9, ఆగస్టు 2012, గురువారం

కళా సౌందర్యము - కావ్య సౌందర్యము



శతాబ్దాల తెలుగు చరిత్రలో మహా మహా కావ్యాలు వెలువడ్డాయి.సర్వలక్షణ సమన్వితమై వున్న కావ్యాలూ చాలానే వుండవచ్చు. వ్యాకరణ, అలంకార,సాహిత్య భూషితమై కావ్యం లాక్షణికుల మన్ననలను పొందవచ్చు. వీటన్నింటినీ మించి ఆ కావ్యంలో  సౌందర్యము లోపించినట్లైతే కాలగర్భంలో కలిసిపోక తప్పదు. చాలాసార్లు ఓ తెలుగు కావ్యాన్ని చెప్పగానే అది శృంగార కావ్యమా లేదా భక్తి కావ్యమా లేదా మరొకటా అని విభజన చేసేస్తుంటాము కానీ, నిజానికి నవరస కళా సౌందర్యము లేని ఏ కావ్యమైనా క్షరము కాక తప్పదు. మానవుడు తన పరిశరాల ప్రభావంతో తన ఆలోచనా పరిధులకు లోబడి మాత్రమే కావ్యాన్ని కానీ, చిత్రాన్ని కానీ, గానాన్ని కానీ ఆస్వాదించగలడు. ఈ సౌందర్యారాధన, దాని ఆస్వాదన, ఆయారంగాలలో తను చేసే కృషిపైన కూడా ఆధారపడే వుంటుంది. ప్రతిమనిషీ సౌందర్యారాధకుడే. ప్రతి జీవీ ఆ కళాసౌందర్యాన్ని ఏదో ఒకనాడు అలౌకికంగా అనుభవించినవాడే. ప్రతి వ్యక్తీ కోపము, ఆనందమూ, దుఃఖము, దయ,  మున్నగు విశేషణాలకు లోబడి చరించువాడే. ఇవన్నీ నిత్యజీవితంలో మనకు అనుభవపూర్వకాలే. ఆ సందర్భాలలో అనుభవపూర్వకంగా ప్రతివాని నోటినుండి వాక్యాలు మాటల గుచ్ఛాలుగా వెలువడుతూనే వుంటాయి. కానీ ఈ వాక్యాలు కవిత్వము కాదుకదా? మరి కవిత్వమంటే ? ఛందోబద్ధముగా వ్రాస్తే కవిత్వమా ? లేదా వాక్యాలను  కుళ్ళబొడిచి విడివిడిగా వ్రాస్తే కవిత్వమా? దేన్ని కవిత్వమంటారు?  మనఃచలనము మూలంగా కలిగిన తాత్కాలిక భావాన్ని క్రమబద్ధీకరించి సౌందర్యముగా చెప్పినదే కవిత్వమేమో !!

కావ్యానికి సౌందర్యము కావాలి. సౌందర్యాన్ని వ్యక్తపరచడానికి భాషకావాలి. అదికూడా క్రమబద్ధంగా వుంటేనే రాణిస్తుంది. మన:చలనము వలన కలిగే భావాలు అస్పష్టంగా వుంటాయి. అస్పష్టంగా  వున్నా సరే ఆ వ్యక్తి తన మనసులో కల్గిన భావాన్ని తప్పక అనుభవిస్తాడు. కవికి, పాఠకునికి తేడా ఇక్కడే!! కవి తను తన మనసులో అస్పష్టంగా, చెల్లా చెదురుగా వుద్భవించిన భావాన్నిసౌందర్యంగా  అక్షర బద్ధం చేసి ఇవ్వగలడు. అదే సౌందర్యాన్ని పాఠకుడు చూడగలడా/అనుభవించగలడా లేదా అన్నది పాఠకుని రస పిపాసపై అధారపడి వుంటుంది. అంటే రచయిత భావనావీధుల వెంట తిరుగాడుతూ తను చూసే భావచిత్రాన్ని పాఠకుని హృదయ ఫలకముపై ఎంతగా ఆవిష్కరించబడితే రచయిత అంత సఫలమైనాడని చెప్పవచ్చు. ఇది ఒక్క కావ్యానికే కాదు, చిత్రం, గానం లాంటి కళలకూ వర్తింస్తుంది.

విద్యుద్దీప కాంతులు ఇంటి లోగిళ్ళల్లో ధగధగలుగా మెరువక ముందువరకూ నిరుపేద చూసే పున్నమీ , శ్రీమంతుడు చూసే పున్నమీ ఒకే రకంగా వుండేవేమో. ఆ పున్నమిని ఇద్దరూ ఒకే రకంగా ఆస్వాదించేవారేమో. కానీ ఇప్పుడు వీరిరువురూ వేరు వేరు. వెన్నెల రాత్రులే తెలియని వాడు ఆ ఆనందాన్ని ఆస్వాదించలేకపోవడమూ అత్యంత సహజం కూడా !! అందుకే  నేటి తరానికి తగ్గట్టు కవిత్వమూ మారుతూ వస్తుంది.

1 కామెంట్‌:

  1. రెడ్డిగారూ,మీరు లేవనెత్తినది పెద్ద సబ్జక్టు.బ్లాగుల్లో రాసి చెప్పడం కష్టం.1.అన్నిరసాలూ ముఖ్యమే.ఐనా ఏ రసం ప్రధానంగా ఉంటే దానికాపేరు వస్తుంది.2.మనిషి అప్పుడూ ,ఇప్పుడూ కూడా సౌందర్యాన్వేషియే. కవిత్వశైలి,భాష కాలానుగుణ్యంగా మారుతుంటుంది.3.ఎంత సరళమైన భాష వాడినా మనం రోజూ మామూలుగా మాట్లాడు కొనే దానికి కవిత్వభాషకీ భావ వ్యక్తీకరణ లో తేడాఉంటుంది.

    రిప్లయితొలగించండి

Comment Form