29, సెప్టెంబర్ 2012, శనివారం

అసంతృప్తి అసంపూర్తి అర్థంపర్థం లేని ఆలోచనల ప్రవాహం... మనరోజులో ఎక్కువభాగం ఇలాగే వుంటుందేమో రాత్రి 11 గంటలు. నిద్రపోదామని పండుకోని కూడా " ఆ రేపు శనివారమే కదా అప్పుడే ఏమి పండుకొంటాములే" అనిపించి తలగీక్కోవడం మొదలు పెట్టాను. జిల పుట్టి కాదులేండి. ఏంచేయాలా అనుకుంటూ.....

ఈ మధ్య నాకు నా ఆన్లైన్  డైరీ మీద బొత్తిగా భయమూ భక్తీ తగ్గినట్టనిపిస్తుంది.దీని మొఖం చూడక కొన్ని సంవత్సరాలైపోయినట్టుంది. Office లో చూస్తేనేమో పగలేకాదు ఈ మధ్య రాత్రులు కూడా Applying Crossapply on over a billion records - Fingers crossed అన్నట్టైపోయింది నాపని. ఎదవగోల ఎప్పుడూ పనిగోలేనా? ఇంట్లో పెళ్ళాము ఆన్లైన్లో second setup (  బ్లాగేలేండి విపరీతార్థాలు తీయక్కరలేదు :-)) ఎదురుచూస్తున్నాయన్న జ్ఞానమేమన్నా వుందా అంటూ Table మీదున్న కంప్యూటర్ కన్నుగొట్టి మరీ అడిగింది.

అసలు ఏమి రాసి బ్లాగు కాగితాన్ని నలుపుచేద్దామా అని ఒకటే ఆలోచన. కాగితమంటే గుర్తుకొచ్చింది. ఈ మధ్య అసలు పెన్నుపట్టి తెలుగు వ్రాసి ఎన్ని రోజులైంది? రోజులేనా? ఏమో నెలలే ఐనట్లుంది. చేతివ్రాత అని ఆలోచనరాగానే నాకు ఇంకుపెన్నే గుర్తుకొస్తుంది. అందులో కూడా ప్రసాద్ ఇంకు పెన్ను. అబ్బో దీనికొక పేద్ద కథ వుందిలే... ఈ పెన్నులు పోవడం నాకు వీపు విమానంమోత మోగడం... అస్సలు ఏ తబలా, మద్దెలకూడా నా అంత మధురంగా ఏడ్చుండవు.

  ఇంతకీ ఏమివ్రాద్దామని ఈ వ్యాసమంటారా? నీ బండబడ మౌస్ తో నాలుగు పిచ్చిగీతలు అక్షరాల రూపంలో గియ్యగానే వ్యాసమైపోద్దా?? పోదా? ...దు కదా??? అందుకని మళ్ళీ నెత్తిగీరుకోని.......

హ్మ్.... ఇప్పుడు దెయ్యాలు తిరిగేవేళయ్యింది. బయట చిమ్మచీకటి. అర్థరాత్రి 12:14AM. కిటికీలోంచి అట్టాచూశానో లేదో బయట.... ఊఊఊఊఊఊఊహూఊఊఊఊ... యాఆఆఆఆఆ.....అన్న శబ్దం. అమ్మో .... తల బయటపెట్టలేదు కానీ ..పెట్టుంటేనా....కసుక్కున కొరికేసి పండగరోజు అనుకోనుండేదేమో.... ఆ దెబ్బతో భయమేసి గబగబ కిటికీమూసేసి మళ్ళీ నాలుగు గీతలు బరుకుదామని ఇట్టొచ్చా

నాకు కుడి వైపుగా ఫ్యాన్ తిరుగుతుంది. అవును చాలా వేగంగా తిరుగుతుంది. నాకు శబ్దము కూడా వినిపిస్తుంది. చాలా స్పష్టంగా వినిపిస్తుంది. నీకేమన్నా పిచ్చంటరా  ఫ్యాన్ తిరుగుతుంటే, ఆహా ఎంత చల్లగాలి, పిల్లగాలి అని వర్ణించుకుంటూ రాసుకోక శబ్దాల గొడవేందివయ్యా అని కచ్చితంగా అనుమానము రావాల కదా? .... వచ్చిందా?...... ఆ... ఈ ఫ్యాను వల్ల గాలి మనదాకా వస్తేకదా పిల్లగాలిని వర్ణించడానికి. అప్పుడర్థమయిందేందయ్యా అనుకుంటుంటే... మన ఇంద్రియాలకు అందనిది మనము వర్ణించలేమని.

ప్రక్కన విక్స్ డబ్బా... తీసి కొద్దిగా తలకు రాసుకున్నా... వ్యాసం వ్రాస్తున్న నాకే ఇంత తలనొప్పిగా వుంటే  చదువుతున్న మీకు ఇంకెంతుండాలి? మీ గూట్లో పెట్టిని ఝండూబామ్ ని తీసి నాకోసం మీరుకూడా వ్రాసుకోండి.  ఛత్... ఎనకటికెవడో చదవంగ చదవంగ "పెసలు" ను కాస్తా పిసలు పిసలు అనడం మొదులు పెట్టాడంట. అట్లావుంది నాయవ్వారం. లేకపోతే "ఝండూబామ్ ని తీసి నాకోసం మీరుకూడా వ్రాసుకోండి" ఏందది? వ్రాసుకోండా..రాసుకోడి అనా? ఏదో ఒకటిలే ఏది రాసుకున్నా శిరోభారం తగ్గడమే కదా అంటారా? నచ్చినది వ్రాసుకున్నా శిరోభారం తగ్గిపోద్దికదా? మరి ఇప్పుడు నేనేమనాలి? వ్రాసుకోండి అని అనాలా లేక రాసుకోండి అని అనాలా?

ఊంగా ఊంగా అని మంచి ఊపున్న పాట వస్తుంది. ఉండండి నేను కూడా మాంచి ఫిల్టర్ కాఫీ తెచ్చుకోని మళ్ళీ వ్రాయడం మొదలుపెడతాను.....

26, సెప్టెంబర్ 2012, బుధవారం

http://www.sakshi.com -- ఆన్లైన్ సాక్షి దినపత్రిక వారికి ఒక సలహామీరు ఉన్నపళంగా సాక్షి వెబ్సైట్ ను పటిష్టం చేయడం మంచిది. ఇప్పుడున్న వెబ్సైట్ సెక్యూరిటీ పరంగా ఏమాత్రమూ ఆశాజనకంకా లేదు. ఏ కొంచెమైనా  Database knowledge మరియు Visual basic.net knowledge వున్నవారికి ప్రస్తుత వెబ్ సైట్ ఓ స్వర్గధామంలా కనిపిస్తుంది. మీ పూర్తి వివరాలతో మిగిలిన వివరాలకు ramireddy.mvb@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.

10, సెప్టెంబర్ 2012, సోమవారం

సొగసు కీల్జడదాన ! సోగ కన్నుల దాన ! వజ్రాల వంటి పల్వరుసదాన


 

శ్రీనాథుడు ఆస్థాన కవిగా విద్యామంత్రిగా పదవీబాధ్యతలను చేపట్టి చాలా కావ్యాలను తెలుగులోకి అనువదించినప్పటికీ, ఓ యాత్రికునిగా దేశాటనం చేస్తూ ఆశువుగా చెప్పిన పద్యాలు కోకొల్లలు. ఆ కాలంలో కులాలు వున్నప్పటికి ఇప్పటిలాగా కాకుండా చాలా సామరస్యంగానే వున్నాయని చెప్పవచ్చు. అప్పట్లో కులవృత్తి గౌరవప్రదమైనది. ఓ బాపనాయనకు ఎన్ని వేదవేదాంగాలు తెలిసినా ఆయన గౌరవం అంతవరకే. కాటికాపరికి ఎంత వేదాంతం తెలుస్తుందో వేదవేదాంగాలు ఆపోసన పట్టినా అంతకంటే పెద్దగా తెలిసేదేదీ వుండదు.మిగతా పనులు చేసుకునే వృత్తుల వారి కులంలో కూడా వారి వారి వృత్తులననుసరించి తత్త్వజ్ఞానమూ వుండేది. అంటే ఎవరి వృత్తి వారికి ఆదర్శ ప్రాయం. ఊరని వుంటే ప్రతికులానికీ ప్రాధాన్యత తప్పక వుండాలి. లేకుంటే ఆ ఊరికి మనుగడ కష్టసాధ్యమయ్యేది.

ఇలా శ్రీనాథుడు దేశాటనం చేస్తూ ఆయా కులాల్లో వున్న సుందరాంగుల వర్ణనలు చాలానే చేశాడు. అలాంటి వర్ణనలతో కూడిన కొన్ని చాటు పద్యాలు ఇవి.

ముందుగా శ్రీనాథునిగా చెప్పుకుంటున్న ఓ పద్యం. కానీ ఈ శైలి శ్రీనాథునుది కాదేమో ననిపిస్తుంది. ఏమైనా చిన్న చిన్న పదాలతో చిన్నదాన్ని వర్ణించడం బాగుంది.

సొగసు కీల్జడదాన ! సోగ కన్నుల దాన ! వజ్రాల వంటి పల్వరుసదాన
బంగారు జిగి దాన ! బటువు గుబ్బల దాన ! నయమైన యొయ్యారి నడల దాన
తోరంపు గటిదాన ! తొడల నిగ్గుల దాన ! పిడికిట నడగు నెన్నెడుము దాన
తళుకు జెక్కులదాన ! బెళుకు ముక్కెరదాన ! పింగాణి కనుబొమ చెలువుదాన

మేలిమి పసిండి రవ కడియాల దాన
మించి పోనేల రత్నాల మించుదాన
తిరిగి చూడవె ముత్యాల సరుల దాన
చేరి మాటాడు చెంగావి చీర దాన

ఇప్పుడంటే చాకలివృత్తి మిగిలిన వృత్తులతో పోలిస్తే లాభదాయకం కాకపోవటంతో ఆ వృత్తి చేసేవారి సంఖ్య తగ్గిపోయింది కానీ, పూర్వకాలంలో ఇప్పటిలా వ్యాపారాలు చేసి పనికిరాని కాగితాల సంపాదనా నిల్వలు వుండేవి కాదు కదా!! మహా ఐతే ధాన్యాన్ని మార్పిడి చేయడం ద్వారా బంగారు నాణేలను ప్రోగు చేసుకొనేవారేమో !!   వాషింగ్ మిషన్లు వచ్చి ప్రతియింట్లో ఇల్లాలే చాకలి వృత్తి చేస్తుంది కానీ, ఆ రోజుల్లో ఊరన్నాక ఓ చేరువో వాగో సాధారణం. ఆ వాగులో చాకలి వాళ్ళు బట్టలు ఉతకటం కూడా అంతే సర్వ సాధారణం. నిజానికి బట్టలు ఉతకటం శరీరానికి మంచి వ్యాయమం. ఈ వ్యాయామం వల్లనే ఏమో కానీ చాకలి వాళ్ళు సాధారణంగా అందగత్తెలై వుంటారు. ఇది నా అనుభవం మాత్రమే !!

అలాంటి అనుభవమే శ్రీనాథునికి ఎదురైతే..ఇంకేముంది... పద్యం పరవళ్ళు తొక్కింది.

శ్రీకర భూషణంబులును,సిబ్బెపు గుబ్బలు, ముద్దు చెక్కులున్
గోకిలవంటి పల్కులును గొల్చిన జేరల గేరుకన్నులున్
బ్రాకట దేహకాంతియును,బంగరు చాయకు హెచ్చువచ్చు నీ
చాకలివారి సుందరికి,సాటిగ రారిక దొంటి జవ్వనుల్


బలిజ వాళ్ళ వృత్తి ఏమిటో నాకు ఇదమిద్ధంగా తెలియదు. కారణం మా ఊరి వద్ద నా స్నేహితుల కుటుంబాల వాళ్ళు కొంతమంది వ్యాపారం కొంతమంది వ్యవసాయం చేసేవారు. కానీ అదేమి చోద్యమో కానీ ఈ కులంలో అమ్మాయిలు చాలా చాలా బాగుంటారు :-)

నాలాగే శ్రీనాథునికీ నచ్చారు మరి. అప్పుడేమైందంటే

పసగల ముద్దు మోవి, బిగి వట్రువ గుబ్బలు, మందహాసమున్
నొసట విభూతిరేఖయు, బునుంగున తావి, మిటారి చూపులున్
రసికులు మేలు! మేలు! భళిరా యని మెచ్చగ రాచవీటిలో
బసిడి సలాక వంటి యొక బల్జె వథూటిని గంటి వేడుకన్

పాపం శ్రీనాథుడంతటివాడి గుండెలోకి బంగారు సలాక కస్సుమని దిగింది.

ఇకా మా రెడ్డి పిల్లలూ వుంటారు ఒంకరటింకరగా.కాకపోతో పొలం పనుల వల్ల కొన్ని భాగాలు పుష్టిగా వుంటాయి :-)
  ఇలాంటి రెడ్డి పిల్ల ఒకటి ఈన కంట్లో పడింది.

విడిబడి నిట్టవేగి, యట బిఱ్ఱున వ్రాలిన నంతలోన, దా
వడిసెల చేత బట్టుకొని, వట్రువ గుబ్బల బైట జాఱగా
నడుము వడంకగా, బిఱుదు నాట్యము సేయగ, కొప్పు వీడగా
దొడ దొడ యంచు నెక్కె నటు దొడ్డ మిటారపు రెడ్డి కూతురున్

అలాగే పల్లెటూళ్ళలో వడ్లమిల్లులు రాకముందు, వడ్లను ఏరోజుకారోజు రోట్లో పోసి ఇంట్లో ఎవరు ఖాళీగా వుంటే వాళ్ళు దంచి, ఆ దంపుడు బియ్యాన్ని వాడి వంటచేసేవాళ్ళు. అలా ఓ ముగుడు, పెళ్ళాలిద్దరూ వడ్లు దంచేపద్ధతినీ, ఆ పిల్ల నంద పదాలతో మొగుడిని కవ్వించే విధానాన్నీ సుందరంగా వర్ణించాడు

పువ్వులు కొప్పునం దుఱిమి, ముందుగ గౌ నసియాడుచుండగా
జెవ్వున పంగ సాచి యొక చేతను రోకలి బూని, యొయ్యనన్
నవ్వు మొగంబుతోడ దన నందను బాడుచు నాథు జూచుచున్
సువ్వియ సువ్వి యంచునొక సుందరి బియ్యము దంచె ముంగిటన్

మరికొన్ని కులాల అమ్మాయిల సౌందర్యాన్ని గూర్చి మరో టపాలో ....


7, సెప్టెంబర్ 2012, శుక్రవారం

అమెరికా వెలుగు - ఒబామా ( America's hope - Mr President Obama)

What a speech!!! Love the confidence and your vision of America Mr President Obama.

దేశము, దేశానికి నాయకత్వం, నాయకునికి వుండవలసిన ముందు చూపు, సామాన్య ప్రజలపట్ల మమకారం, విద్యార్థులు వాళ్ళ భవిత, అమెరికాకు కావలసిన సాంకేతిక విజ్ఞానాన్ని మళ్ళీ పట్టాలపైకెక్కించటం, భూమి పై పొల్యూషన్ పెరగకుండా చేయవలసిన బాధ్యత, కర్మాగారాల అవసరం, Export import policy, విదేశాంగ విధానం ఒక్కటేమిటి మీరు ప్రసంగించిన ప్రతి అంశం ప్రతిదేశానికి ఎంత అవసరమో కనీస జ్ఞాన మున్న ఏ పౌరునికైనా అర్థమవుతుంది.

ఈ ప్రసంగం విన్న తరువాత నాకు అనిపించిన నాలుగు వాక్యాలు.

భారతదేశంలో ఇలాంటి రాజకీయనాయకులు ఎందుకు పైకి రావడంలేదు? అసలు మన రాజకీయాలకు అమెరికా రాజకీయాలకు ఎందువల్ల ఇంత వ్యత్యాశం. మన ప్రజల ఆలోచనా సరళిలో వున్నదా లేక మన స్వార్థంలో వున్నదా? ముందు రాజకీయాలపట్ల విశ్వాసం సామాన్య మానవునికి ఎందువల్ల సన్నగిల్లింది? రాష్ట్రాలను ప్రక్కనపెట్టి దేశరాజకీయాలను చూసినా నాకెప్పుడూ ఇలాంటి వక్త ఓ బహిరంగ సభలో కనిపించలేదు. ఎంతసేపూ ఎదుటి వాడిపై బురద చల్లడం, కులాల వారిగా రిజర్వేషన్లు పెంచుతామని మభ్యపెట్టటం లేదా ప్రాంతీయ ద్వేషాగ్ని ని రగిలించడం లాంటి విశేషాలే కనిపించాయి కానీ ఎప్పుడైనా

మూతపడుతున్న చిన్న పరిశ్రమల గురించి కానీ, పెరుగుతున్న రోగాల గురించి కానీ, నాణ్యత లోపిస్తున్న విద్యా విధానాల గురించి కానీ, అరడుగు లోతున గుంతలపడ్డ రోడ్ల గురించికానీ, స్వయం సమృద్ధికి కావలసిన పాలసీల గురించి కానీ, విద్యుత్, మంచినీరు, ఆహార కొరత ఇలాంటి వాటిపై ఓ జాతీయ విధానాన్ని రూపొందించి ఎలా అమలు చేస్తారో కనీసం ముచ్చటించనైనా ముచ్చటించరు. ప్చ్

"Made in America"  When I heard this sentence in Obama speech (while speaking on industry policy) , ప్రతి శ్రోత కి రోమాలు నిక్కపొడుచుకొని వుంటాయి. What a great feeling !!!.  మన దేశంలో మనమెప్పుడైనా Made in India అనే పదాలకోసం వెతుకుతామా? నిజం చెప్పాలంటే దానిపైన " Made in USA" అని ముద్ర వుందా లేదా అని చూస్తాము. దానర్థం మనము నాణ్యతగల వస్తువులు ఉత్పత్తి చేయలేమనే కదా? what a shame !!!


ఇలా చెప్పుకుంటూ పోతే ఈనాటి ప్రసంగంలో ప్రతి వాక్యము కూడా ఓట్లు వేశే ప్రతి పౌరుడూ విని ఆలోచించుకోవలసిన ప్రసంగం. నాయకులు ఎలాగూ మారరు....కాదు కాదు వాళ్ళని మార్చే దివ్య మంత్రం ఓటరుదే.