31, డిసెంబర్ 2009, గురువారం

న్యూ ఇయర్ స్వాగతాంజలికి ముందు.

ముందుగా బ్లాగ్ బాంధవులకు హ్యా పీ న్యూ ఇయర్


మరో నూతన దశాబ్దానికి స్వాగతం. సుస్వాగతం. గతించిన కాలం. కాలంలో మొలచిన జ్ఙాపకాలు మనసు పొరల్లో నిక్షిప్తమైనవి ఇంకిపోగా మిగిలినవి గాలి కొదిలేసి మరో నవ దశాబ్దికి స్వాగత తోరణాల అలంకారలతో 2010 కి సుస్వాగతం.

సంవత్స్రరం పాటూ మనం చేసిన పనులు దాని నుంచి అందుకున్న ఫలితాలు, అవి మంచా చెడా అని వేసుకున్న ప్రశ్నలు, ఆ ప్రశ్నలనుంచి ఉదయించిన సమాధానాలు మొదలైనవన్నీ మననం చేసుకొని నవ దశాబ్దికి స్వాగతమాలల ఆహ్వానించేముందు...

2009.. ఈ సంవత్స్రరం ప్రపంచానికి ఏమి ఇచ్చిందో నాకనవసరం. సమాజానికి ఏమిచ్చిందో కూడా నాకనవసరం. మరీ ఇంత స్వార్థమా అంటే, అవును. ఈ రోజు పూర్తిగా నా వ్యక్తిగత విశ్లేషణకు మాత్రమే. కాబట్టి

గడుస్తున్న సంవత్సరానికి చివరి పుట ఈ రోజు. మూడు వందల అరవై నాలుగు రోజుల ఉత్థాన పతనాలను ఈ ఒక్కరోజులో నిక్షిప్తం చేద్దామని చిరు ప్రయత్నం. వ్యక్తిగతం, సాంసారికం, ఉద్యోగం ఈ మూడు పార్శ్వాలున్న జీవితంలో మొదటిగా

ఉద్యోగం : ఇక్కడ సమ్మిళిత స్పందనలనే చెప్పుకోవాలి. ఆర్థికమాంద్యానికి అతలాకుతలమైన నగరాల్లో న్యూయార్క్ ఒకటి. కారణం ఈ సారి ఆర్థికమాంద్యానికి మూలం ఫైనాన్స్ కంపెనీలు. ఫైనాన్స్ మునిగిందంటే దానితో ముడిపడి వున్న ప్రతిదీ మునిగి పోతుంది. మా కంపెనీ అందులో ఒకటి. నేను చేరిన సమయానికి 38-40 మంది వున్న స్టాఫ్ 2008 లో 8౦ దగ్గరకు చేరి, 2009 అక్టోబఋ నాటికి 28 దగ్గర ఆగింది. మూడంచలుగా సాగిన ఈ లేఆఫ్ సునామీ ని తట్టుకొని కొంతలో కొంత బోనస్ చేజిక్కించుకోవడం ఆనందం. అలాగే నా ఇండియా ట్రిప్ సెలవులను [ ౩ వారాలు ] పెద్దమనసుతో పట్టించుకోక పోవడమూ ఆర్థికంగా కొంచెం వుపయోగ పడింది.ఇక పని విషయానికి వస్తే నవంబరు, డిసెంబరు అంత పని నేను ఉద్యోగంలో చేరినప్పటి నుండి కూడా చేసి వుండనేమో ;).

సాంసారికం : ఇది పోయిన సంవత్స్రరంలాగే ఏ ఒడిదుడుకులు లేకుండా చాలా ప్రశాంతంగా సాగింది. కానీ పనులు కూడా కొంచెం ఎక్కువయ్యాయనే చెప్పాలి.అర్థాంగి ఇంటిని నడిపిన తీరు కూడా శ్లాఘనీయం. దరిదాపు నెలరోజులు ఒక్కటి నెట్టుకొచ్చింది [ డ్రైవింగ్ కూడా రాకుండా]. అలాగే ఈ సంవత్సరం రకరకాల వంటలకు ప్రయోగశలగా నన్ను మార్చేసింది ;). దానితో సన్న తాటి మొద్దు లాగా వున్నోడిని పిప్పళ్ళ బస్తాలా తయారయ్యాను.

వ్యక్తిగతం : ఇక ఈ హృదయ స్పందనల చిరు సవ్వడి నా అంతరంగం. ఇది నాలోకం. ఈ లోకంలో విహరించేటప్పుడు నాకు నేనే.. సంసారమున్న సన్యాసిని. ఆనందం ఆస్వాదిస్తూ వ్రాసిన కవితలెన్నో. అంతరంగంలో గూడుకట్టుకున్న గువ్వపిల్లల కబుర్లని అక్షర రూపం ఇవ్వడానికి నేను ఎంచుకున్న మార్గం ఇది. ఈ బ్లాగు ద్వారా ఎన్నో స్నేహాలు. మరెన్నో గుండె లయలు. అలాగే మరెన్నో చర్చలు.

దీనికి తోడు హారం డెవలప్ మెంట్ నాకు ఎనలేని ఆత్మ సంతృప్తినిచ్చింది. మొదట సరదాగా మొదలెట్టి రకరకాల విన్యాసాలు చేసి ఓ తెలుగు సంకలని గా తీర్చి దిద్దడంలో నున్న కృషి బయటకు కనిపించక పోవచ్చు. దీని డెవలప్ మెంట్ లో భాగంగా ప్రియంగా నిద్రలేని రాత్రులు గడిపిన రోజులున్నాయి. తొలిదశలో క్రాలర్, పార్సర్ వ్రాస్తున్న రోజుల్లో. అలాగే సంధుల కోసం ఓ ఇంజన్ ను వ్రాస్తున్న రోజుల్లో కూడా చాలా సందేహాలు. గూగుల్ లో దీని మీద ఉన్న విజ్ఙానం తక్కువ. ఒక చిరు ఉపకరణిగా మొదలైన హారం ఈ సంక్రాంతి కి ఒక సంవత్స్రరం పూర్తిచేసుకుంటుంది. ఈ రోజుకు దినికి వచ్చిన హిట్లు ఐదున్నరలక్షలు.

ఇక పై రెండు పనులతో బందీనైపోయిన నాకు సహజంగానే కాల నియంత్రణ కష్టమైపోయింది. దాంతో ఆఫీస్ లో వర్క్ మీద శ్రద్ధ తగ్గింది. ఇంటి పనుల మీద శ్రద్ధ తగ్గింది. దీనికి తోడు వేరే బ్లాగులు చదవడలంలో వెచ్చిస్తున్న సమయం, కామెంట్ల సమయం ఇవన్నీ కలిసి కట్టుగా నా సమయాన్ని హరించి వేసాయి.

ఇక 2010 లో నాకంటూ ఏవో నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టలేక కుళ్ళిపోవడం ఇష్టం లేదు కనుక ఏవో ఓ రెండు

౧) నో స్మోకింగ్ బోర్డ్ [ ఇది చదివిన వాళ్ళు నవ్వకండి ;)... ఏదో అలా ఇప్పటికి ఐదో రోజు పదో సారి నిర్విఘ్నంగా చేస్తున్నాను ]
౨) నా బ్లాగులో రేపటినుంచి కామెంట్లు వుండవు. అలాగే నా కామెంట్లూ వుండక పోవచ్చు.


ఇవి నేనూ పదిమందితో పబ్లిక్ లో పంచుకోవాలనుకున్నవి. మిగిలినవన్నీ నా 2009 డైరీ పేజీలకు మాత్రమే ... :)

అంతర్ముఖంకాలం కళ్ళముందు పరిగెడుతుంది
నిన్న, నేడు, రేపు, రూపుమాస్తున్నాయి
నువ్వు, నేనూ, తనూ, అస్థిరత్వ ప్రతీకలం
ఇవి మనిషి చేసే అంక గణాంకాలు
అతనికి మాత్రమే కొలమానాలు.

కాలం మారదు... మనిషీ మారడు
మనసు నిలువదు...మమతా అంతే
గుండె చప్పుడుల పర్వాలవి
రెప్ప రెప్పకీ మారుతుంటాయి
పరోక్షంలో విపక్షం ... సమక్షంలో స్వపక్షం

మనిషి మనిషికీ ఓ రంగు
కళ్ళముందు మరో రంగు
సభ్య సమాజంలో ఓగానం
అంతర్ముఖంలో మరోగానం

మభ్య పెట్టుకొనే మనిషే
పదుగురిలో పెద్దమనిషి

రంగు వొలికినా
గానం గతి తప్పినా
జరుగుతుంది ఓ హత్య
లేదంటే మరో ఆత్మహత్య

అస్థిరమైన కాలం
క్షణమైనా నిలువని మనసు
అవిశ్రాంత భువనంలో
రెప్పపాటు జీవితం
వల్లకాట్లో శరీరం.

27, డిసెంబర్ 2009, ఆదివారం

నిప్పురవ్వల గానుగలో తన జీవితం కాలుతుంది.

ఎదుట అంతా చీకటి
నిశ్శబ్ద బాహువుల్లో నిదురించే ప్రకృతి
కలతగొన్న మనసులు
అశరీరుని ఒడిలో ఒదిగి వున్నాయ్.

జిగేల్ మన్న చీకటి పురుగులు
నిప్పురవ్వలు పుక్కిలుస్తున్నాయ్
ఎదురుగ ఎదలో అలసిన అబలలు
ఉవ్వెత్తున ఎగసిన భోగిమంటలు

కాలుతున్న కార్చిచ్చు చుట్టూరా
పురివిప్పి నర్తించే మదోన్మత్తులు
వికృతంగా విలాసంగా
వికట్టాట్టహాస నరాధములు.


కింకరుల భీకర గానానికి
కరాళ నృత్య తాండవానికి
చెల్లా చెదురైన పాల పిట్టలు

ఎంతకాలం ఈ కేకలు
ఎంతకాలం ఈ నాట్యం
రేగిన నిప్పు కాల్చి కాల్చి
తనను కాల్చే దాకానా?

అరిచిన అరుపులు
ప్రతిధ్వనుల నినాదమై
నాదశ్వరుడు కన్ను తెరచి
నిజ నాట్యం చేసే దాకానా?

ఎంత కాలం ఈ మిణుకులు?
మరెంతకాలం ఈ చెదలు?

ఉత్పాత తాకిడికి
ఉన్మాదం కరిగే దాకానా?
చిరు కాంతి కాంతిపుంజమై
కళ్ళలోకి దూసుకుపోయేదాకానా?
మనస్సాక్షి ఎదురు తిరిగి
మనిషిని కాల్చుకు తినేదాకానా?
ఖగేశ్వర కరముల
తమ ప్రాణాలు కోల్పోయే దాకానా?
మున్నీటి అగ్ని మస్తిష్కాలను కాల్చి
జీవుని విశ్వంభరలో లీనం చేసే దాకానా?

జిగేల్ మన్న చీకటి పురుగులు
నిప్పురవ్వలు పుక్కిలుస్తున్నాయ్
నిప్పురవ్వల గానుగలో
తమ జీవితం కాలుతుంది.

24, డిసెంబర్ 2009, గురువారం

అమృతం కురిసిన రాత్రి.ఇది లాస్ట్ వీకెండ్ స్నోపడిన రోజు వ్రాసుకున్నా కానీ అనివార్య కారణాల వల్ల ప్రచురించలేదు. ఇదిగో ఈ రోజు తీరిగ్గా ఇలా ...


అర్థరాత్రి వెలుగెపుడైనా చూసారా
పుడమి కాంత కాంతి నెపుడైనా కన్నారా!

మల్లెపూల మాలతురిమి
చెంగల్వపూల చీర కట్టి
వేపపూల రవిక తొడిగి
హొయలొలికే అతివను కన్నారా?

అనంత ఆకృతి తాండవాన
జాలువారిన జాజులనెపుడైనా చూశారా?
జారిపడిన జాజుల పరిమళం
కాశ్యపి ఎదలో లయమవడం కన్నారా?

ఇల చేరిన మంచు విత్తులు
పాల పుంతల పంటపండించినవట
అవని కాంత స్ఫటిక తళుకులద్దుకుని
వేయిగజాల పెళ్లిచీర చుట్ట బెట్టుకుందట!

సిగ్గులొలుకు భువనేశ్వరి
సింగారి శ్రీలక్ష్మి
నడిరాత్రి నడిచింది
తారాజె రాజని.

20, డిసెంబర్ 2009, ఆదివారం

అలాగే ప్రియా..........


ప్రియ యామిని మదికౌగిలిలో
కలల కౌగిలి గిలిగింతలు
గిలిగింతల వెచ్చదనంలో
మనసు చెప్పే మూగఊసులు

ఊయలలూపే ప్రియభామిని
మమకార గారాలలో
ఇలలో కలల కౌగిలిలో
అలనై ఎగసి ఎగసి
ఉప్పైనై పొంగి పొంగి
పడిలేచే పరువపు గంగనై
గగన వీచికల వీచు గాలినై

కోకిల గానాన్నై
గానామృత మధువునై
అధరామృత తడినై
చెలి చెక్కిలి ఎరుపునై
తుమ్మెద ఘుంకారమై
మదిలో ఓంకారమై
జగతికి జనగీతికనై

ఇలలో కలలో
ప్రతి మనిషి హృదిలయలో
కలనై కరిగి
జ్వలితనై ఎగసి
నాదామృత జ్ఞానినై
జాతికి జాగృతినై
ఎగసి ఎగసి లయమై
మదిలో మహాగ్నినై
మనసుకు నవనీతమై

యువతరానికి నవ తరానికి
నేటి తరానికి నిన్నటి తరానికి
రాబోయే రేపుతరానికీ
మార్పులేక మాసిపోక
హృదయ లయల అలలపై
అలుపు లేక ఆగిపోక
ప్రతి నిత్యం ప్రసరిస్తుంటాను

నీరెక్కిన కంటికీ
నీలాల కంటికీ
చిగురించిన బ్రతుకుకూ
మోడిన జీవితాలకూ

నేను నిత్యం
నేను సత్యం
ఈ మాయా ప్రపంచంలో
మాయావినై సంచరిస్తుంటాను
పుట్టుక కు మరణానికి మధ్య.

****

భానూదయ కిరణాలే
హృదయ గాన తంత్రులై
మనసున మల్లెలపూయించి
ఉదయిస్తుంది ప్రేమ ప్రతిమనిషిలో

18, డిసెంబర్ 2009, శుక్రవారం

తెలంగాణా సీమ

నాకిప్పుడే ఒక బ్రహ్మాండమైన, ఎవరికీ రాని ఐడియా వచ్చింది. అసలు సీమాంధ్ర ఎందుకు? సీమ జిల్లాల్లో కరువు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతుంది కాబట్టి మమ్మల్ని తీసుకెళ్ళి కోస్తాలో కలిపేస్తే మా బ్రతుకులు ఏంకావాలి? అందుకని మాకిప్పుడు సీమాంధ్ర వద్దు. తెలంగాణా సీమ కావాలి. ఎట్టాగూ మీరూ వెనకభడ్డోళ్లే, మేమూ మీకంటే వెనక బడ్డోళం కాబట్టి మనిద్దరం కొట్టుకున్నా బూడిదే రాలుతుంది. ఏమంటారు. అందుకని మా తెలంగాణా సీమ లో కలిసి వుండాలనుకొనే వాళ్ళందరూ మాకు మద్దత్తు నివ్వండి. అయితే రాజధాని మాత్రం మా ఒంగోలు అయితేనే ఒప్పుకుంటాం. ఇప్పుడు ఒంగోలు లో లేము కాబట్టి, మేమున్న మా గుంటూరు ప్రాంతాన్ని కూడా అంటే వినుకొండ, నర్సరావుపేట, మాచర్ల, కారంపూడి ఇలాంటివన్నీ కలిపి మాకు తెలంగాణా సీమ కావాలి.మీ మనోభావాలకు అనుగుణంగా తెలంగాణా తల్లిని మన తెలుగు తల్లి గా పూజిద్దాం. తెలంగాణా పేరునే ముందు వుంచి సీమ పేరు ఏదో తోకగా తగిలిద్దాం. ఆంధ్రా వాళ్ళు కూడా ప్లీజ్ అని అడిగితే వచ్చి మా తెలంగాణా సీమ లో వుండవచ్చు. కాబట్టి రేపటి నుండి నేను తెలంగాణా సీమకు ఉద్యమించబోతున్నాను. వస్తే సరే సరి. లేకపోతే...?

10, డిసెంబర్ 2009, గురువారం

రోషమున్న ప్రజానాయకులారా అందుకోండి నా నినాదం


ఈ నాడే నాగతం
గళమై తెరనెక్కి నాడింది
ఈనాడే నా స్వరం
పదునెక్కి తైతక్క లాడింది

ఆంధ్రుని పౌరుషం
ఆతని పరువు
వాడ వాడలా
వేద ఘోషయై ప్రభవిల్లింది.


రజస్ తేజములు
ప్రజా నాదములు
గర్జించి గళమెత్తి
ఉరకలెత్తి ఉప్పొంగి
సమైక్య నాదమయ్యింది

పగటిపూటే హస్తినలో చుక్కలట
పగలబడి నవ్వుతున్న దేశమట
విరిచి ముక్కలిమ్మన్న రాష్ట్రాలట
పొదల చాటున పొంచిన ముష్కరులట

నాదం వాదం
ప్రాణం ప్రాభవం
శివ తాండవ నృత్యం

నోరెళ్ళబెట్టి చూస్తుంది సమస్త భారతం
చేష్టలుడిగి చేతులెత్తిన ప్రజాస్వామ్యం.

8, డిసెంబర్ 2009, మంగళవారం

నా రాష్ట్ర సాదనకు నా అర్జీ. మా రాష్ట్ర భాష - "తెహింతబెం"

పాఠకులకు విన్నపము. ఈ టపా లో నిజమైన తెలంగాణా వాదులను నొప్పించే వుద్దేస్యం నాకు ఏమాత్రమూ లేదు. నిన్న చెప్పినట్టు ప్రత్యేక రాష్ట్రమైనా , లేక మూడు ముక్కలైనా నాకు ఆవేదన కానీ ఆనందం కానీ వుండవు. నిజం చెప్పాలంటే చాలా మందికి ఈ విభజన జరిగినా జరగక పోయినా తమ జీవితాలు ఏమాత్రం మారవు. కాబట్టి ఆ ఆలోచన మీ మనసులలో నుంచి తొలగించి ఒక చెత్త హాస్య టపా క్రింద లెక్క కట్టుకొని చదవాలని పిస్తే చదవండి.

భూనభోమండల ఏకచ్చత్ర మహారాజ్ఞి, అండ పిండ బ్రహ్మాండములను ఒక్క చూపున శాసించగల మహిళాధీమతీ మీ దివ్యసముఖమునకు ఈ దీన ఆంధ్రా యువకుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ వ్రాసుకున్న అర్జీ [ఛత్ ఇంకా నేను యువకుడినేంటి, పెళ్ళి కాకముందే తాతనైపోయాను :(]

మా తాతలది మైదుకూరు ( కడప జిల్లా ) అయినందువల్ల, మా నాన్నగారిదీ, నేను పుట్టినదీ, పెరిగినదీ, అక్షరాలు నేర్చినదీ ప్రకాశం జిల్లా అయినందువలననూ,కొండొకచో చించినది నెల్లూరు అయినందువలన,మళ్లీ తెగ చదివి దేశాన్ని ఉద్ధరిద్దామని చదివింది విశాఖపట్టణం,మద్రాసు,ఖరగ్పూర్ ( మిడ్నాపూర్ జిల్లా) అయినందు వలన వీటన్నింటిని అనగా కడప,ప్రకాశం, నెల్లూరు,విశాఖపట్టణం,మిడ్నాపూరు జిల్లాలనూ

మరియూ
ఇంకా మేడంగారు దయతలిస్తే ఈ క్రిందివి కూడా పరిశీలించ వలసినదిగా మనవి

బ్యాచ్లర్ లైఫును సంపూర్ణంగా రుచి చూపించినది బొంబాయి నగరమయినందువలన, ఇంకనూ అక్కడ జుహీచావ్లా ని చూడడానికని రోజూ జుహూబీచ్ లో మాటువేసిన నాకు తోడుగా నిలిచినది అరేబియా సముద్రము అయినందువలన

జీవితంలో అందరూ చేసే తప్పు పెళ్ళి చేసుకోవడం :) ఆ తప్పును నేనూ మనసారా చేసి గిద్ధలూరు కు అమ్ముడు పోవడం చేతనూ..ఈ ఊరు ఇంతకు పూర్వం కర్నూలు జిల్లాలో భాగముగా నున్న చేతనూ

డబ్బాల డబ్బాల సాఫ్ట్వేర్ విద్యార్థులను తయారుచేసే హైదరాబాదులో దివాను కూలీనై ఇంతకు ముందుచెప్పిన అనుభూతులనన్నింటిని వదులుకొనలేక పొట్టకోసం హైదరాబాదునే స్థిరనివాసంగా చేసుకొ్ని వుండటం చేతనూ చాలా అనారోగ్య అస్థవ్యస్థ స్థితిలో వున్నాను. ఈ నా మనో వ్యాధికి విరుగుడు మీరేనివ్వగలరు.

నాకు నా మనోభావాలను అన్నీ ఒకేదగ్గర కలిపి చూసుకోవాలని ఎప్పటినుంచో తీరని కోరిక. ఈ భారతావనిలో ఇన్ని మనో భావాలున్న వ్యక్తి మీకు మరొకరు కనిపించరు కనుక, మనో భావాలు లేని మిగిలిన వారు ఎలాగూ బాగానే వుంటారు కనుక, వారి చాడీల మాటలు పట్టించుకొనక ఈ దీన దయాళ ప్రభు చరణ దాసుని మనోభావాలను మన్నించమని మీ దివ్యచిత్తమునకు చిత్తగించడమైనది.

కావున ఇందు మూలముగా ఈ దీనుని ప్రార్థన ఏమిటంటే

కడప,కర్నూలు,నెల్లూరు,ఒంగోలు,విశాఖపట్టణం,మిడ్నాపూర్,బొంబాయి,హైదరాబాదు, అరేబియా సముద్రములను నాకు ధారాదత్తము చేయమని ఆ ప్రభువుల సాక్షిగా తెలుపుకుంటున్నాను. రాజభాషగా తెహింతబెం ను ప్రజలపై రుద్దగలను

తెహింతబెం ( తెలుగు-హిందీ-తమిళ్-బెంగాలీ ).

ఓ నుత్తమ రాణీ, తమకు దేశ దేశములందు గల పలుకుబడి ఈ పరిచారికునకు తెలియనిది కాదు. మీ పలుకుబడి నుపయోగించి అమెరికాను కూడా ఇప్పించగలరేమో చూడమనవి.

చివరిగా మరోమాట... ఎన్ని నెలలు కాపుకాసినా జుహూబీచ్ లో జుహీచావ్లా దర్శన భాగ్యము కలుగలేదు. కావున పైనున్న కుగ్రామములను ధారాదత్తము చేసి నన్ను సామంతరాజుగా నియమించు సమయాన ఈ జుహీరాణి ని కూడా సామంతరాణిని చేయగలరని ఆసతో ఆశిస్తూ

మరో సారి తమ పాద ధూళికి కూడా సరిపడని ఓ పాద దాసుడు
(ఆంధ్రా రాజకీయనాయకుడు)


ఇక ఈ క్రింది పద్యం తెలంగాణా యువతకు అంకితం. రాజకీయ మోసాలకు బలిగాకండి.


మండు గుండెల రాష్ట్ర మంతయు మూడు ముక్కల చీలినా
నిండు కుండిన నీదు కుండను నెవ్వ రైనను నింపునా
మండు టెండల ఎల్ల ప్రొద్దుల మంట బెట్టెడి బాలకా
నిండు పున్నమి నీదు జవ్వని నీట పాలును చేయకే

6, డిసెంబర్ 2009, ఆదివారం

ఆంధ్ర Vs అమెరికా తెలంగాణా యువకుడు

ఈ మధ్య కవితలని గీకి గీకి తెగ బోర్ కొడుతుంది. ఇట్టా రాస్తుంటే జీవితంలో థ్రిల్ మిస్ అయిపోతున్న ఫీలింగ్ తెగ ఇబ్బంది పెట్టేస్తుంది. అదే గాక ఏబ్లాగు చూసినా కవితలే కవితలు. ఎప్పుడన్నా బొత్తిగా మైండ్ బ్లాంక్ అయితే కవితలు మళ్ళీ వ్రాసుకోవచ్చు గానీ, ఇలాంటి ఆనంద సమయాల్లో ... ఛత్.. కొట్టండి, చంపండి, నరకండి

ఎవడ్రా ఇక్కడ తెలంగాణా తల్లిని తెలుగు తల్లి అన్నది? మా ఏసీఆర్ అన్న అప్పుడేదో నోరుజారిండు కానీ అసలకది తెలంగాణా తండ్రి బొమ్మ. ఆంధ్రోడు కుట్ర చేసి తల్లిని జేసిండు. కాసుకోండి తరిమి తరిమి కొట్టకపోతే నేను తెలంగాణా బిడ్డనే కాదు.

అన్నా నువ్వు ఆంద్రోడివి కాదంటే ! ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఆంద్రోల్లనే సదువుకున్నానే.

ఎవడ్రా ఆ సదువు చెప్పిన ఆంద్రోడు? అసలు నీకు రక్త తెలంగాణా చరిత్ర తెలుసా. తెలంగాణా వుద్యమ చరిత తెలుసా. వెనుకబాటు తనం తెలుసా.మాసిపోయిన మా బ్రతుకుల వెతలు తెలుసా.వెలిగి ఆరిన ఓరుగంటి చరిత తెలుసా. నిజాములు తెలుసా, రజాకారులు తెలుసా?

ఇయ్యన్నీ తెల్వదు గానన్న ఒక్కటి మాత్రం తెలుసే. రాజకీయాలు మనకు తెలిసినంత బాగా ఇంగెవ్వరికీ అంత తెల్వదన్న.

ఇవన్నీ జనాలకు తెలియచేయటం కోసం మా కార్యాచరణ ఇది

ఎటియం సెంటర్ల కొల్లగొట్టండ్రా.. ఎవడబ్బ సొమ్మని ఈ డబ్బాల్లో దాచుకున్నారు ఆంద్రోడు.
బస్సుల బంద్ చేయండ్రా ... నడిచిందంటే నలిపి పారేయండి
ఆంద్రోడు అని తెలిస్తే ... నరికి పారేయండి
ఆంధ్రా షాపులు కొల్లగొట్టి మంట పెట్టండిరా
అసలా పదం కనిపిస్తే మంటల్లో మసి చేయండి
చివరిగా తెలంగాణా ఎందుకు? అనే వాళ్ళకి గోరీ కట్టండి.
నేను చెప్పేదే వేదం. నా మాటే మంత్రం. నా బాటే రగతం.


అందుకని నే సెప్తున్నా...

అచ్చమైన తెలంగాణ బిడ్డనిరా
స్వచ్చమైన మనసున్న అన్ననురా

అట్టేగన్నా, అట్టనే చేద్దాం.. కానీ నామాటలు కూడా ఓసారి సూడే


మత్తకోకిల ||
ఎల్లలన్నియు రాజకీయపు ఎత్తులందున క్రుంగినా
ఎల్లప్రొద్దుల కాయకష్టము ఈతిబాధలనీదు నా
పిల్లపాపల రాతమార్చి సుభిక్షతెలుంగుతెలంగణా
తల్లిదాహము దీర్చునాయక తారలెవ్వరు తమ్ముడా!
తెలంగాణా యువకుడు ఆంధ్రాలో

కొట్టండి నాకొడుకుని మా తెలంగాణాకొచ్చి మానోటికాడ కూడు తీసి ఎంజాయ్ చేస్తుండు. నరకండ్రా...

అమెరికాలో తెలంగాణా యువకుడు

కొట్టండి నాకొడుకుని మా అమెరికాకొచ్చి మానోటికాడ కూడు తీసి ఎంజాయ్ చేస్తుండు. నరకండ్రా...