19, జనవరి 2013, శనివారం

ఇదే నిజమైతే ముఖ్యమంత్రి గా కిరణ్ కుమార్ రెడ్డి తను చేయాల్సిన పని చేస్తున్నట్లే....

ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం తన మాటను పెడచెవిన పెట్టినట్లైతే తన హయాంలో రాష్ట్ర విభజన జరిగిందన్న పేరును తెచ్చుకోకుండా తన దారి తను చూసుకోవడం కూడా మంచిదేనేమో !

ఈ వార్త ఆంధ్రభూమి నుంచి తీసుకోవడం జరిగింది.



విభజనతో ఉత్పాతమే!


పార్టీకి కొత్త తలపోట్లు తప్పవంటూ సూచన సమైక్యాంధ్రే కొనసాగించాలంటూ విజ్ఞప్తి
నివేదికను జైపూర్‌లోనే హైకమాండ్‌కు అందించాలని నిర్ణయం
సర్కారుకు ఢోకాలేదని భరోసా ఇచ్చే యత్నం అధిష్ఠానానికి స్పీడ్ పోస్ట్‌లో ‘సీమాంధ్ర’ నివేదిక

హైదరాబాద్, జనవరి 18: తెలంగాణ ఏర్పాటు విషయంలో హైకమాండ్ రకరకాల ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలోనూ రాష్ట్రం విడిపోకుండా చూడాలన్న పట్టుదలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన పక్షంలో తలెత్తే పరిణామాలు, ఎదురయ్యే సమస్యలతో ముఖ్యమంత్రి ఒక సుదీర్ఘ నివేదికను స్వయంగా రూపొందించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ‘విభజన జరిగితే ఉత్పన్నమయ్యే సమస్యలు’ అన్న పేరిట నివేదికను ముఖ్యమంత్రి రూపొందించినట్టు సమాచారం. జైపూర్‌లో మూడురోజుల పాటు జరిగే చింతన్ శిబిర్‌లో పాల్గొనేందుకు గురువారం రాత్రి బయలుదేరిన ముఖ్యమంత్రి తనవెంట నివేదికనూ తీసుకువెళ్ళినట్టు చెప్తున్నారు. వాస్తవానికి ఇంతకుముందే ముఖ్యమంత్రి ఒక నోట్‌ను కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేకు అందజేసినట్టు తెలిసింది. దానే్న మరింత వివరంగా మరో నివేదికగా రూపొందించి వెంట తీసుకువెళ్ళినట్టు తెలుస్తోంది.
జైపూర్‌లో జరుగుతున్న చింతక్ శిబిర్‌లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సహా ఇతర పెద్దలంతా అందుబాటులో ఉంటారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని కోర్ కమిటీ సభ్యుల్ని వీలునుబట్టి కలుసి రాష్ట్ర విభజన విషయంలో తన అభిప్రాయాన్ని వివరించి నివేదిక ప్రతిని అందజేయాలని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రం, రాయల తెలంగాణ, కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ వంటి ప్రతిపాదనలన్నిటినీ ముఖ్యమంత్రి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర విభజన వల్ల అనేక కొత్త సమస్యలు తలెత్తుతాయని, ఇప్పుడున్న దానికన్నా సమస్య మరింత జటిలమవుతుందని తన నివేదికలో ముఖ్యమంత్రి పేర్కొన్నట్టు తెలిసింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసిన పక్షంలో సీమాంధ్ర ప్రాంతంలో జల వనరులు, విద్యుత్, పరిశ్రమలతోపాటు ఉద్యోగాల విషయంలోనూ సమస్యలు తలెత్తుతాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా రాజధాని ఏర్పాటు అన్నది పరిష్కారం లభించని సమస్యగా మారుతుందని భావిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసే పక్షంలో తమకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని రాయలసీమ ప్రాంతం వారు, ఉత్తరాంధ్ర ప్రాంతం వారు డిమాండ్ చేస్తున్నారని, ఈ పరిస్థితిలో విభజన జరిగిన పక్షంలో ఆ రెండు ప్రాంతాల్లో ఆందోళనలు ఉధృతం కావచ్చునని అభిప్రాయపడుతున్నారు. విభజన అంటూ జరిగితే కొత్త రాష్ట్రాల డిమాండ్ కేవలం సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకే పరిమితం కాదని, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఇటువంటి డిమాండ్లు పుట్టుకొస్తాయని, కాంగ్రెస్ నాయకత్వానికి ఇది పెద్ద తలనొప్పిగా పరిణమిస్తుందని ఆయన భావిస్తున్నారు.
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయకపోయినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అస్థిరత్వం పాలవుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేకుండా తాను చూసుకోగలనని అధిష్ఠానానికి ఇవ్వాలనుకుంటున్న నివేదికలో ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేసినట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోయినట్లయితే ముగ్గురు నలుగురు ఎంపీలు, ఐదారుగురు ఎమ్మెల్యేలు మాత్రమే తెరాసలోకి వెళ్లే అవకాశం ఉందని, ప్రభుత్వం పడిపోకుండా కాపాడుకునేందుకు అవసరమైన ఎమ్మెల్యేలను ఇతర పార్టీల నుంచి తాను సమీకరించగలనని హైకమాండ్‌కు ముఖ్యమంత్రి హామీ ఇవ్వనున్నట్టు తెలిసింది.
జైపూర్ సదస్సులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీని విడిగా కలుసుకునేందుకు అవకాశం లభిస్తే రాష్ట్ర విభజన విషయంలో తన అభిప్రాయాన్ని వివరించడంతోపాటు నివేదికలను అందజేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నారు. ఒకరోజు పర్యటన నిమిత్తం గురువారం నగరానికి వచ్చిన రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విడిగా కలిసి రాష్ట్ర విభజన విషయంలో తన అభిప్రాయాలను వివరించినట్టు తెలిసింది. రాష్ట్ర విభజన విషయంలో సోనియా, రాహుల్, ప్రణబ్‌లదే కీలక పాత్ర కానుంది.
స్పీడ్ పోస్ట్‌లో సీమాంధ్ర ప్రజాప్రతినిధుల నివేదిక
ఇలాఉండగా, గురువారం ఇక్కడ సమావేశమైన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఎట్టి పరిస్థితిలోనూ రాష్ట్రాన్ని విభజించరాదని, సమైక్యాంధ్రనే కొనసాగించాలని, దీనికి మరో ప్రత్యామ్నాయం ఏదీలేదని తీర్మానించిన విషయం తెలిసిందే. సమావేశంలో చేసిన తీర్మానంతోపాటు ఒక నివేదికను కూడా హైకమాండ్‌కు ఇవ్వాలని నిర్ణయించారు. సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి ఒక నివేదికను రూపొందించారు. నివేదికలో పలు చారిత్రిక అంశాలను ప్రస్తావించినట్టు తెలిసింది. ఈ నివేదికే సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఏకాభిప్రాయంగా అధిష్ఠానవర్గానికి పంపించాలని నిర్ణయించారు. ఈ నివేదికను సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్, మంత్రి ఎస్ శైలజానాథ్‌కు గాదె అందించారు. ఈ నివేదిక ప్రతిని స్పీడ్ పోస్ట్‌లో అధిష్ఠానవర్గానికి శైలజానాథ్ పంపించారు. ఈనెల 21న ఢిల్లీకి వెళ్తున్న సమయంలో నివేదిక ప్రతులను వెంటబెట్టుకుని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, కోర్ కమిటీ సభ్యులకు నేరుగా అందజేయాలని అనుకుంటున్నట్టు తెలిసింది.

1 కామెంట్‌:

  1. కడుపులో కాలుతున్నవాడు నిరంతరం అరుస్తనే ఉంటడు.
    కడుపులో చల్ల కదలకుండ నిండుతున్నవాడు అవసరానికి గట్టిగా అరచి కరుస్తడు.
    ఏం ఫరవా లేదు రెడ్డి గారు!
    దశాబ్దాల పాటు ఘర్షణలు ఇట్లగే కొనసాగి ఈ కుహనా సమైక్య రాష్ట్రం విభజనకు పూర్వం బీహార్ రాష్ట్రం కంటె అద్వానమైపోతది.
    అప్పుడు అన్ని ప్రాంతాలవారు సమానంగ దరిద్రులయితరు.
    అదోరకం "సోషలిజం" - కానీండీ.

    రిప్లయితొలగించండి

Comment Form