9, మే 2020, శనివారం

నూతన గృహ ప్రాప్తిరస్తు....

2000 సంవత్సరం మొదలుకొని 2005 వరకూ బిజినెస్ వీసా మీద ఐదుసార్లు అమెరికా ప్రయాణాలు చేసినా  2005 వరకూ H1 మీద రావడానికి ధైర్యం సరిపోలేదు. కారణం 2000 వ సంవత్సరం మొదటి సారి లాస్ ఏంజలస్ కు బిజినెస్ వీసా మీద వచ్చినప్పుడు కొంతమంది H1 స్నేహితుల కష్టాలు దగ్గరిగా ఓ ఆరునెలలు చూశాను. అప్పటికే  నాకు పెళ్ళై వుండటం, మొదటి పాప పుట్టి రెండేళ్ళు కూడా పూర్తవని కారణంగా భారతదేశంలో వున్న స్థిరమైన ఉద్యోగాన్ని ఒదులుకొని ఇక్కడికి వచ్చి ఇన్ని కష్టాలు పెళ్ళాం బిడ్డలతో అనుభవించడం అవసరమా అని అనిపించింది. దానితో 2001 లో మా బావమరిది ద్వారా వచ్చిన H1 ని కూడా వదులుకొని ఇండియాలోనే ఉద్యోగం చేసుకుంటు కాలం గడిపాను. కానీ 2005 వచ్చేసరికి నా దృక్పధం కొంతమారింది. ఆ సమయంలో దరిదాపు ఓ సంవత్సరం పాటు రెండు విడతలగా అమెరికా లో బిజినెస్ వీసా మీద గడిపాను. అమెరికా విద్యా విధానం, పిల్లల సంపూర్ణ వ్యక్తిత్వ వికాశం, విశాల దృక్పధాలను అలవరచుకోవడానికి కావలసిన వాతావరణం మొదలైన అంశాలు నన్ను ఆకర్షించినవి. అప్పటికి రెండవ పాప కూడా పుట్టి ఇద్దరూ ప్రాధమిక విద్యాభ్యాస స్థాయిలో వున్నారు. అవును మరి ఇండియాలో మూడేళ్ళు నిండగనే స్కూల్ లో వేస్తాము కదా! వారికి మంచి భవిష్యత్తును అందించాలనే తలంపుతో నాకు తెలిసిన స్నేహితుని ద్వారా ఓ H1 కు అప్లై చేశాను. ఆ తరువాత 2005 నవంబరు నాటికి తిరిగి హైదరాబాదు వెళ్ళిపోయాను. అప్పటికి H1 lottery system లేదు. నాకు తెలిసి first come first serve వుండేది. కానీ వాళ్ళు సమయంలోపు అప్లై చేయకపోవడంతో ఆ సంవత్సరం రాలేదు. తిరిగి 2006 లో అప్లై చేశారు.

అనుకున్నట్లుగానే 2006 చివరిలో నాకు H1 approve ఐనట్టు మైల్ వచ్చింది. H1 papers అన్నీ నాచేతికి రావడానికి 2007 జనవరి మాసమైంది.ఈ మధ్యలో ఓ పెద్ద ప్రహసనం. ఆ సమయంలో నా ఉద్యోగం చెన్నై లో వుండేది. కానీ నా క్లైంట్ అమెరికా లో వుండటంతో నేను సంవత్సరంలో ఓ మూడు నాలుగు సార్లు చెన్నై వెళ్ళి అందరికీ హాయ్ చెప్పి వచ్చి హైదరాబాదు లో ఇంటి నుంచే పని చేస్తుండేవాడిని. అలా చెన్నైకి వెళ్ళి పని ముగించుకొని తిరిగి జనవరి 8 2006 లో చెన్నై నుంచి కాచిగూడ ఎక్స్ ప్రెస్ కు హైదరాబాదు వస్తున్నాను. పగలంతా బాగా పని చేసి వుండటం వల్ల ఆదమరచి నిద్ర పోయాను. కాచిగూడ వస్తుందనగా లేచి చూసుకుంటే నా సర్టిఫికేట్లు/పాస్పోర్ట్లు వున్న బ్రీఫ్ కేసు కనిపించలేదు. హత విధీ !!! :(. ఇలా రైలులో వస్తువులు పోగొట్టుకోవడం ఇది రెండవసారి. మొదటి సారి బూట్లతోనే ఆగిపోయింది. కానీ ఈ సారి నా జీవితానికి అతిముఖ్యమైన డాక్యుమెంట్లు పోయాయి.ఆ తరువాత వాటిని తిరిగి ఎలా సంపాదించుకొన్నానో అదొక పెద్ద చరిత్ర. మరొక సారి ఎప్పుడైనా వ్రాస్తాను.

అలా వచ్చిన H1 ని సద్వినియోగ పరచుకొందామని ఫిబ్రవరి 2007 లో చన్నై కౌన్సిలేట్ లో అపాయింట్మెంట్ తీసుకొన్నాను. మేము ఒకటే నిర్ణయించుకొన్నాము. కుటుంబమంతా కలిసి కౌన్సిలేట్ కు వెళదాము. వీసా ఇస్తే అందరికీ ఒకేసారి ఇస్తాడు. అలా కాకుండా మనలో ఏఒక్కరికి రిజెక్ట్ ఐనా H1 కు మంగళం పాడుదామని అనుకొన్నాము. అనుకున్న విధంగానే అందరమూ ఒకేసారి వీసా కు వెళ్ళడం అందరికీ వీసా ఇవ్వడం జరిగిపోయింది. ఆ రోజు, మరసరోజు అందరికీ చెన్నై, మహాబలిపురం చూపించి తిరుగు ప్రయాణంలో మా గ్రామం గాంధీ నగర్ కు వెళ్ళి హైదరాబాదు వచ్చాము. అలా ఏప్రిల్ నాల్గవ తేదీ 2007 వ సంవత్సరం అమెరికాలో దిగి ఏప్రిల్ రెండవ వారంలో H1 మీద ఉద్యోగం ప్రారంభించాను. ఏప్రిల్ లోనే కుటుంబాన్ని తీసుకురావడానికి వీలుగా ఒక సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ తీసుకొన్నాను. 2007 మే రెండవవారంలో ఫ్యామిలీ వచ్చినాతో చేరింది.

ఇక అక్కడినుంచి అమెరికా స్థిరనివాస ప్రయాణం మొదలు. అలా 2007 వ సంవత్సరం నుంచి 2019 మే నెల వరకూ అద్దె ఇళ్ళలో జీవనం కొనసాగింది. ఆ పన్నెండు సంవత్సరాలలో ఎన్నో ఇళ్ళు మారాము అనుకొనేరు. దశాబ్దకాలం పైగా మేము మారింది రెండే రెండు ఇళ్ళు. మొదటి ఇల్లు అద్దె పెంచాడని కోపంతో మారాము. నాకోపానికి కారణం మేము అప్పటికే అక్కడ నివాసం ఏర్పరచుకొని సంవత్సరకాలంగా వున్నా వాడు క్రొత్తగా అద్దెకు వచ్చే వారికి మాకన్నా తక్కువ అద్దెకు ఇచ్చి మాకేమో అద్దె పెంచాడు. ఓ ఇంతలేసి ఇల్లు ఎక్కడా దొరకదా అని కోపంగా ఇల్లు మారాము. ఇల్లు మారిన తరువాతి ఇంటిలో దశాబ్ద కాలంగా వున్నాము. I still miss the second house.

ఈ పన్నేండళ్ళలో చాలామంది మమ్మల్ని ఇల్లు ఎప్పుడు కొంటారు? నూతన గృహ ప్రాప్తిరస్తు! అని ప్రశ్నించడమూ దీవించడమూ జరిగింది. ఈ మధ్య వచ్చే H1 వాళ్ళైతే ఉద్యోగం రావడమే ఆలస్యం ఇల్లు కొనేస్తున్నారు. వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఏమైనా అంటే అది ఇన్వెస్ట్మెంట్ అంటారు. కానీ నేను H1 మీద, గ్రీన్ కార్డ్ మీద ఆ రిస్క్ చెయ్యదలచుకోలేదు.కారణం ఇక్కడ వుంటామో లేదో తెలియదు.అలాగే పిల్లల స్కూల్స్ కూడా మార్చడం ఇష్టంలేక పోయింది. H1 మీదైతే ఇల్లు కొనడం మరీ రిస్క్ అనిపిస్తుంది నాకు. నా కెందుకో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా (H1) అనేది తుమ్మితే ఊడే ముక్కెర లా అనిపిస్తుంది. అది నా అభిప్రాయమే కావచ్చు కానీ H1 మీద ఇల్లు కొంటే మానసిక ఒత్తిడి తట్టుకోవడం కష్టమనిపిస్తుంది నాకు. అలా పన్నెండేళ్ళు గడిపిన తరువాత పోయిన సంవత్సరం మే 9 వ తేదీ అమెరికాలో ఒక ఇంటివాడినయ్యాను.

ఎవరి సొంత గృహం వాళ్ళకు అపురూపం. చిన్నదైనా, ఓ మోస్తరుదైనా, పెద్దదైనా,రాజభవనమైనా ఎవరి శక్తికొలది వారు కొనుక్కుంటారు. అది ఎంత చిన్న గృహమైనా ఎవరి ఇల్లు వారికి అపురూపం. అలాగే నా ఇల్లు నాకు అపురూపం :-)





31 కామెంట్‌లు:

  1. Beautiful house. Congratulations Bhaskar Reddy garu

    రిప్లయితొలగించండి
  2. మొట్ట మొదట శుభాకాంక్షలు . కేవలం ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను , అమెరికా లో ఇళ్లు పెద్దవి గా ఉంటాయా ? మీ భవిష్యత్తు అవసరం కోసం పెద్దది కొనుక్కున్నారా ? ఎవరో బ్లాగ్ లో రాసినట్టు గుర్తు , రీసేల్ వేల్యూ పెద్ద ఇళ్ళకే ఉంటుందని , నిజమా ? ఒకరిద్దరు బ్లాగర్ లు ఇళ్ళు కూడా పెద్దవి గ ఉండటం చూసినట్టు గుర్తు . నేను జర్మనీ లో ఉంటాను , ఇక్కడ ఇళ్ళు అన్ని కొలతలతో కాంపాక్ట్ గా ఉంటాయి . పెద్దవి ఉండవు ( నేను ఉన్న గ్రామం లో ఇలానే ఉంది , వేరే చోట ఎలా ఉంటుందో తెలియదు ). మీ ఇల్లు బాగుంది , చుట్టూ విశాలమైన పచ్చిక తో , బాగుంది . ఇక్కడ ఇంటి పని చేసి చేసి , మీ ఇళ్లు చూసిన వెంటనే , అంత పెద్ద గార్డెన్ కట్ చేయడానికి ఎంత కష్టమో అనిపించింది :-) హ హ హ :
    Kumar

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కుమార్ గారూ అమెరికన్లు విశాలమైన ఇళ్ళను ఇష్టపడతారు. నాకు తెలిసి ఆష్ట్రేలియా తరువాత అమెరికాలోనే పెద్ద పెద్ద ఇళ్ళు. ఇక్కడ స్కూల్ డిష్ట్రిక్ట్ రేటింగ్ బట్టి ధరలుంటాయి. సర్వసాధారణం గా ఇండిపెండెంట్ ఇళ్ళంటే 2800 s.ft నుండి 3300 S.ft ధారాళంగా లభిస్తాయి.(atleast in New Jersey where I live). అలాగే నాలుగు బెడ్ రూమ్ లు, రెండున్నర నుంచి మూడు బాత్ రూమ్ లు సర్వసాధారణం. ఇక బయట లాన్ కొన్ని కమ్యూనిటీల్లో చాలా కొద్దిగా మాత్రమే వుంటుంది. అది కమ్యూనిటీ బట్టి ధరల బట్టి ఒక్కో చోట ఒక్కో రకం. ఇక నా విషయానికొస్తే నేను పల్లెటూర్లో పెరిగాను.ఇల్లు చిన్నదైనా బయటే ఎక్కువ సమయం గడిపేవాళ్ళము. నాలుగు గోడల మధ్య నేను ఎక్కువ సేపు వుండలేను.ఎక్కువగా బయట ఇష్టపడతాను.రెంట్ ఇంట్లో వున్నప్పుడు కమ్యూనిటీ వాక్ వేల్లో,మాల్స్ లో ఎక్కువగా బ్రతికేశాను.అందరిలాగా నేను ఇల్లు ఇన్వెష్ట్మంట్ పర్పస్ కోసం కొనుక్కోదలచుకోలేదు. అలాగే అమెరికన్స్ లాగా ఏడెనిమిదేళ్ళకు అమ్మాలనీ కొనలేదు. అందుకని ఆలస్యమైనా నచ్చినది కొంచెం పెద్దది ( 4400 S.ft not including basement) బయట కూర్చొని పని చేసుకోడానికి, ఫ్రెండ్స్ వస్తే సరదాగా సాయంకాలాలు గడపొచ్చనే వుద్దేశ్యంతో కొనుక్కున్నాను. ప్రస్తుతానికి నా ఆలోచన ఇదే. పిల్లల పెళ్ళిళ్ళై ఉద్యోగాల నిమిత్తం వేరే ఊర్లలో వుంటే నా ఆలోచనా ధోరణి మారుద్దేమో చెప్పలేను :)

      ఇక లాన్ కటింగ్ గూర్చి. దాని కష్టం నాకు ముందే తెలుసు కాబట్టి ఆ పని నేను పెట్టుకోలేదు.ఒక యాభ్హై డాలర్లిచ్చి రెండువారాలకొకసారి కట్ చేపిస్తాము. ఇక ఇంటిలోపల క్లీనింగ్ గూర్చి అడగవద్దు. ఇల్లుమొత్తం ఉడ్ ఫ్లోరింగ్ కాబట్టి మా ఆవిడ క్లీన్ చేసుకొని సర్దుకొనే రోజల్లా నన్ను తిట్టుకోని రోజుండదు. నేను నెలకొకసారి వాక్యూమ్/మాపింగ్ లో సహాయపడినా సరే :-). అప్పటికీ ఇల్లు తనకు నచ్చినాకే కొన్నాను ఐనా ఈ ఆడోళ్ళను అర్థంచేసుకోలేము సుమా :)

      చివరిగా ఇల్లు నచ్చినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
    2. Thank you for your answer.
      :Kunar

      తొలగించండి
    3. ఇప్పుడు ఆటోమాటిక్ గా తడిబట్టతో ఇల్లు ఊడ్చే రోబోటిక్ యంత్రాలు వచ్చాయి కదండీ.

      తొలగించండి
    4. సూర్య గారూ ఆ ముచ్చటా ఐంది.అది వాక్యూం వరకూ బాగానే పనిచేస్తుంది కానీ ఇల్లు తుడవడం సరిగ్గా చెయ్యలేదు.దానితో చేస్తే మరకలు పోవు.దానికి తోడు వుడెన్ ఫ్లోర్ ఎక్కువ సేపు నీటి తడి వుంటే ఆ తడి పీల్చుకొని త్వరగా పాడైపోతుంది.అందుకని స్టీం మాపింగ్ స్టిక్ ఒకటి కొని దానితో నే కుస్తీ పడుతున్నాము. రోబో క్లీనర్ ను మంచాల క్రింద, సోఫాల క్రింద తుడవడానికి మాత్రమే వాడుతున్నాము.

      తొలగించండి


    5. హాయి గా చెట్టు క్రింద పడుకుంటే యెంత సౌఖ్యమో ! ఏమిటో ఈ యిళ్లూ గిళ్లూ వాక్యూమూ గీక్యూమూ అంతా మాడర్నైజ్ అయిపోయింది బతుకే :)



      జిలేబి

      తొలగించండి
    6. జిలేబీ, ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖం లేదని ఒక సామెత. చెట్టుకింద నులకమంచమేసుకొని పండుకుంటే వచ్చే హాయి ముందు ఇవన్నీ దిగదిడుపే.ఇండియా లో వుంటే అదే పని చేసుండేవాడిని.ఓ మూడెకరాల తోట కొనుక్కొని అందులో ఒక చిన్న పర్ణశాల వేసుకొని(ఎండా వానకు రక్షణగా) తోటలో చెట్లక్రింద బ్రతికేసే వాడిని :)

      తొలగించండి
    7. చెట్టుకింద పడుకోవచ్చు. కానీ చెట్టుకింద జిలేబీలు వండలేం కదా! పైనుంచి ఏ పురుగో పుట్రో పడితే ఇక సమారాధన ఎలా చేసేది?
      అందుకే వండుకు తినడానికైనా ఒక ఇల్లు ఉండాలి!!

      తొలగించండి

    8. ఎప్పుడూ తిండి యావేనా :)


      జిలేబి

      తొలగించండి
    9. ఆమాట పేరులోనే తినుబండారాన్ని పెట్టుకున్నవారిని అడిగితే బావుంటుంది☺️

      తొలగించండి
    10. పేరులో తీపి. మాటల్లో కంపరం. ఇనప గుగ్గిల్ల లాంటి పైకూలు. Admin also agreed that belazy paikoos are nuisance.

      తొలగించండి


  3. శుభాకాంక్షలు! ఇంతకీ అమెరికన్ సిటిజన్ అయ్యేరా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారీ ధన్యవాదాలు. ఇప్పుడు నేను మీ ప్రశ్నకు పబ్లిక్ గా సమాధానం చెప్పాలా వద్దా :-)

      తొలగించండి
  4. అక్కడ ఆరుబయట కాంపౌండ్ వాల్స్ ఉండవు కదా మీరు ఎందుకు కట్టారు ?
    నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు !
    మీ ఇల్లు చాలా బాగుంది. ముఖ్యంగా బాల్కనీ నచ్చింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీహారిక గారూ ఇల్లు నచ్చినందుకు ధన్యవాదాలు. :) ఇంటికి కాంపౌడ్ వాల్ ముందు ప్రక్క వుండవండి. బ్యాక్ యార్డ్ కు వుంటాయి.

      తొలగించండి
  5. శుభాభినందనలు ... మీ ఇల్లు చాలా బావుంది.👌

    రిప్లయితొలగించండి
  6. “పరదేశి” సినిమాలో (1990వ దశకంలో వచ్చిన తెలుగు సినిమా) అమెరికా వచ్చిన ఇద్దరు కుర్రాళ్ళకు ఆతిధ్యం ఇచ్చిన తెలుగు కుటుంబం వారి ఇల్లులా ఉంది దూరం నుండి చూస్తే. అన్నట్లు ఆ సినిమా లొకేషన్ కూడా న్యూ జెర్సీ యే అని గుర్తు. మీ రాష్ట్రంలో ఇళ్లు ఇంతింత పెద్ద పెద్ద ప్రాంగణాలుంటాయాండీ, రెడ్డి గారు? ఎనీవే, ఇల్లు బాగుంది, కంగ్రాచ్యులేషన్స్. కొత్త ఇంట్లో మీరు మీ కుటుంబం సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖసంతోషాలతో వర్థిల్లాలని నా శుభాకాంక్షలు.

    అవునూ, మీ ఇంటికి కార్ గరాజ్ (లు) ఫొటోలో కనబడటం లేదు, ఇంటికి ఏ వైపునున్నది (నున్నాయి) అది(వి)?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిండికొలదీ రొట్టె, డబ్బు కొలదీ ఇల్లు అన్నారు కాదండీ. పెట్టుబడి పెట్టాలేకాని ఎక్కడైనా ఇల్లు విశాలంగా కట్టుకోవచ్చు!

      తొలగించండి


    2. డిటెక్టివ్ నర్సన్ ఆన్ ది‌ వర్క్ - స్టార్ట్స్ విత్ సినిమా, గ్యారేజ్ .....


      రెడ్డి గారు ఆన్ ది లుక్ ఔట్ నెక్స్ట్ :)


      జిలేబి




      తొలగించండి
    3. ఏదో వచ్చిన అమాయక సందేహం గురించి అడిగాను రెడ్డి గారిని. మీరు మరీనూ “జిలేబి” గారూ.

      తొలగించండి
    4. నరసింహా రావు గారూ, మీరూ రండి ఆతిధ్యమివ్వడానికి సర్వదా సన్నద్ధమై వుంటాము :)
      అన్ని రకాల ఇళ్ళు వుంటాయండి.ఇంతకు ముందు చెప్పినట్లు సర్వసాధారణంగా న్యూజెర్శీ లో 3300 sq.ft లోపు ఇళ్ళు ధారాళంగా లభించడం మేము ఇంటి కోసం తిరిగే రోజుల్లో గమనించాము.

      కార్ గరాజ్ సైడ్ ఎంట్రీ అండి. రెండవఫొటోలో పేవ్ మెంట్ కనిపిస్తుంది కదా! రెండవ పోటోలో ఎడమవైపు రెండు కిటికీలతో కనిపిస్తున్న గది గరాజ్.

      తొలగించండి
    5. /* ఏదో వచ్చిన అమాయక సందేహం గురించి అడిగాను రెడ్డి గారిని. మీరు మరీనూ “జిలేబి” గారూ. */

      మీరు అమాయకులేమిటండీ :-)

      తొలగించండి
    6. ఆహ్వానానికి థాంక్స్ రెడ్డి గారు.
      మీ రాష్ట్రంలో నా కాలేజీ ఫ్రెండ్ ఒకతను ఉంటున్న Edison నగరానికి ఒకసారి వచ్చాను. మళ్ళీ ఎప్పుడైనా అమెరికాకు, దాంట్లో న్యూ జెర్సీ కు రావడం జరిగితే ... మీ ఆతిధ్యమే 🙂. థాంక్స్.

      తొలగించండి
  7. ఇల్లు బావుంది సార్. సర్వమంగళ సిద్ధిరస్తు!

    రిప్లయితొలగించండి

Comment Form