30, ఏప్రిల్ 2009, గురువారం

పంభూతాలు






ఏ చిత్రం చూసినా ఏమున్నది గర్వ కారణం?
నలుపు తెలుపుల జాడలు తప్ప.

ఏ రేఖ చూసినా ఏమున్నది శాస్త్రసాంకేతికం
గజి బిజి వంకర టింకర దారులు తప్ప

ఏ రంగు చూసినా ఏమున్నది చిత్రలేఖనం
రంగు సిరా విదిల్చిన ముద్రలు తప్ప

ఏ అంకె చూసినా ఏమున్నది మరోకారణం
అనంత సంఖ్యల గణన తప్ప

ఎన్ని తెలిసినా లోకమెంత మారినా
ఎవరికెరుక దీని రాక పోక?


మీ ముందుకు ... మరింత సమాచారం .... మన తెలుగులో.....
మరిన్ని విషయాలకై........... త్వరలో చూడండి...........

సైనికులారా పదండి ముందుకు
బూజు పట్టిన బానిస భావాల వలలు దెంచి
పదండి తోసుకు....

నవ యవ్వన భారతం మనది
నవ మన్మధ చేష్టలాపి
నవ్య భారత నాంది పలుక
పదండి ముందుకు..

మసిబారిన చెత్త నాపి
కుళ్ళిన కంపు నాపి
చేతన శోధన చేయ
పదండి తోసుకు....


23, ఏప్రిల్ 2009, గురువారం

మనిషి - మనసు







ప్రకృతి నడకన ప్రభవించిన మనిషి
జగతి భ్రమణ ప్రతిరూపం మనిషి

మాటకు పాటకు ప్రతిరూపం మనసు
పెదవి దాటే ప్రతి నాదం మనసు.
మదిన మెదిలే ప్రతి కదలిక మనసు
మూగ సైగలకు ప్రభూతం మనసు
హృదయ చెలముల ప్రతినాదం మనసు
ప్రతిమ ప్రతి కదలిక ప్రతిరూపం మనసు

ప్రభాత శాంతికి ప్రతిరూపం
మధ్యాహ్న భ్రాంతికి మలిరూపం
సంధ్యాకాల నిమీలిత రూపం
నిశి రాత్రిన కామానికి రూపం

పండువెన్నెల పులకింతలు
ఆషాఢమేఘ శోకధారలు
ఊహల పల్లకిలో పెళ్ళికూతురు
మరీచికల వీక్షణ పడిగాపులు.

పెదవులపై పండిన నవ్వులు
గుండెలు నిండా రహస్యాలు
జీవన పోరాట నృత్యాలు
అచలనమై సాగుతున్న జీవితాలు.

యాతనలో, వేతనలో
దారి తప్పిన కానలలో
జీవం లేని జనారణ్యంలో
మనిషికి మనసే తోడు.

19, ఏప్రిల్ 2009, ఆదివారం

తెలుగు బ్లాగులు - స్వగతం

అసలు దీన్ని శరత్ గారి బ్లాగులో వ్యాఖ్యకింద రాద్దామనుకున్న... కానీ గంటకష్టపడి అనవసరంగా శరత్ గారికి హిట్లు/వ్యాఖ్యలు ఎందుకు పెంచాలని ఇదుగో ఇక్కడ పెట్టుకుంటున్నా :-). ఇది వ్యాఖ్యగానే తీసుకోండి. అంటే అచ్చుతప్పులు, వ్యాకరణ దోషాలు భోలెడు ( బోలెడు ).

తెలుగు బ్లాగు గూగుల్ గుంపులో 'శోధన' సుధాకర్ వ్రాసిన మెసేజి లోని కొన్ని ఆంశాలు:

"బ్లాగులు ఒక అంతులేని స్వేఛ్ఛ వుండే ఇంటర్నెట్ అనే చోట రాయబడుతున్నాయి. ప్రతీ ఒక్కరికి భావ ప్రకటన స్వేఛ్ఛ వున్నట్లే, ప్రతీ బ్లాగుకూ ఒక ఆత్మ వుంటుంది. నేను స్వయంగా తెలుసుకున్న విషయమేమిటంటే బ్లాగరు ఎంత అగ్నాతంగా వుంటే అంత మంచిది. అందరికీ కూడా. పనికిరాని ముఖపరిచయాలు , కుశల
ప్రశ్నలు ఎక్కువై నేను బ్లాగు రాయటమే మానేసాను. ఏది రాస్తె ఎవరికి కోపమొస్తుందో అని నాకెప్పుడు భయం వుండేది కాదు కానీ, దాన్ని తీసుకు పోయి ఒక విప్లవాత్మక చర్చగా మార్చేసి, తీర్మానాలు చేసేస్తే ఎదుర్కొని వ్యాఖ్యలు తీరిగ్గా రాసుకుని వారిని చల్లబరిచే టైం లేక మానేసా. ఈ విషయమే నేను కొద్ది మంది బ్లాగ్ మిత్రులతో కూడా చెప్పాను.


చెప్పటానికి కొద్దిగా కారంగా వున్నా, ఈ మాట నిజం. ఎవరి బ్లాగు గోల వాల్లు చూసుకుని చక్కబరచుకుంటే మంచిది. అలా అయితేనే ఈ తెలుగు బ్లాగు ప్రపంచానికి
చుట్టూ వున్న ఇరుకు గోడలు పోతాయి. ఇంగ్లీష్ బ్లాగ్ ప్రపంచంలా మనకూ ఒక మంచి వాతారవరణం వుంతుంది.

సుధాకర్ (ఆగిపోయిన శోధన)"



బ్లాగులోకం ప్రాజెక్టులో పోష్టుమార్టమ్. -- నా స్వగతం.


శరత్ గారు, శోధన సుధాకర్ ఇచ్చిన సందేశం నాకూ నచ్చింది. ఇక్కడ "అఙ్ఞాత" అంటే కలం పేరుతో రాసుకోవచ్చనేమో అనిపిస్తుంది. ఇంతకంటే దాన్ని వ్యతిరేకించడానికి అందులో అసత్యము లేదు కదా !!!. ఇక్కడ ఈ ఆరు నెలల్లో నేను గమనించింది చెప్తాను ( మళ్ళీ నాపై దాడి చేయకండేం ). అసలు ఈ ఈర్షలు "వ్యాఖ్య" ల దగ్గర తగులుకుంటున్నాయనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క సారి ఒక పరమ చెత్త టపాకు వచ్చినన్ని కామెంట్లు ఒక మంచి టపాకు రావు. వ్యాఖ్యలదాకా ఏం ఖర్మ, అసలు చదువరులు కూడా తక్కువే. అది చెత్త టపానా మంచి టపానా నిర్ణయించాల్సింది పాఠకులు వారినుంచి వచ్చే కామెంట్లే అంటే నా దగ్గర చెప్పడానికి ఇంకేంలేదు. అలాగే రచయిత దృష్టిలో చెత్త అనుకుని ప్రచురించే వారు బహుతక్కువ. రోజుకొకటో లేక వారానికి ఇన్నో అని రాసేవారిని వదిలేయండి.

సమాజంలో గ్రూపులు సహజం. అలాగే ఇంటర్నెట్ లో కూడా. ఒకసారి ఒక గ్రూపు తయారయ్యాక, ఇక ఆ గ్రూపులో ఎవరు ఎంత చెత్త టపా రాసినా " ఆహా, ఓహో" అని తప్ప వేరే వ్యాఖ్యలు కనిపించవు. కొత్తగా ఈ బ్లాగుప్రపంచంలోకి వచ్చేవారికి " అరె నేనింత మంచి టపా రాసినా ఒక్క కామెంటూ లేదే " అని మానవునికి సహజంగా వుండే ఈర్ష నిద్రలేస్తుంది. అప్పటినుంచి అన్నీ ధూంధాం లే. అలా అని ఈ క్రొత్తగా వచ్చే వారిని పాత వాళ్ళు అంత ఈజీగా కలుపుకోరు సుమా !!! వీళ్ళు ఆ గ్రూపులో చేరాలంటే చచ్చినట్టు " ఆహా, ఓహో" అంటూ గేటు బయట నిలబడాల్సిందే. తాళం తీస్తే లోపలికెళ్ళి "వ్యాఖ్యల" పరంపరలతో పులకించి పోవచ్చు. లేదంటే "అఙ్ఞాత" గా తయారవ్వవచ్చు.

అలా అని కొత్తగా వచ్చే మనము మన బ్లాగు మొదలు పెట్టేటప్పుడు వ్యాఖ్యలకోసం మొదలుపెట్టము. మనకు నచ్చింది రాసుకుందామని మంచి వుద్దేస్యంతో వస్తాము. వచ్చి ఓ నెలో రెండు నలలో బ్లాగుతాము. ఆ తరువాత లెక్కలు గడతాము.

అరె, ఆ " పరమ చెత్త టపా " కి అన్ని వ్యాఖ్యలా ? (నిజంగానే చెత్త టపా). నాకిప్పటివరకూ ఒక్క వ్యాఖ్య కూడా లేదే ? ఎలా తెచ్చుకోవాలి ? ఇదుగో ఇక్కడ, ఒక్కొక్కరు ఒక్కొక్క దారి ఎంచుకొంటారు. ఒకరు అడ్డదారి , మరొకరు మట్టి దారి. కొంచెం అభిమానము వుండి ఓర్పు లేనివారు ముళ్ళ దారి చూసుకుంటారు. అది లేనివారు అడ్డదారి . రెండూ వున్నవాళ్ళు మట్టిదారి చూసుకుంటారు.

యుద్ధం మొదలు. యుద్ధంలో ఎప్పుడూ రెండు పక్షాలే. మిత్రపక్షం.... వైరిపక్షం. లోపల్లోపల వారి వారి గ్రూపుల్లో లుకలుకలున్నా పార్టీ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని అప్పటికప్పుడు సర్దుకు పోతూ వుంటారు. యుద్ధం ముగిసేలోపు కొత్తవాళ్ళందరూ తెలియకుండానే ఎదో ఒక పక్షంలో చేరిపోయి వుంటారు. కాబట్టి యుద్ధం దానంతటదే ఆగిపోతుంది... మళ్ళీ ఎవడో ఒకడు గోకే దాక. ఈ టపాతో ఇప్పడు, ఆ గోకినోణ్ణి నేనేనేమో. నీ కంతసీను లాదంటారా, అప్పుడు నేను ఏ పక్షంలో లేనెట్టే. అర్థంకాలేదా ?

ఈ దెబ్బతో నాకు ఎన్ని "అఙ్ఞాత" వ్యాఖ్యలొస్తాయో చూడండి. రాకపోయినా మరేం ఫరవాలేదు. ఎలా రాసుకోవాలో నాకు బాగా తెలుసు :)

11, ఏప్రిల్ 2009, శనివారం

ఇదీ సామాజిక న్యాయం లెక్క !!

మనవి : ఇది నేను ఏ కులాన్ని తక్కువ చేసో లేక ఎక్కువ చేసో చూపాలని నా వుద్దేశ్యం కాదని గమనించ గలరు.
ఇదీ సామాజిక న్యాయం లెక్క !!

ఈ మధ్య రాజకీయ పార్టీలకతీతంగా అన్నీ వార్తా పత్రికలలో కనిపించే పదం " సామాజిక న్యాయం ". దీనికర్థం ఏమైవుంటుందా అని వార్తాపత్రికలు తిరగేస్తుంటే, "ఏది నిజం" అని ఒకరంటే "పెన్ కౌంటర్" అని మరొకరంటారు. "ఎలక్షన్" అని ఒకరంటే "పాంచజన్యం" అని మరొకరంటారు. ఇంతా చదువుతుంటే పచ్చగడ్డి లేకుండానే భగ్గుమని మండే ఈ పత్రికలలో కూడా ఒక సారూప్యత వుందండోయ్ !!! అదే "సామాజిక న్యాయం". వాడు వాడాడు కదా నేనెందుకు వాడాలని కాకుండా అందరూ ఒకే పదాన్ని వాడి నాకు కొంత శ్రమ తగ్గించారు.

ఇంతకీ సామాజిక న్యాయానికి అర్థం ఏమిటొ ఎంత వెదికినా కనిపించలా.... అర్థం తెలియకపోతే మరి వార్త ఎలా అర్థం అవుతుంది? అందుకని నాకు నేనే ఓహో ఇదేనేమో అనిపించింది ఇక్కడ రాస్తున్నా... మీ దృష్టిలో వేరే అర్థం వుండవచ్చు.

ఇంతకీ నాకర్థం అయ్యిందేమంటే ... పార్టీ పెట్టాలన్నా, పెట్టి నెగ్గాలన్నా,నెగ్గి తినాలన్నా, తిని భరించాలన్నా సమైక్యాధ్రప్రదేశ్ లో ముందు జనాభాని కుల ప్రాతిపదికగా ఈ రకంగా విడగొట్టాలి. ( all percentages are close to reality as per reliable sources on the internet )


Reddy : 6.8 %
kamma : 4.8 %
velama : 3.0 %
komati : 2.7 %
kshtriya : 1.2 %
brahmana : 2.5 %

kaapu : 15.2 % ***** (దిలీప్ గారి వ్యాఖ్య ప్రకారం ఈ శాతం తూర్పు కాపులు, కళింగ, ఓసి కాపులు, రెడ్లు (తెలంగాణా రెడ్లతో కలిపి)).

golla : 6.3 %
telaga : 5.2 %
chakali : 4.2 %
mutarasi : 3.3 %
balija : 3.0 %
padmasali : 2.9 %
kummari : 2.1 %
devangana : 2.1 %
goundla : 2.0 %
vaddera : 1.9 %
mangali : 1.3 %
kuruma : 0.9 %
munnuru kapu : 0.8 %
boya : 0.7 %
besta : 0.7 %
uppara : 0.4 %
gavara : 0.4 %
jangama : 0.4 %
others : 2.9 %



mala/other S.C : 9.2 %
madiga : 6.8 %



muslims and
christians : 7.0 %




ఇప్పుడు ఈ లిష్టు ముందుపెట్టుకుంటే మా percentage ఇంత కాబట్టి మాకిన్ని సీట్లు దక్కాలి. మా కులం percentage ఇది కాబట్టి మాకు ఈ నిష్పత్తి లో సీట్లు కేటాయించాలి. మా జనాభా ఎక్కువ కాబట్టి రాజ్యం మేమే పరిపాలించాలి. ఇదీ నా కర్థమయిన సామాజిక న్యాయం. విభేదించేవారు వారి నిర్వచనాన్ని తెలుపవచ్చు.

సామాజిక న్యాయ రాజ్యం రావాలి. మంచిదే !!! ఇక్కడ F.C లెవరు ? B.C లెవరు ? S.C/S.T లెవరు ? ఈ విభజన ఏమైనా ఒక సైద్దాంతిక ప్రాతిపదికిన జరిగిందా ? మొన్న మొన్నటి దాక F.C లగా చలామణి అయిన కొన్ని కాపు కులాలు ఒక్క దెబ్బతో పాలకుల సౌకర్యార్థం వచ్చి B.C లలో చేరారు? B.C లుగా మారి వారు బాపుకున్నది ఏమిటి ? ఎన్ని ప్రభుత్యోగాలు సంపాయించారు? పాలకులకవసరమైతే రేపు రెడ్డి/కమ్మ/బ్రాహ్మణ లను బి.సి. లిష్టులలో చేర్చరని నమ్మకముందా? అప్పుడు అందరూ బి.సి లే కాబట్టి అప్పుడు ఏ సామాజిక న్యాయం పాటించాలి? అసలు సామాజిక న్యాయ రాజ్యం అంటే ఏ కుల M.L.A గారు ఆ కులాన్ని బాగు పరచాలా? ఇలా అయితే percentage తక్కువగా వున్న కులస్ఠులారా మీరు ఇప్పటికిప్పుడే ఒకరికి వంద మందిని కని మీ జనాభాని పెంచుకోండి. లేకపొతే ఈ రాజకీయ వాతావరణంలో సమర్థనాయకత్వానికి నూకలు చెల్లి సామాజిక న్యాయ రాజ్యాలు వస్తాయి కాబట్టి మీ కులానికి పుట్టగతులుండవు.

నాయకత్వ లక్షణాలు కలిగిన ఏ కుల భారత పౌరుడైనా ఇంత కుళ్ళిన రాజకీయాల్లో కూడా తనదైన రీతిలో ఒక్కో మెట్టు ఎక్కి అందలం అందుకున్నవాళ్ళే. అవి లేని వారు రాజ కుమారులైనా రాజు పేరు చెప్పుకొని బతికినవాళ్ళే. రాజ్యమేలడానికి ప్రాతిపదిక కులం కాదు, అన్నమో రామచంద్రా అని ఏడ్చే పేదలకి నాలుగు మెతుకులు పండించే మార్గం చూపించాలి . దాహమన్న వాడికి గుక్కెడు శుభ్రమైన నీళ్ళు ఇవ్వగలగాలి. మెరుగైన, సంస్కారవంతమైన జీవితానికి విద్యను ప్రసాదించాలి. జీవన ప్రమాణాలు పెంచాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పథకాలు అమలు పరచాలి. ఇవే కాని, నా కుల శాతం ఇది, నాకిన్ని సీట్లు అంటే F.C లందరూ B.C జాబితాలోనో లేక S.C/S.T జాబితాల్లోనో చేరినా ఆశ్చ్రర్య పోనక్కరలేదు.ఆలోచించండి.

9, ఏప్రిల్ 2009, గురువారం

వెన్నెల రాత్రి ........మదిలో కల.






వెన్నెల రాత్రి
మదిలో కల.

సముద్రుని పాదాల చెంత
దేవత అడుగుల వెంట
మదిలో మెదిలిన
గత ఙ్ఞాపకాలు.

ప్రతి కదలికలో
రెండు అడుగులు
ఒకటి నాది
ఒకటి నీది.

చివరి మలుపు మజిలీలో
ఙ్ఞాపకాల అడుగులు చూశా


తరచి తరచి చూసినా
వలచి వలచి వెదికినా
కనులు మూసి కదలినా
కనిపించిన దొకటే.

జీవిత గమన నాటకంలో
విషాద భరిత భూతంలో
తోడు లేని కాలంలో
రెండు లేవు, ఒకటే అడుగు.

"కవిత" నడిగా
నా దేవత నడిగా
కరుణించిన నీవు
కదల లేదు నాతో

కష్ట కాల సమయంలో
ఒంటరి జీవన గమనంలో
నా ఆడుగుల ముందు
నీ అడుగులు ఏవని?

దేవత చెప్పింది.......

ఓ నా చిట్టి బంగారూ
నా బాహు బంధనలలో
నిశ్చింతగా నువ్వు
ఆదమరచి వున్నావు.

కష్టాల కడలిలో
ఒంటరి గమనంలో
నువ్వు చూసిన ఆడుగు
నీదికాదు అది, నాది.

6, ఏప్రిల్ 2009, సోమవారం

spring break




పిల్లల spring break సందర్భంగా నా బ్లాగుకు 2 వారాల సెలవులు.



బ్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్రర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్రర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్క్

5, ఏప్రిల్ 2009, ఆదివారం

శ్రీ సీతారామ కళ్యాణము - 5



రామాయణం జరిగిందా ? కల్పితమా ? రామాయణం భూస్వామ్య వ్యవస్థ కు అద్దం పడుతుంది.

ఇవి మొదట నేను రంగనాయకమ్మ గారి రామాయణము చదివిన తరువాత మదిలో పాతుకుపోయిన ప్రశ్నలు. [ కాదు కాదు, అప్పటిదాక వున్న నమ్మకాన్ని తుడిచేసి విషబీజం నాటిన ప్రశ్నలు ]. నాలాగే రంగనాయకమ్మ గారి రామాయణము చదివిన తరువాత కచ్చితంగా ప్రతి సాటి మనిషి లో వుద్భవించే ప్రశ్నలు.

ప్రశ్న) రామాయణము జరిగిందా ?

జవాబు ) జరిగింది [అయితే గొడవలేదు ]

ప్రశ్న) రామాయణము జరిగిందా ?

జవాబు ) జరగలేదు. లేక నిరూపించండి.

ఈ సమాధానము మీదైతే నాదొక చిన్న విన్నపము. మీ రన్నట్టే జరగలేదు. కానీ రామయణ కావ్యం పురాతనం,అది ఒక కవి రచించాడు అనే దానిలో ఎవరికీ ధర్మ సందేహాలుండవేమో ? మరి ఆ కావ్యం చదివి అందులో మంచి తీసుకోవడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటి ? అసలు మంచేముంది అంటారా ? మీరు కచ్చితంగా భారత సంస్కృతి వినాశనానికి పావులు కదుపుతున్నారని నేను చెప్పక్కరలేదు. కాదు అంటారా ? మీ అంతరాత్మ ని సమాధాన పరచుకోలేక ఈ లోకంలోనే నరకము అనుభవించే మనస్తత్వము మీది.

భారతదేశంలో జీవన ఆవిర్భావం ఎప్పుడు జరిగిందో చెప్పడం కష్టం. ఆంగ్ల భాషా ప్రవీణులు , ఆ, మహా అయితే ఎంత ౩౦౦౦ సంవత్సరాలంటారా ? ఇప్పుడు నేనడుగుతాను, ఋజువులేవని? మీరు ఠక్కున ఏమంటారో తెలుసా ?

Book No 1 -- written by a
Book No 2 -- written by b
Book No 3 -- written by c
Book No 4 -- written by d

మనకు ఈ పుస్తకాలు సైటిఫిక్ ఆధారాలు, కానీ రామాయణం కాదు... కదా?

వేదాలు భారతీయుల అతి ప్రాచీన సాహిత్యం. సంస్క్రృతంలో వుండి ఇవి బతికి పోయాయి. లేకపోతే ఇవి కూడా ఏ మధ్య ఐరాపా నుంచో పుట్టించేవారు.

భద్రం ఇచ్చంత ఋషయఃస్వర్విదః తపోదీక్షా ముపాసేదుః అగ్రే |
తతో రాష్ట్రం బలం ఓజశ్చజాతం తదస్మై దేవా ఉపసం నమంతు ||

భావము : ఆత్మ ఙ్ఞానులైన ఋషులు లోక కళ్యాణం కోరుతూ సృష్టి ప్రారంభంలో దీక్షతో చేసిన తపస్సు నుండి జాతి నిర్మాణమైనది.జాతీయ శక్తి,తేజస్సు ప్రకటితమైనాయి. వివేకులైన వారందరూ దీనికి నమస్కరించాలి.

పైశ్లోకం భావము యధావిధిగా తీసుకుంటే అసంబద్ధంగా లేదూ?

దానికి అర్థం ఇది అని చేప్తే శ్లోకం అర్థం మార్చామని గగ్గోలు పేడతాము. వున్నది వున్నట్టు చెపితే అర్థం కాదు. మార్చి వ్రాస్తే తప్పు . ఇలాంటి ఆలోచనలు కచ్చితంగా అమాయకులకు రావు.

భావము ( వ్యాఖ్య ) : మంచి మనుషులు నాటి సంఘ మేలు కోరి బాగా ఆలోచించి జాతిని నడిపే సూత్ర గ్రంధాలు వ్రాశారు. అవి పెద్దలు అనుభవంతో వ్రాశారు కాబట్టి వాటిని మనము ఇప్పుడు పాటిద్దాం.

ఇలా వ్రాస్తే ఇది మీ భావన ( opinion ) అంటారు. ఇదీ ప్రస్తుత మన పరిస్థితి.

రామాయణ కావ్యాన్ని విమర్శించే వారు కావ్య లక్షణాలను తెలుసుకొని విమర్శిస్తే అర్థవంతంగా వుంటుంది.

కావ్యలక్షణాలు చదివితే తెలిసేవి కావు.

తమకు తాము గా ఒక శ్లోకమో లేక ఒక పద్యమో ఒక కవితో వ్రాస్తే , కవి ఊహాలోకాలలో ఎందుకు విహరిస్తాడో అర్థమవుతుంది.

రామాయణము మీద ( ఇది రామాయణము మీదనే కాదు ప్రతి ఛందో పద్య కావ్యాల పైనా ) మరో విమర్శ చెప్పాలంటే వ్యాకరణానికి అనువుగా పద్యం వ్రాస్తారని. అవును అలా రాస్తేనే పద్యం పండుతుంది. అలాగని ఛందస్సు కోసం భావాన్ని మార్చి , వేరే అర్థాలు వచ్చే పదాలు వాడి కావ్య రచన ఏ కవీ చేయడని మనవి. తన భావం ఆ పద్యంలో ( శ్లోకం లో ) పలకక పోతే వేరే ఛందో రీతి ని వాడతాడు. ఏదీ కాకపొతే గద్యమైనా రాస్తాడు కానీ భావం మార్చడని కొద్దిపాటి కవితా ఙ్ఞాన మున్న ఏ మనిషికైనా ఇట్టే అర్థమవుతుంది.

అలాగే ప్రతి శ్లోకానికి ఈ పదం అర్థము ఇది కాబట్టి ఈ శ్లోకం అర్థమిది అని అర్థం చేసుకుంటే నిజంగానే రామాయణం లో పిడకలు కూడా దొరకవు ( మురళి గారు, ఇది మీరు వ్రాసిన వ్యాఖ్య గా దయచేసి తీసుకోవద్దు. ). అందుకే రామాయణం చదవడానికి, చదివి అర్థం చేసుకోవటానికి కవితా హృదయం తప్పని సరి.

భ్రాతర్యదీదం పరిదృశ్యతే జగన్మాయైవ సర్వం పరిహృత్యచేతసా |
మద్భావనాభావిత శుద్ధమానస స్సుఖీభవానన్దమయో నిరామయః ||

పైశ్లోకం శ్రీరాముడు లక్ష్మణుని తో అన్నది. ఇక్కడ ఇది లక్ష్మణుని తో అన్నట్టు కాకుండా మీకు చెప్పినట్టు చదువుకోండి. చదివి తరించండి

సమాప్తం,

శుభమస్తు
జై శ్రీరామ |

4, ఏప్రిల్ 2009, శనివారం

శ్రీ సీతారామ కళ్యాణము - 4



ఈ రోజు కూడా మనందరకు ఆ సీతా రాములు ప్రశాంత జీవనాన్ని ప్రసాదించాలని, కోరుకుంటూ...నాల్గవ భాగానికి స్వాగతం.

సీతా చేయి రాముని చేతిలో ఉంచి జనకుడు గద్గద స్వరంతో

ఇయం సీతా మమ సుతా
సహధర్మ చరీ తవ |
ప్రతీచ్చ చైనాం భద్రం తే
పాణీం గృహ్ణీష్వ పాణినా ||

ఈ ఒక్క శ్లోకం చాలు, కన్యా దాన సమయాన తండ్రి అనుభవించే ఆనందము తో కూడిన బాధను తెలుసుకోవడానికి .

ఒక ప్రక్క తన అనురాగాల పట్టి కళ్యణ వేడుక. మరో ప్రక్క రేపటి నుండి నా చిట్టి తల్లి ఈ యింట కనపడదన్న దిగులు.

ఒక ప్రక్క తన బిడ్డ ఒక యింటి వెలుగౌతున్న ఆనందం. మరో ప్రక్క అత్తవారింట అన్నీ సౌఖ్యమేనా అన్న అనుమానం.

ఒక ప్రక్క బంగారు తల్లి కి మంచి సంబంధం చూశానన్న ఆనందం . మరో ప్రక్క అల్లుడు నా బిడ్డని సరిగా చూసుకుంటాడా లేదా అన్న దిగులు.

ఒక ప్రక్క తన సాంఘిక బాధ్యత తీరినదన్న సంతోషం . మరో ప్రక్క నా తోడు లేకుండా ఈమె ఈ సంఘంలో ఎలా నెట్టుకొస్తుందో నన్న దిగులు.

ఇది...ఏ సమాజంలో నైనా, ఏ మతంలో నైనా ప్రేమ మూర్తులైన తల్లి దండ్రుల ఆనంద ఆవేదన. ఆనందం, దిగులు సర్వజనీనం. మతాని కతీతం. కొన్ని వేల ( లక్షల ? ) సంవత్సరాల అనుభవ సారం హిందూ మత పురాణ కావ్యాలు. ప్రపంచం లో ఏమతానికుంది ఇంతటి ఉజ్వల చరిత్ర ?



ఓ రఘోత్తమా నుడివెద నే పుడమిన
గురువు లెల్ల చెప్పు గురువు మాట
సతిని కావు మయ్య సతతము దయన ధ
ర్మార్థ కామ మోక్ష కార్య మందు.


దీనికి వధూ వరులు కట్టుబడి వుంటే ఈ జగతిన అనాధ బాలలే వుండరేమో !!!

కథలోకి వెళ్తే...జనక మహారాజు ఇప్పటిదాక జానకి గా పెరిగిన తన పుత్రిక ను కన్యాదానం చేస్తాడు.సీతమ్మ మెడన శ్రీరాముడు మంగళ సూత్రము కడతాడు. దేవదుందుభుల నినాదం మిన్ను చేరింది. తన పుత్రిక కళ్యాణం నిరాఘాటంగా జరిగినందుకు పుడమి పులకించింది. చెట్లు భూమి సిగన పూలవాన కురిపించాయి.

ఈ విధంగా రామునకు సీతను, లక్ష్మణునకు ఊర్మిళను, భరతునికి మాండవిని, శత్రుఘ్నునకు శ్రుతకీర్తిని యిచ్చి వివాహము జరిపించారు.

౫ వ రోజు అయోధ్య ప్రయాణం : పెళ్ళివేడుకలు వివాహ లాంఛనాలు పూర్తి అయ్యాయి. రధాలు సిద్ధమయ్యాయి. వచ్చిన బంధు జనమంతా తిరుగు ప్రయాణమయ్యారు.అయోధ్యకు బయలుదేరిన రధాలు వేగంగా వెడుతున్నాయి.ఆకాశం మేఘావృత్త మయ్యింది . చీకటి పడుతుంది . మెరుపులు తళుక్కుమని మెరుస్తున్నాయి. ఆ మెరుపులో ఎదురుగా ఒక బలశాలి త్రిపురాసుర సంహారానికి వెళ్ళే రుద్రునిలా వున్నాడు. భుజం మీద చీకటి లో కూడా వెలుగులు విరజిమ్మే గండ్రగొడ్డలి. దశరధునికి, వసిష్ట మునీంద్రులకు ఎదురుగా వున్నది ఎవరో క్షణంలో అర్థం అయ్యింది. ఎదురుగా శత్రువు. వెనుక నూతన వధూవరులు. విషయం గ్రహించిన వసిష్టుడు పరశురామునికి అర్ఘ్యపాద్యాదులనిచ్చారు.

పరశురాముడు రాముని వైపు చూసి ఇదిగో ఈ విల్లు నా తండ్రి జమదగ్నిది. దీన్ని ఎక్కుపెట్టి నాతో ద్వంద్వ యుద్ధానికి రా ! దశరథుడు శాంతి చేయ ప్రయత్నిస్తాడు. తండ్రి చెంత నుండగా ఏ కొడుకైనా పరాక్రమాన్ని ప్రదర్శించాలని చూడడు. అలాగే రాముడూ నూ. ఎంతకీ పరిష్కారం కనిపించక విల్లునెత్తి బాణమెక్కుపెట్టి పరశురాముని చంపకుండా వదిలేస్తాడు.

నలుగురు పుత్రులూ తమతమ అర్థాంగులతో అయోధ్య చేరారు.

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

రేపు ఉపసంహారం.అందాకా సెలవు.

జై శ్రీరామ

3, ఏప్రిల్ 2009, శుక్రవారం

శ్రీ సీతా రామ కల్యాణము - 3





ముందుగా శ్రీరామ నవమి సందర్భంగా బ్లాగ్బాంధవులందరికీ ఆ సీతా రాముడు ప్రశాంత జీవనాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ...


రామో రామో రామఇతి ప్రజానామభవన్ కథా !
రామభుతం జగదభూత్ రామోరాజ్యం ప్రశాసతి !!

జగత్తంతా రామ మయం. ఎక్కడ విన్నా రామ కథలే. ఈ ప్రకృతి ( పర్వతాలు, నదులు ) వున్నంత కాలం రామకథ ప్రచారంలో వుంటుంది.

కథ లోకి వెళితే

శివధనుస్సు చూడడానికి రామలక్ష్మణులు వచ్చారని విశ్వామిత్రుని ద్వారా జనకునికి తెలుస్తుంది. జనకుడు తనకు ఆ శివధనుస్సు ఎలా వచ్చింది [ ఇక్కడ ఆనాటి తర తరాల సంపద గురించి అది ఎంత పాతదైనా దానికుండే విలువలు అర్థమవుతాయి ] , అలాగే సీత తనకు ఎలా దక్కింది , స్వయంవర పేరుతో రాజులను అవమానిస్తున్నావని జరిగిన దండయాత్రలు అన్నీ చెప్తాడు.

ఇక్కడ ఒక చిన్న వ్యావహారిక సూత్రం...పెద్దల మాట ఎలావుందో చూడండి.

కన్యా వరయతే రూపం మాతా విత్తం - పితా శ్రుతమ్ !
బాంధవాః కులమిచ్చన్తి - మృష్టాన్న మితరే జనాః ||

ఎంత సుందరమైన శ్లోకం.

వధువు, తనుచేసుకోబోయేవాడు అందగాడా కాదా అని మాత్రమే అలోచిస్తుందట.

తల్లి, ఆస్తిపాస్తులు వున్నవాడా కాదా అని ఆలోచిస్తుందట. [ మరి ఇంట్లో ఏమున్నా లేకున్నా "అమ్మా ఆకలి" అన్న బిడ్డ జాలి చూపులు చూసేది తల్లే కదా ? ఈ అనుభవం ఆమెకు ధనము ఎంత అవసరమో నేర్పిస్తుంది ]

తండ్రి, తనకు కాబోయే అల్లుడు చదువూ సాంప్రదాయాలున్నవాడా కాదా అని చూస్తాడంట. [ అవును మరి , కుటుంబానికి కావలసిన ఆర్థిక పరిపుష్టి సమకూర్చడం యజమాని బాధ్యత. ఈయన తనకున్న అనుభవంతో బయట నాలుగు రాళ్ళు సంపాయించాలంటే చదువు సాంప్రదాయాల ఆవశ్యకత అప్పటికే గుర్తించి వుంటాడు. చదువున్నా, నోరు మంచిది కాకపోతే పని ఎవడు ఇస్తాడు ? ]

బంధువులు, చెడ్డపేరు లేని వంశమునుంచి వచ్చినవాడేనా అని అలోచిస్తారట [ మరి నలుగురిలో అవమానము లేకుండా వుండాలి కదా ]

మిగతా జనం , విందు భోజనం బాగుంటే చాలు అనుకుంటా రట,

వరుని ఎంపిక గురించి ఇంతకంటే బాగా ఏ కావ్యం వ్రాయగలదు ? ఏ మతం చెప్పగలదు ?

మళ్ళీ కథలోకి వెల్దాం...

విశ్వామిత్ర ఆఙ్ఙానుసారం శ్రీరాముడు ముందుగా ధనుస్సును ఒకసారి చూసి ఎక్కుపెట్ట గలనా లేదా అని చూసుకొని నమ్మకం కలిగాక విల్లు ఎక్కుపెట్టడానికి సిద్ధపడతాడు. పెట్టెలో నున్న వింటిని బయటికి తీసి నారిని బిగించి బాణాన్ని సంధించి లాగాడు. విల్లు ఫెళ్ళున విరిగింది.

తే||
కురిసె పూల వాన మిథిలా పురియు నంత
మంగళ రవము లింపుగ సాక్ష మిచ్చె
మెరెసె సీత కన్నులు మిరుమిట్లు మెరియ
మోద మందిరి పురమున ఙ్ఞాత లెల్ల.




రాముడే నా అల్లుడని అంత సభలోనూ జనకుడు ప్రకటించాడు.ఈ వార్త దూతల ద్వారా నాల్గవ రోజుకు ఆయోధ్యా నగరం చేరుతుంది.

మిధిలానగరానికి పెళ్ళికళ వచ్చేసింది. రాజధాని అంతా కళ్ళాపు నీళ్ళతో తెల్లని ముగ్గులతో కళ కళ లాడుతూ నాయనారవిందంగా వుంది. మామిడి తోరణాలు నగరమంతా స్వాగతం పలుకుతున్నాయి. విచ్చేస్తున్న అతిధిలందరికి , ముందే వచ్చిన రాజులు స్వాగతిస్తున్నారు. పాత మిత్రులు చాలా కాలానికి కలిసిన సందర్భంగా కౌగిలింతలు, ఆత్మీయవాక్యాలు,పరాచకాలు,బాల్యవృత్తాంతాలను చెప్పుకుంటూ చూచు వారలకు చూడ ముచ్చటాగా వుంది వాతావరణమంతా!!!

రాజులు వాహనాలగా విచ్చేసిన గుఱ్ఱాలు, ఏనుగులు చూసి ప్రజలు అనందిస్తుంటారు. వినడమే తప్ప జీవితంలో చూడలేమోమో అనుకున్న రాజులను సీతమ్మ వారి పెళ్ళి పుణ్యాన ప్రజలు చూసి తరించారు.

పెళ్ళి ౫ రోజులు చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఆడపెళ్ళి వారి తరపున శతనందుడు , మగపెళ్ళి వారి వైపు వసిష్టుడూ పెద్దలయ్యారు. ఒక్కోరోజు గురించి ఒక్క వాక్యంలో చెప్పుకుందాం. నచ్చితే మళ్ళీ రామాయణం చదువుకుందాం.

మొదటి రోజు : ఇరు వైపు వంశ వృత్తాంతాలని ఒకరికొకరు తెలియచేసుకుంటారు [ దీని వల్ల పెళ్ళి అయిన తరువాత అమ్మాయి తరపు / అబ్బాయి తరపు వాళ్ళు ఎవరికి ఎవరు ఏమౌతారో తెలిసి ఈ రోజుల్లో లాగా మావైపు/మీవైపు అనేవి వుండవేమో ]

రెండవరోజు : నిశ్చితార్థం [ తాంబూలాలు తీసుకోవడం ] , ఇరు వైపుల వంశ వృత్తాంతం విన్న తరువాత అంగీకారం తెలపడం.

మూడవరోజు : గోదానం [ ఈ దాన వివరాలు మూలం లో చాలా చాలా నే వ్రాశారంట. ఆనాటి సామాన్య ప్రజల సాంఘిక ఆచారలకు పనికి వచ్చే ఘట్టం ]

నాల్గవరోజున వధూవరులను మంటపానికి తీసుకొచ్చేరోజు. శా॒స్త్రోక్తంగా వివాహానికి మొదలు ఇది. అమ్మవారిని చెలికత్తెలు తయారు చేయ నారంభించారు.



సీ ||
ఒక గడుసరి చక్కగా కట్టె కురులెల్ల
నల్లనీ రాముడే నా మొగుడని నుడికించి

నొక సుందరాంగి తా నొయ్యారియై నడ
యాడి లలాట తిలకము దిద్దె

నొక చెలి కనులు మూయక సీతయని ఇంపు
గా దిద్దె కనులార కాటుకంత

నొక ప్రాణసఖి సిగ్గుమొగ్గలే నివి యని
బుగ్గచిదిమి దిష్టి చుక్క బెట్టె

గీ||
సిగ్గు మోమున ధరణిజా సీత నడిచె
బంగరు మణి మాణిక్య భంజికములె
సింజితారాగ నాదములై, శీఘ్రమే చితి
చిహ్న నాదమై రావణు జేరె నపుడు.



అసలు ఈ వివాహ ముఖ్యోద్దేశ్యము అదే!!!

సీతమ్మ వారితో పాటు మిగిలిన మువ్వురు కన్యలూ దేదీప్యమానంగా వెలుగు ప్రమిదలలా కనిపిస్తున్నారు. జనక మహారాజు రాముణ్ణి సాదరంగా తోడుకొని వచ్చి అగ్నిహోత్ర వేదమంత్రాల మధ్య సీతమ్మ చేతిని రాముని కందించి ఈ విధంగా చెప్పాడు.

ఇయం సీతా మమ సుతా
సహధర్మ చరీ తవ |
ప్రతీచ్చ చైనాం భద్రం తే
పాణీం గృహ్ణీష్వ పాణినా ||


ఈ శ్లోకం చుట్టూ సృష్టి లో ప్రతి వివాహ వ్యవస్థ తిరుగుతుంటుంది. సీతమ్మ చేయి రాముడు పట్టుకొన్నాడు కాబట్టి వారిని రేపటిదాకా కొంచెం ఏకాంతంగా వుండనిద్దాం.

పై శ్లోకం పెళ్ళి ఘట్టంలో చాలా ముఖ్యమైంది కాబట్టి రేపు దీని గురించి కొద్దిసేపు ముచ్చటించు కుందాం ||

2, ఏప్రిల్ 2009, గురువారం

శ్రీ సీతా రామ కల్యాణము -2




శ్రీ సీతా రాముల కల్యాణ రెండవ భాగానికి రామ నామ ప్రియులందరికీ స్వాగతం.

ముందుగా కథలోకి వెళ్ళే ముందు రెండు మాటలు. ఇక్కడ నేను రామాయణం లోని శ్రీ సీతా రాముల కల్యాణ ఘట్టాన్ని అనువదించి చెప్పాలనో, లేక ప్రతి శ్లోక తాత్పర్యాన్ని వివరించాలనో మొదలు పెట్టలేదు. అంత సామర్థ్యము, పాండిత్యము , శక్తి నాకు లేవు. ఉన్నదల్లా శ్రీరామ నవమి వస్తుంది కాబట్టి ఈ నాలుగు రోజులైనా రామాయణ పారాయణం చేద్దామని. చేసి తరిద్దామని . నా సంస్కృతిని నిలుపుకుందామని . నచ్చితే నలుగురిలో రామాయణము చదవాలనే కోరిక రగులుతుందని. అంతే ఇంతకంటే ఎక్కువ అద్భుతాలు మీకు ఇక్కడేమీ కనబడవు.అలాగే ఇందులో వ్రాసినవి కూడా కొన్ని చిన్నప్పటినుండి విన్నవి, కొన్ని చదివినవి. అంతే ఇందులో నా ప్రఙ్ఙ ఏమీ లేదు.

"రామ", "రామ", "రామ" అని వ్రాసుకుంటూ పోతే అది కచ్చితంగా ఎదో ఒక శ్లోకమో , పద్యమో అవుతుంది. ఆ రెండు అక్షరాలు అంత సుసంపన్నమైనవి. కోకిల కు "కూ, కూ" అని గానము చేయటమే వచ్చు.అలాగే వాల్మీకి కి "రామ రామా" అన్న ధ్వనే వచ్చు. ఈ శ్లోకం చూడండి.

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్ |
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలమ్ ||

అదీ విషయం.

ఒక సారి శంకరుడు పార్వతీ దేవితో ఇలా అన్నాడట. " రామ" , "రామ", "రామ" అని మూడుసార్లు అంటే వెయ్యిమార్లు రామ నామము చేసినట్లేయని.

శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే |
సహస్రనామ తత్యుల్యం రామనామవరాననే ||

వ్యాఖ్యాన సహిత వాల్మీకి రామాయణం లో దీని గురించి ఈ విధంగా వివరణ వుంది.

"య" , "ర" , "ల", "వ" లలో "ర" 2 వ అక్షరం.
"ప" , " ఫ ", "బ", "భ", "మ" లలో "మ" 5 వ అక్షరం.

రామ = 2X5 = 10
రామ రామ రామ = 10X10X10= 1000

ఇక కథలోనికి వస్తే వాల్మీకి రామాయణ మొదటి శ్లోకము ఇది [ఇదే అనుకుంటున్నాను , విబేధించేవారు సరి చేయవచ్చు]

తపస్స్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ |
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవమ్ ||

సూక్షంలో ఈ శ్లోక భావం " ఒక మహిమాన్విత వ్యక్తి గురించి చెప్పమని వాల్మీకి నారదుల వారిని అడిగారు".

రామాయణం అంతో ఇంతో తెలియని వారు భారతదేశం లో ఉండరని నా అభిప్రాయం. కాబట్టి కథను క్లుప్తంగా చెప్పుకొని మిథిలా నగరానికి చేరుదాము.

విశ్వామిత్ర మహర్షి కౌసల్య ని మెప్పించి, దశరధుని భయపెట్టి [దశరధుడు కూడా ఒప్పుకుంటాడు] , రామ లక్ష్మణులను లోక కల్యాణ కార్యార్థం వెంటబెట్టు కొని సరయూ నది తీరంలో బసచేసి వుంటారు. రాత్రి గడచి తెల్లవారు ఝామైంది. పద్మాలు అప్పుడే వికసిస్తున్నాయి. తుమ్మెదలు నిద్ర మేల్కొని మకరంద వేట సాగింప బయలుదేరాయి. మెల్లగా సరయూ నది ప్రవహిస్తుంది. ఎదురుగా సాక్షాత్తు శ్రీమహావిష్ణువు తన అధీనంలో ఆదమరచి నిద్రపోతున్నడు. పరమ ప్రశాంత వదనం. ఇది ఈ బ్రహ్మీ ముహూర్త సమయాన తనకు పట్టిన అదృష్టంగా భావించాడు రాజర్షి. జీవించి వుండగానే పొందేటటువంటి మోక్షమది. ఆనంద పారవశ్యంతో సుస్వర గానం ఈ విధంగా చేస్తాడు.

కౌసల్యా సుప్రజారామ | పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల | కర్తవ్యం దైవమాహ్నికమ్ ||

ఈ శ్లోకం ఒక్కదాని మీద పేజీలకు పేజీలు వ్యాఖ్యానాలు వ్రాయవచ్చు. కానీ ఎవరికి వారు ప్రతిరోజూ గానంచేసుకొని రోజూ కొంచెంకొంచెంగా అర్థమయ్యే ఒక్కొక్క పద గూఢార్థాన్ని తనివితీరా ఆస్వాదిస్తే వచ్చే ఆనందం ఎన్ని వ్యాఖ్యలు చదివినా కలుగదు. స్వానుభవానికి మించిన విద్య ఏముంది?

అలాగే పై శ్లోకం శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంలో మొదటి శ్లోకంగా మనందరికి సుపరిచయమే ! నిజానికిది వాల్మీకి రామాయణ శ్లోకమని పండితుల ఉవాచ.

మళ్ళీ కథలోకి వెళితే విశ్వామిత్ర మహర్షి చెప్పే రక రకాల కథలు వింటూ [ఈ కథలలో బ్రతకడానికి కావలసిన విద్య పుష్కలంగా వుంది] తాటకిని వధిస్తారు. సుబాహుని చంపుతారు. మారీచుని భయపెట్టి వదిలేస్తారు.

మిథిలా నగరికి వెడుతూ రకరకాల దేశాల కథలను రామలక్ష్మణులకు విశ్వామిత్రుడు చెప్తాడు .[ఈ కథలలో బోలెడు భారతదేశ చరిత్ర కనిపిస్తుంది ] దారిలో గంగానది ఒడ్డున విశ్రమిస్తారు. విశ్రాంతి సమయాల్లో ఎన్నో యోగాభ్యాస విద్యలు నేర్పిస్తాడు. మార్గమధ్యంలో రాయిలాగా బ్రతుకుతున్న అహల్యని శ్రీరాముడు మనిషిని చేస్తాడు.

జనకుని సాదర స్వాగతంతో అందరూ మిథిలా నగరం చేరతారు. అన్నదమ్ము లిద్దరూ తానందుని [ జనకుని పురోహితుడు ] నోట గురువైన విశ్వామిత్ర మహర్షి గొప్పతనం వింటారు. అలాగే అందగాడైన రాముని గొప్పతనం ఆనోటా ఈనోటా జానకి ని చేరుతుంది.

[ ఈ చివరి భాగం నా కల్పితం. ]

అందరి లాగా సీతమ్మ వారు కూడా తన కాబోయే భర్తగురించి రకరకాల కలలు కంటుంది.


ఉ||
ఎంతకు రాడు రాముడని ఈక్షణ తీక్షణ బాధలెల్ల నా
అంతరమందె దాచుటెల? ఆ రఘు రాముడె బెండ్లియాడి, నా
చెంతన సేదదీరి నవ జీవనుడై మనమెల్ల కాంక్ష తో
బంధనజేసి నిర్మల సుభాషితుడౌన? నయోధ్య రాముడున్ ?


రాజులంతా ఆసీనులై శివధనుస్సు నెక్కుపెట్ట సిద్ధమై....


సీ||
లేచెనొక్కడు తొడలెల్ల చరిచి, నిది
          ఏపాటి పోటి, నీ మిథిల లోన ?
ఊగెనొక్కడు కర్ణకుండలము లూడ, నే
          చూపెద నిది కంటిచూపు తోడ.
లేచెనొక్కడు తన లేత మీసము దువ్వి
          ఏ పాటి విద్య యిది, మిథిలేశ?
పలికెనొక్కడు తుచ్ఛ పలుకులెల్ల , జయించె
          దను , సిత సీతను ధరణి గాల్చి.

గీ||
ఇటుల రాజాధి రాజన్యు లెల్ల ధనువు
నెత్త బోయి, కొంచెము నైన నెత్త లేక,
సిగ్గున పగ రగులుతుండ, సిత క్షితి
కాంత ధరహాస వదనము కాంచ రైరి.


మళ్ళీ రేపు కలుద్దాం...

గమనిక: శ్లోకాలు నాకు గుర్తున్నట్లు వ్రాశాను. తప్పులేమైనా వుంటే పెద్దలు సహృదయులై సవరింప గోరుతాను.

అలాగే పద్యాలలో కూడా.. పద్య కవులకు పద్య పాదాల లో అభ్యంతరమైనవి గా కనిపిస్తే సరిచేయ మనవి.

1, ఏప్రిల్ 2009, బుధవారం

శ్రీ సీతా రామ కల్యాణము - 1



శ్రీరామ నవమి వస్తుంది. గుడిలో పీటల మీద కూర్చొని అమ్మ వారి పెళ్ళి చేసే అదృష్టం ఏ కొద్దిమందినో వరించే వరం. కనీసం బ్లాగులో నైనా సీతమ్మ వారి కల్యాణం చేద్దామని మొదలు పెట్టి రెండు వాక్యాలైనా పూర్తి చేయకముందే కలం కదలనని మొరాయించింది. ఇంతకీ నా కొచ్చిన చిక్కేమిటంటే శుభలేఖ ఎలా ముద్రించాలని ? " శ్రీ సీతా రామ కల్యాణము" మనా లేకా " శ్రీ రామ సీతా కళ్యాణ" మనా ?

వీడి వితండ వాదం తగలెయ్య...అని తిట్టకండి, నిజంగా తెలియకే , తెలుసుకోవాలన్న కోరికతో అడుగుతున్నా. పెద్దలెవరికైనా దీని వెనుక దాగిన చారిత్రాత్మక లేక ఐతిహాసిక రహస్య మేమైనా వుంటే దయచేసి తెలుపండి. సీతా రామ కళ్యాణ మనే విన్నదీ కన్నదీ కాబట్టి నా టపాకు కూడా అదే పేరున మీ అందరికీ ఆహ్వాన పత్రిక.

ఈ టపా చదివే వాళ్ళందరికీ ఒక చిన్న మనవి. రామాయణము మహా కావ్యం. అది చదివే వారి మనసుల బట్టి వుంటుంది. వాల్మీకి రామాయణము నాపై ఎంత ప్రభావం చూపిందో రంగనాయకమ్మ గారి రామాయణము నాపై అంతే ప్రభావం చూపింది. రంగనాయకమ్మ రామాయణంలో నాకు నచ్చింది ఆమె రచనా తీరు, నాటి సాంఘిక పరిస్థితుల కూలంకుష విశ్లేషణ. అంతవరకే. నచ్చనది ఆమె అదేపనిగా ప్రతి పాత్రను విమర్శించడము. మొదటిలో ఆసక్తిగా వున్నా చదివే కొద్దీ విమర్శించాల కాబట్టి విమర్శిస్తూ సాగుతుంది కథ. ఆర్యులు , ద్రావిడులు లాంటి చర్చ ఇక్కడ అనవసరం. నా వరకు నాకు ఆర్యులు కూడా ఒక భారత తెగ.

అందుకనే

రామాయణాన్ని ఆధ్యాత్మిక దృష్టితో చదివేటప్పుడు, శృంగార కావ్యంగా చూడకూడదు.

ఆస్తికుని గా చదివేటప్పుడు మానవత్వాన్ని ప్రశ్నించకూడదు.

నాస్తికుని గా చదివేటప్పుడు దైవత్వాన్ని ప్రశ్నించకూడదు.

చారిత్రాత్మక దృష్టితో చదివేటప్పుడు కావ్య వర్ణనలు ప్రశ్నించకూడదు.

ఇవన్నీ కలిస్తేనే అది కావ్యం. ఏ భాషలోనైనా సరే !!! లేకపోతే అవి నవలలౌతాయి.

ఈ రకంగా మన మనోఫలకము పైన దేని ముద్రవుందో గ్రధము చదివేముందే గుర్తించ గలగాలి. ఆ దశ ఎదో తెలుసుకొని రామాయణాన్ని చదివితే అమృతం దొరుకుతుంది.

మరోమాట, ఎన్ని శ్లోకాలు ప్రక్షిప్తాలు, వాల్మికి ఎవరు ? ఎప్పుడు జరిగింది అనే వాదనలకు చోటులేదు. వీటిపైన మహామహులు ఉద్గంధ్రాలే రాశారు. వాటిని చర్చించడము ఉపయోగములేనిపని.

ఇలా మదిని ముప్పిరి గొలిపిన ఆలోచనల మధ్య నా బ్లాగులో 5 రోజుల సీతా కల్యాణం చేయ నిశ్చయించి మొదలెట్టిన తొలి టపా. " రామ " శబ్ద ప్రియులకు ఇది అంకితం.


ఆటవెలది||

రామ, రామ, రామ, రఘురామ, కారుణ్య
ధామ, సంకటహరధామ, ధరణి
జా నయన చరిత జగన్నాధ, భక్తుల
పాలి కరుణజూపు పద్మనాభ.



రేపు సీతమ్మ వారి పెళ్ళిచూపులు. అందాకా సెలవు.