20, ఏప్రిల్ 2020, సోమవారం

జీవిత సోపానాలు -- 2

పెళ్ళి సంబంధాలు చూస్తున్నారంటే గుండె లయతప్పడం తప్పని సరి. అది అమ్మాయైనా అబ్బాయైనా!ఆ రోజుల్లో ఇప్పట్లా ఫోను సౌకర్యాలు అరచేతిలో వుండేవి కావు. ఫోను చెయ్యాలంటే ఏ ఫోను బూతు కో వెళ్ళి చెయ్యాలి.అవికూడా ఓ మోస్తరు పట్టణాలలో మాత్రమే వుండేవి.ఫోను చార్జీలు మోత మోగేవి. ఇక ఇంటర్నెట్ సంగతి సరేసరి. అదంటూ ఒకటి భవిష్యత్తును మార్చేస్తుందని ఊహకు కూడా అందని రోజులు. ఇ-మైల్ అన్న పదమొకటి ఉత్తర ప్రత్యుత్తరాలను అంతమొందిస్తుందని ఊహించలేని రోజులు.ఇక వాట్సప్, ఫేస్బుక్,ట్విట్టర్ మొదలైనవి సోదిలో కూడా లేని రోజులు. దానా దీనా చెప్పొచ్చేదేమిటంటే ఇంత సమాచార విప్లవం లేకపోవడంతో ఆరోజుల్లో అమ్మాయిలతో మాట్లాడాలంటేనే ఓ రకమైన భయం. అందుచేత మనసుల్లో అమ్మాయిలకు అబ్బాయిలపట్ల, అలాగే అబ్బాయిలకు అమ్మాయిలపట్ల చెప్పలేని అనుభూతులను గుండె గూటిలో భద్రపరచుకొనే రోజులు.

ఇంతకీ మా ఇంటికి పెళ్ళి సంబధమై వచ్చినాయనకు ఏమి చెప్పాలో అనే సందిగ్ధం లో పడ్డాము. వస్తామని చెప్పాలా లేక రామని చెప్పాలా? ఆ యనను నిరాశ పరచడం ఇష్టం లేక సరే చూద్దాంలే అని చెప్పాము. సాయంకాలంగా ఆయన నరసరావుపేటకు తిరుగు ప్రయాణమై వెళ్ళాడు.

ఇంటిలో కొద్ది రోజులు సంతోషంగా గడచిపోయాయి.హరిహర్ ఉద్యోగం వస్తుందా లేదా అన్న మీమాంశ రోజులు  గడిచే కొద్ది ఎక్కువైంది. ఉద్యోగంలేకుండా ఇంటి పట్టునే ఎన్నాళ్ళుండాలి? ఈ ఆలోచనలతో నా సహాధ్యాయి రంగనాధ్ కు ఒక ఉత్తరం వ్రాశాను. రంగనాధ్ వాళ్ళది తూర్పుగోదావరి జిల్లా చింతలపల్లి.ఈ గ్రామం పాలకొల్లు కి ఓ ఇరవై ఇరవైఐదు కిలోమీటర్ల దూరంలో వుంటుంది.మేము M.Tech చేసేటప్పుడు తూర్పుగోదావరి అందాలు చూడాలన్న కోరికతో రంగనాధ్ పిలుపు మేరకు ఖరగ్ పూర్ నుంచి ఇంటికి వస్తూ వాళ్ళూరుకి వెళ్ళాము. నేను, సుధాకర రెడ్డి, రంగనాధ్ ముగ్గురము రాజమండ్రిలో దిగి ఓ కారు తీసుకొని చింతలపల్లి చేరాము.అదే నేను మొదటసారి తూర్పుగోదావరి వారి ఆతిధ్యాన్ని, కోనసీమ ప్రకృతి అందాలను చూడడం. అద్బుతమైన ఙ్నాపకాలు. పచ్చని పంటపొలాలు, ఎటువైపు చూసినా ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లు. మధ్య మధ్యలో అరటి తోటలు, కల్మషం లేని మనసులు, ప్రత్యేకమైన యాస భాషలతో ఆకట్టుకొనే ప్రజానీకం.అక్కడ వున్న మూడురోజులూ మూడు నిమిషాలగా గడిచిపోయింది.రంగనాధ్ కుటుంబ సభ్యులు కూడా బాగా పరిచయమయ్యారు.

ఉత్తరం వ్రాసిన తరువాత ప్రత్యుత్తరానికై ఎదురుచూస్తున్నాను. ఓ మూడు వారాల తరువాత రంగనాధ్ నుంచి ఉత్తరం వచ్చింది. నేను వ్రాసిన ఉత్తరం వాళ్ళనాన్నకు చేరిందని, దానిని ఆయన పూనా లో వున్న రంగనాధ్ కు పంపాడని విషయం అర్థమైంది. ఉత్తరం చదవడం పూరైన తరువాత మరికొన్ని విషయాలు గ్రహించాను. సుధాకర రెడ్డి, రంగనాధ్ ఇద్దరూ పూనా లో ఓ షుగర్ కన్సల్టెన్సీ లో ఉద్యోగాలుచేస్తున్నారు. అప్పటికి అక్కడకు వెళ్ళి నెలనాళ్ళ పైనే ఐంది. మొదట సుధాకర రెడ్డి పూనా కు వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించిన పిమ్మట రంగనాధ్ ను రిఫర్ చేశాడు. అలా వాళ్ళిద్దరూ ఏప్రిల్ మాసంలో పూనాకు వెళ్ళారు. ఇద్దరూ కంపెనీ కి దగ్గరలో కొత్తపేట్ లో ఓ హాష్టల్ లో వుంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రంగనాధ్ వారుండే అడ్రస్ ఇస్తూ పూనాకు రమ్మని, ఇక్కడికి వస్తే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుందని ఉత్తరాన్ని ముగించాడు.

 ఉత్తరాన్ని చదివిన తరువాత ఇక ఇంటివద్ద  ఉండలేకపోయాను. పూనా వెళ్ళడానికి సిద్ధమైనాను. నాన్న దగ్గర కొంత డబ్బు తీసుకొని , బట్టలు, పుస్తకాలు సర్దుకొని, ఉత్తరంలో వున్న చిరునామా ని భధ్రంగా దాచుకొని ఓ శుభముహూర్తాన ఊరినుంచి పూనా కు పయనమయ్యాను.

19, ఏప్రిల్ 2020, ఆదివారం

కరోనా టైమ్స్ సమయ పాలన ....జీవిత సోపానాలు -- ౧

జీవిత సోపానాలు -- ౧

కరోనా సమయంతో చేతిలో కావలసినంత సమయం.దీనిని ఏదో ఒకరకంగా సద్వినియోగం చేసుకుందామని ఈ సీరీస్ మొదలు పెట్టాను.

జీవితం ఒడ్డించిన విస్తరి కాదు.అనుక్షణం ఈ ప్రపంచంలో జీవించడానికి పోరాడవలసిందే. 1995 లో M.Tech చేసేటప్పుడు మా కెమికల్ లేబరేటరీకి న్యూఢిల్లీ నుంచి ఇష్.కె.ఘాకర్ అనే ఒక చిన్నపాటి ఇండస్ట్రయలిస్ట్ వచ్చాడు. లేబొరెటరీ లో అతనికి నేను సహాయపడుతూ ఏదైనా ఉద్యోగమొచ్చే మార్గముంటే చూడమని అభ్యర్థించాను. మాదురదృష్టం కొద్దీ ఆ సంవత్సరం మా కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట మెంట్ లో M.Tech చేస్తున్న పదిహేను మందికి గానూ ముగ్గురికే క్యాంపస్ ఇంటర్వూలలో ఉద్యోగాలొచ్చాయి. అలాగే బొంబాయి బార్క్ లో ఉద్యోగ ప్రకటన కు అప్లికేషన్ పెట్టుకొని వుండటంతో రిటన్ టెస్టు కు కాల్ వచ్చింది. బొంబాయి వెళ్ళి పరీక్ష రాస్తే రిటన్ టెస్టు పాసయ్యా కానీ ఇంటర్వూ లో పోయింది. ఇన్ని సమస్యల మధ్య ఉద్యోగాన్ని సాధించాలంటే ఎవరిదో ఒకరి రెకమండేషన్ తప్పని సరేమో అన్న అభిప్రాయం నాలో బలంగా వేళ్ళూనుకుంది. అందుకనే ఇష్.కె.ఘాకర్ గారిని అభ్యర్థించాను. ఆయన తన విజిటింగ్ కార్డు ఇచ్చి తన స్నేహితులు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లో వున్నారని మాస్టర్స్ పూర్తైన తరువాత తనకొకసారి తెలియచెయ్యమని చెప్పాడు. ఇంకేముంది ఉద్యోగమొచ్చినట్టే అన్న విశ్వాసంతో డిగ్రీ పూర్తిచేసుకొని ఇంటి దారి పట్టాను.

ఇంటికి మార్చ్ చివరివారంలో వస్తే ఏప్రిల్ లో పెళ్ళి సంబంధాలు రావడం మొదలయ్యాయి. ఈ లోపు పనిలో పనిగా ఓ ఉత్తరాన్ని ఇష్.కె.ఘాకర్ గారికి వ్రాశాను. అక్కడినుంచి ఏ ప్రత్యుత్తరంలేదు. ఓ నెలనాళ్ళు ఆత్రంగా ఎదురుచూశాను. ఏప్రిల్ చివరిలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ హరిహర్ ( కర్ణాటక ) వారి వద్దనుంచి ఇంటర్వూకి రమ్మని పిలుపొచ్చింది. ఆరాత్రి వెన్నెలలో విహరించాను. జీవితమింక ఓ దారికొచ్చినట్లేనని కలలు కన్నాను. నేనూ నాకు కాబోయే భార్య( అప్పటికెవరో తెలియదు కానీ పెళ్ళైతే చేసుకోవాలన్న నిశ్చయానికొచ్చాను) హరిహర్ లో ఎలా గడపబోతున్నామో రంగులకల కళ్ళముందు ప్రత్యక్షమైంది. రాత్రికి రేడియో లో పాటలు వింటూ ఆనందడోలికల్లో విహరించాను.తరువాత ఓ వారం భారంగా గడిచింది. మరుసటి వారం ఇంటివద్దనుంచి హరిహర్ కు బయలు దేరాను.

ఎండాకాలం.సూర్యభగవానుడు ప్రొద్దున్నే తన ప్రతాపం చూపడం మొదలుపెట్టాడు.ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో బస్సు మార్గం. నడుచుకొని మధ్యాహ్నంగా వినుకొండకు బయలుదేరాను. సాయంకాలం కర్ణాటక కు వెళ్ళే బస్సు పట్టుకొని హరిహర్ ( కుమారపట్నం) వెళ్ళాలని ప్లాన్. పంట కోయడంతో చేలన్నీ బోసిపోయి వున్నాయి. మధ్యాహ్నం కావడంతో అక్కడక్కడ మాత్రమే చేలల్లో బఱ్ఱెలు, వాటికి కాపుగా బఱ్ఱెలకాపర్లు కనిపిస్తున్నారు. నీరు పారి పంటకోయడం పూర్తవ్వడంతో ఎండకు చేలన్నీ నెఱ్ఱెలు బారి కనిపిస్తున్నాయి. ఊర్లలో మఱ్ఱిచెట్ల దగ్గర నీడలో పులిజూదం ఆడుకుంటూ అక్కడక్కడ పల్లె జనాలు. పల్లె వాసుల సంపదైన పశువుల దాహార్తి తీర్చడానికి అడుగంటిన బోరింగుల దగ్గర జనులు. ఇంత ఎండలోనూ తనకేమీ పట్టదన్నట్టు సాగిపోతున్న ఎఱ్ఱబస్సు. బస్సు కిటికీల సందుల్లోనుంచి వస్తున్న వడగాల్పులు తట్టుకోవడం కష్టంగానే వున్నది. మధ్యాహ్నం మూడుగంటల సమయానికి వినుకొండ చేరుకున్నాను. సాయంకాలం ఐదున్నరకు ధావనగరె బస్సు.

మొత్తానికి ఒక రోజంతా ప్రయాణించి వినుకొండ నుంచి కర్నూలు,మంత్రాలయం, సింధనూరు  మీదుగా మరుసటి రోజు ఉదయం పదిగంటల ప్రాంతంలో  హరిహర్ చేరాను. ఓ లాడ్జీ లో రూమ్ తీసుకొని పడుకుంటే మరురోజు ఇంటర్వూ ఒత్తిడితో ఎంతకూ నిద్రరాలేదు. ఏ ఝాములో నిద్రపోయానో తెలియలేదు కానీ మరునాడు ప్రొద్దునే నిద్రలేచి స్నానంచేసి వున్నవాటిలో కాస్త మంచి దుస్తులు ధరించి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కు వెళ్ళాను.

ఇంటర్వూ రెండంటే రెండే నిమిషాలు జరిగింది. నీకు ఘాకర్ ఎలా తెలుసని, సాలరీ ఎంతకావాలని?  నాలుగువేల ఐదొందలు అని చెప్పాను. వాడు నువ్వు దానికి సరిపోతావా అని అడిగాడు. నేను వై నాట్ అని సమాధాన మిచ్చాను. అప్పట్లో నాకు నాలుగువేల ఐదొందలు ఎక్కువ మొత్తంగా కనిపించేది.మరి ఆ మొత్తం ఆ ఉద్యోగానికి తక్కువనుకున్నాడో లేదా ఎక్కువనుకున్నాడో తెలియదు కానీ నీకేవిషయం ఉత్తరం ద్వారా తెలియచేస్తామన్నాడు. కానీ నాకక్కడ అతని ముఖ కవళికలు చూస్తే అంతనమ్మశక్యంగా కనిపించలేదు. సరే ఏమి చేస్తాం? ఎక్కువేమైనా అడిగానా అన్న అనుమానం ఓ ప్రక్కనున్నా కనీసం నాలుగువేల ఐదొందలు లేని ఉద్యోగం ఉద్యోగమే కాదని అనిపించింది. లాడ్జ్ రూమ్ కు వచ్చి  కొంతసేపు విరామం తరువాత మంచి సఖీలా మళయాళ సినిమాకు వెళదామని వెళితే టికెట్లు దొరక్క రూమ్ కు వచ్చాను. రూమ్ లోకి వెళుతుంటే ఏదో దుర్వాసన! ఏదోలెమ్మని వెళ్ళి పడుకుంటే ఓ గంటకు విపరీతమైన దుర్వాసన. బయట ఏవో తెలియని భాషలో అరుపులు. బయటకొచ్చి చూద్దును కదా! ప్రక్కరూమ్ ముందు పోలీసులు. ఎవరో ప్రక్క రూమ్ లో లెటర్ వ్రాసి ఫ్యాన్ కు ఉరివేసికొని చనిపోయారు. నాకు అది చూసిన తరువాత ఒళ్ళంతా చెమటలు....

ఆ ఆత్మహత్యకు నాకూ ఏమైనా సంబంధం అంటగట్టి పోలీసు విచారణ అని వేధిస్తారేమోనన్న అనుమానం రావడంతో వెంటనే రూమ్ ఖాళీ చేయాలనుకున్నాను. కానీ అప్పటికప్పుడంటే బస్సులు లేవు. రాత్రికి కానీ హరిహర్ నుంచి ఆంధ్రాకు బయలుదేరే బస్సులు లేవు. ఏమి చేయాలా అన్న ఆలోచన లో పడ్డాను. ఏదైతే అది ఐనదని బస్ స్టాండ్ కు వెళ్ళాను.

 మాకు దూరపు చుట్టము, నాతోపాటు ఎమ్సెట్ కోచింగు కు వచ్చి ఒక నలభైరోజులు నెల్లూరు కోరాలో కోచింగ్ తీసుకున్న తిరుపతిరెడ్డి ధావణగరె లో మెడిసన్ లో పిల్లల వైద్యనిపుణత లో పి.జి. చేస్తున్నాడు. ఇప్పుడతను గుంటూర్ మెడికల్ కాలేజీ లో ప్రొఫెషర్ గా పని చేస్తున్నాడు. ధావణగరె హరిహర్ కు ఓ అరగంట ప్రయాణమని తెలుసుకున్నాను.వెంటనే బస్సు తీసుకొని ధావణగరె వెళ్ళి తిరుపతి రెడ్డి ఫోను చేసి నేను వచ్చి నట్టు, బస్ స్టాండ్ లో వున్నట్టు సమాచారమిచ్చాను. ఓ పదినిమిషాలకు ఓ బండిమీద వచ్చి నన్ను తన హాష్టల్ కు తీసుకొని వెళ్ళి దగ్గరలోని హోటల్ కు తీసుకొని వెళ్ళాడు. ఇద్దరము కబుర్లు చెప్పుకుంటూ సెట్ దోసె తిన్నాము. తరువాత డోల్బీ థియేటర్ అని చెప్పి ఏదో ఇంగ్లీష్ సినిమాకు తీసుకువెళ్ళాడు. సినిమా గుర్తుంచుకోవలసినంత గొప్పగా లేకపోవడంతో గుర్తులేదు. సరదాగా సాయంకాలం దాకా కబుర్లతో గడిపి సాయంత్రం బస్టాండ్ కు వచ్చి ధావణగరె - కనిగిరి బస్సు ఎక్కాను. తెల్లవారేటప్పటికి కనిగిరి చేరుకొని అక్కడనుంచి సాయంకాలానికి దర్శి మీదుగా మాఊరు గాంధీనగర్ చేరుకున్నాను.

ఉద్యోగము వచ్చే సూచనలు సన్నగిల్లాయి. ఈ లోపు పెళ్ళి సంబంధాలు వస్తున్నాయి. అమ్మాయిని చూడడానికి వెళ్ళానంటే వద్దు అని చెప్పకూడదనుకున్నాను. దానితో రెండు సంబంధాలను అసలు చూడడానికి కూడా వెళ్ళలేదు. కారణం ఒకమ్మాయిని నేను ఇంతకు ముందే చూసి వుండటం, మరో సంబంధం వచ్చేనాటికి మరో అమ్మాయిని చేసుకుందామని అనుకోవడం. మేనెలలో మాకు వెలిగండ్లలో హైస్కూల్ లో సైన్స్ పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుని కూతురిని చూడటానికి నేనూ మా అమ్మ వెళ్ళి వచ్చాము. మరుసటి వారం వాళ్ళు మాట్లాడటానికి వచ్చారు. నాకు ఉద్యోగం వచ్చే దాకా పెళ్ళి వద్దని చెప్పడంతో పెళ్ళి వచ్చే సంవత్సరం చేద్దామని పెద్దలు సూచనాప్రాయంగా తెలియజేసారు. ఆ మరుసటి రోజే నర్సరావు పేట నుంచి మరో సంబంధం వచ్చింది. పాపం ఆయన నూజెండ్లలో దిగి మూడుమైళ్ళు ఎండలో పడి నడుచుకుంటూ మా ఊరు వచ్చాడు. ఎండన పడి వచ్చినతనికి మా అమ్మ శక్తిమేరకు ఆతిధ్యం ఇచ్చింది. భోజనానంతరం విశ్రమించి తానొచ్చిన పనిని ఎంతకట్నమిస్తాడో చెప్పి అమ్మాయిని చూడటానికి రమ్మని ఆహ్వానించాడు.

తరువాత భాగం కోసం మళ్ళీ ఇక్కడకే రండి :)