3, మే 2020, ఆదివారం

జీవిత సోపానాలు - 4

ఏంటి ఇక్కడ కూర్చున్నావు.ఇది రిజర్వేషన్ బోగీ.ఇక్కడ కూర్చోకూడదు.ప్రక్క స్టేషన్ లో దిగి జనరల్ బోగీలోకి వెళ్ళమన్నాడు. నేను నా టికెట్ చూపించి ఎక్కడైనా బెర్త్ ఖాళీగా వుంటే ఇవ్వమని అడిగాను. బెర్త్ లు ఖాళీ వుంటే స్టేషన్ లోనే నీకు రిజర్వేషన్ దొరికేదిగా? చూద్దాంలే అని ముందుకెళ్ళిపోయాడు. "హమ్మయ్య ఇక ఇక్కడ కూర్చోడానికి ఇబ్బందిలేదని" అనుకుంటూ మళ్ళీ సూట్కేసు ఆసనంగా చేసుకున్నాను.

అరగంట గడిచింది. టికెట్ కలెక్టర్ మళ్ళీ కనబడ్డాడు. ఇప్పుడు ఇతన్ని వదిలితే నా సంగతి మర్చిపోయి వేరే ఎవరికైనా బెర్త్ ఇచ్చేస్తాడేమోనని భయం. మళ్ళీ కదిలించాను. ఇక్కడే వుండు నేను మళ్ళీ వస్తానని ముందుకు వెళ్ళాడు.నేను ఆత్రుతగా ఎదురుచూస్తుండగానే వచ్చి డెభ్భైఐదు రూపాయిలిమ్మన్నాడు.సార్ అంతలేదని బ్రతిమాలుకుంటే తుదకు అరవై రూపాయలకు బేరం కుదిరింది. ముప్పై రూపాయలు బెర్త్ ఛార్జ్, ముప్పై రూపాయలు ఆమ్యామ్యా. ఇంతకు ముందు రైలు ప్రయాణాల అనుభవంతో ముప్పైరూపాయల దక్షిణ సర్వసాధారణమైన విషయమౌడంతో పెద్దగా బాధనిపించలేదు.

మొత్తానికి బెర్త్ దొరికింది. వెళ్ళి సూట్కేస్ ను సీటుక్రిందపెట్టి చైన్ తో తాళం వేశాను.ఇలా సూట్కేసు కు చైన్ తో సీటుకు కట్టి తాళం వెయ్యడం విశాఖపట్టణంలో బి.టెక్ చేస్తున్న రోజులనుంచి అలవాటు. విశాఖపట్టణంలో ఇంజనీరింగ్ సీటు వచ్చిన తరువాత చేర్పించడానికి మానాన్న కూడా నాతో వచ్చాడు.ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం వర్క్ షాప్ ప్రాక్టికల్స్ కు బూట్లు తప్పని సరి అని సీనియర్స్ చెప్పడంతో మొదటిసారిగా వేక్షన్ బూట్లు జగదాంబ సెంటర్ కు మా నాన్న తో కలిసి వెళ్ళి కొన్నాను. ఆ బూట్లు కొన్నన్ని రోజుల ముచ్చట తీరకుండానే పోయాయి. రేగింగ్ పూర్తైన తరువాత మొదటి సంవత్సర విద్యార్ధులమందరము ఎవరిళ్ళకు వాళ్ళు బయలు దేరాము. అప్పుడు మేము ప్రకాశం జిల్లా వెలిగండ్ల లో వుండే వారిమి.అందుకని నేను బొకారో లో ఒంగోలు కు వస్తున్నాను. బొకారో వైజాగ్ లో సరైన సమయానికొస్తే సాయంత్రం నాలుగు/ఐదు గంటలకు బయలుదేరి ఒంగోలు తెల్లవారి ఝామున చేరుతుంది. అప్పట్లో ఆంధ్రాయూనివర్సిటీ లో చదివే విద్యార్ధులకు సెలవులకు ఇళ్ళకు వెళ్ళటానికి యూనివర్సిటీ వాళ్ళు రైల్వేపాసులు ఇచ్చేవారు. ఆ పాసు తీసుకొని రైల్వేష్టేషను కు వచ్చి రిజర్వేషన్ చేపించుకుంటే చార్జీలో  యాభై శాతం తగ్గించేవారు.ఈ ప్రయాణం ముందుగానే నిర్ణయించినదైనడవటంతో స్నేహితులందరము మా డిపార్ట్మెంట్ కు వెళ్ళి పాస్ తీసుకొని ముందుగానే ఎవరి రైలు కు వాళ్ళం రిజర్వేషన్ చేపించుకున్నాము. ఇంజనీరు గా ఊరికి మొదటి సారి ప్రయాణం.అదో రకమైన ఆత్మస్థైర్యంతో కూడిన ధైర్యం. బూట్లు వేసుకొని ఊర్లో చూపించాలన్న బలమైన కోరిక. ఇలా సాగుతున్న నా ఆలోచనలకు ఆ ప్రయాణంలోనే పెద్ద గండి పడింది. రైలెక్కి కూర్చొని ప్రక్కన వాళ్ళతో కబుర్లలో పడి సూట్కేసుకు తాళం వేసి కాలికున్న బూట్లు విప్పి పై బెర్త్ కావడంతో రాజమండ్రి దాటిన తరువాత నిద్రపోయాను. ఒంగోలు వస్తుందనగా మేల్కొని బాత్రూమ్ కు వెళదామని చూస్తే బూట్లు లేవు.గుండెల్లో రాయి పడింది.వేరే జత చెప్పులు కూడా లేవు.ఒక్కసారిగా ఆ దొంగ మీద ఎక్కడిలేని కోపం. దరిద్రుడా మట్టికొట్టుకు పోతావురా అని తిట్టుకున్నాను. ఆతిట్టు ఆ దొంగ వినుంటే "నేను క్రొత్తగా మట్టికొట్టుకు పోవడానికేముందిలే.బ్రతకడానికి వేరే మార్గంలేక ఈ వృత్తినెంచుకున్నానని ఓ నవ్వు నవ్వుకొనేవాడు." ఒంగూలు లో రైల్ దిగిన తరువాత చెప్పులు లేకుండానే బస్టాండు కు రిక్షాలో వచ్చాను. సమయం తెల్లవారు ఝామున నాలుగై వుంటుందేమో. వస్తూ ఆశ చావక దారిలో ఎక్కడైనా చెప్పులు షాపులుంటాయేమోనని చూశాను.ప్చ్! ఆ సమయంలో షాపులు ఎవరు తీస్తారు? నేను ఒంగోలు నుంచి కనిగిరి వెళ్ళి అక్కడ వేరే బస్సు మారి వెలిగండ్ల వెళ్ళాలి. ఈ లోపు చెప్పుల షాపులు కనిగిరిలోనైనా తెరవకపోతారానన్న ఆశ. ఐదున్నరకు ఒంగోలు లో బస్సెక్కి కనిగిరికి ఎనిమిదిన్నరకు చేరాను.దిగిన వెంటనే మా ఊరికి బస్సు నిలబడి వున్నది.మరో ఆలోచన లేకుండా ఆబస్సెక్కి ఊరికి చేరాను. ఇలా బూట్లు వేసుకొని షో చేద్దామన్న నాకు అసలు కాలికి చెప్పులే లేకుండా ఇల్లు చేరాల్సిన పరిస్థితి వచ్చింది :) అలా బూట్లు పోయిన తరువాత మళ్ళీ సాఫ్ట్ వేర్ లోకి వచ్చేతంతవరకూ వాటవసరం పడలేదు. ఆరోజుల నుంచే నాకు సూట్కేసుకు చైన్ తో తాళం వెయ్యడం అలవాటు.

ఉదయం ఆరుగంటలే కావడంతో కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో జనాలందరూ నిద్రిస్తున్నారు. నా బెర్త్ పైన కావడంతో పైకెక్కి నిద్రపోయి పదకొండు గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి కూర్చున్నాను. ఎదురుగా ఒక తెలుగు కుటుంబం. భార్యాభర్తలు వాళ్ళమ్మాయితో కలిసి ప్రయాణిస్తున్నారు.అమ్మాయి M.Sc Chemistry చదువుతుందట. రాజమండ్రి వాళ్ళు.పూనా లో ఉద్యోగం కావడంతో అక్కడే స్థిరపడ్డారు.మరో సమయంలో ఐతే అమ్మాయిమీద మనసు పారేసుకునేవాడినే కానీ అప్పటికే మరొకర్ని చేసుకుందామన్న నిర్ణయం మనసులో వుండటంతో గుండె లయ తప్పకుండా దాని స్థానంలో అది పదిలంగా వున్నది :).

సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో వారి ఆతిధ్యాన్ని స్వీకరిస్తూ గడుపుతున్నాను. ఎందుకో ఆ అమ్మాయి పాదాలవైపు చూశాను. తెల్లగా ఎక్కడా ఒక్క మట్టిమరకైనా లేకుండా మెరుస్తున్నాయి. నా పాదాలవైపు చూసుకున్నాను.ఒక్కసారిగా ఆత్మన్యూనత ఆవహించింది. అప్పటికి నాలుగునెలలపైన ఊర్లో ఉండటంతో, చేలల్లో వరికి దమ్ముచేసే ప్రయత్నాల్లో ఆ బురదలో తిరిగి నా పాదాలపై అక్కడక్కడ మచ్చలు ఏర్పడ్డాయి. నేను వేసుకున్న చెప్పులు వాటిని ఏమాత్రం దాచలేక మధ్యాహ్నపు వెలుగులో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.పూణె కు వెళ్ళగానే ఈ మచ్చలులేకుండా చేసుకోవాలని దృఢసంకల్పం చేసు కున్నాను :)

అందరమూ కొద్ది సేపు అంత్యాక్షరి ఆడుకున్నాము. ఆ రోజుల్లో అంత్యాక్షరి ఒక ట్రెండ్ సెట్టర్. కాలేజీల్లో వీటికి పోటీలు కూడా నిర్వహిస్తుండేవారు. మా టీం ఈ పోటీలో, డమ్ షరాడ్స్ లో ఎప్పుడూ మొదటి బహుమతిని గెలుచుకునేది. దాని వల్ల చాలా పాటలు నాలుకపై ఆడుతుండేవి. గాత్రం కూడా వినటానికి అభ్యంతరం లేకుండా వుండేది. నా పాటలు వారికి నచ్చాయో ఏమో ఒక పాట పాడమని అడిగారు.
అప్పట్లో నాకిష్టమైన పాట, అప్పటికే చాలా సార్లు పాడిన పాట ఎంచుకున్నాను.అల్లుడుగారు సినిమా లోది.

ముద్దబంతి నవ్వులో మూగబాసలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలూ
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
మధుమాసమే అవుతుంది అన్నివేళలా
ముద్దబంతి నవ్వులో మూగబాసలు...

అందరూ బాగుందని మెచ్చుకున్నారు. ఆ మెప్పుదల మనసుకు సంతృప్తినిచ్చింది.

పులిహోర,పెరుగన్నం తింటూ గడిపాము.పూనా దరిదాపులకు రాగానే నేను దాచుకున్న అడ్రస్ ను చూపించి రైల్వేస్టేషన్ నుంచి ఎలా వెళ్ళాలి అని ఆ తెలుగు కుటుంబాన్ని అడిగాను. నువ్వేమీ ఇబ్బంది పడకు మేము ఆటో ను మాట్లాడి పంపిస్తామని చెప్పి, మేము కూడా నీవుండే హాష్టల్ కు దగ్గరలోనే వుంటామని వీలు చూసుకుని రమ్మని అడ్రస్ ఇచ్చారు.

పూణె రైల్వే స్టేషన్ లో దిగిన తరువాత వారి సహాయంతో ఆటో లో కోథపేట్ కు నా స్నేహితులిచ్చిన అడ్రసు కు చేరుకున్నాను....

1 కామెంట్‌:

Comment Form