28, సెప్టెంబర్ 2010, మంగళవారం

అనుకూలవతి నా ఈ మానిని :-)

మరొక మానిని. ఈ మానిని నాకు కొంచెం అనుకూలవతి. అందుకని నిన్నటిలాగా మరీ బెట్టు చేయకుండా 7 వ అక్షరం తో పాటుగా 13 వ అక్షర యతికి కూడా ప్రమోషన్ ఇచ్చింది. కానీ పూర్తిగా ఇంకా దరిచేయనీయ లేదు. ఇంకా "పొందుదుగా" దగ్గరే ఆపేసింది :-) మానిని పద్యం. [ ఆ ఒక్కటి తప్ప. అదేలేండి 19 వ అక్షరం యతి తప్ప. :-) ] వేకువ ఝామున వెన్నెలలో కను విందుగ పూసిన పువ్వులలో రేకుల పువ్వుల రేణువులో చెల రేగిన వెన్నెల కాంతులలో తాకిన మన్మధ తాపముతో తన దాపున వెచ్చని కోరికతో ఆకుల మాటున మోదముగా చెలి చక్కని అందము పొందుదుగా నిన్నటిలాగే పాదాలను విడమరిచి వ్రాస్తే ఇలా వేకువ ఝామున వెన్నెలలో కను విందుగ పూసిన పువ్వులలో రేకుల పువ్వుల రేణువులో అల రేగిన వెన్నెల కాంతులలో తాకిన మన్మధ తాపముతో తన దాపున వెచ్చని కోరికతో ఆకుల మాటున మోదముగా చెలి చక్కని చందము చూచెదగా /కాంచుదుగా/పొందుదుగా లయ మాత్రం నిన్నటిదే ...... తానన తానన తానననా తన తానన తానన తానననా

27, సెప్టెంబర్ 2010, సోమవారం

ప్రియురాలికి వేడుకోలు - తానన తానన తానననా తన తానన తానన తానననా

ఈ మధ్య ఛందస్సు మీద ప్రయోగాలు చేస్తున్నా కదా. అలా చేస్తూ చేస్తూ గూగుల్ గుంపులో [ జెజ్జాల కృష్ణమోహన రావు గారు ] మానిని కి ఒక లయ చూసాను. ఈ మానిని పద్యానికి వరుసగా ఏడు భగణాలు తరువాత ఒక గురువు వస్తుంది. ఏడు, పదమూడు, పందొమ్మిది అక్షరాలు యతి.

అయితే మనకు ఏకంగా మూడు అక్షరాల యతి వేసే సీను లేదు కాబట్టి ఇలా కానిచ్చేసాను. అందుకని ఈ క్రింద పద్యములో (?) యతి ఏడవాక్షరానికి మాత్రమే సరిపోతుంది. ప్రాస వున్నట్టే వుంది కదా :-). అందుకని ఇది మలినమైన మానిని అన్నమాట.

ప్రేమను పంచిన ప్రేమికవే ఇల ప్రేమకు మారుగ నిల్చితివే
ఆమని కోయిల పాటవులే ఇక కొమ్మగ వచ్చిన చాలునులే
నెమ్మది నెమ్మది నిండితివే మరి నామది నిండుగ నిండితివే
సమ్మత మియ్యవె చంద్రలతా ఇల కమ్మటి మాటను మోదముగా






అయితే ఇదే పద్యాన్ని

1) ప్రేమను పంచిన ప్రేమికవే
ఇల
ప్రేమకు మారుగ నిల్చితివే

2) ఆమని కోయిల పాటవులే
ఇక
కొమ్మగ వచ్చిన చాలునులే

3) నెమ్మది నెమ్మది నిండితివే
మరి
నామది నిండుగ నిండితివే

4) సమ్మత మియ్యవె చంద్రలతా
ఇల
కమ్మటి మాటను మోదముగా


ఇంతకీ ఈ పద్యపు గణాలు 7 భగణాలు 1 గణము ఐనా ఈ క్రింది లయ మాత్రం నాకు తెగ నచ్చేసి పైన పద్యం వ్రాసుకోని asusual ఇలా ఇక్కడ వేడుకోళ్ళు అన్నమాట. అదేలేండి..కామెంటు వేడుకోళ్ళు :-)

తానన తానన తానననా
తన
తానన తానన తానననా

23, సెప్టెంబర్ 2010, గురువారం

అభినవ భువనవిజయము - శారద దరహాసము :-)

ఈ మధ్య ఓ రెండు వారాల క్రితం కవి మిత్రులనుంచి "అభినవ భువనవిజయము - అంతర్జాల కవిసమ్మేళనానికి" సాదర ఆహ్వానం అందింది. ఎప్పటిలానే, చాలా మైల్స్ లాగే దాన్ని ఓ మూల పెట్టేసాను. కానీ అందరి ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుతూ మౌనంగా వుంటే మరీ అసెయ్యంగా వుంటుందని ఒక్క లైను కనాకష్టంగా వ్రాసి అందరికీ మైల్ చేసి హమ్మయ్య అని గాఢంగా గట్టిగా గాలి పీల్చుకొని గుండెల బరువు తగ్గిందని మహదానంద పడుతున్న క్షణాలవి.......

కట్ చేస్తే ఓ నాలుగు రోజుల క్రితం ......

మైల్ ఓపెన్ చెయ్యగానే "శారద దరహాసం - ప్రశ్నాపత్రం" అని ఓ పేద్ద మైల్ వుంది. చదవగానే విషయం బోధపడింది. వారిచ్చిన సమస్యా పూరణలతో పాటి మిగిలిన సమస్యలను పద్య రూపంలో పూరించి పంపాలి. అంతవరకూ బానే వుంది. మొన్న శనివారం ఆవేశమొచ్చి question paper చేతిలోకి తీసుకున్నాను. ఏదో డిగ్రీ ఎక్జామ్ అయితే పక్కోడిది చూసి కాపీ కొట్టేసి పంపేవాడిని. కానీ నిర్వాహకులు ముందు జాగ్రత్త చర్యగా ముందుగా పద్య పూరణలను పంపేవారు కృష్ణదేవరాయల గారికే పంపాలని నిబంధన చేయడంతో అలా కాపీకొట్టే భాగ్యాన్ని అతి దారుణాతిదారుణంగా రాజుగారు హరించివేశారు :-)

question paper చూస్తేనేమో పద్యం వ్రాయడం సంగతి ప్రక్కన పెట్టండి, అసలు అది ఏపద్యపాదమో తెలియడం లేదు. ఇంక అన్ని ప్రశ్నలకు గణాలు, ఛందస్సు లెక్కలేసే పనిలో నా దగ్గర అంతర్జాలం నుంచి దిగుమతి చేసుకొన్న ఒక వ్యాకరణ పుస్తంకంలో గురు లఘువులకోసం CTRL F కొట్టండం మొదలెట్టి అతికష్టం మీద ఒక్క పద్యానికి గణాలను కనుక్కోగలిగాను. కానీ ఇలా చేస్తే పుణ్యకాలం కాస్తా అయిపోద్దేమోనని ఒకటే దిగులు పట్టుకుంది.

ఎంతకష్టపడ్డానో ఏమోగానీ చిరాకేసి Answer paper బదులు question paper ఇచ్చేస్తే పోద్దిలే అని కాస్త బయటకెళ్ళి స్వచ్చమైన గాలి పీల్చుకోని ;-) ఇంటికిరాగానే ఎదురుగా డబ్బా కనిపించింది. అదేలేండి నా ప్రియురాలు లేదా లవ్వర్ లేదా మొదటి పెళ్ళాము. సరే డబ్బా వుందికదా వుపయోగించుకొంటే పోలేదా అని ఈ పుణ్యకార్యం చేసాను. దాని ఫలితమే ఇది. హారంలో వ్యాకరణం పేజీలో వుంచాను.

ఈ చిన్న ఉపకరణి పద్యపాదాన్ని ఇస్తే అది ఏపద్యమో చెపుతుంది. ఇది వ్రాసిన తరువాత నేనైతే నాకు నోటికొచ్చిన వాక్యం వ్రాయడం ఓహో ఇది పద్యం కాదా అని మూతివిరవడం. ఇదే పని :-)

కానీ దీన్ని Develop చేస్తుంటే పద్యం వ్రాయడమేమో గానీ పలు ఆసక్తి కర విషయాలు అమితాశ్చర్యాన్ని కలిగించాయి. ముఖ్యంగా ఉపజాతి పద్యాలు. అందులోనూ కంద పద్యము. ఈ పద్యంలో రెండు / నాలుగు పాదాలనయితే 320 విభిన్న రకాలుగా కూర్చవచ్చని తెలిసి నోట మాట రాలేదన్న మాట !!!!!!!!!!!!!!!!! . ఇలాగే మొదటి/ మూడవ పాదాన్ని 80 రకాలుగా వివిధ గణాల ద్వారా కూర్చవచ్చు.

ఇలాగే తేటగీతి పద్యమయితే 288 విభిన్నరకాలుగా వ్రాయొచ్చొని తేలింది.

ఆటవెలది విషయానికి వస్తే ఒకటవ/ మూడవ పాదాలను 288 రకాలుగా రెండవ/ నాల్గవ పాదాలను 32 రకాలుగా వ్రాయవచ్చు.

ఇకపోతే ఈ ఉపకరణి చెయ్యడానికైతే రెండు రోజులు పట్టింది కానీ, దీని ప్రామాణికత ఎంతో చెప్పాలంటే మీ అందరి సహాయ సహకారాలు తప్పక అవసరం అవుతుందనే ఉద్దేశ్యంతో హారం వ్యాకరణ పేజీలో దీన్ని పరీక్ష కోసం వుంచాను. url is http://www.haaram.com/Vyakaranam.aspx

ఇందులో ఉన్న లిమిటేషన్స్

1) ఈ ఉపకరణి సమాస పదాలను గుర్తించలేదు. ఈ కారణంగా ద్విత్వాక్షర, సంయుక్తాక్షరములు కలిగివున్న సమాసాలు ఒకటే పదంగా వ్రాయాలి. అంటే మధ్యలో space ఇవ్వకూడదు.

ఉదా : "నఖక్షతము" ను నఖ క్షతము గా వ్రాస్తే ఈ ఉపకరణి క్షతము కు ముందున్న ఖ ను గురువు గా గుర్తించలేదు.

2)పాద విరుపుల సమాసాల ద్వారా ముందు పాదాల్లో అయ్యే గురువు ( U ) ను గుర్తించలేదు. ఉదాహరణ గా ఈ క్రింది మత్తేభ పద్యపాదాలను తీసుకుంటే

ఇది కర్ణాటధరాధృతిస్థిర భుజాహేవాకలబ్దేభరా
డుదయోర్వీధర తత్పితృవ్యకృత నవ్యోపాయనోష్ణీష ర
త్నదృగంచత్పద కృష్ణరాయవసుధాధ్యక్షోదితాముక్తమా
ల్యద నాశ్వాసము హృద్యపద్యముల నాద్యంబై మహింబొల్పగున్..

ఇందులో రెండవపాదంలో చివరనున్న "ర" తరువాత పాదంలో నున్న సంయుక్తాక్షరం "త్న" ద్వారా గురువుగా మారుతుంది. కారణం "రత్నదృగంచత్పద" ఒకటే సమాసం. ఇలాంటి ప్రయోగాలను ఈ ఉపకరణి గుర్తించలేదు.

3) యతి/ప్రాస లను గుర్తించలేదు.

సమయా భావం వల్ల application సరిగా Test చేయలేదు.

ప్రస్తుతానికి ఈ ఉపకరణి ఈ క్రింది పద్యపాదాలను గుర్తించగలదు. అక్కడక్కడా తప్పుడు సమాచారాన్ని ఇవ్వనూ వచ్చు ;-). అలా జరిగితే పై రెండు limitations ని ముందుగా సరిచూడండి. చాలా సందర్భాలలో పాద విరుపల వల్లనో లేదా సమాసాన్ని కలిపి కాకుండా విడిగా వ్రాయడం వల్లనో తప్పు చెప్పినట్టు అనిపించవచ్చు. అప్పటికీ సరిగా గుర్తించలేకపోతే మీ పద్యపాదాన్ని admin@haaram.com కి మైల్ చేయండి.

గుర్తించగలిగే వృత్త పద్యాలు
_________

భ ర న భ భ ర వ - ఉత్పలమాల
న జ భ జ జ జ ర - చంపకమాల
మ స జ స త త గ - శార్దూలము
స భ ర న మ య వ - మత్తేభము
ర స జ జ భ ర - మత్తకోకిల
న భ ర స జ జ గ - తరలము
మ ర భ న య య య - స్రగ్ధర
స త త న స ర ర గ - మహా స్రగ్ధర
య య య య - భుజంగ ప్రయాతము
జ ర జ ర జ గ - పంచ చామరము
త భ జ జ గగ - వసంత తిలకము
ర ర ర ర - స్రగ్విణి
స స స స - తోటకము
న న మ య య - మాలిని
భ భ భ భ భ భ భ భ - మానిని
భ జ స న భ జ స న భ య - లయగ్రాహి
ర న భ గ గ - స్వాగత వృత్తము
మ భ న త త గగ - మందాక్రాంతము

ఉపజాతులు
----------------------
తేటగీతి
ఆటవెలది
కందము



ఇక ఆలస్యమెందుకు, హారం మీద ఈ పేజీలో దాడి మొదలెట్టండి. ఈ ఉపకరణి హారంలో వ్యాకరణం విభాగంలో వుంది. లేదా నేరుగా వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి. తప్పొప్పులను దయచేసి admin@haaram.com కి పంపండి.

13, సెప్టెంబర్ 2010, సోమవారం

న్యూజెర్సీ లో Dr Y.S.R సంస్మరణ సభ

ఈరోజు న్యూజెర్సీ లో Dr వై.యస్సా.ర్ సంస్మరణ సభ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల నుంచి కొన్ని చిత్రాలు.

శ్రీమతి ఇందిరా దీక్షిత్ విద్యార్థులు కూచిపూడి నృత్యాన్నించి కొన్ని పాటలను అభినయించగా అనితా కృష్ణన్ గారు "మా తెలుగు తల్లికి" పాటను పాడారు. సాంస్కృతిక కార్యక్రమం ముందుగా గణేష ప్రార్థన తో మొదలై ఫోక్ సాంగ్ తో ముగిసింది. అందునుంచి కొన్ని చిత్రాలు.


గణేష ప్రార్థన




ముకుందా ముకుందా, గణేష ప్రార్థన టీం. ఫోటోలో ఇందిరా దీక్షిత్ గారు మరియు వివేకానంద రెడ్డి గారిని కూడా చూడవచ్చు



మా తెలుగు తల్లీ పాటను ఆలపిస్తూ అనితా కృష్ణన్



భో శంభో శివ శంభో స్వయంభూ పాటను ప్రదర్శిస్తున్న విద్యార్థినులు





folk song ను ప్రదర్శిస్తున్న విద్యార్థినిలు


5, సెప్టెంబర్ 2010, ఆదివారం

గురుపూజోత్సవ దినాన నాగురువుల గురించి.




అందరి గురుపూజోత్సవ ఆర్టికల్స్ చదివాక నాకు మనసులో ఎప్పటినుంచో గూడుకట్టుకున్న నా గురువులకు ఆత్మసాక్షిగా నేనర్పించుకొనే ప్రణామాలివి. అక్షరాభ్యాసం మొదలుకొని ఉన్నతాభ్యాసం దాకా నా ఆలోచనలను, సమాజ పోకడలను ఎప్పటికప్పుడు నాకు నూరిపోస్తూ ఈరోజు నాకాళ్ళపై నేను నిలబడడానికి నాగురువుల మార్గదర్శకత , శిష్యుల పట్ల వారి స్వచ్ఛమైన ప్రేమ ఎన్నటికీ మరువలేను. ఆనాటి గత స్మృతులు మనసు పొరల్లో ఆవిరైపోకుండా ఈనాటిదాకా గుర్తున్నాయంటే వారు నా మీద వేసిన ముద్ర అలాంటిది. ఈ రోజుకున్న ప్రాముఖ్యతను సంతరించుకొని నాలో రేగిన గురు ప్రేమ మాలిక కు అక్షర రూపం ఈ చిన్న వ్యాసం.

మొదటిగా నేను తలుచుకొనవలసిన వ్యక్తి మా పెద్ద చిన్నాయన వేంకట సుబ్బారెడ్డి గారిని. ఆరేళ్ళు నిండినా అక్షరం ముక్క రాకుండా ఊర్లో బఱ్ఱెల వెంట, వాటి తోక పట్టుకోని వాగుల్లో ఈతకొట్టడం కార్యకలాపాలతో మహా సరదాగా గడుపుతున్న బాల్యాన్ని రెండే రెండు నెలల్లో ఒక గాటన పెట్టగ్లిగారు. అప్పట్లో మా చిన్నాయన అంబవరం [ ప్రకాశం జిల్లా దర్శిగుంట పేటకు దగ్గర ] హైస్కూల్ లో తెలుగు పండిట్ గా ఆరు , ఏడు తరగతులకు చిన్న తెలుగు అయ్యవారుగా పాఠాలు చెప్తుండేవారు. ఇంట్లో అమ్మ నాన్నల మాట వినకపోవటం, మాఊర్లో సరైన పాఠశాల లేకపోవడం కారణంగా ఎండాకాలం సెలవులు ఇంక రెండు నెలల్లో ఇస్తారనగా నన్ను మా చిన్నాన్న తీసుకు వెళ్ళారు. స్వతహాగా ఆయనకు తెలుగు పట్ల ఎంత మక్కువో లెక్కల పట్ల అంతకంటే ఎక్కువ మక్కువ. నాకు ఇప్పటికి గుర్తు నా మొదటి పలక పై నాకు వ్రాసి ఇచ్చిన వర్ణం. అది "ఓం" . ఆరోజు దాన్ని రుద్దిన తరువాత తీసుకెళ్ళి ఒకటవ తరగతి లో చేర్పించారు. పాఠశాలకు సెలవులివ్వడానికి రెండే నెలలు. ఇంకొద్ది రోజుల్లో ఒంటిపూట బడి మొదలు కాబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెండే రెండు నెలల్లో నాకు వర్ణమాల మొత్తం నేర్పించడమే కాక, నాలో పలికేటప్పుటు ఉద్భవించే అనేక ధ్వని దోషాలను సవరించి తెలుగు అజంతా భాషపట్ల మక్కువ ను నా చిన్ని బుఱ్ఱలో నాటుకు పోయేట్టు చేయగలిగిన నా మొదటి గురువు. అలాగే తరువాతి మూడు నాలుగు తరగతుల్లో లెక్కల విషయంలో కూడా వైవిధ్య పూరితమైన లెక్కలతో కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం మొదలైన మూల విషయపరిజ్ఞానాన్ని ఇచ్చిన లెక్కను ఏరకంగా ఆలోచించి సాధించాలో లాంటి విషయాల్లో క్షుణ్ణంగా తీర్చిదిద్దారు. ఈ చిన్నాన్న చలువ వల్లే నాకు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ తాడికొండ లో సీటు వచ్చింది. అమ్మనాన్నలు నన్ను దూరంగా వుంచడానికి ఇష్టపడకపోవటంతో చేరలేదనుకోండి అది వేరే విషయం.

ఇక నాలో పురాణాల పట్ల ఆసక్తి ని కలిపించిన వారు నాగిరెడ్డి మరియు నరశింహ రాజు గారు .వీరు నాకు ఒకటినుండి నాల్గవతరగతి వరకు గురువు గారు. ఎన్నో కథలను అభినయిస్తూ చెప్పేవారు. పద్యాలను సుస్వర భరితంగా పాడేవారు. అర్థం కాకున్నా సరే నేర్చుకొని పాడాలన్నంత కోరిక కలిగేది.నాగిరెడ్డి గారి ద్వారా భారత, భాగవత, రామాయణ కథలలో మూల సూత్రాలను చాలావరకు తెలుసుకోగలిగాను.

ఇక్కడ నా విద్యాభ్యాసం నాలుగు తరగతుల వరకు మాత్రమే సాగింది. వివిధకారణాలవల్ల ఐదవతరగతి చదవడానికి మా రెండవ చిన్నాన్న దగ్గరకు వెళ్ళాను. వారిపేరు కూడా సుబ్బారెడ్డిగారే. వీరు సింగరాయకొండ పరాశరభారతిలో [ ప్రైవేట్ స్కూల్ ] హెడ్మాష్టర్ గా చేస్తుండేవారు. వీరిదగ్గర చేరాక పట్నపోకడలు ఎలావుంటాయో మొదటిసారిగా తెలిసాయి. అప్పటిదాకా కాళ్ళకు చెప్పులైనా లేకుండా స్కూలుకు వెళ్లేనాకు ఒక్కసారిగా కాళ్ళకు బూట్లు, మెడకు టై, పుస్తకాలకు అల్యూమినియం పెట్టె, మధ్యాహ్న భోజనానికి కేరియర్.. వహ్.. నా ఆనందం చెప్పనలవి కాదు.అప్పటిదాకా నేను చూసిన సినిమాలు మహా అయితే మూడో నాలుగో వుంటాయి. కానీ నేను ఐదవతరగతి చదివేటప్పుడు అనగా కేవలం తొమ్మిది, పది నెలల్లో చూసిన సినిమాలు అక్షరాలా ముప్పై [ ఈ రికార్డును తరువాత ఆరునెలల్లో ఎనభై సినిమాలు చూసి బ్రేక్ చేసాననుకోండి. అది వేరే సంగతి ]. అంటే ఒక చిన్న పిల్లవానిగా సినిమాల ద్వారా ప్రపంచం అంతా చూశానని చెప్పవచ్చు. ఇక చదువు విషయానికొస్తే ఈ చిన్నాన్న ద్వారా సైన్స్ ను నేర్చుకోగలిగాను. పట్టాభి మాష్టారు ద్వారా సంస్కృతం కొంతవరకూ నేర్చుకోగలిగాను. అప్పట్లో మాకు బాలకాండము సంస్కృత పాఠ్యాంశంగా వుండేది.

అన్నదమ్ములు విడి పడటంతో ఆరవతరగతి నుండి పదవతరగతి వరకు నావిద్యాభ్యాసం వెలిగండ్ల ఉన్నత పాఠశాలలో జరిగింది. ఇది మాఊరినుంచి ఒక మూడు కిలోమీటర్లదూరం. ఈ పీరియెడ్ అంటే ఈ ఐదు సంవత్సరాలు నాకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. బాల్యాన్ని బాగా ఆస్వాదించగలిగాను. స్కూల్ పెద్దదే కానీ టిచర్స్ అంత మంచివాళ్ళు వుండేవారు కాదు. కానీ నా అదృష్టం కొద్దీ నేను ఎనిమిది లో వుండగా లెక్కలు చెప్పటానికి చినకోటయ్య మాష్టారు గారు వచ్చారు. ఈ మాష్టారు ఈనాటి నాస్థితికి కారణమని చెప్పుకోవచ్చు. లెక్కలను అద్భుతంగా చెప్పేవారు. చెయ్యకపోతే దండనా అలాగే వుండేది. నాకు చాలా ప్రియాతి ప్రియమైన టీచర్. పొద్దున పదికి స్కూల్ అయితే ఒక గంట ముందుగా వెళ్ళి ట్యూషన్ చెప్పించుకొనేవాడిని. వెలిగండ్లలో ఎండాకాలమొస్తే పాలు దొరికేవి కావు. నాకిప్పటికీ గుర్తు. మాకున్న గేదెల్లో ఇచ్చే లీటరు పాలతో నీళ్ళమజ్జిగ ఒక కేరియర్ లో తీసుకొని వెళ్ళి ఇచ్చేవాడిని. అందులో నిజానికి మజ్జిగ ఎక్కడో అడుగున వుండేవి. కానీ ఆ టీచరు వాళ్ళు అవే పరమానందంగా తీసుకొనేవాళ్ళు. ఎండాకాలంలో పాలకు అంత గడ్డు పరిస్థితి. ఇంతకీ ఈ మాష్టారు ట్య్యూషన్ చెప్పినందుకు పైసా తీసుకొనేవారు కాదు. నన్ను చూసి ఓ పదిమంది విద్యార్థులు రావడం మెదలు పెట్టారు. అయినా సరే ఫ్రీ ఎడ్యుకేషన్. అంతటి మహానుభావుడు ఆయన. ఈయన చలువవల్లే పదవతరగతిలో నేను పాస్ కాగలిగాను. లెక్కలు [ చిన్నకోటయ్య ] , తెలుగు [ వేంకట సుబ్బారెడ్డి] , హిందీ [ పాపిరెడ్డి ] టీచర్స్ తప్పించి మిగిలిన పాఠ్యాంశాలకు సరైన ఉపాధ్యాయులు లేరు. ఉన్నారేమో కానీ నాకు నచ్చలేదు.

ఇక ఇంటర్మీడియేట్ కనిగిరి జూనియర్ కళాశాల. అన్నట్టు ఇక్కడ చాలా రాచకార్యాలనే నడిపానండోయ్ ;-). ఈ జూనియర్ కళాశాలను ఎప్పటికీ మరువలేను. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ శక్తివంచన లేకుండా బాగా చెప్పేవారు. ఫిజిక్స్,కెమిష్ట్రీ పెద్దగా అర్థమయ్యేది కాదు. కారణం నాకు బేసిక్స్ లేవు. కానీ లెక్కలకు కీర్తిశేషులు బంగారు రెడ్డి అని వుండేవారు. ఎంత క్లుప్తంగా ప్రాబ్లమ్ ను ఎలా సాల్వ్ చెయ్యాలో నేర్పారు. one of the best teacher I have ever seen.

ఇక బేసిక్స్ పడిన తరువాత పైచదువులలో పునాదిపైన ఇల్లు కట్టడమే కదా ! అయినా సరే నాలో సాంకేతిక విద్య పట్ల మక్కువను ఆరిపోకుండా కాపాడిన గురువుల్లో ప్రధములు

Dr v.s.r.k prasad గారు
Dr D Mukherjee
Dr Ray


నా చదువుల్లో నాకు ఇష్టమైన గురువుల కబుర్లు అవి.

3, సెప్టెంబర్ 2010, శుక్రవారం

కవిత కు కోపమొచ్చి అలిగింది :-)




అలక కన్నుల కావేరీ
కొలను నిండినది చూడు దేవేరీ
కలికి చిలక అలలపై అల్లిన
ప్రేమ పంజరం నవ్వినది చూడు నయగారి

తోరణాల అలంకార తోపులోన
త్రోవ త్రోవ వెదికి చూసితినే
తప్పి పోయిన ప్రియురాలెక్కడని
కొమ్మ రెమ్మల ఊపి అడిగినా
చెట్టు పుట్టల తరచి అడిగినా
జాడలేదు నీ జాజిమల్లి
వెళ్ళు వెళ్ళు వెళ్ళి వెతకమన్నవి

కొండనడిగితి కోననడిగితి
కొండమీది మబ్బునడిగితి
సెలయేటి ధార నడిగితి
గాలిలోని పద్మపరాగము నడిగితి
ఎచటనుంది ముగ్ధమోహిని యని

ఎచట వెతికినా వలచి వగసినా
సిగ్గుదొంతర సిందూర పువ్వు
కానరాక కలియదిరిగితి
కానలందు కోనలందు

అలసి సొలసి ఇల్లు చేరితి
రాత్రి కరిగి పాలి పోయెను
నిద్రమత్తు వదిలిపోయెను :))

2, సెప్టెంబర్ 2010, గురువారం

జన నేతకు జన నీరాజనం. వై.యస్స్.ఆర్ ప్రధమ వర్థంతి సందర్భంగా






నీరాజనం నీకు జన నీరాజనం
అలనేలు నాయకా అందుకో ఈ నీరాజనం

పుడమి పుత్తడి పండించ తపమొనరించిన ప్రజానాయకా నీరాజనం
నీటి చుక్కల భవిష్య భారతినిగన్న అపర భగీరథా నీరాజనం |నీరాజనం|

నిర్వాసితులకావాసయోగ్య కుటీర కల్పకా నీరాజనం
నిర్భాగ్యబాలల గుండెలతికిన ప్రాణదాతా నీరాజనం |నీరాజనం|

శతృవు మదిలోన ఈర్ష ప్రదాతా దీనుల పాలిట వరప్రదాతా నీరాజనం
జగమేలు జననాయకా జన హృదయ రంగనాయకా నీరాజనం |నీరాజనం|

కలసి కట్టుగా కత్తికట్టి ఒకటె జట్టుగ జతనుకట్టి
ఎగిరెగిరి పడెనే అడ్డుకట్ట వెయ్యగా
ఏమాయెను ఏమి దక్కెను?

ఇసుక రేణువులన్ని కలసి
కళ్ళనిండా దుమ్ము కొట్టెరా
నీకీర్తి కెరటాల ప్రేమ లాలిత్యాన
ఒకటొకటి రాలి పోయెగా ! |నీరాజనం|

ఎచటున్న ఎటులున్న ఈనాడు ఏమైన
ఈర్షాద్వేషములెవరెన్ని ఏమన్న
ఏమైంది ఈప్రొద్దు ఇలలోన
ఇంటింట ప్రతిఇంట గుండె గదుల్లోన
వెలుగు దీపమై విభవిల్లు ప్రజాపతీ నీరాజనం
నీకు జన నీరాజనం |నీరాజనం|

1, సెప్టెంబర్ 2010, బుధవారం

ఏమి వ్రాయను ఈ మృగతృష్ణ గురించి?





కళ్ళలో ప్రతిబింబించే ప్రతిమ రూపాలు
సుందర సఖీ వలపు విలాసాలు
అధర ధరహాస వింత వర్ణాలు
ఎండమావిలా బహు చేరువే!


మనసులోని భావవీచికలు వేడి గాడ్పులకు ఆవిరయ్యాయ్యా
అందాల అద్దాల మేడ మాటల బీటలు పారిందా
నిండు కుండ తొణికి ఒట్టిపోయిందా
బేధ భావల వలలో చిక్కి చిన్నబోయిందా !

అహంకారం ఆత్మస్థైర్యం
పరుషవాదం మిత్రవాదం
ఏది వరం ఏది శాపం
మనిషి మనుగడకు!

మాయా లోకంలో
యామిని కౌగిలికై
నిట్టూర్చి నిశ్చేష్టితయై
నిందను మోసిందా?

రంగేళి రాత్రులందు రసమయమై
ఆత్మ స్వరూపాన్ని ఎదురుగ కనిందా!