2, ఏప్రిల్ 2009, గురువారం

శ్రీ సీతా రామ కల్యాణము -2




శ్రీ సీతా రాముల కల్యాణ రెండవ భాగానికి రామ నామ ప్రియులందరికీ స్వాగతం.

ముందుగా కథలోకి వెళ్ళే ముందు రెండు మాటలు. ఇక్కడ నేను రామాయణం లోని శ్రీ సీతా రాముల కల్యాణ ఘట్టాన్ని అనువదించి చెప్పాలనో, లేక ప్రతి శ్లోక తాత్పర్యాన్ని వివరించాలనో మొదలు పెట్టలేదు. అంత సామర్థ్యము, పాండిత్యము , శక్తి నాకు లేవు. ఉన్నదల్లా శ్రీరామ నవమి వస్తుంది కాబట్టి ఈ నాలుగు రోజులైనా రామాయణ పారాయణం చేద్దామని. చేసి తరిద్దామని . నా సంస్కృతిని నిలుపుకుందామని . నచ్చితే నలుగురిలో రామాయణము చదవాలనే కోరిక రగులుతుందని. అంతే ఇంతకంటే ఎక్కువ అద్భుతాలు మీకు ఇక్కడేమీ కనబడవు.అలాగే ఇందులో వ్రాసినవి కూడా కొన్ని చిన్నప్పటినుండి విన్నవి, కొన్ని చదివినవి. అంతే ఇందులో నా ప్రఙ్ఙ ఏమీ లేదు.

"రామ", "రామ", "రామ" అని వ్రాసుకుంటూ పోతే అది కచ్చితంగా ఎదో ఒక శ్లోకమో , పద్యమో అవుతుంది. ఆ రెండు అక్షరాలు అంత సుసంపన్నమైనవి. కోకిల కు "కూ, కూ" అని గానము చేయటమే వచ్చు.అలాగే వాల్మీకి కి "రామ రామా" అన్న ధ్వనే వచ్చు. ఈ శ్లోకం చూడండి.

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్ |
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ||

అదీ విషయం.

ఒక సారి శంకరుడు పార్వతీ దేవితో ఇలా అన్నాడట. " రామ" , "రామ", "రామ" అని మూడుసార్లు అంటే వెయ్యిమార్లు రామ నామము చేసినట్లేయని.

శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే |
సహస్రనామ తత్యుల్యం రామనామవరాననే ||

వ్యాఖ్యాన సహిత వాల్మీకి రామాయణం లో దీని గురించి ఈ విధంగా వివరణ వుంది.

"య" , "ర" , "ల", "వ" లలో "ర" 2 వ అక్షరం.
"ప" , " ఫ ", "బ", "భ", "మ" లలో "మ" 5 వ అక్షరం.

రామ = 2X5 = 10
రామ రామ రామ = 10X10X10= 1000

ఇక కథలోనికి వస్తే వాల్మీకి రామాయణ మొదటి శ్లోకము ఇది [ఇదే అనుకుంటున్నాను , విబేధించేవారు సరి చేయవచ్చు]

తపస్స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ |
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవమ్ ||

సూక్షంలో ఈ శ్లోక భావం " ఒక మహిమాన్విత వ్యక్తి గురించి చెప్పమని వాల్మీకి నారదుల వారిని అడిగారు".

రామాయణం అంతో ఇంతో తెలియని వారు భారతదేశం లో ఉండరని నా అభిప్రాయం. కాబట్టి కథను క్లుప్తంగా చెప్పుకొని మిథిలా నగరానికి చేరుదాము.

విశ్వామిత్ర మహర్షి కౌసల్య ని మెప్పించి, దశరధుని భయపెట్టి [దశరధుడు కూడా ఒప్పుకుంటాడు] , రామ లక్ష్మణులను లోక కల్యాణ కార్యార్థం వెంటబెట్టు కొని సరయూ నది తీరంలో బసచేసి వుంటారు. రాత్రి గడచి తెల్లవారు ఝామైంది. పద్మాలు అప్పుడే వికసిస్తున్నాయి. తుమ్మెదలు నిద్ర మేల్కొని మకరంద వేట సాగింప బయలుదేరాయి. మెల్లగా సరయూ నది ప్రవహిస్తుంది. ఎదురుగా సాక్షాత్తు శ్రీమహావిష్ణువు తన అధీనంలో ఆదమరచి నిద్రపోతున్నడు. పరమ ప్రశాంత వదనం. ఇది ఈ బ్రహ్మీ ముహూర్త సమయాన తనకు పట్టిన అదృష్టంగా భావించాడు రాజర్షి. జీవించి వుండగానే పొందేటటువంటి మోక్షమది. ఆనంద పారవశ్యంతో సుస్వర గానం ఈ విధంగా చేస్తాడు.

కౌసల్యా సుప్రజారామ | పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల | కర్తవ్యం దైవమాహ్నికమ్ ||

ఈ శ్లోకం ఒక్కదాని మీద పేజీలకు పేజీలు వ్యాఖ్యానాలు వ్రాయవచ్చు. కానీ ఎవరికి వారు ప్రతిరోజూ గానంచేసుకొని రోజూ కొంచెంకొంచెంగా అర్థమయ్యే ఒక్కొక్క పద గూఢార్థాన్ని తనివితీరా ఆస్వాదిస్తే వచ్చే ఆనందం ఎన్ని వ్యాఖ్యలు చదివినా కలుగదు. స్వానుభవానికి మించిన విద్య ఏముంది?

అలాగే పై శ్లోకం శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంలో మొదటి శ్లోకంగా మనందరికి సుపరిచయమే ! నిజానికిది వాల్మీకి రామాయణ శ్లోకమని పండితుల ఉవాచ.

మళ్ళీ కథలోకి వెళితే విశ్వామిత్ర మహర్షి చెప్పే రక రకాల కథలు వింటూ [ఈ కథలలో బ్రతకడానికి కావలసిన విద్య పుష్కలంగా వుంది] తాటకిని వధిస్తారు. సుబాహుని చంపుతారు. మారీచుని భయపెట్టి వదిలేస్తారు.

మిథిలా నగరికి వెడుతూ రకరకాల దేశాల కథలను రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు చెప్తాడు .[ఈ కథలలో బోలెడు భారతదేశ చరిత్ర కనిపిస్తుంది ] దారిలో గంగానది ఒడ్డున విశ్రమిస్తారు. విశ్రాంతి సమయాల్లో ఎన్నో యోగాభ్యాస విద్యలు నేర్పిస్తాడు. మార్గమధ్యంలో రాయిలాగా బ్రతుకుతున్న అహల్యని శ్రీరాముడు మనిషిని చేస్తాడు.

జనకుని సాదర స్వాగతంతో అందరూ మిథిలా నగరం చేరతారు. అన్నదమ్ము లిద్దరూ తానందుని [ జనకుని పురోహితుడు ] నోట గురువైన విశ్వామిత్ర మహర్షి గొప్పతనం వింటారు. అలాగే అందగాడైన రాముని గొప్పతనం ఆనోటా ఈనోటా జానకి ని చేరుతుంది.

[ ఈ చివరి భాగం నా కల్పితం. ]

అందరి లాగా సీతమ్మ వారు కూడా తన కాబోయే భర్తగురించి రకరకాల కలలు కంటుంది.


ఉ||
ఎంతకు రాడు రాముడని ఈక్షణ తీక్షణ బాధలెల్ల నా
అంతరమందె దాచుటెల? ఆ రఘు రాముడె బెండ్లియాడి, నా
చెంతన సేదదీరి నవ జీవనుడై మనమెల్ల కాంక్ష తో
బంధనజేసి నిర్మల సుభాషితుడౌన? నయోధ్య రాముడున్ ?


రాజులంతా ఆసీనులై శివధనుస్సు నెక్కుపెట్ట సిద్ధమై....


సీ||
లేచెనొక్కడు తొడలెల్ల చరిచి, నిది
          ఏపాటి పోటి, నీ మిథిల లోన ?
ఊగెనొక్కడు కర్ణకుండలము లూడ, నే
          చూపెద నిది కంటిచూపు తోడ.
లేచెనొక్కడు తన లేత మీసము దువ్వి
          ఏ పాటి విద్య యిది, మిథిలేశ?
పలికెనొక్కడు తుచ్ఛ పలుకులెల్ల , జయించె
          దను , సిత సీతను ధరణి గాల్చి.

గీ||
ఇటుల రాజాధి రాజన్యు లెల్ల ధనువు
నెత్త బోయి, కొంచెము నైన నెత్త లేక,
సిగ్గున పగ రగులుతుండ, సిత క్షితి
కాంత ధరహాస వదనము కాంచ రైరి.


మళ్ళీ రేపు కలుద్దాం...

గమనిక: శ్లోకాలు నాకు గుర్తున్నట్లు వ్రాశాను. తప్పులేమైనా వుంటే పెద్దలు సహృదయులై సవరింప గోరుతాను.

అలాగే పద్యాలలో కూడా.. పద్య కవులకు పద్య పాదాల లో అభ్యంతరమైనవి గా కనిపిస్తే సరిచేయ మనవి.

6 కామెంట్‌లు:

  1. చిన్నప్పుడు బళ్ళో "రామకోటి రాసేవాళ్ళు శ్రీరామ అని రాసేకన్న శ్రీరామ రామ రామ అని రాస్తే ఎక్కువ పుణ్యం వస్తుంద'ని మాస్టారు చెప్పారు.. "ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన..." స్వాతిముత్యం పాట గుర్తొచ్చిందా ఎవరికైనా పై పద్యం చదవగానే..? ..బాగా జరిపిస్తున్నారండి కల్యాణం..

    రిప్లయితొలగించండి
  2. Hello Baskar garu..
    chala bagundhi andi me ee prayathnam...
    baga rasthunnaru....

    Ramayanam ane mahakavayam lo vundea manchi matalanu maro sari andhariki gurthu chesthunnandhuku...chala santhosham....

    రిప్లయితొలగించండి
  3. మురళి గారు, మీ అభిమానానికి కృతఙ్ఞతలు. స్వయంవరము లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు :)

    ఒక్క నిమిషం గారు, మీ వ్యాఖ్య కి ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  4. అయ్యా నేను గారు అనగా భాస్కర్ గారు - బాగుంది..
    నాకు, నేను వింటరరుమీడియట్లో చదివుకున్న రఘువంశం గుర్తుకి వస్తోంది. తెరకెక్కిద్దాం అని అనుకుంటున్నా కానీ ఈతిబాధలవల్ల కలుగుతున్న సమయాభావంతో సరైన సమయాన్ని కేటాయించలేకపోతున్నా.
    మీ ప్రయత్నం అత్భుతంగా ఉంది..కొనసాగించండి..

    రిప్లయితొలగించండి
  5. @ భాస్కర్

    భారత్ లో సాఫ్ట్వేర్ కంపెనీల రుద్దుడు తప్పించుకుందామని ఇక్కడకి వస్తే ఇక్కడా ఆ బాధతోటి ఈతి బాధ్యతలూ తోడయ్యాయి. అసలు ఇక్కడకి రావడం లో నా రెండవ వుద్దేశ్యం ( మొదటిది డబ్బు కాదు ) , చాలా సమయం మనకంటూ ఒకటి మిగులుతుందని.


    పిలకాయ్ కి రఘువంశం గుర్తుకొచ్చింది అంటున్నారు. ఇంకేం సమయమున్నప్పుడు మీదైన రీతిలో మీరూ రాయండి. మేము చదివేటప్పటికి వింటర్మీడియట్ ఉపవాచకం గా వేమన వున్నదనుకుంటా.

    రిప్లయితొలగించండి
  6. hello chala bagundandi naku rama namam chala estam chala chala thanks nijam ra kalyanam chusinatu vundi
    inko veshayam
    శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే |
    సహస్రనామ తత్యుల్యం రామనామవరాననే ||
    ee slokam lo
    chinna mistake vundi anukuntuna naku sariga teliyadu kani okasari correct ga chudandi తత్యుల్యం ki badulu తత్తుల్యం anukuntuna okasari verify chesi chudandi
    ok All the best malli mana ramudi kalyan samayam vastundi
    malli apudu kaludam byebye andi

    రిప్లయితొలగించండి

Comment Form