31, అక్టోబర్ 2011, సోమవారం

వ్యవసాయ సంబంధమైన పదాలు.... వాటికి సరిపడ ఫొటోలు...

ఈ మధ్య బ్లాగుల్లో బాగానే అందమైన ఫోటోలు కనిపిస్తున్నాయి. అలాగే కొద్దిమంది ఈ రంగంలో మంచి ప్రొఫేషనల్స్ కూడా వున్నట్టున్నారు. వీరందరికి ఒక అభ్యర్థన.మీరు ఇదివరకు తోసిన లేదా తీయబోతున్న ఫొటోలు వ్యవసాయ సంబంధమైన ఫొటోలైతే ఆ లింకును ఇక్కడ ఇవ్వగలరేమో చూడండి.
ఫొటోలు నాణ్యమైనవి కావాలి. అంటే ఈ ఫోటొల్లో ఆ పనిముట్టుకు సంబంధించిన అన్ని భాగాలను గుర్తించడానికి అనువుగా వుండాలి. వీటిని తెలుగునిఘంటువులో చేర్చడానికి ఎటువంటి అభ్యంతరమూ లేనివై ఉండాలి.ఈ క్రింద కొన్ని ఉదాహరణ పదములనిస్తున్నాను. కానీ ఇవే అవ్వక్కరలేదు. వ్యవసాయానికి సంబంధించి ఏ పనిముట్టైనా తీసుకుంటాము.


కొన్ని ఉదాహరణ పదాలు.

౧) కొడవలి
౨) లిక్కి
౩) జడ్డిగం
౪) నాగలి
౫) గొఱ్ఱు
౬) పరము
౭) బండి
౮) పొన్ను
౯) పలుగు
౧౦) జడ్డిగం అమర్చి విత్తనాలు విత్తే పరికారాలన్ని
౧౧) గుంటక
౧౨) పలక ( అచ్చుకట్టు )
౧౩) దిండు
౧౪) గొర్రు
౧౫) ముల్లుగర్ర
౧౬) చెలకోల ( చెర్నకోల )
౧౭) దోకుడు బార
౧౮)గొడ్డలి
౧౯) గండ్రగొడ్డలి
౨౦) గడ్డపార
౨౧) తర్లుబార
౨౨) కవెల
౨౩) దున్నపోతు
౧౪) బఱ్ఱె
౨౫) ఆవు
౨౬) ఎద్దు
౨౭) గాడి
౨౮) బఱ్ఱెలకొట్టం
౨౯) తొట్టి
౩౦) తలుగు
౩౧) వామి
౩౨) రకరకాల పైర్లు ( దంటు, కంకి స్పష్టంగా కనిపించాలి )
౩౩) గాదె( గాజె )
౩౪) పాతర
౩౫) చిక్కి


ఇవే కాకుండా ఇంకా మీకు తెలిసిన పనిముట్లేవైనా సరే....

30, అక్టోబర్ 2011, ఆదివారం

మాఊర్లో శిశిరమొచ్చింది. ఇక నాలుగునెల్లు కుంపట్లే గతి..........

''మార్గశిర పుప్యౌ హిమ: మాఘఫాల్గుణౌ శిశిర:

చైత్ర వైశాఖౌ వసంత: జ్యేష్ఠాషాడౌ గ్రీష్మ

శ్రావణ భాద్ర వర్షా ఆశ్వీజ కార్తీకా శరత్‌''

అలా మనపెద్దలు ఋతువులకు మాసాలకు లంకెపెట్టారు కదా!!! మనకు భారతదేశంలో వాతావరణ సమతుల్యత గల రోజుల్లో బహుశా స్పష్టంగా ఆరు ఋతువులు బాగా కంటికి కనిపిస్తూ స్పర్శ జ్ఞానముద్వారా తెలుస్తుండేవేమో. నా చిన్నప్పుడు నేను చదువుకొన్నప్రాతంలో అడవులు బాగా ఉండేవి. అప్పుడు కూడా కొద్దో గొప్పో ఏ ఋతువులో వున్నామో కేలండర్ చూడకుండా స్పర్శ జ్ఞానం ద్వారా చెప్పగలిగేవాళ్ళు. ఇప్పుడక్కడకూడా అంత దృశ్యంలేదులేండి. ఓ మూడేళ్ళక్రితం చదువుకున్న పాఠశాల చూద్దామని ఆ ఊరెళ్ళి అక్కడున్న పరిశరప్రాతాలతోటి భైరవకోన కూడా వెళ్ళాము. ప్చ్....అనుకుంటే గుండె తరుక్కొని పోతుంది.దట్టమైన అడవి కనపడకపోతే పోయింది. కనీసము ఆ ఛాయలుకూడా కనిపించలేదు :(. ఈ విషయంలో అమెరికాను నిజంగా మెచ్చుకోవాలి. ఇక్కడ ఇప్పటికీ వీరికున్న నాలుగు ఋతువులు ఖచ్చితంగా మనకు కనిపిస్తాయి.

నాకీ శ్లోకం ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చిందంటారా? ఏమీ లేదండి మొన్నటిదాకా ప్రకృతి ఎంతరమణీయమో కదా అని చెట్లకున్న రంగురంగులాకులను చూస్తూ మైమరచి తన్మయానంద డోలికల ఊగుతూ కారునడుపుకుంటూ ఆఫీసుకు వెళ్ళి వస్తుండేవాడిని. నా ఆనందాన్ని చిదిమేస్తూ నిన్న పడిన ఓ వర్షానికి ఆ తరుణీలతల పత్రాలన్నీ కాలధర్మం చేస్తున్నట్టు భూమాతను కలిసిపోయాయి. అది జరిగి ఒక్కరోజైనా కాకుండానే ఈ వేళ శిశిరాగమనమా అన్నట్లు మా ఊర్లో ఈ సంవత్సరానికి గానూ తొలిసారిగా మంచు పడుతుంది. ఇక్కడ మంచుపడడం సర్వ సాధారణమే ఐనా, అక్టోబరు లోనే ఇలా జరగడం కొంచెం భయాన్ని కూడా కలిగిస్తుంది. ఎందుకంటారా? కుమార సంభవములోని ఈ పద్యాన్ని తిలకించండి.

శార్దూలము.

శీతాత్యంతనిపీడనం బడి జగజ్జీవాళు లత్యార్తులై
పాతాళంబులు సొచ్చు నట్టిరవులొప్పన్ భూగృహావాసులై
భీతిన్ వెల్వడకుండ వహ్ని మెయి కంపింపం బ్రచండార్చికిన్
జేతుల్ గ్రొవ్వెరవోవుచుండ శిశిరోచ్ఛేదంబు పర్వెన్ మహిన్


ఇప్పుడు ఈ పద్యానికి మా తెలుగు నిఘంటువులో అర్థాలను వెతకండి :-). అర్థాలు వెతకటానికి అనుగుణంగా సంధిపరిఛ్ఛేదము కూడా చేయడం జరిగింది.

అంటే మా తెలుగు నిఘంటువులో అర్థాలున్న ప్రతిచోటా ఆ పదానికి hyperlink ఇచ్చానన్నమాట. దాని మీద click చేస్తే మీకా పదానికి అర్థము తెలుస్తుంది.శీత + అత్యంత నిపీడనన్ పడి జగత్తు + జీవ + ఆళులు అతి + ఆర్తులు +ఐ

పాతాళంబులు సొచ్చు అట్టు+ఇరువులు+ఒప్పన్ భూ+ గృహ+ ఆవాసులు+ఐ

భీతిన్ వెల్వడక+ఉండన్ వహ్ని మెయి కంపింపన్ + ప్రచండ+ఆర్చికిన్

చేతుల్ క్రొవ్వెర+పోవుచున్+ఉండన్ శిశిర +ఉచ్ఛేదంబు పర్వెన్ మహిన్


శీత + అత్యంత నిపీడనన్ పడి జగత్+జీవ+ఆళులు అతి+ఆర్తులు+ఐ
పాతాళంబులు సొచ్చు+అట్టు+ఇరువులు+ఒప్పన్ భూ+గృహ+ఆవాసులు+ఐ
భీతిన్ వెల్వడక+ఉండన్ వహ్ని మెయి కంపింపన్ ప్రచండ+ఆర్చికిన్
చేతుల్ క్రొవ్వెర+పోవుచున్+ఉండన్ శిశిర+ఉచ్ఛేదంబు పర్వెన్ మహిన్

తెలుగునిఘంటువింకా పూర్తిగా టైపు కాలేదు కనుక, ఇప్పుడు సూర్యరాయాంధ్ర తెలుగు నిఘంటువు ఆన్ లైన్ వెర్షన్ లో దొరకని పదాలకు అర్థాలు చూద్దాము. అన్నింటికి ప్రతిపదార్థము వ్రాయవచ్చు కానీ ఏదో ఆలింకుల ద్వారా మా తెలుగునిఘంటువుకు కాస్త ట్రాఫిక్ నిద్దామని :))

ఆళులు = సమూహాలు
ఆర్తులు+ఐ = దుఃఖముకలవారై

పాతాళంబులు = పాతాళములు
భీతిన్= భయముతో
వెల్వడక+ఉండన్ = వెలుపలికి రాకుండా

వహ్ని= అగ్ని
ప్రచండ = తీవ్రమైన
ఆర్చికిన్ = కిరణాలు
ప్రచండ+ఆర్చికిన్ = సూర్యునికి

క్రొవ్వెర+పోవుచున్+ఉండన్ = కొంకర్లు పోతుండగా
ఉచ్ఛేదంబు= బాధ
పర్వెన్= వ్యాప్తమయ్యెను


పద్యం మొత్తానికి భావము : భూమిపై చలి ఎక్కువగా వ్యాపించింది. ఆ చలివలన కలిగిన బాధను భరించలేక సృష్టిలోని ప్రాణులు అమిత దుఃఖముతో పాతాళలోకాలకు పోయినట్లు భూగర్భంలో ఉన్న ఇళ్ళలోనికి పోయి అక్కడనుండి బయటకు రాకున్నారు. అగ్నికే శరీరం కంపిస్తునట్టు, సూర్యునికే చేతులు కొంకర్లు పోతున్నట్లు చలి విజృంభించింది.

సరి సరి, ఈ దేవుని సృష్టిలో ప్రతిఒక్కదానికి ఒక ప్రయోజనమంటూ ఉందికదా? మరి ఈ చలి వలన ప్రయోజనమేమిటా అంటే రామరాజభూషణుఁడు కావ్యాలంకార సంగ్రహము లో ఈ విధంగా ఈ శిశిర ఋతువు గూర్చి చెప్పారు.

మాఘ,ఫాల్గుణాలలో శిశిరర్తువు. ఈ ఋతువు హేమంతము వలే నుంటుంది. విశేషించి ఏనుగులకు, లేళ్ళకు, పందులకు, దున్నలకు కొవ్వు పడుతుంది.కామినిలు విచిత్ర సురతోపభోగ యోగ్యులు గా వుందురు. అంటే ( సురత+ఉప+భోగ ) :-) . చందనమునకు రుచి కలుగును. నీటికి మిక్కిలి శైత్యము కలుగును. మరువకములును కుందములును పుష్పించును.
కేళాకూళులయందనాదర మేర్పడును. ఎల్లరును వెచ్చవెచ్చగా కుంపట్ల వద్ద కూర్చుండ నభిలషింతురు. ప్రచండ వాయువు వీచును. కుంకమ పూత పూసుకొని ఆ చలిని కామినులు సహింతురు.

మొత్తంగా చూస్తూ ఈ చలికాలం మొగవారికి మంచి ఋతువన్నమాట :-)

28, అక్టోబర్ 2011, శుక్రవారం

దమ్ముమీద దమ్ము... రింగురింగుల పొగ....

నాయనా ఈ ధూమపానమనేది ఒక జిల లాంటిదన్నమాట. ఒకసారి తగులుకుంటే అంత త్వరగా పోదు. కాబట్టి దీనికి ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. ఇక్కడ నేను వ్రాసేవన్నీ అక్కడ ఇక్కడ ఏరుకొచ్చి వ్రాసినవే కాబట్టి వీటికి ప్రూఫ్ లు కావాలంటే ఒక పదిమంది స్మోకర్లు 20 నుండి 60 ఏండ్ల మద్యవాళ్ళను ఒక దగ్గర కూర్చో పెట్టి వాళ్ళ అభిప్రాయాలను కనుక్కోండి. ఇందులో 99% నిజమయ్యే అవకాశాలుంటాయి. కానీ చాలా వరకు ఇప్పటి తరం వాళ్ళు ఎందుకనో తమజబ్బులను బయటకు చెప్పుకోవటంలేదు.కారణాలేమో??? చెప్పుకోవడం వల్ల ఏమైనా నష్టాలో ఏమో తెలియదు కానీ కనీసం మీమీ వివరాలు డాక్టర్ దగ్గరకి వెళ్ళినప్పుడన్నా చాలా చాలా స్పష్టంగా వివరంగా చెప్పడం అలవాతు చేసుకోండి. ఎందుకంటే వైద్యశాస్త్రంలో వైద్యునికి అతి కష్టమైన పని మనకు ఏ జబ్బుందో కనిపెట్టడమేనట. దానికి మీ వంతు సహాయం లేకపోతే డాక్టర్లు కిడ్నీ బదులు గుండెకాపరేషన్ చేసి " ఎవ్విరిథింగ్ ఈజ్ ఆల్రైట్" అని చెప్పిన నాలుగోరోజుకే వేరే ఏమైనా జరగొచ్చు.

ఇకపోతే మన శరీరంలో ఈ సిగిరెట్టు నోట్లో పెట్టి గుప్పు గుప్పు మని పొగబండి లెక్కన పొగను వదిలేమా.... రింగురింగుల తిరుగుతూ మొదట్లో బాగానే ఉంటుంది. కానీ ఆ ధూమపానమే backpain మరియు నరముల సంబంధించిన వ్యాధులకు మూలమని తెలుసా? ఒకవేళ మీకు ఈ జబ్బులు ఇప్పటికే వుండి ఇప్పటికీ ధూమపానం చేస్తున్నట్లైతే తక్షణం మానడం మంచిది. కారణం ఈ పొగవల్ల కణజాల క్షీణత మరింత ఎక్కువౌతుంది.ఎలాగా???

ఎలాగంటే మన రక్తనాళాల్లో వుండే అంతర్గత పొర ఈ ధూమపానంలో వుండే విషపదార్థాలవల్ల నాశనమైపోవడం మొదలౌతుంది. ఈ పొగత్రాగడంవల్ల ఊపిరితిత్తుల ద్వారా మన రక్తంలో కలిసిన విషపదార్థాలు మన గుండెకు, మెడ,వెన్నుముకల డిస్కులకు రక్తాన్ని సరఫరా చేసే చిన్న చిన్న రక్తనాళాల లోపలి పొరలపై రసాయన చర్య జరిపి ఆ పొరను నాశనం చేస్తాయి. దీని మీద పూర్తి వివరాలు కావలసిన వారు " endothelial cells nitric oxide and nicotine" అని గూగుల్ లో సెర్చ్ చేయవచ్చు. ఇక్కడ మనము గుర్తుంచుకోవాలసింది, ఈ సిగిరెట్లలో నికోటిన్ ఒక్కటే కాదు దానితో కలిసి దరిదాపు ఐదొందల కెమికల్స్ ను మండించి, మండించగా వచ్చిన vapour ను మనం డైరక్ట్ గా మన శరీరంలో ఊపిరితిత్తుల ద్వారా ప్రవేశ పెడుతున్నాము. ఇక్కడ మనకొక అనుమానం రావచ్చు. మనము పీల్చిన గాలి ఊపిరితిత్తుల్లోకి కదా వెళ్ళేది. రక్తాన్ని సరఫరా చేసేది గుండె కదా? మరప్పుడు ఈ రక్తానికి ఊపిరితిత్తులకు గల సంబంధమేమిటని. అది నేను టైపు చేయడం కంటే ఈ క్రింది వీడియో చూడండి. బాగా అర్థమవుతుంది.

ఈ క్రింది వీడియో మన ఊపిరితిత్తుల గురించి వివరిస్తుంది.


ఇప్పుడు గుండె, ఊపిరితిత్తుల 3D వీడియో చూడండి. అంటే మన గుండె ఎక్కడ వుంటుందో గుండెచుట్టూరా ఊపిరితిత్తులు ఎలా ఉంటాయో తెలుస్తుంది.ఇప్పుడు మనగుండె, ఊపిరితిత్తులు కలిసి మనశరీరానికి రక్తసరఫరాను ఎలా చేస్తాయో ఈ వీడియోలో చూడండి. అలాగే రక్తంలో ఆక్సిజన్ కలిసినప్పుడు రక్తము రంగు ఎర్రగా ఎలా మారుతుందో చూడండి. కానీ మనం దమ్మేసి రక్తానికి ఆక్సిజన్ తోపాటు నికోటిన్ తో కూడిన కార్బన్ మోనాక్సైడ్ ను కూడా అందిస్తున్నామే :((సశేషం..

26, అక్టోబర్ 2011, బుధవారం

సాఫ్ట్వేర్ గాడి బ్రతుకింతేలే... ఇంతేలే..ఇంతేలే

జీవితమింతేలే....ఈ జీవితమింతేలే............
సాఫ్ట్వేర్ గాడి బ్రతుకింతేలే... ఇంతేలే..ఇంతేలే

మీటింగంటడు.... మాటీమంటడు మెత్తమెత్తగ మొత్తుతాడే
సూపర్ టీమంటడు భుజాల్తడ్తడు గాలికొట్టి నా మనసే బెలూన్ చేస్తాడే
వార్నీ నీశక్తి నీకు తెలియదంటాడే..... నీముందు నేనెంతంటాడే....

ఉబ్బిపోయి రూటుతప్పిపోయి రింగరింగైపోయి
ఓ యస్ అనేస్తానే... చేసేస్తననేస్తానే......

క్షణమెంబడి క్షణం ..నిమిషమెంట నిమిషం గంటమ్మడి గంట
గడిచి పోయి రెండు మూడు గంటలౌతుందా......
అప్పుడు పుడ్తుందండి వాడి బుఱ్ఱలో గుబులు

నాలుగోగంట.....

డెస్క్ దగ్గరకొస్తడే.. హి హి హి అంటాడే
హే హే.. హౌఆర్వ్యుయ్ డూయింగంటాడే...
భుజం తడ్తడు, తొంగిచూస్తడు,కాలుకాలిన పిల్లల్లె తిరిగుతాడే
వాడు మందేసిన కోతల్లె తిరుగుతాడే...
అంతేనా...కంప్యూటర్లో వేలెట్టికెలుకి
అయిందాలేదా? అంటు ఆరాలే తీస్తడే...

నెత్తినోరు కొట్టుకున్న డెడ్లైనంటడు క్లైంట్ మాటండడు...
నామాటే వేదవాక్కంటాడే.. వాడిశార్థమంటడు
తుదకు నువ్వేకదా ఒప్పుకున్నావంటడు
ఇదెంతపనంటడు ...ఏమన్నా చెప్తే...రికార్డింగేస్తడే

(ఇక్కడ ఫ్లాష్బ్యాక్ అన్నమాట..)

నాచిన్నప్పుడు.... గాడాంధకరమైన ఓ అమావాస్యరాత్రి...
గుడ్లగూబలు కూడా భయపడేంత దట్టమైన కోడారణ్యం ( కోడ్ + అరణ్యం )
చిలకలు,గోరింకలు...కాకులు, గద్దలు
కోకిలలు, గుడ్లగూబలు
ఎన్నని చెప్పేది ఓ డెవలపరో..నీకెన్నని చెప్పేది ఓ డెవలపరో
కోతులు, కొండముచ్చులు
ఎద్దులు, ఏనుగులు,భల్లూకాలు...
ఎన్నని చెప్పేది ఓ డెవలపరో..నీకెన్నని చెప్పేది ఓ డెవలపరో...

ఆ రకంగా ఆ నిశీధిరాత్రుల్లో కాఫీ కూడా తాక్కుండా లైనెంట లైను కోడ్ వ్రాసానా
తెల్లారింది..ఆహా..పొద్దెక్కింది.. పక్షులన్నీ ఆఫీస్ చేరాయి
మేనేజరొచ్చి ప్రాజెక్ట్ కేన్సిలైందన్నడ్రో ఓ డెవలపర్
ఏమి చెప్పేదీ..నాబాధెవ్వడికి చెప్పేది...
నేపడ్డ కష్టమ్ముందు నీదెంతన్నాడే.... నీదెంతన్నాడే


ఏదోలా పగలనకరాత్రనక చేసేస్తానా....

బగ్గంటడు, కోడ్చెత్తంటడు ( కోడ్+చెత్తంటడు ),లీకంటడు,లాకులంటడు
అదంటడిదంటడు ఢాం డిస్కంటడు...
అన్నీ అని...తుదకు
మాటెయ్యరో ఓ డెవలపరో..ఈ చిల్లికోడ్ కుండకు మాటెయ్యరో ఓ డెవలపరో...
మాటెయ్యరో ఓ డెవలపరో..ఈ చిల్లికోడ్ కుండకు మాటెయ్యరో ఓ డెవలపరో...

ఓ శుభముహూర్తాన రిలీజౌద్దా...

హా..వచ్చాడే....వీడి మొగుడొచ్చాడే.....
నాసామిరంగా..వచ్చాడే..వీడి మొగుడొచ్చాడే.....
వచ్చి...

మేనేజరో ఓ ఆఫ్సోర్ మేనజరో
నేనండిగిందేంటి నువ్విచ్చిందేంటి
నేను తెలుపురంగడిగితే నువ్వు నలుపిస్తావా... ఓకే
నేను తొండమడిగితే నువ్వు ముక్కిస్తావా..ఓకే
ఐనా నేనేనుగునడిగితే నువ్వెలుక పిల్లనిస్తావా?
ఏమన్నా అర్థాముందా మేనజరో ఓ ఓ ఆఫ్సోర్ మేనజరో....?
కేన్సిల్..కేన్సిల్ ..కేన్సిల్...

డెవలపర్ బ్రతుకు సుఖాంతం ... మేనజర్ ఎలుక కుడితిలో పడింది.


సమాప్తం :-)

17, అక్టోబర్ 2011, సోమవారం

సిగిరెట్ ఎలా తయారు చేస్తారు? ఈ రోజుకిది చూసేయండి.


చూసారు కదా. పాపం మన సిగిరెట్ కంపెనీల వాళ్ళు మనం యథాతథంగా పొగాకు చుట్టను త్రాగలేమని ఎన్ని కోట్ల ఖర్చుతో మనకు సేవచేసి తరిస్తున్నారో...

స్మోకర్స్ బహుపరాక్... ఈ వారంలో అసలు సిసలైన మరో జబ్బు గురించి చర్చించుకుందాము. ఈ లోపు వీలైతే ఆక్సిజన్ మన రక్తానికెందుకు అవసరమో తెలుసుకోండి.

16, అక్టోబర్ 2011, ఆదివారం

పొగతాగే వాళ్ళలో తరచూ కనిపించే జబ్బు సైన సైటిస్ ( తలనొప్పి లాంటిది ) లేదా తీవ్రమైన జలుబు.... కారణమేంటి?

మనము నిన్న కొన్ని బొమ్మలను చూసాము కదా. ఇప్పుడు మన ఉచ్ఛాశ్వ, నిశ్వాస వ్యవస్థను గురించి, మనకున్న ధూమపానం మూలంగా ఈ వాయునాళ మార్గంలో ఉన్న వివిధ ప్రదేశాలను ఏరకంగా చెడగొడుతుందో చూద్దాము.

మనము పీల్చినగాలి ఈ వాయునాళాల గుండా ప్రవహించేటప్పుడు ముందుగా ముక్కుపుటాలలో ప్రవేసించినప్పుడు ముక్కులోనున్న వెంట్రుకలు, ఈగలు, దోమలు మొదలైన వాటిని ఈ వాయునాళం ద్వారా లోనికి ప్రవేసించకుండా ఆపుతాయి. ఆ తరువాత ఈ గాలి ఈ వాయునాళంలో వున్న సిలియా ( మైక్రోస్కోప్ లో మాత్రమే కనిపించే వెంట్రుకల ఆకారంలో వున్న పదార్థము ) ఒక క్రమపద్ధతిలో కదలడంద్వారా, ఈ సిలియాపైన జిగట గా వున్న శ్లేష్మము (mucus) గాలిలో లేదా సిగిరెట్ పొగలో నున్న మనిషి కంటికి కనిపించని దుమ్ము,ధూళి, సిగిరెట్ పొగలో నున్న ఇతర particles ను పట్టేసి చీమిడి రూపంలో ముక్కుద్వారా కానీ లేదా మనము గుటక వేసినప్పుడు జీర్ణాశయము లోనికో పంపించివేస్తుంది. అంటే మనము మనము పీల్చేగాలి ఎంత కలుషితమైతే అంత బాగా మనకు జలుబు చేసి ముక్కులవెంట గోదావరీ నదిని పారిస్తుంది. లేదా ముసీ నదిలాగా నీళ్ళులేక గడ్డకట్టి మనము ఎంతచీదినా పచ్చటి రంగులో ముసీనదంత కంపు కొడుతూ బయటకు వస్తుంది. అంటే ఇదంతా మనము పీల్చిన గాలిలో ఉన్న రకరకాల కెమికల్స్ లేదా దుమ్ము ధూళి.

నిన్నటి బొమ్మను తిరిగి ఇక్కడ పాఠకుల సౌకర్యంకోసం ఉంచుతున్నాను.

ఇక్కడ trachea అనేది వాయునాళం. మనకు మాట,పాట రావడానికి ప్రధాన కారణమైన స్వరపేటిక ( Vocalcords ) దగ్గర మొదలై ప్రధానమైన బ్రోంకై (bronchi) దాకా ఉంటుంది ( అంటే రమారమి ఊపిరితిత్తుల దాకా అనుకోండి ) . అంటే వీటిమధ్యనున్న గొట్టానికి ఆ పేరు పెట్టామన్నమాట. cilia, mucus లు ఎలా ఉంటాయో ఈ క్రింది బొమ్మలో చూడవచ్చు. ఇవి మైక్రోస్కోప్ లో చూస్తేనే కనిపిస్తాయి సుమా!!!
ఇప్పుడు చెప్పిందంతా బాగా అర్థము కావడానికి ఈ వీడియోను ఒక లుక్కేయండి.

మరి ఈ సైనస్ తలనొప్పి ఎందుకు వస్తుంది? ఆలస్యం చెయ్యకుండా ముందు మన అందమైన మొఖం బొమ్మ చూసేయ్యండి.
చూసారా? అక్కడ పింక్ రంగులో కనిపిస్తున్నాయే....అవి మన పుఱ్ఱెలో ముక్కు చుట్టూరూ ఉన్న ఖాళీ ప్రదేశాలు. వాటికి కూడా రకరకాల పేర్లు పెట్టారు. మనకవన్నీ అవసరంలేదు కానీ అసలు ఈ సైనస్ ఎందుకొస్తుంది అనేది కదా మన ప్రధాన సమస్య. క్లుప్తంగా చెప్పాలంటే పుఱ్ఱెలో మనం చెప్పుకున్న ఆ ఖాళీ ప్రదేసాల్లో మనం పీల్చినగాలి తాలుకూ సూక్ష్మమైన particles వెళ్ళి చేరతాయి. ఇక్కడ కూడా పైన మనం చెప్పుకున్న cilia, mucus లు ఎప్పటికప్పుడు వీటిని బయటికి నెట్టేస్తుంటాయి. బయటికి నెట్టడమంటే చీమిడి ద్వారా వచ్చేస్తుంది. మరి సిరెట్లు తాగేవాళ్ళలో ఎందుకు ఈ సమస్య ఎక్కువ ఉంటుందో వేరే చెప్పాలా? తాగేదే అసలు సిసలైన పొగ. అందులోనూ 500 రకాలు కలిసిన కెమికల్స్. అంతేనా దానికీ కోపమొచ్చి "బాసూ నేను పని చెయ్యను నీ దిక్కున్న చోట చెప్పుకోమ్మని మొరాఇస్తుంది" . మనము ఇలాంటి నొప్పులను పెద్దగా పట్టించుకోము గదా మళ్ళీ ఓ దమ్మేస్తాము కదా :-) అప్పుడేమౌద్ది?

ఈ పొగవల్ల ఈ కెమికల్స్ వల్ల సిలియా కదలడం మానేస్తుంది. ఇది కదలకపోతే దానిపైనున్న మ్యూకస్ కదలదు. మ్యూకస్ కదల్లేదంటే ఆ శ్లేష్మము ఆ పుఱ్ఱెలో నున్న ఖాళీ ప్రదేశంలో తిష్టేసుకోని కూర్చుంటుంది. అంటే ముక్కుద్వారా బయటకు రాదు. అలా శుభ్రంగా డిపాజిట్ అయ్యి అయ్యి అసలు బయటకొచ్చే మార్గాన్నే మూసేస్తుంది. అందువలన ఈ సైనస్ వచ్చినవారికి పుఱ్ఱెలోని ఆ ఖాళీ ప్రదేసాలు ముట్టుకుంటే " స్వర్గం ఎక్కడున్నది స్వర్గం ఎక్కడున్నది ......" అనే పాట బదులు " నరకం ఇక్కడున్నది నరకం ఇక్కడున్నది " అని మాత్రమే గుర్తొస్తుంటుంది. ఆలశ్యం చెయ్యకుండా ఈ వీడియో చూసెయ్యండి. బాగా అర్థమవుతుంది.


15, అక్టోబర్ 2011, శనివారం

సిగిరెట్ మానడం ఎందుకంత కష్టం..... మనమంతటి దుర్బల మనసు కల వాళ్ళమా ?

బోధిసత్త్వునికి బోధిచెట్టుక్రింద జ్ఞానోదయమై బుద్ధుడై దేశాటనం చేసినట్టు ఈ పొగతాగే వళ్ళలో కూడా ఎప్పుడో ఒకసారి ఈ జ్ఞానోదయమవ్వాలి. ఔతుందా అని మీకు అనుమానం రావచ్చు. కచ్చితంగా అవుతుంది. ఒక్కసారి కాదు చాలా సార్లే అవుతుంది. కానీ అలా ఆ జ్ఞానోదయమైనప్పుడు దాన్ని భద్రంగా రెండు మూడు రోజులు ఉంచుకొని నాలుగోరోజో ఐదోరోజే అటకెక్కించేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం నికోటిన్ అడిక్షన్ అని చెప్పుకోవచ్చేమో కానీ దానికంటే ముఖ్యకారణం మన మనసు/ మెదడు మీద మనకు అధికారం లేకపోవడమే. అంటే మనల్ని ఏదో శక్తి లొంగదీసుకొంటుందన్నమాట. ఇక్కడాశక్తి నికోటిన్ అనుకోవచ్చు. అందుకనే ఈ వ్యసనం మానడానికి దండయాత్ర మీద దండయాత్ర చేయాల్సి వస్తుంది. ఎప్పడిదాకా? గెలిచేదాకా !!!!... ఒక్కసారికే గెలుస్తామనుకుంటే అది అపోహ మాత్రమే... నేను మానేయాలని నిర్ణయించుకొన్నాక కూడా పదిహేను పెట్టలు కొని పడేసానంటే ఎన్ని దండయాత్రలు చేసానో చూడండి మరి. కానీ చివరి విజయం నాదే.

సందర్భం వచ్చింది కాబట్టి ఒక చిన్న అనుభవాన్ని వివరిస్తాను. మనము మొదటి నాలుగైదు రోజులు అసలు ఒక్క సిగిరెట్ కూడా ముట్టకుండా మన మనసుని నియంత్రించగలిగామనుకోండి, అప్పుడు కలిగే విజయగర్వం, మీ మనసుపై మీకున్న అధికారం నిజంగా వర్ణనాతీతం. ఈ విషయం సిగిరెట్ తాగే వాళ్ళకు మాత్రమే అర్థమవ్వగలదు. మీరు సాధించిన పురోగతి మిమ్మల్ని నిజంగా ఓ ఉన్నత స్థానంలో వున్నట్టు చూపిస్తుంది. అంటే మొదటి వారంలో మీరు దరిదాపుగా location based mental trauma నుంచి బయటపడినట్టే. నావరకు దీన్ని అధిగమించడమే కష్టంగా తోచింది. కానీ ఈ నికోటిన్ సిగ్నల్స్ రెండవ వారంలో పతాక స్థాయికి చేరి, "ఒక్కటంటే ఒక్క సిగిరెట్" వెలిగిస్తే ఏమౌతుంది. వెలిగించొచ్చు కదా అని ప్రియురాలు పిలిచినంత గోముగా [పెళ్ళాలు కాదులెండి.... పెళ్ళాం ఎక్కడైనా ప్రేమగా పిలుస్తుందా ;-) ] , రకరకాలుగా మనల్ని ప్రలోభాలకు గురిచేస్తుంది. కానీ మీరు ఆ ఒక్కసిగిరెట్ వెలిగించారా? ఔట్... మళ్ళీ మాములు స్థితికి ఒకటి రెండు రోజుల్లో వచ్చేస్తారు. అంటే ఎప్పటిలాగే గుప్పు గుప్పు మనిపిస్తుంటారన్న మాట. కారణం ఈ బుద్ధి ఉంది చూసారూ అది మహా చెడ్డది సుమండీ :-). ఈ ఒక్క సిగిరెట్ symptoms తీవ్రత తగ్గడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేను కానీ నాకైతే నాలుగువారాలదాకా ఉండేది. అంటే రెండో వారంలో రెండు మూడు రోజులనిపిస్తే నాలగవ వారంలో ఏదో ఒకరోజు ఓ రెండు నిముషాలనిపించేది. ఇప్పుడసలు లేదు. ఎవరైనా సిగిరెట్ త్రాగుతూ కనిపిస్తే జాలిగా చూడడం అలవాటైంది.

నాకలా.." ఒక్కసిగిరెట్ వెలిగిస్తే" ఏమౌతుంది అని అనిపించినప్పుడల్లా..." ఇన్ని రోజుల కష్టం బూడిదలో పోసిన పన్నీరౌతుంది కదా " అని అనుకుంటూ నేను నా ఐ-ఫోన్ లో రాసిపెట్టికున్న symptoms చూసుకొనేవాడిని ఆ ఐదారు నిముషాలు. మరో ముఖ్యవిషయం, మీరు స్మోకింగ్ మానేసిన వెంటనే చాలా వేగంగా రోజుకు కనీసం రెండు మూడు మైళ్ళన్నా నడవాలి. దీనివల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఆ ఉపయోగాలు తరువాత చెప్పుకుందాం కానీ అతి ముఖ్యమైన ఉపయోగం "సిగిరెట్ త్రాగాలన్న ధ్యాసను తగ్గిస్తుంది".

ఓ చిన్న సిగిరెట్ మన శరీరంలో కలుగ చేసే రకరకాల మార్పులను తెలుసుకోవాలంటే ముందుగా మానవ శరీర నిర్మాణము గురించి తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే నాకు తెలిసిన అతికొద్ది వివరాలను మాత్రమే నేనందిమ్చగలను. ఇటువంటి టపాలకు సహజంగానే ఆదరణ తక్కువ కాబట్టి నా సమయాన్ని, మీ సమయాన్ని ఎక్కువగా వృధా చెయ్యకుండా కానిచ్చేస్తాను.

ఈ క్రిందనున్న బొమ్మలు జాగ్రత్తగా చూడండి.
మనం సిగిరెట్ తాగినప్పుడు నోటిగుండా పీలుస్తాము, వదిలేటప్పుడు నోటిగుండా, ముక్కు గుండా కూడా వదులుతాము. లేకపోతే అసలు మజా ఏముంటుంది చెప్పండి :-)
కాబట్టి ఇప్పుడు ఈ పొగ ప్రయాణించిన మార్గామేదో చెప్పగలరా? ఎందుకంటే ఆ మార్గంలో నున్న ప్రతి భాగాన్ని ఈ పొగ చెడగొట్టేస్తుంది. ఆ మార్గంలో ప్రతి భాగమూ ఒక పని చేస్తుంది. అది పాపం మనకెప్పటికప్పుడు.. ."సారూ... నువ్వు నన్ను కుళ్ళపొడుస్తున్నావు. నేను ముసలిదాన్నై పోతున్నాను. ఈవాళో రేపో అన్నంట్టుంది నా పరిస్థితి..ఓ సారి నా గురించి ఆలోచించమని " అబ్బే మనం వింటామా??? లెదు కదా....

దీనివల్ల వచ్చేరోగాలను తరువాతి టపాల్లో చూద్దాము.అప్పటిదాకా అక్కడున్న భాగాలను బట్టీయం వేయండి. వాటికి తెలుగు పేర్లు నాకు తెలియదు కాబట్టి ఆ ఆంగ్ల నామాలతోతే రాబోయే టపాలు వ్రాస్తాను.ఎవరైనా తెలుగుపదాలు తెలిపితే సంతోషిస్తాను.


వచ్చేటపాదాకా సెలవు.

14, అక్టోబర్ 2011, శుక్రవారం

వెధవ తలనొప్పి ... ఒక్క దమ్ములాగుదాం దెబ్బకు తగ్గిపోద్ది.

దమ్మేస్తే తలనొప్పి తగ్గిపోద్ది. ఓ సారి బయటకెళ్ళి ఓ దమ్ములాగొద్దాం పదండి. చాలా మంది స్మోకర్స్ లో ఉన్న అభిప్రాయము ఇది. నిజానికి ఎవరికైనా ఇలాంటి అనుభవముందేమో కానీ, నాకైతే తలనొప్పిగా ఉన్నప్పుడు సిగిరెట్ తాగితే ఆనొప్పి ఎక్కువెయ్యేది. ఎందుకో తెలిసేది కాదు కానీ కొన్ని వందల సార్లు ఇలాంటి symptoms observe చేసుంటాను. అంటే తలనొప్పిగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్/ పక్కనున్న వారి మాటలు విని ఓ సిగిరెట్ తాగితే ఆ తలనొప్పి తగ్గకపోగా ఇంకా ఎక్కువయ్యేది. కారణం తెలిసేది కాదు.

మీలో చాలామందికి నేను సిగిరెట్ ఎందుకు మానేసానో అనే సందేహం ఇప్పటికే వచ్చి వుండవచ్చు. కారణం ఇదే... ఓ రోజు చిన్నగా మొదలైన తలనొప్పి నేను తాగిన సిగిరెట్ల మూలంగా రెండోరోజో మూడోరోజు ప్రొద్దిటికే ఎక్కువైంది. ఎక్కువైంది కదా అని మరో సిగిరెట్ తాగాను. మరీ ఎక్కువైంది. ఆ నొప్పి లో నుంచి జ్ఞానాదోయమైందన్నమాట :-). సో అలాగే ధూమపాన ప్రియులకు కూడా ఎక్కడో ఓ చోట జ్ఞానోదయమవాలి. అంటే నాకు ఇంతకు ముందు అవ్వలేదా అని మీకు సందేహము రావచ్చు. ఊహూ కాలేదు. ఎందుకంటే అంతకు ముందు వచ్చిన తలనొప్పి సింప్టమ్స్ ఈ నొప్పికన్నా చిన్నవి కాబట్టి. ఎంతలా జ్ఞానోదయమయిందంటే B.P ఏమైనా వచ్చిందేమో, ఈ బ్లడ్ ప్రెజర్ వల్ల వచ్చిన తలనొప్పేమో ఇది అప్పటికప్పుడు నా ఫ్రెండ్ డాక్టర్ కి ఫోను చేసి కనుక్కునేంతగా. వాడికి ఫోన్ చేస్తే, నీకు ఫ్యామిలీ హిష్టరీలో B.P/ sugar లేవు బాబూ, కాబట్టి ఈ వయసులో నీకు B.P వచ్చే అవకాశం పాళ్ళు చాలా చాలా తక్కువని సెలవిచ్చాడు. అయినా పెరటి వైద్యంమీద చులకనకదా మనకు :-) అందుకని అప్పటిదాకా annual checkup కి కూడా వెళ్ళని వాడిని , Doctor దగ్గర check up కి వెళ్ళాలని నిర్ణయించుకొన్నాను. అనుకున్నా కదా, అప్పటికే ఈ సిగిరెట్లు మానేయలని ప్రయత్నంలో ఉన్నా కదా... అందుకని మానేసానని నమ్మకం కుదిరాక Doctor గడప తొక్కానన్నామాట :-) లేకపోతే బాబూ నీ సిగిరెట్ల మూలంగా వచ్చిన రోగమది అని Doctor చెప్తే సిగ్గుచేటు కదా :-)


సరే మీకోసం ఇప్పుడొక జిలేబీ జిలేబీ పాట :-)

జిల్లేలే జిల్లేలే నువ్వే నా జిల్ జిల్ జిల్లేబి
అయ్యారే అయ్యరే నువ్వే నా వయ్యారి
నిన్ను పీల్చందే రోజైన తెల్లవారదె
నువ్వులేందే క్షణమైన గడవదే నాకు


జిల్లేలే జిల్లేలే నువ్వే నా జిల్ జిల్ జిల్లేబి
అయ్యారే అయ్యరే నువ్వే నా వయ్యారి


ఆనాటి ప్రవరాఖ్యుడు వరూధుని అధరాల్నెకాదన్నాడే
రహస్యమేదో తెలియని వయ్యారి వలచి వగచేనే.....అయ్యారే
ఈనాటి వరూధుని వందమంది ప్రవరులనైన
ఓ లంగరు చుట్టచూపి కట్టి వెయ్యదే... హయ్యారే!!!
ప్చ్..ఆనాటి వరూధునికేగనక ఈ చుట్టచుట్టడం వచ్చుంటే పాపం అంతలా వలచి వగసే అవసరమే ఉండేది కాదు. ఒకే ఒక్క చుట్ట వెలిగించి ఆ చుట్టతో ప్రవరుడంతటి వాడిని చుట్టచుట్టేసి తన ఇంట్లో కట్టి పడేసుండేది. అదండీ ఈ చుట్ట,బీడీ,సిగిరెట్ మహిమ మరి.

అసలా తలనొప్పి ఎందుకు ఎక్కువైందో రేపు వివరంగా తెలుసుకుందాము కానీ.... మీరిప్పటికే ఈ అలవాటు మానలేకపోతుంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియోకి ఈ తలనొప్పి కీ ఎటువంటి సంబంధము లేదు.

STRICT WARNING :

ఇది హృదయవిదాకరమైన వీడియో. దయచేసి పిల్లలకు మాత్రము చూపకండి. అలాగే గుండెజబ్బులు కలవారు కూడా దూరంగా ఉండండి. ఇది నేను కేవలము కొద్దిమందినైనా జాగృతం చేద్దామనే సదుద్దేశ్యమే తప్ప ఎవరినీ భయపెడదామనే ఉద్దేశ్యము తో కాదు. దయచేసి అర్థము చేసుకోగలరు. ఇంతటి భయానకము మనకవసరమా? ఒక్కసారి ఆలోచించండి.

అందరి ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ నేను కేవలము లింకును మాత్రమే ఇస్తున్నాను. వీడియో Embed చెయ్యడము లేదు. చూడాలనుకున్న వారు ఆ లింకును కాపీ చేసుకొని చూడవచ్చు.

http://www.youtube.com/watch?v=toUY_mvzsCs&feature=player_embedded

13, అక్టోబర్ 2011, గురువారం

సరిగ్గా సంవత్సరం క్రితం... ఇదేరోజు ఏం జరిగిందంటే .................

2010 వ సంవత్సరం అక్టోబరు 13 వ తేది, అంటే సరిగ్గా ఇదేరోజు ఒక బృహత్తర కార్యాన్ని తెలుగు బ్లాగర్లు తలపెట్టారు.
తెలుగు నిఘంటువొకటి మన అంతర్జాలంలో ఉంటే బాగుంటదని అనిపించినదే తడవుగా online telugu nighantuvu కు అంకురార్పణ జరిగిన రోజు.
ఓసారి ఆనాటి భావాలెలా ఉన్నాయో చూడాలంటే ఈ టపా చదవాల్సిందే http://chiruspandana.blogspot.com/2010/10/blog-post_13.html

ఓపికుంటే చదివి మళ్ళీ ఈ టపాకు రండి.

అలా మొదలైన మాయీ ప్రయత్నం కేవలం రెండు రోజుల్లో ఒక
తెలుగు నిఘంటు వేదిక http://groups.google.com/group/telugunighantuvu గా ఏర్పడింది. చాలా ఉత్సాహంగా మొదలైన గుంపులో ఆనెలలోనే దరిదాపు ఇరవైమంది దాకా చేరారు. మరో నెలకు ముప్పై మంది గల గుంపుగా తయారైంది. మరో రెండు వారాల్లో కావలసిన ఆర్దిక వనరులను మన బ్లాగర్లనుంచే సేకరించడం జరిగింది. ఆ వివరాలు ఇక్కడ చదువ వచ్చు. http://chiruspandana.blogspot.com/2010/10/blog-post_29.html

పూర్తి విరాళాల వివరాలు తెలుగునిఘంటువు సైట్ లో చదువగలరు.

సభ్యుల్లో నూతనోత్సాహం వెల్లి విరుస్తుంది. తొలి విడత తర్జనబర్జనలయ్యాక సైటుకు "తెలుగునిఘంటువు" అనే పేరును నిర్ణయించాము.

అంతర్జాలంలో అప్పటికే స్కాన్ చేసి పెట్టిన సూర్యరాయాంధ్ర నిఘంటువుతో ( 8th volume ) పని మొదలు పెట్టాము. కానీ అలా అంతర్జాలంలో మాకు లభించిన స్కాన్ కాపీ చాలా నాసీరకంగా అక్షరాలు కనిపించకుండా ఉండటంతో సభ్యులకు ఆ అక్షరాలు సరిగా కనిపించక చాలా అవస్థలు పడ్డారు. ఇలా మేము 8 వ సంపుటితో కసరత్తు చేస్తున్న సమయంలో శ్యాం కందాళ ముందుకు వచ్చి వారి నాన్నగారి వద్దనున్న సూర్యరాయాంధ్ర నిఘంటువుల అన్ని సంపుటాలను స్కాన్ చేసి తెలుగునిఘంటువుకు సహాయపడటం ద్వారా మా కష్టాలు తీరాయని చెప్పాలి.

అలా ఐదైదు పేజీల స్కాన్డ్ కాపీస్ సభ్యులందరికి పంపించాము. మొదటి విడతబాగానే అయింది. సభ్యులకు ఇందులో సాధకబాధకాలు బాగా అర్థమయ్యాయి :-).

రెండవవిడతగా మరో ఐదు పేజీలను పంపించాము. ఎంతో ఉత్సాహంగా చేరిన సభ్యులు చాలా మంది చల్లగా జారుకున్నారు. ఇది వారిని విమర్శిస్తున్నాననుకోవడం కంటే, బహుశా నా పద్ధతి నచ్చక మానుకొని కూడా ఉండవచ్చు. లేదా వాళ్ళలో ఉత్సాహాన్ని నిరంతరం నూతనంగా ఉంచటంలో నేను కృతకృత్యుడను కాలేక పోయి ఉండవచ్చు. లేదా చెప్పుకోలేని అనేక కారణాలై కూడా ఉండవచ్చు. అసలు చేరడమే ఏం జరుగుతుందో చూద్దామని చేరినవారూ వుండి వుండవచ్చు :-). కానీ వీటన్నింటికంటే ఇక్కడ మనము గుర్తుంచుకోవలసింది, ఈ గ్రూపు ఒక స్వచ్ఛందమైన గుంపు. తమంతట తాము ఇష్టంగా వచ్చి చేరిన వాళ్ళు. తరువాత కాలంలో వృత్తిపరమైన ఒత్తిడిలో లేక మరొక కారణాలవల్ల వీరు ఉత్తేజంగా పని చేయలేకున్నా, పిలుపిచ్చిన వెంటనే స్పందించి చేరినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు.

ఏదేమైనా ఆంధ్రుల ఆరంభ సూరత్వం మరోసారి ఋజువైంది. ఇక్కడ ఆంధ్రులంటే మేము లేముకదా అని తెలంగాణా, రాయలసీమ వాళ్ళు అనుకోనవసరం లేదు లెండి :-) ... నా ఉద్దేశ్యంలో ఆంధ్రులంటే తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కడూ. లేకపోతే మా అప్పటి సభ్యుల్లో చాలామంది దేశానికి బయట నివసిస్తున్నవారే.

కానీ అసలైన పని రెండవవిడత పేజీలను పంపాక మొదలైంది. బాబూ పేజీలయ్యాయా??? అమ్మా పేజీలయ్యాయా అని అడుక్కోవడమన్నమాట :-) సరదాగానే వ్రాస్తున్నానండి ఎవ్వరూ పెద్దగా ఫీల్ కావొద్దు. కొద్దిరోజులకు గట్టిగా ఉక్కుతీగల్లా ఐదారు మంది సభ్యులు మిగిలారు. వారు చాలావేగంగా పని చేయడం మొదలెట్టారు. ఉన్నది కొద్ది మందే కాబట్టి మేము మొదలుపెట్టిన నిఘంటు వేదిక అటకెక్కేసింది. నేరుగా సభ్యులతో ఉత్తర ప్రత్యుత్తరాలు మొదలయ్యాయి.
నిజానికి నిఘంటువేదిక సుప్తచేతనావస్థ దశలోనే నిఘంటువు పని అమితవేగంగా జరిగింది. అంటే అక్టోబరు 2010 లో మొదలైననిఘంటువు పని ఈ సంవత్సరకాలంలో ఈ క్రింది మైలురాళ్ళను సాధించింది.

1) నిఘంటువును వేగంగా టైపు చేయడానికి ఎలాంటి పద్ధతినవలంభించాలో చర్చ మరియు దానికి కావాలసిన ఒక ఫార్మాట్ ను తయారు చేయడం. కాలానుగుణంగా, మాకు అందులో అనుభవమొచ్చేకొద్దీ ఈ ఫార్మాట్లో మార్పులు చేర్పులు కూడా చేసాము. దీని వివరాలను ఇక్కడ చూడవచ్చు.
https://sites.google.com/site/telugunighantuvedika/new-rules

2) పైన చేసిన ఫార్మాట్ ప్రధానంగా రకరకాల సెర్చ్ ఫంక్షనాలిటిని దృష్టిలో ఉంచుకొని తయారు చేసింది కాబట్టి దానికనుగుణంగా ఆ పదము,అర్థము, పద వివరణము మొదలైనవి భద్రపరచడానికి ఒక Database Design చేసాము

3) తెలుగు నిఘంటువు ను అంతర్జాలంలో అందరికీ అందుబాటులోనికి తీసుకురావడానికి http://telugunighantuvu.com అనే వెబ్ సైటు రిజిష్టర్ చేయించాము.

4) శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు ఎనిమిదవ సంపుటిని పూర్తిగా టైపు చేసాము.

5) గూగుల్ మహాభారత గుంపులో లభ్యమైన పద్యాలను parse చేసి సూర్యరాయాంధ్ర నిఘంటువులోని పద్య ఉదాహరణలతో అనుసంధానించాము. దాని వివరాలు ఇక్కడ చూడవచ్చు.http://chiruspandana.blogspot.com/2011/04/similarity-index.html

6) టైపు చేసిన పేజీలలోని పదములను Database లోకి పంపించడానికి అవసరమైన Dataparser ని అభివృద్ధిపరిచాము.

7) http://telugunighantuvu.com website ని డిజైన్ చేసి, కోడ్ చేసి online లో ఎనిమిదవ సంపుటితో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో అందుబాటులోకి తీసుకొని వచ్చాము. అలాగే వెబ్సైట్ లో కొన్ని మార్పులు చేర్పులతో పోయిన నెల సరిక్రొత్తగా మరో వెర్షన్ తో మీముందుకొచ్చింది.

8) శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు రెండవ సంపుటిని అనిల్ గారు పూర్తిగా టైపు చేసారు.

9) శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు నాల్గవ సంపుటిని దేవి( మందాకిని ) గారు పూర్తిగా టైపు చేసారు.

10) శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు ఆరవ సంపుటిని కందిశంకరయ్యగారు పూర్తిగా టైపు చేసారు.

11) శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు మూడవ సంపుటిని కవిత పూర్తిగా టైపు చేసారు.

12) ఇక ప్రస్తుతము ఏడవ సంపుటిని అనిల్, ఐదవ సంపుటిని దేవి, ఒకటవ సంపుటిని కందిశంకరయ్య గార్లు టైపు చేస్తున్నారు. అలాగే తెలుగుపర్యాయపద నిఘంటువు ( ఆచార్య జి.యన్.రెడ్డి ) ను పూర్తిగా కవిత టైపు చేస్తుంది.

క్లుప్తంగా తెలుగునిఘంటువులో మొత్తము ఎనిమిది శ్రీసూర్యరాయాంధ్రనిఘంటువు సంపుటాలలో 2,3,4,6,8 సంపుటాలు పూర్తిగానూ, ఒకటవ సంపుటిలో 296 వ పేజి వరకూ, ఐదవ సంపుటిలో 119 వ పేజి వరకు, ఏడవ సంపుటిలో 10 పేజీలు అందుబాటులో ఉన్నాయి. అలాగే తెలుగుపర్యాయపద నిఘంటువు ( ఆచార్య జి.యన్.రెడ్డి ) నిఘంటువులో మరో 170 పేజీలు చేస్తే పూర్తవుతుంది కానీ ఇప్పటికే పూర్తయున పేజీలు ఇంకా తెలుగునిఘంటువులో పాఠకులకు అందుబాటులో లేవు.

అలాగే మహాభారత గూగుల్ గుంపునుంచి తీసుకొన్న పద్యాలనుకూడా ప్రస్తుతానికి ఎనిమిదవ సంపుటికి మాత్రమే పరిమితమై ఉన్నాయి. పూర్తిగా శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు టైపు పని పూర్తైన తరువాత అన్నింటిని ఒకేసారి అందుబాటులోకి తీసుకొని వస్తాము.

ఏవైనా క్రొత్త సాంకేతిక పదాలను ఈ నిఘంటువులో చేర్చాలన్నా తెలుగునిఘంటువు పేజిలోనుంచి చేర్చవచ్చు. http://telugunighantuvu.com లో గల సదుపాయాలను, ఈ వెబ్సైట్ ఎలా వాడాలన్నది మరో టపాలో వివరిస్తాను.

తెలుగు నిఘంటు వేదిక సభ్యుల తరుపున
భాస్కర రామిరెడ్డి.

12, అక్టోబర్ 2011, బుధవారం

సరదా సరదా సిగిరేట్.. గుండెల్లో ఒకటే మంట. అబ్బా...సినిమా కానొస్తుంది కదా.

అప్పుడే సిగిరెట్టు మీద టపా వ్రాసి ఒకరోజు గడిచిపోయింది. ఈ రోజు ఈ ధూమపానం వల్ల కలిగే మరికొన్ని రోగాల గురించి తెలుసుకొనేముందు, ఎవరికైనా ఈ వ్యసనాన్ని మానాలి అనుకొనేవారికి కొన్ని సలహాలు. నా అనుభవం ప్రకారం సిగిరెట్ తాగేవాళ్ళు " ఇప్పుడు సిగిరెట తాగకపోతే బ్రతకలేను" అనుకొనేవాళ్ళ శాతం చాలా చాలా తక్కువ. చాలా సందర్భాలలో ఈ క్రింది సమయాల్లో సిగిరెట్ వెలిగిస్తారు. ఇక్కడ నేను ఈ ధూమపానాన్ని ఇంట్లోనే దుకాణం పెట్టిన వారి గురించి చెప్పడంలేదు. వారి అలవాట్లు ఎలా వుంటాయో నాకు తెలియదు. ఎప్పుడూ దగ్గరుండి గమనించలేదు కూడా. ఈ క్రిందవి ఇంట్లో కాకుండా బయట ధూమపానం చేసేవారికి మాత్రమే వర్తిస్తాయి.

౧) ప్రొద్దున ఆఫీస్ కు వెళ్ళే ముందు లేదా వెళ్ళగానే ఒక గంటలోపు : ఈ సిగిరెట్ మానడం నిజంగా చాలా కష్టం. ఇది లేకపోతే ఆరోజు నికోటిన్ కోటా మనకు అందనట్టే. నా వరకు ఇది చాలాకాలం ఒక ప్రదేశంతో పెనవేసుకుపోయింది.. అంటే రైల్వే స్టేషన్ దగ్గర కఫే లో ఓ కాఫీ, ఓ మార్ల్ బొరొ సిగిరెట్. చాలా సార్లు మిగిలిన సమయాల్లో తాగే సిగిరెట్ అతి సులభంగా మానేసే వాడిని కానీ దీన్ని మానడానికి మానబోయే చివరి నెలలో రోజుకో/ రెండురోజులకో ఒక సిగిరెట్ పేకెట్ ( ఇప్పుడు ఇక్కడ తొమ్మిది డాలర్లు మరి ) పడేసిన రోజులున్నాయి. అంటే సిగిరెట్ పేకెట్ లో 20 సిగిరెట్లుంటే కేవలం ఒకటో రెండో తాగి దరిదాపు ఓ 15 సిగిరెట్ డబ్బాలు పడేసుంటాను.

౨) ఇక ఆఫీస్ లో అడుగు పెట్టబోయేముందు : అంటే అప్పటికి మొదటి సిగిరెట్ తాగి గంటన్నర అయి ఉంటుంది. ఈ సిగిరెట్ Train దిగాక ఆఫీస్ కు నడుస్తూ తాగేదన్నమాట. ఇది నిజానికి అసలు అవసరపడేది కాదు. కానీ అలా నడిచేటప్పుడు అలా వెలిగించి నడిస్తే ఏదో వెలితి తీరినట్టు ఉండేది.

౩) భోజనము చేయక ముందో, చేసిన తరువాత కానీ : చాలా మందికి భోజనానంతరం సిగిరెట్ తాగే అలవాటుంటుంది. కానీ నాకెందుకో అలా అలవాటు అవ్వలేదు. భోజనానికి ఒక అరగంట ముందు తాగితే తరువాత సిగిరెట్ భోజనమయ్యాక రెండు గంటల తరువాత కానీ అవసరమయ్యేది కాదు.

ఇప్పటికి మూడయ్యాయి కదా... ఇక మధ్యాహ్నం నుంచి ఇంటికొచ్చేలోపు మరో నాలుగయ్యేవి

౪) సుమారు 3 PM - 4 PM మధ్యలో

౫) ఆఫీస్ నుంచి రైల్వే స్టేషన్ కి నడిచేటప్పుడు

౬) పాత్ ట్రైన్ మారి వేరే ట్రైన్ ఎక్కేటప్పుడు. ( ఇప్పుడు అనుకుంటే నిజంగా నవ్వు వస్తుంది. ఇక్కడ సిగిరెట్ తాగడం కోసం ఈ రెండు ట్రైన్స్ మధ్య కనీసం ౨౦ నిమిషాల వ్యవధి ఉండేట్టుగా చూసుకోని ఆఫీస్ లో బయలు దేరేవాడిని )

౭) ట్రైన్ దిగి కార్ పార్కింగ్ లాట్ దాకా నడిచేటప్పుడు

౮) ఇంటికొచ్చాక పడుకొనేముందు. ( ఇది ఆప్షనల్ అన్నమాట. ఇంటో వాళ్ళ కళ్ళుగప్పి బయటకు వెళ్ళ గలిగితే సరే లేకపోతే ఆరోజుకు లేనట్టే :-) )


స్మోక్ చెయ్యని వారికివి చాలా సిల్లీగా కనిపించవచ్చు గానీ, నిజానికి స్మోకర్స్ అలవాటు దరిదాపు ఇలాగే వుంటుంది. మానేయలనుకున్న తరువాత పైన నేనెప్పుడెప్పుడు స్మోక్ చేస్తున్నానో చూస్తే, రోజుమొత్తంలో నాకు step 1 and step 5 సిగిరెట్లు తప్ప మిగిలినవి అసలు అవసరం లేదని పించేది. అంటే నేను నికోటిన్ కంటే కూడా, ఈ location based habit కి బాగా అలవాటు పడ్డాననిపించింది.

సరే మానేయలనుకునేవాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే నిర్ణయించుకోవాలి కాబట్టి ఇక్కడ నేను సలహాలు ఏమీ ఇవ్వకుండా నేరుగా మరో సబ్జెక్ట్ లోకి దూకేస్తాను.


ఇప్పుడు ఒక సాంగ్ అన్నమాట

చేతిలో ముచ్చటైన సిగిరెట్
ఎర్రెర్రగా వెలిగిపోతుంది
అప్పుడప్పుడు నేనున్నానంటూ
గాఢమైన పొగను వెదజల్లుతుంది

నేనున్నానంటూ గుర్తుచేసినప్పుడల్లా
గాఢంగా గుండెనిండా, ఆపొగను
నా అనుభూతితోకలిపి
ఆప్యాయంగా పీల్చసాగాను

కాలం గడిచింది
చేతి వేళ్ళు ఇప్పుడు మండటంలేదు
పెదవులకు కూడా పెద్దగా కాలేస్పర్శ తెలియడంలేదు
కానీ కానీ ఎక్కడో గుండెలదగ్గర
ఆ గుండెకు కొంచెం దిగువున
అప్పుడప్పుడు చిన్నమంట
నేనున్నాని గుర్తు చేస్తూ


అర్థమయిందా? సిగిరెట్ తాగేవాళ్ళలో అందరూ అనుకొనే గుండెపోటు, కాన్సర్... ఇలాంటి రోగాలకంటే చాలా చాలా ముందుగా గుండెకు దిగువభాగంలో ఓ మంట లాగా అనిపిస్తుంది. ఈరోజు ఆమంటకు కారణ మేంటో చూద్దాము. సాధారణంగా ఇది స్మోకర్స్ లో కనిపించిందంటే తరువాత రాబోయే దశ Gastroesophageal reflux disease అనుకోవాలి. కాబట్టి మీకు గుండెమంట, లేదా కడుపులో మంట ( కుడి, లేదా ఎడమ వైపు ) అనిపించినవెంటనే రెండువేళ్ళమధ్య వెలిగే సిగిరెట్ ఆర్పేయకపోతే అది మిమ్మల్ని అర్పేస్తుంది. జాగ్రత్త పడండి.

ఇక ఇది స్మోకర్స్ లో ఎందుకు వస్తుందో చూద్దాము. ముందుగా ఈ క్రింది బొమ్మలు చూడండి.


చూసారా? ఇప్పుడు ఒకటవ బొమ్మలో నోటినుంచి పొట్టదాకా ఓ గొట్టం కనిపిస్తుంది కదా. దాన్ని ఇంగ్లీషోడు ఏదో గ్రీకు పేరు పెట్టుకున్నాడు కానీ మనం సుద్దంగా తెలుగులో ఆహారనాళము అందాము.మనము ఏదైనా తిన్నప్పుడు అది ఈ గొట్టంలోగుండా కడుపులోకి వెళుతుంది. అదేలేండి జీర్ణాశయము లోకి వెళుతుంది. వెళ్ళిన తరువాత పడుకున్నప్పుడో లేదా వంగినప్పుడో మళ్ళీ పోయిన నాళం గుండానే నోట్లోకి వచ్చేయాలి కదా!!!. కానీ రాదే. దీనికి మూఖ్యకారణం అదుగో ఆ రెండవ బొమ్మలో కనిపించే LES పొర. ఇది లోపలికి పోనిస్తుంది కానీ బయటికి రానివ్వద్దు. మన జీర్ణాశయం మనము తిన్న ఆహారము జీర్ణమవడానికి రకరకాల అమ్లాలను శృష్టించే సంగతి మనందరికీ తెలిసిందేకదా. అంటే మన జీర్ణాశయంలో ఆమ్లాలు( Acids ) ఉంటాయి. ఇంతవరకూ బాగానే వుంది కదా.....

ఇప్పుడు, For example, suppose, సరదాగా ఆ LES పొర మన ఈ వ్యసనం మూలంగా సరిగా మూసుకోవడం లేదనుకోండి. ఎమైంతుంది? అవ్వడానికేముంది ఇంక సీన్ సితారే. అక్కడ ఏర్పడ్డ ఆమ్లం ఎగదన్నుకోని ఈ ఆహారనాళం గుండా పైకి రావడం మొదలవుతుంది. అదీ ఆమంట.అందుకనే ఈ మంట పడుకొన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది.

ఇక నేను చెప్పేదేముంది. అంతా మీచేతుల్లోనే వుంది.

గమనిక : రాబోయే మూడు నాలుగు రోజుల్లో వేరే వ్యాసాలు రాయాల్సివుంది కాబట్టి..ఈ సీరీస్ ఆ వ్యాసాలయ్యాక మళ్ళీ రాస్తాను. ఇంకో ఇరవై టపాలన్నా రాస్తే గానీ పుస్తకానికి సరిపడా మెటీరియల్ సమకూరేట్టులేదు.

11, అక్టోబర్ 2011, మంగళవారం

స్మోకర్లూ ఎప్పుడైనా మీకు నరాల నొప్పి అనిపించిందా? ఒంటేలు రంగు మారినట్టు అనిపించిందా?

ఈ రోజు మన సిగిరెట్టు టపాల క్రమంలో ఇది నాల్గవది. నిన్నటిదాకా సిగిరెట్ త్రాగడం ఎలా ఎందుకు అనే అంశాలను చూచాయగా చూసాము కదా. ధూమపాన ప్రియులు బయటకు మామూలుగా కనిపిస్తున్నా వారి మనసులో సిగిరెట్ త్రాగిన తరువాత ఎటువంటి సాంఘిక,మానసిక న్యూనతను ఎదుర్కొంటారో చూసేముందు కొంచెం ఈ చుట్ట/బీడీ/సిగిరెట్టు మొదలైన వాటి రసాయనిక సంయోగ క్రియలు గూర్చి తెలుసుకుందాము. నిజానికి సిగిరెట్ త్రాగేవాళ్ళలో చాలామందికి వీటి గురించి ఏమాత్రము అవగాహన ఉండదు. సిగిరెట్ కంపెనీలు చేసే లాబీల వల్ల ఈ దేశం , ఆదేశం అని లేకుండా ప్రపంచమంతా మిన్నకుండి చూస్తున్నాయి. ఏ ఆరోగ్యసంస్థ గానీ, ఏ ప్రభుత్వము గానీ వీటివల్ల సంభవించే అనర్థాలను ప్రజలచెంతకు తీసుకువెళ్ళి వాళ్ళను జాగృతిచెయ్యాలనే కృషి చేయవు. చేస్తే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి. అలాగే ఆరోగ్యసంస్థల మనుగడా ప్రశ్నార్థకమవుతుందేమో !


మనలో చాలామందికి సిగిరెట్ త్రాగడం వల్ల కలిగే కేన్సర్ వస్తుందనే తెలుసు. అంతకుమించి పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం గానీ, అవకాశం కానీ, ఆసక్తిగానీ కలుగక పోవచ్చు. దీనికి నేను పాటించిన చిట్కా ఒకటి చెప్తాను చూడండి. ఈ సారి మీరు సిగిరెట్ వెలిగించినప్పుడల్లా ప్రధానంగా మీ శరీరంలో కలిగే మార్పులను ఓ పేపర్ మీదనో, లేదా ఎలక్ట్రానిక్ యుగం కాబట్టి మీ మొబైల్ ఫోనులో నోట్స్ గానో వ్రాసుకోండి. ఇలా ఓ రెండు మూడు రోజులు చేసారంటే మీ పట్టిక తయారై పోతుంది. నేనైతే సిగిరెట్ త్రాగిన తరువాత నా మనసులో కలిగిన భావాలను కూడా అక్షరబద్ధం చేసాను. వాటి వివరాలను తరువాత కూలంకుషంగా చెప్తాను కానీ, మీరూ మీలిస్టుతో అజ్ఞాతంగా కామెంటు రూపంలో నాకు తెలియచేస్తే సంతోషిస్తాను. అలాగే సిగిరెట్ మానాలని ఉన్నా, మానలేక పోతున్న వారికి మానసికంగా బలాన్ని చేకూర్చిన వారవుతారు. నాకైతే దరిదాపు 25 symptoms తేలాయి ( ప్రతి చిన్న విషయం కలుపుకొని కూడా ). ఉదాహరణ గా చెప్పాలంటే చేతి,కాలి గోళ్ళు పసుపు పచ్చ రంగులోకి మారడం. ఈ 25 symptoms నన్ను ధూమపానానికి వ్యతిరేక దిశలో నడిపించాయి. నడిపిస్తున్నాయు. అంతే కానీ ఇప్పుడు వ్రాయబోయే సైంటిఫిక్ రీజన్స్ చదివి మానేయలేదు. కానీ స్వతహాగా ఉన్న ఉత్సాహంకొద్ది నాకు కనిపించిన symptoms కు కారణాలు తెలుసుకొందామని ఓ వారంపాటు physiology పుస్తకాన్ని ముందునుంచి వెనక్కి తిరగేసాను. అలా నాకర్థమైనది ఇక్కడ మీతో పంచుకుంటున్నాను. నేను డాక్టర్ ను కాను. నాకు ఇందులో చాలా విషయాలు తెలియదు. నిజం చెప్పాలంటే physiology పుస్తకం చదివిన తరువాత నా అభిప్రాయం కొంచెం మారింది. అది " మన మెడికల్ సైన్స్ కు కూడా ఈ సిగిరెట్ త్రాగడం వల్ల మన మెటబాలిజమ్ ప్రక్రియ లో కలిగే మార్పులు పూర్తిగా తెలియవని". ఇంకా చాలా చాలా పరిశోధనలు జరగాలని.

ఇక విషయం లోకి వస్తే, చాలామందికి ఇందులో నికోటిన్ అనే కాంపౌండ్ మాత్రమే తెలుసు. నిజానికి ఇందులో మొత్తంగా 600 కెమికల్స్ ను వాడడానికి అవకాశం వుందట. ఈ లంకె లో http://en.wikipedia.org/wiki/List_of_additives_in_cigarettes ఆ వివరాలు చూడవచ్చు.సిగిరెట్ లో వాడేమి కలుపుకుంటే మనకేమి గానీ, దాన్ని అంటించి గట్టిగా దమ్ములాగినప్పుడు,అది పొగగా ఏర్పడి మన శరీరంలో చేరుతుంది కదా. అప్పుడు జనించే కెమికల్ కాంపోజిషన్ మనకు ప్రధానం. ఎందుకంటే ఇవే మన శరీరంలో మార్పులకు కారణం.

వాటిలో ప్రధానమైనవి ఇవి. అంటే ఒక సిగిరెట్ త్రాగడం మూలాన మన శరీరంలోకి వెళ్ళే కెమికల్ కాంపౌండ్స్ఇక ఇందులో అందరూ చెప్పుకొనే ప్రధానమైన కెమికల్ కాంపౌండ్ నికోటిన్ గురించి చెప్పుకోవాలంటే దీని నిర్మాణం ఈ క్రింది పటంలో . [ppl who read Morrison & Boyd raise your hands ;-) ].


ఇమేజస్ వికీపీడియా నుంచి తీసుకొన్నాను.
పై బొమ్మ ద్వారా మనకు తెలిసేది ఏమిటంటే ఈ నికోటిన్ అనేది నైట్రోజన్ కలిగిఉన్న ఒక కెమికల్. మరోరకంగా చెప్పాలంటే మన మెదడు పై ప్రభావం చూపించగల alkaloid. దీని ద్వారా మన శరీరంలో కలిగే రసాయనిక చర్యలను రెండుగా విడగొట్టవచ్చు. మొదటిది మన నరాల receptors( తెలుగు లో ఏమంటారు? ) మీద జరిగే చర్య. ఇది మన నరాలపై ఉన్న ప్రొటీన్లతో నేరుగా చర్యను జరుపుతుంది. ఇది మొదట్లో బాగానే వున్నట్టు, Mental గా Stimulate అయినట్టు ఉంటుంది. ...........కానీ కానీ స్మోకర్లూ ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోండి, మీ నరాలు ఎప్పుడైనా నొప్పి పుట్టాయేమో ;-). ఈ నరాల రోగానికి ప్రధాన కారణం ఈ రసాయనిక చర్య.

మరొకటి, మనశరీరంలో నికోటిన్ చేరిన తరువాత, ఆ దేవుడు చేసిన అద్భుత శరీర వ్యవస్థ మూలంగా, శరీరం దీన్ని విష పదార్థం గా గుర్తించి బయటకు నెట్టి వేయాలని చూస్తుంది. ఈ నెట్టివేసే ప్రక్రియలో జరిగే కెమికల్ రియాక్షన్స్ మరో రకమైనవి. ఎలా నెట్టివెయ్యాలి. ఇలాంటి చెత్త చెదారం నెట్టడానికి మనకు దేవుడిచ్చిన వ్యవస్థపేరు liver. లివర్లో వున్న ఎంజైమ్స్ కొంతశాతం ఈ నికోటిన్ ని చిన్న చిన్న కాంపౌండ్స్ గా ఛేదిస్తుంది. ఆ కెమికల్ పేరు కోటినైన్ ( cotinine ). మరి ఈ కోటినైన్ బయటకు నెట్టాలంటే దీన్ని నీళ్ళలో కలిసే పదార్థంగా మార్చాలి కదా.. అలా జరిగే ప్రక్రియలో 3'-hydroxycotinine ( ఇది నీళ్ళలో కరుగుతుంది) అనేది ఏర్పడి ఒంటేలు లోకలిసి బయటకు వస్తుంది. స్మోకర్లూ ఇప్పుడు మళ్ళీ రీల్ వెన్నక్కి తిప్పండి ఒకాసారి. మీ ఒంటేలు రంగు అందరి ఒంటేలు లా ఉందా? లేదా వేరే రంగులో ఉంటుందా :-)

అదండీ మరి, ఈ లివర్ కూడా పని చేసి చేసి ముసలిదై ఎప్పుడో టపా కట్టేస్తుంది కదా... దానికంటే ముందుగా మీరు మేల్కోవాలని ఆశిస్తూ... వచ్చేటపాలో మళ్ళీ కలుద్దాం.

10, అక్టోబర్ 2011, సోమవారం

ఆడాళ్లూ అరిచి గీపెట్టి మీ ఆయన చేత సిగిరెట్టు/చుట్ట/బీడి/పైపు మాన్పించలేరు ....
అప్పుడప్పుడు ఆడోళ్ళు అనుకుంటారంట చెప్పినమాట వినని మొగుడొచ్చాడు అంతా నారాత అని. ఇందులో నిజమెంతో నాకైతే తెలియదు కానీ సిగిరెట్ తాగే మొగుడు దొరికితే మాత్రం ఇల్లుపీకి పందిరేసే పెళ్ళాలు మాత్రం బోలెడంతమంది ఉంటారులే. స్వానుభవం మరి. కానీ ఇక్కడ ఒక మాట చెపుతాను వినుకోండి. మీరు సిగిరెట్ మానమని ఎంతగోలచేసి ఇంట్లో రచ్చ రచ్చ చేసినా మీ ఆయన ఆ ఊదుకడ్డి తాగడము మాత్రం మానడు కాక మానడు. నిజం చెప్పాలంటే ఛీ ఇంట్లో దీనిగోల భరించలేకపోతున్నా అని చెప్పి ఏంచక్కా రుసరుస బయటికి పోయి ఒకటికి రెండు తాగి కాసేపయ్యాక ఇంటికొచ్చి ముసుగు తన్నేస్తాడు. నిజమా కాదా? మీరే చెప్పండి?

అసలు ఈ కాలం ఆడవారికి మగవాళ్ళని మడిచి ఎలా తమకొంగుముడిలో కట్టేసుకోవాలో తెలిసినట్టు లేదు. అందుకే విడాకుల సంఖ్య కూడా పెరుగుతుందేమో. దీనికి ఒకటే సూత్రం ఎలాంటి సందర్భాలలోను మగవాడికున్న అహాన్ని కించపరిచే రీతిలో మాట్లాడకూడదు. ఈ ఒక్కసూత్రం గుర్తుంచుకుంటే చాలు. ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు. " ఏం ఆడాళ్ళుకు మాకు మాత్రం అహం ఉండదా " అని ఎదురు తిరిగితే సమాధానం చెప్పడం కష్టం కానీ.. మగవాడి అహం హర్ట్ అయితే ప్రమాదమే. బహుశా తరతరాలనుంచి జన్యుపరంగా కలిగిన మార్పేమో !!!


నేను ఓకానొక రోజు, ఇలాగే ఇంట్లో నుండి తప్పించుకొని ఇంటికి కూతవేటు దూరంలో వున్న Barnes & Nobels పుస్తకాల కొట్టులో కూర్చొని Image processing మీద వచ్చిన సరిక్రొత్త విధానాలను చదువుతూ ఎప్పటిలాగే ఒక గంట గడవగానే వెనుకనుంచి ఏదో తరుమకొస్తున్నట్టు ఓ Tall కాఫీ కొనుక్కొని బయటకెళ్ళి ఓ సిగిరెట్ వెలిగించి విలాసంగా తాగి వెనిక్కి వస్తూ "Quit smoking in 24 hrs" అనే పుస్తకాన్ని చూసి పడి పడి నవ్వుకున్నాను. మానవ దుర్బలత్వాన్ని cash చేసుకోవడంలో ఈ తెల్లవాళ్ళు మరీ ఘటికులు మరి :-)

ఇంతకీ విషయమేమిటంటే ఈ ధూమపానాన్ని మీ మొగుడి చేత మాన్పించాలని మీరు ప్రయత్నం చేసారా? చేస్తున్నారా? చేయబోతున్నారా? ఊహూ... అలాంటి ప్రయత్నాలకు స్వస్తి చెప్పండి. మీరు కాదు కదా, స్వయంగా ఆ బ్రహ్మదేవుడే దిగివచ్చి చెప్పినా ఈ ధూమపానం మానరు కాక మానరు. కారణం ఇక సిగిరెట్ త్రాగకూడదు అని తనంతట తానే స్వయంగా బయటనుండి ఎటువంటి ప్రేరణలు లేకుండా అనుకోవాలి.

ఊరికే అనుకోవడం కాదు చాలా తీవ్రంగా మనసా వాచా కర్మణా ఒక అంతర్గత విప్లవంలా మీలో కలగాలి. ఆ విప్లవ స్ఫూరి జారిపోకుండా కనీసం నలభైరోజులుండాలి. నలభైరోజులని ఎందుకంటున్నానంటే ఏ వ్యసనమైనా మనిషినుండి దూరం కావడానికి నలభైరోజులు పడుతుందని మన పెద్దలు చెప్పిన బంగారంలాంటి సూత్రం. అందుకేనేమో పెద్దలమాట చద్దిమూటంటారు. అంతేనా..ఈనాటి శబరిమలై భక్తులకు విధించే గడువుకూడా నలభైరోజులే అనుకుంటాను. దీని వెనుకున్న ప్రధాన సాంకేతిక ఉద్దేశ్యం ఇలాంటి వ్యసనానికి బానిసైన వారు కనీసం బయటపడతారనేమో... కానీ బయటపడాలంటే మాలేసుకొని ముక్కుమూసుకోని నలభై ఒకటోరోజు దమ్ము వెలిగిస్తే అదేదో ఎవరికోసమో చేసినట్టేకానీ మీకు మీరు మనస్పూర్తిగా అంగీకరించి సాధన చేయలదనే అనుకోవాలి.

కానీ ఇంతటి మానసిక పరిపక్వత, అందులో నుండే జనించే అనుభవసారం ఊరికే పుస్తకాలు చదవడం మూలానో లేదా ఎవరో చెప్పటం మూలానో రాదు. ఇది అనుభవంతో మాత్రమే సాధ్యం. అంటే ఈ సిగిరెట్ త్రాగడం మూలంగా మన జీవితంలో మానసికంగా, సాంఘికంగా , శరీరంలో కలిగే మార్పులు. ఇవి ఒక్కొక్కరికి ఒక్కోరకంగా వుంటాయి. అప్పుడే మొదలు పెట్టినవారికి పొడిదగ్గు,ప్రొద్దుట బ్రష్ చేసి గల్ల ఊసినప్పుడు అందులో పడే సిగిరెట్ నుసి. ఇలాంటివన్నమాట. ఆ స్టేజి దాటిన వారు ఎలాంటి మార్పులు ఎదుర్కొంటారో రాబోయే టపాల్లో చూద్దాము.


కాబట్టి సిగిరెట్ మానేయాలనుకొనేరోజు మీచేతులోనే వుంది. మరో విధంగా చెప్పాలంటే ఆరోజు ఏరోజో మీకు తప్పకుండా తెలుస్తుంది. కారణం అంతకు ముందు చాలా రోజులనుండే మానేయాలని ప్రయత్నాలు చేస్తునే ఉంటారు,కానీ ఎప్పటికప్పుడు ఆప్రయత్నాన్ని అటకెక్కిస్తుంటారు.కాబట్టి శ్రీమతులూ, సిగిరెట్ మానేయమని ఇంట్లో గొడవచేసి రచ్చ రచ్చ చెయ్యకుండా...ఈ పాడు వ్యసనం అనే పరివర్తన వచ్చే దిశగా కృషిచేయండి.

8, అక్టోబర్ 2011, శనివారం

పొగరాజు/ రాణి జబ్బలకు కాస్త చురుకెక్కువ....నపుంసకుడు/ నపుంసకరాలి గా మారేదాకా

ఆనందమొచ్చినా సిగిరెట్, విషాదమొచ్చినా సిగిరెట్, పనెక్కువైనా సిగిరెట్, తుదకు బోర్ కొట్టినా సిగిరెట్.

అప్పుడప్పుడే స్మోక్ చేయడం మెదలు పెట్టిన పొగరాయుళ్ళను ఎందుకు తాగుతున్నారో అడగండి? ఎక్కడనుండి ఎక్కడదాకా లిస్టు లాగుతారో. దె ఫీల్ దట్ దె ఆర్ యునీక్ ఇన్ ది క్రౌడ్. అలా వాళ్ళకు వాళ్ళు జబ్బలు చరుచుకోవడంతో ఆగుతారా? హబ్బే..ఇంకా ఏమంటారో చిత్తగించండి

"ఎప్పుడైనా సిటీలో బతికావా?"
పై మాటనడంలో వారి ఉద్దేశ్యం వాహనాలనుండి వెలువడే కాలుష్యం పీల్చడంకంటే ఈ సిగిరెట్ పొగ ఏమంత ప్రమాదకరం కాదని

"ఏ అలవాటు లేకుండా బ్రతికి ఏంచేద్దామని"
ఆహా.. పొగత్రాగడం వల్ల జీవితంలో ఎంతో సాధించారు వీళ్ళు :-)

................

అదే కవిత్వమొచ్చిన వారైతే ఇకనేమీ, ఇలాంటి సందర్భాల్లో అస్సలు కుంచెకూడా అవసరం లేకుండా ఆశువుగా కవిత్వం తన్నుకొస్తుంది. చూడండి

కందపద్యము :
భుగభుగమని పొగలెగయగ
నగణితముగ నాజ్యధార లాహుతి కాగా
నిగమాది మంత్రయుతముగ
పొగత్రాగని వాడు దున్నపోతై పుట్టున్

అయ్యా అదండి సంగతి. అంటే యజ్ఞం చేస్తున్నట్టు వేదమంత్రాలతో భుగభుగమని పొగలు లేచేటట్టు పొగ త్రాగని వాడు దున్నపోతై పుడతాడట.

అంతేనా..మరొకటి చిత్తగించండి

ఖగపతి అమృతము తేగా
భుగభుగమని చుక్కయొకటి భూమిని వ్రాలెన్
పొగ చెట్టయి జన్మించెను
పొగత్రాగని వాడు దున్నపోతై పుట్టున్


పొగత్రాగడం మీద అసలు సిసలైన మరొక్క పద్యం చెప్పుకొనే ముందు ఇది చూడండి

కూపోదకం వటచ్ఛాయ
తాంబూలం తరుణీకుచం
శీతకాల భవే దుష్ణం
ఉష్ణకాలే తు శీతలమ్!!

బావినీరు,మఱ్ఱిచెట్టు నీడ, తాంబూలము, స్త్రీ చన్నులు శీతాకాలంలో వేడిగానూ, వేసవికాలంలో చల్లగానూ ఉంటాయట. కానీ సిగిరెట్ త్రాగేవాడికి సర్వకాల సర్వావస్థలందు శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పైన చెప్పినవి ఎప్పుడు ముట్టుకున్నా చల్లగానే ఉంటాయి మరి :-)

సరదా సరదా సిగిరెట్టు అలా అలా కొన్ని సంవత్సరాలు మనల్ని రంగుల లోకాల్లో విహరింపచేస్తుంది. వయసు కొద్దిగా ముదురుతుంది. సిగిరెట్టు ను ఆప్యాయంగా తడిమి చూసుకొనే రోజులు దాటి అది మన దైనందిన జీవితంలో ఒక భాగమై పోయాక

పదపడి ధూమపానమున ప్రాప్తము తా పదమూడు చేటులున్
మొదలు ధనంబువోవుట, నపుంసకుడౌట,విదాహమౌటయున్
వదకుచు జాతిహీనులను వేడుట, తిక్కట చొక్కుటల్,రుచుల్
వదలుట,కంపుకొట్టుట,కళల్ తొలగించుట,రిమ్మ పట్టుటల్
పెదవులు నల్లనై చెడుట,పెద్దకు లొంగుట, బట్టకాలుటల్

ఈ పద్యానికర్థం తెలియకపోతే చెప్పండి వచ్చే టపాలో వ్రాస్తాను.


మీరు స్మోకింగ్ మానాలనుకుంటున్నారా? మరి ముందుగా ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి

మీరు మీ అత్మీయులతో ఒక అడుగుదూరంలో నిల్చొని మాట్లాడి ఎంతకాలమైంది?

అప్పుడే గుప్పుగుప్పుమని నాలుగు దమ్ములు లాగొచ్చారు? ఎదురుగుండా మీ కలలరాణి.అప్పుడేంచేస్తారు?

ఏదో అత్యవసరపని ఉన్నట్టు, ఇంట్లో ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకొని పారిపోయిన సందర్భాలెన్నో గుర్తున్నాయా?

సిగిరెట్ తాగడం కోసం, కేవలం సిగిరెట్ తాగడం కోసం ఇంట్లో అందరిని త్వరగా పడుకొమ్మని ఉచిత సలహాలిచ్చి మనం మాత్రం అందరూ నిద్రపోయాక గుప్పు గుప్పుమని గుండెనిండా గాలిపీల్చినరోజులెన్నో లెక్కకట్టారా?

మీకు చిరపరిచితమైన బస్టాండ్ . ఆ స్టాప్ లో ప్రతిరోజూ సిగిరెట్ తాగే అలవాటు. కానీ ఆరోజు ఏదో కారణంవల్ల కొంచెం ఆలస్యంగా బస్ స్టాడ్ వద్దకు వస్తున్నారు. కళ్ళెదురుగా బస్. కానీ తాపీగా ఈ బస్ పోతే బాగుండు, ఓ దమ్ములాగి తరువాతి బస్ కు పోవచ్చు అని అనుకున్న సందర్భాలెన్నో గుర్తున్నాయా?


మీరు స్మోక్ చేస్తున్న విషయం ఇంట్లో తెలిసినా ఎప్పటికప్పుడు చెయ్యలేదనే బుకాయిస్తుంటారు. ఆవిషయం మీకూ తెలుసూ ఇంట్లోనూ తెలుసు. కానీ మీరు ఆఫీసునుంచో లేదా బజారునుంచో అప్పుడే ఇంటిగుమ్మంలో అడుగుపెట్టారు. మీముద్దుల చిన్నారి పరిగెత్తుకుంటూ మీ వద్దకు వస్తుంది. మనసులో ఎత్తుకొని ముద్దాడాలనివుంటుంది. కానీ ఎత్తుకొని ముద్దాడితే పాప మీ విషయం కనిపెట్టేస్తుంది.అసలే చిన్నపిల్ల. ఇంకేమి వెంటనే ఇల్లంతా డాడి సిగిరెట్ డ్రింక్ చేసి వచ్చాడని టాంటాం చేస్తుంది. ఇంకేముంది సీన్ సితారే... మీకళ్ళముందు ఈ సంఘటన కనిపించిందా? అదీ మరి...

MOST OF THE TIME SMOKERS FEEL THAT THEY KNOW THE CONSEQUENCES, BUT THEY DON'T..................

ఇలాంటి సంఘటనలే కాదు మరీ దయనీయమైన సంఘటనలూ స్మోక్ చేసే వాళ్ళ వద్ద ఉంటాయి. పైన చెప్పిన సందర్భాలు క్రానిక్ స్మోకర్స్ కాని వారికి సంబంధించినవి. కారణం క్రానిక్ స్మోకర్స్ ఈ దశ దాటి ఇంట్లో వాళ్ళకు తెలిసేట్టుగానే త్రాగడం మొదలు పెడతారు. వారి విషయం తరువాత ముచ్చటించుకుందాం.

సీనూ సీనూ సిగిరెట్టు సీనూ పెళ్ళాం బిస్కత్తు....
విలాసంగా రెండు వేళ్ళ మధ్య నాట్యమాడుతుంది. పెదవుల మధ్యగుండా రింగు రింగులు ఆకారాల్లో పొగనూ వదులుతుంది. అల్లంత దూరానా అమ్మాయి కనిపించగానే లేని ఉత్సాహం తో ఎఱ్ఱెఱ్ఱగా వెలిగిపోతుంది. అర్థరాత్రులు మస్తు మస్తు మజాగా ఊగేటప్పుడూ నేనున్నానంటూ విలాసంగా కన్నుగీటుతుంది.
వహ్...ఒకటా రెండా... ప్రతి మజిలీ ఒక సిగిరెట్టు బ్రేకు....రోజుకో ఇరవైనలుగ్గంటలు.. గంట గంటకో సిగిరెట్టు. ప్రతిసిగిరెట్టు నీకు ప్ర్రియురాలికంటే ప్రియం. మైకం వదిలేదాకా ప్రియురాలి పిలుపు అత్యంత మధురం. మైకంలోకి వెళ్ళేదాకా సిగిరెట్టు మరీప్రియం.

అందమైన ఉదయం ఆ ఉదయపు స్వచ్ఛత
ఎప్పుడు చూసావు?
సుందర సాయం సంధ్యలను, మిణుకుమనే నక్షత్రాల కాంతిని
ఎన్నడు చూసావు?
పెరటి గుమ్మంలో మల్లె చెట్టు పూసిందట
చిరుగాలి మోసుకొచ్చే సువాసన చేరిందా?
అమ్మ చేసిన కమ్మనైన వంటరుచైనా
తనివితీరా జిహ్వ రుచిచూపిందా?

ఓరీ దౌర్భాగ్యుడా... దుర్బలమానసిక చాపల్యుడా... ఇవినీకు అనుభూతిలోనికొచ్చి సంవత్సరాలు గడిచింది కదా? ఔను.. పైవాటిని తిరిగి సంపాదించడం పోగొట్టుకున్న నీవల్లే ఔతుంది. ఎలాగంటారా?

రేపటినుంచి సైంటిఫిక్ అధారిత ధారావాహిక... సీనూ సీనూ సిగిరెట్టు సీనూ పెళ్ళాం బిస్కెత్తు.

మనవి : మన బ్లాగర్లలో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సిగిరెట్ ఎప్పుడు ఎలా మొదలుపెట్టారో కామెంటు రూపంలో తెలియచేస్తే నా ధారావాహికలకు ఎంతో సహాయం చేసిన వారవుతారు. అమ్మాయిలనడిగానని ముక్కుమీద వేలుతో గీరుకోనవసరంలేదులెండి. ఇప్పుడు ఈ సిగిరెట్టు ఆడా మగా పట్టింపు అస్సలు లేదు. అలాగే మీరు పొరపాటున సిగిరెట్ మానేసినా ఎలా మానేసారో చెప్తే మరీ మరీ మేలు చేసినవారవుతారు.

2, అక్టోబర్ 2011, ఆదివారం

కోటి ఇరవైఐదులక్షల హారం :-)

హారం భారతదేశ సంకలనిగా రూపాంతరం చెందాక చాలారోజులుగా ఈ టపా వ్రాద్దామనుకొని ఎప్పటికప్పుడు ఏవోకారణాలమూలంగా వెనక్కినెట్టేస్తూ వచ్చాను. ఈ రోజుకూడా వచ్చేవారం రాద్దాంలే అని అనుకుంటుండగా వచ్చేవారం మరో వార్షికోత్సవ టపా వ్రాయాలి కదా? దేని వార్షికోత్సవమో వచ్చేవారం తెలుస్తుంది :-)

ప్రస్తుతానికి హారం మీద ఓనాలుగు మాటలు రికార్డు చేసేస్తే ఓపనైపోద్ది. హారంలో ఇతర భారతీయభాషల్ని చేర్చాలన్న ఆలోచన వచ్చాక నాకు మొదట కలిగిన సందేహం... ఎవరైనా వచ్చి చూస్తారా అని. తెలుగులో హారం అప్పటికే రెండు సంవత్సరాలుగా నడుస్తుంది. ఆ రెండు సంవత్సరాల అనుభవం దృష్ట్యా ఈ ప్రశ్నే ప్రధానమైనది. ఈ ప్రశ్నకు కారణం లేకపోలేదు. ఈ ఆగ్రిగేటర్ నిర్వహణలో ప్రధానంగా హిట్స్ వచ్చేది మనకున్న పరిచయస్తులనుండే. అంటే మనమెంతగా ఒక గ్రూపు ను నిర్వహించగలిగితే అంతగా మన ఆగ్రిగేటర్ హిట్ అవుతుందన్నమాట. నేను నేర్చుకున్న తొలిపాఠం ఇది. ఇక్కడ టెక్నాలజీకి విలువ సున్న. మరి హారానికొక గ్రూపుందా??? ఏమో....ఏగ్రూపులో లేని వారు హారం గ్రూపేమో.... :-). మన తెలుగు బ్లాగుల్లో ఈ విషయమే ప్రధానం. ఇది కాదనలేని సత్యం.

ఈ అనుభవం దృష్ట్యా మిగిలిన భాషల్లో హారం ఏమాత్రం పాపులర్ అవుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో భారతీయ ఆగ్రిగేటర్ గా రూపాంతరం చెందింది. పలు భాషలున్నా. తెలుగు కాకుండా హారం ఇప్పటి వరకు బాగా పాపులర్ ఐనది రెండుభాషల్లోనే. ౧) తమిళం ౨) ఆంగ్లం. తమిళంలో అనూహ్యంగా అంచనాలకందకుండా, నేనూహించని రీతిలో చాలా చాలా పాపులర్ ఐందని చెప్పాలి. ప్చ్..నాకు భాష వచ్చి వుంటే కనీసం తమిళంలో ఓ పేద్దటపా వ్రాసి కృతజ్ఞతలు తెలుపుకొనేవాడిని :(

ఇక ఆంగ్ల బ్లాగ్వాతావరణం మిగిలిన భాషా వాతావరణం కంటే చాలా భిన్నం. ఆంగ్ల బ్లాగులు రాసిలో ఎక్కువ కాబట్టి అక్కడ ఎవరికెవరో సరిగ్గా తెలీదు. ఆ కారణంగా అక్కడ రాసే కామెంట్లు బ్లాగుపోస్టుకు సంబంధించే ఎక్కువగా వుంటాయి. వేరే ఎజండా అంటూ వుండే సందర్భాలు అరుదనే చెప్పాలి. చాలా మంది చాలా నిజాయితీతో తమ తమ జీవితాల్లో అనుభవించిన చిన్న చిన్న ఆనందాల దగ్గరనుంచి, అత్యంత దయనీయ పరిస్థుతులను, దారుణ సంఘటనలను వ్రాస్తున్నారు. బహుశా కేవలం వారికోసమే!!! వారి మన్సుల్లో గడ్డకట్టిన భావాలను చెప్పుకోవడానికి బ్లాగింగ్ అక్కడ ఒక ప్రధాన మాధ్యమం.

హారం తెలుగులో ఎంత పాపులర్ ఐందో ఇంగ్లీషులోనూ అంతగా అయింది. అంటే ప్రస్తుతానికి తెలుగు,తమిళాంగ్లభాషల్లో బాగా నడుస్తుంది. హిందీకి ఎందుకనో చాలా చాలా తక్కువగా హిట్స్ వస్తున్నాయి.

ఇంతకీ ఈ సంవత్సరానికి గానూ హారం సాధించిన హిట్లు ఒకకోటి ఇరవైఐదులక్షలు. ఇవిగేన డబ్బులైతేనా..... నో నాగమణి ఎంజాయ్ అనేసుకుండేవాడిని ..ప్చ్ ఆ ఛాన్స్ లేదు :-)

ఆ వివరాలు ఇక్కడ. ఇవి ఈ సంవత్సరం సెప్టంబరు నెలవరకూ వచ్చిన హిట్స్

బాగుంది కదా నాకృషి? కాదులే సెల్ఫ్ డబ్బా :-). ఏమైనా అనుకోండి కానీ భిన్న భాషల్ని ఒకటే గొడుగుక్రింద ఒకటే యూనిఫైడ్ ఫార్మాట్ లో చూపడమన్నది టెక్నికల్ తెలుగు ఛందస్సు తరువాత అంతటి తృప్తినిచ్చిన పని. మరి తెలుగు నిఘంటువో అనకండి. తెలుగు నిఘంటువులో సాంకేతికాంశాల ప్రదర్శనకంటే దీక్ష పట్టుదల ముఖ్యం. అవి నావద్ద లేకున్నా టైపు చేసే మా సభ్యుల వద్ద పుష్కలం.


సెలవా మరి!!!

1, అక్టోబర్ 2011, శనివారం

చివరిరోజు........అదే ఆరోజు..........

రెండేళ్ళు నాఎదురుగానే ఉన్నావు
ప్రతిరోజూ...........ప్రతిగంటా
నీ కళ్ళలో పలికే భావాలు వింటూనే ఉన్నాకదా!!


కానీ ఆరోజు..........
ఎదురుగా నువ్వు నేను
పట్టు పరికిణీ పసిడిజడగంటలు
పాదాలకు ఝుంకార కింకిణీలు
చూడముచ్చటైన రూపు.
కానీ కళ్ళలో ఏదో తెలియని బాధ
కాలానికి బద్ధులమై
విడిపోతున్నందుకా?
లేదా... పెదవిదాటి మాటచెప్పలేనందుకా?


హృదయాల్లో అనంతకోటి భావాలు
రంగురంగుల వర్ణ చిత్రాల్నావిష్కరించాయి
వాటికర్థమేమని ఏరోజైనా సందేహపడ్డామా?
పెదవిదాటని మాట
మనల్ని చెరో ఒడ్డుకు విసిరేస్తుందని కలగన్నామా?


సంధ్యారుణకాంతి సాక్షిగా
రాధామానసగీతిక నాకిచ్చినప్పుడు
నీ హృదయతరంగాల సవ్వడినన్ను చుట్టుముట్టినప్పుడు
నీకళ్ళు ఆతృతగా నన్ను చూస్తున్నప్పుడు
కనీసం అప్పుడైనా మనసు విప్పానా?

చివరిరోజు........అదే ఆరోజు
ఇక కలుస్తామో లేదో తెలియని రోజు
ఒకరికొకరం నిశ్శబ్దంగా నిస్తేజంగా
అలా అలా ప్రాణంలేని శిల్పాల్లా
ఘడియలు గంటలు....
వెళుతూ వెళుతూ
నా చెక్కిలి తుడిచేదాకా తెలియలేదు
అక్కడ ఓ కన్నీటి బొట్టుందని
అదే నేను నీకిచ్చిన చివరి బొట్టు అని.