9, అక్టోబర్ 2010, శనివారం

మూడు ఇ-మైల్స్ ------ ఆరు పద్యాలు

సాధారణ రోజుల్లో, అంటే అసాధారణ రోజులు కాదనేగా అర్థం :-). అదే అలాంటి రోజుల్లో , అంటే కూలిపనికి పోయేటప్పుడు రైల్ లో కూర్చోవడానికి సీటు దొరికినరోజల్లా ఫ్ర్రెండ్స్ తో సెల్లులో సొల్లు కబుర్లు చెప్పుకోవడం అలవాటయ్యింది. అయ్యింది అంటే మనం చేసుకుంటేనే అవుతుందిలే. ఏదో అలా సొల్లు కబుర్లు అన్నాగదా ప్రతిరోజూ మరీ చెత్త కుప్పలో కనపడిన చెత్తంతా మాదే అని మాట్లాడోకోములేండి. సాధారణంగా స్నేహితులు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటారు కదా అలా రోజూ ఏదో ఒక సమయంలో Hello how are you? లాంటి మైల్స్ తో పాటు కొన్ని మంచి మంచి టాపిక్స్ కూడా చర్చలోకి వస్తుంటాయి.ఎలాగూ రెండు గంటల ప్రయాణం లో చేసేదేమీ వుండదు కదా. ఇలా టైం మేనేజ్ మెంట్ అన్న మాట. అలాంటి ఒకానొకరోజు, అంటే నిన్న గాక అటుమొన్న , ఓ ఫ్ర్రెండ్ వాళ్ళ ఊళ్ళో వర్షం పడుతుందని చెప్పడానికి ఈ మైల్ పంపింది.




"ఈ రోజు మాకు ఒకటే వాన ఇంత అని లేకుండా ఇంతింతలు ఎంతెంతో ఎత్తెత్తి పోసేస్తోంది వాన."



ఈ లైన్ ఎందుకో నాకు తెగ నచ్చేసి దానికి పద్య రూపాన్ని ఇచ్చి తిరిగి మైల్ చేసాను. ఆ పద్యం ఇది. ఇది వ్రాసి పంపేసాక హ్యాపీస్. అంటే ఆఫీస్ కెళ్ళి హాయిగా పని లో మునిగిపొయ్యాను




తేటగీతి
ఎంత నెంతటి వర్షమో ఇక్క డిపుడు
ఎత్తి పోసిన యట్లుగ ఏరు లన్ని
పొంగి ప్రవహించె, ఁనదిజూడ పొలతి నోట
మాటలు కవితలయ్యను మధుర గీతి!


కాసేపయ్యాక మరో ఫ్రెండ్ దగ్గరనుంచి మరో మైల్ వచ్చింది. ఆ మైల్ ఇది. [మిగతా వారి పేర్లను ఎడిట్ చేసాను ] అబ్బా ఆశ పేర్లు చూద్దామనే ;-)



"ఏమిటిది అసలేమిటీ మాయా...************* నోటిమాట అయిననూ నాకు వినపడలే...ఆమె కలం కదలికయునూ కనపడలే...కేవలం ఆమె వేలికొసల సన్నాయి మీటల్లోనూ, ఆమె అరచేత నాట్యమాడిన మూషికరాజ ముక్తసరి పలుకుల్లోనూ...వరదగోదారి తీరుగ ఈతడు ఈ అభినవ పెద్దనామాత్యుడు రామి అను నామంబున వెలుగొందుచూ, వేవేల పద్యములు రువ్వుచూ మమ్ముల చూరగొనుచుండుట - ఏమి ఇదంతయునూ...విధివైచిత్రి గాదా? ;)

నేను తిరుమలదేవిగా ఇట నడయాడుచూ నా నాథుడైన దేవరాయల వారికై నిరీక్షించుంచున్న తరుణమున నా మది దోచిన ఓ మిత్ర ద్వయమా! మీకు ఇదియే మా ఉల్లం ఝల్లన వీచిన ఆనందడోలికల సుమ సమ సుమధుర దరహాస మాలికలు. గైకొనుడు.

మా ఉద్యానవనమున మనోహరముగా రంగులద్దుకున్న ఓ తరువును మీకు కానుకగా సమర్పిస్తున్నాను - కవి స్ఫూర్తీమణి, కవి చింతామణీ...ఇక మేము విశ్రమించగ వెడలుతున్నాము.

*****
హమ్మయ్యా...నేనే స్క్రిప్ట్ రాసి నేనే నటించి...విడుదల చేసిన ఈ లఘుచిత్ర సంభాషణను నేడే విని తరించండి.

మహానుభావా..రామి...నీ రచనల మూలంగా నేను ఇలాగ తయారైతినయా...నేస్తమా! ;)




మైల్ సారంశం అది. ఈ మైల్ మాత్రం నాకు తెగ నచ్చేసింది. మరి మునగచెట్టు ఎక్కించేసారు కదా. విమానం లేకుండానే కాసేపు గాల్లో తేలి నట్టనిపించింది. గుండె పొంగింది. రోమాంచితమయ్యి పై మైల్ కు పద్య రూపాన్ని ఇవ్వాలని నిన్న ఈరోజు రైల్ ప్రయాణాన్ని ఈ రకంగా కానిచ్చేసానన్నమాట. ఇక పోతే పై మైల్ లో నా హితులు, సన్నిహితులు, స్నేహితులు నన్ను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతోనే అలా వ్రాసారు కానీ వేరే ఎటువంటి వుద్దేశ్యాలు లేవు. నాశక్తి ఎమిటో నాకు తెలుసు. నాకన్నా వారికే ఎక్కువ తెలుసు. కాబట్టి " కవి స్ఫూర్తీమణి, కవి చింతామణీ, పెద్దనా మాత్యులవారిని " గౌరవంతో నా వచ్చీరాని పదాలతో అగౌరవ పరచడం ఇష్టంలేక వాటికి పద్యరూపాన్ని ఇవ్వలేదు.

ఇక ఈక్రింద ఒక్కో లైను. దనికి సరిపడ పద్యం.



"ఏమిటిది అసలేమిటీ మాయా...************* నోటిమాట అయిననూ నాకు వినపడలే...ఆమె కలం కదలికయునూ కనపడలే...కేవలం ఆమె వేలికొసల సన్నాయి మీటల్లోనూ, ఆమె అరచేత నాట్యమాడిన మూషికరాజ ముక్తసరి పలుకుల్లోనూ..."





ఆ.వె
కలము కదల లేదు, కనగ మాటయు లేదు
వేలి కొనల నాట్య వింత లేమొ
ముక్త సరి పలుకుల మూషిక భాషయొ
జాడ తెలియదేల చారు శీల






"వరదగోదారి తీరుగ ఈతడు ఈ అభినవ పెద్దనామాత్యుడు రామి అను నామంబున వెలుగొందుచూ, వేవేల పద్యములు రువ్వుచూ మమ్ముల చూరగొనుచుండుట - ఏమి ఇదంతయునూ...విధివైచిత్రి గాదా?"





ఆ.వె. ( ఈ పద్యం రెండవ పాదంలో "రా" కు "వ్రా" కు యతి కుదురుతుందో లేదో తెలియదు )

ఏది ఎటుల నైన ఈరోజు నితగాడు
రామి నామ ధేయ వ్రాత గాడు
రూఢి పద్య ములను రువ్వుచు నున్నాడు
మమ్ము, మామది నిటు మాయ చేయ





"నేను తిరుమలదేవిగా ఇట నడయాడుచూ నా నాథుడైన దేవరాయల వారికై నిరీక్షించుంచున్న తరుణమున నా మది దోచిన ఓ మిత్ర ద్వయమా! "





తే.గీ

నేను తిరుమల రాణినై నిచట నా ప-
తియగు దేవరాయ ప్రభుకై తిరుగు వేళ
మదిని దోచిరే మిత్రులు, మా మనమున
వీచె చల్లని గాలులు వెంట వెంట






మీకు ఇదియే మా ఉల్లం ఝల్లన వీచిన ఆనందడోలికల సుమ సమ సుమధుర దరహాస మాలికలు. గైకొనుడు.





తే.గీ

ఝల్లు మనె, తనువానంద చలిత నయ్యె
నిదియె, మీకు సుమధుర వందిత దివిజ సు
హాస మాలికా చందనాహ్వాన లేఖ
వేగ రండు, మా ఇంటను విందు చేయ





మా ఉద్యానవనమున మనోహరముగా రంగులద్దుకున్న ఓ తరువును మీకు కానుకగా సమర్పిస్తున్నాను





ఆటవెలది

రంగులద్దుకుని మరందములొలుకు మ
నోహర తరువు యది, నోము చేసి
నా ప్రఫుల్లతావనాంగినిచ్చెద, కాను
కగను, తిరుమలాంబ కరుణ చేత.




తప్పులుంటే మన్నించి ఎత్తి చూపండి.

3 కామెంట్‌లు:

Comment Form