28, మార్చి 2011, సోమవారం
మొత్తుకున్నందుకు ఓ వచనం. షట్కర్మల నుంచి జనమేజయుని దాకా :-)
మొన్నెప్పుడో రాయక రాయక ఒక కవిత రాస్తే సునీతేమో అప్పట్నించి మొత్తుకుంటున్నా గానీ వచనం రాయడంలేదని ఓ విసురు విసిరారు. ఇంతకీ ఏమి రాయాలా అని ఆలోచిస్తుంటే ఈ మధ్య నిఘంటువు పేజీల ఫార్మాట్ సరి చేస్తున్నా కదా ( ఫార్మాట్ మాత్రమే సుమా... అక్షర దోషాలు కాదు ), అలా చేసేటప్పుడు కంటికింపైన పదాలో! ఓ సారీ, కర్ణభేరికింపైన పదాలో అహా..మనసుకు నచ్చిన పదాలు అక్కడక్కడా కనిపిస్తే వేరేగా నోట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ పదాల లిస్టు మీమీదకు వదులుతాను. చదవడం మీ అదృష్టం. చదవకపోతే మీకు ఫలశ్రుతి దక్కదు. ఫలశ్రుతి ఏమిటంటే "చదివినవాళ్ళకు వారి కోర్కెలు రాబోయే నూటాపది ఏండ్లలో తీరుగాక " :-)
ఇక్కడ మీరు చదివి ప్రతిఒక్కటీ " ట" నే అంటే "అంట" అని చదువుకోవాలి. ఎవరో చెప్పినవి కాబట్టి అన్నింటిలో ఒక "అంట" వుచితంగా వేస్కోండి.ఇక అనుభవించండి.
"షట్కర్మములు " అంటే బ్రాహ్మణునికి విధింపఁబడిన ఆఱు కర్మములు (అధ్యాపనము, అధ్యయనము, యజనము, యాజనము, దానము, ప్రతిగ్రహము)
యజనం అంటే యజ్ఞం చేయడం. యాజనము అంటే యజింపచేయటం. ఇంతకీ రెంటికీ తేడా ఏమిటో.
ఇక ప్రతిగ్రహము అంటే దానము పుచ్చుకొనుట.
అలాగే బ్రాహ్మణునకు ఆరు జీవనోపాధులు చెప్పారు." ఉంఛము, ప్రతిగ్రహము, భిక్ష, వాణిజ్యము, పశుపాలనము, కృషి కర్మ".
ఇవికాక జీవించడానికి మిగిలివున్న మార్గాలు అలోచిస్తే దొమ్మీ చేయడం, దొంగతనం చేయడం,మోసం చేయడం ఇలాంటివన్నమాట. ఇవి వీరు తప్ప మిగిలిన కులాల వారు చేయవచ్చు అనేమో అర్థమా?.
**********
షట్కాలములు అంటే శివపూజకు విధింపఁబడిన ఆరు వేళలు. అరుణోదయము, తపనోదయము, సంగవము, మద్యాహ్నము, సాయాహ్నము, అర్ధరాత్రము.
ఇక్కడ పగటి కాలాన్ని ఐదు భాగాలుగా విభజించారు. ౧.ప్రాతః సమయము ౨. సంగవము ౩. మధ్యాహ్నము ౪.పరాహ్ణము ౫. సాయంకాలము. సంగవము అంటే పగటి కాలంలో రెండవ భాగం. ప్రాతః కాలము అయిన తరువాత ఆరు గడియలకాలాన వచ్చేది.
అంటే బహుశా ఎవరికి వీలైన సమయంలో వారు దైవ ప్రార్థన చేయటానికి అనుకూలంగా ఎన్నుకొన్న సమయాలేమో
మరోసారి మరిన్ని "షట్వాచకాల" ను చూద్దాం. కానీ మరికొన్ని ఆసక్తి కలిగించే వివరాలు చూసాను.
*****************
తెలుగు పద రూపమెలా వచ్చిందో చెప్పే ఈ వివరణ చూడండి.
తెనుగు, తెన్గు ,తెలుఁగు --- (శ్రీశైలము, దక్షారామము, కాళేశ్వరము ఈ మూడు శైవస్థలములకు నడుమనుండు దేశము. ఈ దేశమున వ్యవహరింపఁబడు భాష. దీని ప్రకృతి "త్రిలింగః". ప్రాకృతము "తెలింగో"
లాంగలి-నాఁగలి, తొల-తొన అయినట్లు తెలుఁగుశబ్దమే వర్ణవికారముచే తెనుఁగైనది.
కవిసంశయవిచ్ఛేద కర్త ప్రకృతులలోని "ల" కారము వికృతులలో "న" అగునని చూపుట కిచ్చిన యుదాహరణములలో "త్రిలింగః, తెనుగు" అనునది ఒకటి. ఇది లక్షణ గ్రంథకర్తల సిద్ధాంతము
బ్రౌను ఈ సిద్ధాంతము నంగీకరింపక "తెన్" అను తమిళపదము మూలపదముగాఁ దీసికొని "తెన్-దక్షిణము, తెనుఁగు-దక్షిణదేశపు భాష" అని వ్యుత్పత్తి చెప్పినాడు.
********************
అలాగే సప్త జిహ్వుడు అంటే అగ్ని అని చెప్తూ, ఆ ఏడు నాలుకల పేర్లు ఇలా వివరించారు.
కాలి, కరాలి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, ఉగ్ర, ప్రదీ ప్త అనునవి అగ్ని యొక్క యేడు నాలుకల పేర్లు
కానీ చిత్రంగా నాకు ఇవి వేరే రకంగా అనిపిస్తున్నాయు. మనం చెట్లమొద్దుల్ని మండించేటప్పుడు మంటల్లో రకరకాల రంగులు కనిపిస్తాయి కదా. ఆ రంగులననుసరించి, ఫైర్ ఇంటెన్సిటీ ని తెలుపుతూ పెట్టిన పేర్లేమో!
నిజానికి సోడియం మినరల్ కలిసిన మంట పసుపు పచ్చ గానూ, పొటాషియం కలిస్తే వైలెట్ రంగులోనూ, రాగి కలిస్తే ఆకుపచ్చ రంగులోనూ మంటవస్తుంది. దీనికి కారణం చెట్లలో అంతర్లీనంగా వుండే మినరల్స్ కారణమనుకుంటాను.
*************************
ఇంతకీ లేడీస్ అలంకార ప్రాయంగా పెట్టుకొనే సవరము, ఇప్పుడంటే తిరుపతి గుండ్ల నుంచి వచ్చిన వెంట్రుకలతో చేస్తున్నారేమో కానీ , పూర్వకాలంలో ఎవరూ జుట్టును కత్తిరించుకొనేవారు కాదు కదా. మరి అప్పుడు సవరాలు ఎలా వచ్చేవి? అసలు "సవరము" అంటే చమరమృగము యొక్క తోఁక. అని అర్థం. అంటే ఆ తోకతో చేసేవారేమో
**********************
ఇప్పటి కనూజ్ ను అప్పుడు కన్యాకుబ్జమని, చెంబల్ నదిని చర్మణ్వతి అని వ్యవహరించేవారు. గంగాయమునా నదుల మధ్యదేశాన్ని శశస్థలి అనేవారు
****************************
ఇక రాజు అంటే ఏ అర్థమున్నా, సమ్రాట్టు అని ఊరికే అనరేమో. సమ్రాట్టు అంటే రాజులకు రాజు. రాజసూయ యాగం చేసి అందరి రాజులను ఓడించి వారి దేశాలనుంచి ధన,వస్తు,కనక రూపంగా దబాయించి తీసుకొనేవాడినే అంటారేమో. దీనికి కారణం "సమ్రాట్టు అంటే పదికోట్లకర్షముల వార్షికాదాయము గలవాఁడు."
*************************
సినిమాపాటల్లో సరిగంచు తెల్లచీర అనో మరోటో ఎప్పుడో విన్న జ్ఞాపకంతో ఈ పదం మీదికి వెంటనే దృష్టి పోయింది.
సరిగంచు అంటే సరిగ+ అంచు. ఇంతకీ సరిగ అంటే హారము. హారము అంచుగా గల చీర. హ్మ్మ్?
**********************
జనమేజయుడు అంటే జనమును వృద్ధి పొందించువాఁడు అని అర్థం. అంటే భారత యుద్ధంలో దేశాల దేశాలకే యుద్ధంలో పాల్గొని చస్తే ( ఆడవారు యుద్ధం చేయరు కదా ) ఈ రాజు అప్పటి జనాన్ని బహుళంగా వృద్ధి చేయడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహాయపడి వుండాలి.
***********************
ఇక కల్పవృక్షాలు ఐదు. వాని పేర్లు ౧.మందారము ౨.పారిజాతము ౩.సంతానము ౪. కల్పవృక్షము, ౫.హరిచందనము
కల్పవృక్షమంటే కోరిన కోర్కెలు తీర్చే దేవతా వృక్షమనే అసంబద్ధ అర్థాన్ని ప్రక్కన పెడితే, బహుశా ఈ ఐదు చెట్లలో మనిషి అవసరాలకు, రోగాలను నశింపచేసే గుణాలు పుష్కలమనే చెప్పవచ్చు.
బాగున్నాయి.
రిప్లయితొలగించండి"పూర్వకాలంలో ఎవరూ జుట్టును కత్తిరించుకొనేవారు కాదు కదా. మరి అప్పుడు సవరాలు ఎలా వచ్చేవి? అసలు "సవరము" అంటే చమరమృగము యొక్క తోఁక. అని అర్థం. అంటే ఆ తోకతో చేసేవారేమో"..హ్హహ్హ..హ్హ భలే చెప్పారుగా:)
తిరుపతి జుట్టు సవరాలు మా వైపు ఎవరూ వాడరు..ఎవరి జుట్టుతో వాళ్లే సవరాలు కట్టించుకుంటారు. జుట్టు కత్తిరించుకోకపోయినా దువ్వుకునేటప్పుడు వెంట్రుకలు రాలుతుంటాయి కదా..వాటిని దాచిపెట్టి సవరాలు కట్టించుకోవటం ఊర్లల్లో చాలా మామూలు విషయం. ఇప్పటికి కూడా మా అమ్మ అలా జుట్టు దాచిపెడుతుంది:)
సిరిసిరి మువ్వ గారూ, అవును కదా..ఈరుబాన్లు, చెక్కదువ్వెనలు పెట్టి తెగ లాగి లాగి దువ్వితే జుట్టురాలక ఏమి చేస్తుంది :). పోనీ అయితే మీ జడలు సవరపు తోకల్లాగా వున్నాయని చెప్పేసుకుందాం:-)
రిప్లయితొలగించండిసునీతా, మీ కామెంట్ కు కూడా ధన్యవాదాలు.
భాస్కర రామి రెడ్డి గారు
రిప్లయితొలగించండిమీ టపా కొ౦తవరకు భలేనవ్వి౦చి౦ద౦డి. మధ్యలో శాస్త్రీయ వివరాలు ఉహూ , :)
మీ ఫన్నీ వ్యాఖ్యలు కొన్ని ఇక్కడ :
@యజనం అంటే యజ్ఞం చేయడం. యాజనము అంటే యజింపచేయటం. ఇంతకీ రెంటికీ తేడా ఏమిటో.
కెలకడం , కెలికి౦పజేయ్యడం :)
@ఇవి వీరు తప్ప మిగిలిన కులాల వారు చేయవచ్చు అనేమో అర్థమా?.
హ హ . టీచర్ చెయ్యకూడదు , స్టూడెంట్ చెయ్యొచ్చు . ఇది సత్య౦ :)
ఇంకో ex:
భా .ర .రే . హారం ఓనర్ కేలకకూడదు ,అనామకం గా వ్రాయకూడదు ...కాని బ్లాగర్లు కేలకోచ్చు , అనామకంగా న్యుసేన్స్ చెయ్యొచ్చు ..ఖి ఖి
@చమరమృగము యొక్క తోఁక
మహానుభావా, 'చమరమృగము యొక్క తోఁక వలె ఉన్న' అని భావ విశేషణము. :D
@సరిగంచు అంటే సరిగ+ అంచు. ఇంతకీ సరిగ అంటే హారము. హారము అంచుగా గల చీర. హ్మ్మ్?
ఖర్మ , ఖర్మ 'హారము' డిజైన్ అ౦చు ఉన్న చీర. మీ చొక్కాలకు కర్రలు, పుల్లలు, చదర౦గమ్ బోర్డు డిజైన్ ఉన్నట్లు . హహ్హహ్హ్హా
మిమ్మల్ని వచన౦ వ్రాయమని అడిగిన సునీత గారు ఎక్కడున్నా వచ్చి మాకు క్షమార్పణ చెప్పాల్సి౦దే :)
@ఇక కల్పవృక్షాలు ఐదు.
హ్మ్, కొత్త విష్యం
మోలి, మీ కామెంట్ కొద్దిగా పెద్దది గదా.. నైట్ కి రిప్లై ఇస్తా :-)
రిప్లయితొలగించండి