13, అక్టోబర్ 2017, శుక్రవారం

జీవన పయనం - 1 (1970 వ దశకం. ఊరి సాంఘిక భౌగోళిక పరిస్థితులు)

జిల్లెళ్ళపాడు ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా లోని ఒక కుగ్రామం. కనిగిరికి దరిదాపు 22 కి.మీ దూరంలో పట్టణవాతావరణం మచ్చుకైనా లేని గ్రామం. ఊరు రెండు భాగాలుగా విడిపోయి వుంటుంది. "పాతూరు", "కొత్తూరు" అని. పాతూరికి కొత్తూరికి మధ్యన కొంతపొలం వుంటుంది. నడిచి వెళితే ఓ పదినిమిషాలు పడుతుంది. పాతూరికి ఓ ప్రక్కగా మాల,మాదిగ పల్లెలుండేవి. అన్నింటిని కలిపి జిల్లెళ్ళపాడు అని అంటారు.  అన్నీ కలిపినా కూడా ఊర్లో దరిదాపు వంద ఇళ్ళకు లోపే. ఈ ఊరు గ్రామ పంచాయితీ కూడా కాదు.ఊరికి రెండు కి.మీ దూరంలో నున్న గోకులం పంచాయితీలో భాగమీ ఊరు. ఊరి భౌగోళిక పరిస్థితులు తెలియడానికి ఈ క్రింది గూగుల్ ఎర్త్ మ్యాప్ సహాయ పడగలదు.
ఊర్లో రెడ్లెక్కువ. రెడ్లతోపాటి కోమటి,చాకలి,కంసాలి,గొల్ల,మాల,మాదిగ కులస్థులు వుండేవారు. ఊరికి బ్రాహ్మణుడు ప్రక్కఊరైన కంకణంపాటినుంచి వచ్చేవాడు.మంగలి కూడా కంకణంపాటివాడే. వంట కోసం కుండల కోసం మరో ప్రక్క ఊరైన గోకులం కు వెళ్ళి తెచ్చుకొనేవారు. ఊర్లో పొలాలన్నీ రెడ్ల అధీనంలో వుండేవి. పొలాల్లో పని చేయటానికి  ఊర్లోనే వున్న మాల,మాదిగ,ముత్తరాచ కులస్థులు వచ్చేవారు. ఇక వ్యవసాయ పనిముట్లకోసం కొత్తూరులో ఎప్పుడూ కొలిమి వెలుగుతుండేది. కొంతకాలం కంసాలి మావూర్లోనే వుండేవాడు.అతను వలస వెళ్ళిపోవడంతో కంకణంపాటి నుంచి పాచ్యో అనే కంసాలి వచ్చి ఊరికి కావలసిన వ్యవసాయ పనిముట్లను తయారు చేసి ఇచ్చేవాడు. 

ఊరు ప్రధానంగా వ్యవసాయాధారితం. పొలాలలో పండే పంటతోపాటి వ్యవసాయానికి అవసరమైన ఎద్దులు,దున్నలు రైతులకాధారం. వీటితోపాటి గొఱ్ఱెలు, కోళ్ళు కూడా పెంచేవారు. ఊర్లో చాలావరకు పూరిళ్ళు. మిద్దెలుగా పిలవబడేవి రెండో మూడో వుండేవి. ఊరికంతటికి ఒక్కటే దిగుడుబావి. ఊరినానుకొని పాలేరనే వాగు పారుతుండేది.ఊరికి బస్సు సౌకర్యంగాని, విద్యుత్ సౌకర్యంగాని లేవు. దగ్గరలోని పట్టణమైన కనిగిరికి వెళ్ళాలంటే ఊరికి రెండు కి.మీ.దూరం నడిచి వెళ్ళి బస్సెక్కాల్సిందే. ఆ బస్సులు కూడా ఉదయమొకటి సాయత్రమొకటి వుండేది.

మా ఊరు సస్యశ్యామలమని చెప్పను కానీ సంవత్సరానికొకపంట తప్పకపండేది. ఎక్కువగా రాగి,సజ్జ,జొన్న,ఆరిక,కంది,పిల్లిపిసర,ఆముదాలు మొదలైన పంటలు వేసేవారు.పాడి సమృద్ధిగా వుండేది.అప్పట్లో పాలకేంద్రాలు లేవు కాబట్టి ఊరి పాడినంతా ఊర్లోనే వుపయోగించేవారు. రైతులకు వినోదమంటే పిచ్చిగుంట వాళ్ళ బుఱ్ఱకథలు. ఊర్లోకి అప్పుడప్పుడు వచ్చి ఆడే తోలుబొమ్మలాటలు. చుట్టుప్రక్కల గ్రామాల వాళ్ళు కలిసాడె నాటకాలు మొదలైనవి. ఊర్లో చదువుకున్న కుటుంబాలను వేళ్ళమీదలెక్కపెట్టవచ్చు.

ఊర్లోని బఱ్ఱెలన్నింటిని కాయడానికి  ఒక కుటుంబం వుండేది. ఇలా ఊరి బఱ్ఱెలన్నింటిని కలిపి జంగిడిగొడ్లు అనేవారు.ప్రొద్దున పదిగంటలకు తోలుకొని వెళ్ళి సాయంత్రం మూడు,నాలుగుగంటలకు తోలుకొని వచ్చేవారు. ఇప్పుడంటే రవాణా సాధనాలు పెరిగి ఊరికి ఊరికి మధ్య రాకపోకలెక్కువై బంధుత్వాలు దూరప్రాంతాల్లో కూడా ఏర్పడుతున్నాయి కానీ ఆరోజుల్లో పెళ్ళిళ్ళు చాలా వరకు ఊర్లోనో లేక ప్రక్కప్రక్క ఊర్లోనో జరుగుతుండేవి. ఈ కారణంగా ఊర్లోను,ప్రక్కఊళ్ళలోనూ  అందరూ ఒకరికొకరు బంధువులే.

10 వ్యాఖ్యలు: 1. అద్భుతః‌!

  మీ మిగిలిన జీవన యానం భాగాల కై
  ఎదురు చూస్తో

  చీర్స్
  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిలేబీ వీలున్నప్పుడల్లా వ్రాయాలనేవుంది. చూద్దాం ఎంతకాలం ఈ వ్యాపకం వుంటుందో.

   తొలగించు
 2. బాగుంది మీ జీవన పయనం ...చాలా కాలం తరువాత ఒక్కరొక్కరుగా బ్లాగుల తలుపులు తెరుస్తున్నారు ...

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. చిన్నీ, వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఉద్యోగం ఒక్కటే చేసుకొంటుంటే మిడిల్ ఏజ్ క్రైసిస్ వల్ల జీవితం నిస్సారంగా అనిపించి మళ్ళీ ఇటొచ్చాను.

   తొలగించు
  2. నిజమే రొటీన్ నుండీ బయట పడతాం .... రాస్తూ ఉండండీ మేము చదివి పెడతాము

   తొలగించు
  3. అంతేనండి. మేము రాస్తే చదవడమే కానీ మీరు మాత్రం రాయనంటారు :)

   తొలగించు
 3. అద్భతం సర్. మళ్ళీ మా ఊరిలో విహరించిన అనుభూతి కలుగుతోంది.
  మా పోస్టులు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. కె.యస్.చౌదరి నా పోస్టు మీ పాతఙ్నాపకాలను తడిమి మీ ఊరిలో విహరింపచేసినందంటే బాగానే వ్రాశానన్నమాట :). వ్యాఖ్యకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు

Comment Form