30, అక్టోబర్ 2009, శుక్రవారం

వెన్నెలమ్మకు జోలపాట.

జో... జో... జో...జో
ఊ... ఊ ... ఊ .. ఊ
వెన్నెలా ఓ వెన్నెలా నన్నిలా వ్రాయనీ (మంద్రస్థాయిలో)


నిండార విరిసిన పండు వెన్నెలా
మాయింట విరసిన విరివెన్నెలా
మాకంటి వెలుగుల వెన్నెలా
జగతికి జోలపాడు మా వెన్నెలా

మదిలోన దాగిన దావాజ్ఞి
మనసంత దహించి వేస్తుంటే
ముఖమున పండు వెన్నెల ఫూయీంచేవు
మనుషుల మారాము చేసి మైమరపించేవు


హరిద్వార మందు నిశిరాత్రుల ఎన్నిగుండెల దహనాన్ని చూసేవు
విరిసిన ప్రేమ తోటలందు ఎన్ని జంటల మురిపించేవు

జలజలా పారు సెలయేటి బాల్యమందు
ఎంత సొగసుగ చిన్నారుల మైమరపించేవు
ఉప్పొంగి పొంగు యవ్వన వడిలోన
మనసంత నిండి ఊయల లూగించేవు
వయసంత ఉడిగిన వానప్రస్థులకు
తోడు నీడై ఊ కొట్టి జోలపాట పాడేవు.

నడిరేయి జాముపొద్దున కాగేటి జంటకు
కథలెన్ని చెప్పి మైమరపించేవు
స్వామి లేని రాత్రుల విరహోత్కంఠితకు
రాగాల మాలికల మైపూత పూసేవు

సంద్రాన మునిగిన సంసార జంటకు
రాతిరంత చల్లని చూపుల సేదదీర్చేవు
జగమేలు చోరశిఖామణులకు
మబ్బుచాటున నక్కి దోబూచులాడేవు.


భువినున్న బాలలకు చేతచిక్కిన మల్లెచెండువు
మనసున్న కన్నియలకు సిగలోన చంద్రవంకవు
భావ కవివరులకు పిలిచిన పలికే వెన్నెలవు.

లెక్కల్లో చుక్కలెన్ని కలిపినా
చుక్కల్లో చందమామవు
అందరాని వెన్నెలమ్మవు
జగతిలోన ప్రగతిబాటకు నిను చూడగ ఎన్ని ఆలోచనలు?
ప్రగతిశీల లోచనునికి అందరాని చందమామవు!

ఉబకనీకు మదిలోని అగ్నిగోళాన్ని
చెదరనీకు ముఖమున మురిపెపు నవ్వుల్ని.

జో... జో... జో...జో
ఊ... ఊ ... ఊ .. ఊ
వెన్నెలా ఓ వెన్నెలా నన్నిలా వ్రాయనీ (మంద్రస్థాయిలో)

27, అక్టోబర్ 2009, మంగళవారం

కుదరని మనసు - కదలని చేయి



విరిసిన పుష్పం విసిరిన గాలం
వలచిన ముళ్ళు విరిగిన ముల్లు
అదిరిన తనువు కదలని కాలం
పెరిగిన గాయం రగిలిన కలం
తరగని భావం ఉరికే హృదయం
కుదరని మనసు కదలని చేయి.

26, అక్టోబర్ 2009, సోమవారం

రంగులు మారే లోకంరా ఇది!

ఉషగారి "గారడీ" కవిత స్ఫూర్తితో ...రంగులు మారే లోకంరా ఇది

రంగులు మారే లోకంరా ఇది
ఋతువులు మారే జన్మమురా ఇది
ఉరుకుల పరుగుల లోకంరా ఇది
పడి లేచే జన్మమురా ఇది.

ఒకపరి ఋతుగమనంలో వెచ్చని వెన్నెలనురా
మరొకపరి జీవనగమనంలో ఎర్రని ఎండను రా!

కొడిగట్టే దీపమునేనే వెలిగే దివ్వెను నేనేరా
రంగులు మార్చే లోకంలో రంగవల్లిని నేనేరా!

నలుపైనా తెలుపైనా
వెలుగైనా చీకటైనా
జీవన వాహినిని నేనేరా!

వెన్నెలనైనా ఎర్రని ఎండను ఐనా
ఉషోదయ కిరణాన్నైనా
జగతికి జాగృతి నేనేరా!

మధ్యాహ్న ప్రచండాన్ని
సంధ్యా సమయ సమీరాన్ని
మనిషికి విజయగీతికను!

ప్రేమ వర్షాన్ని నేనే
ద్వేష దావాగ్నిని నేనే
విధ్వంస కారకినీ నేనే
సృష్టికి మూలమూ నేనే !

జీవన ఆనందినిని , చరిత్ర సృష్టికర్తను
వర్తమాన రచయిత్రిని, మానవ రూపకర్తను.

నలుపును నేనే తెలుపును నేనే
వెలుగును నేనే చీకటిని నేనే
మానవ చరిత్రకు మజిలీని నేనే.

ఇంటిని నడిపే సంపెంగను రా
పుడమిని పాలించు ఋతుమతినిరా!

22, అక్టోబర్ 2009, గురువారం

నా ప్రేమలేఖ... దానికి నా సఖి సమాధానం


ప్రియ సఖీ వెన్నెలా !

ఎంతకాలమైంది మనము విడిపోయి? ఆ రోజుల్లో ఎన్నెన్ని కబుర్లు చెప్పుకొనే వాళ్ళమో ! మనసులే కాదు, శరీరాలు ఒక్కటే.

నీలోనే నేను, నాలోనే నువ్వు.

పంచ భూతాలూ మనలోనే. విస్పోటన శక్తి, విశ్వాంతరాళ శక్తి! అన్నీ మనలోనే. లోకంలేదు, లోకులూ లేరు, చుట్టూ ఎవరైనా చూస్తారనే బెంగ లేదు. గత జ్ఞాపకాల అలజడిని తట్టుకొనలేక పొంగి పొరలి వచ్చే ఆనందపు అలలను ఎవరో ఒక్కసారి బలవంతంగా పట్టి ఆపిన భావాన. ఏంచేస్తాం? జీవన పోరాటంలో చెరోదారి. మన ఇద్దరి కలయికను ఓర్వలేక దేవుడు ఆడిన నాటకంలో పావులుగా మారాం. సుదూర ప్రాంతాల వాసితులం. విరహ బాధితులం.

నిన్ను చేరుకోవాలని విడిపోయిన నాటినుండి అలుపు సొలుపు లేకుండా తిరుగుతూనే వున్నా. అయినా ఫలితం శూన్యం. అప్పుడప్పుడు ఏదో నలతగా ఉంటే అక్కడక్కడా ఓ క్షణమో,ఓ నిముషమో సేదతీరడం తప్ప నాకు విశ్రాంతి ఏది? ఆ నిమిషానికే నానా అల్లకల్లోలం. ఈ జీవిత పరుగును ఆపడం కష్టమే !

నువ్వు మాత్రం, ఏంచేస్తావులే ! నన్ను చేరాలని కాంతి విహీనమై నా చుట్టూ తిరుగుతూనే వున్నావుగా? సరేగానీ సఖీ ఈ మధ్య మనయోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఓ వార్తాహరుడిని నీ దగ్గరకు పంపాను. ఏమైంది ? ఎందుకు వున్నపళంగా కోపగించావు? నాపై అలకా? కోపమా ప్రియా! ఈ దీనునిపై కరుణ లేదా? అన్నీ తెలిసిన నువ్వే ఇలా కినుక వహిస్తే ఇక నా గతేంకాను?

కరుణించి ఒక టపానైనా వ్రాయరాదా చెలీ !

నీకు ఏమీ కాలేక పోయిన
నీ భువి.





వెన్నల ప్రత్యుత్తరం.


ఓరి మగడా !
ఎంత చల్లగా ప్రేమలేఖలు వ్రాసుకుంటున్నావురా? నీ జిమ్మడా !? నన్ను దూరంగా నెట్టేసి, హాయిగా పొరల పొరల చొక్కాను తొడుక్కొని, చెట్టు చేమలతో, రాయి రప్పలతో, కొండా కోనలతో, నదీ నదాలతో తనివితీరా జీవితాన్ని అనుభవిస్తూ, నేను లేనని ఏడుపొకటా? నీ మొఖం మండా !? నా శాపమే కానీ నీకు మొఖమెలా మండుతుందిరా? ఏరోజైనా మంట ఎలా వుంటుందో అనుభవించావా? అసలు నీ నుండి విడిపడినప్పుడు నీ లాగే వుండేదాన్ని కదా? మరి ఇప్పుడు? అప్పటి ప్రేయసి ననుకుంటున్నావేమో ! పరువపు అందాలు అన్నీ ఆవిరైపోయాయి.
ఇంకిపోయిన అందాలు, వడలిపోయిన మేను. నా శరీరంలో అసలు నీరు వుందో లేదో నాకే తెలియటం లేదు. నీటి ఛాయ లేని మేని రంగు నాది :(. ఎప్పుడూ త్రుళ్ళి పడుతూ వుండాలని నాకోరికేకానీ జీవించడానికి గాలే లేదు. గాయమైన నా తనువును, మదిని వర్ణించి , నా కష్టాలతో నా ప్రియుని మనసు గాయపెట్టలేను.

ఉంటాను, నీకు ఏమీ కాలేక పోయిన
నీ వెన్నెల






*** అంతా చదివారు కదా?అంతగా అర్థము కాకపోతే ఈ క్రింది ఫాంట్ ను పెద్దగా చేసుకొని మళ్ళీ చదవండి.*****


భువిని Earth గానూ, వెన్నెల ను Moon గానూ అనుకొని చదవండి.
ఇవి విడిపోక ముందు రెండే కలిసే వున్నాయన్న సిద్ధాంత ఆధారంగా! అలాగే చంద్రుని మీద ఉష్ణోగ్రత బేధం చాలా ఏక్కువ.సోలార్ రేడియేషన్ అండ్ సోలార్ విండ్స్ కూడా ఊహకందని విషయాలు!

17, అక్టోబర్ 2009, శనివారం

కోపమేలనే ఓ నారీ - అంటిని కదా ఓ సారీ!






కలికి చిలక సొగసు చూడగ
కులుకొలొలుకు సిగను చూడగ
సైగ చేసి చుక్కల మాటున
సిగ్గు లేని చందమామ
సందు చూసి సందెకాడ


నెల రాజు వంగి వంగి సిగలోన చేరెనులే
తళుకు లీను తారలన్నీ కొప్పులోన ఒదిగిపోయెలే
చెలియ సిగను సింగారించెలే |కలికి|

నింగి మొత్తము నెరజాణ కొప్పులోన విరగపూసెనులే
తారలన్నీ వలసపోయి నింగి బోసిపోయెనులే
పుడమి లోన వెలుగు కరువాయలే |కలికి|


ఆకశాన రాజు నైనా నిను చూడగ నడిచి రాలేదా?
పలుమారు నీ పెదవుల దాటి మరుమల్లె పదముల నవలేదా ?

పున్నమి రాత్రులకై వేచిన రోజులూ
వెన్నెల వెలుగుల విరహపు జాడలు
పద లయల స్వరగీతికలూ
గజ్జల రవళుల నాట్యభంగిమలు
దరిచేరి చూడగ సిగలోన కొలువైతిలే |కలికి|


సిగలోని చంద్రవంక తొంగి తొంగి చూసెనులే
కలువ భామ మోము గనక కినుకు చూసెనులే
చెలిమి జేసి చెలియా అని పిలిచిన ఇటు తిరగదాయెలే
నను కరుణించదాయెలే |కలికి|




సతి కొప్పున చేరి...









**** ఇక్కడ ఆకుపచ్చ రంగులో నున్న వాక్యాలు చందమామ స్వగతం.మరి నీలిరంగు? మీకేది తోస్తే అది :)*******

11, అక్టోబర్ 2009, ఆదివారం

జలపుష్ప మంగళ హారతి

మరువం ఉష గారి జలపుష్పానికి మంగళ హారతి.

కం |
శ్రీకరమగు తలపుల నీ
చక్కని జలపుష్ప రచన సాగె పలుగతుల్
చిక్కని కథలు కవితలుగ
నీ కరుణయె లేకయె నిదినెటులగు స్వామీ?

తే|
కాలగమనగాడ్పులలోన కరిగిపోయె
మంచితనము, కామందులు మందభాగ్యు
లైరి, రాబందు రాజ్యాన సిరిని వలచి,
మానవతుల రక్షించు అమాత్యులేరి?

తే|
భువిన ప్రజలు చూసిరట ప్రభూ పదియగు
నీదు సుందరయవతారమాధురీ మ
హిమలు, కరుణాకర, కలికాలమున మేము
జేసిన చెడుగెయ్యది నాకు చెప్పుమయ్య !

తే|
పుడమి రక్తపుటేరుల గడ్డగట్ట
క మునుపె, జలరాసుల ధరిత్రి మునుగక ము
నుపె, మనువుగ సాగరజల నురగలు విడి
పరుగు పరుగున రావేల భరత శౌరి!

కం|
మంగళ మయ్య జగన్నాధ
మంగళమగు శ్రీపతికిని మంగళ కైతల్
మంగళ కరమై మాకును
మంగళములు కలుగజేయి మాతంగిపతీ.

5, అక్టోబర్ 2009, సోమవారం

మూడవ విడత పి.డి.యఫ్ లు




హారం పాఠకులకు మూడవ విడత వారి వారి టపాలను పి.డి.యఫ్ రూపంలో అందించామని చెప్పడానికి ఆనందంగా వుంది.

కొన్నిసార్లు మీ పూర్తి టపా పి.డి.యఫ్ లో కనిపించకపోవచ్చు. అలా కాకుండా వుండాలంటే మీ మీ ఫీడ్ లను ఈ క్రింద చూపిన విధంగా సెట్ చేయవలసి ఉంటుంది.



ఇప్పటికే సభ్యులైనవారు ఇక్కడ నుండి తమ తమ టపాల P.D.F ఫైల్ ను డౌన్లోడ్ చేసుకొనండి. ఏ కారణం చేతనైనా మీ టపాల P.D.F అలభ్యమైనచో support@haaram.com కు మైల్ పంపండి.

ఆసక్తి ఉండి క్రొత్తగా సభ్యత్వం కోరువారు హారం http://www.haaram.com ను సందర్శించి సభ్యులుగా చేరండి.

2, అక్టోబర్ 2009, శుక్రవారం

ప్రేమ కొలనులో చేప పిల్ల





మరువం ఉష గారి జలపుష్పాభిషేకానికి నా చిరు స్పందన


పండు వెన్నెల వెలుగులో
పడుచు జంట జలకాలు చూడ
సరోవరాన దాగిన నింగి సిగ.

పండల్లె భ్రమించి
పరుగులెత్తిన పడుచు మీనాలు.
జలపుష్ప జలాకాలాటల
కదిలిన సరోవర చిరు తరంగాలు.

తరంగాల తాకిడిన తరలిన మీనాక్షి చూడ
మృచ్చకంఠి కనుల కొలనులో
అరవిరిసిన అలతి అందాలు.

అరుణారుణ అధరాల
అరివిరి నయనాల
చెంగావి చెక్కిళ్ళ
సిందూర సింగారి.

అరవింద నయనాల విలుకాడు
మీనాక్షి వలలోన బందికాడు

యువ చేప ప్రతి కదలికలో
పడుచు చేప పలుకులే!
పసిడి చేప ప్రతి పథములో
ప్రతిమగ నిల్చిన పడుచువాడు!

కదిలీ కదలని పెదవుల కదలికలో
ఉవ్వెత్తున ఎగసే హృదయ తరంగాలు.
చూసీ చూడని ఓరచూపుల
చెలెరేగే చిలిపి కోరికలు.

చిరుగాలి రెపరెపల ప్రియురాలి ముంగురులు
ప్రియుని చెంపల అదృశ్య రేఖల లిఖింప,
ఎలిమి ఎలనాగ రాణిని గాంచి
ఏకాంత కాసార వాసాన
ఆలపించె విరహ వేడుకోలు.

నయగారి నటరాజు
నయనాలు చుంబించి,
మాయావి మన్మధుడు
మదినంత అలరింప,
మధుర మధుగానాల మారాము చేసి,
అధరముల వీణ తంత్రులుగ మలచి
కరముల తంత్రులు మీటగ
ప్రతిధ్వనించిన విరహాగ్ని రాగాల
ప్రక్కనున్న పూలపొద రేపింది
హరివింటి పుప్పొడి దుమారం

తెలి వెన్నల నీటకురిసిన పుప్పొడి
జలచరాల నడుమ జ్వలనమై
జలపుష్ప జాతికి అనునాదమై
సాగరాన జరిగె ప్రతిసృష్టి.

విరిసిన వెన్నెల వాకిట
వెలసిన కన్నె పరువాలు.
పరువపు వెన్నెల ఆరబోతలో
కరిగిన యవ్వన యవనిక కోరికలు.

నీటనున్న చందమామ నింగికెగసె
ఒడ్డునున్న ప్రేమజంట నీటమునిగె.