11, ఆగస్టు 2020, మంగళవారం

మాతోట పూల సందడి....

మా ఇంటి తోట మళ్ళీ పూల సందడి చేస్తుంది. ఈ మధ్యనే మా తోట కొద్దిగా బెండకాయలను బహూకరించింది.ఆ బెండకాయలతో చేసిన సాంబారు అద్భుతంగా వుంది.ఎట్లైనా మనం మన తోటలో పండించుకున్న కూరగూయల రుచే వేరు. ఆ తృప్తి మరిదేనితోనూ రాదు. గోగాకు తాజా ఆకులతో నోరూరిస్తుంది. వచ్చే వారం దాన్ని కోసి ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు వేసుకొని రోటి పచ్చడి చేసుకొని తినాలి.

దోసకాయ, గుమ్మడి,సొరకాయ చెట్లనిండా పూతతో కనులకు విందు చేస్తుంది.కానీ సెప్టంబరు నాటికన్నా వాటి ఫలాలు వస్తాయో రావో అనుమానంగా వుంది. సెప్టెంబరు కు రాకపోతే అక్టోబరు లో చలిమొదలై చెట్లు చచ్చిపోతాయి.

పూలవనం మాత్రం రెండో సారి సందడి చెయ్యడం మొదలుపెట్టింది. మొదటి విడతగా తులిప్, గులాబీ పూలు పలకరించాయి. ఈ సారి గులాబీలతో పాటు జినీయ పూలూ సందడి చేస్తున్నాయి. గులాబీ చెట్లకు మధ్యలో తెగులు వచ్చింది. చచ్చిపోతాయామోనని అనుకున్నాను.కానీ మళ్ళీ తిరుక్కొని పూలు పూస్తున్నాయి. ముద్దబంతి, కారం బంతి పూలు ఏపుగా పెరగనైతే పెరిగాయి కానీ ఒక్క మొగ్గకూడా పెట్టలేదు ఇంతవరకూ :(









గోంగూర, దోసకాయలు ఈరోజుకి పక్వానికొచ్చాయి. దోసకాయాలైతే గుత్తులు గుత్తులు కాస్తున్నాయి. ఈ రెండూ మాకిక్కడ దొరుకుతాయికానీ కాస్త ధర ఎక్కువ. ఇంట్లో మందులు లేకుండా సహజసిద్ధంగా పండిన కూరగాయలతో బయటకొన్నవి సరికాదు కదా :) ఇక రేపు మరిన్ని వెల్లుల్లి వేసి వీటిని పచ్చడి చేసుకోవాలి :)



8, ఆగస్టు 2020, శనివారం

లలితా సహస్రనామ వ్యాఖ్యానం పుర్తై పోవడంతో ఏదో కోల్పోయిన భావన

 నాకు ఎ.బి.యన్ ఛానల్ లో ఏమి నచ్చినా నచ్చకపోయినా గరికిపాటి నరసింహారావు చేసిన నవజీవనవేదం చాలా ఇష్టమైన ప్రోగ్రామ్. దీనిని నేను ఆయన భగవద్గీత చెప్తున్నప్పటినుంచి చూస్తున్నాను. సామాజిక వ్యాఖ్యానం కాబట్టి అన్ని విషయాలనూ ప్రస్తావిస్తూ నవజీవనవేదం రెండువేల భాగాలను పూర్తిచేశారు. ఎప్పుడో తప్పించి రాత్రి తొమ్మిదిగంటలకొచ్చే నవజీవనవేదం సాధ్యమైన ప్రతిరోజూ చూసేవాడిని.నిన్నటితో లలితాసహస్రనామ వ్యాఖ్యానంతోపాటి నవజీవనవేదం కూడా పూర్తైపోయింది.మనసు అల్లకల్లోలంగా వున్నప్పుడు గరికిపాటివారివ్యాఖ్యానం మనసుకు స్వాంతననిచ్చేది. గుడ్డినమ్మకాలను తూర్పారపట్టడంతో పాటి జ్ఞానమార్గానికి పెద్దపీట వేసి  భగవత్భక్తి నిన్ను నువ్వు మంచిమనిషిగా మార్చుకోవడానికి వుపయోగపడాలని కుండబద్దలు కొట్టేవారు. మొదట్లో ఆయన శ్రావ్యంగా పాడే పద్యాలకు ఆకర్షితుడనయ్యాను. క్రమంగా ఆయన వ్యాఖ్యానానికి వ్యసన పరుడనయ్యాను. నిజానినికి నేను దేవుని గుడులకు వెళ్ళటం బహు తక్కువ. ఇక్కడ సంవత్స్రరంలో ఒక్కసారి గుడిని దర్శించుకోవడం కూడా అరుదే! కానీ దైవభక్తిలేదా అంటే లేదని చెప్పలేను. నాకు దేవుని పూజలతో కొలవడంకంటే దేవునిమీద చెప్పిన సాహిత్యం చదవడం ఇష్టం.అదిపాటైనా లేద పద్యమైనా లేద శ్లోకమైనా. సాహిత్యంలో ఏమి చెప్తున్నారో తెలుసుకోవడంలో మక్కువ. ఆ నా ఆసక్తికి గరికిపాటివారి వ్యాఖ్యానాలు ఇతోధికంగా సహాయపడ్డాయి.అలాంటిది ఈ రోజునుంచి ఈ ధారావాహికలైపోయాయంటే ఏదో వెలితి.



1, ఆగస్టు 2020, శనివారం

అమరావతీ, అమరావతీ, అమరావతీ...

దింపుడు కళ్ళంలో అమరావతీ, అమరావతీ, అమరావతీ అని మూడుసార్లు పిలిచి ఆశ చావక ఒక సారి గిచ్చి కూడా చూశాడు చంద్రబాబు. ప్రక్కనున్న జ్యోతీ, ఈనాడు బంధుగణం ఇక లేదులే చంద్రబాబూ అని బాధాతప్త హృదయంతో జీరబోయిన గొంతుతో కళ్ళలో నీళ్ళు కుక్కుకుని చెప్పారు. చంద్రబాబు మాత్రం ఏమవలేదు నేను యమధర్మరాజ కోర్టులో అప్పీల్ చేస్తాను. భూలోకంలో అన్యాయంగా అమరావతీని చంపితే మీరెలా తీసుకెళతారని యుద్ధంచేస్తానని చితికి నిప్పుపెట్టకుండా ఎటో నడిచి వెళ్ళిపోతున్నాడు.అదిచూసిన యమధర్మరాజు బాబూ ఓసారిలా రమ్మని పిలిచి స్వర్గానికి, నరకానికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పగలు ప్రతీకారాలుంటే మీరు గ్రాఫిక్స్ లో స్వర్గానికన్నా మిన్నగా చూపిన రాజధాని దొరికితే అప్పనంగా వదిలెయ్యడామికి నేనేమన్నా పిచ్చిపుల్లయ్య లాగా కనిపిస్తున్నానా అని చక్కా అమరావతిని దున్నపోతుమీద ఎక్కించుకొని ఈలలేసుకుంటూ వెళ్ళిపోయాడు. చంద్రబాబు మాత్రం పోయిన ప్రాణానికి కొన ఊపిరి ఎక్కడోచోట దొరక్కపోద్దా అన్న పట్టుదలతో బజార్లమ్మటి ఏగొందిలో దాగుందోనని వెతుకులాటలో పడ్డాడు...మీ ఇంటికొచ్చి వాకబు చేసి మీరు మాదగ్గరలేదన్నా ఏదీ నన్ను చూడనీ అని ఇంట్లో మూలమూలలు వెతికేదాకా వెళతాడని నాకైతే నమ్మకంలేదు :)