19, ఫిబ్రవరి 2013, మంగళవారం

అనగనగా ఒక వీడియో కెమరా... దానీ మీద ఓ క్రేను.

ఆ మధ్య ఇండియాకెళ్ళే చాలా ముందుగానే అప్పటికే ఇంట్లో వున్న వీడియో కెమెరా చెడిపోవడంతో క్రొత్తది కొనాల్సిన అవసరమొచ్చిపడింది. చెడిపోయిన వీడియో కెమెరా 2000 వ సంవత్సరంలో డెట్రాయిట్ లో $500 పెట్టి కొన్నది. కంపెనీ సోనీ. ఏమాటకామాటే వీడియోలు చాలా బాగా వచ్చేవి. కానీ ఎటొచ్చీ హై డెఫినిషన్ టీవీలు వచ్చాక ఆ వీడియోలు ఇందులో చూడాలంటే ఏదోగా వుండేది. క్రొత్త కెమెరా కొనాలంటే పాతది చెడిపోవాలి కదా! అది చెడిపోయినప్పుడు కాస్త గట్టిగానే ఈల వేసాననుకోండి. కానీ క్రొత్తది మంచిది కొనాలి. ఎలా? ఎవర్నడిగినా వీడియో కెమెరా నా? దాన్దేముంది ఎంత మంచి కెమెరా కొనాలన్నా మహా ఐతే 400 లోపలనే వచ్చేస్తుంది అని సలహాలిచ్చేవారు. అందరూ ఇంత ఘంటాపథంగా నొక్కి వక్కాణించిన తరువాత కూడా $1200 పెట్టి కొనాలంటే స్కెచ్ లు గియ్యాలికదా :-).

అనుకున్నట్లుగానే ఓ సుందరమైన రోజు స్కెచ్ ప్రకారం ఆ వీడియో కెమెరా కొనేసి ఇంట్లో $400 మాత్రమే అని చెప్పడమూ వాళ్ళు నమ్మినట్టు నటించడం నాలుగురోజులు పొయ్యాక బట్టలు laundry కి వేసేటప్పుడు జేబుల్లో బిల్లు దొరకడం... కట్ చేస్తే ...... ఎందుకులేండి మళ్ళీ  నాచేతే చెప్పించుకోని క్కిక్కికి అను నవ్వుకోవాలా ఏమిటి?

సరే అసలు ఈ camcorder  ఇంత పోసి కొన్నాక ఏదో ఒకటి చెయ్యాలి కదా? అప్పుడు ముందుగా గుర్తొచ్చింది tripod. ఏదో కొద్దిలోనే పోయింది. ఆ తరువాత గుర్తొచ్చింది slider. అది కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదు కానీ అది ఇంకా వాడకానికి సిద్ధంగాలేదు. tripod, slider కొన్న తరువాత అత్యంత అవసరంగా, ఇది లేకపోతే జీవితమే లేదన్న నిరుత్సాహంతో క్రేన్ కొందామని చూస్తే చుర్ర్ మని కాలింది. అన్నీ మూసుకొని ఇండియా వెళ్ళాను. ఇండియా వెళ్ళాక నర్సరావు పేట వీధులన్నీ తిరిగి ఇనపసామాన్లు, నట్లు, బోల్టులు ఇంకా ఏమిటేమిటో కొని మా బావ చేత చిన్న మినీ క్రేన్ ( నాలుగడుగల క్రేన్ ) తయారు చేపించుకున్నాను. ఎగిరి గంతువేసాననుకోండి. కారణం ఇక్కడ ౩౦౦ డాలర్లయ్యే క్రేన్ మరి తేరగా తొమ్మిది వందల రూపాయలుకు వస్తే ఎలాగుంటుందో మీరే ఆలోచించండి?

ఆ ఉత్సాహం, ఆ నయనానందం..ఇంకా ఏదో ఏదో ఎక్కువ గంటలు నిలబడలేదు. కారణం అది నా కారులో పట్టలేదు :-). కారులోనే పట్టలేదు ఇక అమెరికా కు ఎలా రావాలి? దానికి shipping ఎవడు కడతాడు. తొమ్మిదొందల దాన్ని ఇక్కడికి తీసుకురావాలంటే  ప్రక్కన మరో సున్న పెట్టాలి కదా!!! దాంతో దాని కథ కంచికి చేరింది.

ఒకానొక దెయ్యాలు తిరిగే రాత్రి. గాలికి నక్కల అరుపులు. బయట చూస్తే అంతా తెల్ల చీర. అలాంటి సుభ ముహూర్తంలో పన్నెండడుగుల  క్రేన్ రా రమ్మని పిలిచింది. ఇంకేముంది అలా వెళ్ళాను..ఇలా వచ్చాను. చూస్తే ఇంట్లో క్రేను. నెత్తి క్షవరం..... తదనంతర పరిణామాలు మామూలేననుకోండి. ఆ క్రేన్ తో తీసిన వీడియో అన్న మాట ఇది.

బయటకెళ్ళాలంటే భయం. చలికి అవయవాలు ఎక్కడివక్కడ ఊడిపోతాయేమోనని. ఇంట్లో 12 అడుగుల క్రేన్ పట్టదు కదా !! అందుకని ఈ క్రింది వీడియో 8 అడుగులతో తీసింది. ఈ 8 అడుగులు కూడా పూర్తిగా కనిపించాలంటే ఆరుబయటకెళ్ళాల్సిందే. ఆరుబయటకెళ్ళాలంటే ఎండాకాలం రావాల్సిందే. ఎండాకాలం ఇప్పుడల్లా లేదు కాబట్టి అప్పటిదాకా ఆగాల్సిందే. కానీ ఆగుతామా? లేదు కదా. అందుకే ఇంట్లోనే ఎక్స్పెరిమెంట్స్ అన్నమాట.




సో, నా ప్రియాతి ప్రియమైన క్రేన్ ఫొటోలు ఇవి.( only 8 feet attached )








6 కామెంట్‌లు:

  1. బ్బబ్బాబు ఆ షెల్ప్ లో ఉన్న పుస్తకాలు స్కాన్ చేసి మెయిల్ చేయండి
    చదువుకుంటా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హేమ గారూ, స్కాన్ చేసి మైల్ చెయ్యడమెందుకండీ. ఈ పుస్తకాలు చాలా వరకు మీకు Digital library of India లో దొరుకుతాయి. ఓ సారి ట్రై చేసి చూడండి.

      తొలగించండి
  2. రిప్లయిలు
    1. లక్ష్మీ దేవి గారూ :-). అంతే కదండీ. ఈ మోజూ, క్రేజూ ఎన్ని రోజులో చూడాలి.

      తొలగించండి
  3. రిప్లయిలు
    1. హరి గారూ, హ హ... మంచోరే... అందులో తొంభై శాతం నా కష్టార్జితమే. చమటలు చిందించి మరీ మోసుకొచ్చుకున్నవే అంతే కానీ కొట్టుకొచ్చినవి లేవు.
      మిగిలిన పది శాతమంటారా :-) అలాంటివి మీరడగ కూడదు మరి :)

      తొలగించండి

Comment Form