26, ఫిబ్రవరి 2013, మంగళవారం

నేను.... నా ప్రేమ.......మొదటిభాగం :)

ఉదయం గంట ఎనిమిదిదాటి యాభై నిమిషాలైంది. భాషా వచ్చి టంగ్ టంగ్ టంగ్ టంగ్.......టంగ్ మని మొదటి బెల్లు కొట్టిండు. పిల్లకాయలంతా బిలబిలమంటూ వచ్చి అసెంబ్లీ సమావేశ స్థలంలో ఏ తరగతికాతరగతి గా విడిపోయి వరుసల్లో నిలబడ్డారు. ఆరు నుంచి పదో తరగతి దాకా మొత్తం ఓ రెండొందల మంది వుంటారేమో. ఆరోజు బడికి ఎగ్గొట్టినోళ్ళు ఎగ్గొట్టగా నూటాయాభై మంది దాకా సమావేశమైనారు. దీర్ఘ చతురస్రాకార స్థలంలో మూడుప్రక్కల క్లాసుల పిల్లకాయలు నిలబడగా నాలుగో వైపు మధ్యలో జెండాకఱ్ఱ దానికి కుడి ఎడమలగా ఖాళీ ప్రదేశము.

మరో ఐదునిమిషాలకు టంగ్ టంగ్ టంగ్ టంగ్.......టంగ్.... టంగ్ మని రెండో బెల్లు కొట్టగానే ఆలస్యంగా వచ్చిన పిల్లలు నక్కి నక్కి వచ్చి వారి వారి క్లాసుల పిల్లల గుంపులో కలిసిపోతున్నారు.మరోవైపు మా హెడ్మాష్టర్, మిగిలిన అయవార్లు వచ్చి నిలబడగానే SPL రోజు వారీ చేసినట్లే విధిగా వందన సమర్పణలు ఆ తరువాత ప్రేయరు యథావిధిగా జరిగిపోయాయి.

గంట తొమ్మిది కొట్టగానే మూడో గంట మోగడం తరగతి గదిలోకి అయవారు రావడం పాఠాల్లో లీనమైపోవడం. రోజూ ఇదే తంతైనా ఏరోజుకారోజు క్రొత్తగా వుండేది. స్కూల్స్ తెరిచి ఓ నెలో రెండు నెలలో అయి వుంటుందేమో. ఓ రోజు ప్యూన్ వచ్చి " సారూ రాంరెడ్డి ని హెడ్ మాష్టర్ సార్ పిలుస్తున్నాడన్న" మాట నా చెవుల పడగానే చెడ్డీలో ఎదో చల్లగా తగిలిన అనుభూతి.

 " ఏ దొంగనాయలో ముండనాయలో నామీద చాడీలు చెప్పుంటడు. ఇప్పుడీన పిల్చిండు. ఈరోజు నాపని గోవిందా.... ఆ కిట్టిగాడే అనుకుంటా పొద్దున్నే వంకలో పడేసి కొట్టినా కదా !!! వాడే వాడే చెప్పుంటడు. ఐనా చాక్లేటు కొనిస్తా అని చెప్పినా గదా వాడికి? ఇంటికి పొయ్యేటప్పుడు చెప్తా వాడిపని "  అనుకుంటూ మా క్లాసు రూము నుంచి హెడ్మాస్టర్ గది వరకూ ఓ రెండు గంటలు నడుద్దామని డిసైడయి పొయ్యా. క్లాసునుండి బయటకొచ్చి నాలుగడుగులు వేసానో లేదో కంచుకంఠం వినపడింది.
" ఏంట్రా ఆ పెళ్ళినడక...నడువు తొందరగా" అని గర్జించగానే ఊడిపోతున్న చల్లాడాన్ని ఓ చేత్తో పట్టుకోని  ఐదారు సెకన్లలో హెడ్మాస్టర్ ముందు ప్రత్యక్షం :)

నాకు ఈ స్కూల్ కు వెళ్ళినప్పటినుంచి ఒక కోరిక బలంగా వుండేది. అసలు హెడ్మాస్టర్ రూములో ఏముంటదో చూడాలని. స్కూల్ లో అయవార్లుగూడా పొద్దున సంతకం చేసేటప్పుడే ఆ రూములోకి పోతారు. లేకుంటే ఎప్పుడైనా  హెడ్మాస్టర్ పిలిస్తేనే. మిగిలిన కాలమంతా క్లాసురూముల్లోనో లేకుంటే స్టాఫ్ రూములోనో పాఠాలు చెప్పుకుంటూనో లేదా లోకాభిరామాయణం మాట్లాడుకుంటూనో  కాలక్షేపం చేస్తుండేవారు. అలాంటి పకడ్బందీ వున్న హెడ్మాస్టర్ గదిలో ఏముంటుందో నని హైస్కూల్ లో చేరిన మొదటి రోజునుండి పురుగు తెగ తొలిచేసేదంటే నమ్మండీ.

హెడ్మాస్టర్ ముందు నిలబడడమైతే నిలబడ్డాగానీ ఇప్పుడీన  గదిలోపలికి తీసుకు పోకుండా బయట్నే వీపు విమానం మోత మోగిస్తాడేమోనని ఒకటే భయం. మొగుడు కొట్టినందుకు కాదు గానీ తోడికోడలు నవ్వినందుకన్నట్టు, బయట కొడితే నేను ప్రేమించే అమ్మాయి చూసిందనుకో!!! అప్పుడు నా పరిస్థితేంది? అసలే సంవత్సరంరోజులు ట్రై చేసి చేసి నిన్న గాక మొన్న " నీ నోడ్సిస్తావా " అని ధైర్యం చేసి అడిగా.   అలాంటిది ఇప్పుడు ఈ తన్నులు తినడం చూసి కిసుక్కున నవ్వితే నాపరిస్థితేమి గాను? నన్నుగేన కొడితే రేప్పొద్దున ఈన వాగు వైపు పొయ్యేటప్పుడు కాచుకూర్చోని రాయితీసుకోని గురీగా కొట్టి పారిపోవాలి అని గట్టిగా నిర్ణయానికొచ్చేసినాను.

"రారా లోపలికి పోదాం" అన్న పిలుపుతో హమ్మయ్య అని బుజ్జి గుండెనిండుగా గాలిపీల్చుకోని హెడ్మాష్టర్ వెంట భయం భయంగా నడిచాను. 


గుండె కొట్టుకోవడం క్షణం పాటు ఆగిపోయింది. నా కళ్ళను నేనే నమ్మలేని స్థితి. ఒకటికి బదులు ఇంకేదో అయిపోతున్న ఫీలింగ్...చూద్దునా లోపల నేను ప్రేమించిన అమ్మాయి. పై ప్రాణం పైనే పోయింది.....

మిగిలింది రేపు :-)

23, ఫిబ్రవరి 2013, శనివారం

A great song and composition - జయమంగళం నిత్యశుభమంగళం

ఓ వారం క్రితం నా ఐఫోన్ లో ఎప్పుడో రెండేళ్ళ నాడు ఎక్కించిన పాటలను తీసివేసి క్రొత్తగా పాటలను upload చేసాను. Travel లో అలా అన్ని పాటలను వింటూ వుంటే ఓ రోజు ఈ క్రింది పాట వినిపించింది. మొదటిసారి విన్నాను. ఇదేదో బాగుందే అని రెండోసారి, మూడోసారి....వందో సారి వినివుంటాను. సాహిత్యమెంతబాగుందో దానికి పోటీగా వుంది సంగీతం. సరిగమల తొలి పాఠాలు రాని నాకు కూడా పాట పాడిన వారు కూడా అద్భుతంగా పాడినారనిపించింది. తరువాత వివరాలకోసం వెతికాను. "తరిగొండ వెంగమాంబ" సినిమా అని తెలిసింది కానీ, ఈ సినిమాలో యిన్ని మంచిపాటలు పెట్టుకోని ఎందుకు పాపులర్ కాలేదో! ఒకవేళ జనాలందరికి తెలిసినా నాకు తెలియలేదేమో. ఏమైతేనేమి, సాహిత్యానికి తగ్గ సంగీతం కీరవాణి చక్కగా చేసారు.ఈ పాటను ఎవరెవరు పాడినారో నాదగ్గర సమాచారం లేదు. కానీ, గాత్రము కూడా చాలా బాగుంది. కొన్ని చోట్ల అమోఘం.సినిమా చూద్దామనుకుంటే యు-ట్యూబ్ లో దొరకలేదు.

ఈ పాట వింటూ వ్రాసిన పంక్తులివి. పాట కొన్నిచోట్ల అస్పష్టంగా వుండడము వల్లనో లేక  ఇప్పటి రోజులలో ఈ పదాలు వాడుకలో లేకపోవడం వల్లనో సాహిత్యంలో కొన్ని పదాలను నేను ఎప్పుడూ వినకపోవడం చేతనో కొద్ది పదాలకు నాకు అర్థాలు తెలియడం లేదు. అలాంటి పదాలు కొన్ని ఇక్కడ

౧) మరుగవలదీబిరుదు. ఇది మరువవలదీబిరుదు అని అనుకోవాలా?
౨) పరుష నళికించి(??). దీని అర్థమేమైవుంటుందో
౩) అందర కన్న మలయ : దీని అర్థమూ తెలియడం లేదు.
౪)
చి(?)రములైతగు : ఇది స్థిరములై తగు అని పాడారా లేక చిరములైతగు అనే పాడినారా? ఏదైనా అర్థం "చాలాకాలము నుండి" అని అర్థమే కాబట్టి ఇబ్బందేమీ లేదు.
౫)  శరధి సుతకును. ఇది కూడా సరిగా వినిపించడము లేదు. పాదార్థాన్ని బట్టి శరధి అనుకుంటున్నాను.

ఇక కొన్ని క్రొత్త పదాలకు అర్థాలు
౧) పన్నగము= పాము  ౨) అనిశము ( నిలయమందనిశంబు) = ఎల్లప్పుడు ౩) మురువు ( మురువొప్పు ) : సుందరము, శోభాయమానమైన ౪) అహి= పాము ౫) రహినొప్పు = సుందరమైన అని అర్థమా?

తెలియని పదాలు :
౧) వితతులు ౨) ప్రతతులు ౩) పొలుపొందు విశ్వప్రభుత్వ మూలంబునకు 


పాట




శ్రీ పన్నగాద్రివర శిఖరాగ్ర వాసునకు  పాపాన్ధకార ఘన భాస్కరునకు
ఆ పరాత్పరునకు నిత్యాన్నపాయిని యైన  మాపాలి అలమేలు మంగమ్మకు
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం

శరణనన్నదాసులకు వరమిత్తునని బిరుదు ధరియించియున్నపరదైవమునకు
మరుగవలదీబిరుదు నిరతమని పతినీ ఏమరనియ్య నలమేలు మంగమ్మకు
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం

ఆనంద నిలయమందనిశంబు వశియించి దీనులను రక్షించు దేవునకును
కానుకలనొనగూర్చి ఘనముగా విభుని సన్మానించు అలమేలు మంగమ్మకు
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం

వరమొసగ నావంతు నరులకని వైకుంఠమరచేత చూపు జగదాత్మునకును
సిరులొసగ తనవంతు సిద్ధమని నాయకుని ఉరముపై కొలువున్న శరధి సుతకు
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం

తెలివితో ముడుపులిటు తెమ్ము తెమ్మని పరుష నళికించి(??) గైకొనెడి అచ్యుతునకు
ఎలమి పాకంబు చేయించి అందర కన్న మలయ కెపుడొసగె మహామాతకు
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం

మరియు చిత్ర విచిత్ర మంటపావళులకును తిరువీధులకు దివ్యతీర్థములకు
పరగ ఘనగోపుర ప్రాకారతతులకును చిరములైతగు కనక శిఖరములకు
తరచైన ధర్మసత్రములకును ఫలపుష్పభరిత శృంగారవన పంక్తులకును

మురువొప్పు ఉగ్రాణములకు బొక్కసములకు సరసంబులగు పాకశాలలకును
అహి వైరి ముఖ్య వాహనములకు గొడుగులకు రహినొప్పు మకర తోరణములకును
బహువిధ ధ్వజములకు పటువాద్య వితతులకు విహిత సత్కల్యాణ వేదికలకు
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం

ధర చక్ర ముఖ్య సాధనములకు మణిమయాభరణ దివ్యాంబర ప్రతతులకును
కరచరణ ముఖ్యాంగ గణ సహితమై శుభాకరమైన దివ్య మంగళమూర్తికి
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం

కలిక సుజ్ఞానాది కల్యాణ గుణములకు బలమొప్పునని తత్ప్రభావమునకు
బలగొనిన సకల పరివార దేవతలకును చెలగి పనులొనరించు సేవకులకు
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం

అలరగా బ్రహ్మోత్సవాదులై సంతతము వలనొప్పు నిత్యోత్సవంబులకును
పొలుపొందు విశ్వప్రభుత్వ మూలంబునకు నలువొందు వర విమానంబులకును
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం

అరయ తరిగొండ నరహరి యగుచు నందరికి వరములొసగె శ్రీనివాసునకును
మురియుచును విశ్వతోముఖునిట్లు భరియించి సిరుల వెలయుచునుండు శేషాద్రికి
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం
జయమంగళం నిత్యశుభమంగళం


22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

రెడ్ల జపంలో ఆంధ్రజ్యోతి :-)




హైదరబాదు చూడరబాబూ...నెత్తుటేరుల ఈదర బాబు



Hyderabad needs a real  tough policing .....

ఇది ఒకటవసారా లేదా రెండవసారా తీవ్ర దిగ్భ్రాంతిని  చిలకపలుకులు లాగా వల్లెవెయ్యటానికి? ఒకరు రెండురోజుల ముందే సమాచారముందంటారు కానీ ఎక్కడో తెలియదు. అసలు ఇలాంటి దాడులు జరిగినప్పుడు బొట్టుపెట్టి బాబూ మేము ఇదిగో ఈ సిటీలో బాంబులను మీ ముడ్డిక్రింద పెట్టిపోతాము అని చెప్పి మరీ చేస్తారా? సరైన టార్గెట్ ను కనుక్కొనడంలో కష్టాలుండవచ్చు. కానీ ముందు జరిగిన పేలుళ్ళ ద్వారా భారత పోలీసు వ్యవస్థ ఏమైనా నేర్చుకుందా? పోనీ నేర్చుకుందనుకున్నా అసలు ముందుగా గుర్తించి పేలుళ్ళు జరగకుండా ఆపిన సందర్భాలెన్ని? దారిన పొయ్యే దానయ్యలు సైకిలో స్కూటరో వేసుకొచ్చి చక్కగా సుష్టుగా భోజనము చేసి సంచీ మర్చిపోయి వెళతాడు. ఆ తరువాత అతి మామూలుగా ధనా ధన్ మని పేలుళ్ళు, అమాయక ప్రాణుల అవయవాలు చిదుగై చెదిరి రోడ్లపైన.

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా హడావిడి. చనిపోయిన ప్రతి కుటుంబానికి నాలుగో ఐదో లక్షలిచ్చి చేతులు దులుపేసుకొని రాజకీయాల్లో మునిగి తేలుతూ, సరిగంగ స్నానాలు ఆచరిస్తూ, దొరికిన కాడికి దోచుకుంటూ,దొరకని దానిని దారికి ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తూ, ఆచరణల్లో పెడుతూ, ఐదేళ్ళకొకసారి పడుతూ  లేస్తూ జనవాసాలలో జనానికి దొరకకుండా సంచరించే మహానుభావులు ఇలాంటివి జరిగినప్పుడు విషన్నవదనులై నోటి ముత్యాలు రాల్చి ఆ ముత్యాలను ఏ వార్తాపత్రికలు బాగా ఒడిసి పట్టుకున్నాయో నని ఆరాలు తీస్తూ మరుసటిరోజుకే రాజకీయ భవిష్యత్తుపై ప్రణాళికా రచనలో నిమగ్నులై పోతారు.

అవును మనది సెక్యులర్ దేశమా? సెక్యులర్ ముసుగులో మతాలను ఏరకంగా వాడుకుంటున్నారో ఎవ్వరికీ కనిపించదా?  ముస్లింలు లేని ప్రదేశాల్లో ఇలాంటి బాంబుదాడులు ఎన్ని జరిగాయి?గణాంకాలను బయటికి తీసి చూడండి. ఇదేమన్నా దేశజనాభాను లెక్కించాల్సిన సమస్యా? కాదే !!! ఒక పౌరునిగా భారత రాజ్యాంగానికి అనుసరించి నడుచుకోకపోతే వాడిని ఏమి చేయాలి? అవును ముస్లింలు కదా !!! Touch me not.... Do you really think even a muslim support these kind of barbarian attacks? isn't it your plot for your political career??  అసలు వీళ్ళు భారతీయులా లేక  ముస్లిములు మాత్రమేనా??  ఇలాంటి వారిని నాలుగు పీకడానికి "భారత నిర్మాత" ల దగ్గర దమ్ములుండవు. అవును మరి ఓట్లకుండలకు చిల్లులు పడతాయి కదా? నిజానికి నీదేశానికి శత్రువు ఉగ్రవాది కాదు. నువ్వే....అవును ముమ్మాటికీ నువ్వే!!!

ఇంటెలిజెన్సీ వ్యవస్థను పటిష్టీకరించడానికి దేశంలో డబ్బులుండవు.... సారీ డబ్బులేకేమీ బ్రహ్మాండంగా వుంటుంది కానీ ఆచరణలో ఆ డబ్బు అయ్యవారి అలమరాల పాలు. నిన్ననే కదా ఇది జరిగింది ఓ వారంపోతే అన్నీ సర్దుకుంటాయని ఓ  అయ్యేయస్సుల సారు అయ్యేపియస్సల వారు ఉచిత సలహా ఒకటి పడేసి వాళ్ళ వాళ్ళ కెరీర్ గ్రాఫ్....సారీ మనీకెరీర్ గ్రాఫ్ ల్లో నిమగ్నమైపోతారు.


ఎంతకాలం నెల? రెండునెల్లు?? ఆ తరువాత పరిస్థితి  మాములే.... ఎవరికి తెలియని కథలివి? క్రొత్తగా చెప్పుకోవడానికేముంది గనక? yes you are right ....మా ఆవేశాలెంతసేపు మహా ఐతే ఓ పదిరోజులు. ఆ సంగతి నీకు బాగా తెలుసు. "లైట్ తీస్కో భాయ్" వారం పోతే అంతా అదే సర్దుకుంటుంది.

21, ఫిబ్రవరి 2013, గురువారం

Best place to live in USA - NJ/GA/NC/FL/TX

ఇప్పుడు అమెరికాలో ఓ మోస్తరు జీవనము సాగించడానికి అనువైన ప్రదేశాల మీద ఎవరైనా ఏమైనా రీసెర్చ్ లాంటివి చేశారా? అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కు ఉద్యోగాలు, ఉన్నంతలో కాస్త మంచి జీతభత్యాలు, ఒకవేళ ఉద్యోగాలు ఊడినా ఏదో ఒకటి రెండు నెలల్లో మళ్ళీ ఉద్యోగం దొరికేట్టు ( న్యూజెర్శీ లోలాగా ) , ఇంకా  మంచి మంచి  స్కూల్స్ , ఇల్లు కొనాలంటే ఓ నాలుగైదు బెడ్ రూమల ఇల్లు ఓ  ఉద్యోగి భరించగలిగే టట్లుగా వుండే  పట్టణం/రాష్ట్రమేదైనా వుందా? As I said my priorities are 1) schools 2) Houses 3) Jobs 4) Yearly income

న్యూజెర్శీ/ న్యూయార్క్ ప్రాంతాల్లో వుండి వేరే ప్రదేశాలకు వెళ్ళి స్థిరపడినవారెవరైనా వున్నట్లైతే, ఈ స్టేట్ వదిలి వెళ్ళాక మీరేమైనా పోగొట్టుకున్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా? ఒకవేళ అలాంటి అనుభవాలు ఏమైనా వుంటే అవి ఏమిటి? ముఖ్యంగా న్యూజెర్శీ/ న్యూయార్క్ వదిలి వెళ్ళడం వల్ల నష్టాలేమిటి? నాకైతే ఉద్యోగావకాశాలు తక్కువగా వుంటాయేమో అన్న ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది. ఇది కాక ఇంకేమైనా నష్టపోతామా?  ముఖ్యంగా  Georgia, North Carolina, Florida, Texas రాష్ట్రాలపై ఓ కన్ను వేసి ఉంచితే ఎందుకైనా మంచిదని.



19, ఫిబ్రవరి 2013, మంగళవారం

అనగనగా ఒక వీడియో కెమరా... దానీ మీద ఓ క్రేను.

ఆ మధ్య ఇండియాకెళ్ళే చాలా ముందుగానే అప్పటికే ఇంట్లో వున్న వీడియో కెమెరా చెడిపోవడంతో క్రొత్తది కొనాల్సిన అవసరమొచ్చిపడింది. చెడిపోయిన వీడియో కెమెరా 2000 వ సంవత్సరంలో డెట్రాయిట్ లో $500 పెట్టి కొన్నది. కంపెనీ సోనీ. ఏమాటకామాటే వీడియోలు చాలా బాగా వచ్చేవి. కానీ ఎటొచ్చీ హై డెఫినిషన్ టీవీలు వచ్చాక ఆ వీడియోలు ఇందులో చూడాలంటే ఏదోగా వుండేది. క్రొత్త కెమెరా కొనాలంటే పాతది చెడిపోవాలి కదా! అది చెడిపోయినప్పుడు కాస్త గట్టిగానే ఈల వేసాననుకోండి. కానీ క్రొత్తది మంచిది కొనాలి. ఎలా? ఎవర్నడిగినా వీడియో కెమెరా నా? దాన్దేముంది ఎంత మంచి కెమెరా కొనాలన్నా మహా ఐతే 400 లోపలనే వచ్చేస్తుంది అని సలహాలిచ్చేవారు. అందరూ ఇంత ఘంటాపథంగా నొక్కి వక్కాణించిన తరువాత కూడా $1200 పెట్టి కొనాలంటే స్కెచ్ లు గియ్యాలికదా :-).

అనుకున్నట్లుగానే ఓ సుందరమైన రోజు స్కెచ్ ప్రకారం ఆ వీడియో కెమెరా కొనేసి ఇంట్లో $400 మాత్రమే అని చెప్పడమూ వాళ్ళు నమ్మినట్టు నటించడం నాలుగురోజులు పొయ్యాక బట్టలు laundry కి వేసేటప్పుడు జేబుల్లో బిల్లు దొరకడం... కట్ చేస్తే ...... ఎందుకులేండి మళ్ళీ  నాచేతే చెప్పించుకోని క్కిక్కికి అను నవ్వుకోవాలా ఏమిటి?

సరే అసలు ఈ camcorder  ఇంత పోసి కొన్నాక ఏదో ఒకటి చెయ్యాలి కదా? అప్పుడు ముందుగా గుర్తొచ్చింది tripod. ఏదో కొద్దిలోనే పోయింది. ఆ తరువాత గుర్తొచ్చింది slider. అది కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు కానీ అది ఇంకా వాడకానికి సిద్ధంగాలేదు. tripod, slider కొన్న తరువాత అత్యంత అవసరంగా, ఇది లేకపోతే జీవితమే లేదన్న నిరుత్సాహంతో క్రేన్ కొందామని చూస్తే చుర్ర్ మని కాలింది. అన్నీ మూసుకొని ఇండియా వెళ్ళాను. ఇండియా వెళ్ళాక నర్సరావు పేట వీధులన్నీ తిరిగి ఇనపసామాన్లు, నట్లు, బోల్టులు ఇంకా ఏమిటేమిటో కొని మా బావ చేత చిన్న మినీ క్రేన్ ( నాలుగడుగల క్రేన్ ) తయారు చేపించుకున్నాను. ఎగిరి గంతువేసాననుకోండి. కారణం ఇక్కడ ౩౦౦ డాలర్లయ్యే క్రేన్ మరి తేరగా తొమ్మిది వందల రూపాయలుకు వస్తే ఎలాగుంటుందో మీరే ఆలోచించండి?

ఆ ఉత్సాహం, ఆ నయనానందం..ఇంకా ఏదో ఏదో ఎక్కువ గంటలు నిలబడలేదు. కారణం అది నా కారులో పట్టలేదు :-). కారులోనే పట్టలేదు ఇక అమెరికా కు ఎలా రావాలి? దానికి shipping ఎవడు కడతాడు. తొమ్మిదొందల దాన్ని ఇక్కడికి తీసుకురావాలంటే  ప్రక్కన మరో సున్న పెట్టాలి కదా!!! దాంతో దాని కథ కంచికి చేరింది.

ఒకానొక దెయ్యాలు తిరిగే రాత్రి. గాలికి నక్కల అరుపులు. బయట చూస్తే అంతా తెల్ల చీర. అలాంటి సుభ ముహూర్తంలో పన్నెండడుగుల  క్రేన్ రా రమ్మని పిలిచింది. ఇంకేముంది అలా వెళ్ళాను..ఇలా వచ్చాను. చూస్తే ఇంట్లో క్రేను. నెత్తి క్షవరం..... తదనంతర పరిణామాలు మామూలేననుకోండి. ఆ క్రేన్ తో తీసిన వీడియో అన్న మాట ఇది.

బయటకెళ్ళాలంటే భయం. చలికి అవయవాలు ఎక్కడివక్కడ ఊడిపోతాయేమోనని. ఇంట్లో 12 అడుగుల క్రేన్ పట్టదు కదా !! అందుకని ఈ క్రింది వీడియో 8 అడుగులతో తీసింది. ఈ 8 అడుగులు కూడా పూర్తిగా కనిపించాలంటే ఆరుబయటకెళ్ళాల్సిందే. ఆరుబయటకెళ్ళాలంటే ఎండాకాలం రావాల్సిందే. ఎండాకాలం ఇప్పుడల్లా లేదు కాబట్టి అప్పటిదాకా ఆగాల్సిందే. కానీ ఆగుతామా? లేదు కదా. అందుకే ఇంట్లోనే ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట.




సో, నా ప్రియాతి ప్రియమైన క్రేన్ ఫొటోలు ఇవి.( only 8 feet attached )