5, జూన్ 2014, గురువారం

నా చిరకాల మిత్రుడు, జాన్ జిగిరీ దోస్త్ నాయుడు లక్ష్మీనారాయణ

నా చిరకాల మిత్రుడు, జాన్ జిగిరీ దోస్త్ నాయుడు లక్ష్మీనారాయణ హఠాత్తుగా ఈ రోజు గూగుల్ ఛాట్ లోకి వచ్చి "హెలో ఆనందా" అంటూ పలకరించాడు. ఈ ఆనంద ఎవరూ అని బట్టతలమీదున్న నాలుగు వెంట్రుకలను పీక్కోకండి. ఆయన సంబోధించిన "ఆనంద" వెనకాల ఓ చిన్న కథే వుంది. ఆ "ఆనంద" ను నేనే. వివరాలలోకి వెళ్తే.....

నేను బి.టెక్ ఆంధ్రా యూనివర్సిటీ విశాఖపట్టణంలో కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న రోజులవి. అప్పట్లో కెమికల్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల నివాసానికై రెండు బ్లాకులను( హాష్టల్స్) కేటాయించారు. నాకు కెమికల్ ఇంజనీరింగ్ లో సీటు ఖాయమైన వెంటనే మా నాన్న విశాఖపట్టణం వచ్చి హాష్టల్ ఫీజు, కాలేజీ ఫీజు కట్టి ఇంటికి వచ్చారు. అప్పట్లో ఆ రెండు బ్లాకుల్లో ఒకటి వెజిటేరియన్ బ్లాకు గా మరొకటి నాన్ వెజిటేరియన్ బ్లాక్ గా వుండేది. విద్యార్థులు వీటి రెంటిలో ఏదో ఒకటి కోరుకోవచ్చు. మా నాన్న ఫీజుకట్టేటప్పుడు ఆలోచించి అసలే పిల్లవాడు మరీ సన్నగా వున్నాడని నాన్ వెజ్ బ్లాకైన నాల్గవ బ్లాకులో నాకు రూమ్ కోసం డబ్బుకట్టాడు.

కాలేజి మొదలుకావడానికి రోజులు దగ్గరపడతంతో మానాన్న,నేను మా ఊరైన జిల్లెళ్ళపాడు నుంచి విశాఖపట్టణానికి బయలు దేరి వెళ్ళాము.నాకది రెండవ రైలు ప్రయాణం.

మరి విశాఖ చేరినప్పుడు ఎక్కడ వుండాలనే సందేహం వస్తుంది కదా? అప్పటికే మా ఊరి దగ్గర వెలిగండ్ల అనే ఊరునుంచి వైజాగ్ వెళ్ళి స్థిరపడ్డ అప్పిరెడ్డి అనే వాళ్ళింట్లో దిగడానికి నిశ్చయించుకొని తొలుతగా వాళ్ళింటికి వెళ్ళాము. మరుసటి రోజు కాలేజీకి వెళ్ళాలి. ఆరోజు రానేవచ్చింది. అప్పట్లో హాష్టల్స్ లో రూములు కాలేజీ తెరిచిన ఒక నాలుగైదు రోజులకు కానీ కేటాయించేవాళ్ళు కాదు. ఈ నాలుగైదు రోజులూ మేము ఎవరో ఒక సీనియర్ ను పట్టుకొని వాళ్ళ రూముల్లో వుండాల్సిందే. అలాగే నేనూ కాలేజీలో చేరడానికి వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రమూర్తి అని అప్పటికే మూడవ సంవత్సరం చదువుతున్న ఆయన రూమ్ లో వున్నాను. ఈయన మీకెలా తెలుసనే సందేహం వచ్చింది కదా? అది ఎలా జరిగిందంటే, EAMCET రేంక్ వచ్చిన తరువాత హైదరాబాదులో కౌన్సిలింగ్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరుగా చదువుతున్న ఒకతను మా నాన్నకు పరిచయమయ్యాడు. నేను ఆంధ్రా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ తీసుకోవడం చూసి "నాకు అక్కడ శ్రీరామచంద్రమూర్తి అని ఒక మిత్రుడున్నాడు", మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ర్యాగింగ్ మరీ ఎక్కువగా జరగకుండా కాపాడటానికి సహాయపడగలడు అని చెప్పి ఆయన దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చాడు. ఆరకంగా నేను కాలేజీలో చేరడానికి వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రమూర్తి రూమ్ కు వెళ్ళాము. అలా ఆరోజు పగలు ఆయనరూమ్ లో వుండి రాత్రి పడుకోవటానికి మళ్ళీ అప్పిరెడ్డి ఇంటికి వచ్చాము.

మానాన్న రెండు రోజులుండి తిరిగి మా ఊరికి బయలుదేరి వెళ్ళాడు.నేను పూర్తిగా శ్రీరామచంద్రమూర్తి రూముకి షిఫ్ట్ అయ్యాను. మేమున్నది వెజిటేరియన్ బ్లాక్ లో. అప్పటికే కొంతమంది సీనియర్స్ నాన్ వెజిటేరియన్ బ్లాక్ లో సరిగా చదివే విద్యార్థులుండరు అని చెప్పడంతో నేను ఐదవ బ్లాకులో రూమ్ తీసుకోవడానికి నిశ్చయమై పోయాను.హాష్టల్ లో రూమ్ అలాట్ చేసే రోజు రానే వచ్చింది. ఒక్కొక్కరి పేరు పిలవడం మిగిలిన రూమ్స్ లో వాళ్ళుకోరుకున్న రూమ్ ను అలాట్ చేయడం జరుగుతుంది. మానాన్న అందరికంటే ముందే వచ్చి డబ్బులు కట్టినా నాపేరు ఎంతకూ పిలవకపోవడంతో శ్రీరామచంద్రమూర్తి గారు విషయమేమిటో కనుక్కొన్నాడు. డబ్బుకట్టింది 4th block కి కాబట్టి నాపేరు 5th block లిష్ట్ లో లేదని చెప్పారు. ఈ విషయం మాకప్పుడే తెలిసింది. ఆరకంగా అందరికీ రూములు అలాట్ చేసిన తరువాత చివరగా ఒక రూమ్ మిగిలితే అందులో నా సహాధ్యాయి శ్రీరామ్ కిషోర్ తో పాటు నాకు కూడా ఆరూమ్ allot చేసారు. ఆ రూమ్ నెంబరు 25.

ఇంతవరకూ బాగానే వుంది కానీ మరి ఈ నాయుడు లక్ష్మీ నారాయణ ఎలా పరిచయమయ్యాడు, నాకు ఈ ఆనంద పేరు ఎలా వచ్చింది అనే విషయాలు తెలుసుకోవాలంటే తరువాతి టపాదాకా ఆగాల్సిందే :)

1 కామెంట్‌:


  1. మరీ బావుందండీ ఈ సస్పెన్సు ! ఏమీ లేని ఆనందానికి ఇంత బిల్డ్ అప్పా ??

    జిలేబి

    రిప్లయితొలగించండి

Comment Form