24, డిసెంబర్ 2017, ఆదివారం

మహా భారతకాలం నాటి పెండ్లీ కట్టుబాట్లు


భారతంలో కుంతీ,పాండురాజుల సంవాదం వలన మనకు ఆనాటి అనగా భారతకాలం నాటి సమాజ వ్యవస్థ, పెండ్లి అనే కట్టుబాటు, మాతృస్వామ్య వ్యవస్థ అప్పటి ప్రజల్లో వీటిపైన నెలకొన్న భావాలు స్థూలంగా అర్థమవుతాయి. పాండురాజు యుద్ధాలతో కురురాజ్యానికి దగ్గర దగ్గర రాజ్యాలన్నింటిని జయించి సామంతరాజులుగా చేసుకొని కప్పం కట్టించుకుంటూ ఇద్దరు భార్యలతో సంసారం చేసినప్పటికీ పిల్లలు కలుగరు. బహుశా ఆబాధతో వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి వుంటాడు. ఇక్కడ మనకు పాండురాజుకు మునిరూపంలో సంగమిస్తున్న జింకలను చంపటం వల్ల శాపగ్రస్థుడై వానప్రస్థానికి వెళ్ళాడని కథ ద్వారా తెలుస్తున్నా బహుశా పాండురాజు దగ్గర విషయం లేకపోవటం  వల్ల అతనికి పిల్లలు పుట్టకపోవడంవల్లనే దుఃఖంతో వానప్రస్థానికి వెళ్ళి వుంటాడు. నాటి సమాజంలో కొడుకును కనకపోతే అతనికి పితృ ఋణం తీర్చుకొనే అవకాశం లేనట్లు చెప్పబడింది. సంతానానికి అధిక ప్రాధాన్యతనీయబడింది.
భారతకాలం బహుశా మాతృస్వామ్య వ్యవస్థకు, పితృ స్వామ్య వ్యవస్థకు సంధికాలమై వుండవచ్చు. అనగా అంతకు పూర్వం పూర్తిగా మాతృస్వామ్య వ్యవస్థ నడచి దానిలోని లోపాల వలన సమాజం క్రమంగా పితృస్వామ్య వ్యవస్థవైపు మళ్ళింది. స్త్రీలు ఋతుమతులైన తరువాత పురుషునితో సంగమానికి కట్టుబాట్లు లేని కాలం. యధేచ్ఛగా వారిష్టమొచ్చిన వారితో గడిపిన కాలం. పురుషులు కూడా తమకు కొడుకులు కావాలనుకొన్నప్పుడు  స్త్రీ తో సంగమించడం కొడుకో కూతురో కలిగిన తరువాత యెవరి దారి వారు చూసుకుంటున్న కాలం. 

 అలాగే భారతకాలనికి పూర్వం, భారతకాలంలో  కన్యగా వుండి అనగా పెళ్ళి కాకుండా పిల్లలను కనడం కూడా దోషము కాలేదు. పెండ్లి అనే వ్యవస్థ పూర్తిగా స్థిరపడని కాలమది.క్రమంగా పితృస్వామ్యవ్యవస్థవైపు అడుగులేస్తున్నకాలం. పెండ్లిల్లు జరుగుతున్నప్పటికి పెండ్లికి ముందే కొడుకో కూతురో వున్నప్పటికీ భార్యగా చేసుకోవడంలో ఆనాటి సమాజానికి పెద్దగా పట్టింపులు లేవు. కానీ ఆ వ్యవస్థ భారతకాలంలో అంత్యదశలో వున్నదనుకోవచ్చు. అందుకే సత్యవతికి, కుంతీకి పెళ్ళికి ముందే పిల్లలు కలిగినప్పటికి  రాజులు పెళ్ళి చేసుకొన్నారు. నాటికాలంలో ఇప్పుడు మనము భారతదేశంగా పిలుచుకుంటున్న పేరు అస్తిత్వంలో లేదు.నాడు, నేడు మనం భారతదేశంగా పిలుచుకుంటున్న దేశం అనేక చిన్న చిన్న రాజ్యాల సమూహం. అందులో కురు దేశం ఒకటి. కురుదేశానికి ఉత్తర భాగంలో భారతకాలం నాటికి కూడా మాతృస్వామ్య వ్యవస్థే నడుస్తుండేది. కామమనేది జీవుల్లో సహజమైనప్పటికీ పిల్లలను కనటమనేది వాళ్ళొక పవిత్రమైన కార్యంగా భావించారు. బహుశా ఇలాంటి మాతృస్వామ్య వ్యవస్థ కురుదేశానికుత్తరంగా వుండటం మూలానే కావచ్చు పాండు రాజు భార్యలతో సహా వానప్రస్థాశ్రమం లో తిరుగుతూ అక్కడ స్థిరపడ్డాడు.

కథలో మనకు కుంతీ,పాండురాజులు పడిన అంతర్మధనం కనిపిస్తుంది. పిల్లలను కనటానికి సంగమమే మార్గమైనా ఆ సంగమానికి రకరకాలైన పద్ధతులనవలింభించారు. సమాజ పరిస్థితులను బట్టి ఆయా పద్ధతులు నాడు సమాజంలో వుండి వుండవచ్చు. కవిత్రయ భారతంలో మనకు పన్నెండు రకాలుగా పిల్లలను స్వీకరించవచ్చని చెప్పారు. ఈ పన్నెండు మంది

౧) వివిహం చేసుకొన్న భార్యయందు తనకు పుట్టిన వాడు ( ఔరసుడు)
౨) నియోగం చేత తనభార్య యందు ఇతరులకు పుట్టినవాడు ( క్షేత్రజడు)
౩) తనకు కుమారుడుగా ఇవ్వబడిన యితరుల కుమారుడు( దత్తకడు)
౪) అభిమానంతో కుమారునిగా పెంచుకొనబడినవాడు (కృత్రిమడు)
౫) తనభార్యయందు తనకు తెలియకుండా యితరుల వలన జన్మించినవాడు(గూఢడు)
౬) తల్లిదండ్రులచేత విడిచిపెట్టబడి తనదగ్గర చేరినవాడు (అపవిద్ధుడు)

పైన చెప్పబడిన ఆరుగురు పుత్త్రులు బంధువులే కాక, తమ ఆస్తిలో భాగానికి కూడా అర్హులు

౧) పెళ్ళికాకముందు తనభార్య కన్యగా వున్నప్పుడు పుట్టిన వాడు ( కానీనుడు)
౨) వివాహసమయానికే గర్భిణిగా వున్న తనభార్యకు వివాహం తరువాత పుట్టినవాడు ( సహోఢడు)
౩) తల్లిదండ్రులకు ధనమిచ్చి కొనబడినవాడు ( క్రీత )
౪) భర్తచే విడువబడిన స్త్రీకి లేదా విధవకు తనవలన కలిగిన కుమారుడు ( పౌనర్భవ)
౫) నీకు పుత్రుడనవుతానని తనంత తానొచ్చినవాడు ( స్వయందత్త)
౬) తనగోత్రం వాడు 

పైన చెప్పబడిన ఆరుగురు బంధువులౌతారు కానీ ఆస్తిలో వాటాకు అనర్హులు

అనగా నాటికాలంలో అంతకు కొంచెం పూర్వం పైన చెప్పిన పన్నెండు రకాలుగా కొడుకులు  లేని వారు కొడుకులగా స్వీకరిస్తుండవచ్చు.

ఇక పాండురాజు కుంతీల విషయానికొస్తే వాళ్ళ అంతర్మధన సంభాషణలలో కొడుకులను ఎన్ని రకాలుగా పొందవచ్చో అది అధర్మమెలా కాదో విపులంగా చర్చించుకుంటారు. యే ముని శాపం వల్ల స్త్రీలకు రతీ నియమాలు కట్టుబాట్లు వచ్చాయో చెప్పుకుంటారు. ఇక్కడ ముని శాపం అనుకొనే కంటే సమాజం పరిణామస్థితి చెంది కొన్నిచోట్ల అలా మరికొన్ని చోట్ల యింకా స్త్రీ యే మగవానితోనైనా సంగమించవచ్చనే నియమాలున్నట్లు కనపడుతాయి. తుదకు పాండు రాజు కుంతీకి చేతులెత్తి  భర్తచేత నియోగింపబడిన వాని (పరపురుషుని సంగమం) ద్వారా పుత్రులను కనమని నమస్కరిస్తాడు.

8 వ్యాఖ్యలు:

 1. బాగుంది వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ కూడా రాస్తే బాగుండేది

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అజ్ఞాత, ఆ సంభాషణ వ్రాస్తే టపా చాలా పెద్దదయిపోతుంది. మీకు చదవాలనుంటే టి.టి.డి వారి వెబ్సైట్ లో భారతము అన్ని పర్వాల పుస్తకాలున్నాయి.
   వ్యాఖ్యకు ధన్యవాదాలు

   తొలగించు
 2. భాస్కర రామిరెడ్డి గారూ,
  చాలా బాగా విశ్లేషిస్తున్నారు భారతాన్ని.ప్రతి మనిషీ తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు భారతంలో చాలా ఉన్నాయి.కానీ అర్ధం చేసుకోవదం కష్టం.ఇదివరలో పౌరాణికులు ఎక్కువ మంది ఉండి ఆ పని చేసవారు.ఇప్పుడు మీరు ఆ బాధ్యత తీసుకున్నారు.వూరికే అక్కడ ఆది ఉంది చెప్పి వొదిలెయ్యడం వల్లనే అపార్ధాలు వస్తున్నాయి.మీరు అలా కాకుండా వాటిని ఈ కాలం వాళ్ళు ఎలా అర్ధం చేసుకోవాలో చెబుతున్నారు - బాగుంది!
  భవదీయుడు
  హరిబాబు

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. హరిబాబు గారూ వ్యాఖ్యకు సంతోషం.
   అవునండీ భారతం చదివి తీరాల్సిన యితిహాసం. ఇంకా ఆదిపర్వంలోనే వున్నాను కాబట్టి ప్రస్తుతం నన్నయ వ్రాసిన పద్యామృతాన్ని కథాకథన శిల్పాన్ని మనసారా అస్వాదిస్తున్నాను.
   విశ్లేషణ అన్ని కథలకూ చెయ్యలేను కానీ అప్పుడప్పుడు వ్రాయకుండా వుండలేననుకున్నప్పుడు వ్రాస్తూ వుంటాను.

   తొలగించు

Comment Form