8, డిసెంబర్ 2008, సోమవారం

ముంబై మారణ హోమం - మూడు రాష్ట్రాల ప్రజా తీర్పు , ఓటరులో చైతన్యము వస్తుందా?

రేపు కాంగ్రెస్ సామంత రాజుల భవిష్యత్తు తేలబోతుంది.ఈ మధ్య కాలంలో ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాలు రాజస్థాన్,మధ్యప్రదేష్,ఢిల్లీ,చత్తీస్ ఘడ్,మిజోరాం రాష్ట్రాల్లో పోటీ ముఖ్యంగా కాంగ్రెస్,భా.జ.పా. మధ్యనే ఉంది. ఎదో ఒకటి గెలవాలి కాబట్టి గెలుస్తుంది.

ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు , ఎలక్షన్ జరిగిన తేది లు యివి.

చత్తీస్ ఘడ్ : ఎలక్షన్ జరిగిన రోజు నవంబర్ 14 మరియు 2౦
మధ్యప్రదేష్ : ఎలక్షన్ జరిగిన రోజు నవంబర్ 25
ఢిల్లీ : ఎలక్షన్ జరిగిన రోజు నవంబర్ 29
మిజోరాం : ఎలక్షన్ జరిగిన రోజు డిసెంబర్ 2
రాజస్థాన్ : ఎలక్షన్ జరిగిన రోజు డిసెంబర్ 4

ఇక్కడ నాకు చత్తీస్ ఘడ్,మధ్యప్రదేష్ లలో ఎవరు వస్తారో అని ఆసక్తి ఏమాత్రము లేదు.కాని మిగిలిన 3 రాష్ట్రాలు ఢిల్లీ,మిజోరాం,రాజస్థాన్ లలో నాకు తెలియకుండానే ఆసక్తి ఏర్పడింది.కారణం ఈ 3 రాష్ట్రాల్లో ముంబై మారణహోమం తరువత ఓటింగ్ జరిగింది.

వీటన్నిటిలో కుడా ఢిల్లీ మీద ఆసక్తి ఎక్కువగా వుంది.కారణం ఇక్కడ నిరక్షరాస్యత తక్కువ.అలాగే ముంబై లో జరిగిన దారుణానికి కొద్దో గొప్పో అలోచించే వర్గము వారు ఎక్కువగా వుండే ప్రదేశాల్లో ఇది ఒకటి.ఉగ్రవాదనికి ప్రతిసారి బలి అయ్యే ప్రాంతాల్లో ఇది మొదటిది.అలాగే దేశ రాజకీయాలను మనందరికంటే దగ్గరిగా గమనించే మేధావి వర్గము వసించేదీ ఇక్కడే.

మిగిలిన 2 రాష్ట్రాలలో కూడా డిసెంబర్ లో ఎన్నికలు జరిగినా వాటిని విశ్లేషించ డానికి సరిపడా విషయ పరిఙ్ఞానము నా వద్ద లేదు. అంటే చదువుకున్న వారెంతమంది,పల్లెలెన్న్ని,ఉద్యోగులు మొదలైన చాలా విషయాలు ప్రభావము చూపుతాయి.

ఇక ఢిల్లీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఎందుకంటే ఉగ్రవాదము,దేశభవిష్యత్తు మొదలైనవి టపాలు,ఆభిప్రాయలు,వ్యాసాలు,ఉపన్యాసాలు మొదలైన వాటికే పరిమితమా లేక ఓటరు లో నిజంగా ఈ మార్పు కనిపిస్తుందా లేదా అని.

నాకైతే ఇప్పటిదాక వేచిచూసే ధోరణి లో ఉన్న U.P.A నవంబర్ 29 తరువాత ఎలక్షన్స్ జరిగిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ గల్లంతైతే పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై యుద్ధభేరి మొగిస్తుందనిపిస్తుంది.ప్రతిదీ రాజకీయలతో ముడిపెట్టే మన రాజకీయపార్టీలు ఎలా స్పందిస్తాయో చుడాలని వుంది.దానికి ఇంకా రెండు రోజుల టైం వుంది.

6, డిసెంబర్ 2008, శనివారం

జల్లెడ లో మీటపా మొదటి పేజిలో మొదటిటపాగా కనిపించాలంటే?

ఈ మధ్య జల్లెడ లో అప్పుడే పోస్ట్ చేసినా, నా బ్లాగ్ టపా ఎ ప్పుడూ మొదటి పేజీ లో కనిపించేది కాదు. కారణం ఏంటి చెప్మా అని ఆలోచిస్తూ మిగిలిన టపా ల టైం చూసిన తరువాత కాని బొధ పడలేదు.టపాలని జల్లెడ సంకేతిక వర్గము వారు ఏ మాత్రము టైం ను యూనివర్సల్ టైం కి మార్చటము లేదని. దీని ఫలితంగా టపాలు అన్ని కూడా ఆయా స్థానిక సమయము ప్రకారము ప్రచురితమౌతున్నయి.కాబట్టి అ.సం.రా (U.S.A ) టపాలు చాలా వరకు ఏ రెండవ పేజీ లొనో కనిపిస్తున్నాయి. ఇది గమనిచిన వారు వాళ్ళ టపా ని పబ్లిష్ చెసేటప్పుడు టైంస్టాంప్ మార్చి పబ్లిష్ చేయడము కూడా గమనించాను.

దీనికి రెండు రకాల పరిష్కారములు:

1) జల్లెడ సాకేతిక వర్గము వారు అన్ని ఫీడ్ లను యూనివర్సల్ స్టాండర్డ్ టైం (U.S.T) కి మార్చి ఆ టైం ప్రకారము వరుస క్రమమును నిర్ణయించి ప్రచురించడము. ఇది సర్వదా అభిలషనీయము.కారణము U.S.A లొ వున్నవాడు ఆస్ట్రేలియా టైం పెట్టుకొని తన టపా ఎప్పుడూ మదటి పేజీ లో మదటి టపా గా వుండేటట్టు చేసే దొంగ దారి ని అడ్డుకోవచ్చు.

2)జల్లెడ వారు ఈ తప్పుని సరి చేసే దాక మీరు ఈ క్రింది పద్ధతి పాటించండి.

మీరు మీ బ్లాగు లో Settings-->Formating పీజీ లోకి వెళ్ళండి. ఆ పెజీ లో వున్న టైంజోన్ ని G.M.T+ 5:౩౦ కి మర్చి save చేయండి. మీ టపా ఇండియా టైం ప్రకారము ప్రచురితమౌతుంది.

5, డిసెంబర్ 2008, శుక్రవారం

తోటి మనిషి ఆవేదన!

నాకొచ్చిన ఒక మైల్ కి తెలుగు అనువాదం. * ( నక్షత్ర ) గుర్తున్నవి నా స్వంతం. ఇది ముంబై ఉగ్రవాద దాడి తరువాత సగటు భారతీయుని మనో భావాలకు అద్దం పడుతుంది.

"ఉగ్రవాది ని క్షమించడమా లేదా అనేది దేవునికి వదిలేద్దం.కానీ వాళ్ళకి దేవుని కలిసేందుకు నిర్ణీత సమయాన్ని నియంత్రించడము మా వంతు." (ఇండియన్ ఆర్మి)

* "ఆహ్వానము : ఈ రోజు రాత్రికి ప్రత్యేక విందు.
స్థలము: తాజ్,ముంబై.
దుస్తులు: చిల్లులబుల్లెట్ ప్రూఫ్, సైకిల్ హెల్మెట్.
ప్రత్యేక ఆకర్షణ: ఉగ్రవాదుల, మహరాష్ట్ర పోలీసుల ఫైర్ వర్క్స్, ఇంకా హిరో దర్శకులు. "

" టెర్రరిస్టులు పడవల ద్వారానే కాదు, ఓట్ల ద్వారా కూడా వస్తారు."

"నాకు క్రొవ్వొత్తి వెలిగించి చనిపోయిన వాళ్ళ ఙ్ఞాపకాలను పూడ్చి పెట్టాలని లేదు.నా మనసు క్రోధం తో రగిలి పోతుంది.తాజ్ ముందు విజయ పతాక లేక జాతీయ జెండా ఆవిష్కరించాల్సిన కారణము ఒక్కటి కూడా లేదు."

"రాజ్ థాక్రే ఎక్కడ దాక్కున్నావు? నీ ముంబై ఇక్కడి కాని వాళ్ళతో ( స్థానికులు కాదు ) నిజంగా యుద్ధము చేస్తుంది."

* "ఉగ్రవాదులు ప్రజల కళ్ళు తెరిపించారు.వ్యవస్థ కళ్ళు కాదు. వ్యవస్థ రాజకీయ నీడలో నిద్రమత్తుతో ఇంకా జోగుతుంది."

* "మాకు నిద్రలేదు , కారణం ఎప్పుడు బాంబు పేలుతుందనో కాదు
నా స్థలం నాతమ్ముడు ఎక్కడ కబ్జా చెస్తాడో అని
నా ఇంటి ఆడపడుచు రాత్రి 9 అయినా ఇల్లు చేరలేదని
మా అబ్బాయి కాన్వెంట్ ఫీజు లక్ష అని
మా పాప బడి గోడలు ఎక్కడ కూలుతాయోఅని
ఆసుపత్రి లో ఆపరేషన్ తో అవయవాలు ఎక్కడ కొట్టేస్తరోనని

ఎంసెట్ పేపరు ఎక్కడ లికవుతుందో అని
రేపు మా పెద్దోడికి ఉద్యోగము వస్తుందో రాదో అని
మా పిల్ల పెళ్లి కి కట్నమెంతో అని.
నా పర్సు ఎవడు కొట్టేస్తాడో అని
నేను డబ్బు దాచిన బ్యాంకు ఎప్పుడు మునుగుతుందో అని.

దారిలో బస్సు ఎక్కడ తగలబెడ్తారో ఆని
ఈ సంవత్సర వినాయక చందా పట్టీ ఎంత వస్తుందో అని
రేపు కూలి దొరుకుద్దో లెదో అని
దొరికినా ఎన్ని రోజులో అని
నాకిచ్చే రూపాయి నిజమైందో కాదో అని.

ఇన్ని చిరుగుల గుడ్డ ముక్కతో రేపు ప్రపంచ దేశాలతో సహ పంక్తి భొజనము లో ఎలా కూర్చోవాలా అని? "

3, డిసెంబర్ 2008, బుధవారం

పత్రికలు, రాజకీయాలు, ఉగ్రవాదం.

ఈ మధ్య కాలం లో అంటే 27 నవంబర్ నుంచి ఎప్పుడెప్పుడు ఆఫ్ఘన్ సరిహద్దుల్లోని నరరూప రాక్షసుల పైనా, P.O.K పైన సైనిక చర్య జరుపుతారా అని ఎదురు చుస్తూ కళ్ళు పత్తి కాయలు అయ్యాయి.అంతర్జాతీయ సంఘీభావం కూడగట్టుకోడానికి,సైన్యాన్ని సమాయత్త పరచడానికి కొంత సమయము పడుతుంది కాబట్టి ఇప్పటిదాక ఆగారేమో. అయినా యుద్ధానికి సన్నద్ధమయ్యె వాళ్ళు చెప్పి చెయ్యరు కదా? ఇదీ అంతే.నాకైతే మొఖాన ఉమ్మేసినా పట్టించుకోని రాజకీయ నాయకులు ఇప్పుడు Elections వస్తున్నాయి కబట్టి తప్పకుండ యుద్ధ భేరీ మోగిస్తారని పిస్తుంది.

ఇక పాకిస్తాన్ విషయనికి వస్తే తను పెంచి పోషించిన లష్కరే ఇప్పుడు పక్కలో బల్లెమై కూర్చింది.పాకిస్తాన్ లో 1947 నుంచి ఈ రోజుదాక ప్రజాస్వామ్యం పేరుకు మాత్రమే.ఈ పరిస్థితుల్లో లష్కర్ ముష్కరులు ప్రభుత్వము మాట వింటారా? అప్పటికి పాకిస్తాన్ ఆమెరికా మీద వత్తిడి ద్వారా భారత్ ను అణచాలని చూసింది."నేను సైన్యాన్ని ఆఫ్ఘన్ సరిహద్దులనుంచి P.O.K కి మారుస్తా అంది". ఇక్కడ విషయమేమిటంటే అమెరికా ఇప్పటిదాక పాకిస్తాన్ సహయం తో ఆఫ్ఘనిస్తాన్ లో నెగ్గుకొస్తుంది.మరి పాకి సైన్యం లేకపొతే మళ్ళీ లాడెన్ చెలరేగిపోతాడు.దీన్ని ఆసరాగా తీసుకొని పాకిస్తాన్ అమేరికాను ఇన్నిరోజులు blackmail చేస్తూ వస్తుంది.ఇది October లో జరిగిన USA presidential డిబేట్ లో కూడా దరిదాపు మెకైన్,ఒబామా ల అభిప్రాయం.అయితే పాకిస్తాన్ పాచిక ఈ సారి పారలేదు.రహస్య ఎజెండా ఏదైనా కాని ఈ మధ్య ఎందుకనో USA భారత దేశానికి దగ్గర అవుతున్నట్టనిపిస్తుంది.

పాకిస్తాన్ కి ఎవరూ సహాయ పడుతున్న సూచనలు లేవు. కానీ యుద్ధమంటూ వస్తే తప్పకుండా బయటికి చెప్పకుండా చైనా సహకరిస్తుంది.ఎవరు అవునన్నా కాదన్నా పైకి చూడ్డానికి అన్నిటిలో పోటీ ఇండియా - పాకిస్తాన్ లమధ్య లా వున్నా నిజానికి అది ఇండియా - చైనా ల మధ్యే అన్నది కఠోర వాస్తవం.

ఒక వేళ యుద్దమే వస్తే అమెరికా భారత్ కి ఒక చిన్న సహాయము చేస్తే చాలు.అది "ప్రస్తుతము అందరికీ చెప్పి కొంత చెప్పకుండా కొంత వివిధ రూపాల్లో పాకిస్తాన్ కి ఇస్తున్న సహాయం ఆపేస్తే చాలు". ఇండియా చేయాల్సిందల్లా భరత భూమిలో పుట్టి పాకిస్తాన్ ను సశ్య శ్యామలం చేస్తున్న జీవ నదులను భారత భూమి దాహాన్ని తీర్చడానికి మళ్ళిస్తే చాలు ఆర్ధికంగా అంతంత మాత్రానే వున్న పాకిస్తాన్ కుదేలైపొవటనికి. కాకపొతే దీంతో ఉగ్రవాదము నశించక పోగా ఇంకా పేట్రేగి పోవచ్చు.ఆకలితో వున్న మనిషి కడుపు నింపుకోవడానికి దేనికైనా సిద్ధ్హ పడతాడు. సోమాలియా సముద్ర దొంగలు ఇందుకు ఉదాహరణ.

ఇప్పుడు చిక్కల్లా పాకిస్తాన్ ISI ని కాని,సైన్యాన్ని కాని, ఉగ్రవాదులని కాని అదుపు చేయలేదు.అలా అని అది రాజకీయ కారణాలవల్ల ఒప్పుకోనూ లేదు.పాకిస్తాన్ నిజంగా ఉగ్రవాదులను వొదిలించుకోవాలంటే దానికి మిగిలిన ఒకే ఒక మార్గము , ఇండియా యుద్ధము తలపెడితే చూసీ చూడనట్టు వుండడమే.లేదంటే మన ఆర్ధిక వ్యవస్థ ఎలా వున్నా, పాకిస్తాన్ లో యుద్ధానంతర పరిణామలు అతి భయంకరంగా ఉండవచ్చు.అరాచకత్వం తో సామాన్య జన జీవనానికి కోలుకోలేని దెబ్బ.

ఇక మన విషయానికి వస్తే మన పత్రికలు చేసిన హంగమా చూసి నిజమా అని నన్ను నేను ఒకటికి పదిసార్లు రక్తము కారే దాక గిల్లుకోని చూసుకున్నాను. మనది నిజంగా విజయమా? అనామకులెవరో వచ్చి 190 మందిని పొట్టన పెట్టుకోవడము అడ్డుకోలేక పోయాము. N.S.G దళానికి సరైన విమానమే కరువైంది.ముఖ్య మంత్రి, హోం మంత్రు ల సంభాషణ(పేపర్లలో వచ్చినదాన్ని బట్టి) ముత్యాలు రాలి పొతాయన్నట్టు మహా క్లుప్తం.సందిట్లో సడేమియా లాగా ముఖ్య మంత్రి గారి ఇలాకు వాళ్ళకి తాజ్ లో రెడ్ కార్పెట్.

T.V వాళ్ళు , పత్రికల వాళ్ళు నాలాగా ఎవడికి తోచింది వాళ్ళు రాసారు.నాకొచ్చిన అనుమానాలు కూడా పత్రికా మేధావులకు రాక పొవడము నిజంగా నాకు ఆశ్చర్య మేసింది.

మనకు తెలిసి మొదటి రోజున ఏదో ముంబై పత్రికలో ఒక ఉగ్రవాది ఫొటో వేసారు.నేటికీ అందరూ అనుకొనేది ఒకడే దొరికాడని. క్రైం డిపార్టుమెంటు ఇలాంటివి ఎలాగూ బహిర్గత పరచరు కాబట్టి వాళ్ళు పట్టుకొన్నది ఎంతమందినైనా ఒక్కడనే చెప్తారు.అలాగే కథను కూడా అల్లుతారు.

ఎంతమందిని పట్టుకున్నా చెప్పింది ఒకడే దొరికాడు అని కాబట్టి మిగిలిన వాళ్ళని ఏరకమైన ఒత్తిడులు లేకుండా కాల్చి అవతల పడేయొచ్చు. లేదా అవసరమైన పక్షంలో విడిచి పెట్టవచ్చు. కారణాలు ఏవైనా కావచ్చు.

శవాలు 9, దొరికింది ఒక్కడు కాబట్టి లెక్క ప్రకారము వచ్చింది 10.కానీ లెక్క ఎంత గందరగోళంగా వున్నా మొదటి రెండు రోజులూ అందరి ఏకాభిప్రాయము 15.అంటే మిగిలిన వాళ్ళు దొరికారా? పారి పోయారా?

ఇప్పటిదాకా సామాన్యులు ఎంతమంది చనిపోయారో ఎవరి సంబంధీకులో ఏ పత్రికైనా రాసిందా?

సముద్ర యానం శ్రమతో కూడుకున్నది,రాగనే విధ్వంస్యం ఎలా మొదులెట్టారు?

అంత మందు గుండు సామాగ్రి తాజ్ లోకి ఎలా తీసుకెళ్ళ గలిగారు? ( ఈ ప్రశ్నకి ఇప్పటిదాకా నాకు సమాధానం దొరకలేదు)

వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినది ఏ దెశస్థుడు? ఇన్ని తెలుసుకున్న పోలీస్ ఇది తెలుసుకోలేదా?

-----------------???????????????????????????????????-----------------

27, నవంబర్ 2008, గురువారం

ఎటు పోతుంది నా దేశం?ఇది నిత్య ప్రస్థానం
ఎగుడు దిగుళ్ళు తప్పవు.

ఇది నిత్య ప్రయోగం
ఎదురు దెబ్బలు తప్పవు.

వల్లకాటి దిబ్బల చుట్టూ
ఊళ్ళ కాపురాలు.

ఇసుక మండే ఎడారిచుట్టూ
పసిమి పండే మాగాణాలు.

మారణ ధూమాన్ని ఊదేసే
జీవన పవనాలు.

మృత్యు శాసనాన్ని పొడుచుకొచ్చే
నిత్య శిశూదయాలు.

ఆకులు రాలిపోతేనేమి?
చిగురాకులు పుట్టవా?

నీళ్ళు ఇగిరిపోతేనేమి?
నీలిమబ్బులు గజ్జె కట్టవా?
.
.
.
ఏ మసక సందెలు కమ్ముకున్నా
ఆ మనసు కాంతి చక్షువే.

ఏ మంచు గడ్డలు పేరుకున్నా
ఆ మేధ జ్వలనధాతువే.

ఆ కంటిని కబళించాలని
ఆ కాంతిని హరించాలని
తమస్సు వలపన్నినప్పుడు (సంఘ వ్యతిరేకులు)
మనస్సు పట్టు తప్పినప్పుడు (సంఘం చిన్నా భిన్నమైనప్పుడు)
ఆలొచన ఆయుధంగా
అంతశ్చేతన ఆలంబనంగా
పురోగమిస్తాడు మనిషి.

-- విశ్వంభర ( డాక్టర్ సి.నా.రే.)

15, నవంబర్ 2008, శనివారం

కాంగ్రెస్, టి.డి.పి, తె.రా.సా ( ప్రజారాజ్యానికి ఇంకా టైం వుంది) వాళ్ళకి మాత్రమే. సామాన్య ప్రజానీకం ఈ వేద సూత్రాలు చదువరాదు.ఈ చిత్రం చూస్తే నా మదిలో చిత్ర విచిత్రాలు చిత్రంగా ఒక్కసారిగా సుడులు తిరిగాయి.( బొమ్మ కాపి రైట్ ఆంధ్రజ్యోతి ఆదివారము వాళ్ళది , వాళ్ళూ ఎక్కడో నాలాగే కాపీ గొట్టి వుంటారు లెండి).విషయానికి వస్తే అదుగో బొమ్మలో అందరూ వున్నారు చూడండి. అచ్చంగా నేననుకున్నట్టే , మీరనుకున్నట్టే, మన రాజకీయ నాయకులనుకున్నట్టే వుంది చూడండి. నేను అందరికంటే పైన వుండాలని. మీకు వుందా ఈ సదాలోచన? మరి మీరు నాలాగా పైనే వుండలను కుంటే ఇవిగో నా మూడు సూత్రాలు పాటించండి. రిజల్ట్ తన్నుకుంటూ వస్తుంది.

భాస్కర్ మొదటి సూత్రం ( న్యూటన్ మొదటి సూత్రం లగా) :- క్రింద వాడిని తొక్కి పెట్టండి !

ఎందుకంటే కింద వాడు లేస్తే నాతో పాటి మీ మూతి పళ్ళు కూడా రాలతాయి కాబట్టి వాడిని ఎప్పుడూ లేవనివ్వకూడదు.అందుకని నాతో పాటి వాడిని మీరూ అణగ దొక్కండి.

భాస్కర్ రెండవ సూత్రం : - క్రింద వాడు పైకి చూడకూడదు !!

ఎందుకంటే,కింద వున్న వాడు పైకి చూసి అలోచించడము మొదలెట్టాడనుకొండి మన ముగ్గురి స్థానలు గోవింద.అందుకని వాడికి పైకి చూసే అవకాశము ఇవ్వకుండా మనము మనము ఇప్పటికి ఒకటి.(మధ్యలో ఎన్నెన్ని తిట్టుకున్నా)

భాస్కర్ మూడవ సూత్రం : - పైవాడు పైనే క్రింద వాడు క్రిందే !!!

ఒకవేళ కిందున్నోడు మన మోత భరించలేక చచ్చాడనుకొండి మా ఎదురీంటొడు,నువ్వు నా కింద వుండాల్సిందే.ఎందుకంటే సూత్ర ధారిని నేను కాబట్టి కొత్త సూత్రాలు వ్రాస్తాను.( మిమ్మల్ని మోసం చేయాలంటే కుక్క బిస్కెట్ విసిరేస్తే సరి.తరువాత తీరిగ్గా మళ్ళీ సూత్రాలు అల్లుకోవచ్చు)

ఇలాగే ఈ బొమ్మ ఇప్పటి ప్రపంచ ఆర్ధిక స్థితికి కూడా సరిగ్గా సరిపొతుంది మీరే ప్రయత్నించండి.

12, నవంబర్ 2008, బుధవారం

చంద్ర యానం - నా ఆత్మ కథ -2

పోయిన సారి కలుసుకున్నప్పుడు, నా పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకున్నారు కదా, మరి నా ప్రయాణ ఘడియలు దగ్గర పడుతున్నాయి.నన్ను సురక్షితంగా భూ కక్ష లో వదిలి పెట్టడానికైతే వాహనము వుంది కాని ఆ తరువాత అక్కడ నుండి చంద్రుని మీదకి వెళ్ళడానికి అసలు దారి వుందో లేదో , వుంటే దాని నిండా ఎన్ని ముల్లు వున్నయో అన్నీ సందేహాలే.అప్పుడప్పుడు నాకూ అనిపిస్తుంది ఏ భీమసేనుడో వచ్చి నన్ను గిర్రున తిప్పి ఒక్క విసురు విసిరేస్తే పోలా, ఇన్ని కష్టాలు ఎందుకు అని. కానీ ఏమి చెస్తాము ఇప్పుడు ఆపనులు చెయడానికి ఇది కలియుగమాయె బకాసురులే కాని భీమసేనులు లేరాయె.
ఇంతకి జర్ని చేసేది నేను,భూమి మీద ఇంట్లో కూర్చొని మీటలు నొక్కే శస్త్రవేత్తలకి కష్టాలు ఏమి తెలుస్తాయ్? తెడా వస్తే అంతు పత్త లేకుండా పొయేది నేనా కదా. అందుకే బుద్ధిగా మాప్ దగ్గర పెట్టుకోని రోడ్ వెతుక్కుంటున్న.ఒక్కటి అర్ధమయి చస్తే కదా.ఇలా లాభము లేదని ఇస్రో లో ఒక సీనియర్ శాస్త్ర వేత్త, నేను కలిసి ఒక రొడ్డు పక్క ఇరాని చాయ్ హోటెల్ లో గట్టిగా దమ్ము లాగి పునాదుల దగ్గరనుంచి మొదలెట్టాము.

నాకసలే బోలెడు సందేహాలు ఒకటొకటిగా అడగడము మొదలెట్టాను.
" మీరైతే నన్ను పైకి పంపుతున్నార లేక నిజంగానే 'పైకి' పంపుతున్నరా? నేను అంత ఎత్తుకు వెళ్ళాక కింద పడనని గ్యారంటీ ఏంటి" అని? ఇదుగో అప్పుడు మొదలైంది ఎదేదో చెప్పాడు నాకు అర్థమైంది మీకు చెప్తున్నా.

ముందుగా భూ కక్ష అంటే ఎంటొ మొదలెట్టాము.భూమి చుట్టూరా స్పేస్ లొ ఏ వస్తువైనా మళ్ళీ మళ్ళీ అదే దారిలో తిరిగితే దాన్ని కక్ష అన్నడు ( An orbit is a regular, repeating path that an object in space takes around another one. An object in an orbit is called a satellite) . సరే అని తల ఒక సారి పైకి మరొక సారి అడ్డంగా ఊపా. అందుకే నెమో ఈసారి బొమ్మలేసాడు.


ఏంటి ఇన్ని దారులున్నయి అని అడిగా. దానికి సమధానంగ ఇంకో 4 బొమ్మలేసాడు.వేస్తూ ఇది చంద్రయాన్ దారి కాదు మనము ఇంకా భూమి పైకే పొలేదు అన్నాడు. ఈ బొమ్మల గొడవేంట్రా బాబు అనుకున్నా కాని చూడగా చూడగా నాకే అర్థమైంది, ఇంక మీకు కాకుండ పోయే ప్రసక్తే లేదు.
అంతా బాగనే వుంది కాని ఇంతకి పోలార్ ఆర్బిట్ అంటే ఏమిటని అడిగా, దానికి సమధానంగా ఒక చిన్న నవ్వు నవ్వి,అసలు ఆర్బిట్స్ అన్ని కూడా భూమికి వున్న ఎత్తు అవి భూమద్య రేఖతో చెసే కోణమును బట్టి రక రకాల పేర్లు పెట్టరు అన్నడు. కొన్ని చెప్పమని అడిగా..

పోలార్ ఆర్బిట్ : ఉపగ్రహము భూమధ్య రెఖతో 90 డిగ్రీల కోణం చెస్తూ ఉత్తర దక్షిణ ధృవాల మీదుగా సంచరిస్తుంటే అది పోలార్ శాటిలైట్. భూమి శాటిలైట్ కిందగా పడమర నుంచి తూర్పుగా తిరుగుతుంది కాబట్టి భూమి ని అంతా పరిశీలించడానికి ( మాప్స్ ) ఇటువంటివి వాడుతారు.అంటే మన భూభాగంలో శత్రువులు ఎవరైనా చొరబడ్డరా లాంటి విషయాలు గట్రా తెలుసుకోవడానికి ( ఇన్ని వున్నా మరి కార్గిల్ చొరబాట్లు ఎందుకు అడ్డుకోలెక పొయమో? బహుసా రిమోట్ సెన్సింగ్ పరికారలు సరిగా లేవేమో..) .కానీ వీటి ద్వారా భూమి మీద ఏ ఒక్క ప్రదేసాన్ని స్థిరంగా గమనించలేము.

ఈక్విటోరియల్ ఆర్బిట్స్ : ఇవి భూమధ్య రేఖకు సమాంతరంగా సంచరిస్తుంటాయి.సధారణంగా ఇవి వాతావరణ వివరాల సేకరణకు వాడతారు.

జియో స్టేషనరి ఆర్బిట్ : ఇవి భూమి మీద నుంచి మనము చూసినట్లైతే ఎప్పుడూ ఒకే స్ఠానంలో స్థిరంగా వుంటాయి. ఇంకో రకంగా ఇవి భూమితో పాటే అదే వేగంతొ భూమధ్య రేఖతో 0 డిగ్రీల కోణం చెస్తూ భూ వెగంతో తిరుగుతుంటాయి. ఇవి కమ్యునికేషన్ కి చాలా అవసరము. ఇవి మన ఇన్సాట్ శాటిలైట్ లాంటివి.

ఇలా చాల వున్నాయి కాని ప్రస్తుత విషయానికి వస్తే నువ్వు కింద పడవా అంటే ఎందుకు పడవు? మన P.S.L.V సరిగా పనిచేయక పొతే దబ్బుమని కింద పడతావు.నిన్ను కొంత ఎత్తులో ఒక నిర్నయించిన వేగంతో వదలేస్తే అప్పుడే నువ్వు నీ రెక్కలతో తిరుగుతావు అని చెప్తుంటే మా ఎదురుగా ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. ఇదిగో నా కెమరా తో ఫొటో కూడా తీసా.మొత్తానికి దెబ్బలైతే ఎవరికి లేవు గాని, మా గురువు గారు గొప్ప సత్యం చెప్పారు.భూమికి గురుత్వాకర్షణ,వాతావరణము లేకపోయినచో ( మన ముండము..అది వేరే సంగతి) ఆ నిచ్చెన కింద పడకుండా అలా ఋజు మార్గం లో వెళ్తుంది అని. కాబట్టి నువ్వు నీ ప్రయాణం లో ఎలాగు భూమికి ఎత్తులో వాతావరణము లేని చొట చంద్రుని పోలార్ ఆర్బిట్ లో తిరుగుతావు కాబట్టి నీకు ఇనెర్షియా పెద్ద సమస్య కాదు. సమస్యల్లా భూ కక్ష లో భూమ్యాకర్షణ , లూనర్ ఆర్బిట్ లో చంద్రుని ఆకర్షణ లకు లోను కాకుండా వేగాన్ని జాగ్రత్తగా సరి చెసుకుంటె చాలు అన్నాడు.


సరే అవన్నీ నాకెందుకు కానీ మీరీ కిందనుంచి మీట నొక్కుతారు కదా , మరి నా ప్రయాణ టైం అయింది అని బయలుదెరా..
( ఈ ఆర్టికల్ రాస్తుంటే టెక్నికల్ వ్యాసము తెలుగు లో ఎందుకు మొదలెట్టానా అని నన్ను నేనే ఛండలంగా తిట్టుకొని చెంప దెబ్బలు వేసుకొని ఇక బుద్ధుంటే తెలుగు లో ఇలాంటి ప్రయోగాలు చేయ కూడదని ... సెలవు )

9, నవంబర్ 2008, ఆదివారం

సాహిత్య హాస్య రస గుళికలు.

మన పూర్వ కవులకు ఎంత రచనా పాటవ మున్నా, ఎంత వాగ్థాటి వున్నా మన పల్లె పడుచుల ముందు ఘోరంగా ఓడిన సందర్భాలు కోకొల్లలు.నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాల లో చదివే రొజుల్లో తెలుగు పంతుళ్ళు , నిజానికి భాషా పండితులు. (ఇప్పటి పరిస్థితి తారుమారు అని విన్నా).వాళ్ళు పఠాలు చెప్తూ మధ్యలో కొన్ని చమత్కారలు చెప్తూ వుండేవారు. వారు ప్రసాదించిన విద్యలో నుంచి కొన్ని హాస్య రస గుళికలు.

ముందుగా సంగీత స్వరాలను ఒక రసజ్ఞుడు కంద పద్యములో చెప్పి తన తృష్ణ ఎలా తిర్చుకున్నాడో చుడండి. మీకు సంగీతము వస్తే పాడుకోండి. ( ఏమండోయ్ అర్థము లేదనుకునేరు, పద్యానికి శుభ్రంగా అర్థము వుంది. కాకపొతే వాడిన అక్షరాలే సంగీత స్వరాలు)

మా పని నీ పని గాదా
పాపమ మా పాపగారి పని నీ పనిగా
నీ పని దాపని పని గద
పాపని పని మాని దాని పనిగానిమ్మా !!

విజయ నగర రాజ్యం లో తెలుగు ఒక వెలుగు వెలిగిన సంగతి మనందరికీ తెలుసు కదా. అక్కడ ఒక పూవులమ్ముకునే ఆమెకు కవికి ఈ రకంగా సంభాషణ జరిగింది.
" వెలది నీ ఈ దండ వెల ఎంత? "
" నా దండకును వెలబెట్ట నెవ్వని తరంబు ?" అని పూలమ్మి చెల్లు మనిపించింది.
ఇక్కడ రసికుని దృష్టిలో "దండ" అంటే "జబ్బ" అని అర్థం. అందుకే ఆమె రెండర్థాలు వచ్చేలా నా దండకి ( పూలదండకి, నా జబ్బకి ) వెల కట్టడమెవరి తరం రా? అంది.

ఇలాంటిదే ఇంకొకటి. తన ఇంటికి అతిధి గా వచ్చిన ఒక అందగాడితో ఓ నెరజాణ యిలా అంటుంది.
ఇచట "నే" పరుండు,నిచ్చట అత్తగా
రిచట పరిజనంబు లెరిగి కొనుము
రాత్రి, నీకు కానరాను;నా శయ్యపై
తప్పి పడెదవేమొ దారికాడ!!

ఇదిగో నేను పడుకొనేది ఇక్కడ.రాత్రులు కాన రాక నా మీద తప్ప అత్తగారి మీద కాని, పని వాళ్ళ పైన గాని పదతావెమో జాగ్రత్త " అని హెచ్చరిస్తే ఇంక నా బోటి వాళ్ళకి నిద్ర ఎలా పడుతుంది చెప్పండి?

చివరిగా కాళిదాసంతటి వడే ఈ సందర్భం లో నీళ్ళు నమిలాడు, మీరే చూడండి

యుక్తం కిం తవ శర్వరీశ ముఖ! మద్వేణీ సమాకర్షణం
వధ్యయా మహరత్తవ కుచద్వందం మదీయం మనః
వృత్యస్తం ననుశిక్షితం జహి జహి స్వామిన్ వచః సాధుతే
ఆగోయత్కురుతే తదేవ భవతాం దండస్య యోగ్యం ఖలు!!

ఒక సుందరి చెరువులో స్నానం చేసి కుండతో నీళ్ళు తీసుకొని కాళిదాసుని ఓర చూపులు చూసుకుంటూ వెల్తుందట.కాళిదాసు కూడ ఊరుకొకుండా వెనకనే గబ గబ వెళ్ళీ జడపట్టుకొని లాగడు. ఆమె ఠక్కున వెనక్కి తిరిగి
" ఓరీ అందగడా ! నా జడ పట్టుకొని ఎందుకు లాగవు" అనే సరికి కవి గారికి ఏమి చెప్పలో తెలియక "నీ బిగువైన చనుదోయి నన్నా పని చేయించింది" అన్నాడట. వెంటనే ఆమె "తప్పు చేసిన వారిని విడిచి, నిరపరాధుల్ని దండిస్తార?" అనేసరికి కాళిదాసుకేంటి నాతో పాటి మీకు కూడా మతి పోయిందా?

8, నవంబర్ 2008, శనివారం

చంద్ర యానం - నా ఆత్మ కథ.నా పేరు చంద్రయనం -1. ఇంతకీ నాకేపేరు ఎందుకు పెట్టారో తెలుసా? హిందూ దేశం నుండి చంద్ర మండలానికి ప్రయాణించే మొదటి ఉపగ్రహాన్ని నేనే. నాకు చాలా గర్వంగా వుంది మన బంధువుతో (ఎంతైనా మామ కదా, పిల్ల నిస్తాడని ఆశ) కబుర్లు చెప్పుకోవాలని. ఎప్పుడూ పురణాళ్ళో చందమామ నవ్విందనో , శివుడి ప్రియురాలనో, వినాయకుని శాపమనో వినడమే తప్పించి చూసింది లేదాయె.

సరే ఇంక విషయానికి వస్తే, మా ముత్తాతలు (ఆర్యభట్ట,భాస్కర,యాపిల్), అమ్మమ్మలు (రోహిణి, స్రాస్ -- కాసేపు స్రవంతి అనుకొండీ) మా తాతలు ( ఇన్సాట్,ఐ ఆర్ యెస్) యిలాంటి ప్రయాణాలు చెశారు. ఇంతెందుకు ఈమధ్యే మా అన్నయ్య కార్టొశాట్,ఐ యెం యెస్) కూడా క్షేమంగా వెళ్ళారు. ( పేర్లు కొంచెం విచిత్రంగా ఉన్నయా... కలి కాలమండి..ముత్తాతలు, అమ్మమ్మ పేర్లు లాగా లెవు కదా? ఐనా నాకు మంచి పేరే పెట్టారు కదా?). మరి యింతమంది వెళితే నాకు భయమెందుకనా మీ ప్రశ్న? సరే చెబుతా వినండి. వీళ్ళందరు భూమికి దగ్గరగానో(>500 కి.మీ) భూమధ్య రెఖ చుట్టూరా,ఉత్తర దక్షిణ ధ్రువాల చుట్టురా ( పోలార్ ఆర్బిట్స్) లేక కొంచెము దూరంగానో (౩6000 కి.మీ - జియో సింక్రొనస్ ఆర్బిట్) ప్రయాణించారే తప్ప నా లాగా వెరే ఊరికని ఎగేసుకుంటూ 3,84,403 కి.మీ ఎవరూ వెళ్ళళేదు. సరే ఈ ప్రయాణ రహదారుల గురించి తీరిగ్గా ఇంకొసారి మాట్లాడుకుందాము ముందు నేను ఎలా పుట్టానో వినండి.

అసలు నా పుట్టుకే చాలా సంక్లిష్ఠం. నేను పుట్టక ముందే మన శాస్త్ర వేత్తలు నా జీవిత కాలము 2 సంవత్సరాలని నిర్ణయించారు.దానికి తోడు నేను అమితమైన వేగాన్ని,వేడిని,నీలలొహిత కిరణాల్ని తట్టుకునేట్టు నా శరీరాన్ని మల్చారు.నా జీవిత కాలంలో నేనేమేమి చెయాలో కూడా ముందే నిర్దేశించారు.నా ప్రయాణనికి కావలసిన ఆహారాన్ని(ఘన,ద్రవ ప్రొపెల్లెంట్ ), నేను ఏ దిశలో చందమామ దగ్గరకి వెళ్ళాలో అన్నీ వాళ్ళే దగ్గరుండి మరీ చూసుకున్నారు.

మీ కందరికీ ఒకటే మెదడైతే నాకు 11. ఇందులో 5 మన శాస్త్ర వేత్తలవి. 4 ఐరోపా వాళ్ళవి, 1 బల్గేరియ,2 అమెరికావి.వాటి వివరాలివిగో ఓపిక వుంటే చదవండి... లేకపొతే వెళ్ళిరండి.

భరత బిడ్డలు.
---------------
టి.యం.సి : నా పని చంద్రుని చుట్టూ తిరుగుతూ చంద్ర గొళాన్ని 3-డి చిత్రాలుగా చిత్రించడము.నా నయనాలు చలా సూక్షం.నేను అతి దగ్గరగా ను ( 5 మీ దూరం నుంచి ), అతి దూరంగాను (20 కి.మీ) బొమ్మలు చిత్రంచి భూమికి ఎప్పటికప్పుడు చేరవేస్తుంటాను.నా బరువు భూమి మీద 6.3 కె.జి.

హెచ్.వై.సి : చందమామ దగ్గర మణీ,మాణీక్య, మరకత రత్నాలున్నయని వాళ్ళు వీళ్ళూ చెపితే వినడమే కానీ, మీకు నాకు ఖచ్చితంగా తెలియదు కదా! నేనా పని లో సిద్ధ హస్తురాలిని. నా బరువు భూమి మీద 2.5 కె.జి.

యెల్.యెల్.ఆర్.ఐ: నేను లేకుండా నా ( ఉపగ్రహ) శరీరము చంద్రుని చుట్టూ తిరగడము కష్టం.నేను ఎప్పటికప్పుడు చంద్ర కక్ష లో ఎంత ఎత్తులో వున్నానో చెప్పక పొతే చంద్రుడు నన్ను తనలో కలిపేసు కుంటాడు (గ్రావిటీ వల్ల ఉపగ్రహము కూలి పొతుంది).నా బరువు భూమి మీద 11.37 కె.జి

హెచ్.యి.యెక్స్: నేను చందమామ మీద ఏమైనా ఘన మంచు వుందేమో అని విశ్లేషిస్తాను.నా బరువు 14.4 కె.జి.

యెం.ఐ.పి: నేను దురదృష్ట ( అదృష్ట) జాతుకు రాలిని. వెళ్ళీ వెళ్ళగానే నన్ను ఉపగ్రహము లో నుంచి నెట్టి వేస్తారు (హత్య చేస్తారు) . మొదటిగా చంద్రుని మీద కాలు పెట్టేది నేనే.నా పని భవిష్యత్తు లో ఉపగ్రహము చంద్రుని మీద ఎక్కడ ఎలా దిగలో విశ్లేషించడము.నా బరువు 35 కె.జి. అన్ని మెదడుల లోకి బరువైన దాన్ని నేనే.

ఐ.రో.పా పుత్రికలు
--------------------
సి1.యెక్స్.యెస్ : నేను బహు విచిత్ర మైన దాన్ని.నాపని చంద్రుడు ఎలా పుట్టాడో కని పెట్టడమే.నా బరువు 5.2.కె.జి

యెస్.ఐ.ఆర్-2 : నేను చందమామ తలాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తాను.చందమామ మీద అలజడులు అన్నీ నేను చూసి మీకు చెప్తాను.

సారా: నా పేరుకు తగ్గట్టే ( సారా (యి)) నేను పైవేవి కాకుండ సూర్య రస్మి చంద్రుని మీద ఎలా ప్రభావము చూపుతుందో ( సోలార్ విండ్స్ ) కని పెట్టి మీకు చెప్తాను. నా బరువు 4.5 కె.జి.

బల్గేరియ బిడ్డ
---------------
రా.డం: నేను చంద్రుని మీద రేడియేషన్ [ తెలుగు పదము ?] ఎంత, ఏ క్రమంలో వుంటుందో ఎప్పటికప్పుడు సమా చారము చేరవేస్తాను.నా బరువు 160 గ్రా.

ఎ.బి.సి.డీ (అమెరికన్ బోర్న్ క న్ ఫ్యూ జ్డ్ దేసి)
-------------------------------------
మిని.సార్ : చంద్రుని మీద కొన్ని ప్రదేశాలు ఎప్పుడూ నీడలోనే వుంటాయి.అలాంటి చోట పై పొరల్లో ఘన మంచు గడ్డలు ఏమైనా ఎవరైనా పారేసుకున్నరో ఏమో అని ఆశగా వెదకడమే నా పని.నా బరువు 8.77 కె.జి.

యెం 3: నా పని చంద్ర గొళ వుపరితలాన్ని దాని స్వరూప స్వభావల్ని ద్రిష్టిలో వుంచుకుంటూ ఖనిజాల పటాలని తయారు చెయడము.నా బరువు 8.2 కె.జి.

హమ్మయ్య,నా మెదడూ గురంచి చెప్పడానికే చాలా టైం పట్టింది.ఇంక నా ప్రయాణ విషయాలు,నేను ప్రయాణించిన మార్గము, అసలు అలాగే ఎందుకు వెళ్ళలో చెప్పలంటే చాలా చాలా వుంది. కాని నాకు ఇప్పుడు చెప్పే తీరికా లేదు మీకు వినే వోపిక లేదు. మళ్ళీ రెండు,మూడు రోజుల్లో కలుద్దాం.


( చంద్రయాన్ లునార్ ఆర్బిట్ లో చంద్రునికి దగ్గర అయిన సందర్భం గా )

2, నవంబర్ 2008, ఆదివారం

ఈ అనంత విశ్వంలో నేనెక్కడ, నీవెక్కడ, ఆ దేవుడెక్కడ ?ఈ అనంత విశ్వంలో నేనెక్కడ, నీవెక్కడ
నా కులమేక్కడ , నీ కులమేక్కడ
మతమెక్కడ ,దాని గురువు లెక్కడ
గుడు లెక్కడ,గుడి పూజారులెక్కడ ?


తెలంగాణా ,రాయలసీమ లెక్కడ
ముంబై , బీహారు లెక్కడ
తెలుగెక్కడ , తమిళ మెక్కడ
అసలు మనిషెక్కడ ?


రాజ్యా లెక్కడ ,రాజ మంత్రిణి లెక్కడ
రాజు లెక్కడ ,యువ రాజు లెక్కడ
బాబు లెక్కడ ,ప్రజా పార్టీ లెక్కడ
జయాపజయా లెక్కడ ?


భూగోళ మెక్కడ, దాని స్థానమెక్కడ
అసలు విశ్వమెక్కడ, దాన్ని సృస్టించిన దేవుడెక్కడ?

ఆంధ్రావతరణ - తెలుగు భాష ప్రాచీన హోదా

ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవము ఈసారి ఒక కలికి తురాయి తురుముకొని స్వాగతించింది. నిజంగా తెలుగుభాష మీద ప్రేమున్న ప్రతి ఒక్కరికి ఇది మరువలేని అనుభూతి.ఈ విశాల విశ్వం లో తెలుగు సాహితీ ప్రియులు ఎక్కడైనా వుండవచ్చు. ఇది తెలుగు భాష కి ఈ శతాబ్దము లో జరిగిన గొప్ప సత్కారము.
రాజకీయ కారణాలు ప్రక్కన పెట్టి చూస్తే అసలు ఎ భాష ఎప్పుడు జానపదుల నోళ్ళలో నాట్యమాడిందో ఎవరు చెప్పగలరు? ఏ భాష అయినా గ్రాంధిక భాషగా మారాలంటే ముందు అది జనారణ్యం లో నుంచి పండిత భాష గా మారి రాజ కోటలో ప్రవేశిస్తే నే గాని ఆ భాష లో రచనలు సాధ్యము కాగలవు. తమ భాష మీద గౌరవముంటే నే సరిపోదు అది మిగతా భాషలు మా కంటే తక్కువ అని న్యాయస్థానాల ను ఆశ్రయించే తమిళ భాష ప్రియులను ఏరకంగా అర్ధము చేసుకోవాలో నాకైతే అర్థము కావటము లేదు. ఆంధ్ర ప్రదేశ్ తరువాత ఎక్కువగా తెలుగు మాట్లాడే రాష్ట్రం తమిళనాడే. నాకైతే గుమ్మడి కాయల దొంగ అంటే భుజము తడుము కొన్న సామెత గుర్తు వస్తుంది ( ఎక్కడ ఆ రాష్ట్రంలో తమిళ ఆధిక్యత తగ్గుతుందో అని.)