19, ఫిబ్రవరి 2010, శుక్రవారం

నాకీవేళ ఈ పద్యం గుర్తుకొచ్చింది !

ఎందుకో నాకీవేళ ఈ పద్యం గుర్తుకొచ్చింది. మీకు తెలిసిన అర్థాన్ని వ్యాఖ్య గా వ్రాసుకోండి :). ఇది వసుచరిత్ర లోని పద్యము. పద్యము చదవకండి. పద్యము పాడుకొంటూ హృదయకుహర లయల ఆనంద నాట్యానికి తాళం కలపండి.

సీ : లలనా జనాపాంగ వలనావసదనంగ
తులనాభికాభంగ, దోః ప్రసంగ
మలసానిలవిలోల దళసా సవరసాల
ఫలసాదర శుకాల పన విశాల
మలినీగరుద నీక మలినీ, కృతధునీ క
మలినీ సుభితకోక కులవధూక
మతికాంత సలతాంత లతికాంతర నితాంత
రతికాంత రణతాంత సుతనుకాంత

మకృత కామోద కురవకా వికల వకుల
ముకుల సకల వనాంత ప్రమోద చలిత
కలిత కలకంఠ కులకంఠ కాకలీవి
భాసురము వొల్చు మధువాస వాసరమ్ము

9, ఫిబ్రవరి 2010, మంగళవారం

అమ్మలారా అయ్యలారా..రారండోయ్ రారండి... వచ్చి * మార్క్ చదవండి.

ఇక్కడ స్నేహితులు వ్రాసిన కొన్ని కవితలు పాఠకుల కోసం. అంతేకాదండోయ్ , ఇవి ఎవరు వ్రాసారో చెప్పిన వాళ్ళకు మంచి వయసుకు తగ్గ ఓ కవిత ఫ్రీ * అన్న మాట . అంటే, కుర్రోళ్ళకు "కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు" లాంటి కవిత, సునీల్ లాంటి యువతరానికి "పాప నన్నే చూస్తుంది " లాంటి కవిత, ఏదో కొద్దిగా పెద్దతరహాలో కనిపిద్దామనుకున్నోళ్ళకు " రామ రామ కృష్ణ కృష్ణ" లాంటి కవితలు ఇలా అన్నమాట. ఇక్కడ ఇంకో మార్కెటింగ్ మార్క్ వుంది. జాగ్రత్త గా * చదువుకోని నిర్ణయం తీసుకోండి.

* పాఠకుల వయసు వారే నిర్ణయించుకోవాలి. అంటే వయసు మళ్ళిన వారు కుర్రాళ్ళు అవ్వొచ్చు లేదా పిల్లాడు "రామ రామ కృష్ణ కృష్ణ" అనుకోవచ్చు. ఇందులో పాఠకుని లేదా కామెంట్ వ్రాసే వారి నిర్ణయమే ఫైనల్. వాళ్ళకిచ్చిన ఆ రాజ్యాంగ హక్కును మేము ఈ రకంగా ప్రోత్సాహించ దలచాము.

ఇప్పుడు కవితలు లేదా తవికలు లేదా ఇకైకలు లేదా పకపకలు :)


మొదటి కవిత :
--------
అబ్బయ్యో అబ్బయ్య
నీకింక పిలక మొలిచిందబ్బయ్యా
అబ్బయ్యో అబ్బయ్య
నెత్తిన జుట్టు పీలికలౌతుందబ్బయ్య
అబ్బయ్యో అబ్బయ్య
దాగుడు మూతలు ఇంక మానాలబ్బయ్య
అబ్బయ్యో అబ్బయ్య
అట్లాంటిక్ సిటీ దారి మరవాలబ్బయ్య
అబ్బయ్యో అబ్బయ్య
ఐదోనెల కడుపును దింపాలబ్బయ్య
అబ్బయ్యో అబ్బయ్య
....
...

ఇలా ఓ పెద్ద ఆశు కవిత ఇది :)


రెండవ కవిత
--------




నేస్తం
స్నేహమనే చిన్ని పూవుని
మన చెలిమితోట లో విరబూయించావు
అనురాగమనే పదాన్ని
మన పరిచయం లో ఎన్నెన్నో రాగాలతో
మేళవించి మాకు వినిపించేవు

ఎంత తలచినా తరగని మన చెలిమి
కరగని కార్తీక మాసపు చిరువెన్నెలలో
కుప్పవోసిన మిలమిలలను
పారిజాత వనం లో
కళ్ళేదుట నిలిపినట్లు వుంటుంది

తెలియని దేవుడికి తలవంచి మొక్కుతున్నాం
అడగకనే నిన్ను మా నేస్తం గా ఇచ్చినందుకు
నీ స్నేహం మాకొక అపురూప వరమైతే
నీ జన్మ దినం మాకు అవ్వదా ఒక పర్వదినం

జన్మదిన శుభాకాంక్షలతో


మూడవ కవిత
---------





నీ చెలిమి పంచిన నునులేత వెలుగు ఎరుపు
నా ప్రయాణపు దారిని సుగమం చేస్తోంది.
నీ ప్రేమ పంచిన చిరుజల్లుల తుంపరలు
నా దప్పిక తీర్చే నీటి చెలమవుతోంది


ఒంటరి నడక లో అలసి, కమ్ముకునే సాయం సంజలలో
నేస్తం నీకు నేనున్నాననే నీవంపిన కబురు
పావురపు కువ కువ లతో
విచ్చిన చంద్రకాంతపు సువాసనలతో కలిపి
నా దారిని పచ్చిక బయళ్ల వెంబడి
వెన్నెల వెలుగును కలిపి చూపుతోంది.


అటువంటి నేస్తానికి జన్మదిన శుభా కాంక్షలు
ఏమని చెప్పగలను... చిరాయువు కావాలని
కోవెల గంటలపై, కరగని మమతలపై ఆన చేసి
కోరుకోవటం తప్ప...

ప్రేమతో


ఇంతమంది ఆత్మీయ స్నేహితులను ప్రసాదించినందుకు ఆ దేవదేవుని కరుణతో మనసంతా అర్ద్రమైంది.

ఇక చివరిగా మీ గెస్స్ లు, అచ్చు బొమ్మలు వెయ్యండి సమాధానం పట్టండి వయసుకు తగ్గ పాటలు పాడుకోండి.

6, ఫిబ్రవరి 2010, శనివారం

జగమెరిగిన సత్యవాక్పరిపాలకులు

అలజడి జడివానయై వెల్లువెత్తిన మదిలో
మాయని అమాయక రూపం వెలుగుచూసింది
ఉరుకుల పరుగుల నవీన జీవితంలో
గతరాత్రి వర్షించిందొక కఠిన శిల్పం

చీకటి వెలుగుల సంగమ కాలంలో
మనసులోని ఆలపన సంధ్యారాగామా
పులుముకొస్తున్న చీకటి తెరలు చీల్చగ
వెల్లువెత్తే పూర్ణచంద్రోదయ వెన్నెల గీతమా

జగమెరిగిన సత్యవాక్పరిపాలకులు
వల్లెవేసే సత్యకాల మత సూత్రాలు
ఇలలో మనలో నాటే నాటుబీజాలు
ప్రగతి రథచక్రం క్రింద నలిగేనా
జాతి జాగృతి చూసేనా?

వేదనిధికి వైద్యం చేస్తూ
ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్నామా
సత్యాసత్యాల మిధ్యా గమనంలో
అసలు దారే మరిచామా?

వాస్తవికత మరచి ఎండమావుల వెంటపడ్డామా
కందిరీగల పుట్ట చూపి తేనెపట్టని చెప్తున్నామా
మందభాగ్యుల మదిలో విషం చిమ్ముతున్నామా

నా మదిలో కురిసిన హిమబిందువులకు
హృదిలో పొంగిన భావస్పందనలివి