1, అక్టోబర్ 2011, శనివారం

చివరిరోజు........అదే ఆరోజు..........

రెండేళ్ళు నాఎదురుగానే ఉన్నావు
ప్రతిరోజూ...........ప్రతిగంటా
నీ కళ్ళలో పలికే భావాలు వింటూనే ఉన్నాకదా!!


కానీ ఆరోజు..........
ఎదురుగా నువ్వు నేను
పట్టు పరికిణీ పసిడిజడగంటలు
పాదాలకు ఝుంకార కింకిణీలు
చూడముచ్చటైన రూపు.
కానీ కళ్ళలో ఏదో తెలియని బాధ
కాలానికి బద్ధులమై
విడిపోతున్నందుకా?
లేదా... పెదవిదాటి మాటచెప్పలేనందుకా?


హృదయాల్లో అనంతకోటి భావాలు
రంగురంగుల వర్ణ చిత్రాల్నావిష్కరించాయి
వాటికర్థమేమని ఏరోజైనా సందేహపడ్డామా?
పెదవిదాటని మాట
మనల్ని చెరో ఒడ్డుకు విసిరేస్తుందని కలగన్నామా?


సంధ్యారుణకాంతి సాక్షిగా
రాధామానసగీతిక నాకిచ్చినప్పుడు
నీ హృదయతరంగాల సవ్వడినన్ను చుట్టుముట్టినప్పుడు
నీకళ్ళు ఆతృతగా నన్ను చూస్తున్నప్పుడు
కనీసం అప్పుడైనా మనసు విప్పానా?

చివరిరోజు........అదే ఆరోజు
ఇక కలుస్తామో లేదో తెలియని రోజు
ఒకరికొకరం నిశ్శబ్దంగా నిస్తేజంగా
అలా అలా ప్రాణంలేని శిల్పాల్లా
ఘడియలు గంటలు....
వెళుతూ వెళుతూ
నా చెక్కిలి తుడిచేదాకా తెలియలేదు
అక్కడ ఓ కన్నీటి బొట్టుందని
అదే నేను నీకిచ్చిన చివరి బొట్టు అని.

9 కామెంట్‌లు:

  1. హబ్బ ఎన్రోజులకు మల్లీ కవితరాసారు సార్

    రిప్లయితొలగించండి
  2. నా చెక్కిలి తుడిచేదాకా తెలియలేదు
    అక్కడ ఓ కన్నీటి బొట్టుందని
    అదే నేను నీకిచ్చిన చివరి బొట్టు అని.చాలా బాగా చెప్పారు. .

    రిప్లయితొలగించండి
  3. మందాకిని గారూ మెచ్చుకున్నందుకు ధన్యవాదాలు


    అజ్ఞాత కేకలేసినందుకు మీకు కూడా

    మానసా..ఏదో అలా వ్రాయాలనిపించింది. థ్యాంక్యూ

    వనజ వనమాలి గారూ వ్యాఖ్యకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  4. భారారె, ఈ కవితకి ప్రేరణ తెలియదు కనుక, "హృదయాల్లో అనంతకోటి భావాలు రంగురంగుల వర్ణ చిత్రాల్నావిష్కరించాయి" ఆధారం గా ఒక అంతరంగ చిత్రం ఇలా రూపు దిద్దుకుందని మాత్రం అనుకుంటున్నాను. కానీ, స్పందన ఇంకా అక్షరాల్లోకి పూర్తిగా రాలేదేమో అనిపిస్తుంది నా వరకు. ఉదా: ఒకరి "కళ్ళలో పలికే భావాలు" అన్నవి మరొకరి మనసుకి భాష్యాలు కానీ వాటివి 'వినటం' సాధ్యమా? చివరి మూడు పాదాలు ఇంకాస్త సాన పెడితే బాగుండేది. రాస్తూ ఉండు. రాయటమే సాధన ఏ రచయిత/కవికైనా...

    రిప్లయితొలగించండి
  5. సునీత..ధన్యవాదాలు

    ఉష.... కవితకు ప్రేరణ తెలియకపోవడమే మంచిది. ఇక నీ సలహాలను దృష్టిలో వుంచుకుంటాను. మనసులో అప్పుడు ఆక్షణంలో కలిగిన భావానికి ఓ ఐదుశాతం అక్షర రూపమిది అనుకో :-)

    ఇక కళ్ళలో పలికే భావాలు" అన్నవి మరొకరి మనసుకి భాష్యాలు కానీ వాటివి 'వినటం' సాధ్యమా? ఇక్కడ వినదం అంటే మరీ చెవులతో వినడం అర్థం తీసుకోకు. ఒక్కోసారి మనసుతో కూడా వినవచ్చేమో ;)

    రిప్లయితొలగించండి
  6. @కవితకు ప్రేరణ తెలియకపోవడమే మంచిది.
    హ హ, అ౦దరి తో కవిత్వం వ్రాయి౦చేలా ఉన్నారు.

    రిప్లయితొలగించండి

Comment Form