1, ఏప్రిల్ 2009, బుధవారం
శ్రీ సీతా రామ కల్యాణము - 1
శ్రీరామ నవమి వస్తుంది. గుడిలో పీటల మీద కూర్చొని అమ్మ వారి పెళ్ళి చేసే అదృష్టం ఏ కొద్దిమందినో వరించే వరం. కనీసం బ్లాగులో నైనా సీతమ్మ వారి కల్యాణం చేద్దామని మొదలు పెట్టి రెండు వాక్యాలైనా పూర్తి చేయకముందే కలం కదలనని మొరాయించింది. ఇంతకీ నా కొచ్చిన చిక్కేమిటంటే శుభలేఖ ఎలా ముద్రించాలని ? " శ్రీ సీతా రామ కల్యాణము" మనా లేకా " శ్రీ రామ సీతా కళ్యాణ" మనా ?
వీడి వితండ వాదం తగలెయ్య...అని తిట్టకండి, నిజంగా తెలియకే , తెలుసుకోవాలన్న కోరికతో అడుగుతున్నా. పెద్దలెవరికైనా దీని వెనుక దాగిన చారిత్రాత్మక లేక ఐతిహాసిక రహస్య మేమైనా వుంటే దయచేసి తెలుపండి. సీతా రామ కళ్యాణ మనే విన్నదీ కన్నదీ కాబట్టి నా టపాకు కూడా అదే పేరున మీ అందరికీ ఆహ్వాన పత్రిక.
ఈ టపా చదివే వాళ్ళందరికీ ఒక చిన్న మనవి. రామాయణము మహా కావ్యం. అది చదివే వారి మనసుల బట్టి వుంటుంది. వాల్మీకి రామాయణము నాపై ఎంత ప్రభావం చూపిందో రంగనాయకమ్మ గారి రామాయణము నాపై అంతే ప్రభావం చూపింది. రంగనాయకమ్మ రామాయణంలో నాకు నచ్చింది ఆమె రచనా తీరు, నాటి సాంఘిక పరిస్థితుల కూలంకుష విశ్లేషణ. అంతవరకే. నచ్చనది ఆమె అదేపనిగా ప్రతి పాత్రను విమర్శించడము. మొదటిలో ఆసక్తిగా వున్నా చదివే కొద్దీ విమర్శించాల కాబట్టి విమర్శిస్తూ సాగుతుంది కథ. ఆర్యులు , ద్రావిడులు లాంటి చర్చ ఇక్కడ అనవసరం. నా వరకు నాకు ఆర్యులు కూడా ఒక భారత తెగ.
అందుకనే
రామాయణాన్ని ఆధ్యాత్మిక దృష్టితో చదివేటప్పుడు, శృంగార కావ్యంగా చూడకూడదు.
ఆస్తికుని గా చదివేటప్పుడు మానవత్వాన్ని ప్రశ్నించకూడదు.
నాస్తికుని గా చదివేటప్పుడు దైవత్వాన్ని ప్రశ్నించకూడదు.
చారిత్రాత్మక దృష్టితో చదివేటప్పుడు కావ్య వర్ణనలు ప్రశ్నించకూడదు.
ఇవన్నీ కలిస్తేనే అది కావ్యం. ఏ భాషలోనైనా సరే !!! లేకపోతే అవి నవలలౌతాయి.
ఈ రకంగా మన మనోఫలకము పైన దేని ముద్రవుందో గ్రధము చదివేముందే గుర్తించ గలగాలి. ఆ దశ ఎదో తెలుసుకొని రామాయణాన్ని చదివితే అమృతం దొరుకుతుంది.
మరోమాట, ఎన్ని శ్లోకాలు ప్రక్షిప్తాలు, వాల్మికి ఎవరు ? ఎప్పుడు జరిగింది అనే వాదనలకు చోటులేదు. వీటిపైన మహామహులు ఉద్గంధ్రాలే రాశారు. వాటిని చర్చించడము ఉపయోగములేనిపని.
ఇలా మదిని ముప్పిరి గొలిపిన ఆలోచనల మధ్య నా బ్లాగులో 5 రోజుల సీతా కల్యాణం చేయ నిశ్చయించి మొదలెట్టిన తొలి టపా. " రామ " శబ్ద ప్రియులకు ఇది అంకితం.
ఆటవెలది||
రామ, రామ, రామ, రఘురామ, కారుణ్య
ధామ, సంకటహరధామ, ధరణి
జా నయన చరిత జగన్నాధ, భక్తుల
పాలి కరుణజూపు పద్మనాభ.
రేపు సీతమ్మ వారి పెళ్ళిచూపులు. అందాకా సెలవు.
దేవుళ్ళ గురించి చెప్పేటపుడు ముందు అమ్మవార్ల పేర్లే చెబుతారండి.. పార్వతీ పరమేశ్వరులు అనే అంటారు.. మంత్రాలలో కూడా అలాగే ఉంటుంది 'వాణీ హిరణ్య గర్భాయనమః.. శచీ పురంధరాభ్యే నమః..' ఇలా.. శుభలేఖ బాగుంది, అందమైన పద్యంతో.. అవునూ.. శుభలేఖలు పంచేశాక పెళ్లిచూపులు ఏమిటండి..? (నా సందేహం రామాయణం లో పిడకల వేట అన్నమాట:) )
రిప్లయితొలగించండిsubhalekaa inkaa mudrinchane ledu gaaaaaaa
రిప్లయితొలగించండిభాస్కర రామిరెడ్డి,
రిప్లయితొలగించండిచక్కగా వ్రాసారు. సీతారాములు అనిపిలవడం వెనుక ఐతిహాసిక కారణం నాకు తెలియదు గానీ, భారతీయ సంస్కృతిలో స్త్రీకి తల్లిగా, భార్యగా, ఇచ్చిన గౌరవం, ప్రాధన్యత ఇక్కడ కన్పిస్తాయి. ఒక్క సీతారాముల్నే కాదు, లక్ష్మీనారాయణులనీ, ఉమాశంకరులనీ, పార్వతీ పరమేశ్వరులనీ, వాణీహిరణ్యగర్భులనీ, అమ్మానాన్నలు, తల్లిదండ్రులు, అక్కాతమ్ముడు, అత్తామామలు ఇలా …… పిలవడమే మనకు తెలుసు. అందమైన మీ టపాను ‘రామ’ శబ్ధ ప్రియులకు అంకితం ఇవ్వడం మనోహరంగా ఉంది.
మురళి గారు, వ్యాఖ్య కి ధన్య వాదాలు. అమ్మఒడి గారు చెప్పినట్టు స్త్రీ పేరు ముందు వచ్చి తరువాతనే పురుషుని పేరు చెబుతారు.మనకు తెలియని కారణాలేమైనా వున్నాయేమోనని ఆ ప్రశ్న.
రిప్లయితొలగించండిమీరు గమనించారో లెదో , రామాయణంలో స్వయంవర ఆహ్వానము ముందు, ఆ తరువాతే పెళ్ళి పత్రికలు.
ఆ మహా కావ్యంలో పిడకలు వేటాడినా ఒక్క శ్లోక భావమైనా పూర్తిగా తెలుసుకోలేక పోయాను.ఆసక్తి కొద్ది అడుగుతున్నాను ఈ చాటువు ఎలా పుట్టింది?
విస్సు గారు , మీరు సరీగ్గానే చెప్పారు.ఇంకా శుభలేఖ లు అచ్చు వేయలేదు. ఈ టపా స్వయంవర ఆహ్వానమే.మరి పెళ్ళి చూపులంటే మాటలా? మరి సీతమ్మ వారి అనుమానాలన్నీ చదవాలంటే రేపటిదాకా ఆగాల్సిందే?
రిప్లయితొలగించండిఅమ్మఒడి గారూ,మీరు చెప్పిన వివరణ నాకు నచ్చింది.ఇలాంటి పదాలే భారతీయ సంస్కృతి కి పట్టు గొమ్మలు.
రిప్లయితొలగించండిఅప్పట్లో ఆడవాళ్ళకే ప్రాతినిత్యం ఇస్తున్నారని, మగవాళ్ళందరూ రాములువారికి మొరపెట్టుకున్నారంటండి...
రిప్లయితొలగించండిఅందుకే కలియుగంలో పెళ్ళి అయిన తరువాత స్త్రీలకి భర్త ఇంటిపేరు
ముందు వచ్చేట్టుగా వరమిచ్చాడంటండీ...
(Just for fun)
@ పద్మార్పిత : హ..హ.హ, మీ చమత్కారం బాగుంది. ఇప్పుడు ఆ ఇంటి పేరు మార్పులు గూడా లేవండి. సర్టిఫికేట్ల పుణ్యమా అని, పెళ్ళి అయినా ఇంటి పేరు మార్చుకోవడానికి కూడా ప్రభుత్వ సంస్థలలో లంచాలు ఇచ్చుకోలేక తండ్రి ఇంటిపేరుతోనే చలామణి అయ్యేవారు బోలెడంతమంది.
రిప్లయితొలగించండిఅయ్యా భాస్కరరామిరెడ్డి గారూ, మరి పెళ్లి పత్రికలు ముద్రించారా? సమయం ఆట్టే లేదు. మేము, అనగా మగపెళ్లి వాళ్లం అన్నిటికీ తొందరపెడాతాం. మీరు సిద్ధమేనా?
రిప్లయితొలగించండిఇది వినండి http://www.ushasri.org/new/audio.php
వరుణ్ని వరించేది వధువు. అనగా కేవలం వధువు కి మాత్రమే వరించే హక్కు ఉంది. మా అబ్బాయిని ఫలానీ అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తున్నాం అంటారే కానీ ఫలానీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి చేసారు అని అనరు.
వరించేది సీత, వరించబడేవాడు రాముడు. వధువు, వరుడు అన్నారేకానీ వధువును "వరి" అనలేదు.
ముందుగా తల్లి, తర్వాత తండ్రి. కాబట్టే తల్లితండ్రులు అంటాం, కానీ తండ్రితల్లులు అనము.
రిప్లయితొలగించండినవమాసాలు మోసి, నొప్పులుపడి కనేది తల్లే.
భాస్కరా - మీకో పెద్ద ప్రశ్న -
రిప్లయితొలగించండినవమినాడు శ్రీరాముడు జన్మించాడే కానీ అది ఆయన పెళ్లిరోజు కాదు కదా. మరి కళ్యాణం దేనికీ చెయ్యటం?
షష్టిపూర్తి రోజున పుట్టినరోజు పండగ కదా మరి ఆరోజు కళ్యాణం దేనికీ చెయ్యటం?
ఆర్యా!
రిప్లయితొలగించండి" శ్రీ సీతా రామ కల్యాణము "
అని అనడం సరైందని నా భావన.
ఇక ఆ పురాణ దంపతుల వివహం మీరు తలపెట్టడం { బ్లాగులో } అది మీ పురా కృత పుణ్య విశేషము. చాలా సంతోషం.
శుభమస్తు.
చింతా రామ కృష్ణా రావు.
భాస్కర్,
రిప్లయితొలగించండిఈ వాక్యం నా కెందుకో అసహజంగా వుంది.
>>మా అబ్బాయిని ఫలానీ అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తున్నాం అంటారే కానీ ఫలానీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి చేసారు అని అనరు
ఇది సహజంగా, మనము ఎవరి తరపునుంచి మాట్లాడుతామో వారిని సూచిస్తూ మాట్లాడుతాము.
నా కు తెలిసి మీ అమ్మాయిని ఎవరికిచ్చారు? అంటామే కానీ, మీ అబ్బాయిని ఎవరికిచ్చారు అని అనరనుకుంటా.
>> వధువును "వరి" అనలేదు .
:) బాగుంది.పిలకాయ్ వరిచేలల్లో బాగా పనిచేసినట్టుందే? :)
>> కల్యాణం గురించి. మీరు ఇలాంటి పానకంలో పుడకలాంటి ప్రశ్నలేస్తే శుభలేఖ ప్రింటింగ్ ఆలశ్యం అవుతుంది.( just for fun ). ఇది ఒకటి అర వ్యాఖ్యలతో అయ్యేది కాదు కానీ సీతమ్మ వారిని అయోధ్య కి పంపి మనము విపులంగా దాని గురించి రాసుకుందాం.
గురుతుల్యులు శ్రీచింతా రామ కృష్ణా రావు గారికి
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యతో నా బ్లాగు పునీతమైంది. శీర్షికను "సీతా రామ కల్యాణము" నుంచి "శ్రీ సీతా రామ కల్యాణము" గా మార్చడమైనది.
యాండోయ్
రిప్లయితొలగించండిఅంతా బాంది కానీండే - ఓ మాటండే - ఆడోళ్ళ పేర్లు మొగోళ్ళ ముందు ఇరికించేసండే, ఇపరీతమయిన గోరవం ఇచ్చేసినోళ్ళే శివపార్వతులనండే, నల్దమయంతులనండే , అల్లా సాలా రకాలుగా అనేసినారండే. అల్లాటియి సదూకున్న సరిత్రలో, దస్త్రాల్లో సానా కనపడతాయండే. అల్లా పిల్డానిక్కూడా యాకరణంలో సాలా సిత్రాలుంటాయండే. అయ్యన్నీ ఫాలో అయిపోతేనండే, ఎవ్వురికయినా పితలాటకాలుండవండే. అదండీ మారాజా!
దిన్నెల గారు,
రిప్లయితొలగించండిమీ భాష లో రాయలేకే నాకు చేతైన భాష లో రాస్తున్నందుకు మన్నించాలి.
I am a fan of your colloquial comments. Please add your 2 cents for the benifit of the rest of the readers.
Thanks for the comment.