14, జనవరి 2009, బుధవారం

చిరుస్పందన నుంచి హారం.కామ్ దాకా...

టపా వ్రాసి చాలా రోజులైంది. గత నెలంతా ఎప్పటికప్పుడు వాయిదాల మీద వాయిదాలేస్తూ కాలం గడిపేశాను. డిసెంబర్ లో ఒకానొక రోజు దేవుడు కలలో కనిపించి, భక్తా ఇలా నువ్వు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఎప్పుడో తాతల కాలము నాటి టెక్నాలజి పట్టుకొని ఊగులాడితే వెన్నుముక విరిగి ఎందుకూ పనికి రాకుండా పోతావు ! కొంచెం కళ్ళు తెరచి చూడు, నీ చుట్టూ అందరూ ఎలా వెలిగి పోతున్నరో ! మరి నువ్వో ? ...... చూశావా ? వాళ్ళు మాట్లాడే మాటలు ఒక్కటన్నా గతం లో విన్నావా ? ఇలా అయితే దేవుడినైన నేను కూడా నిన్న ర॒క్షించలేను.తరువాత నీ ఇష్టం.

దెబ్బకు మెలుకువ వచ్చింది. ఏం చేద్దాం? ......... ఏం చేద్దాం? .......... ఏదో ఒకటి చెయ్యలి. 2008 కి ఒక మంచి పని తో సాగనంపి 2009 ని ఒక మంచి పని తో ఆహ్వానించాలి.
మళ్ళీ ఆలోచనలు మొదటికి....... ఇంత వరకు నేను చేయని పని......నాకు కొత్తగా ఉండాలి........పది మందికి ఉపయోగ పడేలా ఉండాలి.

టెక్నాలజి పుస్తకము చదివి సంవత్సరాలైంది. పుస్తకము తెరిస్తే నిద్ర. ఇలా లాభం లేదనుకొని టపా వ్రాయడం మొదలు పెట్టాను. 2 వాక్యాలు రాసి , ౩ వ వాక్యం రాస్తుంటే వీపు విమానం మోత మోగింది. తిరిగి చూస్తే ఈసారి దేవుడు చింత మెల్లెతో నిలబడి వున్నాడు.

కోపమొచ్చింది. నువ్వెవడివి నన్ను కొట్టడానికి ?
నీ అంతరాత్మ ను , నీ ఇష్ట దైవాన్ని.....నీ మంచి కోరే వాడిని..... నీ స్వధర్మాన్ని విస్మరిస్తే చూసి వుండలేక చేయి చేసుకున్నా.....

మళ్ళీ అలోచిస్తుంటే, ఏంటో అంత దీర్ఘాలోచన? అని అడిగాడు.
అదికాదు ... నువ్వు చెప్పేది నా మంచికే అని అనిపిస్తుంది కానీ....

కానీ?

అది, అది, పుస్తకము ముట్టుకుంటే నిద్..............ర.. వస్తుంది.
తెలుగు పుస్తకాలైతే రాత్రంతా మేల్కొని మరీ చదువుతావు కదా?
అదంటే...నాకు ఇష్టమైన పని. మరి ఇదేమో కష్టమైన పని...

ఇలా కాదు కానీ ఎలాగూ బ్లాగుతున్నావు కదా ! అది నీకు ఇష్టమైన పనే కదా ? మరి టెక్నాలజీ నేర్చుకుంటూ నువ్వే ఒక ఙ్ఞాన హారాన్ని తయారు చేయి అని హితబోధ చేసి, ఇక వస్తా టైం అయింది అని లేచాడు.

ఎక్కడికి ఇంత త్వరగా అని అడిగా ?

నాకు నీలాంటి వాళ్ళు కోకొల్లలు. నీ దగ్గరే వుంటే ఎలా ? అదీ కాక అలివేలు మంగ లేచే వేళయింది. ప్రక్కన నేను లేకపొతే .... ఇంకేమైనా వుందా? రాత్రికి బీబీ నాంచారి ఇంటికి వెళ్ళానని నాష్టా ( టిఫిన్) పెట్టకపోతే ? అమ్మో అసలే ఈ రోజు నాకిష్టమైన ఇడ్లీ చేస్తానంది. మిమ్మలని బాగు ( బ్లాగు) చేయాలని నేను ఇరుక్కునేట్టు వున్నాను..అని మాయమైనాడు.

డిసెంబర్ 20, 2008 , హారం... ఙ్ఞాన హారం.................విఙ్ఞాన హారం అంకురార్పణ.
జనవరి 14,2009 , మకర సంక్రాంతి.... సంక్రాంతి శుభాకాంక్షలతో www.haaram.com

ఈ మధ్య రోజులు చిత్రాతి చిత్రాలు...ఉదయము 8 నుండి రాత్రి 8 దాకా ఆఫీస్ లో తీరిక లేని పని. రాత్రి 9 నుండి అమెరికా కోడి కూసే దాకా www.haaram.com

ఆ వివరాలు, తదుపరి టపాలో.......అంటే వెదుకు యంత్రము ( search engine ), హెచ్.టి.యం.యల్ విభాగిని ( HTML parser ), విశ్లేషిణి ( categorization engine) లాంటి వివరాలు.

అప్పటిదాకా గారెలు,బూరెలు,పులిహోరా, గుమ్మడికాయ కూర, సొజ్జ రొట్టె .......చాలా చాలా తినాలి......మీరూ తినండి....మా ఇంటికి వచ్చినా సరే !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Comment Form