15, జనవరి 2010, శుక్రవారం

పుట్టినరోజు జేజేలు నా చిట్టిపాపకు....
హారం మొదటిపుట్టిన రోజు పండుగ ఈ రోజు. ఈ సందర్భంగా ఆనాటిజ్ఙాపకాల మంచుతెర ఒక్కసారిగా మనసును కమ్మేసింది. అప్పట్లో అంటే పోయిన సంవత్సరం సంక్రాంతి కి దాపుదాపుగా ఒక నెలముందు అమెరికా ధనుర్మాసపు చలిలో ఓ రాత్రి కిటికీలోనుంచి ధారలాగా జాలువారే చంద్రకిరణాలను చూస్తూ అలా ప్రపంచాన్ని మరిచి మావూరి పొలిమేరలలో ఆడుకొంటున్నాను. అంతకు ముందు ఓ వారం క్రితమే హారం డెవలప్మెంట్ మొదలు పెట్టి వున్నాను. అసలు ఎందుకు మొదలెట్టానో ఇక్కడ చదవవచ్చు. ఇక ఆరోజు నేను చిన్ననాడు ఆడుకున్న మా ఊరి అంకాలమ్మ బీటి సాక్షిగా కోడ్ వ్రాయడం ఒక ఎత్తైతే దాన్ని హోస్ట్ చేయాలని ఎక్కడ ఎవరు ఫ్రీగా ఇస్తున్నారా అని వెదకడం మొదలెట్టా. అప్పటిదాకా పేద్ద పేద్ద అప్లికేషన్స్ మా స్వంత సర్వర్ లో హోస్ట్ చేయడమే తెలుసుకానీ ఇలా బయట సర్వర్ ను వెతుక్కోవడం అదే ప్రధమం. సరే క్రొత్త సంవత్స్రరానికల్లా హోస్ట్ చేద్దామని సర్వర్ స్పేస్ అయితే కొనేసాను. డెవలప్ మెంట్ అలా అలా అయిందనిపించి అత్యంత వుత్సాహంగా సర్వర్ కి కనక్ట్ అయితే ఒక్కటి సరిగా యాక్ససబిలిటీ లేదే! ఎప్పటికప్పుడు బ్లాగర్లు వ్రాసే పోస్ట్స్ అప్ డేట్ చేయడానికి ఒక సర్వీస్ వ్రాసుకున్నా. మరి దాన్ని రన్ చేయాలంటే వాడేమో పూర్తి సర్వర్ యాక్ససబిలిటీ [ బహుశా వెర్చువల్ సర్వర్ అయివుంటుంది ] కావాలంటే నెలకు వంద డాలర్లు కట్టమన్నాడు. ఓ యబ్బో సానా కథవుందే అనుకొని ఏలా, ఎలా, ఎలా అనుకుంటున్న రోజులవి. ఆ చంద్రకిరణాల వెలుగులో నాకో వెలుగు వెలిగింది. అంతే మరో రెండు వారాలకల్లా లైవ్ అయింది. పీత కష్టాలు పీతవని అవన్నీ చెప్పుకుంటే తీరేవి కాదులే :-)

ఇక ఈ సంవత్సరం రోజుల్లో చిన్న చిన్నగా మొదలైన హారం ఓ సంతృప్తికర స్థాయికి వచ్చిందనే చెప్పుకోవాలి. తొలినాళ్ళలో హారంలో సినిమా లింకుల ఫీడు, వార్తలు ఫీడు కూడా వుండేది. కానీ అవన్నీ ఎందుకో పెద్ద నాయిస్ లా అనిపించి తొలగించాను. అంతే అప్పటిదాకా వస్తున్న హిట్స్ దరిదాపు సగానికి సగం పడిపోయాయి. ఫైన్ ! అనుకొని, కొన్నాళ్ళు అలాగే వుంచేసాను. తరువాత యూజర్ ఇంటర్ ఫేస్ మార్చే దాకా హారానికి పెద్దగా హిట్స్ లేవు. సైన్యం మిత్రులు [ మలక్ పేట్ రౌడి, శరత్, ఫణిప్రదీప్, యోగి] సూచన మేరకు సరికొత్త ఫంక్షనాలిటీ తో పాటుగా జూలై లో యూజర్ ఇంటర్ ఫేస్ మార్చిన తరువాత యూజర్స్ రావడం మొదలైంది. అలా అలా దినదినాభివృద్ధి చెందుతూనే వుంది. శని ఆది వారల్లో మాత్రం అభివృద్ధి కుంటు పడుతుంది.కారణం బహుశా బ్లాగురు లందరూ సెలవు దినాల్లో తీరికలేని పనుల్లో బిజీ ఏమో ;). నాలాగా ఆఫీస్ వున్న రోజులు ఫ్రీ అనుకుంటా :-) .

ఇదిగో ఇప్పటి వరకు వచ్చిన హిట్స్ లిస్టు. ఈ సంక్రాంతి రోజుదాకా[ మాకు అమెరికాలో ఈ రోజే సంక్రాంతి ] సుమారుగా ఆరులక్షల ఇరవైరెమ్డు వేల హిట్లు వచ్చాయి.

హిట్లు ప్రక్కన పెట్టి రెండవ సంవత్సరంలోనికి అడుగిడుతున్న సందర్భంగా మరింత మెరుగైన సేవలను అందించడానికి సిద్ధమౌతుంది.

ఇందులో నున్న వివరాలు కొన్ని

1) హారం మొదటి పేజీలో రెండు రోజుల వ్యాఖ్యలను చూపించడం జరుగుతుంది

2)పేరులేని టపాలకు హారం ఒక పేరు పెడుతుంది. దానిపేరు అనామిక (హారం)

3) హారం లో ఎడమవైపు ఆ రెండురోజులలో ఎవరెన్ని టపాలు లేదా వ్యాఖ్యలు వ్రాసారు అన్న లిస్టు బ్లాగరుల పేర్లతో వుంటుంది. ఆ పేరు మీద క్లిక్ చేసినట్లైతే వారు వ్రాసిన అన్ని టపాలను లేదా వ్యాఖ్యలను చూపిస్తుంది.

4) రెండు రోజులలో మీరు ఎన్ని టపాలు వ్రాసినా హారం ౧౦ మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ మరో విషయం. మీరు పది టపాలను హారం బ్యాచ్ జాబ్ రన్ అయ్యే టప్పటికి వ్రాసేసారు అనుకోండి. అంటే దరిదాపు ఒక గంటలో మీరు పది టపాలు వ్రాస్తే !!!!, హారం ఒక్క టపా కూడా సూచించదు. మరో రకంగా రెండురోజుల్లో మీ పది టపాలు హారంలో కనిపించాలంటే టపాకు టపాకు వ్యవధి కనీసం ఒక్కగంట వుండాలి. లేదా మొదటి గంటలో ౮ వ్రాసి రెండవగంటలో మరో ఐదు వ్రాస్తే, మీరు రెండవ సారి గంటలోపల వ్రాసిన ఐదిటిలో కనిపించాల్సిన రెండుకూడా కనిపించవు. చాలా మందికి ఈ రూల్ నచ్చకపోవచ్చు. కానీ హారం మొదటిపేజీని సుందరంగా వుంచాలంటే ఇంతకంటే నాకు వేరేదారి కనిపించలేదు.

5) ఈనాటి హారంలో ఆ రోజు వ్రాసిన అన్ని టపాలను చూపిస్తుంది

6) ఖజానా: ఇది టపాల ఆర్కైవ్ లాంటిది. ఇందులో మీఅన్ని టపాలతో పాటి మీ టపాలలో చిత్రాలు వున్నట్ట్టయితే అందులోనుంచి ఒక చిత్రాన్ని కూడా చూపిస్తుంది.

7) వ్యాఖ్యల పేజీ లో వ్యాఖ్యలతో పాటి రచయిత చేసిన అన్నివ్యాఖ్యలను పొందుపరచడమైనది.

8) మన బ్లాగరులు రోజుకు ఎన్ని టపాలు వ్రాస్తున్నారు, ఎన్ని వ్యాఖ్యలను వ్రాస్తున్నారో గ్రాఫు పేజీలో చూడవచ్చు.

9) పుస్తకహారం లో అరుదైన పుస్తకాలను పొందుపరచాలని కోరిక

10) హారంలో సభ్యులవ్వాలంటే ఈ లింకు ను క్లిక్ చేయండి

11) మీకు హారం నచ్చినట్టయితే హారం లోగోను ప్రచారం పేజీ నుంచి మీ బ్లాగులో కలపండి

12) మాగురించి ఈ సోది . ఇందులో ప్రస్తుతానికి అన్నీ హారం వారే :)

13) ఇక పి.డి.యఫ్ : డిసెంబర్ నెల పిడియఫ్ ప్రాసెస్ అవ్వలేదు. జనవరిచివరకో లేక ఫిబ్రవరిలోనో ౨౦౦౯ లో వారువ్రాసుకున్న టపాలనన్నింటిని పిడియఫ్ రూపంలో ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇది ఆటోమాటేడ్ గా జరగాల్సిన ప్రక్రియ కానీ టపాల సంఖ్య ఎక్కువై పిడియఫ్ పేజీలు ఎక్కువయ్యే కొద్దీ ప్రాసెస్ టైమౌట్ అవుతుంది. కాబట్టి రోజుకు ౧౦ బ్లాగ్స్ కంటే ఎక్కువ చేయలేకపోతుంది. కాబట్టి ఈ నెలంతా పట్టవచ్చు.

14) సంధిప్రక్రియను ప్రయోగాత్మకంగా మొదలెట్టాను. ఈ జూన్ లోపల పూర్తి చేయాలని ప్రయత్నం

15) అలాగే సంధిపేజీలో చాలామంది ఇంగ్లీష్ లో టైపు చేస్తున్నారు. అలా చేయకుండా తెలుగులో టైపుచేయడానికి ప్రస్తుతానికి ఓ టైపు ఉపకరణి క్రొత్తగా జత చేసాను. కాల క్రమేణా దీన్ని తెలుగు టెక్ష్ట్ బాక్స్ క్రింద రూపుదిద్దాలని ఈ ప్రయత్నం.

అబ్బా రాసి రాసి విసుగొస్తుంది. నా బిడ్డ తొలి పుట్టినరోజుకు ఈ మాత్రమన్నా వ్రాయకపోతే బాగుండదని అలా అలా కెలికాను. ఇక మిగిలినవి మీరే వెళ్ళి సోధించండి.

అన్నట్టు మీ అభిప్రాయాలు చెప్పాలంటే ఇక్కడ చెప్పండి. ఈ పోస్టుమీదకాదండోయ్ ;)... హారం మీద.