2, మే 2020, శనివారం

జీవిత సోపానాలు - 3

ముఖ్యమైన పుస్తకాలు, వేసుకునే బట్టలు కలిపి ఒక మధ్యస్త వి.ఐ.పి సూట్కేసు నిండుకుంది. ఆరోజుల్లో ఇప్పటిలా అలమరాలనిండా బట్టలు నింపుకొనే సంస్కృతి మా ఇంట్లో లేదు. సంస్కృతి లేదు అనడం కంటే కొనే స్థోమత లేదు అనడం సబబుగా వుంటుంది.మన ఆర్ధిక స్థోమతలను బట్టి సంస్కృతి,సంప్రదాయాలు కూడా మారిపోతుంటాయి.నా బట్టలన్నీ కలుపుకుంటే ఓ ఆరేడు జతలుండేవేమో! ఊర్లోకి బస్సు లేదు కాబట్టి ఓ రెండు కిలోమీటర్ల దూరంలో నున్న రోడ్డు మీదకు వెళ్ళి బస్సు ఎక్కాల్సిందే. ప్రతి రెండు గంటలకు దర్శి నుంచి వినుకొండ పోయే బస్సులుంటాయి.బస్సు వచ్చే ఓ పదినిమిషాల ముందు టిక్కీ వ్యాన్ లు వస్తుంటాయి. బస్సుకోసం వేచి చూస్తున్న జనాలంతా ఈ బస్సెప్పుడొస్తుందోలే అనుకుంటూ ఆ చిన్న వ్యాన్ లో క్రిక్కిరిసి పైన,క్రింద కూర్చొని ప్రయాణిస్తుంటారు.

పుస్తకాలు పెట్టడంతో సూట్కేసు బరువుగా వుంది. మా నాన్న సైకిల్ మీద లగేజీ తీసుకొని నేనూ రోడ్డు దాకా వస్తాననడంతో మా అమ్మను శకునం కోసం ఎదురు రమ్మని, మాఅమ్మకు వీడ్కోలు పలికి నేనూ మా నాన్న సైకిల్ ని నడిపించుకుంటూ, దానితో మేమూ నడుస్తూ మాట్లాడుకుంటూ ఓ అరగంటలో రోడ్డుకు చేరాము. ముందుగా టిక్కీ వచ్చింది.ఎప్పటిలాగే జనాలు క్రిందా మీదా క్రిక్కిరిసి వున్నారు.అందులోనే కాస్త సర్దుకోండమ్మా అంటూ మరో నలుగురు ఎక్కారు. నా దగ్గర లగేజీ వుండటంతో బస్సులో ఎక్కుదామని అందులో ఎక్కే ప్రయత్నం చెయ్యలేదు.

ఓ పదిహేను నిమిషాల నిరీక్షణ తరువాత బస్సు ఖాళీ గా వచ్చింది. మా నాన్నకు వస్తానని చెప్పాను. చేరిన వెంటనే ఉత్తరం వ్రాయమన్నాడు. సరేనని బస్సు ఎక్కి కూర్చున్నాను. కండక్టర్ టికెట్ టికెట్ అని అరవడం కూడా దండగనుకున్నాడో ఏమో వచ్చి సీటు ప్రక్కన నిలబడ్డాడు. వినుకొండ కు ఒక టికెట్ తీసుకుందామని తలెత్తి చూస్తే కండక్టర్ మా హైస్కూల్ లో నాకు రెండేళ్ళ సీనియర్. కాసేపు కబుర్లయ్యాక ఎక్కడికెళుతున్నావు సూట్కేస్ తో అని అడిగాడు. ఉద్యోగ ప్రయత్నానికై పూనా వెళుతున్నానని విషయం వివరించాను. అతని కళ్ళలో ఓ విజయగర్వం. ప్రభుత్వ ఉద్యోగమిచ్చిన సంతృప్తి ఆ కళ్ళలో కనిపించింది. ఓ క్షణం నేను ఇంజనీరింగ్ చేయకుండా ఇలా ఇంటర్మీడియట్ తో చదువును ఆపి ఉద్యోగాలకు ప్రయత్నిస్తే జీవితం వేరే విధంగా వుండేదేమోననిపించింది. అది ఆనాటి నా మనఃస్థితి.

బస్సు నూజెండ్లలో ఆగింది.కొద్ది మంది జనాలు ఎక్కారు.కండక్టర్ వారికి టికెట్స్ ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. సీట్లో ఒంటరిగా వున్న నాకు ఒక్కసారి నిస్సత్తువ ఆవరించింది తల్లిదండ్రులను, చుట్టాలను, ఊరి జనాలను వదిలి దూరంగా వెళుతున్నందుకు.కానీ నాకు ఉద్యోగాలు వుండేది దూరప్రాంతాలలోనే కదా అని సర్దిచెప్పుకున్నాను.ఎన్ని కష్టాలెదురైనా ఈ సారి ఉద్యోగం దొరకనది ఇంటికి వెళ్ళకూడదనుకున్నాను.ఆలోచనలు కలగా పులగంగా మారిపోతున్నాయి.ఓ క్షణం గట్టినిర్ణయం తీసుకున్నట్లే వుంటుంది. మరోక్షణం తెలియని భవిష్యత్తు పై అనిశ్చితి. ఈ ఆలోచనల మధ్య బస్సు వినుకొండను చేరింది.

సాధారణంగా ఈ పల్లె బస్సులు అప్పట్లో ప్రతి ట్రిప్ కు బస్ డిపో కు వెళ్ళేవి కావు.బస్ డిపోకు వెళ్ళకపోతే విజయవాడ వెళ్ళటానికి బస్సులో సీటు దొరుకుతుందో లేదోనన్న సందిగ్ధం. నాలుగైదు గంటలు నిలబడి విజయవాడ వెళ్ళడం కంటే ఓ ఇరవైనిమిషాలు కష్టపడితే డిపోకు చేరుకోవచ్చని కాలికి పని చెప్పాను. వినుకొండ నుంచి విజయవాడకు బస్సుల ఫ్రీక్వెన్సీ బాగానే వుండేది. అటు పడమటి నుంచి విజయవాడకు వెళ్ళే బస్సులన్నీ వినుకొండ ద్వారానే వెళ్ళేవి. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో విజయవాడ బస్సు ఎక్కి కూర్చున్నాను. టికెట్ తీసుకొన్న తరువాత అలసిపోయున్నానేమో బాగా నిద్రపట్టింది. మెలుకువ వచ్చాక చూస్తే చుట్టూ చీకటి.బస్సు ఎక్కడుందో అర్థంకాలేదు.ప్రక్కన సీటులో కూర్చొన్నతను కూడా నిద్రలో జోగుతున్నాడు. కాసేపటికి ఏదో ఊరు వచ్చింది. అపట్లో షాపుల ముందు సైన్ బోర్డులు ఇప్పటిలా షాపు పేరు మాత్రమే వ్రాసే అలవాటులేదు. షాపు ముందు బోర్డు వుందంటే ఆ షాపు పేరు, ప్రక్కన ప్రొప్రైటర్ పేరు, క్రింద ఊరి పేరు వ్రాసే అలవాటు. అలా ఓ శాఖాహార హోటల్ సైన్ బోర్డు చూసి మంగళగిరి వచ్చిందని తెలుసుకున్నాను. మరోగంట లోపు బస్సు విజయవాడ చేరింది.

బస్ డిపో నుంచి రైల్వేస్టేషన్ కు ఓ రిక్షా ఐదురూపాయలకు మాట్లాడుకొని విజయవాడ రైల్వేస్టేషన్ చేరాను. కోణార్క్ ఎక్స్ ప్రెస్ కు ఇంకా చాలా సమయం వుంది. అర్థరాత్రి దాటిన తరువాత కానీ రాదది. సమయం పదకొండు దాటింది. మరో నాలుగు గంటలు రైల్వే స్టేషన్ లోనే గడపాలి. టికెట్ కౌంటర్ కు వెళ్ళాను. ఎప్పటిలానే రిజర్వేషన్ దొరకలేదు.ఐనా సరే టికెట్ కలెక్టర్ ను మేనేజ్ చెయ్యగలనని మొండి ధైర్యం. సూట్కేస్ తో ప్లాట్ ఫాం మీదకు చేరుకొని చుట్టూరూ కలయచూశాను. అప్పటిదాకా జనసందోహ కోలాహలంతో మర్మోగిపోయిన ప్లాట్ ఫాం జనాలు కుర్చీలమీద, కుర్చీలు దొరకని వారు అక్కడే క్రొంద పడుకొని నిద్రకు ఉపక్రమిస్తున్నారు.

నేను బస్సులో ఓ కునుకు తీయడం వల్ల నిద్రాదేవి ఇప్పటిలో నా చెంత చేరేటట్టు కనిపించడంలేదు. విజయా డైరీ పార్లర్ కు వెళ్ళి రెండు మజ్జిగ పేకెట్లు కొనుక్కొని త్రాగాను.ఒక్కొక్కటి రెండు రూపాయలు. నాకు విజయా డైరీలో అమ్మే మజ్జిగ చాలా ఇష్టం. చిక్కగా కారం కారంగా అదో అద్భుతమైన రుచి. భోజనానికి సమయం కాకపోవటంతో ప్లాట్ ఫాం మీద అమ్మే బ్రెడ్/ఆమ్లేట్ ఐదురూపాయలకు తిన్నాను.ఆత్మారాముడు శాంతించాడు. అప్పట్లో రైలు ప్రయాణం చేస్తుంటే వారపత్రికలు కొని చదవటం అలవాటు. ఆ అలవాటు ప్రకారంగా ఆంధ్రభూమి,స్వాతి వార పత్రికలను కొని పేజీలన్నింటిని ఓ సారి ముందునుంచి వెనక్కు త్రిప్పి కథలు రైలెక్కాక చదవొచ్చులెమ్మని అట్టిపెట్టుకున్నాను.

అర్థరాత్రెప్పుడో మాగున్నుగా నిద్రపట్టింది. రైలు తప్పిపోతుందన్న భయమో ఎమో కానీ మధ్య మధ్యలో రైల్వే అనౌన్స్మెంట్స్  స్పష్టంగా వినిపిస్తున్నాయి. అలా జోగుతూ సమయం గడుస్తుండగానే కోణార్క్ రైలు వచ్చి ఆగింది. ధైర్యంచేసి రిజర్వేషన్ బోగీలో ఎక్కి సూట్కేసు ను క్రింద పెట్టి దానిమీద నేను కూర్చున్నాను. తెలతెలవారుతుండగా టికెట్ కలెక్టర్ వచ్చాడు.......

8 కామెంట్‌లు:

  1. సేమ్ స్టోరీ... రిజర్వేషన్ లేకుండా సూట్ కేస్ మీద కూర్చుని, విజయ మజ్జిగ, తెలుగు వీక్లీలు...
    నా మొదటి ప్రవాస ప్రయాణం కూడ కోణార్క్ ఎక్స్ప్రెస్ తోనే, బొంబాయికి.
    పాతికేళ్ళు దాటినా ఇప్పటికీ ప్రవాస జీవితమే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బోనగిరి గారూ అంతేనండి.ఆనాడు రిజర్వేషన్ల సౌకర్యం పొందాలంటే దూరపు పట్టణాకికొచ్చి చేపించుకోవాలి.అక్కడికి రావాలంటే చార్జీల మోత.వచ్చినా దొరుకుతుందోలేదో తెలియదు. కాబట్టి నాటిరోజుల్లో సూట్కేసే ఆసనం.

      తొలగించండి

  2. టికెట్ కలెక్టరు తెలతెలవారుతుండగా వచ్చాడు :)


    వచ్చాడా! అదే పెద్ద విషయము :) దక్షిణ యెంత ముప్పై రూపాయలా బెర్తుకి :)


    జిలేబి

    రిప్లయితొలగించండి


  3. విజయా మజ్జిగ పత్రిక
    లు జోగుచు ప్రయాణము మొదలు మజా! తుదక
    య్యె జిలేబి చుట్టు వలెనా
    గజిబిజి గా పూణె చేరిక తెలుగు బాలా:)


    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. // “ అపట్లో షాపుల ముందు సైన్ బోర్డులు ఇప్పటిలా షాపు పేరు మాత్రమే వ్రాసే అలవాటులేదు. షాపు ముందు బోర్డు వుందంటే ఆ షాపు పేరు, ప్రక్కన ప్రొప్రైటర్ పేరు, క్రింద ఊరి పేరు వ్రాసే అలవాటు. ” //
    ——————-
    నిజం రెడ్డి గారు. మారిపోయిన ఈనాటి బోర్డులు చూసి ఊరి పేరు తెలుసుకుందామంటే వీలవడం లేదు. క్లుప్తంగా బోర్డు వ్రాయించడం స్టైల్ అనుకున్నట్లున్నారు. ఊరి పేరు తెలుసుకోవడం చాలా ఇబ్బందిగా తయారయింది.

    కనుమరుగైపోయిన మరొక అలవాటు రెయిల్వే స్టేషన్లో ప్లాట్-ఫాం కంచెకు ఆ స్టేషన్ పేరు బోర్డులు తగిలించడం. ఒకప్పుడు కనీసం ఐదారు బోర్డులు ఉండేవి (ప్లాట్-ఫాం పొడుగుని బట్టి) ... ఒక్కొక్క వైపు (అంటే స్టేషన్ బిల్డింగ్ కు ఆ వైపు. ఈ వైపు). మరి అన్ని బోర్డులెందుకు, చెక్క పెయింట్ దండగ అని రెయిల్వేలో ఏ అధికారన్నా భావించేసుకున్నారేమో మరి .... ఇప్పుడు ఒక్కో వైపు ఒక్కో బోర్డు కనిపిస్తే అదే గొప్ప. ఈ బోర్డులు రెయిల్వే ఉద్యోగుల కోసం కాదనీ, ట్రెయిన్లో ప్రయాణిస్తున్న వారి కోసం బ్రిటిష్ పాలనలోనే పెట్టిన సౌలభ్యం అనీ గ్రహింపు లేకుండా తయారయ్యారు. రెయిల్వే వారి ఈ అనాలోచిత మార్పు వల్ల స్టేషన్ పేరు తెలుసుకోవడం కష్టమవుతోంది ప్రయాణీకులకు. దానికి తోడు పాత “దేవదాసు” చిత్రంలో లాగా “రామాపురం” “రామాపురం” అంటూ రెయిల్వే ఉద్యోగి ప్లాట్-ఫాం మీద అటూ ఇటూ నడుస్తూ అరిచే ఏర్పాటు కూడా లేదు ఈ రోజుల్లో 🙂.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమేనండి. ఇప్పుడు బస్సులో ప్రయాణిస్తుంటే ఏదైనా ఊరు వచ్చిందంటే తెలుసుకోవడం చాలా ఇబ్బందైపోయింది.
      రైలు ప్రయాణం చేసి చాలా సంవత్సరాలైపోయింది విన్నకోట గారూ!! ఇప్పటి పరిస్థితులు తెలియవు. కానీ అప్పట్లో మీరన్నట్టు స్టేషన్ వస్తుందంటే పెద్ద బోర్డు ముందుగా కనిపించేది. తరువాత స్థంబాలకు అక్కడక్కడా ఊరిపేరు బోర్డులుండేవి.

      అవునూ ఇప్పుడు కూడా రైల్వే స్టేషన్ లో రైలు ఆగగానే ఏ కాఫీ, టీ , ఇడ్లీ అని అరుస్తున్నారా లేక అదికూడా నామోషీ ఐపోయిందా? :)

      తొలగించండి
    2. కాఫీ, టీ, ఇడ్లీ అరుపులు వినిపిస్తుంటాయి లెండి, అమ్ముకోవాలి కదా 🙂.

      తొలగించండి

Comment Form