31, మార్చి 2013, ఆదివారం

ప్రేమించుకుందాం......... రా

 
    పెళ్ళికళ వచ్చేసిందే బాలా..
    పల్లకిని తెచ్చేసిందే బాలా...
    హడావిడిగా రెడి అవుదాం చలో లైలా
    ముచ్చటగ మేళం వుంది... ఆజా ఆజా
    తద్దినక తాళం వుంది... ఆజా ఆజా
    మంటపం రమ్మంటుంది... ఆజా ఆజా
    జంటపడు వేళయింది... ఆజా ఆజా

    పెళ్ళికళ వచ్చేసిందే బాలా..
    పల్లకిని తెచ్చేసిందే బాలా...


    అక్షితలు వేసేసింది షాదీ
    అడ్డుతెర తీసేసింది షాదీ
    స్వయంవరమే శభాషంది హలో డార్లింగ్
    ఇష్టపడు కన్యాదానం.. లేజా లేజా
    జానెమన్ ఏ దుళన్ కో... లేజా లేజా
    మై డియర్ హబ్బి ముజ్కో... లేజా లేజా
    ఆశపడు అందం చందం... లేజా లేజా

    అక్షితలు వేసేసింది షాదీ
    అడ్డుతెర తీసేసింది షాదీ

    ఆలుమగలై పోయామే... భామా
    అసలు కథ బాకీ వుంది... రామ్మా
    అమాంతంగా ప్రోసీడ్ అవుదాం చలో జాణా

    మల్లెలతో మంచం సిద్ధం... దేఖో దేఖో
    అల్లరితో మంత్రం వేద్దాం.. దేఖో దేఖో
    మన్మధుని ఆహ్వానిద్దాం... దేఖో దేఖో
    ముద్దులతో సన్మానిద్దాం... దేఖో దేఖో
    ఆలుమగలై పోయామే... భామా
    అసలు కథ బాకీ వుంది... రామ్మా
    అమాంతంగా ప్రోసీడ్ అవుదాం చలో జాణా.. ఆ.. ఆ..--సిరివెన్నెల

30, మార్చి 2013, శనివారం

People use this link to get details from Google.

ఏ  వ్యక్తులనుండైనా మీకెప్పుడైనా abusive comments వస్తే don't let them go. Use the following link to get the user details and report in local police station.


https://support.google.com/mail/contact/abuse?hl=en&rd=1

26, మార్చి 2013, మంగళవారం

మీ అందాల నటుడు "ధీరోదాత్తుడు" అందచందాల తార "ప్రగల్భ" నటించిన నవరస భరిత చిత్రం

మీ అందాల నటుడు "ధీరోదాత్తుడు" అందచందాల తార "ప్రగల్భ" నటించిన నవరస భరిత చిత్రం అతి త్వరలో హృదయస్పందనల టాకీస్ లో విడుదల కాబోతుంది. 

ఆనెక్కు టికెట్టు దొరకలేదని బాధపడక్కరలేకుండా  ఉల్లిగడ్డ నంజుకొంటూ సద్దికూడు పొట్టనిండా తిని గతుకుల రోడ్లను లెక్కచేయకుండా ఎఱ్ఱబస్సులో మా యీ టాకీస్ కి వచ్చి ఇప్పుడే ఓ తుండుగుడ్డ, కండవ, పైపంచె సీట్లో వేసుకొని టిక్కెట్టు రిజర్వు చేసుకోండి. 


ఇప్పుడు సినిమా ట్రైలర్ అన్నమాట.....


టాయ్..టట్టడాయ్..ట్టాయ్య్...ట్టట్టడ్డాయ్య్...

శృంగార వీరరసముల నుఱ్ఱుత లూగిస్తూ  ఆశల సౌధంలో విహరింపచేసే చిత్రం
అందాలు ఆరబోసి రంభామేనక తిలోత్తమలకు సైతం చెమటలు పట్టించే చిత్రం
ఆంగిక ,వాచక, ఆహార్య, సాత్వికాభినయనంలో కళ్ళుచెదిరి గుడ్డి వాళ్ళను చేసే చిత్రం :))

హమ్మయ్య ట్రైలర్ సూపర్ గా వ్రాశాను కాబట్టి సినిమా ఓపనింగ్స్ బాగా వుంటాయి లెండి :)))


ఇంతకీ ఈ పోస్టు ఇప్పుడెందుకు వ్రాయల్సొచ్చింది? ఏకంగా మొత్తం వ్యాసమొక్కసారే రాయొచ్చుకదా !!! వచ్చిందా మీకా అనుమానం? అబ్బే అదేమీలేదండీ ఇదో ఐడెంటిటీ క్రైసిస్.

24, మార్చి 2013, ఆదివారం

మనమెంత భద్రం ? ఈ యుగంలో భారత యుద్ధంలో లా కత్తులు కటార్లు అక్కరలేదు.

If anyone is close to any telugu news paper, you may share this post with them.

మన వార్తా పత్రికలకు  IT డిపార్ట్ మెంట్ అంటూ ఒకటి వుంటుందో లేదో నాకు తెలియదు. ఒకవేళ వున్నా వారి జీతభత్యాలు ఎంత వుంటాయో తెలియదు. జీతాలు పెద్దగా లేకపోతే పనిచేసే సామర్థ్యత ఎంత వుంటుందో  కూడా చెప్పడం కష్టమే. ఇదంతా ఇప్పుడు ఎందుకు వ్రాయాల్సి వస్తుందంటే గత నాలుగు రోజులుగా నాకు చేతనైనంత గొడవచేస్తున్నా తాత్కాలికంగా తప్ప  పరిపూర్ణమైన  ఫలితం కనపడలేదు. పాఠకుల భద్రత ఇప్పటికీ  గాలిలోనే.  ఇవి కూడా  Third party వారి సర్వర్స్ లో నడుస్తున్నాయా అనుమానం కూడా వస్తుంది.

ఇక ఈ వైరస్ గురించి చెప్పాలంటే ఇవి ఉడతలు, మండ్రగబ్బలూ, పసిరిక పాములూనూ !! అవును :-))). మీమీ నిరాధారమైన గాలి వార్తలను ఊహలను ఆపి కాసేపు క్రింది పేరా కూడా చదవండి.


నిజానికి ఈ వార్తాపత్రికల సర్వర్ లకు పట్టిన వైరస్  " Linux rootkit Virus " లాంటిది.. rootkit Virus అంటేనే మీరూ నేనూ వ్రాసేటటువంటి వైరస్ లు కాదు. వ్రాయలేమా అంటే వ్రాయగలమేమో కానీ చాలా సమయాన్ని, అంకిత భావాన్ని వినియోగించాల్సి వస్తుంది. ఇవి ఆపరేటింగ్ సిస్టమ్ మాడ్యూల్స్  లో code ని inject చెయ్యడం ద్వారా పనిచేస్తాయి. మన వార్తాపత్రికలకు పట్టిన వైరస్ ఇటువంటిదే. ఇంత సమయాన్ని వెచ్చించినవారు ఊరికే వుండరు కదా ! ప్రాధమిక సమాచారం ప్రకారం ఈ వైరస్ బ్యాంక్ లావాదేవీల కోసం శృష్టించబడింది. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమయ్యే వుంటుంది :))ఇది ప్లగిన్ ద్వారా వ్యాప్తి చెందినదంటున్నారు.
 
ఈ క్రింది బొమ్మలో వివరాలను చూడవచ్చు.


అదనపు  వివరాల కోసం ఈ క్రింది వ్యాసాన్ని చదువవచ్చు.

http://arstechnica.com/security/2012/12/apache-plugin-turns-legit-sites-into-bank-attack-platforms/

23, మార్చి 2013, శనివారం

I Frame Virus దొంగ ఎవరు? పత్రికలవాళ్ళు పట్టుకొని సమాజానికి మేలు చేస్తారా?

ఏదో కూసిన్ని కామెంట్లు వస్తాయని ఈ టపా ఏస్తున్నానన్నమాట. :))

IFrame virus అనగానే కొద్దిమందికైనా ఏవో ఏవో అవిడియాలు ఇప్పటికే వచ్చేసుంటాయి. రాకపోయినా పర్లేదు. ఆ పత్రికల చాటున మాటేసి దొంగను పట్టేసుకుంటే ఇక్కడ కామెంటేసుకోండి.ఏదో తెలుసుకుందామన్న తాపెత్రెయం.అబ్బా రెండురోజులనుంచి అసలు కలా పోసన లేక మనసేదోలా ఐపోయింది. కాసేపీ పద్యాన్ని ఎంజాయ్ చెయ్యండి.పద్యంలో క్లూలు గట్రాలు ఏమీ వెతక్కండి. ఇది కేవలం మానసికానందం కోసమే.

ఒడలికీయమ యమృతంపు జడిసుఖంబు
కన్నులకు పచ్చకపురపు గణికతునక
యెదకు నెమ్మేను; కోర్కెల కెల్లయగుచుఁ
గట్టెదుర జీవితేశ్వరి కానవచ్చె.


22, మార్చి 2013, శుక్రవారం

వైరస్ ల అడ్డా....తెలుగు వార్తాపత్రికలు

మొన్న ఒక post వ్రాసిన తరువాత దీని గూర్చిరెండు రోజులుగా అలికిడి లేని ఈ వైరస్ లు తిరిగి కొద్దిగా రూటు మార్చి మళ్ళీ ప్రత్యక్షం.
కచ్చితంగా చెప్పాలంటే ఇవి I Frame ల ద్వారా వ్యాప్తి చెందే Virus లు. Severity: High Virus లు.

వార్తాపత్రికల వారి సహకారం వీరికి లేకపోతే బహుశా ఈ వైరస్ లు ఏ I Frame ద్వారా వ్యాప్తి చెందుతున్నాయో తెలుసుకోవటం పత్రికల వారికి పెద్ద కష్టం కాబోదు కాబట్టి ఈతడు త్వరలో ఊచలు లెక్కపెట్టవచ్చు.


"జ్యోతి" వెలుగుతుందో లేదో "సాక్షం" చెప్పమని గ్రుడ్డివాడిని అడిగారంట వెనకటికెవడో. అలాగే పాఠకులు అమాయకంగా వున్నంత కాలం వీళ్ళ ఆటలు సాగుతూనే వుంటాయి.

పాఠక మహాశయులారా  అదండీ విషయం. ఇక విజ్ఞత గల పాఠకులకు, వార్తాపత్రికలకు నిర్ణయాన్ని వదిలివేయడమైనది

20, మార్చి 2013, బుధవారం

రాయలా రాయ లా రాయాలా రాయాలా?

రాయాలా రాయాలా    ( వ్రాయాలనా అనే అర్థం లో )
రాయలా రాయలా?     ( ఇంకా వ్రాయలేదు)

రాయాలా రాయాలా     ( వ్రాయాలనా అనే అర్థం లో )
రాయాలా? రాయలా!     ( ఇంకా రాయలేదు )

రాయాలా రాయాలా?
రాయ లా  రాయలా?      ( దేవరాయ లోని రాయ వ్రాసినట్టు రాయాలా? )

రాయలా రాయలా?     ( దేవరాయలు లోని రాయలు )
రాయాలా రాయాలా?     (  నేను వ్రాయాలనా?)

రాయ లా రాయ లా
రాయాలా రాయాలా? ( దేవరాయలు లోని రాయ. రాయా, నేను వ్రాయాల్నా? )హమ్మయ్య  రాయాలా? రాయాలా అన్న మోజు రాయల తో తీరింది.

19, మార్చి 2013, మంగళవారం

పల్లెటూరి స్త్రీ మనస్తత్వము.

బహుశా ఈ వివరణ ఇప్పుడు సమంజసముగా తోచదేమో కానీ ఓ ఇరవై ముఫ్ఫై ఏళ్ళ వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఆ రోజుల్లో అని సినిమాల్లో లా ఫ్లాష్ బేక్ లోకి వెళ్ళిపోయి చదివితే ఈ పుస్తకము అచ్చం మన ఊరి పరిశరాల్లో నివసించిన మనుషుల మనస్తత్వాలను ఒడిసి పట్టి ఈ సిద్ధాంత పుస్తకాన్ని రచయిత వ్రాసినాడని చెప్పవచ్చు. నేటి కాలంలో పట్టణ, పల్లె జీవితాల మధ్య వ్యత్యాసం తగ్గిన కారణంతో పల్లెటూరి వారి మనస్తత్వాలలో వచ్చిన మార్పులు వల్ల ఈ తరం వారికి ఇది క్రొత్తగా వుండే సూచనలున్నాయి.

ఈ పుస్తకం (పల్లె పదాలలో ప్రజా జీవనం - రచయిత డాక్టర్ యెల్దండ రఘుమారెడ్డి )   నుంచి జానపద స్త్రీ మనస్తత్వం గూర్చి రచయిత తెలిపిన అభిప్రాయాలు ఇక్కడ.18, మార్చి 2013, సోమవారం

తెలుగు వార్తా పత్రికల మాయాజాలం... పాఠకులారా జర భద్రం

ఈ మధ్య కొన్ని వారాలుగా *కొన్ని* తెలుగు వార్తా పత్రికలను చదువుదామని  వాటికి వెళతానా! దొంగతనంగా నా కంప్యూటర్ లోకి Fake Anti Virus software ని Install చెయ్యాలని ప్రయత్నించడమో లేదా వెబ్ సైట్ లో వున్న ప్లగిన్ సాఫ్ట్వేర్ల ద్వారా system లోని Data ని Read చెయ్యాలని ప్రయత్నించడమో జరుగుతుంది. పాఠకలోకానికి ఎలాంటి అనుమానాలు రాకుండా వీటిని రోజూ అన్ని వేళలా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే Activate చేస్తున్నట్లుగా అనుమానించవలసి వస్తుంది. మీ సైట్లకు అభిమానంతో  చదవడానికి వచ్చే పాఠకుల ఆదరణను ఇలాంటి టెక్నిక్ ల ద్వారా పాడుచేసుకోవద్దు.

ఆ ఇవి ఎవడికి తెలుస్తాయిలే అనుకోవడం మన పొరపాటు. లోకంలో మనమెంత తెలివిగల వారమైనా మనకన్నా ఓ మెట్టు ఎక్కువ తెలిసినవారు ఎక్కడో ఒకచోట ఎల్లవేళలా వుంటారని గుర్తుంచుకుంటే మంచిది.  మీలాంటి వార్తా సంస్థలకు నమ్మకం ఎంత ముఖ్యమో మాలాంటి సాధారణ పాఠకులు చెప్పవలసిన పనిలేదు. These Techniques are very easy to Identify if some one tracks the network traffic or using antivirus softwares. People can easily instrument such attacks using javascript. So, let readres sustain faith in your respective news papers.


నీటి చుక్క సైతం ....క్రొత్త నీటిలో చిన్న చిన్నగా కలుస్తుంది

కళ్ళుండి చూడలేని అద్భుతాలెన్నో..అలాంటి వాటిల్లో ఇదొకటి


16, మార్చి 2013, శనివారం

మా ఆవిడ vs మా ఆయన ?

చాలారోజులనుంచి రాయాలకున్న టపా యిది. లోకంలో ఈ రెండు పదాలు ఎలా మొదలయ్యాయో కానీ విన్నప్పుడల్లా భలే ఆశ్చర్యంగా వుంటుంది. విపరీతార్థాలు తీస్తున్నానని కాదు కానీ, నిజంగానే  పూర్వకాలంలో, అంటే బహుభార్యాత్వం వున్నప్పుడు ఆడవారు "మా ఆయన" అని అన్నారంటే అర్థముండేదేమో! ఆరోజుల్లో ఇద్దరు ముగ్గురకు కలిపి ఒకడే మొగుడు కాబట్టి "మా ఆయన" అని చెప్పుకునే వాళ్ళేమో ! కానీ ఇప్పుడు? ఏంచక్కగా "నా మొగుడు" అని చెప్పుకోకుండా "మా ఆయన", లేదా "మావారు" ( నవారు ) అన్నప్పుడల్లా ఈ సందేహం దేహమంతా వ్యాపించేస్తుంది.

సంస్కార వంతులకు "నా మొగుడు" అని అనాలంటే సంస్కార హీనంగా పల్లేటూరి వాళ్ళలాగా వుంటుందేమో? కానీ ఆలోచిస్తే నిజానికి "మా ఆయన" అనే దానికన్నా "నా మొగుడు" అన్నదే సంస్కారము కదా.

అట్లాగే మగవాళ్ళు కూడా "నా పెళ్ళాం" అని బుద్ధిగా చెప్పుకోవచ్చు కదా. అబ్బే " మా ఆవిడ" అనాల్సిందే... మరీ ఎక్కువగా వ్రాస్తే బాగోదు కానీ "ఎంతమందికి ఈవిడ ఆవిడ"? దీనర్థం అనే వాళ్ళందరూ ఇలా లాగి పీకి అర్థాలు పట్టించుకోని అంటారని కాదు. ఇవికూడా ఊతపదాల లెక్క గౌరవసూచకంగా "ఆయన" కు "ఆవిడ" కు ముందు "మా" చేర్చి మాట్లాడతారేమో కానీ మా తీసి "నా" తో కలిపి మొగుడు పెళ్ళాలని చూడండి. "మీ" ఆయన "మీ" ఆవిడ కంటే ఎంతో హాయి.

12, మార్చి 2013, మంగళవారం

హంపీ యాత్ర - విజయనగర నిర్మాత (సమాచారము) - ౨

 విజయనగర పట్టణ వర్ణనము - దాని నిర్మాతలు. ఈ పేజీలు విజయనగర చరిత్రము పుస్తకము నుండి ( గ్రంధకర్త - నూతలపాటి పేరరాజు )


11, మార్చి 2013, సోమవారం

ఋతు లక్షణాలు ....వర్షాకాలం...సేదదీరే సమయం
పూర్వమంటే దేశంలో ఇప్పటి కాంక్రీట్ జనారణ్యాల స్థానంలో వనములు విరివిగా  వుండేవేమో.  ఆనాటి కవులకు అడవిలో చెట్లు, జంతువులు ఏఏ  మాసాలలో ఏఏ ఋతువులు వచ్చేవి, ఏ ఋతువులో లోకం ఏరకంగా వుంటుంది అన్నవి పరీశీలించి ఆలాంటి వర్ణనలు కావ్యాల్లో చేసేవారు. కానీ ఈ రోజుల్లో ఏఏనెలలు ఏ ఋతువుకు సంబంధించినవో తెలియవు. ఒకవేళ తెలిసినా ఆ ఋతువుయొక్క గుణగణాలు కనిపించవు.  అందుకేనేమో ఈ నాటి రచనల్లో ఋతువుతో అనుసంధానించి వ్రాసిన పాటలు కానీ, పద్యాలు కానీ కనిపించడంలేదు.  ఈ గొడవేదీ లేకుండా గాలి,పూలు, మనసు ఇలాంటి వాటిని పట్టేసుకుంటే సరి. ఏ కాలంతో పెద్దగా పని వుండదు.

ఎప్పుడైనా ఒక రిఫరెన్సు క్రిందన్నా పనికొస్తుందేమోనని కావ్యాలంకార సంగ్రహం ( రామరాజ భూషణుడు ) పుస్తకం నుంచి ఈ క్రింది వ్యాసం.


౧) వర్షర్తువు

శ్రావణ భాద్రపద మాసములు వర్ష ఋతువు. ఈ ఋతువున అందుగు, వరి, పుట్టగొడుగు, అడవి మొల్లలు, తఱిగొఱ్ఱ, గిరిమల్లిక, కడిమి, మద్ది, ఏఱుమద్ది, మొగలి మొదలగు చెట్లు పుష్పించును. ఆర్ట్రపురుగులు, వెన్నెల పులుగులు, చాతకములు, లేళ్ళు, గోదురుకప్పలు, నెమిళ్ళు, నీరుకాకులు, గ్రద్దలు మొదలైనవాటికి క్రొవ్వుపట్టి బలుస్తాయి. బలాకా పక్షులు ( బెగ్గురు పిట్టలు ) గర్భమును ధరించును. రజస్సు ( ధూళి ) శమించును. రాజులు యాత్రలనుండి నివర్తిల్లుదురు. వనభూములు శ్యామలమై వుండును. జలాసారములవలన పర్వతములు కడగబడినట్లుగా రమ్యముగా నుండును.నదులు వొడ్డులొరసి ప్రవహించుచు నొక్కక్కచోట గట్లు తెగి లోకోపద్రవము కలిగించును.యతులును, చారులును తిరిగి వత్తురు. ప్రోషిత భర్తృకలు భర్తలకై దారులు చూచుచుందురు. పాంథులు గృహములకు మఱలుదురు. మేఘబృందముచే ఆకాశము చీకట్లు క్రమ్మును. దిఙ్మఖముల మెఱుగు తీగలు పరుగిడుచుండును. మేఘ గర్జనలచే వైడూర్యభూములందు రత్నాంకురములు పొటమరించును. కామినీ కాముకులుద్యానయాత్రను చేయుదురు. సౌధోపరి భాగముల శయ్యలు కల్పింతురు. కస్తూరీ మిశ్రమగు చతుస్సమ విలేపనమును ( చందన, కుంకుమ, కర్పూర, అగరు మిశ్రితమగు మైపూత ) పూసికొందురు. కృక్షీవల కుటుంబినీ బృందములు రాసక్రీడలాడుదురు. కడిమి పూల వాసనగల పడమటి గాలి గానీ తూరుపు గాలి గానీ వీచును.


ఇప్పుడు ఆ పైన పేరా వ్రాసిన తరువాత బోలెడు సందేహాలు. ఇందులో నాకెన్ని తెలుసునని?

" ఈ ఋతువున అందుగు, వరి, పుట్టగొడుగు, అడవి మొల్లలు, తఱిగొఱ్ఱ, గిరిమల్లిక, కడిమి, మద్ది, ఏఱుమద్ది, మొగలి మొదలగు చెట్లు పుష్పించును"

ఇందులో వరి, పుట్టగొడుగు, మద్ది, ఏఱుమద్ది, మొగలి చెట్లు చూసినాను. అందుగు పూలు కూడా చూసిన గుర్తు. కానీ మద్ది కి ఏఱుమద్దికి తేడా ఏమిటో తెలియదు.


ఇకపోతే వరి వర్షాధార పంటగా ఇప్పుడు ఎవరూ పండిచటం లేదనుకుంటాను. కాలువ నీటిద్వారా ఈ పంటను సంవత్సరానికి రెండుగార్లు పండిస్తున్నారు.

"ఆర్ట్రపురుగులు, వెన్నెల పులుగులు, చాతకములు, లేళ్ళు, గోదురుకప్పలు, నెమిళ్ళు, నీరుకాకులు, గ్రద్దలు మొదలైనవాటికి క్రొవ్వుపట్టి బలుస్తాయి"

పైవాటిలో చాతకము( వానకోయిల ), లేళ్ళు, గోదురుకప్పలు, నెమలి, నీరుకాకి, గ్రద్దలను చూసినాను. ఆర్ట్రపురుగులు, వెన్నెల పులుగులు తెలియవు. అన్నట్లు ఈ మధ్య ఊరికి వెళ్ళినా కప్పల బెకబెకలు వినపడటం లేదు ఎందుకనో?

"బలాకా పక్షులు ( బెగ్గురు పిట్టలు ) గర్భమును ధరించును". ఇదేమిటో ఎప్పుడూ వినలేదు.

"రజస్సు ( ధూళి ) శమించును. రాజులు యాత్రలనుండి నివర్తిల్లుదురు. వనభూములు శ్యామలమై వుండును. జలాసారములవలన పర్వతములు కడగబడినట్లుగా రమ్యముగా నుండును.నదులు వొడ్డులొరసి ప్రవహించుచు నొక్కక్కచోట గట్లు తెగి లోకోపద్రవము కలిగించును.యతులును, చారులును తిరిగి వత్తురు."

పై వాక్యము అవగతమే కదా! వర్షము పడితే గాలిలో దుమ్ము పెద్దగా వుండదు. అదీ ఆకాలంలో మోటారు వాహనాలు లేవు కాబట్టి వాతావరణం నిర్మలంగా వుండేదేమో. ఇక రాజులకు ఎక్కడికక్కడ ఏర్లు పొంగి ప్రవహిస్తుంటే వాటిని దాటడం కష్టం కాబట్టి ఈ కాలంలో దండయాత్రలుండవు. దండయాత్రలుండనప్పుడు చారులకు పెద్ద పని వుండదేమో! లేకపోతే అప్పటికే సమాచారాన్ని సేకరించి రాజధానికి తిరిగి వస్తారేమో. సన్యాసులు ఎందుకు తిరిగివస్తారు? తిరిగిరావడానికి వీళ్ళకు ఇల్లెక్కడ? ఏమోలే అప్పట్లో చారులు, సన్యాసుల రూపంలో సంచరించేవాళ్ళేమో.

"ప్రోషిత భర్తృకలు భర్తలకై దారులు చూచుచుందురు"

సంసారాన్ని సాగదీయడానికి ఆరోజుల్లో వున్న ఊరు వదిలి దేశాటనము వెళ్ళినవాళ్ళ ఇల్లాండ్ల కు ఎదురుచూపులే కదా ! వర్షాకాలంలో ఆ రోజుల్లో పని వుండేది కాదేమో. అందుకే భార్యలు తమ భర్తలకోసం ఎదురు చూపులు. ప్చ్..ఆరోజుల్లో వాళ్ళకు కనీసం వర్షాకలం రెండునెలలన్నా సెలవులు. మరిప్పుడో? అసలు సాఫ్టీ లైతే ఎప్పుడింటికి వస్తారో తెలియదు కాబట్టి పెళ్ళైన రెండు మూడు నెలల్లోనే ఇంటావిడ అలవాటు పడిపోద్దనుకోండి :)

 "పాంథులు గృహములకు మఱలుదురు"

మరి బాటసారులకు కూడా వర్షం బెడదే కదా !! సో వాళ్ళకూ ఈ వర్షాకాలంలో కాస్త ఉపశమనం.

"మేఘబృందముచే ఆకాశము చీకట్లు క్రమ్మును. దిఙ్మఖముల మెఱుగు తీగలు పరుగిడుచుండును. "

This is self explanatory and we do see these even today.


"మేఘ గర్జనలచే వైడూర్యభూములందు రత్నాంకురములు పొటమరించును"

ఇది మాత్రం సూపరు. అసలు ఈ వైడూర్య భూములెక్కడ వుంటాయో.. ఈ రత్నాలెలా పొటమరిస్తాయో !!! లేకపోతే ఇదేమన్నా జొన్న చేల గురించా?

"కామినీ కాముకులుద్యానయాత్రను చేయుదురు. సౌధోపరి భాగముల శయ్యలు కల్పింతురు. కస్తూరీ మిశ్రమగు చతుస్సమ విలేపనమును ( చందన, కుంకుమ, కర్పూర, అగరు మిశ్రితమగు మైపూత ) పూసికొందురు. కృక్షీవల కుటుంబినీ బృందములు రాసక్రీడలాడుదురు."

ప్చ్..ఇప్పుడా అదృష్టమెక్కడ? ఉద్యాన వనానికెళ్ళడం వరకూ ఓకే. మరి ప్రక్కలెక్కడెయ్యాలి :)? దానికి తోడు చతుస్సమ విలేపనలా? మరీ అత్యాస కదా?
అసలు ఉద్యానవనానికి వెళ్ళాలంటేనే ఒకరు టీవీ, మరొకరు కంప్యూటర్ విహారంలో బిజీ. ఎవరి వెర్చువల్ ఉద్యానవనం వారిదే. గది దాటి బయటకు రావడమే పేద్ద పని కాబట్టి ఈ రోజుల్లో ఉద్యానవనాలు నిషేధం. ఇక చతుస్సమ విలేపనాల స్థానాన్న్ని సబ్బులు ఆక్రమించాయనుకుంటా. ఇక "కృక్షీవల" అంటే అర్థమేమిటో తెలియదు. "కృషీవల" పొరపాటుగా "కృక్షీవల" గా టైపయిందో లేక ఆ పదమే వుందో?

" కడిమి పూల వాసనగల పడమటి గాలి గానీ తూరుపు గాలి గానీ వీచును"

Yes, I experienced it. ఇప్పుడుకూడా మాగాణి ప్రాంతాల్లో కాకుండా మెట్టప్రాంతాల్లో మీరు రాత్రులు ఆరు బయట పడుకుంటే ఈ అనుభవాన్ని ఆస్వాదించవచ్చు.


మరో రోజు మరో ఋతువు...

10, మార్చి 2013, ఆదివారం

విభూతి అంటే యేమిటి? విభూతి ఎప్పుడెప్పుడు ఎలా పెట్టుకోవాలి? ఈ విభూతి ఎన్నిరకాలు? దీని మహిమ ఏమిటి?

మహా శివరాత్రి సందర్భంగా ఓంకారనాద స్వరూపుడైన పరమేశ్వరుని స్మరిస్తూ ......

విభూతి అంటే యేమిటి? విభూతి ఎప్పుడెప్పుడు ఎలా పెట్టుకోవాలి? ఈ విభూతి ఎన్నిరకాలు? దీని మహిమ ఏమిటి ఇలాంటి పెక్కు ప్రశ్నలకు సమాధానమీ వ్యాసము. దీనిని "విభూతి తొలి పత్రిక" నుంచి తీసుకోవడం జరిగింది. ఈ పత్రిక 1939 ఫిబ్రవరి నెలలో విడుదలైంది. భారత జీవన వ్యవస్థలో పంచ భూతములు, గోవు యొక్క ప్రాముఖ్యత ఎంతగా వుండేదో తెలిపే వ్యాసమిది.


9, మార్చి 2013, శనివారం

పున్నమి నాటి జాబిల్లి

నిండు పున్నమి రాత్రులందు
నీదు దివ్వెల వెలుగులోన
కాంచితిని నేనొక కలువ కన్యను
కనుల నిండుగ మనసు నిండగ

అదేమి చిత్రమో మరుక్షణమే....

క్రమ్మివచ్చిన కారుమబ్బులలో
కాంతిరేఖలు మాయమయ్యెను
మోమున శిశిరాశ్రువలతో
నేల పడిన శేఫాలికము వలె


8, మార్చి 2013, శుక్రవారం

హంపీ ప్రాంతంలోనే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కారణమేమిటి ?

రోమన్ సామ్రాజ్యం గ్రీస్ లో ఎందుకు పెరిగి పెద్దదైంది? Pharaohs ఈజిప్ట్ లో పెరగడానికి కారణమేంటి? హంపీ ప్రాంతంలోనే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కారణమేమిటి?

గ్రీసు, ఈజిప్టుల సంగతి కాసేపు ప్రక్కన పెట్టి హంపీ గురించి ఆలోచిద్దాము. సామ్రాజ్యాల ఆవిర్భావం,అభివృద్ధి వాటి వ్యాప్తి సహజంగానే సహజవనరులు ఎక్కడ లభ్యమైతే అక్కడే మొదలౌతుంటాయి. ఈ సిద్ధాంతం ఎప్పుడో రామాయాణ మహాభారత కాలాలనుండి నేటి వరకూ నిజమైతూనే వస్తుంది. ఇక్కడ మనము కేవలం విజయనగర సామ్రాజ్యాన్ని దృష్టిలో వుంచుకుని చూస్తున్నాము కాబట్టి ఈ వ్యాసాన్ని ఆ రాజ్య పరిధికే లోబడి ఆలోచిద్దాము.

ఈ సామ్రాజ్య స్థాపన ఆనగొందిలోనే చేయడానికి ఓ జానపద కథ ప్రచారంలో వుంది. విద్యారణ్యుడు ఆ ప్రదేశంలో తిరగాడుతున్నప్పుడు  ఓ నక్క కుక్కను తరమడం చూసినాడట. అది చూసి ఇక్కడ రాజ్యస్థాపన చేస్తే బలవంతులను కూడా తరిమివేయగలిగే ధైర్యం ఈ పరిశరప్రాంత ఆహారము వల్ల లభిస్తుందని అక్కడ రాజ్యాన్ని స్థాపించినాడట. అలాగే రాజ్య శంఖు స్థాపన తాను చెప్పిన ముహూర్తానికంటే ముందుగానే పొరపాటున చేసినారనడానికీ మరో కథా ప్రచారంలో వుంది. దానిమూలంగా రెండువేల సంవత్సరాలు పదిలంగా వుండటానికి పెట్టిన ముహూర్తము కంటే ముందుగా శంఖుస్థాపన చేసినారు కాబట్టి ఆ రాజ్యం రెండు వందల సంవత్సరాలు మాత్రమే మన్నినది. ఈ నమ్మకాలు ఎలా వున్నా రాజధాని నగరాన్ని అక్కడే స్థాపించడానికి ముఖ్యమైన కారణాలు వేరు. ఈ రోజుల్లోనే కాదు ఆరోజుల్లో కూడా మానవులు రెండు వర్గాలనుకుంటాను.

౧) రాజ్యాంగము, రాజ్యాలను తమకోసం నిర్మించుకొని తమకనుకూలంగా సాహిత్యాన్ని, ధర్మ వచనాలను వ్రాసి, వ్రాయించి  ప్రచారం చేసే వారు.అలాగే ప్రజలను తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడానికి చెప్పే ఏ న్యాయాన్నీ వీరు పాటించరు. ఈ వర్గం సహజంగా దేనికీ భయపడరు. నిజానికి ఏ రాజైనా ఈ నియమాన్ని పాటించకపోతే ఎక్కువకాలం రాజ్యం చేయ్యలేడు. కాదు.... అసలు రాజే కాలేడు.

౨) ధర్మా ధర్మాలను వల్లె వేస్తూ భయం భయం గా బ్రతికే మనలాంటి సామాన్య జనులు.

అంటే పాపపుణ్యాలన్నీ మానవజాతిని సక్రమంగా నడపడానికే గానీ రాజులకు రాజ్యాలకు ఇవి వర్తించవు. ఏ మనిషీ వాటిని లెక్కచేయని నాడు మానవ సమాజం అంతమైపోతుంది. భారత యుద్ధంలో లాగా...కానీ తాను పెరిగిన వాతావరణాన్ని బట్టి ప్రతి మనిషీ నమ్మే సిద్ధాంతాలు కొన్ని వుండవచ్చు. ఆ సిద్ధాంతాలకు లోబడి నడుచుకుంటే జీవితంలో చరమాంక దశలో పశ్చాత్తాప పడడాన్ని తప్పించుకోవచ్చేమో !

పై రండు వాక్యాలు ఎంత కఠినంగా వున్నా, ఏ చరిత్ర తీసుకున్నా కనిపించేదంతే. నువ్వు రాజువు కావాలంటే ధర్మాధర్మాలను, నీతీ న్యాయాలను విడిచి పెట్టాల్సిందే. అంతగా కావాలంటే రాజువయ్యాక ప్రచారం చేసుకోవచ్చు. ప్రతి ఇతిహాసమూ దీనికి చక్కని ఉదాహరణే !!

సరే ఇక విషయంలోకి వస్తే ఆ నాటి విజయనగర సామ్రాజ్యాన్ని తీసుకున్నట్లైతే ముఖ్యంగా సామ్రాజ్య విస్తరణకు అక్కడి వనరులే మూల కారణం. 
కృష్ణదేవరాయల కాలములో నైతే విజయనగర సామ్రాజ్యం ఒరిస్సా నుండి శ్రీలంక వరకూ వ్యాప్తి చెందింది. హిందూ ధర్మ ప్రచారానికి ఏర్పడిన సామ్రాజ్యం సైనికావసరాల దృష్ట్యా  అరబ్బులతో గుఱ్ఱాల వ్యాపారాన్ని యధేచ్చగా సాగించింది. ఆ రోజుల్లో గుఱ్ఱాలు, మందుగుండు  ఎవరు సాధించగలరో వారిదే పైచేయి. నమ్మిన విజయనగర రాజులకు గుఱ్ఱాల తోకలను చూపించి కూడా ఎర్రచందనం, వజ్రాలు మొదలైన వాటిని అరబ్బులు గుంజారంటే ఆనాటి రాజులకు గుఱ్ఱాల అవసరమెంత వుండేదో తెలుస్తుంది. మోటారు వాహనాలొచ్చాక గుఱ్ఱాల ప్రాబల్యం తగ్గింది.

పోర్చుగీసు వాళ్ళు వ్యాపారనిమిత్తం భారతదేశానికొచ్చాక గుఱ్ఱాల వ్యాపారంలో అరబ్బుల హవా తగ్గింది. పోర్చుగీసు వర్తకుడు ఈ విధంగా ఓ ఉత్తరం వ్రాసాడంటేనే గుఱ్ఱాలకు ఆ నాడున్న విలువను తెలుసుకోవచ్చు.

Sewell  writes ...

Krishna Deva’s anxiety was to secure horses. …what he wanted (from them) was horses and again horses, for perpetual wars against Adil Shah. Albuquerque… declared that he would prefer to send cavalry mounts to him (Krishnadevaraya) rather to supply them to the Sultan of Bijapur...’ Sewell goes on ‘It appears that, in 1544 AD, Krishnadevaraya offered Albuquerque   exclusive right to trade in horses…’, which though he refused in the beginning agreed to later. Heras5 cites an anonymous letter of a traveller, written in Venice to ser Zuane di Santi, dated 10 November 1511, and kept in Biblioteca Magliabecchina of Florence, ‘the King Narasinga (Vijayanagara) has sent ambassadors … in order to establish a perpetual friendship with the king of Portugal… to establish alliance’. Heras goes on to write: ‘Krishnadevaraya proposed… his desire of getting horses … He (king of Vijayanagara) sent another Legation…. This friendship between both powers still subsisted in the year 1526’ Consequently horses became relatively cheaper for the Indian rulers.

To be contd....


వ్యాస భాగాలన్నీ రాయడం పూర్తయ్యాక అన్నీ భాగాలను కలిపి కుట్టి అప్పుడు రిఫరెన్సు పుస్తకాలనిస్తా.7, మార్చి 2013, గురువారం

హంపీ యాత్ర (సమాచారము) - 1

ఆ మధ్య భారతదేశానికి వెళ్ళేముందు "హంపి" పరిశరప్రాంతాలన్నీ తిరిగి చూసి ఓ డాక్యుమెంటరీ తీద్దామని పెట్టాబేడ సర్దుకోని వెళ్ళానా... కానీ వెళ్ళిన తరువాత హంపీ కి వెళ్ళడానికి సమయం సరిపోలేదు. ఇందులో కొత్తేముందిలెండి ఇక్కడనుంచి  చుట్టపు చూపుగా ఇండియా వెళ్ళినచాలా మందికి ఇలాంటి అనుభవాలే వుంటాయి. అలా నా ట్రిప్ ప్రిపరేషన్ లో భాగంగా హంపీ, దాని పరిశర ప్రాంతాల గూర్చి కొంత సమాచారాన్ని సేకరించాను. ఆ సమాచారాన్నంతా ఇక్కడ పెట్టేస్తే ఈ సారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడో వెతుక్కోకుండా సమాచారమంతా ఒకేచోట దొరుకుతుంది కదా. అందులో భాగంగా మొదటి వ్యాసమిది.

ఈ వ్యాసాన్ని ప్రాచీనాంధ్ర నగరములు - మొదటి భాగము ( రచయిత ఆదిరాజు వీరభధ్ర రావు ) గ్రంధంనుండి సేకరించడం / తస్కరించడం జరిగింది. ముందుగా ఆనగొంది సమాచారము.


4, మార్చి 2013, సోమవారం

నేను.... నా ప్రేమ.......రెండవ భాగం :)

అలా అడుగులో అడుగు వేసుకుంటూ హెడ్మాష్టర్ వెంట గదిలోపలికి అడుగుపెట్టాను. లోపలంతా పాత రికార్డులు భధ్రపరిచే గదిలో ఎలాంటి వాసన వస్తుందో అలాంటి వాసన. ఈ స్కూలు పెట్టి ఎన్ని సంవత్సరాలైవుంటుందో ఇన్ని రికార్డులా అని నోరెళ్ళ పెట్టుకొని చూస్తున్నాను. ప్రక్కనే అమ్మాయి.

హెడ్మాష్టర్, టేబుల్ పై వృత్తాకారంలో  వున్న చిన్న స్టీల్ బెల్ తలపై ఒక్కటిచ్చాడు. దాని దుంపదెగ అది ట్రింగ్...ట్రింగ్.....గ్....గ్...గ్ అని ఒకటే మోత. అది అలా మ్రోగు తుండగానే మరో అటెండర్ "పాచ్యో" వచ్చి సార్ అని ఎదురుగా నిలబడ్డాడు. ఒక "కాఫీ"  అని ఆర్డర్ వేసి కుర్చీలో వెనక్కి వాలి సర్దుకొని కూర్చొన్నాడు.

 ఈ పిల్లను నోడ్సు అడిగితేనే హెడ్మాష్టర్ తో ఇలా చెప్పాలా? బోడిది దీనికే గనక ఇంగ్లీషు వచ్చని తెగయిదైపోతుంది. ఈ సారి నా లెక్కల నోడ్సు అడిగితే అప్పుడుచెప్తా దీనిపని.

"మీ ఇద్దరూ మన స్కూలు పరువు నిలబెట్టారు రా !"

ఈనొకడు. ఏదో స్కూలు పరువు నావల్ల పోయినట్టు మాట్లాడుతుండడు. ఈన వల్ల పోదేమో !!! స్కూలుకు వచ్చేది మంగళవారం మధ్యాహ్నానికి. సరిగ్గా మూడురోజులుంటాడో లేదో శుక్రవారం మూడుగంటల బస్సుకు వెళ్ళిపోతాడు. ఈన ఊరికి పోగానే మా అయవార్లు భలే సంతోషంగా పండగచేసుకొంటారు కదా. వీళ్ళవల్ల పరువుపోదా?

హెడ్మాష్టర్ మాకు ఇంగ్లీషు క్లాసు తీసుకొనేవారు. వారానికి ఎన్ని ఇంగ్లీషు పీరియడ్లు వున్నాయో గుర్తులేదుకానీ మాకు క్లాసుకు మాత్రం ఒక్కరోజే వచ్చేవారు. వచ్చినరోజు గంటన్నర క్లాసు. హైస్కూల్ చరిత్రలో నాకు నచ్చని ఒక సబ్జెక్టు ఇంగ్లీషు. మరొకటి సోషల్. ఈరెండూ పోరంబోకు సబ్జెక్టులని నా అభిప్రాయం. పెద్దగా కారణాలంటూ ఏమీ లేవుకానీ, ఎంతచదివినా గుర్తుండి చావవు.  ఎంత చదివినా అన్నానని ఇప్పటి కార్పొరేట్ స్కూల్స్ చదువుతో పోల్చకండి. ఊర్లో జనాలు అరుగుమీద చేరి ఓ ప్రక్క  లోకాభిరామాయణం మాట్లాడుకుంటుండగా అతిచేరువులో ఓ పుస్తకాన్ని ముందేసుకొని ఏ ఒక్కమాటకూడా జారిపోకుండా ఓ చెవు అటువైపు వేసి చదివిన చదువులు మావి :)


"పాచ్యో" కాఫీ తీసుకొచ్చి హెడ్మాష్టర్ చేతికిచ్చి వెళ్ళిపోబోతుండగా " మరియమ్మ" ను పిలువు అని పాచ్యో కు  మరోఆర్డర్.

హెడ్మాష్టర్ నా వైపు తిరిగి "రేపు మీ నాయన్ని తోడకరారా" అని చెప్పిండు.
ఇంకేముంది నాకు బడితపూజ ఖాయమనే నిర్ణయానికొచ్చేసాను. ఆ పిల్లతోనేమో నేను మీయింటికొచ్చి మీ నాయనతో మాట్లాడతానని చెప్పిండు.

హెడ్మాష్టర్ ఎదురుగాలేకపోతే ఆ పిల్లకు ఆరోజు చింతపండు పులుసు పడుండేది. నోడ్సు అడిగినందుకే ఇంత పని చేసినందుకు.

ఇంతలో మరియమ్మ వచ్చి సారూ అని నిలబడ్డది. "మరియమ్మా...పోయినేడాది రికార్డులు తీసకరా" అని మరో ఆర్డర్. 

ఒరే మీరిద్దరూ పోయినేడాది వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సంపాయించినందుకు గానూ గవర్నమెంట్ మీకు 100 రూపాయల బహుమానాన్ని ప్రకటించింది. మీ కెలాగూ ఆడబ్బుతో పెద్ద అవసరముండదు. రేపు మీ నాయనలతో మాట్లాడి మన స్కూల్లో వున్న పేద విద్యార్థులకు ఆ డబ్బులు ఇద్దామనుకుంటుంన్నాను అని ఏదో చెప్తూ పోతున్నాడు మా ప్రధానోపాధ్యాయులు శ్రీ గాలిరెడ్డి...... నాచెవులు ఇంకేమీ వినే స్థితిలో లేవు.

మరియమ్మ రిజష్టర్ తీసుకొని వచ్చింది. ఇక్కడ సంతకాలు పెట్టండ్రా అన్న పిలుపుతో చెరొకొ పెన్ను తీసుకొని మెలికలు తిరిగిపోతూ, సంతకాలు పెడుతూ ......

కనులు కనులు కలిసాయంటే ప్రేమ అని దానర్థం... :-)..... మళ్ళీ మామూలే. ఎన్నైనా ఈ పిల్ల మంచిపిల్ల. అలా హైస్కూలు జీవితం దాటింది :))ఈ పోష్టు కు ప్రేరణ : పోయినవారమెప్పుడో టీచర్ల పోస్టుల భర్తీ అన్న ప్రకటన చూశాక నా స్కూలు టీచర్లు గుర్తుకువచ్చిన సందర్భంగా....

ఏమాటకామాటే ఈ టేబుల్ బెల్లు కొట్టంగానే అటెండర్ రావడం, స్కూల్ ప్రేయర్లో జరిగే తతంగం, అయవార్లు హెడ్మాష్టరంటే చూపే భయము ( గౌరవమా??? ), మధ్య మధ్యల్లో కాఫీలు, మంగళవారమొచ్చి శుక్రవారానికి వెళ్ళిపోవడం ఇవన్నీ చూసి పెద్దయ్యాక హైస్కూలు హెడ్మాష్టరు గా ఉద్యోగం చెయ్యాలని ఆరోజే అనుకున్నా :-). నాకోరిక ఇప్పటిదాకా తీరనేలేదు :(. అసలు తీరుద్దో లేదో.