
అక్షర లాక్షిణికకు
సులక్షణ కవితారాణికి
ఏలనో, ఏ పాద గుర్తులో
చెరిగిపోని శిధిలపు ఆనవాళ్ళు.
గులకరాయి రేపిన అలజడికి
మదిలోన ఏ సెలఏరు పొంగెనో !
మండు టెండల తాకిడికి
హృదిలోన ఏ నిర్ఝరి ఇంకెనో !
అమావాస్య కాంతిధారకు
ఏ నెత్తురు గడ్డకట్టేనో !
పుడమిని మురిపే పండువెన్నెల
ఏ రాజ బందీగ మిగిలెనో !
నీడను వర్షించే పెరటి పట్టుగొమ్మ
ఏ పున్నాగరవళి గా మారెనో !
దాహము తీర్చే సుజల జల ధార
ఏ గరళ కంఠుని అస్త్రమాయెనో !
చెమ్మగిల్లిన చూపుకు దోసిలొగ్గిన మమత,
మసిబారిన మదికి స్ఫటికపు రంగులద్దిన కలువ,
విరిగిన అధరాన నవ్వులూడ్చిన పూబోణి,
విచలిత వదనాన జ్వలిత చల్లిన విరిబోణి.
అలసిన మదికి ఊతమిచ్చిన విరజాజి,
మాటలేని భావాల మూగభాష్యకారిణి.
ఏలనో, ఏమాయెనో
ఉరుకులు పరుగులు మాని
గడ్డకడుతున్న సెలయేరౌతుంది.
నిశీధి పయనాన
నిశ్శబ్ద మదిలోన
రోదించే కీచురాళ్ళే
మిణుగురుల దివిటీలు.