24, సెప్టెంబర్ 2009, గురువారం

గతిలేని భూమాత...మతిలేని త్రిశూలం




పగలంతా..
భూమత కష్టాన్ని
ఆమె దరిద్రాన్ని
దాశ్యత్వాన్నీ దానవత్వాన్నీ
రాచరిక దాపరికాన్నీ
రాటుదేలిన హృదయాల్నీ
కండలు పిండే కష్టాన్ని
కరుడు గట్టిన కాఠిన్యాన్ని
ఆర్తిగా చూసే అన్నార్తుల్నీ
కన్నీరింకిన పసి మోముల్ని

అంబరాన అశక్తి తో
మూడు కళ్ళు విప్పి మరీ చూస్తున్నాడు



రేయంతా రెండు కనులు మూసినా..

చీకటి బజారులో
భయంలేక తిరిగే రారాజుల్నీ
రక్తపు మడుగుల్లో
అసహాయంగా ఏడ్చే యువరాజుల్నీ
ఆ ఏడుపు జోలపాటగా
నిదురించే రాబందుల్నీ..

కృత్రిమ హరివిల్లు పరదాలక్రింద
నర్తించే నంగనాచి తుంగబుఱ్ఱల్నీ

ముప్పొద్దుల మోసపోయిన మానినిలనూ
మూడోఝామున మూడు నోట్లు లెక్కంచే పడతులనూ

మైకంలో మాయమైన ఆలోచనలతో
మమేకంలో మంటగలిసిన స్నేహబంధాల్నీ

పర్యాలోచన నశించి నిశీధి నీడలో నడిచే భావిపౌరుల్నీ

విరూపాక్షని మూడో కన్ను
మూడు ఝాములా విప్పార చూసింది.



తెల్లవారబోతుండగా సిగలోని అమరాపగ విప్పి
నాలుగు హిమ బిందువులు విదిల్చాడు
గతిలేని భూమాత
అభ్యంగన పునీత యైనది.



మళ్ళీ ఎప్పటి లాగే ...
ఉషోదయాన గాలి పులకింతలు
తన్మయాన తలలూపే తరుణీ లతలు
విరులు విసిరే విరజాజి వీచికలు
కోనేటి రాయుని కీరవాణి రాగాలు.

21, సెప్టెంబర్ 2009, సోమవారం

సతీ సత్య భామ







చిక్కని పాలును, చక్కెర,
మక్కువ మీరగ, కలిపిన మాపాపా, పా
లెక్కువ యని ,ఆ కుర్చీ
నెక్కి, గబగబ దొరలించె నేర్పుగ "సింకు"న్




అయ్యది గన్న సతీమణి
చెయ్యిన దాల్చెను గరిటెను, చేసెద నీకున్
వియ్యము, నేడెంతైనన్,
కయ్యము నైనను, ఇకనిది కష్టము నాకున్



మీ యయ్యను జూడన్, నీ
కెయ్యడల మదిన కలుగు ఎకిలి చేష్టలు ,నీ
సొయ్యము నణచెద, నిక్కము
కయ్యము నైనను, వెరవను కాచుకొ పిల్లా


పాప స్వగతం...

నేచేసిన పాపము ఏ
మీ? చేత గరిట ఎలాగు? మెల్లగ ఎటులన్
నే ఛేదింతు? అపాయము
గాచేవారెవ్వరీ అకాల సమయమున్



అప్పుడు నా బంగారు కొండ మదిలోన మెరుపుతీగ మెరిసింది ఆపద్బాంధవుడు నాన్న గుర్తుకు వచ్చారు.



నాన్నా యన్న పిలుపు గని
చిన్నా ఏమిటని అదురు చిత్తము తోడన్
మన్నన జేయ జనె, రా
నున్న ట్టాపద తెలియక నొడుపుగ బోతిన్



ఎదురాయె సతి గరిటతో
న, తనకు నిపుడేది దిక్కు? నా పరు వేలా
గు తనయ ముందని? సతితో
న తగవు లాడగ, సతిమారె నయొ భామగతిన్

11, సెప్టెంబర్ 2009, శుక్రవారం

న్యూయార్క్ లో సంస్మరణ దినం

న్యూయార్క్ లో (మెమోరియల్ డె) సంస్మరణ దిన సందర్భంగా ప్రార్థనలు చేస్తున్న మహిళలు. ఐ ఫోన్ ఫొటోలు కాబట్టి సర్దుకుపోండి.










లైవ్ కవరేజి కోసం బారులు తీరిన వార్తా ఛానళ్ళు.














9, సెప్టెంబర్ 2009, బుధవారం

చెలియా వినవా మది లోని మౌనగీతాన్ని?






నీలాల గగనాన వ్రేలాడే వెండి మబ్బుల్లారా
నిశిరాత్రి సమయాన తళతళలాడే తారల్లారా

చెప్పరే నాచెలి చిరునామా
విప్పరే నా మది మనసారా |నీలాల|

మౌనముద్ర వలపుల్లో మొలకెత్తిన ప్రేమలో
విరిసిన మనసు మురిసింది ఎందుకో
కనుపాప కబురులు దోచింది ఎందుకో |నీలాల|

చెలియా వినవా మది లోని మౌనగీతాన్నీ ....

కాలేక, కనరాక కనిపించి కలవరించి
కానున్న, రానున్న రమ్యాతి సమరంలో
లాలించి అలరించి, అందించి చుంబించి
పాలించి ప్రేమించి, ప్రేమంత రంగరించి
కీర్తించి క్రీడించి,కష్టాల కామించి
శాంతించి స్తుతించి, సరళంగ అలంకరించి
భరించి భావించి, భ్రమించి విభ్రమించి |నీలాల|

తొలిప్రేమ చెలివాకిట సుమమల్లే విరిసింది
తొలిప్రొద్దు పొడుపుల్లో మనసంత మురిసింది. |చెలియా|

నీలాల గగనాన వ్రేలాడే వెండి మబ్బుల్లారా
నిశిరాత్రి సమయాన తళతళలాడే తారల్లారా

చెప్పరే నాచెలి చిరునామా
విప్పరే నా మది మనసారా

చెలియా వినవా మది లోని మౌనగీతాన్ని?

3, సెప్టెంబర్ 2009, గురువారం

YSR కు అశృనివాళి




పేదల ప్రజాపతి
దానమున ధరణీ్పతి
మాననీయ మహరాజు
మానవత్వ తారాజు

మనసున్న మారాజు
మమతల మారేడు
నవ్వుల రారాజు
ఆంధ్రుల అలరేడు
మానవతకు స్ఫూర్తి

ఆత్మశాంతి కోరి
కోరి కోరి వ్రాసుకున్న
మమకార మాలిక

నమ్మిన వ్యక్తుల పాలిటి వర ప్రదాత, పేదల పెన్నిధి వై యస్ ఆర్



మనసు కీడు శంకించకూడదు, కానీ నా మాట విననంటుంది. నమ్మిన వ్యక్తుల పాలిటి వర ప్రదాత, పేదల పెన్నిధి, పల్లె వాసుల సహవాసి, కార్యసాధనలో అసాధ్య సాధకులు వై యస్ ఆర్ క్షేమంగా వుండాలని కోరుకుంటూ...

1, సెప్టెంబర్ 2009, మంగళవారం

పడిలేచే లేలేత కిరణం




అలల కడలి ధరిత్రి దరిని చేర
ఆలపించదా రమ్య గమ్య గీతిక

పడిలేచే నురగతరగలే
ఎగసి ఎగసి అలుపులేక
కడలి కడుపులో కరిగేనా
వెను తిరిగి వెన్ను చూపేనా?

లవణ శిలల తాకిడికి
అలల హోరు అరుపులకి
ఇసుక రేణువు దెబ్బలకి
చెరిగేనా కడలిపై అనురాగం
విరిగేనా ఎగసిపడే శోధన కిరణం

కనుచూపు మేర పొలిమేర లేకున్నా
అలసిన తనువు సొమ్మసిల్లి పోతున్నా
ఎగసి పడే భావ తరంగాలు
సుడులు తిరిగే తీక్షణ తలపులు

తనువును స్థిరం చేసి
మనసును లయం చేసి
హృదయాన్ని తట్టి లేపి
కనిపించని అన్వేషితకై
ఆలపించనా అనురాగ రాగాలు
మధించనా సాంకేతిక సాగరాన్ని
నే పడిలేచే లేలేత కిరణమై.