15, ఆగస్టు 2019, గురువారం

రారండోయ్ రారండోయ్-- తండూరీ చాయ్ తాగండోయ్....:)

1993 వ సంవత్సరం.B.Tech ఐపోయి M.Tech లో చేరమని ఆహ్వానం రావడంతో గుంటూరు జిల్లా వినుకొండ తాలూకా గాంధీనగరం గ్రామం నుంచి ఖరగ్ పూర్ కు బయలు దేరాను. బస్సులో విజయవాడదాకా వచ్చి హౌరా ఎక్స్ప్రెస్ కు రిజర్వేషన్ కోసం ప్రయత్నిస్తే దొరకలేదు. యువరక్తం. జనరల్ టికెట్ కొనుక్కొని టి.సి. కి డబ్బులిచ్చి ఏదో ఒక బెర్త్ రిజర్వ్ చేసుకోవచ్చులెమ్మని ధైర్యంతో కూడిన అనుభవం. విశాఖపట్టణంలో  B.Tech  చేసేటప్పుడు ఏదో ఒక ట్రైన్ పట్టుకొని రిజర్వేషన్ బోగీలో ఎక్కడం టికెట్ కలక్టర్ కరుణిస్తే అంతో ఇంతో డబ్బులిచ్చి ఆ పెట్టలోనే వుండండం లేదంటే దిగి జనరల్ బోగీలోకి మారడం బాగానే అనుభవముంది. అసలు అప్పట్లో నేను బొకారో ఎక్స్ప్రెస్ కు ఎక్కువగా ఇంటికి వస్తుండేవాడిని. ఎంతలా అంటే దానిపేరును మాఫ్రెండ్స్ భాస్కర్ బొకారా అని పిలుచుకునేటంతగా. B.Tech చదివిని మొదటి మూడేండ్లు మేము ప్రకాశం జిల్లా కనిగిరి తాలూకా జిల్లెళ్ళపాడు గ్రామంలో వుండేవాళ్ళము. ఈ ఊరికి పోవాలంటే అదొక పెద్ద ప్రహసనం. కారణం ఒంగోలులో దిగినాక, కనిగిరి బస్సు పట్టుకొని మొదట కనిగిరి చేరుకోవాలి. అక్కడనుంచి బస్సుకోసం నిరీక్షణ. కనిగిరి లో బస్సుదొరొకిన తరువాత ( కనిగిరి=వెదుళ్ళ చెరువు లేదా కనిగిరి-రంగన్నపల్లి ) ఓ గంట ప్రయాణం తరువాత తాడిచెట్ల దగ్గర దిగి ఓ రెండుకిలోమీటర్లు నడిచి జిల్లెళ్ళపాడు చేరుకోవాలి. విశాఖలో వున్న రోజుల్లో మొదటిసంవత్సరంలో మాఊరికి ఏ సమయంలో బయలుదేరితే త్వరగా చేరుకోవచ్చో ప్రయోగాలు చేసి చివరికి బొకారో రైలు ఎక్కితే అతి తక్కువ సమయంలో బస్సులకోసం ఎక్కువ నిరీక్షించకుండా ఇల్లు చేరుకోవచ్చని కనిపెట్టాను. :) అతితక్కువ సమయమంటే మరీ తక్కువ అనుకోకండి. కనీసం పదహారు/పదిహేడు గంటలు పట్టేది. అసలు బొకారో మొదటి ప్రయాణం నాకు బహు బాగా గుర్తు. ఆ మొదటి ప్రయాణంలోనే నేనెంతో ఇష్టపడి జీవితంలో మొదటిసారి కొనుక్కున్న  Vaction boots ఎవరో కొట్టేశారు. దాని గురించి మరో సారి.

ఇలా హౌరా ఎక్స్ప్రెస్ కు టికెట్ కొనుక్కొని విజయా డైరీ వాళ్ళ మజ్జిగ రెండు మూడు పేకెట్లు లాగించి స్వాతి,ఆంధ్రభూమి వార పత్రికలు కొనుక్కొని ఒక రిజర్వేషన్ బోగీలో ఎక్కాను. అనుకున్నట్లే రైలు లో ఖాళీ లేదు. ఎక్కిన భోగీలో ఎవరైనా కుఱ్ఱ పిల్లలు ఉన్నారేమో నని ఒక సింహావలోకనం చేశాను కానీ అంత ఆసక్తి గొలిపే మొఖాలెక్కడా కనపడలేదు :). రైలు ప్రయాణం మొదలైంది. కొద్దిదూరం పోయాక T.C వచ్చాడు. నా పరిస్థితి వివరించాను. ఏమనుకున్నాడో ఏమో విశాఖ దాకా ఖాళీల్లేవు అక్కడ ఏమైనా ఖాళీ వస్తే తప్పక ఇస్తానని మాట యిచ్చి అక్కడి వరకూ ఎక్కడో ఒక చోట సర్దుకొని కూర్చోమని చెప్పి వెళ్ళిపోయాడు. వైజాగ్ దాకా ప్రయాణం కొట్టిన పిండి కాబట్టి సరదాగా గడిపేశాను. విశాఖ రాగానే T.C ని కలిసి బెర్త్ రిజర్వ్ చేసుకొని మిగతా ప్రయాణాన్ని సుఖాసీనుడనై
 ప్రయాణించి ఉదయం పది/పదిన్నర ప్రాంతానికి ఖరగ్పూర్ చేరుకున్నాను.

బెంగాలీ రాదు నాకు. హిందీ కొద్దికొద్దిగా వచ్చేది. దిగిన తరువాత వచ్చిన హిందీలో IIT కి వెళ్ళాలని అడిగితే ఎక్కడనుంచని అడిగాడు. ఆంధ్రా అని చెప్పా. అంతే స్వచ్చమైన తెలుగులో సంభాషణ మొదలెట్టాడు. అప్పటిదాకా ఖరగ్ పూర్ లో తెలుగువాళ్ళెక్కువని తెలియదు నాకు. అలా ఆజాద్ హాల్ చేరుకొని మరుసటిరోజు అడ్మిషన్ పూర్తిచేసుకున్నాను.

ఇంతకీ మట్టికుండలో టీ కి నేను చెప్పేదానికి సంబధమేమిటా అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. అక్కడున్నరోజుల్లో తరచూ గోల్ బజార్ అనే మార్కెట్ కు కొత్తగా వచ్చిన తెలుగు పాటల కోసమో లేదా కావాల్సిన పుస్తకాలు కొనుక్కోవటానికో లేదా ఎదో సినిమా చూడడానికో వెళ్ళేవాళ్ళము.అదిగో అక్కడ రుచి చూశాను తండూరీ చాయ్ ని మట్టి ముంతలో! ఆ రుచి నాకిప్పటికీ గుర్తే. ఆ మట్టి వాసన ఆ టీ రుచీ మర్చిపోవాలన్నా మరపురాదు.అది మొదలు ప్రతివారం లేదా ఖాళీ దొరికినప్పుడల్లా సైకిల్స్ మీద గోల్ బజార్ కు వెళ్ళి టీ త్రాగడం అలవాటైపోయింది అక్కడున్న సంవత్సరమున్నర రోజులూ!!

ఆ తరువాత మళ్ళీ మట్టిపాత్రల్లో టీ త్రాగిన జ్ఞాపకాలు లేవు. ఈ మధ్య అమెజాన్ లో ఏదో కొందామని వెతుకుతుంటే ఇవిగో ఇవి నాకంట పడ్డాయి. ఎగిరి గంతేసి ఆర్డర్ చేసి మళ్ళీ ఈ రోజు ఇంచుమించు అదే రుచితో టీ త్రాగుతున్నా...

తండూరీ చాయ్ కావాలా!!! ఆలస్యమెందుకు...మాయింటికి రండి :)

11, ఆగస్టు 2019, ఆదివారం

కూరలో కరివేపాకు అంటారు కానండి ...

అందరూ కూరలో కరివేపాకు అంటారు కానండి ఇది అమెరికాలో మాత్రం కాదు. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు మన దక్షిణ భారతదేశంలో ఈ కరివేపాకు మితిమీరి దొరుకుతుంది కాబట్టి కూరల్లో కరివేపాకును తీసి పక్కన పెట్టేస్తారు కానీ అలా చేసినోళ్ళని ఒక సంవత్సరం పాటు తెచ్చి అమెరికాలో పడెయ్యాలి.అప్పుడు కానీ దాని విలువతెలిసిరాదు. నవ్వులాటకు చెప్పటంఏదండీ :). ఇక్కడ ఒకేఒక చిన్న కరివేపాకు రెమ్మ ఒక డాలరు పెట్టి కొంటుంటే పర్సులో డబ్బులు ఒత్తి ఒత్తి చూసుకుంటూ కళ్ళమ్మటి నీళ్ళు కార్చాల్సిందే.ఈ దెబ్బకు చాలా రోజులు అవసరమైన కూరల్లో, పచ్చళ్ళలో కరివేపాకు లేకుండానే జీవితాలని లాగించేవాళ్ళు అమెరికా నిండా కనిపిస్తారు. అలా రుచీ పచీ లేని కూరల్ని తింటూ జిహ్వచాపల్యాన్ని చంపుకొని బ్రతకడానికి కడుపు నింపుకొనే రోజుల్లో ఒక దేవత మాపై కరుణించి ఒక చిన్న కరివేపాకు చెట్టునిచ్చింది.అది కొద్దిరోజులు బాగానే గెంతుతూ తుళ్ళుతూ మాతో బాగానే ఆడుకున్నది. అప్పటికి చిన్న పిల్లే కాబట్టి దాని ఫలాలు మాకు అందలేదు. బాగానే వున్నదికదా అని ఒకరోజు ఆడుకుంటానంటే బయట పాటియో లో పెట్టి దాని సంగతి కొద్దిరోజులు మర్చిపోయాము. ఎంతా ఒక పదిరోజులనుకుంటాను. నవంబరు చివరి వారమనుకుంటాను. బయటకు వెళ్ళి చూస్తే అప్పటికే అది మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది :(

అదిగో అప్పటినుంచి మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు. కానీ ఈ మధ్య గత ఆరునెలలుగా బ్రతికేది తిండి తినటంకోసమే కదా . అందరికీ ఏవేవో గోల్స్ వుంటాయి కానీ నాకు మాత్రం బ్రతికినన్ని రోజులు కరివేపాకు వేసుకొని కూరలొండుకోవాలని ఒక్కటే గోల్. ఆ గోల్ తో ఈ మధ్య మళ్ళీ కూరగాయలకు వెళ్ళినప్పటినుంచి కరివేపాకు మాత్రం తప్పక తెచ్చుకుంటున్నాను. ఇలా కాలంసాగిపోతుండగా మళ్ళీ కరివేపాకు దత్తు తెచ్చుకోని పెంచుకోవాలని కోరిక కలిగింది.పోయిన సారి గుణపాఠంతో ఈ సారి అసలు న్యూ జెర్శీ లో ఏమేమి మొక్కలు పెరుగుతాయోనని రీసెర్చ్ చేస్తే..అబ్బే ఇవన్నీ జోన్ ౭ ఆపైన పంటలని తేల్చేశారు. అమెరికా లో మనసౌలభ్యంకోసం వాతావరణ పరిస్థితులను బట్టి  మొక్కలు నాటడానికి ఏకాలం అనుకూలం, ఏ ఏ పంటలు పండించుకోవచ్చు మొదలైన విషయాలు నాలాంటి వారికి కూడా అర్థం కావడానికి  దేశాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. న్యూ జెర్శీ లో మేముండే ప్రాంతం జోన్ 6b క్రిందకు వస్తుంది. ఈ జోన్ 6b లో కరివేపాకు పెరగదు.పెంచాలంటే ICU లో పెట్టి చూసుకోవాల్సిందే. సరే ఏమైతే అదవుతుందని మళ్ళీ ఒక కరివేపాకు మొగ్గని కొన్నాను. ఎండాకాలం దరిదాపు ఐపోవచ్చింది కాబట్టి ఈ సారి కొద్దిగా పెద్ద మొక్కనే కొన్నాను.వేరు నుంచి పైనుండే ఆకు దాకా రెండడుగులంట. అదొచ్చాక చూడాలి ఎంత పొడవు ఎంతా లావుందో! ఈ సారి డబ్బులు పెట్టి కొన్నాము కదా చలికాలంలో నిజంగానే ICU లో పెట్టి చూసుకోవాలి. నిజమే కదా ఊరికే వచ్చిన దానికంటే మనం డబ్బులు పెట్టి కొన్న దానిమీద శ్రద్ధ ఉంటుంది కదా!! జీవిత సత్యమిదేకదా :)

గ్రిల్ పొయ్యి మీద వంటలకు తయారు. ఇక గ్రిల్లింగే గ్రిల్లింగ్

గ్రిల్ మీద బార్బెక్యు చికెన్, మొక్కజొన్న కండెలు, బర్గర్స్, బంగాళా దుంప వేపుళ్ళు, అరటికాయ డెసర్ట్ ఇలాంటి వంటలు చేసుకుందామని ఎండాకాలం వచ్చినప్పటి నుంచి అనుకుంటూనే వున్నాను.కానీ దాన్ని సుభ్రం చేసి గ్రిల్లింగ్ కి అనుకూలంగా తయారు చేద్దామని అనుకుంటూనే ఎండాకాలం కాస్తా ఐపోవచ్చింది.మధ్యలో భారతదేశ ప్రయాణంతో ఒకనెల హరీమన్నది. చప్పబడిన నోటికి తెలుగు వంటలరుచి చూసి వచ్చేటప్పటికి ఎలాగైనా ఈ సారి గ్రిల్ మీద వంటలొండాలని నిర్ణయం తీసుకొని ఈ రోజు ఇదిగో ఇలాగన్నమాట. ఇక రేపటినుంచి గ్రిల్లింగే గ్రిల్లింగ్ :)