29, మార్చి 2012, గురువారం

అమావాస్య రాత్రుల్లో మా పెరటి కబుర్లు.


చిన్నప్పుడు అమావాస్య రాత్రులు పెరట్లో పడుకొని ఆకాశం వైపు ఎప్పుడైనా చూశారా? అదీ మీ ఊరు విద్యుద్దీపాల వెలుగుకు దూరమైతే !! రేడియో పక్కన పెట్టుకొని అందులో రాత్రి 9 గంటల తరువాత వచ్చే సంగీత కార్యక్రమాలు వింటూ, ఆకాశంలో నక్షత్రాల వైపు చూస్తూ, మనసులో శూన్యాన్ని అనుభవిస్తూ..ఒహ్ ఆ తృప్తి అనుభవించి ఎన్నాళ్ళయిందో. అలా అలా సప్తర్షి మండలాన్ని, శుక్ర గ్రహాన్ని, మిగిలిన గ్రహాలనూ చూస్తూ ...... అలా అలా పాలపుంత దారుల్లో పరుగులు పెడుతూ విశ్వానికి ఆవలి అంచులు చూసొచ్చారా? శృష్టిలోని అందాలను తనివితీరా ఆస్వాదించే మానవ జన్మనెత్తినందుకు ఎంత అదృష్టవంతులమో మనం


నిజమేకదా ! అందాన్ని ఆస్వాదించడానికి చీకటి వెలుగులేమిటి. ఒక్కోదానిది ఒక్కో ప్రత్యేకత. చీకటి రాత్రులు ఈ విశ్వప్రాంగణంలో మనమెంత చిన్నవారమో తెలియచేస్తే పున్నమి రాత్రులు సుదూర తీరాల నుంచి దూసుకు వచ్చే వెలుగును చూసి ఆనందిస్తాం. లెక్కలతో పని లేదు. సైన్స్ తో పనిలేదు. కావలసినదల్లా ఆ సౌందర్యాన్ని గుర్తించగలిగే కళ్ళు, ఆస్వాదించి స్పందించగలిగే హృదయం.


మనకు తెలిసిన సౌర కుటుంబం ఇసుమంత. తెలియని, కనిపించని కుటుంబం కొండంత. ఆ కొండ ఎంత? ఎవరు చూశారు. మనకు ఇప్పటికి తెలిసినదానికి మనం పెట్టుకున్నపేరు Milky way. అందులో మనది అతి చిన్న సౌర కుటుంబం. ఆ చిన్న కుటుంబంలో భూమి ఒక్క నలుసు. ఆ నలుసు లో మనందరం రాజులం, రాణులం, మంత్రులం, ధనవంతులం, కూలివాళ్ళం, కీర్తికాంక్షాపరులం. పీఠం కోసం, దర్పంకోసం, ఇగోల కోసం అనునిత్యం కొట్లాడుకొనే పరమాణు సమూహాలం. 


ఈ మిల్కీవే లో మనలాంటి సౌరకుటుంబాలెన్నో. ఓ అంచనా ప్రకారం భూమిమీదున్న మనుషులకు కనీసం 40 రెట్ల నక్షత్రాలున్నాయట. మనము అంచనా వేయగలిగిన గెలాక్సీ ఎంత సుందరమో చూడండి. దీని ఆకారం డిస్క్ షేప్. వ్యాసము చూస్తే 90,000 light years. మందము చూస్తే 10,000 light years, వెడల్పు చూస్తే 13,000 light years. ఇందులో కనీసం 40 బిలియన్ల నక్షత్రాలు/గ్రహాలు/ సౌరకుటుంబాలు. 


మనం ఒక ఊరినుంచి ఇంకోఊరికి పోవడానికి ఆ ఊరిమధ్య దూరాలు కొలిచి పటాలను తయారు చేసుకున్నట్టే ఈ నక్షత్రాల మధ్య కూడా దూరాలను కొలిచి "ఆకాశ పటాలను ( sky maps )"  తయారు చేసారు. ప్రతి పల్లెటూరూకి మనపటాల్లో ఎలా స్థానం లేదో అలాగే ఇక్కడా ముఖ్యమైన నక్షత్రాల మధ్య దూరాలకు మాత్రమే ఆకాశ పటాలున్నాయి. కాకపోతే మన ఊర్లమధ్య దూరాన్ని కి.మీ/ మైళ్ళ ద్వారా కొలిచినట్టు కాకుండా ఇక్కడ నక్షత్రాల మధ్య దూరాన్ని డిగ్రీలలో సూచిస్తారు. 
ఒక కొండ గుర్తు ఏంటంటే మన చేతివేళ్ళన్ని ముడిచి, చేయిని పూర్తిగా ముందుకు చాచి చిటికిన వేలు మాత్రమే తెరిచి చూస్తే ఆ వేలు మనకు ఎంత వెడల్పు కనిపిస్తుందో దాన్ని 1 డిగ్రీ అనొచ్చు. ఈ క్రింది బొమ్మలో లాగా.  ఇది మగవారికి ,ఆడవారికి, పిల్లలకు కూడా కచ్చితమైన ఫలితాన్ని ఇస్తుంది. కారణం చిన్న పిల్లల చేతుల పొడవు తక్కువగా వుంటుందికదా.ఈ డిగ్రీల లెక్క చూడాలంటే మరి ఆరుబయట మంచమేసుకొని ఆకాశంలో Big dipper (అదేనండీ మన సప్త ఋషి మండలం) ను చూడాల్సిందే. ఇదిగో ఈ క్రింది పటంలో చూపినట్టు నక్షత్రానికి నక్షత్రానికి సుమారుగా 5 Degrees దూరమనుకోండి. అప్పుడు వాటి మధ్య దూరం మీ చేతికున్న మధ్య మూడు వేళ్ళదూరమన్నమాట. అంటే ఆ రెండునక్షత్రాల మధ్య అప్పుడు ఏమీ ఖాళీ ప్రదేశం మీకు కనిపించకూడదు.
ఆ రెండు నక్షత్రాల మధ్య దూరం మీ చేతి మూడు వేళ్ళ దూరమే అని మరీ వెటకారంగా చెప్పానా? :))

ఊహూ, కాదు. ఇప్పుడు మీకొక ప్రశ్న. ఈ మూడు వేళ్ళనాధారంగా చేసుకొని అసలు దూరాన్ని ఎలా కనిపెడతారు? ఓ సారి పైథాగరుడ్ని, త్రికోణమితిని తల్చేసుకోండి.వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Comment Form