14, మార్చి 2009, శనివారం
గజిబిజి జిగిబిగి - కవిత
కనులు మూస్తే కవితా తరంగాలు
కనులు తెరిస్తే కదన రాబందులు
రెప్పల చాటున చరించే కలలైనా
పెదవుల మాటున మసలే భావాలైనా
కలైనా, భావనైనా, కదిలే ఆలోచనైనా
భాషలేని భావాలకందని నిత్య దృశ్యాలు
గుండెల మాటున గునపమైనా
మనస్సు లోపలి మలినమైనా
భాషరాని మూగజీవి రోదనైనా
భాషలేని భావాలకందని నిత్య దృశ్యాలు
కళాకారుని కుంచెల రంగులైనా
కృతి కర్త ఘంటపు వెలుగులైనా
గాయకుని గాత్ర మాధుర్యమైనా
భాషలేని భావాలకందని నిత్య దృశ్యాలు
పసిపాప పసిడి నవ్వులైనా
తల్లిప్రేమ లోతులైనా
పండువెన్నెల కాంతులైనా
భాషలేని భావాలకందని నిత్య దృశ్యాలు
కనులు మూస్తే కవితా తరంగాలు
కనులు తెరిస్తే కదన రాబందులు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
బాగుందండి.. 'పాటకారుని' బదులు 'గాయకుని' అనొచ్చా..?
రిప్లయితొలగించండిఎందుకనగూడదూ, శుభ్రంగా అనవచ్చు. దీని చరిత్ర చెప్తా వినండి. నిన్న రాత్రి బరహా లో ఈ కవిత టైపు చేస్తూ ముందు ఇలా వ్రాసుకున్నా
రిప్లయితొలగించండిచిత్రలేఖుని కుంచెల రంగులైనా
కావ్య కర్త ఘంటపు వెలుగులైనా
కళాకారుని గాత్ర మాధుర్యమైనా
భాషలేని భావాలకందని నిత్య దృశ్యాలు
తరువాత ’చిత్రలేఖుని’ అంటే పరిధి తగ్గిందనిపించి కళాకారుని గా మార్చాను. మరి ’కళాకారుని గాత్ర మాధుర్యమైనా’ లో పదము కావాల కదా...
ఇదిగో అక్కడే పదాల కొరత రెసిషన్ లాగా వచ్చి ఎదో రాశాను. ఒక్కోసారి అంతే చిన్న పదమైనా సమయానికి గుర్తు రావు.
ఇలాంటి దే ఇంకో వాక్యం
’ తల్లిప్రేమ లోతులైనా ’
ఇక్కడా ఏదో పదము లోపించింది.
ఏమైనా మీ సవరణకి ధన్యవాదాలు.
అయ్యా భాస్కర రామి రెడ్డి గారు-
రిప్లయితొలగించండిచాలా కృతజ్ఞతలు! మీరు పంపించిన చిన్ని లంకె నిజం గా చాలా ఉపయోగకరం గా ఉన్నది! నెనర్లు! కాని ఈ లంకె ద్వారా తపాలు మాత్రమే ఫీడు గా వస్తోంది! బ్లాగ్బంధువులు వ్రాసిన వ్యాఖ్యలతో సహా రావాలి అంతే ఎమి చెయ్యలి?
ధన్వ్యవాదములతో
జిలేబి.
http://www.varudhini.tk
వరూధిని గారు, ఇక్కడ మీ వ్యాఖ్య చూసుకోలేదండి.. నాకు తెలిసిన పద్ధతి మీ బ్లాగులో చెప్పాను. గమనించ గలరు.
రిప్లయితొలగించండిఏంటో "వరూధిని" అని కూడలి వ్యాఖ్యలలో చూసి నేను ఇక్కడ వ్యాఖ్య ఏం వ్రాసానబ్బా అనుకుంటూ వచ్చాను, వచ్చాక తెలిసింది అది జిలేబి గారికి ఇచ్చిన సమాధానం అని.
రిప్లయితొలగించండిభాస్కరరామిరెడ్డి గారు, జిలేబి గారి బ్లాగు పేరు మాత్రమే వరూధిని, తనని జిలేబి అని సంబోధిస్తే సరిపోతుందేమో ఈ అయోమయం లేకుండా!
భాస్కర రామి రెడ్డి గారు.. మీరు లోపించిందన్న చోట ఇది సరి చేసుకోండి..
రిప్లయితొలగించండిబోసి పాపడి నవ్వులైనా
అమ్మ ప్రేమన లోతులైనా
పండు వెన్నెల కాంతులైనా
భాషలేని భావాలకందని నిత్య దృశ్యాలు
చాలా బాగుంది మీ కవిత..అభినందనలు.
ఆత్రేయ గారు సరిగ్గా సరిపోయింది.చదివి మెచ్చుకోలుతో పాటి సవరణ చేసినందుకు ధన్యవాదాలు.మీ టపాలన్నీ ఒకరోజు తీరిగ్గా కూర్చొని చదవాలనుకుంటే మీ ఆలోచనల వేగంతో నా పెదవులు కదలనంటున్నాయి.
రిప్లయితొలగించండిఓ !!! మనకు ఇంకో వరూధిని వుందని ఇప్పుడే తెలిసింది. మీ సిరిసిరిమువ్వలు చదివానుకానీ, వరూధిని పేరు గమనించలేదు.ఇకనుంచి జిలేబి , జిలేబే.. వరూధిని వరూధినే.. no confusion..
రిప్లయితొలగించండిఇంతకీ మీరు మొల్లగారి మువ్వలా లేక వరూధిని పద రవళి లా?