16, నవంబర్ 2012, శుక్రవారం

చిట్టి చిట్టి సరదాలే.... ఇవి బుజ్జి బుజ్జి కోరికలే...



జిల్లెళ్ళపాడెళ్ళి వేడి వేడి అన్నంలో చింతకాయపచ్చడి అప్పుడే నిప్పులమీద కరగబెట్టిన నెయ్యి వేసుకోని తినాలి. పొలాల్లోకి బొయ్యి రేగ్గాయలు కోసుకోని ఉప్పేసి దంచుకోని తినాలి. దోసకాయలు,అలసందకాయలు కూడా..వీలైతే సుబ్బమ్మ కొట్టు కాడ  సోల రాగులుపోసి నూగుజీడీలు తినాలి ;)

ఇంగామాయిన భైరవకోనకుఁబొయ్యి కోటి లింగాల దర్శనంతోపాటు సెలయేట్లో తడవాలి. అక్కడే వె(ఎ)లక్కాయలూ,బీరకాయలు,బిక్కికాయలూ అన్నీ తినాలి. వీలైతే బత్తాకాయల దొంగతనమూ చెయ్యాలి :). అక్కడనుండి నెల్లూరెళ్ళి ఎండుచేపల కూర తినాలి. ఇంగామైన ఆదార్నటే పెత్తిరుపతికి పొయ్యి ఎంకన్న దర్శనమయ్యాక నాలుగు లడ్లు గుటక్కిన మింగి చిన్తిరుపతొచ్చి..... ఒంగూలు పొయ్యి బస్టాండు దగ్గర ఇడ్లీ, మైసూరుపాకు లాగించాలి. ఆడ్నే మద్దేన్నానికి మా అక్క/చెల్లళ్ళింటికి అట్టాపొయ్యి నాటుకోడి కూర కుమ్మెయ్యాలి. దర్శిలో నేమో పప్పుచారు, కాలవదగ్గర జగన్మాత పీఠం ( ఇక్కడ తిండిగోల లేదులెండి. గురువు గారు కొడతారు) ,  గాంధీనగరంలోనేమో సొరకాయ కూర  తిన్నాక ఇనకొండ మీదుగా నర్శింగపాడు బొయ్యి   పచ్చిమిరపకాయ పచ్చడి గడ్డపెరుగుతో పెద్దపళ్ళాన్ని నాకెయ్యాలి :)

సందెగాల గుంటూరుఁబొయ్యి  సకుటుంబసపరివారసమేతంగా నాజ్ సెంటర్లో ఫష్ట్ షో చూసుకోని విందుభోజనాలారగించి అప్పుడు ..... ఇశాకపట్నం, ఇజీనగరంబోవాల. ఇజీనగరంలో  ఏమేమి స్పెసలో చూస్కోని అయ్యన్ని తిన్నాక హైదరాబాదు కుపోవాలి. అదికూడా ఏడికిరా నువ్వొచ్చేది ఆంధ్రావోడా అనకపోతేనేలెండి :-) హైదరాబాద్ కు పొయ్యాక ఇంక జూస్కో నా సామిరంగా మస్తు మస్తు ఎంజాయ్ చెయ్యాలి.

ఆమాయిన ఒక్కొక్కరోజు కలల్లో బొంబాయి జుహూబీచి కెళ్ళాలి. తోడుగా కనీసం Lover ను అన్నా తీసుకెళ్ళాలి. కుదరకపోతే నారిమన్ పాయింట్ అయితే పక్కా.   అలా అరేబియా అందాలు చూసి మర్సరోజు  మీరారోడ్డు , బోరివలి, అంధేరి,మాతుంగ, దాదర్, మహాలక్ష్మి, సెంట్రల్, గ్రాంట్ రోడ్, ఛర్నీరోడ్డు, మెరైన్ లైన్స్ చూసుకొని గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర పావురాళ్ళ ఫొటో తీసుకొని  ఎలిఫెంటా కేవ్స్ కు వెళ్ళోచ్చాక అలసి పొయ్యుంటాము కదా... అప్పుడు తాజ్ లో ఒక చాయ్ కొట్టాలి. వీలైతే నా ఫేవరేట్ లాడ్జింగ్ ప్లేస్ ఆంధ్రమహాసభ లోనే వుండాలి :)

మరొకరోజు కలకత్తా నుంచి ముంబాయి కి పట్టపగలు Gitanjali Express లో తలుపు తీసుకొని కూర్చొని భారతదేశ అందాలన్నీ చూడాలి. ఖరగ్ పూర్ లో మట్టి చిప్పలో టీ తాగాలి.


ఇంకోరోజు ఆగ్రా, మధుర, ఫతేఫూర్ సిక్రీలు చూసేస్తాను.
మధుర లో పొద్దుపొద్దున్నే పాలల్లో జిలేబీలద్దుకోని తినాలి :)
నిద్రరాకపోతే ఢిల్లీలో గల్లీ గల్లీ తిరుగుతాను. నీబొంద కల అని చెప్తూ నిద్ర అంటావేంటటే..అదంతే.. ఇది పగటికల ;)

ప్చ్...ఇంతచేసినా సగం భారతం కూడా చూడలేకపోతున్నా.

13, నవంబర్ 2012, మంగళవారం

దీపావళి ఢాం...డాం..... టప్.. తుస్ ... టపాకాయలు - హారం.

అసలు ఈ రోజు దీపావళికి ఏదైనా కవిత వ్రాయాలని కూర్చున్నా...

దీపావళీ
గాలిడోలికలయందు అనురాగ వీచికలయందు
తరళమై సరళమై మమతానురాగములై వర్థిల్లు దీపావళీ!!

ఇలా ఏవో నాలుగైదు లైన్లు వ్రాసి చివరిగా

కాంతియే శాంతియై, శాంతియే చైతన్యమై... వినువీధుల వెలుగు తారలై .

.అంటూ ఏదో వ్రాసుకుంటూ పోతున్నానా ఇంతలో  ఎవరి దగ్గరినుంచో హారం ఫీడ్ బ్యాక్ ద్వారా ఓ "లక్ష్మీ" బాంబ్ పేలింది. ఇలాంటి టపాసులు రోజూ సాధారణమే ఐనా ఈ రోజు అసలే దీపావళీ కనుక దీని ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టపాకాయ :))

ఈ పండుగ ఉపయోగం, పరమార్థం ఎంతమందికి తెలుసో అని నాకెప్పుడూ అనుమానమే!! ఇలాంటి మైల్స్ ఇచ్చేవాళ్ళ ను చూస్తే మరీ ఎక్కువ అనుమానం వస్తుంది.హారం ద్వారా ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఆ ఇబ్బందులను హారం దృష్టికి తీసుకురావడానికి ఓ feedabck పేజీని పాఠకుల సౌకర్యార్థం వుంచడమైనది. అదుగో ఆ పేజీనుండి ఇలాంటి టపాకాయలు వేస్తుంటారు. ఇప్పటికి ఈ సంవత్సరానికి గాను 4994 మైల్స్ వచ్చాయి. ఇవి కేవలం feedabck  ద్వారా వచ్చిన మైల్స్ మాత్రమే ( బ్లాగ్ ను కలుపమని వచ్చే మైల్స్ కాదు )

అందులో మూడొంతులు టపాకాయలే. కొన్ని చిచ్చుబుడ్లు, భూచక్రాలు, కాకరొత్తులు, ఇంకొన్ని థౌజన్ద్ వాలాలు వుండవచ్చు. చిచ్చుబుడ్లు సాధారణంగా పేలకుండా కాంతినిస్తాయి. అంటే హారం ను ఏవిధంగా ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావచ్చో ఈ చిచ్చుబుడ్ల ద్వారా తెలుస్తుంది. :)). సాధారణంగా వీరికి ప్రత్యుత్తరము తప్పక ఇస్తాను.

ఇక భూచక్రాలేమో భూమి గుండ్రముగా వుండును అన్నట్లు వీరినుంచి సహజంగా ఒకే రకమైన ఫీడ్బ్యాక్ వుంటుంది. నా టపా కనిపించడం లేదని. ఈ టపా కనిపించకపోవడానికి సవాలక్ష కారణాలు. ఒక్కోసారి బ్లాగు దొరికిందే సందుగా టపాలను కుమ్మేస్తుంటారు. అది వారిష్టం కానీ నిర్ణీత గడువులో నిర్ణీత టపాలకంటే ఎక్కువ వస్తే ఆ బ్లాగు ఓ రోజు పాటు స్పాం లో వుంటుంది. అలాగే మరికొన్ని నియమాలూ వున్నాయి. ఇవి కాక శాండీ లాంటి దెబ్బలు తగిలి మనుషులకే దిక్కులేకపోతే ఇక హారం ఎక్కడ? ఇలాంటి కారణాలు బోలెడు. సాధారణంగా ఈ భూచక్రాలకు మొదటి మైల్ కు రిప్లై ఇవ్వను. రెండవసారి కూడా మైల్ ఇస్తే అప్పుడు తప్పక సమాధానముంటుంది. కారణం అన్ని మైల్స్ కు సమాధానాలివ్వడం ఇప్పట్లో నాకు కుదరని పని.

ఇక కాకరొత్తులు చాలా తక్కువన్నమాట :)). వీళ్ళు రంగురంగుల కలలతో హారం కు వెలిగిస్తామని వస్తారు. నేనూ " ఆహా ఏమి నాభాగ్యము!! ఎంతకాలానికి మా మా మానసముల్లాతోత్సవ
డోలికలూగుచూ  దీపావళి జరుపుకొనుచున్నదని సజ్జ నిండుగా కనులకింపుగా ఇష్టమృష్టాన్నములైన విందునంతా కూర్చి" తిరిగి మైల్ పంపుదునా.... హతవిధీ ఏమీ ఈ వైపరీత్యమూ ఒక్కరో ఒక్కరూ... ఒక్కరైననున్... అని దీపావళి కి  అమావాస్య పాట పాడుకోవటమే :)

ఇక Thousand waalaa లు. వీరు తమకు తెలిసిన Technology ని అంతా హారం పైన చూపిస్తుంటారు. :-). అంటే మీకిప్పటికే అర్థమయి వుంటుందనుకుంటా. చూసి నవ్వేసుకోవడమే :)).  అంటే వీళ్ళు తమ బ్లాగుని Add చేయమని పదే పదే మైల్స్, ఫీడ్ బ్యాంక్ లు చేస్తుంటారు. వీరికి మైల్ రిప్లై ఇచ్చినా ఉపయోగం వుండదు కనుక Thousand waalaa లకు సహజంగా సమాధానముండదు. వీళ్ళు టప్ టప్ టప్ మని బుద్ధిపుట్టినప్పుడల్లా పేలుతుంటారు :))


చివరిగా కొంతమంది అసలు సిసలైన బాంబులేస్తుంటారు. వీళ్ళు కనీసం ఓ రోజు కూడా ఆగలేని బాపతులన్నమాట. అసలు మైల్ ఇవ్వడివడమే నేను కత్తిని, నాపేరు బాకు ఏమనుకున్నావో తెలుసా...నువ్వు గనక నా బ్లాగును వెంటనే నీ సైట్ నుండి తీసెయ్యక పోతే నీమీద DMCA complaint  ఇస్తాం. జాగ్రత్త ఏమనుకున్నావో.. మాకు గూగుల్ తెలుసు..నీకు తెలుసా..గూగులోడికి కూడా complaint  చేస్తాం....ఇది నీకు వార్నింగ్... ఇలా పేలుతుంటాయి.

సహజంగా ఇలాంటి మైల్స్ కు నా reply వుండదు. కారణం వీళ్ళు హారం ను అసలు చూడరు. మరికొంతమందికి నా మీద అప్పుడప్పుడూ ఎక్కడో కాలుతుంది :)). అలాంటప్పుడు ఇలాంటి మైల్స్ వస్తుంటాయి. ఓ రకంగా చెప్పాలంటే హారం ఆయా  సైట్లకు ఓ చిన్నపాటి compitator అని వాళ్ళు ఫీల్ అయిపోయి ఇలా ఫట్ మని లక్ష్మీ బాంబులేస్తుంటారు.

ఇలాంటి వాటికి నా reply వుండదు. ఒక్కోసారి నిజంగానే జనాల పౌరుషాన్ని(? కాదు అమాయకత్వం) చూసినప్పుడు నవ్వు వస్తుంది. మరోసారి ఏముందబ్బా ఆ బ్లాగులో అని చూసి అబ్బబ్బా ఈ ఆడ/మాడా/మగాడిదొక బ్లాగు వీడివొక వ్రాతలు దానికొక కాపీరైట్ అని ఫీల్ అయిన రోజులూ వున్నాయు. కారణం అయ్యగారు బ్లాగునిండా ఇంటర్నెట్ లోనుంచి కాపీకొట్టిన ఫొటోలో లేదా వికీపీడియా కాపీనో లేదా Microsoft MSDN నుంచో మక్కీకి మక్కీ దించేసి వుంటారన్న మాట :))

ఇలా ముందు ఢాం ఢాం అని పేలుతారు. కాస్త గట్టిగా webhosting వాళ్ళ దగ్గరా పేలుతుంటారు. గూగుల్ దగ్గరా పేలుతుంటారు. హ్మ్..ఎంత పేలినా హారం ఎక్కడికీ పోదు. పేలి పేలి తుస్ మనడం తప్పించి ఇలాంటి మైల్స్ వల్ల ఉపయోగమూ వుండదు. కానీ ఇలాంటి మైల్స్ సహజంగా Americans నుంచి రావు. వాళ్ళ మైల్స్ polite గా వుంటాయి. నిజమే కదా అమెరికా వాళ్ళకు దీపావళి లేదాయె టపాకాయలు పేలుద్దామంటే :)).

ఇంతకీ దీపావళి కి కవిత వ్రాద్దామని కూర్చుంటే ఓ ఆడామె లక్ష్మీబాంబేసింది. అందుకోసం ఈ టపా వ్రాయాల్సి వచ్చింది. టపాసుల్లో రకాలు వేరయా అన్నట్టు ఈ టపాసు మొదటి మైలే మహా ఘాటుగా వేసింది. చదవాలని వుందా???

అబ్బా ఆశ దోశ అప్పడం ఆవడ :))))
ఇలాంటి వారికి దీపావళి ప్రాశస్త్యం తెలిసి మనసు తిమిరం తొలగితే నిజంగా దీపావళే ఆరోజు.

అదీ నా ఈ నాటి దీపావళి కవితన్నమాట:))

చివరిగా పాఠకులందరికీ దీపావళి శుభాకాంక్షలు.

12, నవంబర్ 2012, సోమవారం

కర్ణుడిని కుంతీదేవి పది నెలలు మోసి కన్నదా లేక సద్యోగర్భము(?) ద్వారా కన్నదా?

ఆంధ్రవిద్యార్థి 1934 ఆగష్టు సంచికలో  కర్ణుని గురించి వచ్చిన ఒక చిన్న వ్యాసమిది. వ్యాసకర్త శ్రీ కూచిభొట్ల ప్రభాకర శాస్త్రి గారు.
మనకు ఇష్టమైన వారేదైనా సంఘ విరుద్ధమైన పని వల్ల అపకీర్తికి బద్ధులయ్యే అవకాశముంటే  దానిని రకరకాలుగా తర్కించి అది తప్పు అని నిరూపించడానికో చక్కని ఉదాహరణ ఇది.  ఇందులో ప్రధానమైన ప్రశ్న కుంతీదేవికి కర్ణుడు జీవపరిణామ నియమాలకు లోబడి పుట్టాడా లేదా సద్యోగర్భము వలన పుట్టాడా అన్నది ప్రశ్న. వ్యాసకర్తకూ ఈ విషయం తెలిసినా కుంతీదేవి అంతఃపుర స్త్రీ, గొప్ప వ్యక్తి కాబట్టి ఆమెకు  పెళ్ళికాకముందే కర్ణుడు పుట్టినాడంటే అపకీర్తి కాబట్టి అలా చెప్పకూడదని, అది సమంజసము కాదని అంటాడు. మనకున్న అభిమానము పెడదారులు పట్టినప్పుడు ఇలాంటి సిద్ధాంతాలు వ్యాప్తి చెందుతాయేమో !




8, నవంబర్ 2012, గురువారం

అమెరికా ఎలక్షన్లు - రిపబ్లికన్స్ Vs డెమోక్రాట్స్ - ఓ పరిశీలన


ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశాన్ని తీసుకున్నా ప్రజలే అధిపతులు. అమెరికా కానివ్వండి లేదా భారతదేశం కానివ్వండి. మొన్న అమెరికాలో జరిగిన ఎలక్షన్ల ఫలితాలను విశ్లేషించినట్లైతే రెండు పార్టీల ఎజండా ఎలా వున్నప్పటికి  ముఖ్యంగా రిపబ్లికన్స్  వైట్ అమెరికన్ల ను టార్గెట్ చేసుకొని ప్రచారం కొనసాగించింది. అమెరికాలో వీరి శాతం 72% కు పైగానే వున్నారు. ఇక డెమోక్రాట్స్ విషయానికి వస్తే వీరు ముఖ్యంగా మైనారిటీ వర్గాలను, మధ్య తరగతి వర్గాన్ని దృష్టిలో వుంచుకొని ప్రచారం చేసింది. ఇక పార్టీల ఎజండా విషయంలో ఎన్ని అభిప్రాయ బేధాలున్నా ఇరువర్గాలు చెప్పిందీ దేశ సంక్షేమం అభివృద్ధి గురించి. అమెరికా ప్రజలు ఇక్కడ పరిస్థితులను బట్టి సహజంగా  అక్షరాశ్యులు. స్వయంగా నిర్ణయాలు తీసుకోగల జ్ఞానం కలవాళ్ళు. ఇక జాతీయత, దేశాభిమానం, ప్రాంతీయాభిమానం విషయాలకొస్తే ఇక్కడున్న మైనారిటీ వర్గాలు శ్వేతజాతీయులకు ఏమాత్రం తీసిపోని వారు.

మరి 72 శాతానికి పైగా  శ్వేతజాతీయులున్న ఈ దేశంలో రిపబ్లికన్లు ఓడిపోవటానికి గల కారణాలను భారతదేశంతో పోల్చి చెప్పాలంటే, 70 శాతం హిందువులున్న దేశంలో BJP ఎప్పుడూ ఓడిపోతుండంటంతో పోల్చవచ్చు. కారణం చాలా మంది పౌరులకు నేను శ్వేతజాతీయుడనా లేక హిందువునా అనే దానికన్నా ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే  నేను లేదా నాదేశం బాగుపడుతుంది అన్నదే ప్రధాన సమస్య. ఈ కారణం చేతనే ఇక్కడున్న శ్వేతజాతీయుల్లో సగం మంది ఒబామాకు ఓటు వేశారు. మరో ప్రధానకారణం ఒబామా outsourcing ని బాహాటంగా వ్యతిరేకించడం. outsourcing ని అడ్డుకోలేకపోవచ్చు కానీ రాయితీలను తగ్గించవచ్చు. అలా రాయితీలు తగ్గడం వల్ల ఇక్కడే ఉద్యోగాలిచ్చే సంస్థలు పెరుగవచ్చు. దీని ద్వారా అమెరికాలో ఉద్యోగావకాశాలు పెరుగవచ్చు.

ఇక అమెరికాలోనున్న లాటిన్ అమెరికన్లలో  70 శాతానికి పైగా ఓటర్లు ఒబామాకు ఓటు వేశారు. దీనికి దారితీసిన కారణాలను చూస్తే ముఖ్యంగా రెండు కనిపిస్తున్నాయి. ౧) రిపబ్లికన్స్ లో శ్వేతవర్గీయుల హవా తప్ప మిగిలిన జాతీయుల భాగం కానీ, వారి అధికారాలు కానీ అత్యంత స్వల్పం. కలుపుకోయే మనస్తత్వమూ తక్కువే అని ఆరోపణలూ వున్నాయి ౨) ఒబామా అనుసరిస్తున్న  ఇమ్మిగ్రేషన్ పాలసీలు.

అతి కొద్దిశాతమే ఐన ఏసియన్ అమెరికన్ల ( 3 % ) లో సుమారు 48% శాతం ఒబామాకు ఓటు వేశారు. ఎవరెవరు ఎలా వేశారో తేల్చడం కష్టం కానీ రోమ్నీ బాహాటంగా పాకీస్తాన్ ను సపోర్ట్ చెయ్యడం వల్ల చైనా దేశస్థులు, పాకీస్థాన్ దేశస్థులు రోమ్నీకి వేయగా భారతీయులు ఒబామా కు వేసి వుండవచ్చు.అలాగే ఆఫ్రికన్ అమెరికన్స్ కూడా ఒబామా కే సపోర్టు.

ఇదంతా చూస్తుంటే దేశమేదైనా అధికారానికి ఈ సమీకరణాలు తప్పనిసరేమో. కాకపోతే మనదేశం ఈ సమీకరణాలల్లో అమెరికాకంటే చాలా ముందంజలో వుంది.
ఇక్కడ ఖండాలూ, దేశాల వారీగా విడిపోయి సమీకరణాలు చేసారు. ఇలా విడిపోయి ఓట్లు వేసినా ఆ తరువాత అంతా అమెరికా కోసం పాటు పడేవారే.

మరి మనదేశంలో  దీన్ని మించిన కులసమీకరణాలు. ఓటింగ్ తరువాత కూడా అవే వర్గాలు. ఇక్కడ రోమ్నీ ఓటమి చూసిన తరువాత నాకో విషయం జ్ఞప్తికి వస్తుంది. నేను విశాఖలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ లో వున్నప్పుడు జరిగిన ఓ చిన్న సమావేశంలో బెజవాడ గోపాలరెడ్డి పాల్గొనడం జరిగింది. ఈపాటికే అది ఏ సమావేశమో మీకు అర్థమై వుండవచ్చు. బెజవాడ గోపాలరెడ్డి చెప్పిన వాక్యం యథాతథంగా ఇక్కడ

" మీరు రాజకీయాలలో రాణించాలంటే కులాభిమానాన్ని తగ్గించుకోవాలి" .

ఇది అక్షర సత్యం. మన రాష్ట్రంలో తనకులాన్నే నమ్ముకుని అధికారంలోకి వచ్చిన పార్టీ గానీ నాయకుడు గానీ ఒక్కడు కూడా లేడు. అమెరికాలో  రిపబ్లికన్స్ కూ, భారతదేశంలో BJP కి  జరిగిందదే.

5, నవంబర్ 2012, సోమవారం

హృదయమే శూన్యమై, శూన్యమే సంపూర్ణమై

హృదయమే శూన్యమై, శూన్యమే సంపూర్ణమై
ఆలపిస్తున్నా నేనీ ఆలాపనా...
నే  నీ ఆలాపనా      !! హృ||

అరుణకిరణ సమయమిది, జననమరణ భూతమది
నింగినేగు మేఘమది, మలయమారుత పవనమిది
వికసించిన మొగ్గయది, నేలరాలిన పుష్పమది
జనన మరణముల మధ్య గాలివాటు గమనమిది   

నువ్వా నేనంటూ సాగే పయనంలో
ముందో వెనకో నేనూ నువ్వూ చేరే గమ్యం ఒకటేలే
రక్తీ ముక్తీ, ప్రేమా ద్వేషం
వాడీ వేడీ, వాడూ వీడూ అన్నీ నేనూ నువ్వేలే
అంతా మూణ్ణాళ్ళ ముచ్చటేలే !            !! హృ||



కణకణమూ రగిలే రంగులబంతి కణములోపలి విష్ఫోటనము గని
కనులు మూసిన నిలిచేనా నువ్వూ నేనూ !
అహరహం రగిలే అగ్నిజ్వాలలే సమస్తావనికీ మూలాధారం
అది మింటికి రాజైనా,  నువ్వైనా, నేనైనా  !! హృ||