18, జులై 2021, ఆదివారం

నా కార్ల గోల...


కారు కంటే ముందు బజాజ్ చేతక్ స్కూటర్, దానికంటే ముందు అద్దె సైకిల్ యొక్క విధివిధానాలు,ప్రకరణలు,అధ్యాయాల గురించి వ్రాయాలంటే మహాభారతమౌతుంది కాబట్టి విసిగించకుండా మూడుముక్కల రామాయణం  కట్టె,కొట్టె,తెచ్చె లాగా చెప్తాననుకుంటుంన్నారా.. అంత అదృష్టం మీకివ్వనుగాక ఇవ్వను :)


అది 1983 వ సంవత్సరం.హైస్కూల్ లో ఎనిమిదవ తరగతి చదువుతున్నా.మాఊరు మండలకేంద్రానికి రెండుకిలోమీటర్ల దూరముంటుంది. రోజూ ఊరినుంచి వెళ్ళి చదువుకొనే వాళ్ళందరూ కాళ్ళకు చెప్పులు లేకుండా బుద్ధి చెప్పేవారే... ఊరిలో అప్పటికికూడా సైకిల్ వున్న కుటుంబాలు చాలా చాలా తక్కువ. నాకు గుర్తుంన్నంత వరకూ మాఊరినుంచి సైకిల్ మీద బడికి వచ్చి చదువుకున్న వారు ఇద్దరే.. కొత్తూరు మేడం వెంకట నారాయణ, చాకలోల్ల నారాయణ. వీళ్ళిద్దరూ కూడా సైకిల్ లేకపొతే రోజూ మాకు బడికి పోయి రావడానికి సమయం వృధా అవుతుంది పదవతరగతి పాస్ అవ్వాలంటే సైకిల్ కొనివ్వమని ఇంట్లో పోరుబెట్టి కొన్నారు. అదిగో అప్పుడు పుట్టింది మనసులో కోరిక, ఎలాగైనా సైకిల్ నేర్చుకోవాలని. అప్పటికి మాఇంట్లో సైకిల్ లేదు.మరి ఎలా నేర్చుకోవడం? ఆ సంవత్సరం రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి ఒక ప్రభంజనం సృష్టిస్తున్నాడు. చాలా ఊర్లలాగే మాఊర్లోకూడా అప్పటిదాక కాంగ్రస్ లో వున్న ముప్పావు కుటుంబాలు తెలుగుదేశం జెండా భుజానికెత్తుకున్నారు.మాఇంటి వారితో సహా.

మా ఊరు పంచాయితీ కూడా కాదు. ప్రక్కన ఓ రెండుకిలోమీటర్ల దూరంలో వున్న గోకులం పంచాయితీలోకి వస్తుంది మాఊరు. మా ఊరివాళ్ళు ఓటువెయ్యాలంటే గోకులం పోవలసిందే. అలా  ఎలక్షన్ జరగ బోతున్న ఓ వారం ముందు చాలా తెలుగుదేశంకుటుంబాలు మా ఇంటి అరుగుమీద సమావేశమయ్యారు. ఊర్లో ఎవరెవరికి ఓటువుందో లెక్కలేసుకుంటూ తెలుగుదేశానికి ఎంత మెజారిటీ వస్తుందో నన్న ఊహాగానాలు చేసుకుంటూ సమావేశం జరుగుతుంది.ఇంతలో ఇవన్నీ కాదుగానీ అసలు ఓటుఎవరెవరికుందో తెలుసుకుందామని ఓటర్ల జాబితా గోకులం నుంచి తెప్పించుకొందామని ఓ నిర్ణయానికి వచ్చారు.మరి గోకులం ఎవరు పోతారు? 


రాజకీయాలు నీకెందుకురా అని బలవంతంగా నన్ను చదువుకొమ్మని ఓ మూల కూర్చో బెట్టి వున్నారు. పుస్తకంలో వున్న విషయాలకంటే వీళ్ళ లోకాభిరమాయణాన్ని ఓ చెవిలో వేసుకుంటున్న నేను దొరికిందిరా అవకాశం అనుకొని "నేను పోతానని" లేచి నిలబడ్డాను. అదిగో అప్పుడు ఆ అరుగుమీదున్న తిరుపతిరెడ్డి సైకిల్ తొక్కడం వచ్చా అంటే "ఓ బ్రహ్మాండంగా వచ్చని" చెప్పడంతో తొందరగా పొయ్యి ఓటర్ల జాబితా తీసుకురమ్మన్నారు. ఇంకేముంది సైకిల్ తీసుకొని అప్పటిదాకా అందరూ ఎలా సైకిల్ నడుపుతున్నారో గమనించి వుండటంతో నేనూ అలాగే దాన్నిఆచరణలో పెట్టాలని చూసి అందరూ చూస్తుండగా ఓ యాభై అడుగులదూరంలోనే క్రింద పడ్డ సైకిల్ మీద నేను పడ్డాను. పాపం మా తిరుపతిరెడ్డి గుండె గుభేల్ మన్నది :)


అదిగో ఆ తరువాత మళ్ళీ నాకు సైకిల్ ఇచ్చే సాహసం ఎవరూ చెయ్యలేదు కాబట్టి నేను ఇంటర్మీడియెట్ చదవడంకోసం ప్రక్కనున్న పట్టణానికి వచ్చేటంతవరకూ సైకిల్ నేర్చుకొనే అవకాశం దొరకలేదు. ఇంటర్మీడియెట్ మొదటిసంవత్సరంలో వుండగా అద్దెకు సైకిల్ తీసుకొని స్నేహితుల సహకారంతో నేర్చుకోవాలసి వచ్చింది.


ఇక రెండవ అంకం.ఉద్యోగమొచ్చి పెళ్ళై మకాం బొంబాయి అంధేరి నుంచి హైదరాబాదు లోతుకుంట కు మారింది. అప్పటిదాకా బస్సుల్లో అవస్థలు పడుతున్న మేము ఓ బండి కొనుక్కుందామనుకున్నాము. అప్పట్లో అనగా 1998 ప్రాంతంలో బజాజ్ చేతక్ చాలా ఆదరణ వున్న బండి. కుటుంబం వున్నదంటే వారింట్లో ఒక్క చేతక్ అన్నా వుండేది అలా బజాజ్ చేతక్ చేత వశీకరణ చేయబడ్డవాడినై రాణిగంజ్ నుంచి ఓ బండి కొన్నాను. అప్పటికి నాకు స్కూటర్ నడపడం రాదు కాబట్టి వేరేవారిచేత ఇంటిదాకా తెప్పించి ఓ గ్రౌండ్ లో నేర్చుకుంటూ క్రిందపడ్డాను. కాకపోతే ఈ సారి నేను క్రిందా బజాజ్ చేతక్ పైన :)


మూడవాంకం.ఇద్దరు పిల్లలు పుట్టి బజాజ్ చేతక్ మాకు చిన్నదైపోయింది. చిన్నపిల్లలతో ఎక్కడికి వెళ్ళాలన్నా అవస్థలు పడటం బాగా ఇబ్బందనిపించి ఓ కారుకొనాలని 2004 లో నిర్ణయించుకున్నాము. అప్పటికి మామకాం కూకట్ పల్లికి దగ్గర్లో వున్న వసంతనగర్. అప్పట్లోనే పెట్రోల్ ధరలు భరించడం కష్టం కావడంతో డీజిల్ ఇంజన్ కొనాలని "టాటా ఇండికా" కొని డ్రైవర్ చేత ఇంటికి తెప్పించాను. అప్పటికి మనకు కార్ నడపడం రాదు :). ఓ మూడునెలలు డ్రైవర్ ను పెట్టుకొని రోజూ ఆఫీస్ కు వెళ్ళి వస్తుండేవాడిని. అలా మొదటినెలలో నేర్చుకుంటూ ఓ దుర్మూహార్తాన ఆఫీసుకు బయలుదేరి వెళ్తూ ఓ "T" జంక్షన్ దగ్గర ఆగాల్సి వచ్చింది. అలా ఆగి వెళ్ళేటప్పుడు బ్రేక్ బదులు యాక్సిలరేటర్ తొక్కడంతో ఓ లారీ బాడీకి నా కారు పోయి గట్టిగా ముద్దుపెట్టుకొని ముందుభాగంలో ఓ చిన్న సొట్ట బడింది :) 


ఇక నాల్గవ అంకం. రెండువేల ఎనిమిదవ సంవత్సరం. కుటుంబంతో సహా మకాం అమెరికాకు మారింది.అప్పటికే హైదరాబాదు రోడ్లలో కారు సునాయాసంగా నడిపిన నాకు అమెరికాలో కారునడపడం ఓ లెక్కలోనిది కాలేదు.వచ్చిన వెంటనే చేతిలో లక్ష్మీదేవి వుండదు కాబట్టి మొదటి రెండునెలలు ఓ స్నేహుతుని దగ్గరున్న కారు వాడుకొని మూడోనెలలో అతను స్యూరిటీ గా వుండి నాకు ఒక కారు అప్పుతో ఇప్పించాడు. అలా అమెరికాలో నా మొదటి కారు "సెకండ్ హ్యాండ్ టయోటా సియన్నా". దాన్ని నడిపి నడిపి బోరుకొట్టడంతో ఈ కారుకేమన్నా ఐతే బాగుండని తలచినదే తడవుగా ఓ శుభముహూర్తాన పార్కింగ్ లాట్ లో వెళుతున్న నాకారును ఓ కొరియన్ అమ్మాయి కారును వేగంగా వెనుకకు తీయడంతో నా కార్ రెండు తలుపులు బాగా సొట్టబడి టోటల్ అయిపోయింది. హమ్మయ్య అనుకొని తరువాతి వారంలో "టయోటా హైలాండర్" కొన్నాను.


ఐదవాంకం. మా పెద్దమ్మాయి హైస్కూల్ కు రావడంతో మాకు రెండవకారు తప్పనిసరి అనిపించింది. పగలు నేను కారు తీసుకుపోతే పిల్లల యాక్టివిటీస్ కి మాకు ఇబ్బందిగా వుండేది.ఆ ఇబ్బందిని అధికమించడానికి నా భార్యకు 2012 లో డ్రైవింగ్ నేర్పించి రెండవకారు "సెకండ్ హ్యాండ్ హోండా అకార్డ్" కొన్నాము. 


ఆరవాంకం. 2020 లోపెద్దమ్మాయి చదువుపూర్తిచేసుకొని ఉద్యోగంలో చేరింది. కానీ కరోనా కారణంగా ఆఫీసుకు వెళ్ళే అవకాశం లేకపోవడంతో ఇంట్లోనుంచే పనిచేస్తున్నది. ఈ సంవత్సరం సెప్టంబరులో వాళ్ళకు ఆఫీసులు తెరిచి తప్పనిసరిగా కనీసం మూడురోజులు ఆఫీసుకు రావాలని చెప్పడంతో ఊరుమారడం తప్పటంలేదు. తను పనిచేసే ఆఫీసు మా ఇంటికి వంద కిలోమీటర్లుంటుంది.కాబట్టి మా పెద్దమ్మాయికి కారు అవసరమౌతుంది. ఇప్పటిదాకా మేము వాడుతున్న "హోండా అకార్డ్" ఆ అమ్మాయికిచ్చి ఓ రెండేళ్ళు దీన్ని వాడుకొని కొత్తకారుకొనుక్కోమని చెప్పాము. అదుగో అలా ఇప్పుడు మాకు మూడవ కారవసరమైంది.


ఏడవాంకం. మూడవకారు ఏది కొనాలా అన్న తర్జనభర్జనలు,యూట్యూబ్ వీడియోలు మొదలైనవన్నీ చూసి ఓ రెండువారాల పరిశీలన తరువాత నిన్న మూడవకారు మా ఇంటికొచ్చింది.
















9 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. ఓ బెంజువారయ్యారన్నమాట ! Congratulations.

    రిప్లయితొలగించండి
  3. లేదు హిమబిందు..ఈ మధ్య బ్లాగులవైపు రావడం దాదాపు శూన్యమైపోయింది.

    రిప్లయితొలగించండి

Comment Form