13, జనవరి 2010, బుధవారం

ఒక అంతరంగం

ఆటపాటల చిఱుధరహాసమున
తల్లిఒడిన తనమోము చూసి
విహరింతు పదునాల్గులోకములు
ఆది సంతును నేను అమ్మ నాన్నలకు
ఆదిలక్షిని నేను తల్లిదండ్రులకు.

అష్టదళ పద్మాసన పుత్రికను
సకల భోగభాగ్యవిరాజితను
ఇంటిముంగిటి ముద్దుబిడ్డను
పద్మామృతఫలశంఖకలశ ధారిని
గజలక్ష్మిని నేను నా గృహమునందు.

పొంగిపొరలిన పాడిపంటలు
మూడుకారుల మూడుపంటలు
ఎల్లప్రొద్దుల మంగళశోభితను
ధనధాన్యాల దానధర్మాల ధరాపుత్రిని
ధాన్యలక్ష్మిని నేను అమ్మవారింట


సకల విద్యల కళామతిని
విద్యార్జిత జ్ఞానవికసిని
మంజుల భాషిత భూషితను
సద్గుణసన్మార్గ సుచరితా రచయిత్రిని
విద్యాలక్ష్మిని నేను కన్నవారింట.

ధైర్యసాహసముల తేజోమయిని
ఉద్యమగీతికల ఊపిరిని
అన్నార్తుల అక్షయపాత్రను
బడుగుల గుండెలో భువనపూజితను
ధైర్యలక్ష్మిని నేను మాపుట్టినింట.


బంగరు చీరకట్టి నుదుట నవరత్నాల్బొదిగి
కాంతులీను కంఠహారమున్దొడిగి
సిగ్గుబుగ్గల బుగ్గచుక్కన
బంధుజనము వెంటనడువగాను
తల్లిదండ్రులు బోయలై మొయ్యగ
వయసు ఒడిలో వాలిపోతిని
మగని కౌగిల కరిగిపోతిని

ఆశల పల్లకిలో అత్తమామలు
ఆకలిచూపుల ఆడుబిడ్డలు
అమ్మప్రేమలో మూగబోయిన మగడు
చూపరులకు ముచ్చటైన దంపతులం
ధనలక్ష్మిని నేను అత్తవారింట.

పండిన కడుపున పుట్టెడు దుఃఖము
కన్నుల చాటున కరిగిన కాటుక
మనసున దాగిన మాతృత్వపాశము
వింతగ బ్రతికితి బిడ్డలకొరకు
సంతానలక్ష్మిని నేను ఈ నవసమాజానికి

కడుపు పండిననాడె తెలిసె నా కలలు కల్లలని
అమ్మనాన్నల మాటకై అమ్ముడుబోయె నాస్వరం
గొంతులోన కరిగిపోయే పుట్టెడు దుఃఖము

జీవనరంగస్థలి వేదికపైన నర్తించి నర్తించి
సతీ అనసూయనవ్వనా
గడపదాటి విశ్వవిహంగ గీతికలాలపించి
భరత భూమి పరువు తియ్యనా

గడపగడపనెక్కి నా గళమును వినిపించనా
గరళ కంఠుని పడతినై గతించిపోనా

అలతి పెదవుల మ్రోగిన పదమునై
అలుపు సలుపు లేక ప్రతిధ్వనించనా

ప్రేమానురాగాలు ధనారాగమైన ఇంట
అతిధినై చేరి అమ్మసాయమందించనా

మూగపోయిన కొమ్మవాకిట వెలుగునునేనై
ప్రియుని చూపించనా నడిరేయి నడిపించనా

మనసులేని ఇంట నా కాంత ప్రణయ పదమై
రస సౌధముల ప్రణయరాగము పరిమళించనా

బ్రతుకు కాఱడవిలో మమత మరచిన ఇంట
తెలిమంచు కిరణమై సువర్ణ తాపడమద్దనా

పుడమిలో పుత్తడి బొమ్మమదిలో
పెనుకాంతినై కడవరకు తోడుండనా

కల్లోల మనసుకు మమతతాయత్తునిచ్చి
పుడమి పూసిన పూవుకు పుప్పొడినద్దనా

చీకటి బ్రతుకుల చేజారు చిన్నారికి
అమ్మనై చిరుదివ్వెనై దారి చూపనా

విశ్వకాంత కడుపున చిరుబీజమై వొదిగి
పుడమి అణువణువున చైతన్యగీతిక నింపనా

కుమిలి యేడ్చెడి కుముదిని ఎద సవ్వడినేనై
కరుణఘట్టము ఇలాతలాన రచింపనా

మరుజన్మ నైన మరోలోకమునైన
కాలుతున్న గుండెల మంటల మలచి
ప్రభాత గీతికల జీవన గతిని మార్చి
సెలయేటిధారనై శిలలగుండెల తడిపి
ఎడారిసీమలో సుజల గంగనై
మండు చితి మంటల నార్పగ
మరుజన్మ కోరుతి మరణశయ్యపై
జన్మరాహిత్య పుణ్య కార్యాచరణచేయ
భరత నారి నోట విజయలక్ష్మిగ పూజలందుకొనగ.