15, ఆగస్టు 2012, బుధవారం

స్వరాజ్యం - స్వాతంత్ర్యం - సురాజ్యం



భారత దేశ చరిత్రలో 1947 ఆగష్టు 15 వతేది సంవత్సరానికొక్క రోజైనా సంస్మరణీయ దినం. పల్లె టూళ్ళలో ప్రభుత్వపాఠశాలలు దివ్యంగా వెలుగుతున్న రోజుల్లో పిల్లలైతే ఆరోజు కోసం ముందుగా ఓ పది రోజులనుండే స్కూలు గోడలకు సున్నము వేయించడం దగ్గరనుండి, ప్రతిక్లాసులో రంగు కాగితాలనంటించడం, వక్తృత్వ పోటీలకు సన్నద్ధులవడము, స్వాతంత్ర్య దినోత్సవం రోజు మాట్లాడడానికి ముందుగా రిహార్సల్స్ చేసుకోవడం లాంటి తీరిక లేని పనులతో గడిపేవారు. అమ్మాయిలైతే ప్రతిరోజూ ఆలపించే "మాతెలుగు తల్లికి" పాటతోపాటు హిందీ గీతమైన "ఝండా ఊంఛా రహే హమారా" లతో కుస్తీ పట్టడం కూడా జరుగుతుండేవి. హిందీ, ఇంగ్లీషు అయ్యవార్లైతే క్లాసులో ఒక మంచి చురుకైన విద్యార్థినెన్నుకొని హిందీ, ఇంగ్లీషుల్లో స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగాన్ని కంఠతా పెట్టించి వారిచేత ఆరోజు ప్రసంగించే ఏర్పాట్లు చేసేవారు. ఆ ప్రసంగాన్ని విని తృప్తిగా విద్యార్థిని ఆశీర్వదించేవాళ్ళు కూడా! ఇదంతా ఒక ఎత్తైతే Physical Education  Period మరో ఆనందకరమైన సన్ని వేశం. సావ్ ధాన్, విశ్రమ్ లతో కొద్దిపాటి కవాతును చేయడానికి పిల్లలకు తర్ఫీదును కూడా ఇచ్చేవాళ్ళు. ముఖ్యంగా C.P.L ( class pupil leader ), S.P.L ( school pupil leader ) లు Head Master కు వందన ప్రమాణాలు చేసే సన్నివేశం చాలా బాగుంటుంది. ఉన్న వాటిలో శుభ్రమైన తెల్ల రంగు చొక్కాలు ధరించి పిల్లలంతా వచ్చేవాళ్ళు.  బహుశా రెండులోనో, మూడులోనో అనుకుంటా ఈ స్వాతంత్ర్యదినోత్సవం గురించి నాకు పరిచయమవ్వడం జరిగింది. అదికూడా Elementary school  ప్రక్కనే వున్న High school లో చాక్లెట్లు పంచుతున్నారని  పిల్లలందరిని తీసుకొని వెళ్ళారు. ఆ మరుసటి రోజు మా అయ్యవారు స్వాతంత్ర్యదినోత్సవాన్ని గురించి చెప్తూ గాంధీ, నేతాజీ, నెహ్రూ లగురించి కూడా వివరించారు. చాక్లెట్లు పంచడంవల్ల అప్పటి సన్నివేశం బాగా గుర్తుండి పోయింది. అప్పటినుండి ఎప్పుడెప్పుడు హైస్కూల్ కు వెళదామా అని ఒకటే ఆరాటం.

" నేటితో మనకు స్వాతంత్ర్యమొచ్చి 38 సంవత్సరాలు పూర్తయిందంటూ" మొదలయ్యే ప్రసంగాలు ఆద్యంతం ఆకట్టుకొనే విదంగా సాంతంత్ర్య సాధనలో అసువులు బాసిన నాయకుల జీవిత చరిత్రనుంచి స్ఫూర్తి పొందే విధంగా సాగేవి. మధ్యమధ్యలో ఆవేశ పూరితమైన కవితా ప్రసంగాలూ వుండేవి. స్వచ్ఛమైన పిల్లల మనసులో సమసమాజ బీజాక్షరాలనూ ఇక్కడే నాటేవారు. ( అది స్కూలు వరకే పరిమితం. స్కూలు నుంచి పై చదువులకని విశ్వవిద్యాలయాలకు వెళ్ళగానే పూర్తి ప్రపంచం కనిపిస్తుంది లెండి ).

బహుమతుల ప్రదానోత్సవము కూడా అయ్యాక, క్రమశిక్షణ గల సైనికుల్లా ఎవరిక్లాసుకు వాళ్ళు వెళ్ళేవారు. ఒక్కసారి చాక్లెట్లు చేతిలో పడగానే  ఇంటివైపు పరుగోపరుగు. మరుసటి రోజు స్కూలుకొచ్చాక అందంగా కనిపించే స్కూలుని చూసి లోలోపల మురిసేవాళ్ళం కూడా. అది ఆనాటి మాట.

రాను రానూ పాఠశాలల్లోకి రాజకీయాలు ప్రవేశించాయి. అయ్యవార్లు రాజకీయ ప్రతినిధులుగా మారారు. విద్యార్థికీ, ఉపాధ్యాయునికీ వుండవలసిన సత్సాంగత్యము కూడా చెడుతూ వచ్చింది. ప్రసారమాధ్యమాల హోరు వల్లనైతేనేమీ, మారుతున్న జీవన విధానాలవల్ల నైతేనేమీ  పెద్దల తో పాటు పిల్లల మనసులు కూడా సున్నితత్త్వాన్ని కోల్పోతున్నట్టున్నాయి. స్వాతంత్ర్యదినోత్సవం పాతబడిపోయి "ఆ స్వాతంత్ర్యదినోత్సవమా" అనే స్థాయికి వచ్చాము. ప్రజాస్వామ్యంలో వున్నా మనకు ప్రజాస్వామ్యమంటే ఏమిటో తెలియదని చెప్పుకోవాలేమో !.  స్వాతంత్ర్యం కూడా సరిగా అర్థమవక విచ్చలవిడి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నామేమో !

భారత పౌరులు మాత్రమే దేశాన్ని పరిపాలించాలని పోరాడిన నాయకులు రాజ్యార్హతకు భారతపౌరసత్వాన్ని కొంత కఠినతరం చేసి వుంటే బాగుండేది. స్వారాజ్యం, స్వాతంత్ర్యంలతో పాటు సురాజ్యము మనకు కావాలి. నాయకులలో చిత్తశుద్ధి పెరిగే విధంగా ప్రజలతీర్పు వుంటే బాగుంటుంది. కానీ 1947 నాటి పరిస్థితులతో పోలిస్తే దేశం సర్వతోముఖంగా అభివృద్ధి చెందిందనే చెప్పాలి. ప్రజలకు ముఖ్యమైన విద్య, ఆరోగ్యం ఓ రెండు దశాబ్దాలవరకూ అభివృద్ధి సాధించినట్లే వున్నది కానీ నేడు అవిరెండూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి చల్లగా జారుకుంటున్నాయి. ప్రైవేటు వ్యవస్థలకు ఆదాయం ముఖ్యము కాబట్టి రాబోవుకాలాలలో పేదవాడు చదువుకు, ఆరోగ్యానికి దూరం కావచ్చు. అలాగే  విద్యుత్ సరఫరా, రహదారులు నిర్మాణాలలో ప్రభుత్వం మొదటినుంచి దారుణంగా విఫలమయ్యింది. ప్రైవేటు వ్యవస్థల వల్ల ఇవి కొంతవరకూ మెరుగైనాయని చెప్పవచ్చు.

ఇక ఆన్నింటికంటే ముఖ్యం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం. దీనికి మనదేశంలో ఇప్పుడొచ్చే నష్టమంటూ ఏమీలేదు. అంటే సైనిక పరిపాలన రాదు.  కానీ ప్రజలే ప్రజాస్వామ్యాన్ని Manipulate చేసే స్థాయికి ఎదిగారు. ప్రజాస్వామ్యానికి ఈనాడు నిజమైన అడ్డంకి ప్రచార సాధనాలే. ఏ ఒక్క పేపరు కానీ, ఛానలు కానీ స్వప్రయోజనాలు లేనిదే వార్త ప్రచురించండం లేదు. ఏది వార్తో, ఏది అభిప్రాయమో, ఏది ప్రకటనో తెలియకుండా ప్రచారసాధనాలు జాగ్రత్త పడుతూ తమవారికి మేలు చేసే విధంగా చెమటోడ్చి కష్టపడుతున్నాయి. ప్రజలకు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనీయకుండా అయోమయానికి గురి చేస్తున్నారు. ప్రభుత్వమున్నది ప్రజలకోసం అని ప్రజలు ఏనాడో నమ్మడం మానేశారు. ప్రభత్వం ఏదో చేసి వాళ్ళ బ్రతుకులను మార్చుతుందన్న అపోహలూ ఇప్పుడు ప్రజలలో లేవు. ఏనాడైతే ప్రజలు ఎన్నికల పట్ల విముఖత చూపుతున్నారో ఆనాడే దేశంలో ప్రజాస్వామ్య ఆనవాళ్ళు  దిగజారుతున్నాయని చెప్పవచ్చు.

ఇంతకుముందు రాజకీయనాయకుల మాటలలో Secular state అనే పదమన్నా వినిపించేది. ఇప్పుడు దాని స్థానంలో so called  "సామాజిక న్యాయం" అనే Posh పదం వచ్చి చేరింది. పుట్టుకతో వచ్చిన కులం, రాజరిక వ్యవస్థను పోలిన అధికారం మొదలైన అనాదిగా వస్తున్న ఆచారాలే ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటివి.

స్వార్థ రహిత పరపీడన పరాయణత్వం సహింపని అమృత లాంఛనం మన ధర్మచక్రం. సమత, స్వాతంత్ర్యం సౌఖ్యం సూచించే త్రివర్ణ పతాకం మనది. త్రవర్ణ రేఖల మధ్య భాషించే ధర్మచక్రాన్ని రక్షిచడం భారత పౌరుల ధర్మం

జై భారత్.





3 కామెంట్‌లు:

Comment Form