25, డిసెంబర్ 2014, గురువారం

అమ్మ నాల్గవ వర్ధంతి.

మా అమ్మ పరమపదించి నేటితో నాలుగేళ్ళు నిండుకుంటుంది.2010 డిసెంబరు 25 వ తేదీ శనివారము వైకుంఠ యాత్ర చేసి శివైక్యం చెందారు.వైకుంఠ యాత్ర చేసి శివైక్యం పొందటమేమిటని తర్కపడకండి. శివకేశవులు అభేదులు. గీత లో పరమాత్మ చెప్పినట్టు ఉన్నది ఒక్కటే అది పరమాత్మ స్వరూపం. ఈ సమస్త జగత్తూ ఆత్మచేత నిండి ఈశ్వరునిచే వ్యాపించబడి వుంటుంది.

అంతవంత ఇమేదేహః నిత్యస్యోక్తా శరీరిణః
అనాశినోప్రమేయస్య తస్మాద్యుధ్యస్య భారత

భావము: నిత్యమైనటువంటి, నాశనం లేనటువంటి,సాటిలేనటువంటిది ఆత్మ(శరీరి). ఈ శరీరాలన్నీ నశించి పోయేవే. కనుక ఓ అర్జునా యుద్ధం చెయ్యు.
పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు కదా.అలాంటప్పుడు ఎంతవగచినా ప్రయోజనమేమీ వుండదు కాబట్టి జీవించి వున్నవాళ్ళు ఈ ప్రపంచంలో బ్రతకడానికి ప్రతినిత్యం యుద్ధము చేయక తప్పదు.


నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః
న చైవ న భవిష్యామః సర్వేవయ మతః పరం

భావము: నేను లేని సమయం అంటూ ఎప్పుడూ లేదు.అలాగే నీవుగానీ, ఈ రాజులు గానీ లేని సమయం కూడా ఎప్పుడూ లేదు. ఈ శరీరాలు నశించినప్పటికీ ఇక ముందు కూడా మనందరం లేకపోవుట అనేది లేదు.