23, నవంబర్ 2017, గురువారం

జగన్ పదిహేనవరోజు పాదయాత్ర డైరీ - నా పద్యము

ఈ రోజు డైరీ లోనుంచి కొంత భాగము

"ఈ రోజు నడిచినదంతా కొండలు, గుట్టలతో కూడిన ప్రాంతం. రోడ్డు మార్గం, సమాచార సౌకర్యం, రక్షిత మంచినీరు కూడా సరిగాలేని గ్రామాలు! ఈ ప్రాంతంలో ఆకస్మికంగా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగినా, అనారోగ్యం పాలైనా వాళ్ల పరిస్థితేంటి.. అన్న ఆలోచన రాగానే మనసు బరువెక్కింది.

ముద్దవరం, వెంకటగిరి, పెండేకల్లు, చుట్టుపక్కల గ్రామాల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ, బతుకు భారంగా గడుపుతున్న దాదాపు 20 మంది నిరుపేదలు వచ్చి కలిశారు. కిడ్నీ వ్యాధులు, హృద్రోగాలు, వెన్నెముకకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులతో వాళ్లు బాధపడుతూ, ఆరోగ్యశ్రీ సేవలు అందక, ఆదుకునే నాథుడులేక అల్లాడిపోతున్నారు. గుండె తరుక్కుపోయింది. పూట గడవడమే కష్టంగా ఉన్న పేదవాడు ఆరోగ్యం కోసం లక్షల రూపాయలు ఎలా ఖర్చు చేయగలడు?

కొలుముల్లపల్లెకి చెందిన ఓబులమ్మ భర్త కొంతకాలం క్రితం మరణించాడు. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. ఉన్న ఆ ఒక్క కొడుకు కండరాలు, నరాలకు సంబంధించిన వ్యాధితో మంచం పట్టాడు. ఇటీవలే వెన్నెముక కూడా విరిగింది. కదలలేని పరిస్థితి. ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్‌ చేయించుకుందామంటే ఆంధ్రప్రదేశ్‌లో సౌకర్యాలు లేవు. హైదరాబాద్‌లోని నిమ్స్‌ లాంటి ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను రాష్ట్ర ప్రభుత్వం నిలిపి వేసింది. దాంతో వైద్యం చేయించలేక.. కొడుకుని ఆ పరిస్థితుల్లో చూడలేక.. ఆ కన్నతల్లి తల్లడిల్లుతోంది. వెంకటగిరికి చెందిన కిరణ్‌కుమార్‌ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఉన్న ఒకే ఒక కొడుక్కి కిడ్నీల వ్యాధి. మందులకే నెలకు దాదాపు 4,000 వరకూ ఖర్చవుతోంది. కన్నీటి పర్యంతమయ్యాడు. అప్పులు పెరిగిపోయి అతను ఆర్థికంగా చితికిపోతున్నాడు. ‘అప్పు పుట్టడం కూడా కష్టమవుతోందన్నా..’ అని అతను ఒక్కసారిగా భోరుమనగానే నా మనసు కదిలిపోయింది. ప్రాణాంతకంగా పరిణమించే డెంగీ, తలసీమియా వంటి వ్యాధులను కూడా ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదు. దీంతో వేలాది కుటుంబాలు గుండెకోతను అనుభవించాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీని నీరుగార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రభుత్వానికి సామాన్యుల క్షోభ అర్థమయ్యేట్లుగా కనిపించడం లేదు.
చంద్రబాబుగారూ.. ఆంధ్రాలో తగిన వైద్య సదుపాయాలు లేవు. అన్ని సదుపాయాలూ ఉన్న హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో మీరు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు. పేదవారెవరైనా వైద్య సహాయం అందక మరణిస్తే బాధ్యత మీది కాదా? హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తే మీకొచ్చే నష్టమేంటి? అంటే పేదల ప్రాణాలకు విలువే లేదా?"


సీ|| కొండల గుట్టల కూడి నడచుట కసాధ్యమైనట్టి దేశమిది, చూడ
రక్షణ నొసగు నీరము సమాచార సౌకర్యముల్ లేనట్టి గ్రామములివి
రోగము రొష్టుల రోదించు బడుగుజీవులకు సాక్షమ్ములీ వూళ్ళు, కనగ
నింటికొక రకమైనట్టి రోగముల బ్రతుకునీడ్చభాగ్యవంతులయ వీరు

తే.గీ|| రోగము నయము చేయగ రూకలేవి?
ఉన్న ఆరోగ్య శ్రీ చెల్లదుకద తెలుగు
దేశమున, మాకికను మీరె దిక్కనుచు ప్ర
జలు నడచిరి జగన్ తోడ జతగ నేడు

2 కామెంట్‌లు:

  1. ఆంధ్రాలో కే సీ ఆర్ కిట్లు ...తెలంగాణాలో ఆరోగ్యశ్రీ ఇస్తే తప్పేవిటండీ ?
    ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోనీయకుండా భలే అడుగుతున్నారు :))

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హహ అజ్ఞాత... అవి నాకు సంబధంలేని విషయాలు :-).
      నేను జగన్ డైరీ చదవడం ద్వారా ప్రజలెదుర్కుంటున్న కష్టాలు తెలుసుకోవాలనుకొంటున్నాను. దానికి తోడు నా స్వంతగా ఏదైనా జోడించాలనే వుద్దేశ్యంతో నాకు కలిగిన భావాలను కలిపి పద్యంలో వ్రాస్తున్నాను. నిజానికి పాదయాత్రలో సేకరిస్తున్న ప్రజా సమస్యలు ఏ వార్తాపత్రికలో కూడా రావు.ఎంతసేపు రొడ్డకొట్టుడు రాజకీయాలు తప్ప ప్రజా సమస్యలకు మన వార్తాపత్రికల్లో చోటెక్కడిది?

      తొలగించండి

Comment Form