10, సెప్టెంబర్ 2012, సోమవారం

సొగసు కీల్జడదాన ! సోగ కన్నుల దాన ! వజ్రాల వంటి పల్వరుసదాన


 

శ్రీనాథుడు ఆస్థాన కవిగా విద్యామంత్రిగా పదవీబాధ్యతలను చేపట్టి చాలా కావ్యాలను తెలుగులోకి అనువదించినప్పటికీ, ఓ యాత్రికునిగా దేశాటనం చేస్తూ ఆశువుగా చెప్పిన పద్యాలు కోకొల్లలు. ఆ కాలంలో కులాలు వున్నప్పటికి ఇప్పటిలాగా కాకుండా చాలా సామరస్యంగానే వున్నాయని చెప్పవచ్చు. అప్పట్లో కులవృత్తి గౌరవప్రదమైనది. ఓ బాపనాయనకు ఎన్ని వేదవేదాంగాలు తెలిసినా ఆయన గౌరవం అంతవరకే. కాటికాపరికి ఎంత వేదాంతం తెలుస్తుందో వేదవేదాంగాలు ఆపోసన పట్టినా అంతకంటే పెద్దగా తెలిసేదేదీ వుండదు.మిగతా పనులు చేసుకునే వృత్తుల వారి కులంలో కూడా వారి వారి వృత్తులననుసరించి తత్త్వజ్ఞానమూ వుండేది. అంటే ఎవరి వృత్తి వారికి ఆదర్శ ప్రాయం. ఊరని వుంటే ప్రతికులానికీ ప్రాధాన్యత తప్పక వుండాలి. లేకుంటే ఆ ఊరికి మనుగడ కష్టసాధ్యమయ్యేది.

ఇలా శ్రీనాథుడు దేశాటనం చేస్తూ ఆయా కులాల్లో వున్న సుందరాంగుల వర్ణనలు చాలానే చేశాడు. అలాంటి వర్ణనలతో కూడిన కొన్ని చాటు పద్యాలు ఇవి.

ముందుగా శ్రీనాథునిగా చెప్పుకుంటున్న ఓ పద్యం. కానీ ఈ శైలి శ్రీనాథునుది కాదేమో ననిపిస్తుంది. ఏమైనా చిన్న చిన్న పదాలతో చిన్నదాన్ని వర్ణించడం బాగుంది.

సొగసు కీల్జడదాన ! సోగ కన్నుల దాన ! వజ్రాల వంటి పల్వరుసదాన
బంగారు జిగి దాన ! బటువు గుబ్బల దాన ! నయమైన యొయ్యారి నడల దాన
తోరంపు గటిదాన ! తొడల నిగ్గుల దాన ! పిడికిట నడగు నెన్నెడుము దాన
తళుకు జెక్కులదాన ! బెళుకు ముక్కెరదాన ! పింగాణి కనుబొమ చెలువుదాన

మేలిమి పసిండి రవ కడియాల దాన
మించి పోనేల రత్నాల మించుదాన
తిరిగి చూడవె ముత్యాల సరుల దాన
చేరి మాటాడు చెంగావి చీర దాన

ఇప్పుడంటే చాకలివృత్తి మిగిలిన వృత్తులతో పోలిస్తే లాభదాయకం కాకపోవటంతో ఆ వృత్తి చేసేవారి సంఖ్య తగ్గిపోయింది కానీ, పూర్వకాలంలో ఇప్పటిలా వ్యాపారాలు చేసి పనికిరాని కాగితాల సంపాదనా నిల్వలు వుండేవి కాదు కదా!! మహా ఐతే ధాన్యాన్ని మార్పిడి చేయడం ద్వారా బంగారు నాణేలను ప్రోగు చేసుకొనేవారేమో !!   వాషింగ్ మిషన్లు వచ్చి ప్రతియింట్లో ఇల్లాలే చాకలి వృత్తి చేస్తుంది కానీ, ఆ రోజుల్లో ఊరన్నాక ఓ చేరువో వాగో సాధారణం. ఆ వాగులో చాకలి వాళ్ళు బట్టలు ఉతకటం కూడా అంతే సర్వ సాధారణం. నిజానికి బట్టలు ఉతకటం శరీరానికి మంచి వ్యాయమం. ఈ వ్యాయామం వల్లనే ఏమో కానీ చాకలి వాళ్ళు సాధారణంగా అందగత్తెలై వుంటారు. ఇది నా అనుభవం మాత్రమే !!

అలాంటి అనుభవమే శ్రీనాథునికి ఎదురైతే..ఇంకేముంది... పద్యం పరవళ్ళు తొక్కింది.

శ్రీకర భూషణంబులును,సిబ్బెపు గుబ్బలు, ముద్దు చెక్కులున్
గోకిలవంటి పల్కులును గొల్చిన జేరల గేరుకన్నులున్
బ్రాకట దేహకాంతియును,బంగరు చాయకు హెచ్చువచ్చు నీ
చాకలివారి సుందరికి,సాటిగ రారిక దొంటి జవ్వనుల్


బలిజ వాళ్ళ వృత్తి ఏమిటో నాకు ఇదమిద్ధంగా తెలియదు. కారణం మా ఊరి వద్ద నా స్నేహితుల కుటుంబాల వాళ్ళు కొంతమంది వ్యాపారం కొంతమంది వ్యవసాయం చేసేవారు. కానీ అదేమి చోద్యమో కానీ ఈ కులంలో అమ్మాయిలు చాలా చాలా బాగుంటారు :-)

నాలాగే శ్రీనాథునికీ నచ్చారు మరి. అప్పుడేమైందంటే

పసగల ముద్దు మోవి, బిగి వట్రువ గుబ్బలు, మందహాసమున్
నొసట విభూతిరేఖయు, బునుంగున తావి, మిటారి చూపులున్
రసికులు మేలు! మేలు! భళిరా యని మెచ్చగ రాచవీటిలో
బసిడి సలాక వంటి యొక బల్జె వథూటిని గంటి వేడుకన్

పాపం శ్రీనాథుడంతటివాడి గుండెలోకి బంగారు సలాక కస్సుమని దిగింది.

ఇకా మా రెడ్డి పిల్లలూ వుంటారు ఒంకరటింకరగా.కాకపోతో పొలం పనుల వల్ల కొన్ని భాగాలు పుష్టిగా వుంటాయి :-)
  ఇలాంటి రెడ్డి పిల్ల ఒకటి ఈన కంట్లో పడింది.

విడిబడి నిట్టవేగి, యట బిఱ్ఱున వ్రాలిన నంతలోన, దా
వడిసెల చేత బట్టుకొని, వట్రువ గుబ్బల బైట జాఱగా
నడుము వడంకగా, బిఱుదు నాట్యము సేయగ, కొప్పు వీడగా
దొడ దొడ యంచు నెక్కె నటు దొడ్డ మిటారపు రెడ్డి కూతురున్

అలాగే పల్లెటూళ్ళలో వడ్లమిల్లులు రాకముందు, వడ్లను ఏరోజుకారోజు రోట్లో పోసి ఇంట్లో ఎవరు ఖాళీగా వుంటే వాళ్ళు దంచి, ఆ దంపుడు బియ్యాన్ని వాడి వంటచేసేవాళ్ళు. అలా ఓ ముగుడు, పెళ్ళాలిద్దరూ వడ్లు దంచేపద్ధతినీ, ఆ పిల్ల నంద పదాలతో మొగుడిని కవ్వించే విధానాన్నీ సుందరంగా వర్ణించాడు

పువ్వులు కొప్పునం దుఱిమి, ముందుగ గౌ నసియాడుచుండగా
జెవ్వున పంగ సాచి యొక చేతను రోకలి బూని, యొయ్యనన్
నవ్వు మొగంబుతోడ దన నందను బాడుచు నాథు జూచుచున్
సువ్వియ సువ్వి యంచునొక సుందరి బియ్యము దంచె ముంగిటన్

మరికొన్ని కులాల అమ్మాయిల సౌందర్యాన్ని గూర్చి మరో టపాలో ....


3 వ్యాఖ్యలు:

Comment Form