21, ఏప్రిల్ 2012, శనివారం

Empires Of the Indus - Alice Albania ( సింధూనదిని పాకిస్తాన్ కు కోల్పోవటం మనకు లాభమా, నష్టమా?)








ఈ పుస్తకము సింధూనది గూర్చి, ఆ నది పరివాహక ప్రాంత ప్రజల గురించి, వారి చరిత్ర గురించి, ఆయా ప్రాంత ప్రజల మతముల గురించి, ఆచార వ్యవహారాలను గురించి, దేశ విభజన ద్వారా ఇండియా, పాకిస్తాన్ లకు జరిగిన నష్టాలగురించి, రాజకీయ అవసరాలగురించి రచయిత్రి స్వీయ అనుభావలను కూర్చి, తన అభిప్రాయాలకు పూర్వపు ముద్రిత గ్రంధాలలోని విషయాన్ని ఊతంగా చేసుకొని వ్రాసిన ఓ నాన్- ఫిక్షన్ (చరిత్ర) పుస్తకము.

ఈ పుస్తకము చదువుతున్నంత సేపూ నన్ను మూడు ప్రశ్నలు తొలిచేసాయి. అవి

౧) పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో రచయిత్రి ఒంటరిగా ఎలా తిరుగగలిగింది? తనకెటువంటి ఫిజికల్ హరాస్మెంట్/ టీజింగ్ అనుభవాలు కలుగలేదా? లేక తన మరో నవల Leela's book లో వ్యాసుడిని వెక్కిరిస్తూ వ్రాసినట్లు ( అంటే మహాభారత వక్త వ్యాసుడే కాబట్టి, తను చేసిన పనులను మంచిగా చూపించుకోవడం ) ఇక్కడ Alice Albania కూడా అలాంటి విషయాలను వ్రాయకుండా దాటవేసిందా? ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్  గురించి చదివిన, విన్న వార్తలను బట్టి తప్పక ఈ అభిప్రాయం కలుగుతుంది. లేదా మనము కన్నవి,విన్నవి సత్యదూరాలైనా అయి వుండాలి.

౨) ఈ సింధూనది పరివాహక ప్రాంతం మొత్తం ఈ రకంగా నెలల తరబడి తిరగడానికి ఎంత మొత్తము ఖర్చు అయి వుంటుంది? ఎన్ని నెలల ప్లాన్ ఇది? ఈ మొత్తము తన సొంత ధనమా లేక ఆమె రీసెర్చ్ చేస్తున్న యూనివర్శిటీ భరించిందా?

౩) లగేజ్ రూపంలో ఎప్పుడూ తనతో పాటు తీసుకు వెళ్ళే అత్యవసరమైన వేమిటి? ( కారణం రచయిత్రి దరిదాపు ౨౫౦-౩౦౦ కి.మీ నది వెంటనుండే ఊర్ల గుండా నడుస్తుంది. అలాగే టిబెట్ లో ట్రెకింగ్ కూడా)


ఈ ప్రశ్నలకు సమాధానాలేవైనా సరే,  చరిత్రను, యాత్రా విశేషాలను కలిపి ఆసక్తిగా చదివించ గలిగే పుస్తకమిది. ఇందులో నాకు అభ్యంతరకరమైన విషయాలు అక్కడక్కడ కనిపించినా, చాలా విషయాలపై పట్టుగల రచయిత్రిగా కనిపిస్తుంది Alice Albania. అలాగే కొన్ని కొన్ని విషయాలపై స్థరమైన అభిప్రాయాలు కల్గిన రచయిత్రి కూడా. అంటే, BJP/RSS అన్నా, అద్వానీ అన్నా మంట. స్త్రీ వాది అన్న అనుమానమూ కలుగుతుంది కానీ చెప్పలేము. మొత్తానికి నవలలో తన అభిప్రాయాలను సర్వమత సామరస్య పూర్వకంగానే చూపినట్లు మనకళ్ళకు గంతలు కట్టేస్తుంది :-)

రచయిత్రి లిటరల్ గా చాలా చోట్ల  మనస్పూర్తిగా ఆ నదీపరివాహక ప్రాంతాల్లో మమేకమై ఈ రచనను మనకందించింది. ఈ కారణం చేతనే ఈ పుస్తకం చివరిదాకా మనల్ని చదివించేలా చేస్తుంది. కానీ ఆసక్తి కరంగా భారతదేశంలో రచయిత్రి ప్రయాణం చాలా పేలవంగా నడిచి కొంచెం బోర్ కొడుతుంది కూడా. దీనికి కారణమేమైవుంటుందా అని ఆలోచిస్తే నాకు తట్టిన ఒకే ఒక్క సమాధానం, ఇక్కడ Alice Albania కు పెద్దగా ఇబ్బందులే ఎదురు కాలేదు. కష్టాలు లేవు కాబట్టి రచనలో విషయం లోపించింది. లేదా భారతదేశంలో సింధూనది పరివాహక ప్రాత నిడివి తక్కువ కాబట్టి రచయిత్రికి పెద్దగా ఆసక్తి కలిగించిన విషయాలు లభ్యమయి వుండక పోవచ్చు.

ఇక ఈ పుస్తకము నవలలా చదువడానికి వీలుపడదు. ఇందులో స్పృశించిన విభాగాలు చాలానే వున్నాయి. కరాచీలో మొదలైన తన ట్రావెల్ ప్రాజెక్ట్. ఇండస్ జన్మస్థలి ఐన టిబెట్ లో ముగుస్తుంది. ఈ మధ్యలో మనకు ఇండియా, పాకిస్తాన్ విడిపోవటం వల్ల ఇండస్ నదిని కోల్పోయి, ఇండియా అనే పదానికి అర్థము లేకుండా పోవడం గుర్తుకొచ్చి బాధవేస్తుంది. అలాగే పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్ లలో నేటి పరిస్థితులు చూసి ఆ భాగము లేకపోవడమూ భారతదేశానికి అదృష్టమేమో అని కూడా అనిపిస్తుంది. ఈ నదిని,దీని ఉపనదులను కోల్పోవడం ద్వారా చాలా వరకూ నీటిని కోల్పాయాము. కానీ  భారతదేశానికి ఎప్పుడూ NW, లేదా ఉత్తర  దిశలో  శత్రువు వుండటం సాంప్రదాయమేమో :-)

పుస్తకము ద్వారా పాకిస్తాన్ రాజకీయ, సాంఘిక, మత చరిత్ర కొంతవరకూ తెలుస్తుంది. వజీరిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ చాలా సంవత్సరాలనుండే గాన్ కేసెస్ కాబట్టి ఆశ్చర్యమనిపించదు కానీ ఆ ప్రాంతాలలో రచయిత్రి తీసుకున్న రిస్క్ భయాన్ని కలిగిస్తుంది. బహుశా అమ్మాయి, దానితోటి అందమైన రూపు కూడా రచయిత్రికి కలిసి వచ్చి వుంటుంది. చాలా సునాయాసంగా గవర్నర్లను, మిలటరీ కమాండర్లను, పోలీస్ అధికారులను కలువగలుగుతుంది. భారత్, పాక్ రాజకీయాలు తెలిసిన ఎవరికైనా ఇది కష్ట సాధ్యమని ఇట్టే అర్థమవుతుంది. అంతకు మునుపు పత్రికా ఎడిటర్ గా ఢిల్లీ లో చేసిన అనుభవమూ తోడై వుండవచ్చు.

సూఫీ సైంట్స్ గురించి, సిక్కు మతం గురించి చక్కగా వ్రాసింది. రచయిత్రికి అలగ్జాండర్ పట్ల అమితమైన ఇష్టం. కారణం ఇండస్ ను దాటి భారతదేశాన్ని కొద్దిభాగాన్ని జయించిన మొదటి వ్యక్తి. వీరుడు. అందగాడు. కనుక ఎవరికి మాత్రం ఆరాధనా భావముండదు? ఇక్కడ బింబిసారుడు గురించి మౌర్యుల గురించీ ప్రస్తాపన వస్తుంది. పుస్తకము చదువుతుంటే అశోకుని  విస్తార సామ్రాజ్యమూ కళ్ళముందు కదులుతుంది. మనదేశంలో బౌద్ధం వ్యాప్తికీ, పతనానికీ కారణాలూ కొంతవరకూ తెలుస్తాయి.   అలగ్జాండర్ ఇండస్ ను బోట్స్ ద్వారా దాటినట్టు మనల్నీ బోటు ఎక్కిస్తుంది. బాబర్ తో పాటు  ఖైబర్ పాస్ కు తీసుకువెళుతుంది. ఆనాటి  సోమరసమంటే ఏమిటో కానీ , రచయిత్రి సోమరసాన్ని వైన్ లో చూపిస్తుంది. బహుశా నిజమేనేమో !! వైన్ ఐనా, సారాయి ఐనా వట్టి రసం బువ్వ ఐనా ఇప్పుడు తేల్చలేము కదా.

ఇండస్ పై రిజర్వాయర్లు కట్టటం ద్వారా, కంకరకోసం కొండను వాడుకోవడం ద్వారా మన ప్రాచీన చరిత్రను ఎలా కోల్పోతున్నామో చెప్తూ బాధపడుతుంది. ఇస్లామ్, బౌద్ధమతం పై ఎలా దాడి చేసిందో చెప్తూ, సిక్కు, ఇస్లాం,బౌద్ధమతాలు సామరస్యంగా శతాబ్దాలపాటు కలిసి వున్న వైనాన్ని వివరించింది.

పుస్తకం చదువుతూ, గూగుల్ శాటిలైట్ మ్యాప్స్ చూస్తూ, మనము రచయిత్రితో పాటు ఆ ప్రాంతాల్లో సంచరిస్తూవుంటే చాలా విషయాలు అవగతమవుతాయి. నేనూ ఊహల్లో తిరుగుదామనుకున్నాను కానీ, బార్బారిక్ ఇస్లాం టెర్రరిష్టుల గురించి తెలిసీ ఊహల్లోనైనా అలాంటి సాహసం చెయ్యాలని పించలేదు. ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళు ఆయా ప్రాంతాల్లో  పాకిస్తాన్ సామాన్య ప్రజానీకానికి, ఓవరాల్ గా పాకిస్తాన్ కి చెప్పులోని రాయి, చెవులోని జోరీగ చందము. కానీ రచయిత్రి సేకరించింన అభిప్రాయాల ప్రకారం అటు గవర్నమెంట్ కు కానీ, ఇటు ప్రజలకు కానీ ఈ టెర్రరిజం ఏమీ పట్టకపోగా, మద్దత్తు ఇస్తారట.

అభ్యంతరాలు : ఋగ్వేదం ఇందులో ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆర్యులకు ప్రధానమైనది  Indus river అని, వారు దాని పరివాహక ప్రాంతాలలో వుండేవారని,  Indus నుంచి ఇండియా, హిందూ వచ్చిందని, ఋగ్వేదకాలము క్రీ.పూ ౧౦౦౦ ప్రాంతమని అభిప్రాయ పడుతూ, పూర్వ గ్రంధాలను కోట్ చేసింది. కానీ ఈ ఇండియా,హిందూమతము  అన్నవి మనకు బ్రిటీష్ వారు నేర్పిన పాఠాలు. దీనికీ ఋగ్వేదానికి సంబంధము లేదు. ఋగ్వేదము ఒక్క మతానికి సంబంధించిన గ్రంధము కాదు. ఆ మాటకొస్తే మనకు వర్ణవ్యవస్థ తప్ప "హిందూమత"మే లేదు. అలాగే ఋగ్వేదంలో ప్రధానమైన నది భూమి పొరల్లో మాయమైపోయిన సరస్వతీ నది. ఇందులోని చాలా శ్లోకాలు ఈ నదిపైనే వున్నాయి. ఋగ్వేద కాలం నాడు ఈ నది ప్రవహిస్తూ వుండి, మహాభారతకాలం నాటికే మాయమై పోయింది. ఈ లెక్కన రచయిత్రి తీసుకున్న    క్రీ.పూ ౧౦౦౦ అన్నది చాలా అసంబద్ధమైనది.

హ్మ్మ్.... ఇంకా మరికొన్ని వున్నట్లున్నాయి కానీ ఇప్పుడు గుర్తురావడంలేదు...  కానీ వీలున్నప్పుడల్లా ఒకటికి రెండు సార్లు చదవవలసిన పుస్తకం. మీ స్నేహితులెవరికైనా బహుమతి ఇవ్వడానికీ వుపయోగపడే పుస్తకం. అవిభాజ్య భారత చరిత్ర గురించి తెలుసుకొనగోరువారికి వుపయోగపడే పుస్తకం

 కాలం సాగిపోతూనే వుంటుంది. కాలంతో పాటు హిస్టరీ థీరీస్ మార్పు చెందుతూ వుంటాయి. సత్యం ఎప్పటికీ స్థిరమై, నాశనము లేనిదై భూమి పొరల్లో కప్పబడిపోయి ఎప్పుడో ఎక్కడో మళ్ళీ వెలుగుచూస్తూ వుంటుంది.

12 కామెంట్‌లు:

  1. ఇంకొకరికి బహుమతి సంగతేమోగానీ ముందు నన్ను కొనిచదనివ్వండీ పుస్తకాన్ని :). Thanks for the introduction.

    రిప్లయితొలగించండి
  2. మీరు చదివి వ్రాసిన పుస్తకం నేను చదవలేదు.కాని ఆ విషయాలు ఇంకా అనేక ఇతర గ్రంథాల ద్వారా తెలుసుకొన్నాను.రచయిత్రి పాశ్చాత్యుల దృష్టి తో రాసివుంటుంది.మన ఉపఖండం పేరు పురాణాల ప్రకారం భరత వర్షం ,లేక భరతఖండం.హిందూ అన్నపేరు తర్వాత వచ్చింది.దీని పరిధి గాంధార (ఆఫ్ఘనిస్తాన్ ) నుంచి బ్రహ్మదేశం ( బర్మా ) వరకు ,కాశ్మీర్ ,హిమాలయాల నుంచి సిమ్హళం ( శ్రీలంక )ల వరకు ఉన్నది.ఐతే పూర్వకాలం నుంచి ఇందులో అనేక రాజ్యాలు,కొన్ని సామ్రాజ్యాలు కూడా ఉండేవి.మీరన్నట్లు వేదకాలంలో సరస్వతీనది ప్రవహించేది.మహాభారత కాలంలో కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.తర్వాత క్రమంగా ఎండిపోయింది.
    ఇక సింధు నదీ ప్రాంతాన్ని భారత్ కోల్పోడం లాభమెలా అవుతుంది.?నష్టమే.కాని ఇప్పుడు చెయ్యగలిగింది ఏమీ లేదు .మనకున్న ప్రస్తుత విశాల దేశాన్ని ( 32 లక్షల చదరపు కిలోమీటర్ల దేశం ) భద్రంగా నిలుపు కొంటే చాలు.ప్రపంచంలోనే అగ్ర రాజ్యాలలో ఒకటిగా వర్ధిల్లగలము.అగ్ని వంటి క్షిపణుల్ని ,విక్రాంత్ వంటి నౌకల్నీ ఇంకా సమకూర్చుకోవలసి వుంటుంది.

    రిప్లయితొలగించండి
  3. @Indian minerva మరి ఇక ఆలస్యమెందుకు. ఆపని మూద వుండండి.


    @కమనీయం గారూ, మీ వ్యాఖ్యకు, విషయ పరిజ్ఞానానికి ధన్యవాదాలు. Indus ను కోల్పోవడం అన్ని రకాలుగా దురదృష్టకరం. కానీ ఇప్పుడు ఆ పరిసర ప్రాతాంల శాంతి భద్రతలను చూస్తే పార్టిషన్ ద్వారా పొలిటికల్ గా ఎంత తప్పుజరిగిందో కూడా అర్థమవుతుంది.

    పైవన్నీ మనకు వేరే పుస్తకాల ద్వారా తెలిసినా, ఇప్పటిదాకా చరిత్రకారులు చూడని ఈ నదీపరివాహక ప్రాంతాల సాంఘిక చరిత్ర (contemporary history) రచయిత్రి ద్వారా First hand information మనకు దొరుకుతుంది.

    రిప్లయితొలగించండి
  4. కానీ ఆ ప్రాంతాలలో రచయిత్రి తీసుకున్న రిస్క్ భయాన్ని కలిగిస్తుంది. బహుశా అమ్మాయి, దానితోటి అందమైన రూపు కూడా రచయిత్రికి కలిసి వచ్చి వుంటుంది. చాలా సునాయాసంగా గవర్నర్లను, మిలటరీ కమాండర్లను, పోలీస్ అధికారులను కలువగలుగుతుంది.
    మీ వ్యాఖ్యానాలు పూర్తిగా ఖండిస్తున్నాము .అమ్మాయి కాక అబ్బాయి అయితే ఇలా అంటారా!ఇండస్ అనగానే ఆశగా తీరికగా చదువుతున్న నాకు కొంచెం నిరాశ కలిగింది అసలు పుస్తకం లోని కంటెంట్ కంటే రచయిత్రిని టార్గెట్ చేసారెంటి:)
    మీ మూడు సందేహాలకి కొంచెం ఆలోచిస్తే సమాధానం మీకు వీజీ గా దొరుకుతుంది . అసలు బారతదేశ చరిత్ర తెలీని వారికి ఎంతోకంత అవగాహనా కలిగిస్తుంది అన్నమాట !
    బాగుంది.
    .

    రిప్లయితొలగించండి
  5. చిన్నీ,
    >> అమ్మాయి కాక అబ్బాయి అయితే ఇలా అంటారా?
    అబ్బాయి ఐతే, తిరిగి వచ్చి వుండేవాడు కాదు. ఎక్కడో పిట్టను కాల్చినట్టి కాల్చేసి వుండేవారేమో.

    >>ఇండస్ అనగానే ఆశగా తీరికగా చదువుతున్న నాకు కొంచెం నిరాశ కలిగింది అసలు పుస్తకం లోని కంటెంట్ కంటే రచయిత్రిని టార్గెట్ చేసారెంటి:)

    ఇక రచయిత్రి గూర్చి రాసాను అంటే రాయక తప్పలేదు. ఇందులో కథానాయిక రచయిత్రే కాబట్టి. ఇది చరిత్ర పుస్తకమే ఐనా ఒక ట్రావెలాగ్ కూడా.
    ఐనా మీ వాలకం చూస్తుంటే మీరు పుస్తకం చదివినట్లు కనిపించడం లేదు :)). ఒకవేళ పుస్తకం చదవడం ముదలు పెట్టి వుంటే ఆపకుండా చివరివరకూ చదవండి.
    భారతదేశ చరిత్ర తెలిసిన వారికి కూడా ఇందులో చాలా సమాచారమే వుంది. అంటే మీలాంటి చరిత్ర పండితురాళ్ళకు కాదేమోలండి ఇలాంటి పుస్తకం :-)

    >> మీ మూడు సందేహాలకి కొంచెం ఆలోచిస్తే సమాధానం మీకు వీజీ గా దొరుకుతుంది
    నా సందేహాలకు సమాధానాలు తెలుస్తాయా? ఎలా? నాకు రచయిత్రి అక్కడక్కడా సూచాయగా వ్రాసిన విషయాల వల్ల అసంపూర్తి సమాధానాలేకానీ, ఖచ్చితమైన వివరాలు తెలియలేదు. మీకు ఎక్కడైనా వీటి సమాధానాలు కనిపించి వుంటే నోట్ చేసి పెట్టగలరా?

    వ్యాఖ్యకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. ఇండియా అని గ్రీకులు పిలిచారు. ఆ తరువాత పర్షియన్స్ హిందూ అని పిలిచారు. వాళ్ళ ఆక్సెంట్ బట్టి వచ్చిన మార్పులు ఇవి. ఇక్కడ కనిపించిన అనేక ఆధారాల బట్టి,ఆర్యులకి ద్రవిడులకి మధ్య ఉన్న తేడాలను బట్టి ఆర్యుల కన్న ద్రవిడ సంస్కృతే ఎక్కువ కనిపిస్తుంది. ఆర్యుల దండయాత్రల వల్ల ఈ సంస్కృతి నశించింది. 3000 B.C. నాటిదని చరిత్రకారుల పరిశోధన తెలుపుతుంది. నేను చదివిన అంశాలండి ఇవి. సింధూనది ని కోల్పోవటం ఏమాత్రం లాభం కాదు కదా!

    రిప్లయితొలగించండి
  7. ఏదో మీ రివ్యు చూసి పై వ్యాఖ్యానాలు చేసాను .పుస్తకం చదివినట్లు నేను చెప్పలేదుగా అయినా నేను పండితురాల్నిఅని ఎగతాళి చేస్తున్నారా హ్మం !

    రిప్లయితొలగించండి
  8. జయ, మీ అభిప్రాయం ఇండియా, హిందూ వరకూ ఏకీభవిస్తాను. ఇక ఆర్యుల దండయాత్ర వల్ల ద్రావిడ సంస్కృతి నశిస్తే దక్షిణభారత ముండేదే కాదేమో. ఇవన్నీ ఒట్టొట్టి మాటలేనేమో. పర్షియన్లు, ముస్లింల దండయాత్రల వల్ల హిందూ మతము నశించినట్టు చెప్పుకోవాలప్పుడు.

    రిప్లయితొలగించండి
  9. చిన్నీ, "మీ మూడు సందేహాలకి కొంచెం ఆలోచిస్తే సమాధానం మీకు వీజీ గా దొరుకుతుంది" అని చూసి పుస్తకం చదివి రాసారేమో అనుకున్నా.

    రిప్లయితొలగించండి
  10. భాస్కర రామి రెడ్డి గారు, నేను చెప్పింది సింధూ నాగరికత గురించి. ఆర్యుల దండయాత్ర వలన, అక్కడ ద్రావిడ సంస్కృతి నశించింది.

    రిప్లయితొలగించండి
  11. జయ గారూ, నేనూ అదే చెప్పానండి. ఏదో దండయాత్రలవల్ల ఒక సంస్కృతి నశించిపోదేమోనని. అప్పటికే అక్కడ నివశిస్తున్న వారి సంస్కృతి , కొత్త వారి సంస్కృతితో కలిసి సరికొత్త సంస్కృతి ఏర్పడుతుందేమో గానీ, పూర్తిగా నశించదనుకుంటుంన్నాను.

    రిప్లయితొలగించండి
  12. మా లోకల్ లైబ్రరీలో వుందండి ఈ పుస్తకం. తెచ్చుకుని చదువుతాను. మీ పుస్తకపరిచయంలో నాకు బాగా నచ్చినవి మీ మూడు ప్రశ్నలు :)

    రిప్లయితొలగించండి

Comment Form