M.Tech కెమికల్ ఇంజనీరింగ్ లో నా స్పెషలైజేషన్ పెట్రోలియం రిఫైనింగ్ అండ్ కెమికల్స్. రెండు సెమిస్టర్లయిపోయి మూడవసెమిస్టర్ ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలు జరిగేవి. అందులో భాగంగా రిలయన్స్ మా కాలేజీకి క్యాంపస్ ఇంటర్వ్యూ కు వచ్చింది. టెస్ట్ పెట్టారు. వ్రాశాను కానీ సెలక్ట్ కాలేదు. ఆ సందర్భంగా అప్పుడు నా డైరీ లో వ్రాసుకున్న ఆనాటి నా భావాలు :) ఇప్పుడు చదువుతుంటే నిజంగా ఆరోజుల్లో ఉద్యోగం కోసం ఎంత మధనపడ్డానో అని అనిపిస్తుంది :) . డైరీలో ఇంగ్లీష్ లో వున్నదాన్ని తెలుగులో వ్రాస్తున్నాను.
ఉద్యోగాలొచ్చేవాళ్ళందరూ నాకంటే మెరుగైన వాళ్ళా? కాదని కచ్చితంగా చెప్పగలను. మరి దేవుడెక్కడున్నాడు? అసలు నిజంగా వున్నాడా?లేక అదృష్టమే దేవుడా? మరప్పుడు పాపానికి పుణ్యానికి గీత ఎక్కడ? అదృష్టమనేది పుణ్యాత్ములనే వరిస్తుందనుకొంటే మరి నేనంత పాపాత్ముడనా? తప్పకుండా కాదు. మరప్పుడు నాకు ఉద్యోగమెందుకు రాలేదు? నా గతానుభావాల దృష్ట్యా నేనంత అదృష్టవంతుడిని కాదు. తప్పకుండా కాదు. కాబట్టి దేవుడు నావైపు లేడు. కాబట్టి నేను మరింతకష్టపడి ఈ అదృష్టవంతులనెదుర్కోవాలి. ఇది నేను చెయ్యగలనా? చెయ్యాలి.తప్పకుండా చెయ్యాలి.
ఇది నాచెతుల్లో వుందా? ఏమో? లేదు నాచేతుల్లో లేదు.ఈ లోకంలో నేనే దురదృష్టవంతుడినా?దేవుని దృష్టిలో అసలు నాకు స్థానమేలేదా?నేనంత నైపుణ్యములేని వాడనా?లేక మరేదైనానా?
నా జీవితమెటుపోతుంది? అసలు నేనెక్కడవున్నాను.నాకు సక్సస్ అనేది వస్తుందా? నా గమ్యాన్ని నేను చేరుకోగలనా? ఏమిటినాగమ్యం? నాకసలు గమ్యమంటూ వుందా? అసలు అందరిగురించి నాకెందుకు? వదిలేయి. నా గమ్యాన్ని చేరుకోవడానికి నేనేంచెయ్యాలి? అదేమైనా కానీ ఇప్పుడు సమయమాసన్నమైంది. ఏమి చేయాలో విశ్లేషించుకోవాలి.జాగ్రత్తగా గమనించాలి.లోతులకెళ్ళి ఆలోచించాలి. ఇప్పుడు నాముందున్న మార్గాలు రెండు
౧) నాపై చల్లని చూపు చూడమని దేవుని ప్రార్థించడం
౨) గమ్యం చేరడానికి పనిచెయ్యి..పనిచెయ్యి......పనిచెయ్యి
ఈ రెండింటిలో ఏది మంచిది? అసలు నావైపు లేని దేవుడిని ప్రార్థించడమెందుకు?
work.....work..............work
అదండీ సంగతి.అప్పటి డైరీని తిరగేస్తుంటే అనుకోకుండా కళ్ళబడి మోముపై చిరునవ్వు తెప్పించిన పేజీ ఇది. ఇది 1994 నవంబరు 9 వతేదీనాటి నా మనఃస్థితి :)
జిల్లెళ్ళపాడు ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా లోని ఒక కుగ్రామం. కనిగిరికి దరిదాపు 22 కి.మీ దూరంలో పట్టణవాతావరణం మచ్చుకైనా లేని గ్రామం. ఊరు రెండు భాగాలుగా విడిపోయి వుంటుంది. "పాతూరు", "కొత్తూరు" అని. పాతూరికి కొత్తూరికి మధ్యన కొంతపొలం వుంటుంది. నడిచి వెళితే ఓ పదినిమిషాలు పడుతుంది. పాతూరికి ఓ ప్రక్కగా మాల,మాదిగ పల్లెలుండేవి. అన్నింటిని కలిపి జిల్లెళ్ళపాడు అని అంటారు. అన్నీ కలిపినా కూడా ఊర్లో దరిదాపు వంద ఇళ్ళకు లోపే. ఈ ఊరు గ్రామ పంచాయితీ కూడా కాదు.ఊరికి రెండు కి.మీ దూరంలో నున్న గోకులం పంచాయితీలో భాగమీ ఊరు. ఊరి భౌగోళిక పరిస్థితులు తెలియడానికి ఈ క్రింది గూగుల్ ఎర్త్ మ్యాప్ సహాయ పడగలదు.
ఊర్లో రెడ్లెక్కువ. రెడ్లతోపాటి కోమటి,చాకలి,కంసాలి,గొల్ల,మాల,మాదిగ కులస్థులు వుండేవారు. ఊరికి బ్రాహ్మణుడు ప్రక్కఊరైన కంకణంపాటినుంచి వచ్చేవాడు.మంగలి కూడా కంకణంపాటివాడే. వంట కోసం కుండల కోసం మరో ప్రక్క ఊరైన గోకులం కు వెళ్ళి తెచ్చుకొనేవారు. ఊర్లో పొలాలన్నీ రెడ్ల అధీనంలో వుండేవి. పొలాల్లో పని చేయటానికి ఊర్లోనే వున్న మాల,మాదిగ,ముత్తరాచ కులస్థులు వచ్చేవారు. ఇక వ్యవసాయ పనిముట్లకోసం కొత్తూరులో ఎప్పుడూ కొలిమి వెలుగుతుండేది. కొంతకాలం కంసాలి మావూర్లోనే వుండేవాడు.అతను వలస వెళ్ళిపోవడంతో కంకణంపాటి నుంచి పాచ్యో అనే కంసాలి వచ్చి ఊరికి కావలసిన వ్యవసాయ పనిముట్లను తయారు చేసి ఇచ్చేవాడు.
ఊరు ప్రధానంగా వ్యవసాయాధారితం. పొలాలలో పండే పంటతోపాటి వ్యవసాయానికి అవసరమైన ఎద్దులు,దున్నలు రైతులకాధారం. వీటితోపాటి గొఱ్ఱెలు, కోళ్ళు కూడా పెంచేవారు. ఊర్లో చాలావరకు పూరిళ్ళు. మిద్దెలుగా పిలవబడేవి రెండో మూడో వుండేవి. ఊరికంతటికి ఒక్కటే దిగుడుబావి. ఊరినానుకొని పాలేరనే వాగు పారుతుండేది.ఊరికి బస్సు సౌకర్యంగాని, విద్యుత్ సౌకర్యంగాని లేవు. దగ్గరలోని పట్టణమైన కనిగిరికి వెళ్ళాలంటే ఊరికి రెండు కి.మీ.దూరం నడిచి వెళ్ళి బస్సెక్కాల్సిందే. ఆ బస్సులు కూడా ఉదయమొకటి సాయత్రమొకటి వుండేది.
మా ఊరు సస్యశ్యామలమని చెప్పను కానీ సంవత్సరానికొకపంట తప్పకపండేది. ఎక్కువగా రాగి,సజ్జ,జొన్న,ఆరిక,కంది,పిల్లిపిసర,ఆముదాలు మొదలైన పంటలు వేసేవారు.పాడి సమృద్ధిగా వుండేది.అప్పట్లో పాలకేంద్రాలు లేవు కాబట్టి ఊరి పాడినంతా ఊర్లోనే వుపయోగించేవారు. రైతులకు వినోదమంటే పిచ్చిగుంట వాళ్ళ బుఱ్ఱకథలు. ఊర్లోకి అప్పుడప్పుడు వచ్చి ఆడే తోలుబొమ్మలాటలు. చుట్టుప్రక్కల గ్రామాల వాళ్ళు కలిసాడె నాటకాలు మొదలైనవి. ఊర్లో చదువుకున్న కుటుంబాలను వేళ్ళమీదలెక్కపెట్టవచ్చు.
ఊర్లోని బఱ్ఱెలన్నింటిని కాయడానికి ఒక కుటుంబం వుండేది. ఇలా ఊరి బఱ్ఱెలన్నింటిని కలిపి జంగిడిగొడ్లు అనేవారు.ప్రొద్దున పదిగంటలకు తోలుకొని వెళ్ళి సాయంత్రం మూడు,నాలుగుగంటలకు తోలుకొని వచ్చేవారు. ఇప్పుడంటే రవాణా సాధనాలు పెరిగి ఊరికి ఊరికి మధ్య రాకపోకలెక్కువై బంధుత్వాలు దూరప్రాంతాల్లో కూడా ఏర్పడుతున్నాయి కానీ ఆరోజుల్లో పెళ్ళిళ్ళు చాలా వరకు ఊర్లోనో లేక ప్రక్కప్రక్క ఊర్లోనో జరుగుతుండేవి. ఈ కారణంగా ఊర్లోను,ప్రక్కఊళ్ళలోనూ అందరూ ఒకరికొకరు బంధువులే.
మనిషి మనిషిగా రూపాంతరం చెందినప్పటినుండి బ్రతుకు కోసం పోరాటంలో తెగలు తెగలు గా సంచరించుచూ ఆ తెగలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటు సాటి మనిషితో సంభాషిస్తూ తన మనసులోని భావాల్ని రకరకాల శబ్దాలతో తెలియచేస్తూ సహాయాన్ని పొందుతూ సహాయపడుతూ వేల ఏళ్ళుగా సాగే పరిణామ క్రమంలో కొన్ని వేల భాషలు ఏర్పడుంటాయి. జన బాహుళ్యం నుంచి పుట్టే ఏ భాషకైనా మొట్టమొదట లిఖిత రూపముండదు. అది జానపదమై చెప్పుకోదగ్గ పరిమాణంలో ఆ భాషను ప్రజలు మాట్లాడుతున్నప్పుడు రక రకాల అవసర రీత్యా దానికి లిఖిత రూపమివ్వబడుతుంది. దీనికి ప్రపంచంలో ఏభాషా అతీతంకాదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న తెలుగు కూడా వందల సంవత్సరాలుగా అనేక రూపాంతరాలు చెంది లిఖిత రూపాక్షరాలు ప్రింట్ మీడియా వృద్ధిలోనికి వచ్చినాక స్థిరపడ్డాయని చెప్పుకోవచ్చు. ఈ టపా ముఖ్యోద్దేశము తెలుగులో జరిగిన ఈ దశలను కొద్ది మాత్రంగా నైనా విశ్లేషించడమే.
తెలుగును ప్రజలు ఎప్పటినుండి ఏరూపంలో మాట్లాడేవారో చెప్పడం కష్టం. అసలు మూలద్రావిడ భాష నుండి తెలుగు రూపంగా ఎప్పుడు రూపాంతరం చెందిందో కూడా చెప్పడం కష్టం. మనకు లభిస్తున్న శాసనాలను బట్టి భట్టిప్రోలు, ఎఱ్ఱగుడి శాసనాలు తెలుగు దేశాల్లో లభిస్తున్న మొదటి శాసనాలుగా చెప్తారు. ఇది బ్రహ్మీ లిపి లో వున్న ఒక విధమైన ప్రాకృత మని చరిత్రకారులు చెప్తారు. ఇక లభిస్తున్న తెలుగు శాసనాల ప్రకారం లిఖిత రూపంగా తెలుగు క్రీ.శ 500 ప్రాంతానికి రాజభాషల్లో కూడా చేరిందని చెప్పవచ్చు. దీనర్థము అంతకు ముందు తెలుగు కు లిపి లేదా అని కాదు. వున్నది. కానీ రాజ శాసనాల వరకూ రాలేదు. కానీ నాటి మానవులు మాట్లాడుకొనే భాషారూపం ఎలా వుండేదో చెప్పడం కష్టం. అప్పటివరకు మనకు మనకు లభించిన శాసనాధారాల్లో అక్కడక్కడ తెలుగు పదాలు తప్పించి వాక్య రూపమైన తెలుగు లభించలేదు. వాక్యరూపమైన తెలుగు మొట్టమొదటగా ఆరవశతాబ్దిలో కడపమండలాల్లో ( కమలాపురం శాసనము ) కనిపించాయి. ఇది అప్పటివరకూ వున్న బ్రహ్మీ లిపినే కొద్ది మార్పులతో నున్న శాసనమట.
ఆనాటి శాసనాలలో తెలుగు లో అచ్చులు ఎనిమిది మాత్రమే కనిపించాయి.
అ, ఆ, ఇ, ఈ , ఉ, ఊ , ఎ, ఒ అనునవి మాత్రమే మొదట్లో వుండేవి. ఐ కి బదులు అయి, ఔ కు బదులు అవు అని వాడేవారు. అంటే లిఖితాక్షరాలు ఇంకా పూర్తిగా ఓ రూపు సంతరించుకోలేదు. క్రీ.శ 898 నాటికి "ఐ" అనే అక్షరం వచ్చి చేరింది. ( అనిమల శాసనము ). "ఔ" అన్న అక్షర ప్రయోగం కనిపించలేదు.
హల్లులలో వర్గాక్షరాల అల్పప్రాణములు ( ఒత్తులు లేనివి ), అనునాశికాలు ఙ,ఞ,ణ,న,మ లు విరివిగా వాడేవారు. య,ర, ఱ, ల,వ,శ,స,హ,ళ వర్ణములు వాడుకలో వుండేవి. వలపల గిలక కూడా విస్త్రుతంగా వాడేవారు. ఇది డెభ్భై వ దశకం వరకూ కూడా వాడేవారు. కానీ ఇప్పుడు వాడుకలో కనిపించడంలేదు.
వీటితో పాటు మరో రెండు వర్ణాలు నన్నయ్యకు ముందు వాడుకలో వుండేవి. అవి
" అడ్డు గీత లేని ఱ" అనే అక్షరాన్ని ఎలా పలికేవారో మనకు తెలియదు కానీ సందర్భాన్ని బట్టి ఈ అక్షరం నన్నయ కాలం నాటికి కొన్ని చోట్ల "ళ" గానూ మరికొన్ని చోట్ల "ద" గాను , ఇంకొన్ని చోట్ల "డ" గానూ రూపాంతరం చెంది అదృశ్యమై పోయింది.
ఉదాహరణలు ( కంప్యూటర్ లో ఈ అడ్డగీతలేని ఱ అక్షరం లేదు కనుక ఱ నే టైపు చేస్తున్నాను. మీరు దానిని అడ్డగీతలేని ఱ అక్షరంగా ఊహించుకొని చదువుకొన మనవి. అంటే ఈ అక్షరం సందర్భాన్ని బట్టి పలికేవారేమో!
చోఱ = చోడ లేక చోళ
నోఱంబ = నోళంబ
ఱెందులూరు = దెందులూరు
క్ఱిన్ద = క్రింద
క్ఱొచె = క్రొచ్చె
వ్ఱచె = వ్రచ్చె
ఈ పదాలను కంప్యూటర్ లో తెలుగించడం కష్టము గాబట్టి నేను చదువుతున్న పుస్తకములోని పేజీలను ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ పుస్తకము అంతర్జాలంలో ఉచితంగా దొరుకుతుంది. కావలసిన వారు డౌన్లోడ్ చేసుకొని చదవ వచ్చు.
పుస్తకము పేరు : తెలుగు శాసనాలు. 1975 వ సంవత్సరంలో ప్రంపచ తెలుగు మహాసభల ప్రచురణ
రచయిత : శ్రీ జి.పరబ్రహ్మ శాస్త్రి.