31, జనవరి 2013, గురువారం

సిరిమల్లె చెట్టు విశ్వరూపం.......



ఇక్కడికొచ్చిన మొదటిరోజు రెండో ఆటకే జరభద్రం బిడ్డో అని చెప్తున్నా వినకుండా అందరం ఎగేసుకుంటూ వెళ్ళాము. టిక్కెట్లు దొరుకుతాయో లేదో నని మధ్యమధ్యలో ఒకటే అనుమానం. మొత్తానికి సాధించి లోపలికెళ్ళాక ఎంత సేపటికీ సినిమా వెయ్యడే ! ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. సినిమాను ఇప్పటికే చీల్చి చండాడేసినారు కాబట్టి రాయడానికి పెద్దగా ఏమీలేదు కానీ సినిమా మొదలైనప్పటినుండి కథ కోసం ఎదురుచూడ్డం మొదలు. పోనీ కథలేకున్నా స్క్రీన్ ప్లే బాగున్నా సినిమా బయటికి వచ్చాక ఓ పాట, మూడు నాలుగు సీన్లన్నా గుర్తుండేవి. ఒకవేళ వున్నాయేమో సినిమా చూసి మూడువారాలైంది కాబట్టి గుర్తుకూడా లేవు. గుర్తు తెచ్చుకోకుండా మనసులో మెదిలే సన్నివేశం ఒక్కటికూడా గుర్తుకు రావటంలేదు.

పిల్లలతో వెళుతున్నాము కాబట్టి కుటుంబ కథా చిత్రంగా కాస్తంత బంధువుల హడావిడి ఊహించుకోని పోయ్యా. అలాగే టైటిల్ చూసి మంచి గ్రామీణ వాతావరణ సినిమా అనుకోవడం వల్ల కూడా దెబ్బైపోయింది. కాకుంటే సుమోలు లేవడాలు, లారీల జనాలను ఇరగెయ్యడాలు చూసి చూసి బోరుకొట్టడం వల్ల ఏదో క్రొత్తగా వుంది. సినిమా ఎలా వున్నా ఈ సినిమాకు నాలాగే చాలామంది వెళ్ళి చూస్తారు కాబట్టి  హిట్ అవ్వడంలో సందేహమేమీ వుండదు కానీ డైరక్టర్ కథ, సినిమా టేకింగ్ పట్ల ఏమాత్రం శ్రద్ధతీసుకొని వున్నా ఇంతకు రెట్టింపు హిట్ అయి వుండేది. సిరిమల్లెల గుభాళింపు కొద్దిరోజిలైనా గుర్తుండేది.

ఇంతకీ ఇప్పుడిదంతా ఎందుకంటే  మేము భారతదేశానికి వెలుపల వుండడం వల్ల ఈ శనివారం "విశ్వరూపం" చూసే అదృష్టం కలుగుతుంది. నిజమే ఇది అదృష్టమే !!! ఈ మధ్య కొన్ని కావాలని చేసుకొనే వివాదాల వల్లనైతేమీ మరికొన్ని కావాలని చేసే వివాదాలవల్లనైతేనేమీ భారతదేశంలో సినిమా చూడాలంటే ముందుగా సెన్సార్ సర్టిఫికేట్, ఆ ఆ తరువాత మత/కుల సంస్థల సర్టిఫికేట్, తరువాత చిన్నకోర్టు సర్టిఫికేటు, ఆపైన పెద్దకోర్టు సర్టిఫికేట్ .... బొమ్మపడ్డాక గవర్నమెంట్ సర్టిఫికేట్ ( గవర్నమెంట్  అంటే ఏమిటో?? )  తెచ్చుకొని పొరబాటున ఎక్కడైనా సినిమా హాళ్ళు ఖాళీగా వుంటే అప్పుడు కానీ మీకు సినిమా చూసే అదృష్టం కలుగుతుంది. మాకిలాంటి గొప్పగొప్ప సమస్యలేమీ వుండవు కదా :-)


2 కామెంట్‌లు:

  1. ఈ మధ్య కొన్ని కావాలని చేసుకొనే వివాదాల వల్లనైతేమీ మరికొన్ని కావాలని చేసే వివాదాలవల్లనైతేనేమీ భారతదేశంలో సినిమా చూడాలంటే ముందుగా సెన్సార్ సర్టిఫికేట్, ఆ ఆ తరువాత మత/కుల సంస్థల సర్టిఫికేట్, తరువాత చిన్నకోర్టు సర్టిఫికేటు, ఆపైన పెద్దకోర్టు సర్టిఫికేట్ .... బొమ్మపడ్డాక గవర్నమెంట్ సర్టిఫికేట్ ( గవర్నమెంట్ అంటే ఏమిటో?? ....
    చాలా దురదృష్టకర పరిస్థితి...పూర్తిగా కలుషితమయిన సమాజం లోని మనుష్యుల మానసిక స్థితిని ప్రతిబంబిస్తున్నాయి...

    రిప్లయితొలగించండి

Comment Form