24, డిసెంబర్ 2017, ఆదివారం

మహా భారతకాలం నాటి పెండ్లీ కట్టుబాట్లు


భారతంలో కుంతీ,పాండురాజుల సంవాదం వలన మనకు ఆనాటి అనగా భారతకాలం నాటి సమాజ వ్యవస్థ, పెండ్లి అనే కట్టుబాటు, మాతృస్వామ్య వ్యవస్థ అప్పటి ప్రజల్లో వీటిపైన నెలకొన్న భావాలు స్థూలంగా అర్థమవుతాయి. పాండురాజు యుద్ధాలతో కురురాజ్యానికి దగ్గర దగ్గర రాజ్యాలన్నింటిని జయించి సామంతరాజులుగా చేసుకొని కప్పం కట్టించుకుంటూ ఇద్దరు భార్యలతో సంసారం చేసినప్పటికీ పిల్లలు కలుగరు. బహుశా ఆబాధతో వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి వుంటాడు. ఇక్కడ మనకు పాండురాజుకు మునిరూపంలో సంగమిస్తున్న జింకలను చంపటం వల్ల శాపగ్రస్థుడై వానప్రస్థానికి వెళ్ళాడని కథ ద్వారా తెలుస్తున్నా బహుశా పాండురాజు దగ్గర విషయం లేకపోవటం  వల్ల అతనికి పిల్లలు పుట్టకపోవడంవల్లనే దుఃఖంతో వానప్రస్థానికి వెళ్ళి వుంటాడు. నాటి సమాజంలో కొడుకును కనకపోతే అతనికి పితృ ఋణం తీర్చుకొనే అవకాశం లేనట్లు చెప్పబడింది. సంతానానికి అధిక ప్రాధాన్యతనీయబడింది.
భారతకాలం బహుశా మాతృస్వామ్య వ్యవస్థకు, పితృ స్వామ్య వ్యవస్థకు సంధికాలమై వుండవచ్చు. అనగా అంతకు పూర్వం పూర్తిగా మాతృస్వామ్య వ్యవస్థ నడచి దానిలోని లోపాల వలన సమాజం క్రమంగా పితృస్వామ్య వ్యవస్థవైపు మళ్ళింది. స్త్రీలు ఋతుమతులైన తరువాత పురుషునితో సంగమానికి కట్టుబాట్లు లేని కాలం. యధేచ్ఛగా వారిష్టమొచ్చిన వారితో గడిపిన కాలం. పురుషులు కూడా తమకు కొడుకులు కావాలనుకొన్నప్పుడు  స్త్రీ తో సంగమించడం కొడుకో కూతురో కలిగిన తరువాత యెవరి దారి వారు చూసుకుంటున్న కాలం. 

 అలాగే భారతకాలనికి పూర్వం, భారతకాలంలో  కన్యగా వుండి అనగా పెళ్ళి కాకుండా పిల్లలను కనడం కూడా దోషము కాలేదు. పెండ్లి అనే వ్యవస్థ పూర్తిగా స్థిరపడని కాలమది.క్రమంగా పితృస్వామ్యవ్యవస్థవైపు అడుగులేస్తున్నకాలం. పెండ్లిల్లు జరుగుతున్నప్పటికి పెండ్లికి ముందే కొడుకో కూతురో వున్నప్పటికీ భార్యగా చేసుకోవడంలో ఆనాటి సమాజానికి పెద్దగా పట్టింపులు లేవు. కానీ ఆ వ్యవస్థ భారతకాలంలో అంత్యదశలో వున్నదనుకోవచ్చు. అందుకే సత్యవతికి, కుంతీకి పెళ్ళికి ముందే పిల్లలు కలిగినప్పటికి  రాజులు పెళ్ళి చేసుకొన్నారు. నాటికాలంలో ఇప్పుడు మనము భారతదేశంగా పిలుచుకుంటున్న పేరు అస్తిత్వంలో లేదు.నాడు, నేడు మనం భారతదేశంగా పిలుచుకుంటున్న దేశం అనేక చిన్న చిన్న రాజ్యాల సమూహం. అందులో కురు దేశం ఒకటి. కురుదేశానికి ఉత్తర భాగంలో భారతకాలం నాటికి కూడా మాతృస్వామ్య వ్యవస్థే నడుస్తుండేది. కామమనేది జీవుల్లో సహజమైనప్పటికీ పిల్లలను కనటమనేది వాళ్ళొక పవిత్రమైన కార్యంగా భావించారు. బహుశా ఇలాంటి మాతృస్వామ్య వ్యవస్థ కురుదేశానికుత్తరంగా వుండటం మూలానే కావచ్చు పాండు రాజు భార్యలతో సహా వానప్రస్థాశ్రమం లో తిరుగుతూ అక్కడ స్థిరపడ్డాడు.

కథలో మనకు కుంతీ,పాండురాజులు పడిన అంతర్మధనం కనిపిస్తుంది. పిల్లలను కనటానికి సంగమమే మార్గమైనా ఆ సంగమానికి రకరకాలైన పద్ధతులనవలింభించారు. సమాజ పరిస్థితులను బట్టి ఆయా పద్ధతులు నాడు సమాజంలో వుండి వుండవచ్చు. కవిత్రయ భారతంలో మనకు పన్నెండు రకాలుగా పిల్లలను స్వీకరించవచ్చని చెప్పారు. ఈ పన్నెండు మంది

౧) వివిహం చేసుకొన్న భార్యయందు తనకు పుట్టిన వాడు ( ఔరసుడు)
౨) నియోగం చేత తనభార్య యందు ఇతరులకు పుట్టినవాడు ( క్షేత్రజడు)
౩) తనకు కుమారుడుగా ఇవ్వబడిన యితరుల కుమారుడు( దత్తకడు)
౪) అభిమానంతో కుమారునిగా పెంచుకొనబడినవాడు (కృత్రిమడు)
౫) తనభార్యయందు తనకు తెలియకుండా యితరుల వలన జన్మించినవాడు(గూఢడు)
౬) తల్లిదండ్రులచేత విడిచిపెట్టబడి తనదగ్గర చేరినవాడు (అపవిద్ధుడు)

పైన చెప్పబడిన ఆరుగురు పుత్త్రులు బంధువులే కాక, తమ ఆస్తిలో భాగానికి కూడా అర్హులు

౧) పెళ్ళికాకముందు తనభార్య కన్యగా వున్నప్పుడు పుట్టిన వాడు ( కానీనుడు)
౨) వివాహసమయానికే గర్భిణిగా వున్న తనభార్యకు వివాహం తరువాత పుట్టినవాడు ( సహోఢడు)
౩) తల్లిదండ్రులకు ధనమిచ్చి కొనబడినవాడు ( క్రీత )
౪) భర్తచే విడువబడిన స్త్రీకి లేదా విధవకు తనవలన కలిగిన కుమారుడు ( పౌనర్భవ)
౫) నీకు పుత్రుడనవుతానని తనంత తానొచ్చినవాడు ( స్వయందత్త)
౬) తనగోత్రం వాడు 

పైన చెప్పబడిన ఆరుగురు బంధువులౌతారు కానీ ఆస్తిలో వాటాకు అనర్హులు

అనగా నాటికాలంలో అంతకు కొంచెం పూర్వం పైన చెప్పిన పన్నెండు రకాలుగా కొడుకులు  లేని వారు కొడుకులగా స్వీకరిస్తుండవచ్చు.

ఇక పాండురాజు కుంతీల విషయానికొస్తే వాళ్ళ అంతర్మధన సంభాషణలలో కొడుకులను ఎన్ని రకాలుగా పొందవచ్చో అది అధర్మమెలా కాదో విపులంగా చర్చించుకుంటారు. యే ముని శాపం వల్ల స్త్రీలకు రతీ నియమాలు కట్టుబాట్లు వచ్చాయో చెప్పుకుంటారు. ఇక్కడ ముని శాపం అనుకొనే కంటే సమాజం పరిణామస్థితి చెంది కొన్నిచోట్ల అలా మరికొన్ని చోట్ల యింకా స్త్రీ యే మగవానితోనైనా సంగమించవచ్చనే నియమాలున్నట్లు కనపడుతాయి. తుదకు పాండు రాజు కుంతీకి చేతులెత్తి  భర్తచేత నియోగింపబడిన వాని (పరపురుషుని సంగమం) ద్వారా పుత్రులను కనమని నమస్కరిస్తాడు.

23, డిసెంబర్ 2017, శనివారం

గిరిక, సత్యవతుల అందాల వర్ణన. పరాశరుని గోకుడు :)

సందర్భం: చేది దేశ రాజైన ఉపరిచరమహారాజుకు ( వసువు )  శుక్తిమతీ నది కోలాహలం అనే పర్వతం వల్ల కలిగిన కొడుకూ,కూతురినీ యిస్తుంది.కూతురు పేరు గిరిక, కొడుకు పేరు వసుపదుడు. గిరికను ఉపరిచరమహారాజు పెండ్లి చేసుకొని వసుపదుని తనసేనాపతిగా చేసుకుంటాడు.కొంతకాలానికి గిరిక సమర్త అవుతుంది. అప్పుడామెకు మృగ మాంసం తెచ్చిపెట్టమని తల్లిదండ్రులు చెప్పటం వల్ల వసురాజు అడవికి వెళ్తాడు. ఈ సందర్భంలో గిరికను మనసులో తలచుకొనే సన్నివేశంలో సాగిన శృంగార వర్ణన యిది.

బహుశా ఆకాలంలో ఇలా రాజులకు భార్యలయ్యే వారి విషయంలో రాజుల విషయంలో వారి జన్మలకు యేవో ఇలాంటి అద్భుతాలనాపాదించారనుకోవాలి. ఇక్కడ గిరిక విషయంలోనూ, మత్స్యగంధి/యోజనగంధి ( సత్యవతి )  విషయంలోనూ యిలాంటి కథలే కనిపిస్తాయి. 

యిక ఈ పద్యాన్నాశ్వాదించండి. మూలనున్న ముసలోడు కూడా లేచి కూర్చుంటాడు :)

సీ||పలుకులముద్దును, గలికిక్రాల్గన్నుల తెలివును, వలుఁదచన్నుల బెడంగు
నలఘకాంచీపదస్థలములయొప్పును, లలితాననేందుమండలము రుచియు
నళినీలకుటిలకుంతలములకాంతియు, నెలజవ్వనంబున విలసనమును
నలసభావంబునఁ బొలుపును, మెలుపును, గలుగు నగ్గిరికను దలఁచి తలచి

ఆ.వె||ముదితయందుఁ దనదు హృదయంబు నిలుపుటఁ
జేసి రాగ మడర భాసురముగ
రమణతో వనాంతరమున రేతస్స్కంద
మయ్యె నవనిపతికి నెయ్య మొనర

తాత్పర్యం: ఆ గిరికముద్దుపలుకులను, మనోజ్ఞంగా చలించే కన్నులను, స్థూలమైన చన్నుల సోయగాన్ని, పిఱ్ఱల ఒప్పును, మృదువైన ముఖ చంద్రబింబ కాంతిని,తుమ్మెదలవలె నల్లగా రింగులు తిరిగిన శిరోజాల వన్నెనూ, లేతయౌవనంలో ప్రకాశాన్ని, అలస విలాసాల అందచందాలను  తలచుకొని తలచుకొని గిరికాలగ్నమనస్కుడై ఆ వనము మధ్యలో రేతస్ఖలన మైంది.


ఇలాంటి దే మరో పద్యం. కాకపోతే ఇది పరాశరుడు మత్స్యగంధిని గోకడానికి తయారయ్యే సందర్భంలోది. వ్యాసుని జననానికి కారణమైన పద్యము.

సీ|| చపలాక్షిచూపులచాడ్పున కెడ మెచ్చుఁ, జిక్కనిచనుగవఁ జీఱఁ గోరు
నన్నువకౌఁదీగ యందంబు మది నిల్పు, జఘనచక్రంబుపైఁ జలుపు దృష్టి
యభిలాష మేర్పడ నట్లుండగాఁ బల్కు, వేడ్కతో మఱుమాట వినగఁ దివురు
నతిఘనలజ్జావనత యగు నక్కన్య పైఁ బడి లజ్జయుఁ బాపఁ గడుఁగు

ఆ.వె|| నెంతశాంతు లయ్యు, నెంత జితేంద్రియు
లయ్యు గడువివక్త మయినచోట
సతులగోష్ఠిఁ జిత్తచలన మొందుదురెండుఁ 
గాము శక్తి నోర్వఁగలరె జనులు

తాత్పర్యం: పరాశరుడు మత్స్యగంధినేత్ర సౌందర్యాన్ని చూచి మనసులో మెచ్చుకున్నాడు. ఆమె చన్నులను గోళ్ళతో రక్కాలనుకొన్నాడు.ఆమె సన్నటి నడుము సొగసును మనస్సులో నిలుపుకున్నాడు. ఆమె జఘనప్రదేశమందే దృష్టి నిలుపుకొన్నాడు.తనకోరిక వెల్లడి అయ్యేటట్లుగా మాట్లాడాడు.ఆమె ప్రత్యుత్తరాన్ని వినేందుకు ఉవ్విళ్ళూరాడు. అతి సిగ్గుతో నున్న ఆ కన్యమీదపడి ఆమె సిగ్గును పోగొట్టడానికి ప్రయత్నించాడు.
ఎంతశాంతులైనా.ఎంతజితేంద్రియులైనా, ఏకాంతస్థలంలో స్త్రీలకూటమి తటస్థిస్తే చిత్తచాంచల్యానికి లోనవుతారు.మన్మథుని బలాన్ని ఓర్వగల జనులున్నారా?

అదన్నమాట నన్నయ గంటంనుంచి జాలువారిన శృంగార వర్ణన. చివరి ఆటవెలది పద్యంలో మన్మథ తాపాన్ని తట్టుకోవడం అంత ఈజీ కాదని కూడా తేల్చేసాడు.

22, డిసెంబర్ 2017, శుక్రవారం

పిచ్చాపాటి కబుర్లు కొన్ని.....

ఈ రోజుతో కవిత్రయ మహాభారతం టి.టి.డి వారు ప్రచురించిన పదిహేను పుస్తకాలలో మొదటి పుస్తకం చదవడం పూర్తయింది.అంటే ఆదిపర్వములోని మొదటి నాలుగు ఆశ్వాసాలను ప్రతిపదార్థంతో సహా చదివాను. మొదలు పెట్టి నప్పుడు ఇలాంటి తెలుగు చదివి దశాబ్దాలు దాటింది కాబట్టి వాక్యం చదవడానికి కూడా నోరు తిరగని పరిస్థితి. కూడబలుక్కొని చదవగా చదవగా అలావాటై నాల్గవ ఆశ్వాసానికొచ్చేటప్పటికి ప్రతిపదార్థం, తాత్పర్యం చూడకుండానే పద్యము చదివి షుమారు అర్థాన్ని గ్రహించ గలుగుతున్నాను :) ..శభాసో :)))

పద్యం ప్రతిపదార్థం తో చదవడం మూలంగా చదవడమాలస్యమైనా ఇలా ఒక కావ్యాన్ని / ఇతిహాసాన్ని పూర్తిగా చదవగల్గితే చాలామటుకు అర్థాలు తెలిసి వేరే కావ్యాలు చదవడం కూడా కొంత సులభమవుతుందనుకొంటాను. కానీ నాకు మొదటి సంపుటం దరిదాపు 450 పేజీలు చదవడానికి నెల రోజులు పట్టింది. అదీ గత పదిరోజులుగా సెలవులో వుండటం మూలానా రోజుకు సరాసరి మూడు నాలుగు గంటలు కేటాయించడం మూలానా తృతీయ,చతుర్థాశ్వాశాలు పదిరోజుల్లో పూర్తయ్యాయి కానీ మొదటి రెండు ఆశ్వాసాలు పూర్తి చెయ్యడానికి ఇరవై రోజులు పట్టింది.

చదువుతూ పద్యరసాన్ని గ్రోలుతూ నన్నయ్య కాలంనాటి తెలుగును రుచి చూస్తూ నాటి భాషావిభక్తులను పరికించుతూ మొత్తంగా భారతకథనాస్వాదిస్తూ ప్రయాణం సాగుతుంది. చదివేటప్పుడు ముందు ప్రతి ఆశ్వాసానికి నాదైన వివరణ వ్రాయాలనుకున్నాను కానీ దానికి సమయమెక్కువపడుతుండటం ఒక కారణమైతే మరో కారణం ప్రతి కథనూ విశ్లేషించాలంటే మరో మహాభారతమవుతుంది కదా :))

ఐనా అప్పుడప్పుడు కొన్ని విశేషాలను నోట్ చేసుకుంటూ వున్నాను. అందులో కొన్ని ఇక్కడ.

కుల పర్వతాలు ఏడు. అవి ౧) మహేంద్రం ౨) మలయం ౩)సహ్యం ౪)శుక్తిమంతం ౫)గంధమాదనం ౬) వింధ్యం ౭) పారియాత్రం

అష్ట సిద్ధులు ఎనిమిది అవి ౧) అణిమ  ౨) మహిమ ౩) గరిమ ౪) లఘిమ ౫) ప్రాప్తి ౬) ప్రాకామ్యం ౭) ఈశిత్వం  ౬) వశిత్వం

వేదాంగాలు ఆరు ౧) శిక్ష ౨) వ్యాకరణం ౩) ఛందస్సు ౪) నిరుక్తం ౫) జ్యోతిషం ౫) కల్పం

వ్యసనాలు ఏడు ౧) వెలది ౨) జూదం ౩) పానం ౪) వేట ౫) వాక్పారుష్యం ౬) దండపారుష్యం  ౭) సొమ్ము అనవసరంగా వ్యయం చేయటం

ఋత్విజులు పదహారు మంది  ౧) బ్రహ్మ ౨) ఉద్గాత ౩)హోత ౪) ప్రతిప్రస్థాత ౫) పోత ౬) ప్రతిహర్త ౭) అచ్చావాకుడు ౮) నేష్ట ౯) అగ్నీధ్రుడు ౧౦) సుబ్రహ్మణ్యుడు ౧౧) గ్రావస్తుతుడు ౧౨) ఉన్నేత ౧౩) అధ్వరుడు ౧౪) బ్రాహ్మణాచ్చంసి ౧౫) ప్రస్తోత ౧౬) మైత్రావరుణుడు

పంచాగ్నులు  దక్షిణాగ్ని, గార్హపత్యము , ఆహవనీయము, సభ్యము, అవసథ్యము అను నయిదు అగ్నులు

ఉంటానేం... కవిత్రయ భారతం నన్ను పిలుస్తుందక్కడ :)

14, డిసెంబర్ 2017, గురువారం

మహాభారత ఆదిపర్వము లోని ద్వితీయాశ్వాస కథా విశ్లేషణ

ఆదిపర్వం ద్వితీయాశ్వాసం చదివాక నాకొకటి అనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం వరకూ సామాన్య జనాల్లో ఈ నాడున్నట్టి హింశా ప్రవృత్తులు లేకుండా జీవించారంటే వారు రామాయణ భారతాది కథల్లోని సారాంశాన్ని గ్రహించి ఏది ధర్మమో ఏది అధర్మమో గుర్తించి నడుచుకోవడమే నాటి సమాజ విజయానికి కారణమనిపిస్తుంది. ఈ ఆశ్వాసంలో (నాటి) సమాజానికి ఉపయోగపడే నీతులను అంతర్గతంగా చెప్పేటువంటి కథలు మనకు తారసపడుతాయి. ఇందులో ౧) పాములు, అనూరుడు,గరుత్మంతుడి పుట్టుక ౨) సముద్ర మథనం ౩) ఏనుగు,తాబేలు కథ (గజ కచ్చపముల కథ)  ౪) గరుత్మంతుడు  స్వర్గానికెళ్ళి అమృతం తేవడం ౫) వాలఖిల్యుల కథ  ౬) జరత్కారుని కథ  ౭) పరీక్షుత్తు ఎలా చనిపోయాడనే కథ  ౮)సర్పయాగము ౯) ఆస్తీకుడు సర్పయాగాన్ని మాన్పించే కథ  లున్నాయి.

బహుశా భారతకాలంనాటికే  ఆనాటి పూర్వ కథలను అంటే కృత,త్రేతా యుగకాలపు కథలను చెప్పటంలో కొంత అతిశయోక్తి కనపడుతుంది. యెప్పటిలాగే నాటి చదువుకున్న సమాజం మునులు కాబట్టి వారి వారి ఆధిపత్యాలను నిలబెట్టుకోవడానికల్లిన కథలు వారే కేంద్రంగా మనకు కనిపిస్తాయి.కథల్లో కేంద్రబిందువు వారే యై వారికొరకు వాళ్ళు కొన్ని అతీంద్రయ శక్తులనాపాదించుకొన్నా కథా సారాంశానికొచ్చేటప్పటికి మంచిని ప్రోత్సహించడమే కనిపిస్తుంది. రాజుల వద్ద లేదా కార్యార్థము మనమెవ్వరిదగ్గరకైనా పనికి వెళ్ళినప్పుడాపనిని ఎలా సాధించుకోవాలో కూడా ఈ ఆశ్వాస చివరిలో ఆస్తీకుడు జనమేజయ సర్పయాగాన్ని మాన్పించడం ద్వారా తెలుస్తుంది.

శ్రమ చేయడంతోనే ఫలితం దక్కదని దానికి కావలసిన తెలివి కూడా అవసరమని సముద్రమథనం కథలో తెలుస్తుంది. ఇది కచ్చితంగా రాక్షసులకు దేవతలు చేసిన మోసమే.ఇక్కడ దేవతలకు రాక్షసులకు విభేధాలేమిటో మనకు స్పష్టంగా తెలియదు కానీ సముద్రాన్ని చిలికేటప్పుడు వాసుకి ని మంథర పర్వాతానికి కవ్వపు తాడుగా చేసుకొన్నప్పుడు రాక్షసులు పాము తలవైపు వుండేటట్లు,దేవతలు పాము తోక ను పట్టుకొని చిలుకుతారు. విషము తలవైపు వుంటుంది కాబట్టి పోతే రాక్షసులే పోతారు. అదే గాక ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపిన విష్ణువు (బ్రహ్మ కూడా ) సముద్రమథనంలో వచ్చిన యే ఒక్క దానిని కూడా రాక్షసులకు చెందకుండా అన్నీ దేవతలకే చెందేటట్లు చేస్తాడు.అమృతంతో సహా !. చివరికి విషయాన్ని గ్రహించిన రాక్షసులు యుద్ధంచేసి ఓడిపోతారు. ఈ కథలో నిజానికి రాక్షసులు దేవతలకు దక్కిన ప్రతిదానిలో అర్హులు, కానీ తగిన సమయస్ఫూర్తీ, సౌర్యము లేక పోవడం వల్ల కష్టపడినా ఫలితం దక్కదు. నేటికి కూడా ఇదే పరిస్థతి కదా !!

ఇక్కడ మనం మరో ముఖ్య విషయాన్ని గూర్చి చెప్పుకోవాలి. గరుడుడు అమృతం తేవడానికి స్వర్గానికెళుతూ నాకు బలం రావడంకోసం ఆహారాన్నిమ్మని తల్లియైన వినతను అడుగుతాడు. అప్పుడు వినత సముద్రగర్భంలో నున్న బోయవాళ్ళను (నిషాదులను) తినమని చెప్తూ బ్రాహ్మణులను మాత్రం తినొద్దని చెప్తుంది. బ్రాహ్మణులను ఎలా గుర్తించాలంటే ఎవడైతే గొంతులోనుండి క్రిందకు జారకుండా అగ్నివలె కాలుస్తాడో వాడిని బ్రాహ్మణుడని చెప్తుంది. ఇక్కడ బ్రాహ్మణులను చంపరాదని వారు ఉన్నతులని చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే గరుడుడు నిషాదులను తినేటప్పుడు ఒక బ్రాహ్మణుడు గరుడుని గొంతులోకి పోయి అడ్డుపడతాడు. ఇక్కడ కొంత సంవాదం జరిగిన తరువాత చివరికి బ్రాహ్మణుడు పెళ్ళి చేసుకోవడం ద్వారా  అపవిత్రు రాలైన బోయవనిత కూడా పవిత్రురాలైనట్టు చెప్పడం ద్వారా బ్రాహ్మణాధిక్యతను కథలో చొప్పించారు.

ఇక విష్ణువు సౌర్యపరాక్రమాలను గలవానిని గుర్తించి దగ్గరకు తీయటంలో నేర్పరని మనకు గరుత్మంతుడు అమృతం తేవడానికి స్వర్గానికి వెళ్ళిన సందర్భంలో కనిపిస్తుంది. అమృతానికి కాపలాగా వున్న దేవతలందరిని చిత్తు చేసి అమృతాన్ని తీసుకొని పోతుంటే విష్ణువు ప్రత్యక్షమై వరమివ్వడం లాంటి సన్నివేశాలు కార్యశూరులను గుర్తించి తనవైపు తిప్పుకోవడంలో నేర్పరితనం విష్ణువుకు ఎంతగానుందో తెలియచేస్తుంది. అలాగే ఓడిపోయిన ఇంద్రుడుకూడా శత్రువు బలవంతుడైనప్పుడు లొంగిపోయి అతనితో స్నేహాన్ని కోరుకోవడం ద్వారా మరింత నష్టాన్ని నివారించుకోగలుగుతాడు.

వినత, కద్రువ కథలో తల్లే తన మాట నెగ్గడంకోసం మోసం చేయమని చెప్పడం,తిరస్కరిస్తే శాపమివ్వటం పాములు ధర్మాధర్మాల మధ్య నలిగి పోవడం తుదకు శేషుడు నేను అధర్మాత్ముల దగ్గరుండనని వెళ్ళిపోవటం ద్వారా దుష్టులకు దూరంగా వుండమనే సారాంశాన్ని ఆ కథలో అంతరార్థం. అంతేకాకుండా వాసుకి తన ప్రమేయంలేకుండానే శాపానికి అర్హమై సర్పయాగంలో ప్రాణాలు కోల్పాతారని తెలిసినప్పుడు కుటుంబపెద్దగా బాధ్యత తీసుకొని దానికి పరిష్కారాన్ని కనుగొనడం ద్వారా తనకుటుంబాన్ని ఎలా రక్షించుకొన్నదో కూడా తెలుస్తుంది. 

వాలఖిల్యుల కథ ద్వారా మునులు లేదా నిర్బలులను చూసి వెటకారంచేస్తే యేమి జరుగుతుందో  గరుత్మంతుని ద్వారా ఇంద్రునకు తెలియచేసినట్లయింది. ఇక్కడ ప్రధానంగా ఇంద్రుని గర్వానికి ప్రతిగా వినత కడుపున కశ్యపునికి గరుత్మంతుడు పుట్టి స్వర్గాధిపతైన ఇంద్రుని గర్వాన్ని అణచడమనేది ప్రధానం.

జరత్కారుని కథ ద్వారా ఎంతటి తపస్సంపన్నులైనా  బిడ్డలు  లేకపోతే  ఉత్తమలోకాలు ప్రాప్తించవని చెప్పిస్తాడు. బహుశా ఆకాలంలో ఎంతమంది పుత్రులుంటే వారికి సమాజంలో అంత బలమేమో. 

పరీక్షుత్తు తక్షకుడి కాటుద్వారా చనిపోవటానికి కారణం తపస్సులో నున్న ముని మెడలో పామును అకారణంగా వేయటం.దానికి ఫలితము పరీక్షిత్తు చావు. ఇందులో నీతి విదితమే కదా.

ఇక చివరిగా జనమేజయుడు సర్పయాగాన్ని చేస్తున్నప్పుడు ఆస్తీకుడొచ్చి దానిని మాన్పించడానికి చేసిన ప్రయత్నం నిజంగా ప్రతిఒక్కరు భారతాన్ని చదివి ఆస్వాదించవలసిందే. ఇక్కడ మనకు అధికారమున్న వారి దగ్గర యెలా మాట్లాడాలో తెలుస్తుంది. సన్నివేశాన్ని మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో తెలుస్తుంది. 

10, డిసెంబర్ 2017, ఆదివారం

మహాభారతం ఆదిపర్వము - ప్రధమాశ్వాసము - నా కల్పనలు - 2

మొదటిభాగం -  https://chiruspandana.blogspot.com/2017/12/1.html

కుండలాలు తెచ్చిచ్చిన ఉదంకుని గురుదక్షిణ పూర్తయిందని చెప్పి పైలుడు ఉదంకుని తో " ఇక నీ చదువు పూర్తయింది నీకిష్టమైన చోటికెళ్ళి సుఖంగా జీవించమని" దీవించి పంపించి వేశాడు. ఉదంకుడు కూడా చాలాకాలం తపస్సు చేసి తనను కష్టపెట్టిన తక్షకుని పై ప్రతీకారం తీర్చుకోవడానికి జనమేజయ మహారాజు వద్దకెళ్తాడు. తపస్సు తపస్సే కోపతాపాలు కోపతాపాలే మరి :)

రాజు కాబట్టి జనమేజయుని కాసేపు పొగిడి తక్షకుడనేవాడు నా అంతటి మునికి కష్టం తెచ్చిపెట్టాడు కాబట్టి నువ్వెలాగైనా వాడి పని పట్టాలంటాడు. అంతే కాదు అసలు నీ తండ్రి పరీక్షుత్తు మరణానికి కారణమెవరనుకుంటున్నావు? ఈ తక్షకుడే !! అని ఇంకాస్త ఎక్కదోసి దానికి ప్రతీకారంగా సర్పయాగం చెయ్యమని పురికొల్పుతాడు. సర్పయాగం చేస్తే పాములన్నీ వచ్చి అగ్నిలో పడి చచ్చిపోతాయి. కులంలో ఒక్కడు చెడ్డవాడుంటే ఆకులమంతా చెడుతుంది గాబట్టి పాములన్నింటిని చంపెయ్యమని పుల్లపెడతాడు :)

ఈ కథ ఉగ్రశ్రవనుడు చెప్తుంటే వింటున్న  మునులకు ఒక డౌటొచ్చింది. అసలు ఈ పాములన్నీ అగ్నికాహుతవ్వడానికి కారణమేంటి అని ఉగ్రశ్రవనుని అడుగుతారు. మళ్ళీ ఇంకొక పిట్టకథ మొదలు.

పూర్వం పాముల తల్లయిన కద్రువ శాపమియ్యడం వలన పాములన్నీ అట్లాఅగ్నిలో పడ్డాయి ఆ కథ ఇప్పుడు చెప్తానని ఇట్లా చెప్పాడు.

పూర్వం భృగువు అనే బ్రాహ్మణుడుండేవాడు. ఆయన భార్య పులోమ. ఆమె కడుపోతో వున్నది. ఒకరోజు యాగం చేస్తూ ఏటికి స్నానానికని వెళ్తూ భార్యని అగ్నికార్యాన్ని చూడమని చెప్పి వెళ్తాడు. అప్పుడు పులోముడనే రాక్షసుడొచ్చి ఆమె అందానికి గులామై అగ్ని ని ఈమె ఎవరిభార్యని అడుగుతాడు. అగ్ని నిజం చెప్తే భృగువు శాపమిస్తాడని తెలిసినా "ఈమె భృగువు భార్య" అని చెప్తాడు. అప్పుడారాక్షసుడు ఈమె పూర్వం నాకోసం ఎన్నబడిన భార్య. తరువాత భృగువు పెండ్లి చేసుకొన్నాడని పందిరూపంతో పులోమని ఎత్తుకొని పరుగులంకించుకొన్నాడు. అలా పరిగెత్తుతుంటే పులోమ పొట్టలో వున్న బిడ్డకు కోపమొచ్చి పొట్టలోనుంచి జారిపడి పులోముడిని భస్మం చేస్తాడు. గర్భంనుంచి జారి పడ్డాడుకనక ఆ బిడ్డ చ్యవనుడయ్యాడు. పులోమ చ్యవనునెత్తుకొని తిరిగి భృగువు దగ్గరకి వస్తుంది.

ఇక్కడ నాకనిపించేది యేమిటంటే పులోముడు, భృగువు భార్యను అపహరించుకోని పోతుంటే బిడ్డపుట్టాడు.వాడికి చ్యవనుడని పేరుపెట్టారు. కొంత కాలానికి వాడు చచ్చినాక పులోమ మళ్ళీ భృగువు దగ్గరకొస్తుంది. పులోమ ముందు పులోమని భార్యగా వుండి తరువాత భృగువుని పెండ్లి చేసికొని కూడా వుండవచ్చు.బహుశా ఆ కాలంలో అందంగా వుంటే ఒకరి భార్యను మరొకరు పరాక్రమము చేత పెళ్ళి చేసుకోవడం పెద్దనేరము కాదేమో!

పులోమనెత్తుకొని పులోముడు పరిగెత్తినప్పుడు ఆమె భయంతో ఏడిస్తే ఆ కన్నీటితో ఆ ఆశ్రమం దగ్గర ఒక నది యేర్పడితే బ్రహ్మ దానికి  "వధూసర" అని పేరు పెట్టాడు. స్నానం చేసి వచ్చిన భృగువు కొడుకునెత్తుకొని వున్న పులోమను చూసి "ఆ రాక్షసుడు నిన్నెలా తెలిసికొన్నాడు? నీజాడ ఎవరు చెప్పారని " అడిగితే ఇదిగో ఈ అగ్ని నన్నుగూర్చి చెప్పాడని చెప్పింది. అంతే భృగువుకు కోపమొచ్చి అగ్నికి శాపమిస్తాడు. నువ్వు సర్వభక్షకుడవు కమ్మని. ఇక్కడ మళ్ళీ అగ్నికి భృగువుకి కొంత సత్యం గురించి, బ్రాహ్మణుల గొప్పతనం గురించి అగ్నిచేత వ్యాసుడు కొంత చెప్పిస్తాడు. అగ్ని తనకిచ్చిన శాపానికి ప్రతిగా తన కాంతిమయమైన రూపాన్ని లేకుండా చేసేస్తాడు. ఇది చూచి యజ్ఞ యాగాదులు, పితృ కర్మలు చేసే మానవులు అవిచేయలేక మునులదగ్గరకు వెళ్ళారు.మునులు దేవతలదగ్గరకి వెళ్ళారు.మునులూ దేవతలూ కలసి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకొంటే బ్రహ్మ అగ్ని ని పిలిచి  ఆ ముని వాక్యం వ్యర్థం కాదు కానీ నీవు అన్నీ తినేవాడవయినప్పటికి మొదటపూజనీయమైన వాడవవుతావని శాంతింప చేస్తారు.

బహుశా ఆ కాలంలో అగ్ని ప్రతిదాన్ని దహించివేయడం చూసి ఈ శాపాన్ని ఒక కారణంగా చూపి సంతృప్తి పడివుండేవారేమో! అలాగే ప్రతివొక్కరు బహుశా అగ్ని కార్యాలు చేసే వారేమో. ఆరోజుల్లో ఇప్పటిలాగా అగ్గి తయారు చేయడం కుదరక అవసరమైనప్పుడు అగ్ని అందుబాటులో వుండడానికి ఇదొక ప్రక్రియగా మొదలైందేమో. మునుల వాక్కులకు తిరుగులేదనే వ్యవస్థను సూత్రీకరించే కథల్లో ఇదొక కథయి వుండవచ్చు.

అలా అగ్ని శాంతించినపిదప భృగువు కొడుకు చ్యవనునికి సుకన్య కు ప్రమతి అనేవాడు పుడుతాడు. ప్రమతికి ఘృతాచి అనే అప్సరసకూ రురుడు జన్మిస్తాడు. రురుడు ప్రమద్వర అనే ముని కన్యకను ప్రేమిస్తాడు. ప్రమద్వర విశ్వావసుడనే గంధర్వ రాజుకు, మేనకలకు పుట్టి స్థూలకేశుడనే ముని ఆశ్రమంలో పెరుగుతుంటుంది. ఒకరోజు ప్రమద్వర స్నేహితురాళ్ళతో ఆడుకుంటుంటే పాము కరిచి చచ్చిపోతుంది. అప్పుడు ప్రమద్వరను చూడటానికి గౌతముడు, కణ్వుడు, కుత్సుడు, కౌశికుడు ( విశ్వామిత్రుడు), శంఖుడు, మేఖలుడు,భరద్వాజుడు,వాలఖిల్యుడు,ఉద్ధాలకుడు,శ్వేతకేతుడు,మైత్రేయుడు మొదలైన ఋషులతోటి ప్రమతి, రురువుడు కూడా స్థూలకేశునాశ్రమానికి వస్తారు. రురుడు అక్కడ వుండలేక అడవికి వెళ్ళి దేవతలను ప్రమద్వరను బ్రతికించమని ప్రార్ధిస్తాడు. ఇక్కడ ప్రార్థించడంలో ఒక విశేషముంది మంత్రము తో కానీ, విషతత్త్వాన్ని తెలిసిన వ్యక్తుల చేతకానీ బ్రతికించమని వేడుకుంటాడు. బహుశా పాముకాటు అప్పట్లో సర్వసాధారణం కాబట్టి ఋషులకు పాము విషాన్ని హరించే వైద్యం తెలిసుండాలి.

ఆ ప్రార్థన విన్న ఒక దేవదూత నీ ఆయుష్షులో సగం ప్రమద్వరకిస్తే ఆ అమ్మాయి బ్రతుకుతుందని చెప్తే రురుడు అలాగే ననటంతో ఆమె బ్రతుకుతుంది.ఇక అప్పటినుంచి తన భార్యకు అపకారాన్ని చేసిన పాములపై కక్షగట్టి రురుడు ఒక పెద్ద దుడ్డుకర్ర తీసుకొని అడవుల్లో తిరుగుతూ కనిపించిన పామునల్లా చావబాదుతుంటాడు. ఒకరోజు విషంలేనటువంటి డుండుభమనే పామును అలాగే కొట్టడానికి కర్రెత్తితే అది బ్రాహ్మణులకుండవలసిన లక్షణాలు గురించి చెప్పి యింత క్రోధానికి కారణమేమిటని అడుగుతుంది. రురుడు విషయం చెప్పి పామును చంపడానికి కర్రెత్తగానే ఆ పాము ముని రూపంలో ప్రత్యక్షమౌతాడు. అదిచూసి రురుడు నీవెవ్వరవు పామవతారంలో ఎందుకున్నావని అడిగితే ఆ ముని ఇలా చెప్తాడు.

నేను సహస్రపాదుడనే మునిని. నా సహపాఠి ఖగముడు. వాడొకరోజు అగ్ని గృహంలో వుండగా తమాషాకు గడ్డితో చేసిన పామును వాడిపై వేశాను. వాడు భయపడి కోపంతే నువ్వు విషంలేని పాముగ అవ్వమని శపించాడు. దానికి నేను తమాషాకోసం చేశానని శాపవిముక్తి కలిగించమని వేడుకోగా రురుని చూసిన తరువాత శాపవిముక్తుడవవుతావన్నాడు కాబట్టి నేను శాపవుముక్తడయ్యానని బ్రాహ్మణులకుండవలసి లక్షణాలను రురువుకి చెప్పి పాములపై కోపాన్ని పోగొడతాడు. 

పై కథంతా ఎవరు ఎవరికి చెప్తున్నారు?ఉగ్రశ్రవణుడు మునులకు చెప్తున్నాడు కదా! ఇప్పుడు మునులు మరో క్వొశ్చెన్ వేశారు.

ఉగ్రశ్రవణా "తల్లి బిడ్డలను ప్రేమతో లాలించి చూస్తుంది కాదా? అలాంటి తల్లే పాములకు శాపమెలా యిచ్చిందని" అడుగుతారు.

ఈ ప్రశ్నతో ప్రధమాశ్వాస కథ  పూర్తవుతుంది. 

మహాభారతం ఆదిపర్వము - ప్రధమాశ్వాసము - నా కల్పనలు - 1

చాలా సంవత్సరాలక్రితం హైదరాబాదు వెళ్ళినప్పుడు కోఠి లోని విశాలాంధ్ర బుక్ హౌస్ కు వెళ్ళినప్పుడు తిరుమలతిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రచురించిన మహాభారత పుస్తకాల కట్ట అన్ని వాల్యూములు నా కంటబడ్డాయి.అవి ప్రతిపదార్థ వ్యాఖ్యాన సహితమై ఈరోజే కొనేసెయ్ అని నన్ను టెంప్ట్ చేశాయి :). కానీ వాటి బరువు అప్పటికే నేను తీసుకెళ్ళవలసిన లగేజీ తలచుకొని వీటినెలా తీసుకొనిపోవాలనే ఆలోచనతో వాటిని కొనడం అప్పటికి వాయిదా వేశాను. ఆ తరువాత కొన్నేండ్లు దాని గురించి మరిచిపోయాను.

మళ్ళీ ఒకటి,రెండు సంవత్సరాలక్రితం దేనికోసమో వెదుకొతుంటే టి.టి.డి వారి వెబ్సైట్ నాకంట పడటం అందులో ఉచితంగా భారత బాగవత పుస్తకాలుండడం చూసి ఆలసించిన ఆశాభంగమని భారతము, భాగవత పుస్తకాలను నా కంప్యూటర్ లోకి దిగుమతి చేసుకున్నాను. ఆపుస్తకాలు నాకంటికి కనిపిస్తూ చదవనిదానికీపుస్తకాలు నీకెందుకన్నట్టు కన్నుగీటుతుండేవి.

పోయిన నెల ఇరవైనాల్గవతేదీ ( నవంబరు ఇరవైనాలుగు ) నుంచి వీలున్నప్పుడు ఆంధ్ర మహాభారతం చదువుదామని నిర్ణయించుకొని చదవడం మొదలుపెడితే నేటికి ఆదిపర్వంలోని ప్రధమాశ్వాసము పూర్తయింది.నేను చదివిన దాన్ని క్లుప్తంగా వ్రాద్దామని ఈ టపా.

నన్నయ్య భారతాన్ని ఒక సంస్కృత శ్లోకంతో మొదలుపెట్టాడు. "శ్రీ వాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాఙ్గేషు..."  అని భారతం మొదలు పెట్టాడు. భారతం మొదట  విష్ణువు,శివుడు, బ్రహ్మలు రాజరాజనరేంద్రునికి శ్రేయస్సు చేకూర్చాలని మొదలు పెడతాడు. ఆ తరువాత రాజులకు ప్రీతికరమైన ముఖ స్తుతి మొదలౌతుంది. అతని పరాక్రమాన్ని,అందచందాలను, వంశాన్ని ఇతోధికంగా పొగిడేపద్యాలున్నాయి. ఐతే ఈ పద్యాలలో మనకు కొంత చరిత్ర తెలిసే అవకాశమున్నది.

రాజరాజనరేండ్రుడి తండ్రిపేరు విమలాదితుడని తెలుస్తుంది.వీరిది చాళుక్య వంశమనీ తెలుస్తుంది.రాజరాజనరేంద్రుడు ఆగమశాస్త్రాలు తెలిసినవాడని తెలుస్తుంది.ఆ కాలంలో రాజు విధి వర్ణాశ్రమ ధర్మాలు పాటింపచేయడమే నని నమ్మడం విశేషం. బ్రాహ్మణులు సమాజంలో అగ్రగణ్యులుగా వుంటూ రాజుల ప్రాపకంతో దానధర్మాలు స్వీకరిస్తూ సుఖమయజీవనం గడిపేవారనుకుంటాను. బ్రాహ్మణులకు దానం చేయడం పుణ్యమనే నమ్మకం లోకంలో బలంగా వుండేదనుకుంటాను. దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలకు లోటులేకుండా చూసుకోవడంకూడా రాజు లక్షణం అని తెలుస్తుంది.

నాడు రాజసభల్లో వ్యాకరణ పండితులూ, పురాణ ప్రవచనాలు చెప్పేవారూ, కవులు, తర్కశాస్త్రము క్షుణ్ణంగా తెలిసినవారూ వుండేవారని తెలుస్తుంది. అంటే అక్షర జ్ఞానమున్న వారికి గౌరవమర్యాదలెప్పటినుంచో వున్నాయని తలంచవచ్చు. అలాగే కులవృత్తులు వంశపారంపర్యమని, కొన్ని పదవులు తండ్రి తరువాత తనయునికి దక్కుతాయని కూడా తెలుస్తుంది. నన్నయ్య రాజరాజనరేంద్రునికి ఈ విధంగా కులబ్రాహ్మణుడయ్యాడు. రాజరాజనరేంద్రుడు శివభక్తుడని తెలుస్తుంది.

తరువాత భారతాన్ని వినడం వలన కలిగే ఫలాలు చెప్పబడినాయి. ఆ కాలంలో విద్య శ్రవణ ప్రధానం కాబట్టి "వినడం" వలన అని వాడి వుంటారు. ఇక్కడ కూడా బ్రాహ్మణులకు దానం చేసినంత పుణ్యమని చెప్పడంద్వారా నాకొకటి అనిపిస్తుంది. ఆకాలంలో మిగిలిన కులాల వారందరూ స్వయంపోషకులు అనుకుంటాను. అంటే వ్యవసాయమో లేదా తదనుకూలమైన వృత్తో చేయడంవలన వారి పోషణ వారు చూసుకొనేవారనుకుంటాను. కానీ బ్రాహ్మణుల వృత్తి పురాణాలను,వంశ గత చరిత్రలు, యజ్ఞ యాగాదులు, మంత్ర తంత్రాలను,చరిత్రను పరిరక్షించడం మొదలైన వృత్తి కాబట్టి వీరికి ఎవరైనా ఏదైనా పెడితే గానీ కుటుంబం గడవని పరిస్థితి కాబట్టి బ్రాహ్మణులకు దానాలు చేయడం పుణ్యమని పురాణాలద్వారా సామాన్యప్రజల మనస్సులలో చొప్పించి వుంటారు.

మొత్తానికి భారతాన్ని వ్రాయమని రాజరాజనరేంద్రుడు నన్నయను కోరడం నన్నయ్య దానికొప్పుకొని తాను భారతాన్ని యెలా రచించదలచుకున్నాడో చెప్పుకొని భారత కథను  నైమిశారణ్యంలో  శౌనకుడనే కులపతి సత్త్రమనే యాగం చేస్తూ వుండగా ఊగ్రశ్రవనుడునే కథకుడు( రోమహర్షుని కుమారుడు)  అక్కడకు వచ్చి మునుల కోరికమేరకు భారతం చెప్పడం మొదలుపెట్టాడని భారతకథనెత్తుకుంటాడు. సంస్కృతభారతంలో వున్న పర్వాలను తెలుగులో ఏఏ పర్వవములో వ్రాయనున్నాడో ఆ పర్వాలలో వున్న శ్లోకాలసంఖ్యను మొదలైన వాటిని విషయసూచికలలాగా వివరిస్తూ భారతయుద్ధం శమంతపంచకమనే ప్రదేశంలో జరిగిందని చెప్తాడు. వింటున్న మునులూ శమంతపంచకము కాపేరు ఎలా వచ్చిందని, అక్షౌహిణి అంటే పరిమాణంలో ఎంత చెప్పమని అడుగుతారు.

త్రేతా ద్వాపరయుగాల మధ్యకాలంలో పరుశురాముడు యుద్ధప్రీతి పరుడై శత్రురాజులనందరిని చంపి ఆ రక్తంతో ఐదు మడుగుల నింపి పితృదేవతలకు తర్పణమిచ్చాడు. అలా ఆ ప్రదేశానికి దగ్గరలోనున్న స్థలం శమంతపంచకమని పిలుస్తున్నారని చెప్పి అక్షౌహిణి అంటే ఏమిటో యిలా చెప్పాడు.

ఒకరథం+ఒక ఏనుగు+మూడు గుర్రాలు+ఐదుగురు కాలిబంట్లు = పత్తి
పత్తికి మూడురెట్లు=సేనాముఖం
సేనాముఖానికి మూడురెట్లు = గుల్మం
గుల్మానికి మూడురెట్లు = గణం
గణానికి మూడురెట్లు = వాహిని
వాహినికి మూడురెట్లు = పృతన
పృతనకు మూడురెట్లు = చమువు
చమువుకు మూడురెట్లు = అనీకిని
అనీకినికి పదిరెట్లు = అక్షౌహిణి

ఒక్కొక్క దానిలో ఎన్ని ఏనుగులు ఎన్ని గుర్రాలు ఎన్ని రథాలు ఎంతమంది కాల్బలమో మీరే లెక్క వేసుకోండి.
మొత్తంగా చూస్తే 21870 రథాలు, 21870 ఏనుగులు,65610 గుర్రాలు, 109350 కాల్బలం కలిపి ఒక అక్షౌహిణి. ఇటువంటివి ఏడక్షౌహిణులు పాండవుల పక్షాన, పదకొండక్షౌహిణులు కౌరవపక్షాన తలపడ్డాయి.

శమంతపంచకమనే ప్రదేశంలో కురుపాండవుల యుద్ధం జరగడంచేత ఆప్రదేశానికి కురుక్షేత్రం అనికూడా పేరొచ్చింది.

యజ్ఞయాగాదులు రాజులయొక్క కర్తవ్యమనుకుంటాను. భారత యుద్ధానంతరం జనమేజయుడు దీర్ఘకాలం యజ్ఞాన్ని చేశాడు.అక్కడకు దేవతల కుక్కయైన సరమ కొడుకు సారమేయుడు ఆడుకొనడానికి వస్తాడు.దాన్ని జనమేజయ తమ్ముళ్ళు శ్రుతసేనుడు,భీమసేనుడు,ఉగ్రసేనుడు అనే వాళ్ళు కొడతారు.ఆ కుక్క ఏడుస్తూ వెళ్ళి తనతల్లికి చెప్తుంది. సరమ వచ్చి జనమేజయుడిని కడిగిపారేస్తుంది. అన్యాయంగా నా కొడుకుని కొట్టావు నీకు ఆపదలొస్తాయని చెప్పి అదృశ్యమైపోతుంది.

జనమేజయునికి సరమగిలి పట్టుకోని దాన్ని శాంతింపచేయటానికొక పురోహితుని వెతుకుతూ అడవులు పట్టుకు పోయి ఆ అడవుల్లో శ్రుతశ్రవసుడనే మునిని చూస్తాడు.ఈ శ్రుతశ్రవసునికి సోమశ్రవసుడని ఒక కొడుకు. ఆ సోమశ్రవసుని పురోహితునిగా పంపమని కోరుతాడు.ఆ సోమశ్రవసుని మంచి మాటలతో శాంతిపొంది రాజ్యాన్ని సుఖంగా అనుభవిస్తూ వుండగా

జనమేజయుడు రాజ్యంలోనే ఒకానొక అరణ్యంలో పైలుడు పాఠాలు చెప్పుకుంటు జీవిస్తుంటాడు.పైలుని గురుకులంలో ఉదంకుడనేవాడు విద్యనభ్యసిస్తుంటాడు.ఇతను గురువుకు ప్రియ శిష్యుడై ఎనిమిది సిద్ధులను సంపాదిస్తాడు. ఉదంకుడు గురువుగారి భార్య చెప్పటంతో పౌష్యుడనే రాజు భార్యయొక్క కుండలాలు తీసుకురావడానికి బయలు దేరుతాడు. దారిలో తనకొక మహానుభావుడుకనపడి ఎద్దుపేడ తినమంటే తిని పౌష్యుని దగ్గరకెళ్ళి వచ్చిన పని చెప్తాడు. రాజు దానికి సంతోషపడి రాణి దగ్గరకెళ్ళి తెచ్చుకోమంటాడు. ఉదంకుడంతఃపురానికెళితే రాణి కనిపించదు. ఏడుపుమొఖంతో రాజుదగ్గరికొచ్చి రాణి కనపడలేదంటే నువ్వు అపవిత్రుడవు కాబట్టి కనపడలేదంటాడు. అప్పుడు ఎద్దుపేడతిన్న విషయం గుర్తొచ్చి మళ్ళీ అన్నీ కడుక్కొని రాణిదగ్గరకెళ్ళి కుండలాలు తీసుకొని రాజువద్దకొచ్చి వెళతానంటాడు. పౌష్యుడు అన్నంతిని పొమ్మంటాడు.అన్నంలో వెంట్రుకొచ్చిందని ఈ సద్బ్రాహ్మణుడు రాజును గుడ్డివాడివి కమ్మని శపిస్తాడు. రాజు మాత్రం తక్కువ తిన్నాడా..నీకు పిల్లలు లేకపోవుగాకని శపిస్తాడు.

ఈ శాపనార్థాలను చూస్తే నాకొకటనిపిస్తుంది. ఆ కాలంలో యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు ఏదైనా నోటితో అంటే అది జరుగుతుందనే నమ్మకం ప్రబలంగా ప్రజల మనసుల్లో నెలకొని వుండాలి. ఒక్కొక్కచో విధి వశాన ఏమైనా కీడు జరిగితే అది తప్పకుండా శాపం వల్లే జరిగిందని భయపడేవారనుకుంటాను. ఇన్ని యజ్ఞాలు మనిషిని శాంతితో సంతోషంతో జీవించడానికి ఏర్పరచుకున్నట్టి వైనా కోపతాపాలు ఈర్ష్యా ద్వేషాలు వాళ్ళలో పరిపూర్ణంగా వుండేవని దెబ్బకు దెబ్బ తీయాలని వుండే మానవ సహజ ప్రవృత్తి ఎక్కడికీ పోలేదని భారతంలో వచ్చే అనేక కథలద్వారా మనకు కనిపిస్తుంది.

ఉదంకుడు కుండలాలు తీసుకొని వస్తూ వుంటే  ఒక సెలయేరు కనిపిస్తే ఈ కుండలాలొడ్డున పెట్టి ఆచమనానికి దిగుతాడు. తక్షకుడనే పాము అదే అదనుగా చూసుకొని ఆ కుండలాలను దొంగలించుకొని నాగలోకానికి వెళతాడు. ఉదంకుడు కూడా సిద్ధులు తెలిసిన మూలంగా పుట్టలో దూరి నాగలోకానికి వెళతాడు. ఇక్కడ నన్నయ్య పాములను స్తుతించే పద్యాలు అద్భుతం.ఇక్కడ ఉదంకునికి తెల్లని నల్లని దారాలతో నేతనేస్తున్న ఒక స్త్రీ, పన్నెండాకుల చక్రాన్ని తిప్పుతూ ఆరుగురు యువకులు, గుర్రాన్నెక్కి వున్న ఒక దివ్యపురుషుని చూస్తాడు. దివ్యపురుషుడు అనుజ్ఞతో గుర్రము చెవిలో ఊదితే పాతాళమంతా ప్రళయకాల బడబాగ్ని జ్వాలలు వ్యాపిస్తాయి.అవి తట్టుకోలేక తక్షకుడు కుండలాలు తెచ్చి ఇస్తే దివ్యపురుషుడు తనగుర్రానెక్కి మీ గురవాశ్రమానికెళ్ళమంటాడు. ఉదంకుడు గురువు దగ్గరకొచ్చి జరిగిన విషయం చెప్పి తనకు పాతాళంలో కనిపించిన వాటికి అర్థాలడుగుతాడు. తెలుపు నలుపు పగలు రాత్రికి సంకేతాలని, దానిని నేస్తున్నవారు ధాత విధాత అని, పన్నెండాకుల చక్రం నెలలరూపమైన సంవత్సరమని,దానిని తిప్పేవాళ్ళు ఋతువులని ఆ దివ్యపురుషుడు ఇంద్రుని మిత్రుడైన వర్జన్యుడని చెప్తాడు. అలాగే నీకు ఎద్దుపేడ తినిపించిన పురుషుడు ఇంద్రుడని ఆ యెద్దు ఐరావతమని చెప్తాడు.

ఇక్కడ నాకొకటనిపిస్తుంది. గురువులు శిష్యులదగ్గర చులకనకాకుండా తనకు తోచినది జరిగిన సంఘటనలకు అన్వయించి ఏదో ఒకటి చెప్పి సంతృప్తి పరిచేవారనుకుంటాను.



సశేషం

4, డిసెంబర్ 2017, సోమవారం

జగన్ ఇరవై ఐదవరోజు పాదయాత్ర డైరీ - నాపద్యము

ముందుగా ఈరోజు జగన్ డైరీ లోనుంచి కొంతభాగం, ఆ తరువాత నా పద్యం

"ఈ రోజు పత్తికొండ నియోజకవర్గం ఎర్రగుడిలో రైతు సదస్సు జరిగింది. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఆలోచనలను మరింత విస్తృతం చేసుకోవడానికి రైతులు ఈ సదస్సు నిర్వహించారు. సుదీర్ఘ కాలంగా రైతు సమస్యలపై పనిచేస్తూ, వివిధ రైతు సంఘాల నాయకులుగా ఉన్న ముఖ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. విత్తనం నాటే దగ్గర్నుంచి, తన ఉత్పత్తిని మార్కెట్లో అమ్మే వరకూ.. వివిధ దశల్లో రైతు ప్రయోజనాలు ఏ విధంగా కాపాడాలనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. వ్యవసాయ రంగంపై ఆలోచనలను సుసంపన్నం చేసే అనేక సలహాలు, సూచనలు ఈ సదస్సులో చర్చకు వచ్చాయి. అందుకుగాను వారికి ధన్యవాదాలు.

ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభం వల్ల రైతులు విపరీతమైన ఆందోళనతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు నా దగ్గర స్పష్టమైన ఆలోచనలు, కార్యాచరణ ప్రణాళికా ఉన్నాయి.. రైతుల సమస్యలు భూమి టైటిల్‌ నుంచే మొదలవుతాయి. అందువల్ల మన వ్యవసాయ భూములకు టైటిల్‌ సమస్యలు రాకుండా చేసేందుకు, రైతుల భూములన్నిటికీ స్పష్టమైన టైటిల్స్‌ ఇస్తాము. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్తు, సాగునీరు, సకాలంలో వ్యవసాయ రుణాలు, నాణ్యమైన విత్తనాలు, కల్తీ లేని ఎరువులు, క్రిమి సంహారక మందులు, వ్యవసాయానికి అయ్యే ఖర్చు తగ్గించడం కోసం రైతు భరోసా పథకం, వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి సకాలంలో తగు సూచనలు, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు, పంటను నిల్వ చేయడానికి గిడ్డంగి సౌకర్యాలు, దురదృష్టవశాత్తు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, చివరిగా పండిన పంటకూ గిట్టుబాటు ధర, అనువైన చోట వ్యవసాయానుబంధ పరిశ్రమలు స్థాపించి రైతుకు మరింత లబ్ధి చేకూర్చడం. మన ప్రభుత్వం తీసుకునే ఈ చర్యల వల్ల రైతుల జీవితాలు బాగుపడతాయి. పల్లెలు అభివృద్ధి పథంలో పయనిస్తాయి. రాష్ట్రానికి ఆహార భద్రత లభిస్తుంది.


ఈ రోజు రైతు గర్వంగా నేను రైతునని చెప్పుకునే పరిస్థితి లేదు. రైతుల పిల్లలు ఉన్నత చదువులు చదివిన తర్వాత ఒక వేళ ఉద్యోగం రాకపోయినా, అదొక ఉపద్రవంలా భావించకుండా నేను వ్యవసాయం చేయగలను.. పది మందికి ఉపాధి కల్పించగలనని ఆలోచించే స్థాయికి వ్యవసాయాన్ని తీసుకురావాలి. ఇంకా చెప్పాలంటే ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, బ్యాంకర్, డాక్టర్‌లు తమ వృత్తుల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటారో.. రైతు కూడా తన వృత్తి గురించి అంతే గొప్పగా చెప్పుకునే రోజులు రావాలి. ఉన్నత విద్యావంతులు వ్యవసాయాన్ని ఒక పూర్తిస్థాయి వృత్తిగా చేపట్టే స్థాయికి వ్యవసాయాభివృద్ధి జరగాలి."


సీ|| ఆకొన్నవాని నాదరణజూపి కడుపునిండ కూడుకుడిపి నిమురు వాడు
కష్టనష్టంబు లొక్కపరిచుట్టుకొనినగూడ విశ్వాస సాగొదల డతడు
కండువా తలచ్రుట్టి కరకర టెండల భక్తితో పొలమున బ్రతుకు వాడు
నేడుప్రభుత్వాధినేత లాదరణలే కాత్మహత్యలపాలు! కనరె వింత?

ఆ.వె|| అట్టి రైతు వృత్తి కండగ నిలబడి
మేలు వృత్తి యిదని మెచ్చు నట్లు
సాగు నీటి నిచ్చి సాధ్యముచిత వ్యవ
సాయ ఋణము లిచ్చి సాయ పడుదు

3, డిసెంబర్ 2017, ఆదివారం

జగన్ ఇరవైనాల్గవ రోజు పాదయాత్ర డైరీ - నాపద్యము

ముందుగా ఈ రోజు జగన్ డైరీ లో నుంచి కొంత బాగం ఆపైన నా పద్యము

"ఈ రోజు ప్రజాసంకల్ప యాత్ర పత్తికొండ నియోజకవర్గంలోని రాతన గ్రామంలోంచి సాగింది. ఈ గ్రామానికి చాలా చారిత్రక ప్రాధాన్యం ఉందట. గ్రామంలోని చెరువు శ్రీ కృష్ణదేవరాయల కాలంలో నిర్మించినదట. ఆ చెరువు గురించి తెలుసుకున్నప్పుడు నేను ఎంతో సంభ్ర మాశ్చర్యాలకు లోనయ్యాను. ఆ రోజుల్లోనే రాజులు ఎంతో దార్శనికతతో భావి తరాల గురించి ఆలోచించి, ఆ ప్రాంత భౌగోళిక స్వరూప, స్వభావాలను దృష్టిలో పెట్టుకుని వర్షపాతం, భూగర్భ జల వనరులు తక్కు వగా ఉన్న ప్రాంతాల్లో చెరువులు తవ్వించా రు. అప్పటి పాలకులు ప్రజాసంక్షేమం గురించి ఆలోచించారు కాబట్టే ఇటువంటి మహత్కార్యాలు చేయగలిగారు. అదే బాటలో నడిచిన నాన్నగారు ఈ ప్రాంతానికి జలకళ తీసుకురావాలని సంకల్పించి, ఇక్కడి ప్రాజెక్టులను దాదాపు 80 శాతం పూర్తిచేశారు. కానీ ప్రజాసంక్షేమం పట్టని నేటి పాలకులు ఆ మిగిలిన 20 శాతం పనులు కూడా పూర్తిచెయ్యడం లేదు.

ఈ ప్రాంతంలో వర్షాలు పడితే ప్రజలు పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతారని నా దృష్టికి వచ్చింది. రాయల కాలంలో వీధుల్లో వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవాళ్లని చదివిన చరిత్ర గుర్తుకు వచ్చింది. అంతటి సిరిసంపదలతో తులతూగిన ఈ ప్రాంతం నేడు కడు పేదరికంలో మగ్గుతోంది. ఈ ప్రాంతం, ఈ ప్రజల భవిష్యత్తు మార్చడం మనం సంకల్పించిన నవరత్నాలతోనే సాధ్యమని భావిస్తున్నాను. అందుకే నైరాశ్యంలో ఉన్న ప్రజలకు నవరత్నాలను విపులంగా వివరిస్తూ.. భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నాను.

పత్తికొండ నియోజకవర్గం బాగా వెను కబడిన ప్రాంతం. ఇక్కడి ప్రజలకు పెద్దగా ఆదాయ వనరులేమీ లేవు. భార్యాభర్తలు కూలి పనులు చేసుకోగా వచ్చిన డబ్బుని జాగ్రత్తగా పొదుపు చేసుకుని, బ్యాంకుల నుంచి నాన్నగారు ప్రారంభించిన పావలా వడ్డీ, సున్నా వడ్డీలకు రుణాలు తీసుకుని పిల్లల్ని చదివించుకున్నారు. చిన్నచిన్న వ్యాపారాలు ప్రారంభించారు. ఇలా అప్పుడప్పుడే అభివృద్ధిలోకి వస్తున్న మహిళలు, అధికారంలోకి వస్తే బేషరతుగా డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మి అప్పులు తీర్చకపోవడంతో పూర్తిగా నష్టపోయారు. చంద్రబాబు తన హామీ నిలబెట్టుకోకపోవడంతో ఈ రోజు వారందరూ డిఫాల్టర్లుగా మారారు. వాళ్ల రుణాలు నిరర్థక ఆస్తులుగా మారాయి. పైగా వీళ్లకి రుణమాఫీ పేరుతో ఇచ్చిన కొద్ది మొత్తాన్ని కూడా సీడ్‌ క్యాపిటల్‌గా చూపించి, మహిళల దగ్గర నుంచి మళ్లీ వడ్డీ వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో డ్వాక్రా ఉద్యమం పూర్తిగా బలహీనపడింది. ఈ ప్రభావం బాగా వెనుకబడిన ప్రాంతమైన పత్తికొండపై మరీ ఎక్కువగా ఉంది. ఇక్కడి మహిళలు వారికున్న కొద్దిపాటి ఆదాయ వనరుని కూడా కోల్పోయారు."



సీ|| రాయలేలినయట్టి రాజ్యమ్మిది దొరువు చెరువుల ఖ్యాతిని జెంది నూరు
రతనాల రాశులు రహదారులందు వీసెలలెక్కనమ్మి ప్రసిద్ధి నొందె
కాలగతిన నేడు కడుపేదలమయి గతించిన సౌఖ్యమ్ము తిరిగి బడయ
మీచెంత కొచ్చితిమి జగనన్నా మావెతలు బాపు నాయకా దయన నీవు!

ఆ.వె|| కరువు కాటకముల కలతచెందెడిమిమ్ము
నాదు కొందు నేను నవరతనము
ల, యిదె మాట నాది లయకారుసాక్షిగ
పత్తి కొండ వాస పౌరు లార

2, డిసెంబర్ 2017, శనివారం

1, డిసెంబర్ 2017, శుక్రవారం

జగన్ ఇరవై రెండవరోజు పాదయాత్ర డైరీ- నా పద్యము

ముందుగా ఈ రోజు డైరీ లోని కొంత భాగము ఆ తరువాత నాపద్యము

"కారుమంచి ప్రభుత్వోన్నత పాఠశాల విద్యార్థినులు వచ్చి కలిశారు. ఆ స్కూల్లో కనీసం మరుగుదొడ్లు కూడా లేనందున బహిరంగ ప్రదేశాన్నే వాడాల్సిరావడం వారికి నరకయాతనగా మారింది. తాగే నీళ్లలో పురుగులు వస్తున్నాయి. మధ్యాహ్న భోజనంలో కూడా పురుగుల బాధ తప్పడం లేదు. స్కూల్‌ మొత్తం కంప చెట్లు పెరిగి, తరగతి గదుల్లోకి పాములు వస్తున్నాయి. శిథిలావస్థలో ఉన్న తరగతి గది గోడ ఇటీవల కూలిపోవడంతో ఒక విద్యార్థికి గాయం కూడా అయ్యిందట. స్కూల్‌కి వెళ్లాలంటేనే భయమేస్తోందని వాళ్లు నాతో చెప్పారు. స్కూల్‌ ఇంతటి దారుణ స్థితిలో ఉండటంతో స్కూలు హాజరు సగానికి సగం పడిపోయింది. తర్వాత గ్రామమైన కైరుప్పలలో కూడా విద్యార్థినులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. "



సీ|| చక్కని గంధముల్ చల్లు చిన్నారుల సత్ప్రవ ర్తననద్ది  చక్క నైన
భాషణముల నేర్పి భావిభారత పౌరులగ దీర్చిదిద్ది కలకలు బాపు
పల్లె బడులునేడు పట్టించు కొనునాథుడోపక  చిన్నారులోజము నశి
యించి యేడ్చుచునుంటి రీవేళ ఓంకార రాగముల్ వ్యాపించ రాజ్య మందు


ఆ.వె|| మరుగుదొడ్లు లేవు మరుగుయును గనము
ముట్ట మంచి నీళ్ళు పురుగు లొచ్చు
పాము లొచ్చి తిరుగు పాఠశాలల్లోన
కనరె మాదు బాధ కరుణ జూపి