27, మే 2009, బుధవారం

నిశ్శబ్ద మదిలో నిశీధి కీచురాళ్ళు






అక్షర లాక్షిణికకు
సులక్షణ కవితారాణికి
ఏలనో, ఏ పాద గుర్తులో
చెరిగిపోని శిధిలపు ఆనవాళ్ళు.

గులకరాయి రేపిన అలజడికి
మదిలోన ఏ సెలఏరు పొంగెనో !
మండు టెండల తాకిడికి
హృదిలోన ఏ నిర్ఝరి ఇంకెనో !
అమావాస్య కాంతిధారకు
ఏ నెత్తురు గడ్డకట్టేనో !

పుడమిని మురిపే పండువెన్నెల
ఏ రాజ బందీగ మిగిలెనో !
నీడను వర్షించే పెరటి పట్టుగొమ్మ
ఏ పున్నాగరవళి గా మారెనో !
దాహము తీర్చే సుజల జల ధార
ఏ గరళ కంఠుని అస్త్రమాయెనో !


చెమ్మగిల్లిన చూపుకు దోసిలొగ్గిన మమత,
మసిబారిన మదికి స్ఫటికపు రంగులద్దిన కలువ,
విరిగిన అధరాన నవ్వులూడ్చిన పూబోణి,
విచలిత వదనాన జ్వలిత చల్లిన విరిబోణి.

అలసిన మదికి ఊతమిచ్చిన విరజాజి,
మాటలేని భావాల మూగభాష్యకారిణి.

ఏలనో, ఏమాయెనో
ఉరుకులు పరుగులు మాని
గడ్డకడుతున్న సెలయేరౌతుంది.

నిశీధి పయనాన
నిశ్శబ్ద మదిలోన
రోదించే కీచురాళ్ళే
మిణుగురుల దివిటీలు.

22 కామెంట్‌లు:

  1. "నీడను వర్షించే పెరటి పట్టుగొమ్మ
    ఏ పున్నాగరవళి గా మారెనో !"
    ...చాలా బాగుందండి..

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. విచలిత మది మాట నోచుకోలేదు
    సజల నా నయనం చాటు చూసుకోలేదు
    చదివానా, చదువుతూవుండిపోయానా?
    సరైన ఆనవాళ్ళు నాకే లేకివ, మీకేమని తెలుపను?

    “అద్భుతం”

    రిప్లయితొలగించండి
  4. మంచి ముత్యాలను మాలగా గుచ్చినట్టున్నారు కవిత రూపంలో.....
    చాలబాగుందండి!

    రిప్లయితొలగించండి
  5. చాలా బాగుందండీ
    మీలా కవితలు రాయగ మీకే జెల్లున్
    నీలపు వర్ణము కవితలొ
    నిలిపెను నీలాలకళ్ళ నిరీక్షణంతా !!

    రిప్లయితొలగించండి
  6. మురళి గారు తొలి వ్యాఖ్య కి ధన్యవాదాలు. కవిత మధ్యలో పాదాన్ని బాగానే పట్టారు.
    నీడను వర్షించే పెరటి పట్టుగొమ్మ
    ఏ పున్నాగరవళి గా మారెనో

    ఎన్నో భావాలమధ్య వెలుగు చూసిన ఒక వాక్యమది.
    కొమ్మలు నీడనివ్వడం సహజం. అదే నీడ గాలికి అటు ఇటు ఊగడం అంతే సహజం. అలాగే ఎండకు తన ఉనికిని మార్చుకోవడం సహజమే, వర్షం వచ్చినపుడు కొమ్మలనుండి కన్నీరు ( ఆనందభాష్పాలు ) రాలడమూ అంతే సహజం. అదే రెండో పాదం... పున్నాగ రవళిగా ఏల మారెనో..

    కాకపోతే ఇక్కడ మరోఅర్థం ఏమిటంటే కొమ్మ అంటే స్త్రీ. పెరటి పట్టుగొమ్మ అంటే .. ఎల్లకాలాల్లో మనకు అవసరానికి నీడనిచ్చే స్త్రీ... ఏ పున్నాగరవళి గా మారెనో?... ఎందుకో నాకు పున్నాగరవళి రాగం వినగానే మల్లేశ్వరి(పాత సినిమా) లో "పోయిరావమ్మా" అనే పాట గుర్తుకు వస్తుంది. అందుకే కొమ్మ కన్నీటి రాగమది.

    రిప్లయితొలగించండి
  7. ఉషగారు, చదువుతూ వుండిపోకండి, జీవిత గమనంలో గమకాల భావన్తో మరో కవితను ఆవిష్కరించండి.

    యోహంత్ గారు, తొలిసారి నా బ్లాగులో వ్యాఖ్యానించినందుకు ధన్యవాదాలు.

    పద్మార్పిత గారు మంచిముత్యాలా, కన్నీటి ముత్యాలా?

    రిప్లయితొలగించండి
  8. ఆత్రేయ గారు

    ఎక్కడి కెళ్ళా రండీ?
    మిక్కిలి కవితలు నుడివెడు మీరే బ్లాగున్
    ప్రక్కన బెట్టిన, కవితల
    చుక్కకు మొగుడిని వెదకగ సులభమ మాకున్?

    రిప్లయితొలగించండి
  9. ఒక్కటి తోనే చత్తును
    చుక్కలు నాకిక సతులను చురకలు తగునా ?
    ఒక్కడు జంపక ఒదలడు
    నిక్కము నా పతులు చాల నిర్దయులయ్యా

    (about my managers )

    రిప్లయితొలగించండి
  10. ఎంతటి ధైర్యము వాడికి?
    అంతర మెరుగని కవి కొం. ఆత్రెయ గా రే
    గంతలు కట్టిన గానీ
    ముంతల కవితలు నుడువడ ముక్కున ఇలలో

    రిప్లయితొలగించండి
  11. ఎంతభిమానము నాపై
    కొంతయు నబ్బిన పతులకు కొంచెము మెరుగే
    పుంతలు నిండగ చక్కగ
    చెంతన 'నెట్టుకు ' నిలిచెద ! చెప్పెద కవితల్‌ !

    రిప్లయితొలగించండి
  12. చిన్నగ వానిని కవితన
    మిన్నగ పొగడిన, కదలక మెదలక గనడా?
    అన్నెము పున్నెము ఎరుగని
    చిన్నను కసిరిన వానిని చిత్తుగ జేతున్!

    రిప్లయితొలగించండి
  13. చివరి పాదము
    చిన్నను పతినని కసిరిన , చిత్తుగ జేతున్!

    రిప్లయితొలగించండి
  14. మీ కవితా వనంలోకి ఆలస్యంగా ప్రవేశించాం ..మీ పూలన్నీ సుగంధాలు విరజిమ్ముతూ మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదనుకుంటా ! ఇక్కడ పూసిన అక్షర సుమాల్ని కోసుకుంటూ ఇంకాసేపు విహరిస్తాం .:)
    .

    రిప్లయితొలగించండి
  15. ఉ||

    చిత్తము "చిన్ని"రాణి తమచిత్తము తోచిన రీతి మెల్లగన్
    వత్తుగ పూచినాతరుల వాసన మత్తున గ్రోలి మీమదిన్
    ఉత్తమ చింతచే తడిపి ఊయల లూగ, సుకావ్య గంగవై
    పుత్తడి రంగులీను విరిపూవుల మాలను గట్టరే హిమా!

    రిప్లయితొలగించండి
  16. హమ్మో !మీతో సరిపడగలవారమ.....?..చిన్ని "బిందు"వుని :)

    రిప్లయితొలగించండి
  17. చిన్ని గారు, పైవ్యాఖ్య, మా పాప నేను లేని సమయంలో నా I.D తో లాగిన్ అయ్యి పై వ్యాఖ్య రాసింది. sorry for the trouble :)
    ఇకపోతే మీరు చిన్ని "బిందు" వు కాదండి. మీ టపాల్లో ఎక్కడో అన్నట్టు "ద" కు ఏత్వమిస్తే దె.

    రిప్లయితొలగించండి
  18. .ఇప్పుడే చూసానండి ..మీ పాప రాసింది ముచ్చటగా వుంది ....నాన్న రాసినదాని మీద అంత అభిమనమన్నమాట .....గ్రేట్....అయ్యో నాకు సారీ ఎందుకండి ....తండ్రి-కుతుళ్ళకు ఒకటే బ్లాగన్నమాట!....

    రిప్లయితొలగించండి
  19. "లాక్షిణిక" అంటే??

    రిప్లయితొలగించండి
  20. "లాక్షణికుడు" పదానికి స్త్రీ లింగముగా ఈ పదాన్ని వాడాను.

    రిప్లయితొలగించండి

Comment Form