9, మే 2020, శనివారం

నూతన గృహ ప్రాప్తిరస్తు....

2000 సంవత్సరం మొదలుకొని 2005 వరకూ బిజినెస్ వీసా మీద ఐదుసార్లు అమెరికా ప్రయాణాలు చేసినా  2005 వరకూ H1 మీద రావడానికి ధైర్యం సరిపోలేదు. కారణం 2000 వ సంవత్సరం మొదటి సారి లాస్ ఏంజలస్ కు బిజినెస్ వీసా మీద వచ్చినప్పుడు కొంతమంది H1 స్నేహితుల కష్టాలు దగ్గరిగా ఓ ఆరునెలలు చూశాను. అప్పటికే  నాకు పెళ్ళై వుండటం, మొదటి పాప పుట్టి రెండేళ్ళు కూడా పూర్తవని కారణంగా భారతదేశంలో వున్న స్థిరమైన ఉద్యోగాన్ని ఒదులుకొని ఇక్కడికి వచ్చి ఇన్ని కష్టాలు పెళ్ళాం బిడ్డలతో అనుభవించడం అవసరమా అని అనిపించింది. దానితో 2001 లో మా బావమరిది ద్వారా వచ్చిన H1 ని కూడా వదులుకొని ఇండియాలోనే ఉద్యోగం చేసుకుంటు కాలం గడిపాను. కానీ 2005 వచ్చేసరికి నా దృక్పధం కొంతమారింది. ఆ సమయంలో దరిదాపు ఓ సంవత్సరం పాటు రెండు విడతలగా అమెరికా లో బిజినెస్ వీసా మీద గడిపాను. అమెరికా విద్యా విధానం, పిల్లల సంపూర్ణ వ్యక్తిత్వ వికాశం, విశాల దృక్పధాలను అలవరచుకోవడానికి కావలసిన వాతావరణం మొదలైన అంశాలు నన్ను ఆకర్షించినవి. అప్పటికి రెండవ పాప కూడా పుట్టి ఇద్దరూ ప్రాధమిక విద్యాభ్యాస స్థాయిలో వున్నారు. అవును మరి ఇండియాలో మూడేళ్ళు నిండగనే స్కూల్ లో వేస్తాము కదా! వారికి మంచి భవిష్యత్తును అందించాలనే తలంపుతో నాకు తెలిసిన స్నేహితుని ద్వారా ఓ H1 కు అప్లై చేశాను. ఆ తరువాత 2005 నవంబరు నాటికి తిరిగి హైదరాబాదు వెళ్ళిపోయాను. అప్పటికి H1 lottery system లేదు. నాకు తెలిసి first come first serve వుండేది. కానీ వాళ్ళు సమయంలోపు అప్లై చేయకపోవడంతో ఆ సంవత్సరం రాలేదు. తిరిగి 2006 లో అప్లై చేశారు.

అనుకున్నట్లుగానే 2006 చివరిలో నాకు H1 approve ఐనట్టు మైల్ వచ్చింది. H1 papers అన్నీ నాచేతికి రావడానికి 2007 జనవరి మాసమైంది.ఈ మధ్యలో ఓ పెద్ద ప్రహసనం. ఆ సమయంలో నా ఉద్యోగం చెన్నై లో వుండేది. కానీ నా క్లైంట్ అమెరికా లో వుండటంతో నేను సంవత్సరంలో ఓ మూడు నాలుగు సార్లు చెన్నై వెళ్ళి అందరికీ హాయ్ చెప్పి వచ్చి హైదరాబాదు లో ఇంటి నుంచే పని చేస్తుండేవాడిని. అలా చెన్నైకి వెళ్ళి పని ముగించుకొని తిరిగి జనవరి 8 2006 లో చెన్నై నుంచి కాచిగూడ ఎక్స్ ప్రెస్ కు హైదరాబాదు వస్తున్నాను. పగలంతా బాగా పని చేసి వుండటం వల్ల ఆదమరచి నిద్ర పోయాను. కాచిగూడ వస్తుందనగా లేచి చూసుకుంటే నా సర్టిఫికేట్లు/పాస్పోర్ట్లు వున్న బ్రీఫ్ కేసు కనిపించలేదు. హత విధీ !!! :(. ఇలా రైలులో వస్తువులు పోగొట్టుకోవడం ఇది రెండవసారి. మొదటి సారి బూట్లతోనే ఆగిపోయింది. కానీ ఈ సారి నా జీవితానికి అతిముఖ్యమైన డాక్యుమెంట్లు పోయాయి.ఆ తరువాత వాటిని తిరిగి ఎలా సంపాదించుకొన్నానో అదొక పెద్ద చరిత్ర. మరొక సారి ఎప్పుడైనా వ్రాస్తాను.

అలా వచ్చిన H1 ని సద్వినియోగ పరచుకొందామని ఫిబ్రవరి 2007 లో చన్నై కౌన్సిలేట్ లో అపాయింట్మెంట్ తీసుకొన్నాను. మేము ఒకటే నిర్ణయించుకొన్నాము. కుటుంబమంతా కలిసి కౌన్సిలేట్ కు వెళదాము. వీసా ఇస్తే అందరికీ ఒకేసారి ఇస్తాడు. అలా కాకుండా మనలో ఏఒక్కరికి రిజెక్ట్ ఐనా H1 కు మంగళం పాడుదామని అనుకొన్నాము. అనుకున్న విధంగానే అందరమూ ఒకేసారి వీసా కు వెళ్ళడం అందరికీ వీసా ఇవ్వడం జరిగిపోయింది. ఆ రోజు, మరసరోజు అందరికీ చెన్నై, మహాబలిపురం చూపించి తిరుగు ప్రయాణంలో మా గ్రామం గాంధీ నగర్ కు వెళ్ళి హైదరాబాదు వచ్చాము. అలా ఏప్రిల్ నాల్గవ తేదీ 2007 వ సంవత్సరం అమెరికాలో దిగి ఏప్రిల్ రెండవ వారంలో H1 మీద ఉద్యోగం ప్రారంభించాను. ఏప్రిల్ లోనే కుటుంబాన్ని తీసుకురావడానికి వీలుగా ఒక సింగిల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ తీసుకొన్నాను. 2007 మే రెండవవారంలో ఫ్యామిలీ వచ్చినాతో చేరింది.

ఇక అక్కడినుంచి అమెరికా స్థిరనివాస ప్రయాణం మొదలు. అలా 2007 వ సంవత్సరం నుంచి 2019 మే నెల వరకూ అద్దె ఇళ్ళలో జీవనం కొనసాగింది. ఆ పన్నెండు సంవత్సరాలలో ఎన్నో ఇళ్ళు మారాము అనుకొనేరు. దశాబ్దకాలం పైగా మేము మారింది రెండే రెండు ఇళ్ళు. మొదటి ఇల్లు అద్దె పెంచాడని కోపంతో మారాము. నాకోపానికి కారణం మేము అప్పటికే అక్కడ నివాసం ఏర్పరచుకొని సంవత్సరకాలంగా వున్నా వాడు క్రొత్తగా అద్దెకు వచ్చే వారికి మాకన్నా తక్కువ అద్దెకు ఇచ్చి మాకేమో అద్దె పెంచాడు. ఓ ఇంతలేసి ఇల్లు ఎక్కడా దొరకదా అని కోపంగా ఇల్లు మారాము. ఇల్లు మారిన తరువాతి ఇంటిలో దశాబ్ద కాలంగా వున్నాము. I still miss the second house.

ఈ పన్నేండళ్ళలో చాలామంది మమ్మల్ని ఇల్లు ఎప్పుడు కొంటారు? నూతన గృహ ప్రాప్తిరస్తు! అని ప్రశ్నించడమూ దీవించడమూ జరిగింది. ఈ మధ్య వచ్చే H1 వాళ్ళైతే ఉద్యోగం రావడమే ఆలస్యం ఇల్లు కొనేస్తున్నారు. వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఏమైనా అంటే అది ఇన్వెస్ట్మెంట్ అంటారు. కానీ నేను H1 మీద, గ్రీన్ కార్డ్ మీద ఆ రిస్క్ చెయ్యదలచుకోలేదు.కారణం ఇక్కడ వుంటామో లేదో తెలియదు.అలాగే పిల్లల స్కూల్స్ కూడా మార్చడం ఇష్టంలేక పోయింది. H1 మీదైతే ఇల్లు కొనడం మరీ రిస్క్ అనిపిస్తుంది నాకు. నా కెందుకో నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా (H1) అనేది తుమ్మితే ఊడే ముక్కెర లా అనిపిస్తుంది. అది నా అభిప్రాయమే కావచ్చు కానీ H1 మీద ఇల్లు కొంటే మానసిక ఒత్తిడి తట్టుకోవడం కష్టమనిపిస్తుంది నాకు. అలా పన్నెండేళ్ళు గడిపిన తరువాత పోయిన సంవత్సరం మే 9 వ తేదీ అమెరికాలో ఒక ఇంటివాడినయ్యాను.

ఎవరి సొంత గృహం వాళ్ళకు అపురూపం. చిన్నదైనా, ఓ మోస్తరుదైనా, పెద్దదైనా,రాజభవనమైనా ఎవరి శక్తికొలది వారు కొనుక్కుంటారు. అది ఎంత చిన్న గృహమైనా ఎవరి ఇల్లు వారికి అపురూపం. అలాగే నా ఇల్లు నాకు అపురూపం :-)





3, మే 2020, ఆదివారం

జీవిత సోపానాలు - 4

ఏంటి ఇక్కడ కూర్చున్నావు.ఇది రిజర్వేషన్ బోగీ.ఇక్కడ కూర్చోకూడదు.ప్రక్క స్టేషన్ లో దిగి జనరల్ బోగీలోకి వెళ్ళమన్నాడు. నేను నా టికెట్ చూపించి ఎక్కడైనా బెర్త్ ఖాళీగా వుంటే ఇవ్వమని అడిగాను. బెర్త్ లు ఖాళీ వుంటే స్టేషన్ లోనే నీకు రిజర్వేషన్ దొరికేదిగా? చూద్దాంలే అని ముందుకెళ్ళిపోయాడు. "హమ్మయ్య ఇక ఇక్కడ కూర్చోడానికి ఇబ్బందిలేదని" అనుకుంటూ మళ్ళీ సూట్కేసు ఆసనంగా చేసుకున్నాను.

అరగంట గడిచింది. టికెట్ కలెక్టర్ మళ్ళీ కనబడ్డాడు. ఇప్పుడు ఇతన్ని వదిలితే నా సంగతి మర్చిపోయి వేరే ఎవరికైనా బెర్త్ ఇచ్చేస్తాడేమోనని భయం. మళ్ళీ కదిలించాను. ఇక్కడే వుండు నేను మళ్ళీ వస్తానని ముందుకు వెళ్ళాడు.నేను ఆత్రుతగా ఎదురుచూస్తుండగానే వచ్చి డెభ్భైఐదు రూపాయిలిమ్మన్నాడు.సార్ అంతలేదని బ్రతిమాలుకుంటే తుదకు అరవై రూపాయలకు బేరం కుదిరింది. ముప్పై రూపాయలు బెర్త్ ఛార్జ్, ముప్పై రూపాయలు ఆమ్యామ్యా. ఇంతకు ముందు రైలు ప్రయాణాల అనుభవంతో ముప్పైరూపాయల దక్షిణ సర్వసాధారణమైన విషయమౌడంతో పెద్దగా బాధనిపించలేదు.

మొత్తానికి బెర్త్ దొరికింది. వెళ్ళి సూట్కేస్ ను సీటుక్రిందపెట్టి చైన్ తో తాళం వేశాను.ఇలా సూట్కేసు కు చైన్ తో సీటుకు కట్టి తాళం వెయ్యడం విశాఖపట్టణంలో బి.టెక్ చేస్తున్న రోజులనుంచి అలవాటు. విశాఖపట్టణంలో ఇంజనీరింగ్ సీటు వచ్చిన తరువాత చేర్పించడానికి మానాన్న కూడా నాతో వచ్చాడు.ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం వర్క్ షాప్ ప్రాక్టికల్స్ కు బూట్లు తప్పని సరి అని సీనియర్స్ చెప్పడంతో మొదటిసారిగా వేక్షన్ బూట్లు జగదాంబ సెంటర్ కు మా నాన్న తో కలిసి వెళ్ళి కొన్నాను. ఆ బూట్లు కొన్నన్ని రోజుల ముచ్చట తీరకుండానే పోయాయి. రేగింగ్ పూర్తైన తరువాత మొదటి సంవత్సర విద్యార్ధులమందరము ఎవరిళ్ళకు వాళ్ళు బయలు దేరాము. అప్పుడు మేము ప్రకాశం జిల్లా వెలిగండ్ల లో వుండే వారిమి.అందుకని నేను బొకారో లో ఒంగోలు కు వస్తున్నాను. బొకారో వైజాగ్ లో సరైన సమయానికొస్తే సాయంత్రం నాలుగు/ఐదు గంటలకు బయలుదేరి ఒంగోలు తెల్లవారి ఝామున చేరుతుంది. అప్పట్లో ఆంధ్రాయూనివర్సిటీ లో చదివే విద్యార్ధులకు సెలవులకు ఇళ్ళకు వెళ్ళటానికి యూనివర్సిటీ వాళ్ళు రైల్వేపాసులు ఇచ్చేవారు. ఆ పాసు తీసుకొని రైల్వేష్టేషను కు వచ్చి రిజర్వేషన్ చేపించుకుంటే చార్జీలో  యాభై శాతం తగ్గించేవారు.ఈ ప్రయాణం ముందుగానే నిర్ణయించినదైనడవటంతో స్నేహితులందరము మా డిపార్ట్మెంట్ కు వెళ్ళి పాస్ తీసుకొని ముందుగానే ఎవరి రైలు కు వాళ్ళం రిజర్వేషన్ చేపించుకున్నాము. ఇంజనీరు గా ఊరికి మొదటి సారి ప్రయాణం.అదో రకమైన ఆత్మస్థైర్యంతో కూడిన ధైర్యం. బూట్లు వేసుకొని ఊర్లో చూపించాలన్న బలమైన కోరిక. ఇలా సాగుతున్న నా ఆలోచనలకు ఆ ప్రయాణంలోనే పెద్ద గండి పడింది. రైలెక్కి కూర్చొని ప్రక్కన వాళ్ళతో కబుర్లలో పడి సూట్కేసుకు తాళం వేసి కాలికున్న బూట్లు విప్పి పై బెర్త్ కావడంతో రాజమండ్రి దాటిన తరువాత నిద్రపోయాను. ఒంగోలు వస్తుందనగా మేల్కొని బాత్రూమ్ కు వెళదామని చూస్తే బూట్లు లేవు.గుండెల్లో రాయి పడింది.వేరే జత చెప్పులు కూడా లేవు.ఒక్కసారిగా ఆ దొంగ మీద ఎక్కడిలేని కోపం. దరిద్రుడా మట్టికొట్టుకు పోతావురా అని తిట్టుకున్నాను. ఆతిట్టు ఆ దొంగ వినుంటే "నేను క్రొత్తగా మట్టికొట్టుకు పోవడానికేముందిలే.బ్రతకడానికి వేరే మార్గంలేక ఈ వృత్తినెంచుకున్నానని ఓ నవ్వు నవ్వుకొనేవాడు." ఒంగూలు లో రైల్ దిగిన తరువాత చెప్పులు లేకుండానే బస్టాండు కు రిక్షాలో వచ్చాను. సమయం తెల్లవారు ఝామున నాలుగై వుంటుందేమో. వస్తూ ఆశ చావక దారిలో ఎక్కడైనా చెప్పులు షాపులుంటాయేమోనని చూశాను.ప్చ్! ఆ సమయంలో షాపులు ఎవరు తీస్తారు? నేను ఒంగోలు నుంచి కనిగిరి వెళ్ళి అక్కడ వేరే బస్సు మారి వెలిగండ్ల వెళ్ళాలి. ఈ లోపు చెప్పుల షాపులు కనిగిరిలోనైనా తెరవకపోతారానన్న ఆశ. ఐదున్నరకు ఒంగోలు లో బస్సెక్కి కనిగిరికి ఎనిమిదిన్నరకు చేరాను.దిగిన వెంటనే మా ఊరికి బస్సు నిలబడి వున్నది.మరో ఆలోచన లేకుండా ఆబస్సెక్కి ఊరికి చేరాను. ఇలా బూట్లు వేసుకొని షో చేద్దామన్న నాకు అసలు కాలికి చెప్పులే లేకుండా ఇల్లు చేరాల్సిన పరిస్థితి వచ్చింది :) అలా బూట్లు పోయిన తరువాత మళ్ళీ సాఫ్ట్ వేర్ లోకి వచ్చేతంతవరకూ వాటవసరం పడలేదు. ఆరోజుల నుంచే నాకు సూట్కేసుకు చైన్ తో తాళం వెయ్యడం అలవాటు.

ఉదయం ఆరుగంటలే కావడంతో కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో జనాలందరూ నిద్రిస్తున్నారు. నా బెర్త్ పైన కావడంతో పైకెక్కి నిద్రపోయి పదకొండు గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి కూర్చున్నాను. ఎదురుగా ఒక తెలుగు కుటుంబం. భార్యాభర్తలు వాళ్ళమ్మాయితో కలిసి ప్రయాణిస్తున్నారు.అమ్మాయి M.Sc Chemistry చదువుతుందట. రాజమండ్రి వాళ్ళు.పూనా లో ఉద్యోగం కావడంతో అక్కడే స్థిరపడ్డారు.మరో సమయంలో ఐతే అమ్మాయిమీద మనసు పారేసుకునేవాడినే కానీ అప్పటికే మరొకర్ని చేసుకుందామన్న నిర్ణయం మనసులో వుండటంతో గుండె లయ తప్పకుండా దాని స్థానంలో అది పదిలంగా వున్నది :).

సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో వారి ఆతిధ్యాన్ని స్వీకరిస్తూ గడుపుతున్నాను. ఎందుకో ఆ అమ్మాయి పాదాలవైపు చూశాను. తెల్లగా ఎక్కడా ఒక్క మట్టిమరకైనా లేకుండా మెరుస్తున్నాయి. నా పాదాలవైపు చూసుకున్నాను.ఒక్కసారిగా ఆత్మన్యూనత ఆవహించింది. అప్పటికి నాలుగునెలలపైన ఊర్లో ఉండటంతో, చేలల్లో వరికి దమ్ముచేసే ప్రయత్నాల్లో ఆ బురదలో తిరిగి నా పాదాలపై అక్కడక్కడ మచ్చలు ఏర్పడ్డాయి. నేను వేసుకున్న చెప్పులు వాటిని ఏమాత్రం దాచలేక మధ్యాహ్నపు వెలుగులో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.పూణె కు వెళ్ళగానే ఈ మచ్చలులేకుండా చేసుకోవాలని దృఢసంకల్పం చేసు కున్నాను :)

అందరమూ కొద్ది సేపు అంత్యాక్షరి ఆడుకున్నాము. ఆ రోజుల్లో అంత్యాక్షరి ఒక ట్రెండ్ సెట్టర్. కాలేజీల్లో వీటికి పోటీలు కూడా నిర్వహిస్తుండేవారు. మా టీం ఈ పోటీలో, డమ్ షరాడ్స్ లో ఎప్పుడూ మొదటి బహుమతిని గెలుచుకునేది. దాని వల్ల చాలా పాటలు నాలుకపై ఆడుతుండేవి. గాత్రం కూడా వినటానికి అభ్యంతరం లేకుండా వుండేది. నా పాటలు వారికి నచ్చాయో ఏమో ఒక పాట పాడమని అడిగారు.
అప్పట్లో నాకిష్టమైన పాట, అప్పటికే చాలా సార్లు పాడిన పాట ఎంచుకున్నాను.అల్లుడుగారు సినిమా లోది.

ముద్దబంతి నవ్వులో మూగబాసలు
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలూ
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
మధుమాసమే అవుతుంది అన్నివేళలా
ముద్దబంతి నవ్వులో మూగబాసలు...

అందరూ బాగుందని మెచ్చుకున్నారు. ఆ మెప్పుదల మనసుకు సంతృప్తినిచ్చింది.

పులిహోర,పెరుగన్నం తింటూ గడిపాము.పూనా దరిదాపులకు రాగానే నేను దాచుకున్న అడ్రస్ ను చూపించి రైల్వేస్టేషన్ నుంచి ఎలా వెళ్ళాలి అని ఆ తెలుగు కుటుంబాన్ని అడిగాను. నువ్వేమీ ఇబ్బంది పడకు మేము ఆటో ను మాట్లాడి పంపిస్తామని చెప్పి, మేము కూడా నీవుండే హాష్టల్ కు దగ్గరలోనే వుంటామని వీలు చూసుకుని రమ్మని అడ్రస్ ఇచ్చారు.

పూణె రైల్వే స్టేషన్ లో దిగిన తరువాత వారి సహాయంతో ఆటో లో కోథపేట్ కు నా స్నేహితులిచ్చిన అడ్రసు కు చేరుకున్నాను....

2, మే 2020, శనివారం

జీవిత సోపానాలు - 3

ముఖ్యమైన పుస్తకాలు, వేసుకునే బట్టలు కలిపి ఒక మధ్యస్త వి.ఐ.పి సూట్కేసు నిండుకుంది. ఆరోజుల్లో ఇప్పటిలా అలమరాలనిండా బట్టలు నింపుకొనే సంస్కృతి మా ఇంట్లో లేదు. సంస్కృతి లేదు అనడం కంటే కొనే స్థోమత లేదు అనడం సబబుగా వుంటుంది.మన ఆర్ధిక స్థోమతలను బట్టి సంస్కృతి,సంప్రదాయాలు కూడా మారిపోతుంటాయి.నా బట్టలన్నీ కలుపుకుంటే ఓ ఆరేడు జతలుండేవేమో! ఊర్లోకి బస్సు లేదు కాబట్టి ఓ రెండు కిలోమీటర్ల దూరంలో నున్న రోడ్డు మీదకు వెళ్ళి బస్సు ఎక్కాల్సిందే. ప్రతి రెండు గంటలకు దర్శి నుంచి వినుకొండ పోయే బస్సులుంటాయి.బస్సు వచ్చే ఓ పదినిమిషాల ముందు టిక్కీ వ్యాన్ లు వస్తుంటాయి. బస్సుకోసం వేచి చూస్తున్న జనాలంతా ఈ బస్సెప్పుడొస్తుందోలే అనుకుంటూ ఆ చిన్న వ్యాన్ లో క్రిక్కిరిసి పైన,క్రింద కూర్చొని ప్రయాణిస్తుంటారు.

పుస్తకాలు పెట్టడంతో సూట్కేసు బరువుగా వుంది. మా నాన్న సైకిల్ మీద లగేజీ తీసుకొని నేనూ రోడ్డు దాకా వస్తాననడంతో మా అమ్మను శకునం కోసం ఎదురు రమ్మని, మాఅమ్మకు వీడ్కోలు పలికి నేనూ మా నాన్న సైకిల్ ని నడిపించుకుంటూ, దానితో మేమూ నడుస్తూ మాట్లాడుకుంటూ ఓ అరగంటలో రోడ్డుకు చేరాము. ముందుగా టిక్కీ వచ్చింది.ఎప్పటిలాగే జనాలు క్రిందా మీదా క్రిక్కిరిసి వున్నారు.అందులోనే కాస్త సర్దుకోండమ్మా అంటూ మరో నలుగురు ఎక్కారు. నా దగ్గర లగేజీ వుండటంతో బస్సులో ఎక్కుదామని అందులో ఎక్కే ప్రయత్నం చెయ్యలేదు.

ఓ పదిహేను నిమిషాల నిరీక్షణ తరువాత బస్సు ఖాళీ గా వచ్చింది. మా నాన్నకు వస్తానని చెప్పాను. చేరిన వెంటనే ఉత్తరం వ్రాయమన్నాడు. సరేనని బస్సు ఎక్కి కూర్చున్నాను. కండక్టర్ టికెట్ టికెట్ అని అరవడం కూడా దండగనుకున్నాడో ఏమో వచ్చి సీటు ప్రక్కన నిలబడ్డాడు. వినుకొండ కు ఒక టికెట్ తీసుకుందామని తలెత్తి చూస్తే కండక్టర్ మా హైస్కూల్ లో నాకు రెండేళ్ళ సీనియర్. కాసేపు కబుర్లయ్యాక ఎక్కడికెళుతున్నావు సూట్కేస్ తో అని అడిగాడు. ఉద్యోగ ప్రయత్నానికై పూనా వెళుతున్నానని విషయం వివరించాను. అతని కళ్ళలో ఓ విజయగర్వం. ప్రభుత్వ ఉద్యోగమిచ్చిన సంతృప్తి ఆ కళ్ళలో కనిపించింది. ఓ క్షణం నేను ఇంజనీరింగ్ చేయకుండా ఇలా ఇంటర్మీడియట్ తో చదువును ఆపి ఉద్యోగాలకు ప్రయత్నిస్తే జీవితం వేరే విధంగా వుండేదేమోననిపించింది. అది ఆనాటి నా మనఃస్థితి.

బస్సు నూజెండ్లలో ఆగింది.కొద్ది మంది జనాలు ఎక్కారు.కండక్టర్ వారికి టికెట్స్ ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. సీట్లో ఒంటరిగా వున్న నాకు ఒక్కసారి నిస్సత్తువ ఆవరించింది తల్లిదండ్రులను, చుట్టాలను, ఊరి జనాలను వదిలి దూరంగా వెళుతున్నందుకు.కానీ నాకు ఉద్యోగాలు వుండేది దూరప్రాంతాలలోనే కదా అని సర్దిచెప్పుకున్నాను.ఎన్ని కష్టాలెదురైనా ఈ సారి ఉద్యోగం దొరకనది ఇంటికి వెళ్ళకూడదనుకున్నాను.ఆలోచనలు కలగా పులగంగా మారిపోతున్నాయి.ఓ క్షణం గట్టినిర్ణయం తీసుకున్నట్లే వుంటుంది. మరోక్షణం తెలియని భవిష్యత్తు పై అనిశ్చితి. ఈ ఆలోచనల మధ్య బస్సు వినుకొండను చేరింది.

సాధారణంగా ఈ పల్లె బస్సులు అప్పట్లో ప్రతి ట్రిప్ కు బస్ డిపో కు వెళ్ళేవి కావు.బస్ డిపోకు వెళ్ళకపోతే విజయవాడ వెళ్ళటానికి బస్సులో సీటు దొరుకుతుందో లేదోనన్న సందిగ్ధం. నాలుగైదు గంటలు నిలబడి విజయవాడ వెళ్ళడం కంటే ఓ ఇరవైనిమిషాలు కష్టపడితే డిపోకు చేరుకోవచ్చని కాలికి పని చెప్పాను. వినుకొండ నుంచి విజయవాడకు బస్సుల ఫ్రీక్వెన్సీ బాగానే వుండేది. అటు పడమటి నుంచి విజయవాడకు వెళ్ళే బస్సులన్నీ వినుకొండ ద్వారానే వెళ్ళేవి. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో విజయవాడ బస్సు ఎక్కి కూర్చున్నాను. టికెట్ తీసుకొన్న తరువాత అలసిపోయున్నానేమో బాగా నిద్రపట్టింది. మెలుకువ వచ్చాక చూస్తే చుట్టూ చీకటి.బస్సు ఎక్కడుందో అర్థంకాలేదు.ప్రక్కన సీటులో కూర్చొన్నతను కూడా నిద్రలో జోగుతున్నాడు. కాసేపటికి ఏదో ఊరు వచ్చింది. అపట్లో షాపుల ముందు సైన్ బోర్డులు ఇప్పటిలా షాపు పేరు మాత్రమే వ్రాసే అలవాటులేదు. షాపు ముందు బోర్డు వుందంటే ఆ షాపు పేరు, ప్రక్కన ప్రొప్రైటర్ పేరు, క్రింద ఊరి పేరు వ్రాసే అలవాటు. అలా ఓ శాఖాహార హోటల్ సైన్ బోర్డు చూసి మంగళగిరి వచ్చిందని తెలుసుకున్నాను. మరోగంట లోపు బస్సు విజయవాడ చేరింది.

బస్ డిపో నుంచి రైల్వేస్టేషన్ కు ఓ రిక్షా ఐదురూపాయలకు మాట్లాడుకొని విజయవాడ రైల్వేస్టేషన్ చేరాను. కోణార్క్ ఎక్స్ ప్రెస్ కు ఇంకా చాలా సమయం వుంది. అర్థరాత్రి దాటిన తరువాత కానీ రాదది. సమయం పదకొండు దాటింది. మరో నాలుగు గంటలు రైల్వే స్టేషన్ లోనే గడపాలి. టికెట్ కౌంటర్ కు వెళ్ళాను. ఎప్పటిలానే రిజర్వేషన్ దొరకలేదు.ఐనా సరే టికెట్ కలెక్టర్ ను మేనేజ్ చెయ్యగలనని మొండి ధైర్యం. సూట్కేస్ తో ప్లాట్ ఫాం మీదకు చేరుకొని చుట్టూరూ కలయచూశాను. అప్పటిదాకా జనసందోహ కోలాహలంతో మర్మోగిపోయిన ప్లాట్ ఫాం జనాలు కుర్చీలమీద, కుర్చీలు దొరకని వారు అక్కడే క్రొంద పడుకొని నిద్రకు ఉపక్రమిస్తున్నారు.

నేను బస్సులో ఓ కునుకు తీయడం వల్ల నిద్రాదేవి ఇప్పటిలో నా చెంత చేరేటట్టు కనిపించడంలేదు. విజయా డైరీ పార్లర్ కు వెళ్ళి రెండు మజ్జిగ పేకెట్లు కొనుక్కొని త్రాగాను.ఒక్కొక్కటి రెండు రూపాయలు. నాకు విజయా డైరీలో అమ్మే మజ్జిగ చాలా ఇష్టం. చిక్కగా కారం కారంగా అదో అద్భుతమైన రుచి. భోజనానికి సమయం కాకపోవటంతో ప్లాట్ ఫాం మీద అమ్మే బ్రెడ్/ఆమ్లేట్ ఐదురూపాయలకు తిన్నాను.ఆత్మారాముడు శాంతించాడు. అప్పట్లో రైలు ప్రయాణం చేస్తుంటే వారపత్రికలు కొని చదవటం అలవాటు. ఆ అలవాటు ప్రకారంగా ఆంధ్రభూమి,స్వాతి వార పత్రికలను కొని పేజీలన్నింటిని ఓ సారి ముందునుంచి వెనక్కు త్రిప్పి కథలు రైలెక్కాక చదవొచ్చులెమ్మని అట్టిపెట్టుకున్నాను.

అర్థరాత్రెప్పుడో మాగున్నుగా నిద్రపట్టింది. రైలు తప్పిపోతుందన్న భయమో ఎమో కానీ మధ్య మధ్యలో రైల్వే అనౌన్స్మెంట్స్  స్పష్టంగా వినిపిస్తున్నాయి. అలా జోగుతూ సమయం గడుస్తుండగానే కోణార్క్ రైలు వచ్చి ఆగింది. ధైర్యంచేసి రిజర్వేషన్ బోగీలో ఎక్కి సూట్కేసు ను క్రింద పెట్టి దానిమీద నేను కూర్చున్నాను. తెలతెలవారుతుండగా టికెట్ కలెక్టర్ వచ్చాడు.......