26, జులై 2020, ఆదివారం

నలభీమపాకం తిరగబడింది - సికినీ , పొరాటా తో నా పోరాటం.

నలభీమపాకం తిరగబడింది - సికినీ , పొరాటా తో నా పోరాటం.

ఎదురు చూస్తున్న వారాతం రానేవచ్చింది. ఈమధ్యన ఆదివారం వస్తే ముక్క లేనిది ముద్ద దిగడం లేదు. కాస్ట్కో నుంచి చికెన్ తెచ్చిన రోజు ఇంటావిడ దాన్ని శుభ్రం చేసి మేరినేట్ చేసి డీప్ ఫ్రిజ్ లో పెడుతుంది కాబట్టి ఏరోజు చికెన్ తినాలనిపిస్తే ఆరోజు దాన్ని బైటకు తీసి ఓ రెండుగంటలు గది ఉష్ణోగ్రత దగ్గర వుంచి వండుకోవడమే.

హడావుడిగా పొద్దున లేచి అల్పాహారం చేసి తన బాక్స్ తీసుకొని మా ఆవిడ పనికెళ్ళిపోయింది.కవితకు ఆదివారం పూర్తిగా పనిదినం. ప్రొద్దున పోతే మళ్ళీ పునర్దర్శనం సాయంకాలమే. మామూలప్పుడు వంటగదిలేకి నాకు ప్రవేశంలేదు. ప్రవేశంలేదనే దానికంటే నేను వంటచేస్తే వంటగదిని మళ్ళీ శుభ్రం చేసుకోవడానికి రెండింతల పనిబడుతుందని నన్నావైపు రానివ్వదు. ఆటలో ఆటవిడుపులాగా ఈరోజు కూరచెయ్యడానికి సమయంలేక వెళ్ళి పోయింది కాబట్టి వంటగది నాదే. యాహూ అనుకొని ఒక ఈల వేసి ఏంచెయ్యాలా అనుకొంటూ టీవీ లో యూట్యూబ్ వంటల ఛానళ్ళ వైపు నా దూరదృష్టిని మళ్ళించాను.

అమ్మచేతివంట యూట్యూబ్ ఛానల్ (https://www.youtube.com/watch?v=k1R8Mb3f83Q) లో పొరాటా చెయ్యడం చూశాను. పొరాటా చేసుకొని, చికెన్ గ్రేవీ కర్రీ చేసుకొని ఆ గ్రేవీని పొరాటాపై పోసుకొని నానిన తరువాత తినాలని ప్లాన్ చేసుకొన్నా. పూర్వాశ్రమంలో విశాఖపట్టణం నుంచి మా ఊరు వెళ్ళేటప్పుడు వినుకొండలో ఆగి మిలటరీ హోటల్ లో ఈ రకంగా తినేవాడిని. ఆ టేస్టు గుర్తుకొచ్చి ఆ యూట్యూబ్ ఛానల్ చూసి ముందుగా పొరాటా చెయ్యడం మొదలు పెట్టాను :)

   అక్కడ చెప్పినట్లుగానే ముందుగా మైదా పిండి, అందులోకి కావలసిన మిగిలినవి అన్ని కలిపాను. కానీ కొలతల తేడాతో అమ్మచేతివంట భార్గవి కి పిండి ముద్దలాగా వస్తే నాకు చారు లాగా వచ్చింది :).ఓ అరగంట మూతపెట్టి ప్రక్కన పెడితే అదే గట్టి పడుతుందిలెమ్మని అనుకుని ఓ అరగంట తరువాత పిండిని ఎనిమిది సమభాగాలుగా విభజించాలని చూస్తే తీగలాగా సాగుతుంది కానీ విడిపడదే :). ఇలా కాదులెమ్మని ఒక్క పొరాటాకు కావలసిన పిండిని ఆ పెద్ద చారులాంటి ముద్దనుంచి తీసుకొని ఒకదాని తరువాత ఒకటి చేద్దామనుకొని మొదలుపెట్టాను. పిండి చపాతీలు చేసే చెక్కమీద వేసి చపాతీకర్రతో రుద్దపోతే అది కర్రకు చుట్టుకొని పోతుంది కానీ గుండ్రంగా పలుచగా రావడంలేదాయె :) . అప్పుడు చూశాను వీడియో లో అలా పలుచగా వత్తేటప్పుడు పొడి పిండి కొద్దిగా ఆ ముద్దపై చల్లి ఆ తరువాత కర్రతో రుద్దడం. ఆహా ఇది కదా ట్రిక్ అనుకొని మొత్తానికి నాకు మించిన వంటగాడు ఈ ప్రపంచంలో వుండబోడని అన్నింటిని వీడియో లో చెప్పినట్టు చేస్తున్నానన్న ఉద్దేశ్యంతో మొదటి పొరాటో పెనంమీద వేసి రెండో దాని ప్రిపరేషన్ లో పడ్డాను. అంటే ఇంకొద్దిగా పిండి ముద్ద తీసుకొని చపాతీ కర్రతో రుద్దడం చేస్తున్నాను.

కొద్దిసేపటికి ఏందబ్బా ఈ వాసన అనుకుంటూ, నాముక్కులకు వాసన బాగానే తెలుస్తుంది అంటే నాకు కరోనా లేనట్టే నని నిర్థారించుకొని పెనం వైపు వెళితే గుప్పున మాడు వాసన :-). హతవిధీ అనుకుంటూ దాన్ని మరోవైపుకు త్రిప్పి కాల్చి ..అహా --పొరాటా రెడీ అనుకొని వీడియో లో చూపినట్టు రెండు చేతులతో దాని అంచులను వత్తబోతే ఎంతకీ పొరలు రావే..అసలు పొరలు రావడానికి అది వంగితే కదా, కడ్డీలాగా గట్టిగా వుంటేను. :)

మొదట పెనం మీద చేసిన పదార్థాన్ని కాస్త ఆసక్తి గా పరిశీలిస్తే అది నాకు "నాన్" లాగా అనిపించింది. మిగిలినవి చేసి చూద్దామని అన్నింటిని ఈ సారి మాడకుండా వళ్ళు దగ్గరపెట్టుకొని చేస్తే పొరాటాల బదులు నాన్ లు తయారయ్యాయి :)చికెన్ కర్రీ ఇంతకు ముందు చేసిన అనుభవం వుంది కాబట్టి దాన్ని చెడగొట్టకుండా కొంచెం బాగానే చేశాను. మొత్తానికి ఈ రోజు పొరాటాను గ్రేవీ లో నాన పెట్టుకొని తిందామనుకున్న నాకు నాన్ ను నాన పెట్టుకోవలసి వచ్చింది :)
21, జులై 2020, మంగళవారం

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమస్యలు...


ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం పరిశీలన మొదలైంది. ప్రతిపార్లమెంట్ నియోజక వర్గాన్ని జిల్లాగా చేస్తానని ఎన్నికల ప్రచార సందర్భంగా జగన్ వాగ్దానం చేసి వున్నాడు.ప్రతి పార్లమెంట్ నియోజక వర్గం జిల్లా కేంద్రంగా చెయ్యడానికి ఎవరికీ అభ్యంతరాలుండవు కానీ అలా క్రొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రంలో ఏఏ ఊర్లు చేర్చాలో ఆలోచించి సమగ్రనివేదికల తరువాత మాత్రమే జిల్లాల సరిహద్దులను నిర్ణయించడం మంచిది. ఉదాహరణగా మా ఊరు వినుకొండకు దగ్గర్లోని నూజెండ్ల మండలంలో వున్న గాంధీనగరం గ్రామం. మాది గుంటూరు జిల్లా. అసెంబ్లీ నియోజకవర్గం వినుకొండ. కానీ పార్లమెంట్ నియోజకవర్గానికొచ్చేటప్పటికి ప్రకాశం జిల్లాలోని బాపట్ల. ఇప్పుడు బాపట్ల కేంద్రంగా జిల్లా ఏర్పడి మా ఊరు లాంటి ఊర్లు ఎక్కడో దూరంగా వున్న బాపట్ల లో కలపడం అర్థంలేని పని. లోక్ సభ పరిధిలోని ఆ యా మండలాలను గ్రామాలను ఉన్నవి ఉన్నట్లుగా చేరిస్తే వచ్చే రాజకీయ ప్రయోజనమేమిటో నాకు తెలియదు. ఇలా చేయడంవల్ల మా ఊరు దగ్గరలోని నరసరావుపేట జిల్లాకు కాకుండా బాపట్లలో చేరడంతో ప్రజలకు చాలా అసౌకర్యంగా వుంటుంది.

 ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణం మీద ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు వస్తున్నాయి.అది వైసీపీ కి వ్యతిరేక పత్రికైనా ఆ కథనాల్లో నిజంలేకపోలేదు. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చే వార్తలు ఏవి స్వప్రయోజనంకోసం వ్రాసే వార్తలో, ఏవి ప్రభుత్వానికి లేనివి వున్నట్లుగా ఆపాదించే ఏడుపుగొట్టు వార్తలో,ఏవి క్షేత్రస్థాయి ఇబ్బందులతో కూడిన వార్తలో ఇట్టే చెప్పేయవచ్చు :)

ఇలాంటి సద్విమర్శలను అనుకూల వార్తలగా తీసుకొని నిర్ణయం తీసుకుంటే పార్టీకి ప్రభుత్వానికి మంచిపేరొస్తుంది. జగన్ పునరాలోచిస్తాడని కోరుకుంటున్నాను..

ఇలాంటి బ్లాగులో వ్రాసుకున్న వార్తలను ఒక రాష్ట్రముఖ్యమంత్రి పట్టించుకుంటాడా అన్న అనుమానాలు అక్కరలేదు. ఇది చేరవలసిన వారికి చేరి జిల్లాల ఏర్పాట్లలో సానుకూల మార్పులుంటాయని విశ్వాసంతో...

సెలవు.

18, జులై 2020, శనివారం

పూర్వకాలంలో బలిజె వారి ఇళ్ళు ఎలా వుండేవి?

బలిజవాళ్ళ ఇళ్ళ గురించి కొంత సమాచారం మనకు అసలు పద్యాలు హంసవింశతి పుస్తకంలో ఐదవ ఆశ్వాసములో 97,98 పద్యాల్లో కనిపిస్తుంది. నేను వర్ణన రత్నాకరము డౌన్లోడ్ చేసుకొని అందులో పద్యాలను ఇక్కడ ఫోటో గా జతచేస్తున్నాను.

ముందుగా పద్యాలు:

తగణము లానుకంట్లములు తండిగముల్ సలకల్ దడెల్ కుతూ
గణములు చెక్కుగుంపు లడిగంబులు పంబులు త్రాడుగట్లు మం
కెణములు గోతముల్ నగలు గెంటెపు బోరెము లాతనింటిలో
గణన కశక్యమై వెలయుఁగంజసమాన విశాలలోచనా!

గూటపుఁదిరుగుళ్ళు కొలికి దామెన త్రాళ్ళు
కందళి కెముకలి కదురుకోల
మఱగజమును మోడి మెఱుఁగుగాఁ
పిల్ల చుట్టులు నల్లుబిళ్ళ లొల్లె
త్రాళ్ళును బురికొసల్ దబ్బనములు నుసి
గంతలు నట్టెన కట్టె లసిమి
బలుపొన్ను లలరారు బగిస గూటంబులు
పెలుజోగి పట్టెళ్ళు పిల్లపట్టె

డలును బూవుల కోరగిన్నెలు విభూతి
పండ్లు గంగాళమును గుసిగెండ్లి పాల
మడ్డి బరణియు రుద్రాక్ష మాలికా స
మూహములు గల్గియుండుఁ దద్గేహమునను.


కొన్ని పదాలకు నాకు తోచిన,నిఘంటువులో చూచిన,నాకు అన్వయానికి సరిపడ్డ అర్థాలు ఇక్కడ యిస్తున్నాను.
తణగము=ఎద్దుమీఁదనుంచి నీళ్లు తెచ్చెడి తోలుసంచి. వక్కాలి
ఆనుకంట్లము=ఒక విధమగు సంచి
తండిగము=ఒకవిధమైన గోనెసంచి
సలక=చిన్నగోనె
దడి=వెదురు మున్నగువానితో నేర్పఱచిన తడిక
కుతూ గణము=సిద్దె,బుంగవలె తోలుతోకుట్టిన పాత్రల సముదాయము

అడిగము=ఒకవిధమైన గంప, ఎడ్లమీదవేసే కంట్లాలలో భేదం
పంబు=ఎద్దుమీఁద వేసెడు పెద్దసిద్దె
మంకెణము=ఎద్దులు మున్నగువాని మీఁద కొనిపోవు జలతైలాది పాత్రములు కుదురుగా నుండుటకై క్రింద సమర్పఁబడు బెత్తపుబుట్ట
గోతము;=గోనె సంచి
నగ=ఎద్దుమీఁది బరువు
గెంటెపుబోరెములు=జమిలినేఁత వస్త్రముతోఁ జేసిన దూది మొదలగునవి మూటకట్టుట కుపయోగించు సంచి
గణనకు=లెక్కించుటకు
అశక్యమై= సాధ్యము కానివై
వెలయు=ప్రకాశించు,ఒప్పు
కంజెసమాన విశాలలోచనా=తామర, పద్మములంత విశాలమైన నేత్రములు కలదానా.


గూటపుఁదిరుగుళ్ళు=గుంజలకు బొక్కలు పెట్టే సాధనము,స్క్రూ డ్రైవర్
కొలికి దామెన త్రాడు=కొక్కెములకు వేలాడదీసిన పెక్కు పలుపులు గల పెద్ద త్రాడు; త్రాడు
కందళి= టెక్కెము,ధ్వజము

మఱ=తిరుగుడు చీల, కీలు.
గజము మోడి= మూఁడడుగుల పరిమాణము. ముప్పది యాఱంగుళములు విడివిడిగ లేక గొలుసువలె ఒకటితో నొకటి పెనగొన్న వ్రాఁత

అల్లబిళ్ళ వల్లెత్రాడు=చిక్కు పడిపోయిన పసులఁగట్టెడి త్రాళ్ళు
పురికొసల్=పురికొసలు
దబ్బనములు=దబ్బనములు ( గోనె సంచులు కొట్టటానికి వాడుతారు)
నుసిగంతలు=కట్టెలు కాల్చటం ద్వారా వచ్చే నుసికి అడ్డు గంతలు (?)
అట్టెన కట్టె లసిమి= అటకపై కట్టెలు మూటగట్టుకొనే గోనెసంచులు
పలు-పొన్ను=రోకలి మున్నగువాని కొన నమర్చెడు లోహవలయములు
బగిసె గూటము=బగిసె చెట్టు గుంజలు
పట్టె=ద్వారబంధువు నిలువుకమ్మీ,ఇంటికప్పుకు వాడు పొడుగైన కఱ్ఱ
పాలమడ్డి =ధూపద్రవ్య విశేషము, (ఇది సాంబ్రాణి వంటిది)


పూర్వకాలంలో బలిజె వారి వృత్తి ప్రధానంగా వ్యవసాయ సరంజామా,ఇళ్ళ కు అవసరమైన సామాగ్రి మొదలైనవి సమకూర్చే పనిగా కనిపిస్తుంది.అలాగే కవిలెలు తోలడం, ఇల్లు కట్టడం, రైతుల పంటలను దాచుకోవడానికి,అమ్ముకోవడానికి కావాలసిన గోనె సంచులను,వేరే అవసరాలకు కావలసిన రకరకాల సంచులను సమకూర్చే పనికూడా వీరే చేసేవారనుకుంటాను.ఇప్పుడు మనము అన్నింటిని కలిపి సంచి అంటున్నాము కానీ నాడు చూశారుకదా ఎన్ని రకాల సంచులు వాడేవారో. బలిజె కులస్థులకు పైన చెప్పిన సంచులు, త్రాళ్ళు,పనిముట్ల వివరాలు తెలుసుండవచ్చేమోకానీ నేను చాలా పదాలు విని వుండలేదు. పూర్వం చాలా వరకూ పూరిల్లే కాబట్టి ఆ ఇంటికి గుంజలు,ఇంటికప్పుకు వాడే పట్టెలు, దూలాల లాంటివి వీరే సమకూర్చేవారని తెలుస్తుంది.అలాగే ఎద్దుల పోషణ కూడా అవసరార్తం చాలా ఎక్కువగా చేసేవారనుకుంటాను. పైన పద్యాలలో మొదటి పద్యం మొత్తము ఎద్దులపైన వాడే సరంజామా గురించే వర్ణించారు.

వీరికి దైవభక్తికూడా మెండనే విషయం పైన చివరి పద్యంద్వారా మనకు తెలుస్తుంది. ప్రధానంగా శివునికొలిచేవారనుకుంటాను. కారణం బ్రాహ్మణులలో తప్పించి సాధారణ ప్రజాళిలో దక్షిణభారతంలో నాడు శైవమంత ఉడ్రుతిగా వైష్ణవం లేదని చరిత్రద్వారా మనకు తెలుస్తుంది. కోరగిన్నెలు,గుసిగెండ్లి అనగా నేమిటో తెలియదు. విభూతి పండ్లు,గంగాళాలు,భరిణెలు,సాంబ్రాణీ,రుద్రాక్షలు,మాలికలు ప్రధానంగా పూజా విశేషాల్లో కనిపిస్తున్నాయి.

పూర్వకాలంలో రెడ్ల ఇళ్ళు ఎలా వుండేవి?

ఈ మధ్య ఆఫీసుపని వత్తిడితో పుస్తకాలు చదవడం పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడప్పుడూ చేతికి దొరికిన ఏదో పుస్తకంలో పేజీలు అలా ఇలా త్రిప్పడం తప్పించి మనసుపెట్టి ఒక్క పేజీకూడా చదవలేదు. ఓ వారం క్రితం అంతర్జాలంలో వర్ణన రత్నాకరము అనే పుస్తకాన్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ పుస్తకంలో  ఆసక్తికరమైన వర్ణన పద్యాలు చాలా పుస్తకాలనుంచి ఏరికూర్చారు. అలా వున్న వర్ణనల్లో గృహ వర్ణనలు ఒక భాగం. అందులో బ్రాహ్మణ,వైశ్య,శూద్ర,రెడ్డి,బలిజ,తిలఘాతక,వేశ్య,సూతిక,స్త్రీ శూన్య,వంటపూటి,చాకలి,పద్మశాలి వారి గృహవర్ణనలు వున్నాయి.మా వారి ఇళ్ళు అప్పుడెలా వుండేవో అన్నఆసక్తి కొద్దీ తెలుసుకుందామని ఈ క్రింది పద్యాన్ని చదివి అన్వయించుకొని సంబరపడ్డాను. వీలున్నప్పుడల్లా ఒక్కొక్కరి గృహవర్ణన పద్యాలతో ఓ పోస్టు వ్రాస్తాను. ఈ పద్యం శుకసప్తతి పుస్తకంలో రెండవ ఆశ్వాసంలో ౪౦౮ వ పద్యం. నాకర్థమైనంతలో ఇది వ్రాస్తున్నాను.పెద్దలెవరైనా మరింతలోతుగా విశ్లేషణ చెయ్యగలిగితే సంతోషం.సీ|| అచ్చమై వాకిట రచ్చఱాయిమెఱుంగు 
పంచతిన్నెలు, గొప్ప పారిగోడ
           కంప తెట్టులును, రాకట్టు ముంగిలి,మల్లె
సాలె, దేవర యిఱ చవికె యొకటి,
           కోళ్ళగూండ్లను,గొఱ్ఱు, కుఱుగాడి,యేడికో
లలు కాడి పలుపులు గలుగు నటుక,
           దూడలు, పెనుమూవకోడెలు కుఱు కాడి
గిత్తలీనిన మేటి గిడ్లదొడ్డి

  తే.గీ||   ఇఱుకు మ్రాను, పెరంటిలో నెక్కుబావి,
           మునుగలును, చొప్ప, పెనువామి, జనుము, రుబ్బు
           రోలు, పిడికెలకుచ్చెల, దాలిగుంత
దనరవగతంబు వెలయు నాతని గృహంబు.

ఈ పద్యం చదవగానే మా ఊరు గుర్తుకొచ్చింది. మరచిపోయి మనసుపొరల్లో అట్టడుగున మిణుకు మిణుకు మంటూ గుర్తుండీ గుర్తుండని చాలా పదాలు ఒక్కసారిగా స్ఫురణకు వచ్చాయి. ముందుగా కొన్ని పదాలకు అర్థాలు ( దరిదాపు ప్రతిపదార్థము) వ్రాసి ఆ తరువాత నా వివరణ వ్రాస్తాను.

తిన్నె=అరఁగు
మెఱుంగు=polished stone
తెట్టు=బయట ౘుట్టు నేర్పఱచిన కంప
రాకట్టు=చట్టము
ఇర= కల్లు
చవికె=మండపము
దేవర=ప్రభువు
ఏడికోల=నాఁగటికొయ్య
పలుపులు=పసువుల మెడకు కట్టెడు త్రాడు, తలుగు
పెను= పెద్దది, గొప్పది
మూఁపు=ఏద్దులకు వీపు పైన వుండే భుజశిరస్సు
కుఱు=వృత్తియందు ' కుఱుచ ' శబ్దము యొక్క అంత్య వర్ణము లోపింపఁగా మిగిలిన రూపము. అచ్చులు పరమగునపు ' ఱ ' వర్ణమునకు ' ద్విరుక్తటకారము ' ఆదేశమగును. ఉదా: కుఱుమొల్ల కుట్టుసురు, మొ.) పొట్టి
కుఱు గాఁడిగిత్తలు = కౌమారపు గిత్తలు
గిడ్డిదొడ్డి=పసులకొట్టము
అటుక=వస్తువు లుంచుట కింటిలోపల గోడలమీద అడ్డముగా కొయ్యలు లోనగువానిచే నేర్పఱచిన మంచె.
ఇరుకుమ్రాను=పంగల గుంజ
ఎక్కుబావి=ఎక్కుటకు మెట్లుగల బావి, నడబావి,దిగుడుబావి
మునగ=శిగ్రువు, ఒకానొక చెట్టు
పిడికెలకుచ్చెల=పిడకలు చొప్ప మొదలగువాని ప్రోఁగు, రాశి
దాలిగుంట=నిప్పులేని పొయ్యి
తనరు=పెరుఁగు, వర్ధిల్లు
అవగతము=తెలియఁబడినది, జ్ఞాతము

పై పద్యంలో వర్ణించినట్టు మాఊర్లో రైతుల ఇళ్ళు దరిదాపు పైవిధంగానే వుండేది. కాకపోతే కల్లు/సారాయి అలవాటు ఊరి రైతులకు లేకపోవటంతో ఆ గది మాత్రముండేది కాదు. పూర్వకాలంలో ఇల్లు సాధారణంగా రైలుపెట్టెలమాదిరి గదులు ఒకదానితరువాత ఒకటి వుండేవి. అంటే ముందు పంచ, ఆ తరువాత శయనాగారము, ఆ తరువాత వంట ఇల్లు. రహదారి వైపున ఇంటికి ముందు పందిరి, ఇంటిగోడల నానుకొని నల్లరాయి అరుగు.

మరోవైపు ఇంటిని ఆనుకొని పశువుల కొట్టము,పశువులు బైటికి రాకుండా చుట్టూరా రాళ్ళు లేదా కంపతో ప్రహరీ, ప్రహరీ కి ద్వారంగా పంగల గుంజ.పశువులకొట్టానికి కొద్దిదూరంలో రుబ్బురోలు, ఇంటిగోడకు వారగా గాడిపొయ్యి. కొద్ది దూరంలో దిబ్బ, కల్లము,దానినానుకొని వామిదొడ్డి, ఈమధ్యలో రుబ్బురోలు, దిబ్బ కు కళ్ళానికి మధ్యలో మునగ,బాదం చెట్లు. వ్యవసాయ సామాగ్రి అంతా దాచుకోవడానికి పశువులకొట్టంలో అటక. విశాలమైన ప్రాంగణంలో తిరిగే కోళ్ళు రాత్రులు కోళ్ళగూట్లోనో లేద గంపల క్రిందనో నిద్రపోయేవి. మంచాలకు కావలసిన నులక జనపనారను నానబెట్టి దానిని వడికి మంచానికి అల్లేవాళ్ళు.ఎండాకాలమొస్తే పిల్లలమైన మాకు జనపనార వడికే పనే!

ఇలా వుండేవి నా చిన్నప్పుడు మా ఊర్లో ఇళ్ళు.

గొఱ్ఱు


ఇక పద్య తాత్పర్యానికి వస్తే అప్పటి రెడ్ల ఇల్లు ఎలా వుండేవంటే  పంచలో మెరుగుపెట్టిన రాళ్ళతో అరుగులు, కంపతో వేసిన ప్రహరో గోడ, చట్టాలను చేసే ముంగిలి. మొన్నమొన్నటి వరకూ ఊర్లలో ఊరిపెద్దగా రెడ్లే వుండేవారు. ఊరి జనాలకు ఏమైనా తగాదాలైతే సహజంగా రెండు వర్గాలు వీరి దగ్గరకు వస్తారు. వాళ్ళకు సంధిచేసో లేక ఎవరికి చెప్పవలసింది వారికి చెప్పి రెండు వర్గాలను సంతృప్తి పరచో పంపేవారు.

ఆ తరువాత నిద్రించే గది, కల్లు త్రాగడానికి ఒక గది, కోళ్ళగూళ్ళు,కాడెద్దులు,గొఱ్ఱు,నాగలి( వ్యవసాయ పనిముట్లు ) చిక్కెము, పలుపులు మొదలైనవి పెట్టుకోవడానికి అటక, దూడలు, , చెంగుచెంగున ఎగురుతూ ఆహ్లాదాన్ని కలిగించే గిత్తలను ఈనే పశువుల కొట్టము,పెరట్లో దిగిడుబావి, మునగ చెట్లు,జనుము,రుబ్బురోలు,పిడకలు, గాడిపొయ్యి ఇలాంటి వాటితో రెడ్ల ఇల్లు వర్థిల్లుతున్నది.

12, జులై 2020, ఆదివారం

మళ్ళీ బ్లాగుల్లోకి.....

గత కొన్ని సంవత్సరాలుగా ఫేస్ బుక్ వాడుతున్నా గానీ నాకెందుకో బ్లాగంత సౌలభ్యంగా వుండటంలేదు.ఏదైనా వ్యాసం బొమ్మలతో వివరించాలంటే ఆ బొమ్మలొక చోట వ్యాసం మరోచోట వుండటంతో ఏబొమ్మ ఏవాక్యానికి లింకో సరిగ్గా తెలియడంలేదు.కాకపోతే అక్కడ మన సెలెక్టెడ్ లిస్టులో వాళ్ళకు మాత్రమే కనిపించేటట్టు పోస్టు వ్రాసే సౌలభ్యముంది.బ్లాగర్ పబ్లిక్ డొమైన్ కాబట్టి ఈ సదుపాయం దొరకదు.ఫేస్ బుక్ ఒకటి రెండు వాక్యాలు వ్రాసుకోవడానికి, బొమ్మలు ప్రచురించు కోవడానికి సౌలభ్యంగా వుంటుంది.కాబట్టి ఇక నుంచి పబ్లిక్ గా ఏమైనా పంచుకొనదలిస్తే బ్లాగులోనూ అలా కుదరని వాటిని ఫేస్ బుక్ లోనూ వ్రాద్దామనుకుంటుంన్నాను. వ్యాసాల నిర్వహణ,అరేంజ్మెంట్ లకు నాకు ఫేస్ బుక్ అస్సలు నచ్చలేదు. ఇక్కడైతే చక్కగా మనకు కావలసిన దానిని ఇట్టే పట్టుకొని అవసరమనుకున్నప్పుడు లింక్ లు కూడా ఇచ్చుకోవచ్చు.
 
అన్నట్లు ఇప్పుడు రోజువారీ తెలుగు బ్లాగర్లెందరుండవచ్చు? మాలిక,శోధిని బ్లాగు ఏగ్రిగేటర్ల నిర్వాహకులు ఏమైనా గణాంకాలు పంచుకొనగలరా? పరిస్థితి మరీ అధ్వాన్నంగా వుంటే ఇక్కడ పోస్టువ్రాసి ఫేస్ బుక్ లో లింకు ఇచ్చుకుంటే చదివే వారి సంఖ్య పెరగవచ్చు.

11, జులై 2020, శనివారం

తెలుగు నిఘంటువు (http://telugunighantuvu.org) - డాటా మైనింగ్ ద్వారా మరింత శక్తిమంతం.

తెలుగు నిఘంటువు - డాటా మైనింగ్ ద్వారా మరింత శక్తిమంతం.

దరిదాపు దశాబ్దం క్రిందట  తెలుగు బ్లాగులు దేదీప్యమానంగా వెలుగుతున్న రోజుల్లో నాకొక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను సాటి బ్లాగర్లతో పంచుకొని (http://chiruspandana.blogspot.com/2010/10/blog-post_5784.html ) అంతర్జాలంలో ఒక తెలుగునిఘంటువు వుంటే బాగుంటుందని ఒక సమూహంగా ఏర్పడి పని మొదలు పెట్టాము. కష్టనష్టాలకోర్చి శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువును, సూర్యరాయాంధ్ర నిఘంటు శేషమైన శ్రీహరి నిఘంటువును సమూహ సభ్యుల సహాయసహకారాలతో చాలావరకూ ఓ ఐదు సంవత్సరాలక్రితం పూర్తిచేశాము. ఈ ఐదు సంవత్సరాలలో శ్రీహరి నిఘంటువును కూడా చేర్చాము. ఈ పనిలో ఎవరెవరు సహాయంచేశారు, ఎవరెవరు ఎన్ని పేజీలను టైపు చేశారు మొదలైన సమాచారం ఇక్కడ చూడవచ్చు. (http://telugunighantuvu.org/About.aspx)

ఇంతకీ ఈ వ్యాసం ఇప్పుడెందుకంటే తెలుగునిఘంటువులో(http://telugunighantuvu.org) మనకు ప్రస్తుతం లభ్యమౌతున్న కొన్ని సదుపాయాలను వివరించదలచుకొన్నాను.

సాధారణ శోధన ( General search ) గురించి చివరి వ్యాసంలో వ్రాస్తాను.ప్రస్తుతం తెలుగు నిఘంటువులో లభ్యమౌతున్న బహుళశోధన గురించి వివరిస్తాను. మీరు http://telugunighantuvu.org కు వెళ్ళి బహుళశోధనము అనే లింకు పైన నొక్కినట్లైతే ఈ క్రింది పేజి కనిపిస్తుంది. పేజి మొదటగా లోడ్ ఐనప్పుడు బహుళశోధన controls అన్ని minimize చేయబడి వుంటాయి. దీనికి కారణము మనము సెర్చ్ చేసినప్పుడు వచ్చే పదాలకు చోటు పెద్దదిగా కనిపించాలని అలా చేశాను. ఆ పేజిలోనికి వెళ్ళి "బహుళ శోధన కంట్రోల్స్ కనిపించుటకొఱకు ఇక్కడ నొక్కండి " అన్నదానిపైన క్లిక్ చేస్తే ఈ క్రింది ఎంపికలు కనిపిస్తాయి. ఆ ఎంపికలలో మీకు కావలసిన దానిని నేరుగా తెలుగులో టైపు చేసి పొందవచ్చు. తెలుగు లో ఎలా టైపు చేయ్యాలో తెలియకపోతే ఈ పేజిని చూడండి. (http://telugunighantuvu.org/FontHelp.html). అంటే మీరు "ఓనమాలు" అని టైపు చెయ్యాలంటే "Onamaalu" అని ఇంగ్లీషులో టైపు చేస్తే అది తెలుగులో కనిపిస్తుంది.

ఇప్పుడు ఒక్కొక్క ఎంపిక ఏమి చేస్తుందో చూద్దాము.

౧) అర్థమున్న పదములు చూపుము : మనము ఏదైనా పద్యమో,కవితో లేక వ్యాసమో వ్రాసేటప్పుడు ఏమి వ్రాయాలో తెలుసు కానీ దానికి సరైన పదములు స్ఫురించకపోతే ఈ ఫీచర్ చాలా వుపయోగపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పద్యానికి కానీ కవితకు కానీ సరిపోయే గణాల పదాలు చప్పున పట్టేయవచ్చు. ఇందులో మళ్ళీ రెండు ఎంపికలున్నాయి ౧) కచ్చితమైన పూర్తి అర్థముతో కూడిన పదాలు ౨) పదము అర్థంలో ఎక్కడో చోట మనకు కావాలసిన పదమున్నదేమో చూచుకొనుటకుమొదటగా బహుళశోధనలో కచ్చితమైన పూర్తి అర్థముతో కూడిన పదాలు ఎలా పొందాలో ఒక ఉదాహరణ ద్వారా చూద్దాము. మీరు "ధ్వని" అనే పదము కు సరిసమానమైన పదాలు ఏమేమి వున్నాయో చూడాలనుకుంటే ఈ క్రింద చూపిన విధంగా టైపు చేసి దానికి ఎదురుగా వున్న శోధన అనే బటన్ నొక్కండి.
చూశారుగదా "ధ్వని" కి సమానార్థాలు ఎన్ని వున్నాయో.... మొత్తం 69 పదాలు "ధ్వని" అనే అర్థాన్ని ఉదాహరణ సహితంగా సూచిస్తున్నాయి. ఇంకే ముంది మీకు నచ్చిన పదాన్ని చూసి వాడుకోవడమే. అన్నట్లు ఎడమప్రక్కన ఆపదాలను ఎవరు టైపు చేశారో కూడా చూడవచ్చు. వారి కష్టం ఊరికే పోలేదు :)

మరో రోజు మరొక ఎంపిక గూర్చి చూద్దాము.