ఈ మధ్య టపాలు వ్రాసి టోపీలు పెట్టి చాలా రోజులైంది. ఏదో అనుకోని పనుల్లో కూసింత బిజీ బిజీ. పనులు సక్రమంగా అనుకున్న రీతిగా సాగి పోయాయి. మళ్ళీ నాగాలి గోళీ కాయలా గాలి సుయ్య్ మని పొంగినట్టి వున్నట్టుండి బ్లాగులవైపు మళ్ళింది. ఈ మధ్య చాలానా గ్యాప్ వచ్చినట్టుంది కదా !. అయినా రాసి రాసి పెన్నులో సిరా ఖాళీ అవడమో కీబోర్డ్ లో "కీ" లు అలాగే చేతి కీళ్ళు అరిగిపోవడం తప్పించి పెద్దగా ఆరోగ్యం బాగయ్యింది లేదు. అంతా మాయ గానీ ఈ పెపంచకంలో రాసేదెవరు చదివేదవరు? హుష్... అలుపొచ్చేస్తూంది. సరిగ్గా మూడు లైన్లు రాసానో లేదో దీని సిగతరగ మళ్ళీ ఈ చంచల మనసు సాంకేతిక సమ్మోహిత యై సవర్ణదీర్ఘ సంధులు, గుణ సంధులు అంటుంది. ఈ సంధి ప్రక్రియలకు ఇంకా ముహూర్తం పెట్టలేదు కానీ హారం లో కాస్త రమ్ము, జిన్ను కలిపి కొత్త సీసాలో పాత సారాలా మార్కెట్ చేసుకుందామని ఈ టపా.
హారం రూపు రేఖలు మార్చుకొని కొంగ్రొత్త చీర కట్టుకొని మరిన్ని అందాలతో పాఠకలోకాన్ని మైమరపింప సమాయత్తమై మీ ముందు రేపు ప్రత్యక్షం కాబోతుంది. ఇలా అన్నానంటే ఇప్పుడు వున్న రూపు బాగాలేదని కాదు. ఒకే రూపు తో సంవత్సర కాలంగా కనిపించేటప్పటికి నాకే మొఖం మొత్తింది. ఇలా మొఖం మొత్తిందని ప్రతిదీ ప్రతి సంవత్సరం మారుద్దామంటే కుదరదండోయ్..గొడవలై పోగలవు జాగ్రత్త సుమా ! అందుకే దానికి క్రొత్త హంగులు.ఏమిటా హంగులు?
ముందుగా హోమ్ పేజి అనాటమీ వివరిస్తాను. హోమ్ పేజీ యే కాదు, హారం లో ప్రతి పేజీనీ ఐదు భాగాలుగా విడగొట్టడం జరిగింది. [ ఇప్పుడున్న హారం కూడా అలాగే ఐదుభాగాలుగా వుంది.]
౧) హెడర్ .. ఇది హారం లోగో కు ప్రత్యేకించ బడింది
౨) ఎడమ వైపు భాగము .. ఇది రచయితల పేర్లు వారు వ్రాసిన వ్యాసాలు లేదా వ్యాఖ్యల కోసం వినియోగించడం జరిగింది.
౩)మధ్య భాగము ... ఇందులో రచయితల వ్యాసాలు, లేదా వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు చూపడానికి నిర్దేసించింది.
౪)కుడి భాగము ... ఇది హారం చేసే రకరకాల విశ్లేషణలు చూపడానికి నిర్దేసించింది.
౫) ఆడుగు భాగము ... ఇది హారం కాపీ రైట్ కోసం నిర్దేసించింది.
హారం ఈ సారి గ్లోబల్ హారం గా ఎదగడానికి తొలి మెట్టు కట్టు కుంది. ప్రయోగాత్మకంగా ఇంగ్లీష్ బ్లాగులని కూడా చూపడానికి సిద్ధమైంది. ప్రయోగాత్మకంగా అనేకంటే సాంకేతిక ఆంగ్ల బ్లాగులను ఒకచోట చూస్తే ఎలా వుంటుందో అన్న దురాశతో మొదలెట్టిన ప్రయత్నం. అంటే హారం మల్టిలింగ్వల్ వెబ్ సైట్. ఆల్ వియ్ నీడ్ ఈజ్ ఫ్యూ కాన్ఫిగరబుల్ చేంజెస్.విత్ దీజ్ ఛేంజెస్ హారం కెన్ షో ఎని యూనికోడ్ లాంగ్వేజ్ ఇన్ ద సేమ్ ఇంటర్ ఫేస్.
ఈసారి హారంలో మరిన్ని సదుపాయాలు పొందుపరచడమైనది.అందులో కొన్ని
1) గతవారం రోజుల్లో ఎక్కువగా ఏబ్లాగులు పాఠకులు చదివారో చూపుతుంది. ఈ వ్యాసాలను కేవలం హిట్ ల ఆధారంగానే కాకుండా వేరే parameters కూడా వాడుకుని చూపుతుంది. ఈ టపాల/వ్యాసాల పట్టిక రోజుకొక సారి మాత్రమే మారు తుంది.పూర్తి వివరాలకు రేపు హారాన్ని దర్శిస్తే సులభంగా అర్థమవుతుంది.
2)అలాగే తక్కువగా వీక్షించిన వ్యాసాలను కూడా క్రోడీకరించి సముచిత స్థానం ఇవ్వడం జరిగింది.ఇదికూడా రోజుకొక్కసారే మారుతుంది.
3) అంతర్జాల పత్రికలలో వచ్చిన వ్యాసాలను పదిహేను రోజుల పాటు హోమ్ పేజీలో అలానే వుంచడం జరిగింది. అంటే చందమామ,జ్యోతి,స్వాతి,భూమి లాంటి పత్రికలే కాకుండా వివిధ వెబ్ పత్రికల రచనలు హైవాల్యూమ్ బ్లాగు లిస్టులమధ్యలో కొట్టుకొని పోకుండా వుండడానికై ఈ జాగ్రత్త తీసుకోవడమైనది.
4) పద్య, సాహిత్య ,వార్తా బ్లాగులను అలాగే కవితా బ్లాగులను విడిగా చూపడమైనది.
5) వివిధ విభాగాల్లో వ్రాసిన వ్యాసాలను కూడా క్రోడీకరించి [సాధ్యమైనంత తప్పులు లేకుండా ] చూపడానికి కూడా అనువుగా హోమ్ పేజీని డిజైన్ చేయడమైంది.అంటే మీరు చాలా సులభంగా పద్యాలను, పాటలను, సంగీతపు వ్యాసాలను, హాస్య/వ్యంగ్య వ్యాసాలను, సాంకేతిక వ్యాసాలను చదువుకోవచ్చు.
6) కామెంట్ల పేజీలో ప్రత్యేకించి పాటల టపాలను చూపించడం జరిగింది.
ఈ మార్పులు చేర్పులు చేయడానికి హారం రేపు సిద్ధపడుతుంది. కాబట్టి రేపు రాత్రి తొమ్మిది నుంచి అనగా భారత కాలమానం ప్రకారం ఎల్లుండి ఉదయం ఆరున్నర నుంచి ఓ మూడు గంటల పాటు హారం పని చేయకపోవచ్చు.
ఇవెట్టున్నా మిమ్మల్ని పలకరించి చాలా రోజులైంది కదా... మస్తుగున్నారా అందరూ, పిల్ల, పాప, గొడ్డు గోద అంతా కుశలమేనా? ఎండాకాలం కదా, ఇంటికొక పెళ్ళి తోరణంతో ఊౠ వాడా సిద్ధమయ్యాయా? గొంతులెండిపోతున్నాయా? చొక్కాలు తడిచిపోతున్నాయా? గోళీ సోడాలు తాగుతున్నారా !!!
సక్కనైన సందమామ మబ్బుసాటుకెళ్ళింది
కంటిమీద రెప్పలేమో సందుసూసి మూసుకొన్నాయి.
బై బై....