29, మార్చి 2011, మంగళవారం

అందనంత ఎత్తులో అంతులేని మమత


ఎక్కడో గ్రుచ్చుకొనే ముల్లు
జీవితపు చిక్కు ముళ్ళలో
పదునెక్కి చిక్కబడిన ముల్లు

అంతులేని మమత
అందనంత ఎత్తులోనువ్వు
జీవన రాగాలాలపిస్తూ
గలగలా పారే సెలయేటిలా

ఉరుకుల పరుగుల జీవితంలో
దుమ్ముకొట్టుకుంటున్న జీవితం
అప్పుడప్పుడూ రాలిపడే నక్షత్ర రజం
మిగిలిన జీవితాన్నీ కాల్చేస్తుంది

ఆగి ఆగి వీచే సుడిగాలిలో
అప్పటిదాకా ప్రోగైన
మమతానురాగాల కుప్ప
కొట్టుకు పోయింది

ఏదీ నీస్పర్శ? ఏదీ ఆ మమత?
ఏదిక్కున వెదకేది? ఎలా వగచేది?

జీవితం సాఫీగా నడుస్తుంది
దిక్కులేని బాటసారికిమల్లె.

28, మార్చి 2011, సోమవారం

మొత్తుకున్నందుకు ఓ వచనం. షట్కర్మల నుంచి జనమేజయుని దాకా :-)


మొన్నెప్పుడో రాయక రాయక ఒక కవిత రాస్తే సునీతేమో అప్పట్నించి మొత్తుకుంటున్నా గానీ వచనం రాయడంలేదని ఓ విసురు విసిరారు. ఇంతకీ ఏమి రాయాలా అని ఆలోచిస్తుంటే ఈ మధ్య నిఘంటువు పేజీల ఫార్మాట్ సరి చేస్తున్నా కదా ( ఫార్మాట్ మాత్రమే సుమా... అక్షర దోషాలు కాదు ), అలా చేసేటప్పుడు కంటికింపైన పదాలో! ఓ సారీ, కర్ణభేరికింపైన పదాలో అహా..మనసుకు నచ్చిన పదాలు అక్కడక్కడా కనిపిస్తే వేరేగా నోట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ పదాల లిస్టు మీమీదకు వదులుతాను. చదవడం మీ అదృష్టం. చదవకపోతే మీకు ఫలశ్రుతి దక్కదు. ఫలశ్రుతి ఏమిటంటే "చదివినవాళ్ళకు వారి కోర్కెలు రాబోయే నూటాపది ఏండ్లలో తీరుగాక " :-)

ఇక్కడ మీరు చదివి ప్రతిఒక్కటీ " ట" నే అంటే "అంట" అని చదువుకోవాలి. ఎవరో చెప్పినవి కాబట్టి అన్నింటిలో ఒక "అంట" వుచితంగా వేస్కోండి.ఇక అనుభవించండి.


"షట్కర్మములు " అంటే బ్రాహ్మణునికి విధింపఁబడిన ఆఱు కర్మములు (అధ్యాపనము, అధ్యయనము, యజనము, యాజనము, దానము, ప్రతిగ్రహము)
యజనం అంటే యజ్ఞం చేయడం. యాజనము అంటే యజింపచేయటం. ఇంతకీ రెంటికీ తేడా ఏమిటో.
ఇక ప్రతిగ్రహము అంటే దానము పుచ్చుకొనుట.

అలాగే బ్రాహ్మణునకు ఆరు జీవనోపాధులు చెప్పారు." ఉంఛము, ప్రతిగ్రహము, భిక్ష, వాణిజ్యము, పశుపాలనము, కృషి కర్మ".
ఇవికాక జీవించడానికి మిగిలివున్న మార్గాలు అలోచిస్తే దొమ్మీ చేయడం, దొంగతనం చేయడం,మోసం చేయడం ఇలాంటివన్నమాట. ఇవి వీరు తప్ప మిగిలిన కులాల వారు చేయవచ్చు అనేమో అర్థమా?.


**********


షట్కాలములు అంటే శివపూజకు విధింపఁబడిన ఆరు వేళలు. అరుణోదయము, తపనోదయము, సంగవము, మద్యాహ్నము, సాయాహ్నము, అర్ధరాత్రము.
ఇక్కడ పగటి కాలాన్ని ఐదు భాగాలుగా విభజించారు. ౧.ప్రాతః సమయము ౨. సంగవము ౩. మధ్యాహ్నము ౪.పరాహ్ణము ౫. సాయంకాలము. సంగవము అంటే పగటి కాలంలో రెండవ భాగం. ప్రాతః కాలము అయిన తరువాత ఆరు గడియలకాలాన వచ్చేది.
అంటే బహుశా ఎవరికి వీలైన సమయంలో వారు దైవ ప్రార్థన చేయటానికి అనుకూలంగా ఎన్నుకొన్న సమయాలేమో

మరోసారి మరిన్ని "షట్వాచకాల" ను చూద్దాం. కానీ మరికొన్ని ఆసక్తి కలిగించే వివరాలు చూసాను.


*****************

తెలుగు పద రూపమెలా వచ్చిందో చెప్పే ఈ వివరణ చూడండి.
తెనుగు, తెన్గు ,తెలుఁగు --- (శ్రీశైలము, దక్షారామము, కాళేశ్వరము ఈ మూడు శైవస్థలములకు నడుమనుండు దేశము. ఈ దేశమున వ్యవహరింపఁబడు భాష. దీని ప్రకృతి "త్రిలింగః". ప్రాకృతము "తెలింగో"
లాంగలి-నాఁగలి, తొల-తొన అయినట్లు తెలుఁగుశబ్దమే వర్ణవికారముచే తెనుఁగైనది.
కవిసంశయవిచ్ఛేద కర్త ప్రకృతులలోని "ల" కారము వికృతులలో "న" అగునని చూపుట కిచ్చిన యుదాహరణములలో "త్రిలింగః, తెనుగు" అనునది ఒకటి. ఇది లక్షణ గ్రంథకర్తల సిద్ధాంతము

బ్రౌను ఈ సిద్ధాంతము నంగీకరింపక "తెన్" అను తమిళపదము మూలపదముగాఁ దీసికొని "తెన్-దక్షిణము, తెనుఁగు-దక్షిణదేశపు భాష" అని వ్యుత్పత్తి చెప్పినాడు.


********************

అలాగే సప్త జిహ్వుడు అంటే అగ్ని అని చెప్తూ, ఆ ఏడు నాలుకల పేర్లు ఇలా వివరించారు.
కాలి, కరాలి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, ఉగ్ర, ప్రదీ ప్త అనునవి అగ్ని యొక్క యేడు నాలుకల పేర్లు
కానీ చిత్రంగా నాకు ఇవి వేరే రకంగా అనిపిస్తున్నాయు. మనం చెట్లమొద్దుల్ని మండించేటప్పుడు మంటల్లో రకరకాల రంగులు కనిపిస్తాయి కదా. ఆ రంగులననుసరించి, ఫైర్ ఇంటెన్సిటీ ని తెలుపుతూ పెట్టిన పేర్లేమో!
నిజానికి సోడియం మినరల్ కలిసిన మంట పసుపు పచ్చ గానూ, పొటాషియం కలిస్తే వైలెట్ రంగులోనూ, రాగి కలిస్తే ఆకుపచ్చ రంగులోనూ మంటవస్తుంది. దీనికి కారణం చెట్లలో అంతర్లీనంగా వుండే మినరల్స్ కారణమనుకుంటాను.


*************************


ఇంతకీ లేడీస్ అలంకార ప్రాయంగా పెట్టుకొనే సవరము, ఇప్పుడంటే తిరుపతి గుండ్ల నుంచి వచ్చిన వెంట్రుకలతో చేస్తున్నారేమో కానీ , పూర్వకాలంలో ఎవరూ జుట్టును కత్తిరించుకొనేవారు కాదు కదా. మరి అప్పుడు సవరాలు ఎలా వచ్చేవి? అసలు "సవరము" అంటే చమరమృగము యొక్క తోఁక. అని అర్థం. అంటే ఆ తోకతో చేసేవారేమో





**********************
ఇప్పటి కనూజ్ ను అప్పుడు కన్యాకుబ్జమని, చెంబల్ నదిని చర్మణ్వతి అని వ్యవహరించేవారు. గంగాయమునా నదుల మధ్యదేశాన్ని శశస్థలి అనేవారు
****************************





ఇక రాజు అంటే ఏ అర్థమున్నా, సమ్రాట్టు అని ఊరికే అనరేమో. సమ్రాట్టు అంటే రాజులకు రాజు. రాజసూయ యాగం చేసి అందరి రాజులను ఓడించి వారి దేశాలనుంచి ధన,వస్తు,కనక రూపంగా దబాయించి తీసుకొనేవాడినే అంటారేమో. దీనికి కారణం "సమ్రాట్టు అంటే పదికోట్లకర్షముల వార్షికాదాయము గలవాఁడు."


*************************

సినిమాపాటల్లో సరిగంచు తెల్లచీర అనో మరోటో ఎప్పుడో విన్న జ్ఞాపకంతో ఈ పదం మీదికి వెంటనే దృష్టి పోయింది.
సరిగంచు అంటే సరిగ+ అంచు. ఇంతకీ సరిగ అంటే హారము. హారము అంచుగా గల చీర. హ్మ్మ్?

**********************

జనమేజయుడు అంటే జనమును వృద్ధి పొందించువాఁడు అని అర్థం. అంటే భారత యుద్ధంలో దేశాల దేశాలకే యుద్ధంలో పాల్గొని చస్తే ( ఆడవారు యుద్ధం చేయరు కదా ) ఈ రాజు అప్పటి జనాన్ని బహుళంగా వృద్ధి చేయడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహాయపడి వుండాలి.



***********************


ఇక కల్పవృక్షాలు ఐదు. వాని పేర్లు ౧.మందారము ౨.పారిజాతము ౩.సంతానము ౪. కల్పవృక్షము, ౫.హరిచందనము

కల్పవృక్షమంటే కోరిన కోర్కెలు తీర్చే దేవతా వృక్షమనే అసంబద్ధ అర్థాన్ని ప్రక్కన పెడితే, బహుశా ఈ ఐదు చెట్లలో మనిషి అవసరాలకు, రోగాలను నశింపచేసే గుణాలు పుష్కలమనే చెప్పవచ్చు.

7, మార్చి 2011, సోమవారం

తెలుగు నిఘంటువు - సరిక్రొత్త రూపురేఖలతో..... బహుళ శోధనతో

బ్లాగర్లు తలపెట్టిన తెలుగు నిఘంటువు ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి, భిన్నమైన రీతులలో శోధించి పాఠకులకు అందించడానికి తయారైంది.

ఇంతకు ముందు గుడ్డెద్దు చేలో పడినట్టు మనమొక పదము వ్రాస్తే దానికి సంబంధమైన అర్థాలను వెతికి తెచ్చి చూపించేది. కానీ ఈ నయా నిఘంటువు ఇప్పుడు చిన్నగా జోగాడడం నేర్చుకుంది.

ఈ క్రొత్త నిఘంటువులో వచ్చిన మార్పులు చేర్పులు క్లుప్తంగా !

౧) పదము, వాని అర్థాలతో పాటు, ఆ పదానికి వేరే భాషలో ఏమైనా సారూప్యత కలిగిన పదాలున్నాయేమో నని కూడా వెతికి తెస్తుంది. ఈ పదముల ద్వారా భాషల మధ్య నున్న అవినాభావ సంబంధాన్ని ఇట్టే పట్టేయవచ్చు.

ఈ ప్రోగ్రామ్ వ్రాస్తూ పరిశీలుస్తుంటే నాకు తట్టిన ఒక చిన్న విషయం కూడా ఇక్కడ. చాలా వరకూ మనిషికి కావాలసిన నిత్యావసర వస్తువులు, అనగా నిత్యమూ అవసరమయ్యే వర్తక సంబంధమైన మాటలు కన్నడ, తమిళ్, తెలుగు మూడు భాషల్లో బహు కొద్ది మార్పులతో లేదా ఒకే రకంగా కనిపించాయి. దీనర్థం ?? అబ్బో చెప్పాలంటే ఒక పేద్ద పుస్తకమే అవుతుందేమో కాబట్టి అర్థాలు, పరమార్థాలు మీ మీ ఊహలకే !

౨) పదము కు సంబంధించిన రూపాంతరాలనూ సూచిస్తుంది. వీటిద్వారా పద స్వరూపము ఏరకంగా మారుతూ వచ్చిందో కనుక్కోవచ్చు. చాలా పదాలకు పూర్వము పూర్ణ స్వరం వుండి పలుకుబడుల్లో లోపించిన పదాలు కోకొల్లలుగా కనిపించాయి. ఈ నిఘంటువు కొంచెము పాతది కాబట్టి నిండు సున్నలు పూర్వముండి వాడుకలో లోపించిన పదాలకు అరసున్నాలుంచడం మూలంగా చరిత్ర కొంతవరకూ తెలుస్తుంది. ఆ ఇప్పుడు వాడటం లేదు కదా అని వాళ్ళే నిఘంటువునుండి తీసేసి వుంటే ఈ మాత్రమైనా కూడా మనకు ఆ వివరాలు లభ్యమవ్వకపోవునేమో.

ఇలా అరసున్నా వున్న పదాలు చూస్తుంటే నా చిన్నప్పటికి, ఇప్పటికీ తేడా వచ్చిన కొన్ని పదాలు గుర్తుకొచ్చాయి. ఆ వివరాలు ఇవి. ముందుగా చిన్నప్పడు విరివిగా నేను విన్న పదాలను వ్రాసి ఇప్పుడు విరివిగా వింటున్న పదాలను కూడా ఇస్తాను

పండుకోపో ( చిన్నప్పుడు ) == పడుకోపో ( ఇప్పుడు ) ... రెండు పదాల అర్థాలు ఒకటే కదా? ఇలాంటి పదాలకు అరసున్న వాడుతాము. అంటే రాబోవు తరం పిల్లలు ఒకవేళ తెలుగు నేర్చుకొని చదివితే వాళ్ళు ఇలా చదువుకోవచ్చేమో పఁడుకోపో

ఇలాంటివి చాలానే వున్నాయి. మీరూ ఒకసారి చిన్నప్పటి రోజుల్లోకి వెళ్ళి చూడండి :-)

౩) అలాగే సాధ్యమైనన్ని చోట్ల వ్యుత్పత్తి ని కూడా సూచించడం జరిగింది
౪) శాస్త్ర విభాగాన్నీ , అంటే ఆ పదము ఏ శాస్త్రానికి సంబంధించిందో కూడా, వివరాలు వున్నచోట చూపిస్తున్నాము

ఇక అసలు, సిసలైన బహుళ శోధన లోకి వెళితే, రాను రానూ మిగిలిన తెలుగునిఘంటువు సైట్ మొత్తంలో ఏ మార్పులు లేకున్నా, ఈ పుట లో మాత్రము చాలానే పరిశోధనలు జరుగుతాయి. ఇక్కడ ప్రస్తుతానికి రెండు రకాల శోధనా సౌకర్యాలనుంచాను. ఓ సారి చూస్తే మీకే అర్థమవుతుంది.

చాలా సార్లు మనం ఏదైనా కవితో,కథనో లేదా వర్ణనో , లేదా పద్యమో వ్రాస్తున్నప్పుడు కొన్ని మంచి పదాలు చప్పున స్ఫురణకు రావు. వాటి పర్యాయ పదాలేమై వుంటాయబ్బా అని అప్పుడప్పుడైనా ఆలో చిస్తుంటాము కదా !. ఈ పేజి ముఖ్య వుద్దేశ్యము ఇలాంటి పర్యాయ పదాలను కనిపెట్టి చెప్పడమే.

ఇక్కడ search reverse లో జరుగుతుంది. అంటే, మనకు "శివుఁడు" అర్థమిచ్చే అన్ని పదాలూ కావాలనుకున్నప్పుడు dictionary hard copy ఐతే ఏంచేస్తాం? కూర్చొని రోజంతా వెతుకుతాం.లేదా పర్యాయపద నిఘంటువు అని మరో పుస్తకాన్ని కొనాల్సిన అవసరమూ రావచ్చు. కానీ ఇక్కడ మీకు కావలసిన అర్థాన్నిచ్చే "మాట" ను ఈ పేజి లో Textbox లో type చేసి Search చేయండి.

చేసారా? కావలసినన్ని పదాలు కదా :-). మరో మాట To avoid abusing search, only first 200 words will be shown on any search availble in telugunighantuvu.com.


ఈ search ఇంకా అరసున్న, "ము" కారము బదులు "పూర్ణ బిందువు" ను గుర్తించలేదు.

అంటే చక్రం, చక్రము ఒకటికాదు. అలాగే శివుఁడు, శివుడు ఒకటి కాదు. రాబోయే రోజుల్లో ఇవి చేరుస్తాను.




మీరు ఆ పేజీని , అదే బహుళశోధన పేజీని చూసి వుంటే ఇప్పటికే మరోటి మీ కంట్లో పడుండాలి కదా? అదే పద్యాల శోధన. కనిపించిందా? go and enjoy. here is the link
తెలుగు నిఘంటువు

సలహాలు ఇవ్వగోరు వారికి వ్యాఖ్యాన పెట్టంతా మీదే ;-)