13, అక్టోబర్ 2010, బుధవారం

తెలుగులో ప్రామాణిక నిఘంటువు... బ్లాగర్ల సహాయ సహకారాలకు పిలుపు.

గొర్తి బ్రహ్మానందం గారు వ్రాసిన ఈ వ్యాసం చదివిన తరువాతనుంచి మనసదోలా అయిపోయింది. వారు ఇటువంటి నిఘంటువు పుస్తక రూపంలో వుంటే బాగుంటుందని కోరుకున్నారు కానీ పుస్తకరూపంలో వున్న నిఘంటువు కు మార్పులు చేర్పులు చేసి పునర్ముద్రణలు చేయడం కొంచెం కష్టముతో కూడుకున్నపని అని నా అభిప్రాయం. సందర్భం వచ్చింది కాబట్టి, మన బ్లాగుల్లో చాలా మంది తెలుగు అభిమానులు వున్నట్టే వున్నారు కదా !. మరి అలాంటప్పుడు మనమే ఒక సమూహంగా ఏర్పడి పదికాలాల పాటు నిలిచే online edition కు ఎందుకు శ్రీకారం చుట్టకూడదు? ఇది చేయడానికి డబ్బుకంటే తెలుగు మీద అభిమానముండి తమ సమయాన్ని కేటాయించగల నిబద్ధత గల వారు చాలా అవసరం. online edition, haard copy కంటే ఉపయోగకరమని భావించడానికి గల కారణాలు.

౧) ఒకేసారి వివిధ ప్రాంతాలనుంచి వేర్వేరు వ్యక్తులు ఈ project పై పని చేయవచ్చు
౨)తప్పొప్పులను సరిదిద్దడం చాలా సులభం
౩)ఇప్పటివరకూ మనకు online లో లభ్యమయ్యే నిఘంటువలనుంచి పదాలను,అర్థాలను క్రోడీకరించడం సులభం
౪)ఇలా online edition వల్ల ఉత్తరోత్తరా మనం ఇప్పటిలో ఊహించలేని applications దీని చుట్టూ నిర్మించవచ్చు.
౫ )అవసరమైన సందర్భంలో దీనిని పుస్తకరూపంలో ప్రచురించడం కూడా సులభమే.

ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడడం కంటే ఐదువందలకు పైగా ప్రతిరోజూ బ్లాగులు చదివేవారు రోజుకొక గంట తమ సమయాన్ని దీనికొరకు ధారపోస్తే ఇదేమంత పెద్ద చెయ్యలేని పని కాదని నా అభిప్రాయం.

ఆసక్తి కలవారు ఎవరైనా ముందుకు రాగలరా? ఈ application కి కావలసిన సాంకేతిక సహాయాన్ని నేనందించటానికి సిద్ధం. నాతో పాటి చేయికలిపేవారికీ ఆహ్వానం.ఇది పూర్తిగా ఉచితంగా అందరికీ అందుబాటులో వుంటుంది. మరి మీరు తమ సమయాన్ని కేటాయించగలరా? లేదా ద్రవ్య రూపంగా వనరులు ఇవ్వగలరా? మీరు చేయగోరే సహాయం ఎటువంటిదైనా కానీ మీ వ్యాఖ్య ద్వారా తెలియచేస్తే, వచ్చే స్పందన ను బట్టి తరువాతి కార్యాచరణాన్ని మాట్లాడుకుందాం

39 కామెంట్‌లు:

  1. మీరు గనక php/mysql సాంకేతికత ఉపయోగిస్తుంటే నేను సాయపడ డానికి సిద్ధం.

    రిప్లయితొలగించండి
  2. మంచి ప్రయత్నం. నాకూ ఇలాంటి ఆలోచన వచ్చి, కొన్ని నెలల క్రితం ఆవేశంగా మొదలు పెట్టాను. కానీ ఆంధ్రభారతి వాళ్ళ డిక్షనరీ http://andhrabharati.com/dictionary/index.php
    చూసిన తర్వాత ఇది ఉందికద, మరొకటి ఎందుకని ఆపేసాను.
    ఆంధ్రభారతి వాళ్ళు ఒక ప్రామాణిక నిఘంటువు అని తయారు చేయలేదు కానీ, పుస్తక రూపంలో ఉన్న చాలా నిఘంటువులను డిజిటల్ రూపంలోకి మార్చి ఆన్‌లైన్ లో అందుబాటులోకి తెచ్చారు. ఒకే సారి అన్ని నిఘంటువుల్లో పదాలు వెతకవచ్చు. దీనికి ఎక్కువగా ప్రచారం లేదు కాని చాలా మంచి సైట్. ఒక సారి చూడండి.

    రిప్లయితొలగించండి
  3. మంచి ఆలోచన, ఆంధ్రభారతి నిఘంటువు చాలా బావుంటుంది కానీ కొన్ని కొన్ని పదాలు దొరకవు. అలాగే ఆన్‌లైన్ బ్రౌణ్యంలో కూడా చాలా పదాలకి అర్థాలు దొరకట్లేదు. అన్ని పదాలను సమకూర్చేలా నిఘంటువు ఉంటే బావుంటుంది. సహయాసకకారాలందివ్వడానికి నేను రెడీ. రోజులో కొంత సమయం దీనికి కేటాయించగలను. నాకున్న సాంకేతిక పరిజ్ఞాం సున్న, కానీ తెలుగు జ్ఞానం బాగానే ఉంది. ఆవిధంగా సహాయపడగలను.

    రిప్లయితొలగించండి
  4. రెడ్డి గారు

    సంతోషం. మీరు చేసే పనిలో నేను ఏమయినా చేయగలిగితే చెప్పండి. నేను సాయపడడానికి సిద్దం

    రిప్లయితొలగించండి
  5. te.wiktionary.org ఉన్నది అందుకోసమే కదా...చక్రాన్ని మళ్ళీ కనిపెట్టకుండా అందరూ అక్కడికి వచ్చి కృషి చేస్తే బాగుంటుంది. విక్షనరీ ఎటూ స్వేచ్ఛాయుతమైన పథకమే కాబట్టి మీకు అక్కడ నుంచి డేటాబేస్ డంప్ కావాలన్నా తీసుకోవచ్చు.

    రిప్లయితొలగించండి
  6. భా.రా.రె. శరన్నవరాత్రుల్లో సరస్వతీదేవి ప్రీత్యర్థంగా అన్నట్లు చక్కని ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. భాషాభిమానులందరికీ ఎంతో ముదావహం. నా వంతు సహకారం ఈ క్రింది షరతులతో అందించగలను.

    ౧) నా ఇతర వృత్తిపర, వృత్తీతర వత్తిడిననుసరించి రోజుకి గంట అన్నది నా శక్తికి మించినది, వారానికి రెండు గంటలు నా భాషాపరిజ్ఞానం, సామర్థ్యం దృష్ట్యా నాకొసగబడిన కార్యాలకు ఇవ్వగలను.

    ౨) నేను నడిపే తెలుగుబడి పిల్లలకి కూడా [అంటే సులభతర వినియోగం] ఈ నిఘంటువు అందుబాటులోకి వస్తుందా అన్నది కాస్త స్వార్థోపేత యోచన.

    ఏదేమైనా భారతీదేవి కృప,కరుణ కటాక్షాలు ఈ ప్రయత్నాన్ని దిగ్విజయం చేయాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.

    [గమనిక:ఇదే టపా రెండుసార్లుగా పోస్టైనట్లుంది.]

    రిప్లయితొలగించండి
  7. రాత్రి నిద్రమత్తులో ఇదేటపా రెండు సార్లు పోస్టు చేసినట్టున్నాను. అక్కడి వ్యాఖ్యలను కూడా తిరిగి ఇక్కడ ప్రచురిస్తున్నాను.

    oremuna చెప్పారు...
    why not use wiktionary -? http://te.wiktionary.org
    13 అక్టోబర్ 2010 2:13 సా
    *****************************************

    ఆ.సౌమ్య చెప్పారు...
    @oremuna
    wiktionary లో ఏమీ లేవండీ, నాకేమీ నచ్చదు, కావలసిన పదం ఎప్పుడూ దొరకదు.
    13 అక్టోబర్ 2010 2:29 సా

    *****************************************
    ఆ.సౌమ్య చెప్పారు...
    సమస్యేమిటంటే వికీలో ఎవరినా ఎలాగైనా ఏదైనా మార్చుకోవచ్చు...అక్కడొచ్చింది చిక్కు.
    13 అక్టోబర్ 2010 4:08 సా

    *****************************************
    కొత్త పాళీ చెప్పారు...
    మంచి ఆలోచన. నాకు చేతనైన సహాయ సహకారాలు అందించగలను.
    13 అక్టోబర్ 2010 5:26 సా

    *****************************************

    రిప్లయితొలగించండి
  8. @Hari, Technology is second priority here. I guess we can use multi language model so that people can use their preferred language.We can definitely talk when we reach to that point.

    రిప్లయితొలగించండి
  9. @ఏకలింగం, ఇది ఒక్కరివల్ల అయ్యే పని కాదండి. ఆంధ్రభారతి సైట్ చూసాను.చాలా బాగుంది. తప్పక వారిని కూడా సంప్రదిద్దాము. ఈ project కేవలం నిఘంటువు వరకే పరిమితం కాకుండా తెలుగుకు ఒక wordnet లాంటి సదుపాయం వుంటే బాగుంటుందని యోచన.

    @సౌమ్య, Technology కి సహాయపడగలవారు చాలామందే మనకు వున్నారు. Data entry కి , ఆ enter చేసిన పదాలను సరి చూసి approve చెయ్యగలవారు చాలా అరుదుగా వుంటారు. మీ సహాయం అక్కడ అవసరమవుతుంది.

    @భాను, తప్పకుండా. తరువాత వచ్చే టపాలో online dictionary ఎలా వుండాలనుకుంటున్నారో సాధ్యమైనన్ని అభిప్రాయాలను సేకరించి మలి అడుగు వేద్దాము. మీరు ఏమేమి చేయగలరో చెప్పగలరా?

    @రవిచంద్ర, we are not reinventing the wheel. we are just collecting the right spokes and filling the missing spokes to make it perfect circle.

    రిప్లయితొలగించండి
  10. @ఒరేమున , పోయిన సంవత్సరం నాకు నిఘంటువు అవసరపడినప్పుడే ఈ ఆలోచన వచ్చింది. దీని మీద ఒక పోస్టు కూడా వ్రాసాను. అది ఇక్కడ http://chiruspandana.blogspot.com/2009/01/blog-post_25.html . అప్పటినుంచి చూస్తున్నాను విక్ష్ణరీ ని. అందులో ఎటువంటి పురోభివృద్ధి కనిపించడంలేదు.కానీ ఈ ప్రాజెక్టు మరిన్ని వివరాలతో చేయాలని యోచన.



    @కొత్తపాళి, మీరూ ఇందులో పాలు పంచుకోవడానికి సిద్ధ పడినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. ఒక్క విషయం మనం గమనించాలి, గుర్తు పెట్టుకోవాలి.
    ఆంధ్రభారతిగానీ DSAL గానీ అందించేది ఇప్పటికే ఉన్న నిఘంటువులని. ఒకటి బ్రౌణ్యం, ఇంకోటి బలిజేపల్లి వారిది. ఇదికాక ప్రింటులో దొరుకుతున్నది సూర్యరాయాంధ్ర నిఘంటువు.
    ఇక్కడ అసలు పని, ఏదో ఒక నిఘంటువుని తీసుకుని దాన్ని ఆధునీకరించడం. సమస్య సాంకేతికం కాదు, ఉన్న డిక్షనరీని కంప్యూటర్లోకి ఎక్కించడం కాదు. ఉన్న డిక్షనరీని నవీకరించడం. దీనికి కేవలం కంయూటర్ సాంకేతిక పరిజ్ఞానం సరిపోదు. తెలుగు పండితులు, భాషాశాస్త్ర పండితులు మొదలైన వారి సహాయం కావాలి, ఈ కార్యక్రమాన్నంతటినీ సమర్ధవంతంగా గాడి తప్పకుండా నడిపించగల ప్రాజెక్టు మేనేజర్లు కావాలి.

    రిప్లయితొలగించండి
  12. @ఉష , అబ్బ ఎన్ని రోజులకు మళ్ళీ బ్లాగుల్లో కామెంట్ పెట్టావు. మహదానందంగా వుంది.

    ఇక మీ షరతులకు సమాధానాలు.

    ౧)వారానికి రెండుగంటలు కేటాయించినా చాలా పనులు పూర్తి చేయ్యొచ్చు. implementation phase లో మీ రేమి చెయ్యగలరో వాటినే తీసుకొనండి.

    ౨) ఇది అన్ని రకాలుగా ఉచితంగా అందించబడుతుంది including source code, database design and all the data that we collect while progressing.

    మీ దీవెనలు, ఆ దేవి కృపాకరుణాకటాక్షములు వుంటే సాధించలేనిదేమీ వుండదులే.

    రిప్లయితొలగించండి
  13. అవును కొత్తపాళీ గారూ, content editors ని , తెలుగు, సంస్కృత పండితులనీ సమీకరించి వారిని జాగ్రత్త గా ఎప్పటి కప్పుడు ఈ ప్రాజెక్ట్ లో అంతర్భాగంగా ఉత్తేజితులని చెయ్యడమే కష్టమైన పని.

    రిప్లయితొలగించండి
  14. సాంకేతికంగా ఏదయినా గైడ్ లైన్స్ ఇస్తే చేయగలను లేదా చేయగలిగింది ఏదయినా సరే, దాటా ఎంట్రీ లాంటివి అనుకోండి, ఇంకా ఏదయినా సరే నాకు చేతనైన సాయం చేద్దామని

    రిప్లయితొలగించండి
  15. భాను, తప్పకుండా... మిగతా వివరాలను తరువాత టపాలో వ్రాస్తాను.

    రిప్లయితొలగించండి
  16. నాకీ కొత్త నిఘంటువు అవసరమేమిటో బోధపడలేదు. నిఘంటువులో లేని కొత్త పదాలు పుట్టుకొచ్చాయి, కొన్నిటికి అర్థాలు మారిపోయాయని గొర్తి బ్రహ్మానందం తన వ్యాసంలో పేర్కొన్నారు. కాని అవి ఏమిటో వివరంగా చెప్పలేదు. వారిచ్చిన ఉదాహరణల్లో రైల్వే సిగ్నల్ అన్న పదం తప్ప తక్కినవన్నీ బ్రౌణ్యంలో ఉన్నవే. రైల్వే సిగ్నల్ అన్నది నిఘంటువులో ఉండాల్సిన అవసరం ఏమిటి?
    ఇక వృత్తులకు సంబంధించిన పదకోశాలు విడిగా ఉండడమే సమంజసమని నా ఉద్దేశం.
    ఉన్న నిఘంటువులని కొత్త పదాలతో తాజా పరచాలనేటప్పుడు కొన్ని విషయాలు స్పష్టమవ్వాలి:
    1. కొత్త పదాల (లేదా అర్థాలు మారిన పాదాల) స్వరూపం ఏమిటి?
    2. కొత్త పదాలని నిఘంటువులో చేర్చడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి, ఎవరికి?

    ఆంధ్రభారతి సైట్లో (శబ్దరత్నాకరం, బ్రౌణ్యంలో) కొన్ని పదాలు దొరక లేదని సౌమ్యగారన్నారు కాబట్టి, అవేమిటో చెపితే బాగుంటుంది. అవి సూర్యరాయాంధ్ర నిఘంటువులో ఉన్నాయో లేదో నేను చెప్పగలను. ఉన్నట్టైతే, చెయ్యాల్సిన పని ఆ నిఘంటువుని కూడా ఆన్లైన్లో పెట్టడమే.

    భాషలో ప్రామాణికత ఏర్పడినప్పుడే, ప్రామాణిక నిఘంటువు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రామాణిక నిఘంటువు అని ఒకటి తయారుచేసినంత మాత్రాన భాషకి ప్రామాణికత ఏర్పడదు.

    రిప్లయితొలగించండి
  17. నేనుసైతం సహాయం చేయడానికి సిద్దం....వీకెండ్స్‌లో.


    మరొకవిషయం భరారే గారు, నిఘంటువు నిర్మాణంతోపాటు సమాంతరంగా తెలుగు పదకోశం విస్తరించే పని ఎలా ఉంటుంది...!!ప్రతిరోజు మనం ఎన్నో సాంకేతిక పరమైన పదాలు వాడటం కోసం ఇంగ్లీషులో మాట్లాడేసి తద్వారా తెలుగు వాడుకను తగ్గిస్తున్నాం...ఉన్న అనువాదాలేమో మక్కీకి మక్కీ అన్నట్టు ఉంటున్నాయి. అలా కాకుండా నేరుగా ఒక కొత్తపదాన్ని తయారుచేయడం ఎలా ఉంటుంది....

    రిప్లయితొలగించండి
  18. నా వ్యాసం చదివి మీరూ, తోటి బ్లాగర్లూ స్పందించిన తీరు బావుంది. ఈ వ్యాసం నేను రెండేళ్ళ క్రితం రాసింది. చాలా కుదించి పత్రిక్కి పంపాను కానీ, సుమారు ఏభై పేజీల పైగా రాసాను. రాసి తెలుగు విశ్వవిద్యాలయం వారికీ ఒక ప్రతి అందించాను. చదివి చెత్తబుట్టకి అంకితమిచ్చారు.

    మీరందరూ ఒక విషయం గమనించాలి. నిఘంటువు తయారు చెయ్యడం అనుకున్నంత సులభమైన పని కాదు. చూడ్డానికి ఇంతేనా అన్నట్లుంటుంది. దిగితే కానీ లోతు తెలీదు. ఒకసారి దిగాక పైకి రావడం ఉండదు. అలాని ఇది దుస్సాధ్యం కాదు. పండితులూ, భాషా కోవిదులొ కూడా కలిసి పనిజేస్తేనే అయ్యే పని. ఒక్కో పదానికి అర్థమూ, నానార్థాలూ, మూలాలూ, వాక్య ప్రయోగమూ వగైరా వగైరాలన్నీ ఒక్కో పదానికి కూర్చాలి. పాత పదాల్నీ పోగుచేసుకోవాలి. కొత్త పదాల్ని కూడ బెట్టుకోవాలి. చాలా తతంగముంది. మీరెవరూ సూర్య రాయాంధ్ర నిఘంటువు చూసినట్లు లేదు. ఒక్కోటి సుమారు అయిదు వేళ పేజీల చొప్పున ఆరు వాల్యూములున్నాయి. ఇవన్నీ 1940కి ముందున్న వాడుక పదాల లిస్టు. ఆ తరువాత చచ్చేటన్ని కొత్త మాటులు తెచ్చుకున్నాం. అవన్నీ కలిపితే మరో రెండు వాల్యూములవుతాయి. కాబట్టి అనుకున్నంత ఆవేశంగా ఈ పని వుండదు. ఒక్క మాటలో చెప్పాలంటే కొయ్యగుర్రపు స్వారీ! ఎన్నిరోజులయినా ఒక్క అడుగుకూడా ముందుకెళ్ళని తతంగం.

    నేనూ మీలాగే అయిదారేళ్ళ క్రితం ఉత్సాహంగా ఎగిరాను. నిఘంటువొకటి వెబ్ లో పెట్టేద్దామని. తరువాత తెల్సింది. సూర్యరాయామిధ్ర నిఘంటువు కాపీ రైట్లు ఒక్క తెలుగు యూనివర్శిటీకే వున్నాయి. ఎవరూ దాన్ని ముద్రంచకూడదు. దాన్ని మరలా ప్రింటు వేయడానికని కేతు విశ్వనాథ రెడ్డి గారి సహాయంతో చాలా చాలా ప్రయత్నించాము. అమ్మ పెట్టదు;అడుక్కోనివ్వదు. ఈ సామెత తెలుగు విశ్వవిద్యాలయం వారికి కంఠతా వచ్చు. అందువల్ల అప్పుడే నిరుత్సాహపడి, ఆ బాధని కేవలం వ్యాసాలకే పరిమితం చేసుకోవల్సి వచ్చింది.
    ఈ పనికి తెలుగు విశ్వవిద్యాలయం వారే నడుం కట్టాలి. పదిమంది సహాయమూ తీసుకొని చెయ్యాలి. విశ్వవిద్యాలయం అనేసరికి నానా రకాల రాజకీయాలూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయి.
    ఈ నిఘంటువు మోయడానికి చాలా చిత్తశుద్ధి కావలి. భాష మీద అభిమానం, ఆర్తీ వుండాలి. నిరంతర శ్రమా, కృషీ కావలి. ఇవన్నీ తెలుగు వారి నిఘంటువులో లేని పదాలు.

    నిరుత్సాహ పరుస్తున్నాని నన్ను తిట్టుకోకండి. మీకంటే ఆవేశంగా ఆకాశానికి ఎగిరి కూలబడ్డ అనుభవమ్మీద చెబుతున్నాను.
    ప్రయత్నం చెయ్యండి. ఏ పుట్టలో ఏ థాటుందో ఎవరు చెప్పగలరు?

    -బ్రహ్మానందం

    రిప్లయితొలగించండి
  19. కామేశ్వర రావు గారూ, దీని ఉపయోగం భవిశ్యత్తులో ఎలా వుంటుందో తెలియదు. మచ్చుకు కొన్ని చెప్పుకోవాలంటే

    ౧)మీరు చెప్పిన రైల్వే ష్టేషన్ లాంటి పద సమూహాల అర్థాలను గుర్తించంటం
    ౨)ఆంగ్ల భాషకు వున్నట్టుగా మన తెలుగులో కూడా Text corpus ని చూడాలన్న తపన
    ౩)ఇంకా భవిష్యత్తులో మన ఊహకు కూడా అందనివాటికి తొలి మెట్టుగా సహాయపడటం.

    రాను రానూ తెలుగు ఉపయోగం తగ్గిపోతున్నా, యువత తమ creativity తో తెలుగు మీద ఏవైనా ప్రయోగాలు చేయడానికి మాత్రం ఆస్కారం మెండగా వుంటుందనే అనుకుంటున్నాను. ఇక భాష నిరంతర స్రవంతి కాబట్టి ఈరోజున్న అర్థం రేపు వుండకపోవచ్చు.అలాగే ఆ పద ప్రయోగాలు కూడా మారిపోతుంటాయి.అలా అని పాత అర్థాలనే పట్టుకొని ఊగులాడినా ఆ నిఘంటువు త్వరలోనే అటకెక్కేస్తుంది. ఇలాంటి Dynamic society లో ఎప్పటికప్పుడు నిఘంటువు నూతనీకరణ జరిగితేనే నిత్యజీవితంలో ఇలాంటి online editions ద్వారా విభిన్న ఉపకరణులు ప్రజలకు వుపయోగపడేవిగా అవతరించడానికి అవకాశం వుంటుందని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  20. తొందరలో అచ్చుతప్పులు దొర్లాయి క్షమించగలరు :)

    రిప్లయితొలగించండి
  21. నాగార్జునా, తప్పకుండా. మన పరిధిలో మనకు చేతనైన విధంగా ప్రయత్నిద్దాము.

    రిప్లయితొలగించండి
  22. బ్రహ్మానందం గారూ, మీ వ్యాఖ్యకు ముందుగా ధన్యవాదాలు. ఇక వ్యాఖ్యలోకి వెళితే

    మీ వ్యాసం మొత్తం ప్రచురించి వుంటే ఇంకా బాగుండేదేమో. ఒకవేళ అది మీవద్ద వుంటే పూర్తి ప్రతిని ప్రచురించగలరా? ఇక మీరన్నట్టు నిఘంటువు తయారు చెయ్యడం అంత సులభమేమీ కాదని అర్థమవుతూనే వుంది. కానీ ఈ ప్రయత్నం open source online edition గా చేయడానికి ముఖ్యకారణం, ఇప్పుట్లో ఆ పని ఒకవేళ మనం పూర్తి చేయలేకపోయినా కనీసం వచ్చే generation వాళ్ళయినా పూర్తి చేసే అవకాశాలుండవచ్చు. ఇక మీరన్నట్టు పోయిన సంవత్స్రరం సూర్య రాయాంధ్ర నిఘంటువు కోసం వెదికితే అసలు దొరకలేదు కానీ కొస దొరికింది. అంటే అనుబంధం మాత్రం సంపాయించగలిగాను.

    అన్నట్టు >> సూర్యరాయామిధ్ర నిఘంటువు కాపీ రైట్లు ఒక్క తెలుగు యూనివర్శిటీకే వున్నాయి. ఎవరూ దాన్ని ముద్రంచకూడదు. ఇలా భాషమీద కాపీరైట్లు అన్నప్పుడల్లా నవ్వుకోవడం తప్పించి ఏమీ చేయలేము. ఇప్పుడు ఆ నిఘంటువును వెబ్ లో పెడితే తెలుగు యూనివర్శిటీ వాళ్ళు కేసు పెడతారా? పెడితే ఏమని పెడతారు? ఒకవేళ పెట్టి ఏమి చేయగలరు? ఒకసారి ఏ విజ్ఞానమైనా online చేరిందంటే అది ఎక్కడతేలుతుందో ఎవరికి తెలుసు?

    భలేవారండి, మీ వ్యాఖ్య ద్వారా నిరుత్సాహ పరచడం కన్నా ముందస్తు జాగ్రత్తలు చెప్పినట్లుగానే వుంది. చేతనైనంత చేయడమే. వీలుండి అందరి సహకారముంటే ఒక wordbase తయారవుతుంది. లేదంటే బావిలో మునిగిపోతుంది. success అయితే పదిమందికి ఉపయోగం, లేకుంటే పోయేదేమీ లేదు కదా. నిరుత్సాహం ఏమీ లేదండి. వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. నాకూ చేతనైన సాయం చేద్దామంటే...నా తెలుగు పరిజ్ఞానం అంతంత మాత్రం... పొనీ టెక్నికల్ గా అన్నా... అంత సీన్ లేదు... అందువల్ల మీరు ఎమనుకున్నా ద్రవ్య రూపంలొ మాత్రమే సహాయం చెయ్యగలను... అది కాకుండా వేరే ఎదన్నా పని ....తెలుగు పరిజ్ఞానం లేక సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేనిది.....కొంత ట్రైనింగ్ తొ ఈజిగా చెయ్యగలిగిన పని ఉన్నా పర్లేదు...
    సహాయం చెయ్యలన్నా తాపత్రయం, నిబద్దత అయితే ఉన్నాయి.. అవి ఎలా వినియొగించుకొవాలన్న విషయం తరువాత నిర్ణయించవచ్చు.. కౌంట్ మీ ఇన్ ..

    రిప్లయితొలగించండి
  24. @మంచు నాగార్జున, మీరు రావడం కొత్త ఉత్సాహాన్నిస్తుంది.:-) తప్పకుండా మనందరి సేవలూ లేనిదే బ్రహ్మానందం గారు చెప్పినట్టు ఇది వీసమెత్తైనా కదలదులే.

    @స్పూర్తీ, మీరు లేకపోతే QA ఎవరు చేస్తారు చెప్పండి? :) JK.
    your comment is well received and I hope we will meet soon with all other members.

    రిప్లయితొలగించండి
  25. భారారే,

    శుభసంకల్పం.నా అజ్నానమ్ ఏదైనా మీకు ఉపయోగపడగలదు అనుకుంటే రోజు కి ఒక గంట కేటాయించడం పెద్ద సమస్య కాదు. మాలాంటి వాళ్ళను వున్నట్లుండి తెలుగు మహాసముద్రం లో తోసెయ్యకుండా అవసరమైతే కొంచెం ఏ పని ఎలా చేయాలో చెపితే చేయటానికి సిద్ధం.

    రిప్లయితొలగించండి
  26. చక్కటి పని, చిక్కని పని, చాంతాడంత పని, చేరలేని పని(ఎప్పటికప్పుడు తాజాకరణ చెయ్యాల్సిందే కదా), (మన తరంలో కొస)చూడలేని పని మొదలెట్టారు - సంతోషం. ఆలోచన మొలకెత్తింది కాబట్టి ఆరంభమయితే సగం విజయం వరించినట్టే.

    అయితే నన్నొగ్గెయ్యండి బాబోయ్ - నేను చాలా రకాల దేశ సేవలు చెయ్యాల్సి వుంది. ఇంకో విషయం ఏమిటంటే నేను ఒక్కసారి కమిట్ అయ్యానంటే ... ఎంత సేపు కమిటవుతాననేది నాకే తెలియదు! అంటే నేను పని చేస్తే మీరు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లే అన్నమాట.

    రిప్లయితొలగించండి
  27. కల్పన గారూ :), మీరు అజ్ఞాన వంతులేమిటండీ. ఆకాశ వాణి లో వాణి ని వినిపించినవారొకవైపు, మహా సముద్రంలో అలసటలేకుండా ఈదుతున్న తెలుగు ప్రొఫెసర్ ఒకవైపు వుండి మీరే అజ్ఞాన వంతులంటే ఇంక మేమేమనుకోవాలి?

    తప్పకుండా నండి మీరు చెయ్యగల పనులు చాలానే వున్నాయి. అవన్నీ మీరే చెయ్యాలి మరి.



    శరత్ ఏంది, నిన్నొగ్గెయ్యాలా, కుదరదంతే.. నీచేత నానార్థలు వ్రాపిస్తాగా :)కుక్కతోక పట్టుకుంటే గోదారి ఈదలేకున్నా కనీసం మునగకుండా తేలొచ్చేమో చూడు :)

    రిప్లయితొలగించండి
  28. నా పరిథిలో టెక్నికల్ గా సాయపడడానికి నేను కూడా సిద్దమే..

    రిప్లయితొలగించండి
  29. భైరవభట్ల గారి మాటే నా మాటానూ.. ఆంధ్రభారతి యూని కోడులోనే ఉంది కదా... మనకి అవసరమైన పదం దొరక్కపోతే వారికో ఉత్తరం రాసి సాయం చెయ్యడం ఉత్తమం అని నా అభిప్రాయం. నా వరకూ అయితే ఆ నిఘంటువు చాలా ఉపయోగపడుతుంది.

    ఇంకా కొత్త పదాల చేరిక, వాటికి ప్రామాణికత ఆపాదించడం అనేది కొత్తపాళి గారన్నట్టు భాషా పండితుల సహాయం కావాలి, అది చాలా పెద్ద ప్రాజెక్టు.. ఏ తెలుగు అకాడెమీనో, తెలుగు విశ్వవిద్యాలయమో పూనుకోవాలి... అలాంటి సంస్థలు పూనుకుంటేనే అది శాస్త్రీయంగా జరుగుతుంది. ఈలోగా నానా విద్యలు నేర్చుకుంటున్న మనం, ఆయా విద్యలకి సంభందించిన పదాలకి తెలుగు పదాలు ఉంటే బాగుండు అనుకుంటే వికీ ద్వారా ఒక చోట సంగ్రహ పరుచుకోవడం, వాడి చూసుకోవడం, ఆయా సంస్థలకి మన తరపునుండి విన్నవించుకోవడం, సమయం వచ్చినప్పుడు అలాంటి ప్రాజెక్టు మొదలైనప్పుడు మనం చేసుకున్న వికీని వారికి అంద చెయ్యడం ఆచరణీయమయ్యే ప్రయత్నమని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  30. దిలీప్ గారూ, వ్యాఖ్యకు ధన్యవాదాలండి. తెలుగు యూనివర్శిటీ నిజంగా ఈ పనికి పూనుకుంటే అంతకన్నా కావాల్సింది ఏముంది? ఇంతమందిమి ఇన్ని రకాలుగా తమ పర్సనల్ టైం ని, శ్రమను, డబ్బును ఈ పనికై వినియోగించాల్సిన అవసరం లేకుంటే మేమందరం హాయిగా మరో నాలుగు పనికొచ్చే పనులు చేసుకొనేవాళ్ళము కదా.అయితే నాకొచ్చిన సమాచారం ప్రకారం ఈ పని తెలుగు యూనివర్శిటీ వాళ్ళు ఈ జన్మలో చేయరు కాక చేయరు.

    రిప్లయితొలగించండి
  31. మీ బృహత్పథకానికి నా హృదయపూర్వక అభినందనలు. నా వైపు నుంచి ఇంతే అనుకుంటా మరి. మీకు దసరా శుభాకాంక్షలు మాత్రం చెప్పగలను.

    రిప్లయితొలగించండి
  32. జయగారూ, మీ ఆశీర్వాదాలకు ధన్యవాదాలు.మీకు కూడా దసరా శుభాకాంక్షలు. మీరీపాటికే మా గ్రూపులో చేరి వుంటారని నా అనుమానం.

    రిప్లయితొలగించండి
  33. తెలుగు భాష గురించి మి అందరి తాపత్రయం
    చాలా బాగుంది.
    అందరికి ఒక నమస్కారం.
    నకు ఏంతాగనొ శొదిస్తీని.

    రిప్లయితొలగించండి

Comment Form